కళాపూర్ణోదయం -2: (మధుర లాలస .)..6/5/16. మణికంధరుడి తపోభంగం!

కళాపూర్ణోదయం -2: (మధుర లాలస .)..6/5/16.

మణికంధరుడి తపోభంగం!

(జరిగిన కథ ద్వారకలో కృష్ణుణ్ణి చూడటానికి, శిష్యుడు మణికంధరుడితో వెళ్తున్న నారదుడు రంభా నలకూబరుల్ని కలుస్తాడు. రంభకి గర్వభంగం చెయ్యాలనుకుంటాడు. కలభాషిణి రంభానలకూబరులు విమానంలో మాట్లాడుకున్న కొన్ని విషయాల గురించి నారదుణ్ణడుగుతుంది.నారదుడు ద్వారకలో సంగీతం నేర్చుకుని తిరిగి వెళ్తూ ఏ స్త్రీ రూపం కావాలనుకుంటే ఆ రూపం వచ్చే వరం కలభాషిణికి ఇస్తాడు. ఒకరోజు కలభాషిణి తోటలో ఉండగా ఓ సిద్ధుడు సింహం మీద ఆకాశంలోంచి దిగుతాడు. ఆమె గతచరిత్రని వల్లిస్తూ కుశలమడుగుతాడు. ఇక చదవండి.)

“అయ్యా! మీకేవో గొప్ప శక్తులున్నట్టున్నాయి. నువ్వు కపిలముని లాటి సిద్ధుడివో లేకపోతే స్వయంగా దేవుడివేనో! మీ పేరేమిటో విశేషాలేమిటో వినాలనుంది నాకు”

“నా పేరు మణిస్తంభుడు. నువ్వు చెప్పిన వాళ్ళలో ఎవణ్ణీ కాను. కేవలం మామూలు సిద్ధుణ్ణి”

“మీ మాటలు ఒక్కొక్కటి వింటుంటే నాకు మతిపోతోంది. ఇవి మామూలు సిద్ధులకి ఎలా తెలుస్తాయి? మరో విషయం మీరిందాక మణికంధరుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడన్నారు. అదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది”

“అమ్మాయీ! నాకు దూరదృష్టి, దూరశ్రవణ శక్తులున్నాయి. అందువల్ల నేను ఉన్నచోటునుంచి కదలకుండా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. నీ గురించి నేను చెప్పిన వన్నీ నిజమే కదా! ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళాక మణికంధరుడు ఏం చేశాడో చెప్తాను విను.

“నువ్వు వాళ్ళ దగ్గర్నుంచి వచ్చెయ్యటం తోటే నారదుడు మణికంధరుణ్ణి చూసి అన్నాడు “శిష్యా! నువు నేర్చుకున్న సంగీతానికి న్యాయం జరగాలంటే నువ్వు చెయాల్సింది ఎప్పుడూ ఆ విష్ణువుని కీర్తిస్తూ పాడుతూ ఉండటం. సంగీతం కన్నా ఆయనకి ఇష్టమైంది ఇంకోటి లేదు. అందుకే నేనూ, విశ్వావసుడు, తుంబురుడు, చివరకు ఆ సరస్వతీ దేవీ ఎప్పుడూ అదే పన్లో ఉంటాం. నిజంగా నీ అదృష్టం కాకపోతే శ్రీకృష్ణుడంతటి వాడు తనంతట తను నీకు సంగీతం నేర్పుతాడా! కనక ఆ విద్యని నువ్వు సరైన విధంగా వాడుకో, నీ కోరికలు తీరతాయి….

ఇక నే వెళ్ళి స్వర్గంలోనో బ్రహ్మ లోకంలోనో కైలాసంలోనో లేకపోతే ఈ గొడవంతా మొదలైన ఆ వైకుంఠంలోనో మదమెక్కి మిడిసిపడుతున్న తుంబురుణ్ణి గానవిద్యలో ఓడించి నా కష్టాలకి ఫలితం దక్కించుకోవాలి” అన్నాడు హుషారుగా.

“అతనలా అనేసరికి మణికంధరుడు కుతూహలంతో “అంటే తుంబురుడికీ మీకూ ఏదో పోటీ ఉందన్నమాట! నాతో ఎప్పుడూ చెప్పలేదే?” అనడిగాడు.

దానికి నారదుడు ఇలా చెప్పుకొచ్చాడు

“ఒకనాడు వైకుంఠంలో విష్ణువు కొలువు తీరాడు.

దేవతలు, మునులు, యోగులు సభంతా నిండిపోయారు.

