మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

.

పాటల లోకంలో విరిసిన పారిజాతం దేవులపల్లి. ఆయన 1897లో రామచంద్రపాలెంలో జన్మించినప్పట్నించీ- 

-''ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై''- మాటల ముత్యాలతో తెలుగు వాగ్గేయకారుల్ని మించిన అందాల్ని తెలుగు పాటలకు అందించారు. ఆయన బ్రహ్మ సమాజవాది. కనిపించే ప్రతి రాయికీ, ప్రతి రప్పకీ, బొమ్మకీ, శిలకీ మొక్కవద్దని చాలా స్పష్టంగానే అన్నారు. 

.

''ప్రతి కోవెలకూ పరుగిడకు 

ప్రతి బొమ్మకు కైమోడ్చకు...'' 

.

ఆయన ''ప్రభు! ప్రభు! ప్రభు! దీనబంధు, ప్రాణేశ్వర దయాసింధు...'' అంటూ ఈశ్వరుడిని ఎలా వేడుకొన్నారో హైదరాబాదులో ఉన్న తరుణంలో సాయంత్రం వేళ నమాజు విని అల్లాను అలాగే వేడుకొన్నారు. 

.

ఖుదా! నీదే అదే పిలుపు 

ఖుదా! నీదే సదా గెలుపు 

.

కృష్ణశాస్త్రి ఏ విషయంమీద పాట రాసినా ప్రతి మాట లయాత్మకంగా అందులో ఒదిగి పోతుంది. ఆయన్ని అందుకే వడ్డెపల్లి కృష్ణ ''మృదు పదాల మేస్త్రీ'' అన్నారు... లేకుంటే ఇంత కమ్మగా ఎలా సాధ్యమైంది- 

.

''ముందు తెలిసెనా, ప్రభు ఈ 

మందిర మిటులుంచేనా...'' 

.

ఆయనొస్తాడని ముందు తెలిస్తే భక్తుడు అన్నీ సిద్ధం చేసి ఎదురు చూస్తాడు కదా... అంతే కాదు-

''ప్రతి క్షణము నీ గుణ కీర్తనము 

పారవశ్యమున చేయుదును...'' 

.

అంటూ గుణ నామాల్ని కీర్తిస్తూ గడపడూ! దేవులపల్లి ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారుల సరసన నిలవదగిన గేయకారుడు. అయితే ఆయన రచయితే కానీ పాటగాడు కాలేకపోయారు. 

.

కనికరముంచరా! కరుణాకర తండ్రి!....... 

రండు రండు ప్రాణేశుడు 

రాక రాక వచ్చె నేడు 

........ 

జయము జ్ఞాన ప్రభాకరా 

జయము శాంతి సుధాకరా... 

......... 

కన్న తండ్రీ! వేచి యుంటి 

కరుణా సృష్టికి వేచియుంటి 

......... 

వీటిల్లో అర్థం కాని పదం లేదు. అన్నీ అలతి అలతి పదాలే. అయినా ఎంత కమ్మని భావాలు! నిర్మల భక్తికి దేవులపల్లి కృతుల్లో ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. 

లేదోయి నిదురలో లేదోయి సుగతి 

చూడవా కనువిచ్చి చూడవా జగతి 

........ 

తొలి ప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము 

వెలుగు గుడి మొగసాల నిలిచె యాత్రాజనము 

....... 

ఎటుల నేనీ లీల కీర్తింతు 

ఓ దేవ దేవా! 

ఎటుల నేనీ మ్రోల నర్తించు 

......... 

ఆ కాలంలో శైవ వైష్ణవాల మధ్య వైషమ్యాలు విగ్రహారాధన వంటివి ప్రబలంగా ఉండేవి. వాటిని నిరశిస్తూ- శిథిలాలయమ్ములో శివుడు లేడోయి, తెగదెంచండయ్యా, ఏ ద్వేషపు సంకెళ్ళేవి- వంటివి ఎన్నో రాశారు. రాధా కృష్ణుల విరహాన్నీ, ప్రేమనీ తనివి తీరా కీర్తించారు. 

రాధ విరహ బాధ- అనురాధ మధుర గాధ... 

....... 

మ్రోయింపకోయ్ మురళి 

మ్రోయింపకోయ్ కృష్ణ 

.

అన్నమయ్య, రామదాసు కీర్తనలను తలపించేలా ''నవ తులసీ దళ దామా! నవకువలయాభిరామా!'' రామచరణం, రామచరణం, రామ చరణం మాకు శరణం'', నీ పదములె చాలు రామా, నీ పద ధూళులె పది వేలూ, శివశివశివ అనరాదా? శివనామముచేదా'', నమో నమస్తే నారాయణా! నవ జీవని ధానా నమో నమో...'' వంటి గీతాలు ఎన్నో కనిపిస్తాయి. వసంత వేళ దేవులపల్లి కృష్ణశాస్త్రి మనసు ఉరకలు వేస్తూ కలాన్ని పరవళ్ళు తొక్కేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ''మధూ దయంలో మంచి ముహూర్తం మాధవీలతకు పెళ్ళి, మల్లెనమ్మా మల్లెనేనా, ఒళ్లు సందెల జల్లెనే'' వంటి ఎన్నో నృత్య గీతాలు రాశారు. 

