తెనాలి వారి స్వభావ చిత్రణము.!

తెనాలి వారి స్వభావ చిత్రణము.!


ఉ: ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గొంద్రు గాని, యో

పల్లవపాణి ! నే పరమ పావన వంశమునిచ్చిఁ గొంటి , నీ

'నల్లనిరూపు' నిక్కమని నమ్మి ధృవంబటుఁగాక, నేడు వి

ద్యుల్లతికాధికాభినయ ధూర్వహ మౌట నెఱుంగ భామినీ !

పాం:మాహాత్మ్యము -3 ఆ: 93వ :పద్యము;

కఠిన పదముల కర్ధము:-

మృగాక్షులు-స్త్రీలు; పల్లవపాణి- చిగురాకులవంటి చేతులు గల చాన ; ధృవము- శాశ్వతము ; విద్యుల్లతిక-మెఱపుతీగ ;

అభినయము- నటన ; ధూర్వహము-భారమును మోసెడిది;

కతిపయ దినములకు కాపుచిన్నది యకాల మరణము నందెను. ఇట్లువారిముచ్చట మూన్నాళ్ళు సాగినది. నిగమ శర్మ కొత్త తోడు కోసం వెదకులాట మొదలు పెట్టినాడు. వాని స్వభావ మట్టిది. అతడాకలికాగలేడు.ముఖ్యముగా మూడు అతనికి ముఖ్యావసరములు గామారినవి 1 మద్యము 2మాంసము 3మగువ ; వీనిలో మగువకిచ్చిన ప్రాధాన్యము మరియొకదానికి లేదు.

ఆకారడవిలో నతనికి చిక్కెడిదెవరు? ఒక ఆటవిక వనత మాతంగి చిక్కినది. అది నల్లని వికృత రూపి. అయినను కామాంధుడగు ఆతనికి యందగత్తెగానే దోచినది. తామెచ్చినది రంభ!తామునిగినది గంగ గదా! దానితోనేపునః సంసార మారంభమైనది. దానికి వరుసకాన్పులు.ఆరునెలలు బాలింత మఱి యాఱునెలలు చూలింత .వేట భారమంతయు నిపుడు అతనిపైననే బడినది దారులుగాచి దోచుకొనుట, వేటాడి యింటికి యెఱచి దెచ్చుట, కుండలలో ఇప్పకల్లు నింపుట దైనందిన కార్యక్రమము లైనవి. ఇట్లుండ నొకనాడాతడు వేటకేగి యింటికి వచ్చుసరికి యిల్లంతయు భస్మీపటల మైనది .గుడిసె పూర్తిగా కాలిపోయినది. వాని మాతంగియు పిల్లలు మాడిమసియైపోయిరి. అప్పుడతడా మాతంగి కొఱకై యెంతగా విలపించెనో తెలియజేయునదియే పైపద్యము.

భావము: లోకంలో అందరూ డబ్బుతో ఆడవాళ్ళను కొంటారే ,! మరి నేనో నాపవిత్రమైన వంశం వెచ్చించి నీనల్లని రూపాన్ని

స్వంతం చేసికొన్నానే! ఇది శాశ్వతమని భ్రమిశానే! కానీ, ఇతంతా మబ్బులో మెఱపులా క్షణంలో మాయమౌతుందని తెలియ లేకపోయానే ! అయ్యో నామాతంగీ! అంటూ హృదయ విదారకంగా విలపిస్తున్నాడు నిగమ శర్మ.

అసలు వాడి ప్రకృతిలో కన్నీటికి అవకాశముందా? లేనేలేదు. జూదంలో ఓడినప్పుడుగాని, యిల్లంతా దోచుకొని పోయేటప్పుడు గాని, దొంగలచేత చావుదెబ్బలు తిన్నప్పుడుగాని, కాపు పడచు చచ్చినప్పుడు గాని, చెమరింపని వానికన్నులు 

మాతంగి మరణానికి వర్షిస్తున్నాయి. యింత బేలతనం అతనికెలా కలిగింది? అదే మరి! అపత్య సంజనన ప్రభావం!

వేరెవ్వరి వలన అతడు సంతానాన్ని పొందలేకపోయాడు. దానిపొత్తు అపవిత్రమైనదైనా దానివలన సంతతికలిగింది. అదిగో అందువలన దానిమీద అభిమానం పెరిగింది. ఈరహస్యం తెలిసిఉండే మనపెద్దలు వివాహంఅయిన జంటను "శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు "- అని దీవిస్తారు. పెళ్ళైన జంట తొందరగా సంతానాన్ని పొందాలి.అది

వారి దాంపత్యానికి మరోముడివేసి సతీపతులను యింకా దగ్గర కుచేరుస్తుంది. సరేమనం ప్రకృతానికి వద్దాం.

పల్లవపాణి, భామినీ యిత్యాది సంబోధనలు అత్యంత మనోహరాంగులకు వాడేపదాలు. కవి యిక్కడ వాటిని నిగమశర్మ నోట పలికిస్తూ వానికి ఆమెపట్ల ఏర్పడిన అనురాగాధిక్యతను వెల్లడించాడు.

ఈవిధంగా పై పద్యంలో కవిచేసిన మనో విశ్లేషణను మనవాళ్ళు యిప్పుడు " చైతన్య కళాశిల్పం"- అనియంటున్నారు. దీని నీవిధంగా తెనాలివారు పోషించినతీరు వర్ణనాతీతమైనది. మనస్సు పొరలలో దాగిన విషయాలను

మాటలద్వారా బయటకు లాగి నిగమశర్మలో గూడా ఆత్మీయతా గుణాలు అంతరింప లేదని నిరూపించారు.

ఇదీ తెనాలి వారి రచనా సామర్ధ్యము! ఇదే "పాండు రంగ విభుని పద గుభనమై వాసి కెక్కింది!

స్వస్తి !


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!