నేనూ, తుంబురుడు, విశ్వావసుడు లాటి వీణాధరులం కూడా అక్కడున్నాం.

విష్వక్సేనుడు బెత్తం పట్టుకుని సభని అదుపు చేస్తున్నాడు.

దివ్య వారాంగనలు నాట్యాలు చేస్తున్నారు.

అంతలో

మేఘాల మధ్య మెరుపు లాగా సఖుల మధ్య ఉండి లక్ష్మీదేవి అక్కడికి వస్తున్నది.

ఆమె అలా కనిపించిందో లేదో ఇలా వేత్రధరులు వచ్చి జనాన్ని బెత్తాల్తో బాదేశారు.

శివుడు, బ్రహ్మ లాటి వాళ్ళే దూరంగా పారిపోయారంటే ఇక మాలాటి వాళ్ళ విషయం చెప్పాలా? తలా ఓ దిక్కు పరిగెత్తాం.

ఇంతలో ఎవరో వచ్చి “ఓయ్‌ తుంబురుడా! ఎక్కడున్నావ్‌ ! ఇటు రావయ్యా!” అని అతన్ని లోపలికి తీసుకుపోయారు.

“అతన్నెందుకు పిలిచుంటారు?” అని అందరూ చెవులు కొరుక్కుంటుంటే, “ఎందుకేమిటి? విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి తుంబురుడి చేత ప్రత్యేకంగా పాడించుకుని వింటున్నారు” అని అక్కడికి దగ్గర్లో ఉన్న వాళ్ళన్నారు.

నాకు మనసు భగ్గుమంది.

ఇక కొంతసేపటికి తుంబురుడు బయటికొచ్చాడు.

ఇప్పుడతని ఒంటినిండా మెరుగుపూత, మెళ్ళో కొత్త పతకం, బుజాన కొత్త గుడ్డలు!

అందరూ అతని చుట్టూ చేరి పొగడటం!

నాకు ఒళ్ళు మండి పోయింది.

“తగుదునమ్మా అని ఒక్కడివే వెళ్ళి పాడటమే కాకుండా ఒంటి నిండా బహుమానాలు తగిలించుకుని అందరికీ చూపిస్తూ మరీ వస్తావా! ఓరి పాపీ!” అని పళ్ళు పటపట కొరుక్కుని ఏదో ఒక విధంగా వాడితో పోట్లాట పెట్టుకుని సంగీతంలో ఓడించాలని నిర్ణయించుకున్నా.

ఐతే ఎందుకైనా మంచిదని వెంటనే బయటపడకుండా కొన్నాళ్ళు మామూలుగా ఉండి ముందుగా అతని పాటలో బలహీనతల్ని తెలుసుకోవాలని యుక్తి పన్నా.

ఆ పని మీదే ఓ రోజు అతని ఇంటికెళ్ళా.

అప్పుడే అతను తన వీణని మేళవించి బయట వుంచి లోపలికెళ్ళాడు.

ఇదీ బాగుంది, ఈ వీణ ఎలాటిదో చూద్దామని నేను దాన్ని పలికిద్దును కదా

దాని అపూర్వమైన శ్రుతులు వినేసరికి నాలో ఆశ్చర్యం, భయం, లజ్జ కలిగాయి.

సిగ్గుతో వెంటనే తిరిగొచ్చేశాను.

“ఆహా! నిజానికి నాకన్నా గొప్ప విద్య తన దగ్గర ఉన్నా కూడా నాతో కలిసి పాడేటప్పుడు ఎప్పుడూ నన్ను మించటానికి చూడలేదు! పైగా నేను గొప్పవాణ్ణని అందరూ అంటున్నా కిక్కురు మనలేదు! ఇప్పుడు విష్ణువు పిలిపించి పాడించే వరకూ బయటపడలేదు. నీరు కొద్దీ తామరన్నట్టు నిజంగా గొప్పవాళ్ళు ఎవరి దగ్గర ఎంత అవసరమో అంత విద్యే ప్రదర్శిస్తారు కదా!” అని ఆశ్చర్యపడ్డాను.

ఇక అప్పట్నుంచి అతన్తో సమానమైన విద్య సంపాయించాలని ఎన్ని పాట్లు పడ్డానో!

ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతమందినో కలిశాను. ఏమీ లాభం కలగలా.

చివరికి ఆ విష్ణుమూర్తే దిక్కని ఆయన్ని గురించి ఎంతోకాలం తపస్సు చేశాను.