.

''శీతవేళ రానీయకు- రానీయకు, 

శిశిరానికి చోటీయకు- చోటీయకు, 

పడమటి వాకిటి తలుపులను, గడియ తీసి తెరిచారా? 

ఆ... దుడుకు గాలి గుర్రాలను విడిచి బయట తోలారా...'' 

.

ఇవన్నీ ఆయా రుతువుల గురించి ఎంతో కమ్మగా రాశారు. ప్రేయసీ ప్రియుల మనోభావాలు తెలుపుతూ-, 

''చెలీ నన్ను లేపకే, కలలు కనేవేళ, 

కలలోనైనా వానిని కనగలనేమోనే... ఏనాటికీ రాడు 

ఏలాటి ప్రియుడే, తోట పిలిచె తోపు పిలిచె ఏటి తరగల పాట పిలిచె...'' 

.

ఇలా ఈ గీతాలన్నీ వింటోంటే, చదువుతోంటే కృష్ణశాస్త్రి గీతాల్ని పోలిన గీతాలు తెలుగు సినిమాల్లో ఎన్నో వచ్చినట్లు స్పష్టమవుతుంది. దేశ భక్తి గీతాలు రాసినా ఇతరులకు సాధ్యం కాని విధంగానే ప్రబోధాత్మకంగా రాశారు. 

ప్రాభాత ప్రాంగణాన మ్రోగేను నగారా 

ఈ భారత భువి పొంగెను ముక్త జీవధార! 

........ 

అనవేరా భారతవీరా 

అనవేరా నీ నోరారా 

....... 

హే భారత జననీ! 

స్వేచ్ఛా గగన వీధీ విహారిణీ 

....... 

ఎత్తండీ! ఎత్తరేం? స్వాతంత్య్రపు జెండా! 

...... 

నారాయణ నారాయణ! అల్లా అల్లా! 

...... 

కమ్మగా బతికితే గాంధీయుగం-మనిషి 

కడుపు నిండా తింటె గాంధీజగం 

జయ జయ జయ ప్రియభారత 

జనయిత్రీ దివ్య ధాత్రి 

........ 

శ్రామిక జనాన్ని ఉత్తేజితుల్ని చేస్తూ ఆయన రాసిన గీతాలు 

కొండరాళ్ళు పగులగొట్టి 

కోన చదును చేద్దాం 

కోనలంట దారి తీసి 

గోదారులు వేద్దాం.... 

........ 

కొత్త కోవెల కొత్త కోవెల 

నాల్గు దిక్కుల నడిమ ఈ ఇల 

మానవా, నవ మానవా 

నీవు నిలిచిన నెలవె కోవెల 

....... 

ఐలెస్సా! ఓ లెస్సా... 

ఇలా ఎన్నో రాశారు. జయ జయ జయ ప్రియ భారతిలా తెలుగు తల్లిని, కూడా ఘనంగా కీర్తించారు. 

''జయ జయ మహాంధ్ర జనయిత్రీ... 

...... 

జయ మహాంధ్ర జననీ! జయ మహాంధ్ర జననీ...'' 

దేవులపల్లి వాన దేవుడు మీద పాటలు రాశారు. ఎలుక, చిట్టెలుకల మీద రాశారు. జానపద గీతాల్ని అనుసరిస్తూ ''ఎవరాడపడుచమ్మ - ఎవరాడపడుచు?'' వంటివి రాశారు. వెన్నెల పాటలు, జాబిల్లి పాటలు, జోల పాటలు ఇలా అన్ని సందర్భాలకు అనువైన గీతాలు రాశారు. గొంతు వ్యాధితో మూగవాడైనా గుండె గొంతుకతో చివరి వరకు వందల గీతాలు రాశారు. సినిమా గీతాల గురించి సరేసరి. 1980లో కన్ను మూసిన దేవులపల్లి తెలుగు తల్లికి మంగళ గీతం పాడారు. తెలుగు పాటకి హృదయాన్నిచ్చి, ఆర్ద్రపరచి, అందరి సొంతం చేసిన ధన్యుడు దేవులపల్లి. 

.

''తెలుగు తల్లికి మంగళమే! 

మా కల్పవల్లికి మంగళమే 

వేద వేదములన్ని తరచీ 

వాద భేదములన్ని మరచీ 

స్వాదు ధర్మ పథమ్ము పరచు 

విశాల శీలకు మంగళమే "

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!