సౌందర్య దర్శనమ్ !

సౌందర్య దర్శనమ్ !

కాళిదాస మహాకవి కావ్య త్రయాన్ని నాటక త్రయాన్ని రచియించి కవితాప్రియుల కానంద సంధాయకుఁ డైనాడు. ముఖ్యంగా నాటక త్రయంలో అతడు దర్శించిన, దర్శింపఁ జేసిన నాయికా సౌందర్యం నాన్యతో దర్శనీయమైనది.

మాళవికాగ్నిమిత్రమ్ విక్రమోర్వశీయమ్ , అభిజ్ఙాన శాకుంతలము లుగా 

చెప్పబడే ఆనాటక త్రయంలో ఒక్కొక నాటకంలో ఒక్కొక విధమైన నాయికలను యెంచుకున్నాడు. 

మాళవిక కేవలం అదివ్య. మానవకాంత. 

విక్రముడు పురూరవుడు వలచిన ఊర్వసి దివ్య . శకుంతల 

వీరి సౌందర్యములను వర్ణించు పట్టుల వినూత్నమైన వివిధ పధ్ధతుల ననుసరించినాడు.

ముందుగా దివ్యా దివ్య సౌందర్య విభ్రాజిత యగు శకుంతలా సౌందర్యాన్ని వర్ణించిన తీరుతెన్నులను బరిశీలింతము. దుష్యంతుడు వేటకై వచ్చి యలసి కణ్వాశ్రమమునకు అరుదెంచెను. అట బాలపాదపములకు నీరువోయుచున్న మువ్వురు కన్నియలను జూచెను.

ఆమువ్వురిలో నొకతె వినూత్న సౌందర్యవతి. మానవకాంత వలె యగుపడలేదు.కాకున్న బుష్యాశ్రమ నివాసమేల? వల్కల ధారణమేల? అపూర్వమీ సౌందర్యముగదా! యనిమనంబున నెంచుచు తనలో తానిట్లను కొనెను.

నీజమునకీమాటలు ఆపాత్రమాటున దాగిన కాళిదాస మహా కవివేగదా!

శ్లో: సరసిజ మనువిధ్ధం శైవలేనాపి రమ్యం /

మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి /

ఇయ మధికమనోజ్ఙా వల్కలేనాపి తన్వీ /

కిమివహి మధురాణామ్ మండనమ్ ఆకృతీనామ్/

అర్ధము:- 

సరసిజమ్- పద్మము; శైవలేన- నాచుతో; అనువిధ్ధమ్+ అపి- కలసిఉన్నాకూడా ;రమ్యమ్- మనోహరమే;

హిమాంశోః- చంద్రునియొక్క; లక్ష్మ- మచ్చ; మలినమపి -మాలిన్యమేయైననూ( నలుపైనను)లక్ష్మీం-శోభను; తనోతి-కలిగించుచున్నది. ఇయం తన్వీ- ఈకన్నె ;(నాజూకు పిల్ల) వల్కలేనాపి-నారవస్త్రమును దాల్చిననూ; అధికమనోజ్ఙా-చాల యందముగా నున్నది; మధురాణామ్ -తియ్యని (చక్కని) ఆకృతీనామ్- ఆకారము గలవారికి ( అవయవముల పొందిక గలవారికి) మండనమ్- అలంకారము- కిమివహి-ఎందుకు? ( అనవసరము)

తామర పూవు చుట్టూ పచ్చని నాచు ఆక్రమించి యుంటుంది. అయినా అదెంత అందంగా ఉంటుంది? చంద్రునిలోని మచ్చ నలుపే అయితేనేం చంద్రుడెంత అందంగా ఉంటాడు! నాజూకైన యీపిల్ల నారచీర కట్టినా అందమేమీ తగ్గలేదు. అసలు చక్కని ఆకారం ఉన్నవారికి అలంకారాలెందుకు?

అందమైన వారికి వేరే అలంకారాలు అవసరంలేదంటాడు కాళిదాసుగారు. లేనివారికి కావాలని వేరే చెప్పక్కర లేదుగదా! శకుంతల యంద మలాంటిది. తల్లి మేనక దేవవేశ్య. మొత్తానికి దేవకాంత. ఆమెనుండి దివ్యౌందర్యం,లావణ్యం యీమెకు సంక్రమించాయి. తండ్రి తపోధనుఁడైన విశ్వామిత్రుఁడాయె. అతనినుండి,గాభీర్యాది సుగుణాలు సంక్రమించాయి.

అందుచేత ఆమె ముని కన్నెలలో వైవిధ్యంగానే కనిపించింది. అందుచేతనే చివరకుతీర్పు. ఏమనీ? ఆకారముగలవారికి(అనగా సహజమైన సౌందర్యము గలవారికి ) అలంకారము లక్కరలేదని.

దీనిని సమర్ధిచుట కోసమే ముందు రెండు ఉపమానములను జెప్పినాడు. ఉపమాకాళిదాసస్య అన్నారుగదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!