అప్పుడాయన ప్రత్యక్షమైతే “తుంబురుణ్ణి సంగీతంలో గెలవాలనే” వరం కోరుకున్నాను. దానికాయన “ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా ద్వారకలో పుడతాను. అప్పుడు వచ్చి నన్ను కలువు, నీ కోరిక తీరుస్తాను” అన్నాడు. ఇలా చివరికి ఇప్పుడు నా కోరిక తీరబోతోంది” అని ముగించాడు నారదుడు.

“అదంతావిన్న మణికంధరుడు ఆలోచనలో పడ్డాడు.

“మరి తుంబురుడు ఒక్కసారి వైకుంఠంలో పాడటమే అంత గొప్ప విషయమైతే ఇక ఎప్పుడూ వైకుంఠంలోనే ఉండి పాడగలిగే అదృష్టం ఎలా కలుగుతుందో కదా!” అని పైకే అనేశాడు.

ఆ మాటతో నారదుడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

“భేష్‌, భేష్‌! నీకీ ఆలోచన రావటమే బ్రహ్మాండంగా ఉంది. సామాన్యంగా ఎంత చదివి ఎన్ని తెలుసుననుకున్న వాళ్ళైనా వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్టు మళ్ళీ వాళ్ళనీ వీళ్ళనీ కొలవటానికి తయారౌతారు.

అలా కాకుండా వైకుంఠంలో విష్ణువుని పూజిస్తూ ఉండాలంటే పెద్ద వాళ్ళ నించి నేను విన్న ఆలోచన ఇది

శక్తి కొద్దీ కృష్ణార్పణంగా మంచి పన్లే చెయ్యటం, చెడ్డ పన్లు చెయ్యకపోవటం, విష్ణువు మీద భక్తి, ఆయన భక్తుల్తో స్నేహం, ఆయన వెలిసిన దివ్యక్షేత్రాలు చూడటం, బ్రహ్మచర్యం, తపస్సు, వైరాగ్యం వీటిలో కొన్ని పాటించినా చాలునని.

కాబట్టి నువ్వు నీకున్న గొప్ప సంగీత విద్యతో తిరుపతి, శ్రీరంగం లాటి క్షేత్రాల్లో విష్ణు సంకీర్తనలు చెయ్యి. నీకు శుభం జరుగుతుంది” అని చెప్పి

ఆ ఉద్రేకంలో పులకరిస్తూ కృష్ణుడి గురించి పాడుతూ ఆడుతూ తన్మయంగా ఎటో వెళ్ళిపోయాడు నారదుడు.

అది చూసిన మణికంధరుడు కూడా “ఆహా! ఈ నారదుడెంత అదృష్టవంతుడు! ఇతనికి ఎంత భక్తి!” అనుకుని అతను దూరం వెళ్ళేవరకు అతన్నే చూస్తూ నిలబడి ఇక తను కూడా తీర్థయాత్రలకి బయల్దేరాడు.

“అలా వెళ్ళిన మణికంధరుడు యమునా నదిని చూశాడు. ఆనందించాడు. అక్కడ కూర్చుని విష్ణువు గురించి గొప్పగా పాడాడు.

మధుర, హరిద్వారం, సాలగ్రామ పర్వతం, బదరికాశ్రమం, నైమిశారణ్యం, కురుక్షేత్రం, ప్రయాగ, కాశి, అయోధ్య, గంగా సంగమం చూసి అన్ని చోట్లా స్నానాలూ, దానాలూ చేశాడు. సముద్రం పక్కనే ఉన్న నీలాచలానికి వెళ్ళి అక్కడ ఇంద్రద్యుమ్నం అనే సరస్సులో రోహిణీ కుండంలో స్నానం చేశాడు.

గానంతో జగన్నాథుణ్ణి కొలిచాడు.

తర్వాత శ్రీకూర్మం, సింహాచలం, అహోబలం, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాడు.

అక్కడ మహామహిమలున్న స్వామి పుష్కరిణిలో స్నానించాడు. క్షితి వరాహ మూర్తిని కొలిచాడు. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి వెళ్ళాడు.

మృదువైన పాదాలు, మెరుగు అందెలు, బంగారు దుప్పటి, ముప్పేట మొలతాడు, మణుల వడ్డాణం, బొడ్డులో మాణిక్యం, వైజయింతి పూమాల, వక్షాన లక్ష్మి, వరదహస్తం, కటిహస్తం, మిగిలిన రెండు చేతుల్లో శంఖ చక్రాలు, తార హారాలు, చక్కటి కంఠం, నవ్వు ముఖం, మకరకుండలాలు, తామర కళ్ళు, అందాల ముక్కు, కలికి కనుబొమ్మలు, ముత్యాల నామం, రత్నాల నుదురు ఇవన్నీ ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహాన్ని అంగాంగం చూసి తపించి పులకించి ఆయన గురించి మూడు రాత్రింబగళ్ళు పరవశంతో పాడి అక్కడున్న జనాన్నందర్నీ ఆనందాశ్చర్యాల్లో ముంచేశాడు.

