వాల్మీకి - రామాయణము...బాల కాండము !

వాల్మీకి - రామాయణము...బాల కాండము !

( కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము)

.

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి అయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరధుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.

రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.

కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరధుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరధుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.

రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగినది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిధిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తీ శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసినది.

మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!