వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి - రచన : తనికెళ్ళ భరణి .

   

.

వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి ! - రచన : తనికెళ్ళ భరణి    

.  

 

వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి

కళాకారుడు స్వేఛ్ఛాజీవి!

వాడికొక ప్రత్యేక రాజ్యం...ఇష్టారాజ్యం!!

స్వేఛ్చగా ఆలోచిస్తాడు..అందులోంచే సృజనాత్మక శక్తి ఆవిర్భవించి సామాన్యులకు అనుభవంలోకి రాని సంగతులన్నీ.. కొత్త కోణంలో ఆవిష్కరిస్తాడు.. ఆశ్చర్యపరుస్తాడు...ఆనంద పరుస్తాడు... తృప్తిగా నిట్టూరుస్తాడు.!!

మొట్టమొదట కావాల్సింది..స్వేఛ్చ.!

అంచేతే అన్నారు...

బెదిరించి ఓ సింహాన్ని బంధించగలవేమోగానీ,

శాసించి ఒక్క పూవును కూడా వికసింప చెయ్యలేవు అని..

అయినా కళాకారుడు ఏమడిగాడనీ..స్వేఛ్ఛగా ఉండనిమ్మన్నాడు..నా యిష్టానికి నన్నొదిలేయ్యండయ్యా.. ఆ తర్వాత నా మనస్సురాల్చే పారిజాతాలు ఏరుకోండి అన్నాడు..!

ఆహా..! వాణ్ణి బంధించి వాడి మెదడుని గాజు సీసాలో వేసి దాన్నుంచి అద్భుతాన్ని పిండుకుందామంటే ఎలా వస్తుంది.?

బంగారు పంజరంలో ఉన్న ఏ చిలకని ప్రశ్నించినా బెంగగా ఒకే మాట చెప్తుంది! అడవిలోకెళ్ళి అడుక్కుతినాల్ని ఉందీ అని..

అదే కళాకారుడు తత్త్వం!

వాడే కళాకారుడు!!

సొమ్ముకి అమ్ముడుపోయేవాడు..కళ..కారుడు!..

సాలిగ్రామం గోపాలంగారనీ విజయనగం సంస్థానంలో పెద్ద సంగీత విద్వాంసుడు.

పెద్ద ఇల్లూ వాకిలీ...నౌకర్లు, చాకర్లు...మందీ మార్బలం...పొద్దునే స్త్రోత్ర పాఠాల్తో మేల్కొలుపులు..

గబగబా అనుష్టానం...వెంటనే పల్లకీ ఎక్కి రాజాస్థానానికి వెళ్ళడం..! అక్కణ్ణించే కళా-కార్మికత్వం...ఏం పాడమంటే అదీ! ఎప్పుడు పాడమంటే అప్పుడు ఎవళ్ళ మీద పాడమంటే వాళ్ళ మీద!

ఓ పాటల యంత్రం.

దీన్నంతా గమనిస్తున్నాడు చిరంజీవి...పొడుగు రామమూర్తి అనే శిష్యుడు..!

రామ..రామ..పది నిముషాలపాటు ప్రశాంతంగా పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఎరుగడు గురువుగారు. ఎప్పుడూ ఎవరో తరుముతున్నట్లే...సరే ఐశ్వర్యముంది...కీర్తి ప్రతిష్టలు అంటారా!

పట్టుపంచి, జరీ శాలువా, కాళ్ళకి బంగారు కడియాలు, చేతులకి కంకణాలు, మెళ్ళో నవరత్నాల దండ, వెండి పొన్ను కర్ర, వెండి పొడుం డబ్బా, నుదుటన కస్తూరి, కంఠానికి మంచి గంథం, కంఠంలోపలే గరళం!! గుండెల్లో మంటా..

బంగారు గొలుసుల్తో బంధించబడ్డ గంగిగోవు! ఆయన దగ్గర తన సంగీతం! శిష్యుడికి పాఠాలు చెప్తున్నప్పుడే కాస్త సేదతీరేవారు సాలిగ్రామం వారు.

పదో ఏట నుంచీ, ఒక్క పన్నెండేళ్ళ పాటు..వీణాభ్యాసం చేశాడు పొడుగు రామమూర్తి! అంటే పన్నెండేళ్ళ అహరహం నిరంతర సాధన.

వీణ శరీరంలో భాగమైపోయింది!

వాయిస్తూ వాయిస్తూ నిద్రలోకి ఒరిగి పోయిన శిష్యుణ్ణి చూస్తే కరువుదీరా శివలింగాన్ని కావులించుకున్న మార్కండేయుడిలా అనిపించేవాడు. అప్పుడు రామమూర్తిని లేవదీసి పక్కమీద పడుకోబెట్టి దుప్పటి కప్పేసేవాడు గురూగారు.

ఏదైతేనేం.. రామమూర్తికి వీణ అబ్బింది.. అద్భుతంగా వాయించడం ఆరంభించారు.

కానీ, గుండెల్లో చిన్న గుబులు బయలుదేరింది. కొంపదీసి గురూగారు ఆస్థానానికి రమ్మంటారేమో! ఒక్కసారి అక్కడ వాయిస్తే యావజ్జీవ ఖైదుగదా! అని మధనపడి..ఓ శుభవేళ...గురూగారి పాదాలకి నమస్కరించి..