అక్కడినుంచి కాంచీపురంలో ఏకామ్రనాథుణ్ణీ, కామాక్షినీ సేవించాడు.

కరిగిరి కి వెళ్ళి కన్నుల పండుగ్గా వరదరాజ దేవుణ్ణి చూసి పాడి ఆనందించాడు.

ఆ కాంచీపురం నుంచి సస్యశ్యామలంగా ఉన్న చోళ మండల మహా గ్రామాల్ని దాటుతూ కావేరీతీరం చేరాడు.

కావేరిని పొగిడి ఇంతింతని వర్ణించలేని అద్భుతాలున్న శ్రీరంగం చేరుకున్నాడు.

పాటల్ని ఆశువుగా పాడి ఆ శ్రీరంగనాథుణ్ణి సేవించాడు.

అక్కణ్ణుంచి తూర్పుగా కుంభకోణం వెళ్ళి విష్ణువునీ, కుంభేశ్వరుడినీ పూజించాడు. దర్భశయనంలో రాముణ్ణి కొలిచాడు.

తర్వాత సేతుబంధం వెళ్ళి రామేశ్వరుణ్ణి ఆరాధించాడు.

అప్పటికీ తృప్తి కలక్కపోగా ఇనుమడిస్తున్న భక్తి ఆవేశంతో అక్కడికి పడమరగా చక్కగా దట్టంగా పెరిగివున్న ఒక పూలతోటలో కూర్చుని విష్ణువు గురించి తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు.

తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు అతను చేసిన అద్భుతమైన గానాన్ని నేను ఒళ్ళంతా చెవులుగా విన్నాను. ఇప్పుడతని తపస్సు వల్ల నాకా అదృష్టం పోయింది.

అదుగో, ఇప్పుడతను పద్మాసనంలో కూర్చుని గొప్ప సమాధి అవస్థలో ఉన్నాడు” అంటూ మణికంధరుడి వ్యవహారమంతా వినిపించాడు మణిస్తంభుడు కలభాషిణికి.

(ఇక్కడ మనం “మణికంధరుడు”, “మణిస్తంభుడు” అనే పేర్ల గురించి జాగ్రత్తగా లేకపోతే కలగాపులగమై పోయే అవకాశం ఉంది. మొదటివాడు గంధర్వుడు, నారదుడి శిష్యుడు, ఈ కథకి నాయకుడు; రెండో వాడొక సిద్ధుడు. ఇతను కూడా కథలో ఒక ముఖ్య పాత్ర ధారే.)

ఆ కథంతా విని ఆశ్చర్యంలో మునిగిపోయింది కలభాషిణి.

“ఐతే మీకళ్ళకతను ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాడా?” అనడిగింది ఇంకా నమ్మలేక.

“నీకనుమానంగా ఉంటే నీ చెలికత్తెల్ని అవతలికి పంపించు. వాళ్ళ ప్రవర్తనంతా కళ్ళక్కట్టినట్టు నీకు చెప్తాను. తమాషా చూద్దువు గాని” అని బలవంతంగా ఇద్దరు చెలికత్తెల్ని దూరంగా పంపించి వాళ్ళ పనులు, మాటలు అన్నీ చెప్పి నిజమే నని నిరూపించాడు.

ఆ తర్వాత, ” “దగ్గర వాళ్ళ గురించి చెప్పగలిగాడు గాని బాగా దూరంగా ఉన్న విషయాలు చూడగలడా?” అని నీకు అనుమానం రావొచ్చు. కానీ ఆ అనుమానం తీర్చే దారి లేదు కదా!” అని కొంచెం బాధ పడ్డాడు.

ఐతే అంతలోనే “నువ్వు మణికంధరుడి తపసు గురించి చెప్పిందాంట్లో ఒక్క ముక్క కూడ అబద్ధం లేదు” అని చెప్పింది ఆ పక్కనే చెట్టు మీద నుంచి ఒక చిలక!

“ఆశ్చర్యంగా ఉందే! నువ్వెక్కడి నుంచొచ్చావ్‌? అతను చెప్పేది నిజమని నీకెలా తెలుసు?” అని ఆ చిలకని అడిగింది కలభాషిణి.

