మధురకవిగా పేరు గాంచిన నాళం కృష్ణా రావు గారి కవిత.! (పరులకీయవు, కుడువవు,పైడి నీకు ఏమి లాభంబు)

మధురకవిగా పేరు గాంచిన నాళం కృష్ణా రావు గారి కవిత.!

(పరులకీయవు, కుడువవు,పైడి నీకు ఏమి లాభంబు)

1.ఊరి వెలుపల పాడు కోనేరు చెంత 

మనుజులెవ్వరు మసలని మారుమూల 

గుట్ట చాటున లోతైన గోయి త్రవ్వి 

పసిడి దాచెను పిసినారి ముసలి యొకడు.

.

2. ప్రతిదినంబున వృద్ధుండు పాతుత్రవ్వి 

మురిసి పడుచుండు బంగారు ముద్దజూచి 

పొదలమాటున నదియెల్ల పొంచిచూచి 

దొంగ యొక్కడు సర్వంబు దోచికొనియె

.

౩. మరుదినంబున ముసలివాడరుగుదెంచి 

గోయిత్రవ్వంగ బంగారు మాయమయ్యె 

నెత్తినోరును లబలబ మొత్తికొనుచు 

గొల్లుమని యేడ్చి యతడు గగ్గోలువెట్టె

.

4. అంతనాతని యరపుల నాలకించి 

పరుగు పరుగున పొరుగువారరుగుదెంచి 

"ఏల యేడ్చెద వీలీల నేల బొరలి?" 

అనుచు ప్రశ్నింప నీరీతి బనవె నతడు

.

5. "ఏమి చెప్పుదు? ముప్పదియేండ్ల నుండి 

కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన 

దాచియుంచితి, నెవ్వడో తస్కరుండు 

పచ్చపైకంబు మునుముట్ట మ్రుచ్చిలించె

.

6. "అనుదినంబును నిచ్చటి కరుగుదెంచి 

కాంచనంబును కాంక్షమై కాంచుచుందు;

ఏమి చేయుదు నక్కటా! యింకమీద?"

అంచు ముదుసలి కన్నీరు నించి చెప్పె

.

7. అనుడు నా మాటలకు వార లనిరి యిట్లు 

"పరులకీయవు, కుడువవు, పైడి నీకు 

ఏమి లాభంబు చేకూర్చె నింతదనుక?

అకట! ఉండిన నూడిన నొకటి కాదె

.

8. ఇప్పుడైనను మించినదేమి కలదు? 

పైడి గలచోట నొకపెద్ద బండ పాతి 

కాంచు చుండుము నిత్యంబు కాంక్ష దీర"

అనుచు ముదుసలి వగ్గుతో ననిరి వారు.

Comments

  1. I have been looking for this poem I had read in school.
    Asked many of my friends, but could not get it.
    Thanks for providing it here.

    ReplyDelete
    Replies
    1. Same here , really happy to read again

      Delete
    2. 40 సంవత్సరాల క్రితం నేర్చుకున్న పద్యం. ఒక వ్యాసం వ్రాస్తుంటే "పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు" అనే పాదం గుర్తుకు వచ్చింది. పద్యాలన్నీ ఇక్కడ ప్రకటించినందుకు అనేక ధన్యవాదాలు.

      Delete
  2. చిన్నప్పుడు ఈ పద్యం చదివిన జ్ఞాపకాలను... గుర్తుకు తెచ్చారు..

    ReplyDelete
  3. Thank you a lot. I always remember the poem. I found it on web. Thank you a lot for posting this.

    ReplyDelete
  4. I don't remember which class it was, but taught in my school.

    ReplyDelete
  5. I learnt this poem in fifth standard. My school teacher Shri. Narappa used to sing this poem very nicely. Thanks for posting this poem.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!