Skip to main content
అమ్మ!
అమ్మ!
.
(మా సోదరి..శ్రీమతి తరంకంటిసుర్యలక్ష్మికవిత .)
.
1. అవనిలోన అమ్మ ఆరాద్య దైవము
దైవ మనగ అమ్మ. అమ్మ గురువు.
ఉగ్గుపాల తోటె ఊసులెన్నొ జెప్పు
ఆటపాట లన్ని అమ్మ నేర్పు.
.
2. లాల పోయు వేళ లాలించు చక్కగా
బువ్వ పెట్టు వేళ బుజ్జ గించు
జోల పాడి కథలు జెప్పి నిదురబుచ్చు
అమ్మ కెవరు సాటి రారు.
.
3. అమ్మ చూపులన్ని ఆశీర్వచనములు
తేనె లొల్కు అమ్మ తెలుపు మాట
అలుపు లేని బాట అమ్మ నడుపు బాట
అమ్మ కెవరు సాటి అమ్మ గాక.
.
4. అమ్మ వున్ననాడె అమ్మాయి పుట్టిల్లు
కష్ట సుఖములు విను కన్న తల్లి
అడవి రోదనంబు అమ్మలేని బతుకు
అమ్మ కన్న మిన్న అవని లేరు.
.
5. అందహీనుడైన అవటివాడైనను
అమ్మకెంతో ముద్దు అమ్మ బిడ్డ
కన్న బిడ్డ కేమి కష్టమొచ్చిన గాని
తల్లడిల్లి పొవు తల్లి మనసు.
.
6. దొంగ యైన గాని దొరబాబు యైనను
అమ్మ కూడు బెట్టు ఆకలెరిగి
ఆదరంబు జూపు అమ్మ ఎల్లప్పుడు
దైవ మనగ వేరు దైవ మెవరు?
.
7. బిడ్డ కడుపు తడుము బిడ్డ డింటికి జేర
అన్నమింత బెట్టు ఆక లెరిగి
అన్నపూర్ణ యనగ అమ్మనే యనవచ్చు
అమ్మ చేతివంట అమృత మోగ.
.
8. అమ్మ పెంపులొనె అనురాగమమతలు
బిడ్డ అమ్మ యనుచు బిల్వగానె
అమ్మ కన్నులందు ఆనంద బాష్పాలు
అమ్మ నామ మెంత అద్భుతమ్ము.
.
9. భాగ్యమింత లేక బీదరాలైనను
కన్నబిడ్డ సుఖము గోరు తల్లి
కూలి నాలి చేసి కడుపు కట్టుకునైన
కన్న కడుపు గాన కూడు బెట్టు.
.
10. రోగమొచ్చి నపుడు రామనామ జపమై
ఆర్తి తోడ మూల్గు "అమ్మ" యనుచు
బాధ లెన్నొ గలుగ 'అమ్మా అమ్మాయంచు
అమ్మ నే బిలుతురు "అమ్మ" యనుచు.
.
11. పూజ్యురాలు అమ్మ. పుదమి జనులకెల్ల
సమత మమత జూపు సాద్వి అమ్మ
సహనశీలియె అమ్మ శాంత స్వారూపిణి
పుణ్య చరిత అమ్మ పృధ్వి లోన.
.
12. ఆర్తి గొన్న వేళ ఆనంద సమయాన
ఆకలైన వేళ అమ్మ బిలుచు
తెగని బంధ మనగ తల్లి బిడ్డల దౌను
దైవమనగ వేరు దైవ మెవరు.
.
13. బిడ్డలెందరున్న బిడ్డలందరొకటి
అమ్మకెపుడు లేవు అంతరాలు
ఎవరికెంత వున్న ఎంచదా తేడాలు
సరిసమాన గుణము సహజ మనగ.
.
14. అమ్మ మనసెరింగి అమ్మను ప్రేమించు
జన్మనిచ్చి నట్టి జనని మనకు (ఆమే)
కష్టపెట్ట వద్దు కన్న తల్లి మనసు
తల్లి ఋణము దీర్ప తరము కాదు.
Comments
Post a Comment