అప్పుడా చిలక, “అసలు నాది స్వర్గంలో నందనవనం. శ్రీకృష్ణుడు పారిజాతపు చెట్టుని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేటప్పుడు మిగిలిన పక్షులన్నీ పారిపోయినా నా భార్య ప్రసవసమయం గనక ఏమైతే అయిందని ఒక తొర్రలో వుండిపోయింది. పిల్లలు పెరిగి వాళ్లకి యీకలు వచ్చేదాకా తీసుకెళ్ళటం వీలుగాక ఇక్కడి తోటల ముందు నందనవనం ఎందుకూ చాలకపోయినా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు గనక నేను అటూఇటూ రాకపోకలు సాగిస్తున్నాను. అలా ఇంతకుముందు నేను నా భార్య దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ “మణికంధరుడి” మాట వినపడి ఏమిటోనని ఆగాను.

ఎందుకంటే ఇందాక ఇంద్రుడు, శచీదేవి నందనవనంలో ఉండగా చారుడొకడు వచ్చి, “దేవరా, నేనుండే తోటలోకి ఒకతను వచ్చి కొన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడా తపస్సు చాలా తీవ్రరూపంలో ఉంది. “ఆతోటలో చేసే తపస్సు ఎనిమిది నెలల్లో సిద్ధిస్తుంది గనక జాగ్రత్తగా ఉండమ”ని మీరిదివరకు చెప్పారు గనక ఈ విషయం మీకు చెప్దామని వచ్చాను” అన్నాడు.

ఇంద్రుడు కూడా, “ఔనౌను. అందుకే నిన్నక్కడ ఉంచాను” అని వెంటనే రంభను పిలిపించాడు. “రంభా! ఆ తపస్సు చేస్తోంది ఎవరో గాని నా రాజ్యం కోసమైనా అయుండొచ్చు. గోరంత ఆలస్యానికి కొండంత నష్టం రావొచ్చంటారు. ఇలాటి పనులకి అప్సరసలు బాగా పనికొస్తారు. వాళ్ళలోనూ నీకున్న పనితనం ఇంకెవరికీ లేదు. కనక నువ్వు వెంటనే వెళ్ళి ఆ పులిలాటి మునిని మన్మథుడికి జింకగా చెయ్యాలి. బయల్దేరు” అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు.

దానికి రంభ, “ఆ ముని ఎవరనుకుంటున్నారో! అతను నారదుడి శిష్యుడు మణికంధరుడని విన్నాను. అతన్ని ఇదివరకే చూశాన్నేను.అప్పుడే మాలాటి వాళ్ళని లెక్కచెయ్యని వాడు ఇప్పుడు ఇంత తపస్సు చేశాక లొంగుతాడని నమ్మకం లేదు” అని అనుమానంగా మాట్లాడింది.

“అలాగైతే నీకు అద్భుతమైన రూపం, సరికొత్త యవ్వనం ఇస్తున్నా. ఇంక వెళ్ళి పనిపూర్తిచెయ్యి” అని పంపాడు ఇంద్రుడు.

రంభ కూడ కొత్తగా వచ్చిన లావణ్యం, దానికి తోడు గొప్ప అలంకారాల్తో మణికంధరుడి దగ్గరికి బయల్దేరటం నేను చూశా. ఈ పాటికి అతని తపోభూమికి చేరి ఉండొచ్చు” అని తను చూసిన దాన్ని వివరించింది చిలక.

ఆనందంతో ఆ చిలకని పొగిడి పంపింది కలభాషిణి.

అప్పుడు సిద్ధుడు మళ్ళీ “ఇంతకూ నేను ఇక్కడికి వచ్చింది నీ పాట వినటానికి. ఇకనైనా వినిపిస్తావా?” అనడగటంతో, “అలాగే” అని కొంత సేపు పాడి వినిపించింది కలభాషిణి.

అదే సమయంలో

మణికంధరుడి తపోవనంలో

మెరుపుతీగల్లాగా అప్సరసలు నడుస్తుంటే మేఘాల్లాగా వాళ్ళ వెనక వస్తున్నాయి జడలు!

చేతులు, పాదాల కాంతులు అకాల సంధ్యని పుట్టిస్తుంటే, వాళ్ళ గోళ్ళ మీది చుక్కలు తారకల్లాగా మెరుస్తున్నాయి!

అలా కదిలి మణికంధరుడి దగ్గరికి చేరారు రంభా, ఆమె చెలికత్తెలూ.

