శ్లోక చతుష్టయం.!

శ్లోక చతుష్టయం.!

.

"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"

.

అన్నట్టుగా కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి.

నాటకాలలో శాకుంతలం, అందులో మళ్ళీ నాల్గవ అంకము, 

అందులో కూడా శ్లోక చతుష్టయం 

(ఇది వినగానే నాకు దుష్ట చతుష్టయం గుర్తుకొచ్చింది :)) 

అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు.

ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. 

ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:

.

పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా

నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం

ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః

సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం

.

మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు! 

.

మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, 

అటువంటి శకుంతల అత్తవారింటికి వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. 

వృక్షో రక్షతి రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా 

ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.

.

యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా

కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం

వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః

.

నా కూతురయిన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. 

మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉందే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి.

ఒక ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు అందుకేనేమో!

.

అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః

త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం

సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా

భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః

.

కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. 

నేను సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. 

కావున అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. 

నీకు చాలా మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. 

నన్నెంతగానో కదిల్చింది. ఎంత ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో కదా! అనిపించింది.

.

సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే

భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః

భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ

యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

.

ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో చెప్పాడు. 

పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, 

సేవకుల యందు దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. 

ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో! అనిపిస్తుంది.

ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. 

కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! 

అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి.

ఈ నాటకమంతటిలో నాకు కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!