విక్రమార్కుడి కథలు ! -


-

విక్రమార్కుడి కథలు !

-

ఆ విధంగా రాజ్యాన్ని భట్టి విక్రమార్కులకు అందించి భర్తృహరి అడవులకు వెళ్ళిపోతాడని చెప్పుకున్నాము కదా......

విక్రమాదిత్యుడు, తన సోదరుడైన భట్టిని ప్రధానమంత్రిగా చేసి, రాజ్యపాలన మొదలెడతాడు.

.

-ఒకనాడు....

విక్రమాదిత్యుడు, భట్టిని పిలిచి "నా మనస్సులో ఒక కోరిక ఉంది. అది నెరవేరాలంటే నీ సహాయం కావాలి. వారసత్వంగా మనకు లభించిన ఈ రాజ్యము చాలా చిన్నది. దీనితో సంతృప్తి పడటం నాకు ఇష్టం లేదు.

.

చిరకాలము మనము ప్రజలకు గుర్తుండి పోవాలంటే మనము జైత్రయాత్ర చేసి, ఇతర రాజ్యాలు జయించి, మన సామ్రాజ్యమును విస్తరించాలి. తరువాత అందమైన నగరాన్ని రాజధానిగా నిర్మించాలి. అందుకు తగ్గ ప్రదేశాన్ని నువ్వే వెదకి పెట్టాలి. చుట్టూ పర్వతాలు, పక్కనే నదీ అందమైన ప్రకృతి సౌందర్యము ఉండాలి. అటువంటి చోట, నగరాన్ని నిర్మిస్తే అమరావతి లాగా ఉండాలి." అంటాడు.

అనుకున్నట్టు భట్టి విక్రమాదిత్యులు తమ సైన్యంతో జైత్రయాత్రకు బయలు దేరి ఎందరో రాజులని ఓడించి, సామంతులుగా చేసుకుని, కప్పం కట్టించుకుంటారు. రాజులు భట్టి విక్రమాదిత్యులకు కప్పంగా కట్టటమే గాక, ఎన్నో విలువైన కానుకలని ఇచ్చుకొని విక్రమాదిత్యుణ్ణి చక్రవర్తిగా అంగీకరిస్తారు. అట్లా సామ్రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించి

తిరిగి కన్యాపురాన్ని చేర్తారు భట్టి విక్రమాదిత్యులు.

తర్వాత, ఒకరోజు.... ముందుగా అనుకున్న ప్రకారం, భట్టి రాజధానీ నగరం కోసం తగిన ప్రదేశాన్ని వెదకబోతాడు.

అలా వెళ్తూ... భట్టి వింధ్య పర్వత ప్రాంతాలను చేరుతాడు. చుట్టూ కొండలతో ఆవరించి ఒక పక్కగా గుణవతి నది అందమైన ఉద్యానవనంలా ఉన్న అడవి కనిపిస్తుంది. భట్టికి ఆ చోటును చూసి ఎంతో సంతోషంతో అక్కడ తమ రాజధానీ నగరాన్ని నిర్మించవచ్చని అనుకుంటాడు.

-

తిరుగు ప్రయాణంలో అతనికొక అందమైన సరోవరం, ఆ ప్రక్కనే ఒక పాత మహంకాళి ఆలయం కనిపిస్తాయి. దేవీ దర్శనం చేసుకుందామని ముందు ప్రదక్షిణం చేయబోతూండగా అక్కడ ఒక శిలాశాసనం కనిపిస్తుంది.

"నాలుగు వర్ణాల వారు ఎవ్వరైనా, సాహసియైన వాడు, ఈ ఆలయములో పుష్కరిణిలో స్నానము చేసి, ఒడ్దున ఉన్న మఱ్ఱి చెట్టు ఎక్కాలి. కొమ్మలు, సరోవరము పైకి వ్యాపించి ఉంటాయి. కొమ్మలకు ఏడు ఉట్లు కట్టబడి ఉంటాయి. నీటి మధ్యలో ఒక శూలము ఉంటుంది. సరిగా దాని పైనే ఉట్లు వ్రేలాతున్నాయి. ఏడు ఉట్లను ఒక్క వ్రేటుతో తెగవేసి, ఉట్లు నీళ్ళల్లో పడక ముందే తల్లక్రిందులుగా శూలము పైకి దూకాలి. ఎవరైతే ఈ విధంగా ప్రాణత్యాగము చేస్తారో, వారికి మహంకాళి దర్శనమిచ్చి వరములనిస్తుంది. దేవి కరుణ బొందిన సాహసి, చక్రవర్తి అయి చాలాకాలం రాజ్య పాలన చేసి,కీర్తి ప్రతిష్ఠలను పొందగలరు" అని వ్రాసి ఉంటుంది

-.

