అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుట......తిరుపతి వెంకట కవులు...

అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుట......తిరుపతి వెంకట కవులు...
అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న
య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా
భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్.

జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పం
క్తుల కెవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుల్ గూర్చు దత్సన్నిధి
స్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవార గావించి నా
తొలి జన్మంబున గూడు పాపముల నాందోళింపగా జేసెదన్.
కృష్ణుడు (అర్జునునితో):

ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!
కృష్ణుడు (దుర్యోధనునితో):
కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ యయ్యె, మాకు న
వ్వారికి గూడ నెక్కుడగు బంధు సముద్రుడ వీవు గాన, నీ
చేరిక మాకు నిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్
గోరగ నేగుదెంచితిమి గోపకులైక-శిరో విభూషణా !
కృష్ణుడు (దుర్యోధనునితో):

ముందుగ వచ్చి తీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,
బందుగులన్న యంశ మది పాయక నిల్చె సహాయ మిర్వురన్
జెందుట పాడి, మీకు నయి చేసెద సైన్య విభాగ మందు మీ
కున్ దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు మున్నుగన్.
అన్ని యెడలను నాకు దీటైన వారు
గోపకులు పదివేవు రకుంఠ బలులు
గలరు నారాయణాఖ్య జెన్నలరువారు,
వార లొకవైపు నేనొక్క వైపు మరియు.

యుద్ధ మొనరింత్రు వార ల
బద్ధ మ్మెందులకు ? నేను బరమాప్తుడనై
యుద్ధమ్ము త్రోవ బోవక
బుద్ధికి దోచిన సహాయమును బొనరింతున్.
దుర్యోధనుడు (స్వగతం):

ఆయుధము పట్టడట! యని
సేయండట! "కంచి గరుడ సేవ" యితనిచే
నేయుపకృతి యుద్ధార్థికి
నేయెడ నగు! నిట్టి వాని నెవ్వండు గొనున్.
కృష్ణుడు (అర్జునునితో):

ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకే
సాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్
దోయిలి యొగ్గుదున్, నిజము, తొల్త వచించితి గోరికొమ్ము నీ
కేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందనా.
అర్జునుడు (కృష్ణునితో):

నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పు గాక, నీ
వెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా !

రథము నందెన్ని చిత్రంపు బ్రతిమ లుండ
వందు శివుడును విష్ణువు నజుడు నెల్ల
దేవతలు నుండవచ్చు, నా ఠీవి గృష్ణు
డర్జున స్యందన విభూష యగును గాక !
కృష్ణుడు (అర్జునునితో):

"ఆలము సేయ నే" నని యదార్థము బల్కితి జుమ్మి, యిట్టి గో
పాలుని నన్ను గోరితివి, భండన పండితులగ్నితేజు లు-
త్తాల ధనుర్ధరుల్, బహుశతప్రమితుల్ యదుసింహు లందఱిన్
బాలుగ గైకొనెన్ గురునృపాలుడు, బాలుడవైతి వక్కటా !
అర్జునుడు (కృష్ణునితో):

"ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ! యాల జాతికిన్
దిన్నది పుష్టి" నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నే
సున్నము జేసెదన్ రిపుల చూపఱు లద్భుత మంద, సర్వ లో-
కోన్నత! నాకు బేరొసగు, మూరక చూచుచునుండు మచ్యుతా !
కృష్ణుడు (అర్జునునితో):

ఊరక చూచుచుండు మను టొప్పితి గాని భవద్ రథస్థు నన్
బారగ జూచి నీ రిపులు పక్కున నవ్వి యనాదరింతు రా
శూరకులంబు మెచ్చ రిపుసూదనతాభర మూను నీకు నే
సారధినై, యికన్ విజయసారధి నామమునన్ జరించెదన్
అర్జునుడు (కృష్ణునితో):

సారధి యంట! వేదముల సారము శౌరి, తదంఘ్రి భక్తి చె
న్నారెడు క్రీడి తా రధికుడౌనట! చిందము విల్లు దేరునున్
వారువముల్ మొదల్ దివిజవర్గ మొసంగిన వంట ! యస్త్ర వి-
స్తార గురుల్ శివాదులట, సంగరమం దెవడాగ జాలెడిన్.
కృష్ణుడు (అర్జునునితో):

వచ్చెడి వాడు గాడతడు వారికి మీకును గూడ దోడు, వి-
వ్వచ్చుడ, యమ్మహామహుని భావము మున్నె యెఱింగినాడ, నా
సచ్చరితుండు మీకు దగ సంధి పొసంగిన సంతసించు, నా
యిచ్చయు నట్టిదే, మన నరేంద్రుని యిచ్చయు గూడ నట్టిదే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!