స్వామీ నాకు దక్షిణ దేశం వెళ్ళి, సంగీతాన్ని మరింత నేర్చుకోవాలని అభిలాషగా ఉంది. తమ అనుజ్ఞ అయితే,

గురూగారు శిష్యుణ్ణి ఆపాదమస్తకం చూసుకున్నారు..

అదృష్టవంతుడివి..

వెళ్ళు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

స్వేఛ్చగా ఎగిరిపోతున్న పావురంలా అనిపించీ హృదయం తేలికైపోయింది సాలిగ్రామం గోపాలంగారికి!

అలా ఎగిరిన పావురం, తమిళనాడులోని తచ్చూరి సింగరాచార్య సోదురుల ప్రాంగణంలో వాలింది. వీణమ్రోగింది.

గోదావరి, కావేరీతో కలిసి పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది.. అలా కొన్నేళ్ళు గడిచాక..

ఓ రోజు...సంగీత యజ్ఞం!

వేదిక గోఖలే హాలు.

సంగీత రసజ్ఞులైన జనంతో కిటకిటలాడిపోతోంది హాలు. ముఖ్య అతిథిలో..తిరువత్తూర్ త్యాగయ్య, సుమతీ కృష్ణారావు, బెంగుళూర్ నాగరత్నమ్మ (తిరువయ్యూరులో త్యాగరాజ స్వామి వారి సమాధికి ఆస్తి మొత్తం ధారపోసిన పుణ్యాత్మురాలు) వచ్చారు!

ఒక్కసారి గురుస్మరణ చేసుకుని వీణ మీటాడు రామమూర్తి.

వింటున్న వారి హృదయాలు మీటినట్లయి ఆనందంతో పులకరించారు.

నారదుడు ’మహతి’ మీటినట్లూ..

తుంబురుడు ’కళావతి’ మీటినట్లూ..

స్వర సముద్ర తరంగాల్లో మునిగి తేల్తున్నారు రసికజనం. ’పొడుగు’ వట్టి ఇంటి పేరులోనే గాదు, విద్యలో కూడా ప్రస్ఫుటంగా కనిపించేసరికి!

ఆ వీణా విరాట్ మూర్తికి నమస్కరిస్తూ చప్పట్ల వర్షం కురిసింది.

అంత పొడుగు రామమూర్తి వొంగి వినయంతో ’వామనుడైపోయాడు’

వెంటనే విజయనగరం రాజావారి నుంచి కబురు వచ్చింది. మా ఆస్థానాన్ని అలంకరించవలసింది అని.

వెళ్ళాడు..కానీ

గురూగారితో చెప్పించాడు..ఆస్థాన పదవిలో ఉన్నా..; దేశంలోని అన్ని ప్రాంతాలకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళే అవకాశం ఉంటేనే పదవిని అంగీకరిస్తాను అని.

అలాగే కానియమన్నారు రాజావారు.

అంతే అక్కణ్ణించి కొన్నాళ్ళు మైసూరు మహారాజా వారి సన్నిధిలో..

సింధియా మొదలైన సంస్థానాలకి వెళ్ళి తన మనసుకు నచ్చినన్నాళ్ళు...వాళ్ళు మెచ్చినన్నాళ్ళు ఉండి, అక్కడి సంగీత విమర్శలను పరిశీలించి...తన విద్వత్తును ప్రదర్శించి..అంతులేని అభిమానాన్ని, కానుకల్నీ స్వీకరించి...స్వేఛ్ఛగా తిరిగి విజయనగరం చేరేవారు.

ఎంత కాదనుకున్నా ఆస్థాన పదవి మెడకి లంకే!

ఎంత ఇష్టారాజ్యంగా ఉన్నా, కొన్నిసార్లు అనుమతి తీసుకోక తప్పేది కాదు. అంచేత ఓ సుముహూర్తం నాడు...ఆ పదవికి కూడా తిలోదకాలు ఇచ్చేసారు!

ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఓ సంగీత గురుకులాన్ని స్థాపించారు.

తను సంపాదించిన ధనంతో ఉచిత భోజన వసతుల్ని కల్పిస్తూ సంగీతాన్ని బోధించేవారు.

ఉర్లాం, పోలాకి, నర్సన్నపేట, శ్రీకాకుళం, బరంపురంలో సంగీతోత్వవాలు విరివిగా జరగడానికి కారకులై, ప్రతీఏటా సంగీత ఉత్సవాలు జరపడం సాంప్రదాయంగా చేశారు రామమూర్తిగారు.

1911 లో దివాన్ బహదూర్ కొమ్మారెడ్డి సూర్యనారాయణముర్తిగారు..పొడుగు రామమూర్తిగారిని కాకినాడకి రప్పించి సరస్వతీ గానసభలో వీణ కచ్చేరీ పెట్టించారు.

హరినాగభూషణం, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, గోవిందస్వామిపిళ్ళై వంటి సంగీతజ్ఞుల మధ్యన బంగారు పతకంపై వైణిక సార్వభౌమ అని చెక్కించి బహూకరించారు.

బతికన్నాళ్ళు...తన సంగీత సామ్రాజ్యానికి సార్వభౌమత్వాన్ని నెరపిన పొడుగు రామమూర్తి ధన్యుడు!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!