అక్కడి పరిస్థితి చూస్తే వాళ్ళకు భయం వేసింది

ఆవులు నాకుతుంటే ఆనందంగా పడుకున్న పులులు;

పులుల చన్నులు కుడుస్తున్న లేళ్ళు;

లేళ్ళు ఆడుతుంటే హాయిగా చూస్తున్న సింహాలు;

సింహాలు గోకుతుంటే సంతోషిస్తున్న ఏనుగులు;

ఏనుగుల ముందు ఆడుతున్న పాములు;

పాముల్ని లాలిస్తున్న డేగలు;

డేగల్తో ఆడుకుంటున్న ఎలకలు;

ఎలకల్ని పెంచే పిల్లులు!

వాటి మధ్య మణికంధరుడు

పావనత్వం, పుణ్యం, శాంతం, తపస్సు, సత్వగుణం, వైరాగ్యం, యోగవిద్య, తత్వబోధ, వీటన్నిటి కలబోతలాగా!

ఇలాటి వ్యక్తి తపస్సునా చెడగొట్టటం?

సాధ్యమైన పనేనా?

కాని ప్రయత్నం చెయ్యక తప్పదు. ఇంద్రుడి ఆజ్ఞ!

వనవిహారం మొదలెట్టారు ఉయ్యాలలూగుతూ, ఆడుతూ, పాడుతూ, పరిహాసాలాడుతూ!

అతనికి దగ్గర్లో తారట్లాడుతోంది రంభ కొత్త అందాల్తో, తళుకు బెళుకు కులుకుల్తో!

ఎందుకు ఎలా జరిగిందో చెప్పటం కష్టం దైవ యోగం అనుకోవాలేమో!

మణికంధరుడి సమాథి స్థితి భగ్నమైంది.

వాళ్ళ రొద అతని చెవుల్లోకి దూరింది.

ఆమె రూపం అతని కళ్ళలోకి జొరబడింది.

“కృష్ణ కృష్ణ” అని కళ్ళు మూయటమే గాని కనబడుతున్నది మాత్రం రంభే!

ఇదే సమయం అని మన్మథుడు ఇద్దరి మీదా విపరీతంగా బాణాలు కురిపించేశాడు.

“ఇది రంభ లాగా ఉందే! ఇదివరకు లేని యవ్వనపు సొంపులూ అందాలూ కూడా వచ్చాయి” తో మొదలై, “ఈమె దొరకని వైకుంఠంలో ఉండటం కంటే ఈమె తాకే చెట్టునైనా మేలు” అనుకునేదాకా చేరుకున్నాడతను అలా చూస్తూండగనే!

ఇంక తపస్సుని తీసి గంగలో కలిపేసి తరుణీమణి వెంట పడ్డాడు.

“ఇక్కడికెందుకొచ్చావ్‌? ఎక్కడి నుంచి వచ్చావ్‌? నా చెవుల పండగ్గా వినిపించు” అని బతిమాలాడు.

“ఆడుకోవటానికి” అంది రంభ అతన్ని ఊరిస్తూ.

“అబద్ధం! నువ్వు వచ్చింది నాకోసమే! ఔనా?”

చిరునవ్వే ఆమె సమాధానమైంది.

కొంగుపట్టుకు లాగటం అతని వంతైంది.

“ఐపోయిందైపోయింది! అయ్యగారి తపసుకీ అమ్మాయి గారి సొగసుకీ చెల్లైపోయింది!” అని నవ్వుకున్నారు రంభ చెలికత్తెలు.

రంభా మణికంధరులు దగ్గర్లో ఉన్న పొదరింటికి చేరి రతిక్రీడల్లోకి దిగారు.

అదే సమయంలో

ఇక్కడ ద్వారకలో

మణిస్తంభుడు కలభాషిణి పాట వింటున్నాడు. మాటల్లో మణికంధరుడి విషయం వచ్చింది.

“మరి రంభ వచ్చాక మణికంధరుడి పరిస్థితి ఏమైందో చూస్తారా?” అనడిగింది కలభాషిణి.

అతను తన దూర దృష్టితో అటు చూసి, “ఇంకేం తపస్సు? ఇప్పుడు మణికంధరుడు ఒక పొదరింట్లో ఉన్నాడు రంభ కౌగిట్లో!” అన్నాడు నవ్వుతూ!

ఆమె ఇంకా ఆశ్చర్యపడుతూ అతన్ని పొగిడి, “మీరు నిజంగా మహానుభావులు! మా ఇంట్లో ఓ రెండు రోజులుండి వెళ్ళండి” అని ప్రాధేయపడింది.

“ఏదో నీపాట వినిపోదామని వచ్చా గాని వాళ్ళూ వీళ్ళూ లాగా పట్నాలకి వెళ్ళి మహిమలు చూపించే వాణ్ణి కాను నేను. రహస్యంగా ఐతేనే నీ ఆతిథ్యం తీసుకుంటా” అని అక్కడో రెండు మూడు రోజులున్నాడా సిద్ధుడు.

