పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.! (శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.)

పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!

(శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.)

-

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. -సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. 

-

రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. 

-కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు.

మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. 

అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. ----త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. 

-అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు.

బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు.

ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

-

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ

జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా

జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో

మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

-

మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి,

-

"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!

హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!

వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!

మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!

జాతిసతులఁ బాయ నీతియె హరి కని

జాతులార! దిశలఁ జాటరమ్మ!

కదళులార! పోయి కదలించి శిఖిపింఛ

జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"

-

సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!