Skip to main content
ఉత్తరకుమారుడు!
ఉత్తరకుమారుడు!
.
"భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త జా
లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే"
.
ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్ని
చూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది. భీష్మద్రోణ కృపాదులవంటి అతిరధ,మహారధులు, వేసవిసూర్యుడి ప్రతాపం లాంటి శౌర్యంగల వీరులు నిండివున్న అపారమైన సేననుగూర్చి చెప్పేటప్పటి భాషకు ఎంతటి రాజసం ,
హంగు ఉండాలో ఈ పద్యం చూపిస్తుంది. పైపెచ్చు చెబుతున్నది
సముద్రంలాంటి సేనను చూసి భయభ్రాంతుడైన రాకుమారుడు ఉత్తరకుమారుడు. భయపడ్డ అతనికనులకు ఈ ఉద్దండమైన సేన మరీ ఉగ్రంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
.
గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే ,
పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే ,
ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది.
ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం.
“శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి ,
.
ఆ మేఘగర్జనలాంటి సమాసపు ప్రౌఢ గంభీర శబ్ద సౌందర్యానికి అబ్బురపడతాం.అంటే వాచ్యార్ధం స్ఫురించే లోపే
మూలభావన-రూట్ ఫీలింగ్ మన అనుభూతిలోకి వస్తుంది.
ఇది ఆ పద్యం/కవి గొప్పదనం .
అంతేకాక యుద్ధభూమి పై వ్రాసిన పద్యం ”శార్దూలం”లో వ్రాయటం లో కూడా చక్కటి ఔచితి వుంది.
నా చిన్నప్పుడు మాకు తెలుగు ఎంతబాగా వచ్చో పరీక్ష చేయటానికి మా నాన్నగారు ఈ పద్యపాదాలు డిక్టేట్ చేసి తప్పులులేకుండా రాయగలమో లేదో చూసేవారు .
Comments
Post a Comment