కలభాషిణికి ఎలాగైనా నలకూబరుణ్ణి కలవాలనే కోరిక పెరిగిపోతోంది!

అడిగీ అడగనట్టుగా అతన్నడిగింది “మరి మణికంధరుడు మళ్ళీ తపస్సు మొదలెట్టాడా లేక ఇంకా రంభతోనే ఉన్నాడా? ఒక్కసారి చూసి చెప్పరూ?”

“తపస్సూ లేదు గిపస్సూ లేదు. రంభ కౌగిలే ధ్యానం” అంటూ అంతలోనే చెవులు నిక్కబొడుచుకుని జాగ్రత్తగా విని, “ఓర్నీ, యీ వేశ్యలు ఎంతకైనా తగుదురు సుమా!” అని పగలబడి నవ్వటం మొదలెట్టాడు మణిస్తంభుడు.

“ఏమిటేమిటి? ఏంజరిగింది?” అనడిగింది కలభాషిణి.

“ఏం చెప్పమంటావ్‌! నవ్వలేక చస్తున్నాను.అతని తపసునట్లా చెడగొట్టి తర్వాత రంభ ఏం చేసిందో చూశావా? మణికంధరుడితో రతిక్రీడలో ఉండగా “నేనలిసిపోయాను, ఇక చాలురా నలకూబరా!” అని మూలిగింది పరవశంతో. మణికంధరుడు పాపం మనసు చివుక్కుమని వెళ్ళిపోయాడు”.

“ఆఁ! రంభ మాత్రం ఏం చేస్తుందిలే! నలకూబరుడు ఆమెని అంత ప్రేమగా చూసుకుంటాడన్న మాట! .. ఇంతకూ మరి ఇప్పుడు నలకూబరుడెక్కడున్నాడో?”

“ఔనౌను. నీకు ముఖ్యమైంది అదే కదా! ఉండు చూడనీ! తను పక్కనుంటే రంభ వెళ్ళి తపస్సు చెడగొట్టలేదు, దాని వల్ల ఇంద్రుడికి కోపం వస్తుందని ఆ నలకూబరుడు ఇప్పుడు మణికంధరుడి తపోవనానికి దగ్గర్లోనే ఒక తోటలో చెట్టుకింద ఉన్నాడు….

అతని మీద పరాకుతో నువ్వింకేం పాడుతావు గాని ఇక నే వెళ్ళొస్తాను” అని ప్రయాణం కట్టాడు మణిస్తంభుడు.

భోరుమంది కలభాషిణి!

“నన్నిలా నట్టేట్లో ముంచి వెళ్ళొద్దు. ఎలాగైనా సరే ఈ రోజే, ఇప్పుడే, నేను అతని దగ్గరికి చేరాలి. మీరు తప్ప నాకు దిక్కు లేరు”

“వీలైతే చెయ్యనా? కానీ అది దగ్గరా దాపా? మా గురువుగారు ఎంతో చక్కగా శిక్షణ ఇచ్చిన ఈ సింహానికైనా నాలుగ్గడియలు పడుతుందే!

ఐనా నిన్ను దీని మీద ఎక్కించుకుపోవాలంటే అవ్వ! సాటి సిద్ధులంతా ముక్కున వేలేసుకోరా! అదీ గాక నేను నిన్ను తాకలేను కూడ.

ఇదంతా ఎందుగ్గాని, దూరదృష్టి, దూరశ్రవణాల్తో చెయ్యగలైగిన పని ఉంటే చెప్పు, తప్పకుండా చేస్తా”.

ఇంక కలభాషిణి నిలవలేక పోయింది.

“అయ్యా! వట్టి మాటల్తో పనిజరగదు. ఎలాగైనా నన్ను మీరు అతని దగ్గరికి చేర్చాల్సిందే! ఐనా, ఎవరేమనుకుంటే మీలాటి మహాత్ములకి ఏం తక్కువౌతుంది!” అంటూ కాళ్ళా వేళ్ళా బడింది. అతికష్టం మీద ఒప్పుకున్నాడతను.

ముందుగా తను సింహం మీద ఎక్కాడు.

“నన్ను తాకకుండా దీని నడుం మీద కూర్చోగలవా వెనక ఆ మరకొమ్ము పట్టుకుని?”

“మీ అనుగ్రహం అయింది. అదే చాలు. మీరెలా చెయ్యమంటే అలా చేస్తా” అంటూ తనూ ఎక్కింది కలభాషిణి.

“థే!” అని అదిలించటంతోటే సింహం అమాంతం అకాశానికెగిరి వేగంగా పరిగెత్తింది.

కొంత దూరం వెళ్ళారు.

హఠాత్తుగా పక్కనున్న మేఘం చాటునుంచి ఘుమ ఘుమ సువాసనలు, నవ్వులు, పాటలు!

ఎవరో కాదు, మణికంధరుడి తపస్సు చెడగొట్టటానికి రంభతో వెళ్ళిన చెలులు!

మణిస్తంభుడికి వాళ్ళతో కబుర్లు కలపాలనిపించింది.

“ఇదేమిటి మీ చెలిని వదిలేసి మీరే దేవలోకానికి తిరిగెళ్తున్నారు? ఆవిడ మణికంధరుడితో ఇంకొన్నాళ్ళు గడపబోతోందా?”

“ఇంకెక్కడి మణికంధరుడు? ఏమయ్యాడో, ఎటు పోయాడో! ఇప్పుడు రంభ నలకూబరుడితో హాయిగా ఉంది ఆ తోటలోనే! ఇన్నాళ్ళు విరహంలో ఉన్న వాళ్ళని విడదియ్యటం ఇష్టం లేక మేమే వెళ్ళిపోతున్నాం”.

తుర్రుమన్నారు వాళ్ళు, “కలికాలం కాకపోతే ఆ బీరజడల జోగికీ ఈ అందాల బొమ్మకీ జోడేమిటో! ఆమెని చూశారా, స్వర్గంలో ఒక్క నిముషం ఉంటే చాలు దేవతావిటులందర్నీ ఒకాట ఆడించేట్టుంది!” అని బుగ్గలు నొక్కుకుంటూ.

సిద్ధుడికి అర్థమైపోయింది పొరపాటు జరిగిందని.

ఇప్పుడు వాళ్ళు చెప్పింది కలభాషిణికి దుర్వార్తే!

“అమ్మాయ్‌! నీకు చింతేం వద్దు! ఇంకెంత సేపు నీ బాధంతా పోగొడతానుగా, అలా చూస్తుండు” అన్నాడు ఆమెకి ఉత్సాహం కలిగిస్తూ.

“అదెలాగ?”

“తినబోతూ రుచడగటం ఎందుకు?” అంటూండగానే

ఒక్కసారి తలపైకెత్తి చూసి టక్కుమని నిలిచిపోయింది సింహం!

ముందుకు నడిపించటానికి అతను రకరకాల ప్రయత్నాలు చేశాడు గాని తోకతిప్పుతూ వెనకడుగే తప్ప ముందడుగు వెయ్యదే!

కలభాషిణికి కంగారెత్తిపోయింది.

“ఏమైందేమైంద”ని అరిచింది భయంగా!

ఒక్క క్షణం ఆలోచించాడు సిద్దుడు.

“అబ్బే, ఏమీలేదు. మాటల హడావుడిలో ఒక ముఖ్య విషయం మర్చిపోయాను” అంటూ సింహాన్ని నేలకి దించి మేతకి విడిచి, “ఎదురుగా ఎంతో మహిమ గల కాళికాలయం ఒకటుంది. అక్కడ ఉన్న సింహానికి భయపడి ఈ దాపుల వెళ్ళటానికి జంకుతాయి ఎంత గొప్ప సింహాలైనా! మనం వెళ్ళి దేవికి నమస్కరించి వద్దాం. అంతా సక్రమంగా జరుగుతుంది” అంటూ ఒక కత్తి ఉన్న ఎలుగుబంటి చర్మపు ఒరని తీసుకుని గుడికి దారితీశాడు.

“నువ్విక్కడే ఉండు. నే వెళ్ళి పూలు కోసుకొస్తాను” అని పక్కనున్న పూలతోటలోకి పరిగెత్తాడు సిద్ధుడు.

అయోమయంగా దిక్కులు చూస్తూ నిలబడింది కలభాషిణి.

హఠాత్తుగా

కసువు బుట్టలాగా నెరిసిన జుట్టుతో మన్మధుడు ఖాళీ చేసి వెళ్ళిన పాడుమేడ లాటి ఓ ముసలావిడ వచ్చిందక్కడికి.

ఆమెలో విపరీతమైన ఆందోళన!

“అయ్యయ్యో! ఎక్కడ్నించి వచ్చావు నువ్వు? బావురుబిల్లిని నమ్మిన చిలకలాగా ఉన్నావే! ప్రాణాల మీద ఆశ ఉంటే వాడు తిరిగిరాక ముందే నువ్విక్కడ్నించి పారిపో! పో!”

హడావుడిగా మాట్లాడేస్తోందామె.

(ఇంకా ఉంది)


x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!