ఆ శిలాశాసనాన్ని చదవగానే తన అన్న విక్రమాదిత్యుడు అంతటి సాహస కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు అనుకున్న భట్టికెంతో ఆనందం కలిగుతుంది.

దేవాలయంలో మహంకాళికా దేవిని అర్చించి కోవెల ఎదురుగా సరోవరం ఉండటాన్ని, దాని మధ్యలో త్రిశూలం ఏ ఆధారమూ లేకుండా ఉండటం చూస్తాడు. అది అమ్మవారి మహిమగా గ్రహిస్తాడు.

-

నగరం చేరి, తనకు అన్న, రాజూ అయిన విక్రమాదిత్యుడి దగ్గరి కెళ్ళి, వినయంగా నమస్కరించాడు. భట్టిని చూడగానే విక్రమాదిత్యుడికెంతో సంతోషంతో భట్టీ! మనం ఆశించినట్లుగా ఏదైనా ప్రదేశాన్ని కనుగొన్నావా?" అని అడుగుతాడు.

భట్టి తాను చూచిన ప్రదేశాన్ని, దేవీ ఆలయాన్ని, శిలా శాసనాన్ని వివరిస్తాడు. విక్రమాదిత్యుడు ఎంతో ఆనందమూ, ఉత్సాహముతో వెంటనే అక్కడికి వెళ్లాలని నిశ్ఛయించుకుంటాడు. సుముహుర్తం చూసుకుని భట్టి విక్రమాదిత్యులిద్దరూ మారువేషాలు ధరించి వింధ్యాటవికి బయలుదేరుతారు.

-

ఇద్దరూ వింధ్య పర్వత ప్రాంతాన్ని, గుణవతీ నదీ తీరాన్నీ చేరి మహంకాళీ దేవీ పురాతన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు.

పుష్కరిణిలో స్నానం చేసి గుళ్ళోకి ప్రవేశిస్తారు.

మహంకాళి విక్రమాదిత్యుని సాహస లక్షణాలని చూసి అదృశ్య రూపంలో భట్టి విక్రమాదిత్యుల వెంట నడిచింది.

భట్టి విక్రమాదిత్యులు సరోవరం దగ్గరికి చేరుతారు. విక్రమాదిత్యుడు శిలాశాసనాన్ని మరోసారి చదివి సరస్సు మధ్యలో ఆధార రహితంగా, నీటిపై నిట్టనిలువుగా నిలిచి ఉన్న త్రిశూలాన్నీ, సరస్సు పైకి వ్యాపించి ఉన్న మర్రి కొమ్మలకు వ్రేలాడుతున్న ఏడు ఉట్లనీ పరీక్షగా చూస్తాడు. ఆధారమేమీ లేకుండా వేళ్ళాడుతున్న త్రిశూలాన్ని చూసి గుడిలోని దేవికి ఎదురుగా నున్నది గనుక, ఆ తల్లి మహిమతోనే అది అట్లా నిలుచుంది అనుకొని సాహస కార్యము చేసి తీరాలన్న పట్టుదల కలుగుతుంది.

భట్టిని వటవృక్షము మొదలులో నిలబడమని చెట్టెక్కుతాడు. ఒర నుండి కత్తి తీసి నోట్లో బెట్టుకొని, చెట్టు కొమ్మలమీద ఉన్న ఉట్ల దగ్గరికి చేరుతాడు. విక్రమాదిత్యుడికి తాను చేయబోయే సాహసకార్యం ఎంత ప్రమాదకరమైనదో తెలుసు.

మహంకాళి దేవిపై భక్తి నమ్మకంతోనూ నిండి ఏడు ఉట్లని పరిశీలిస్తాడు. అవి ఒకే కొమ్మకు వరుసగా లేవు; ఒక్క వేటులో తెగ వెయ్యటానికి. వర్తులాకారంలో ఉన్నాయి.

విక్రమాదిత్యుడు "భట్టి! ఈ ఏడు ఉట్లునూ ఒక తాడుకి కట్టి లేవు. ఒక వరుసలోనూ లేవు. వలయాకృతిలో అమర్చబడ్డాయి. ఒక్క వేటుతో వీటిని తెగ వేయిటం ఎట్లా? ఆలోచించి ఉపాయం చెప్పు!"అంటాడు. అప్పటికే భట్టి దానిని పరిశీలనగా చూస్తాడు. వాటిని ఎట్లా కొట్టాలో అర్దమవుతుంది.

-

ఆ చెట్టును దానికి కట్టి ఉన్న ఏడు ఉట్లను బాగా గమనిస్తాడు భట్టి. ఒక వరుసలో కాకుండా గుండ్రంగా ఉన్న ఉట్లను ఒక్క వేటితో పడవేయడం ఎట్లాగా అని పరిశీలనగా చూసి అర్ధం చేసుకుంటాడు.

"అన్నా! నీ కుడిపాదము ఒక ఉట్టి మీద ఉంచి, దాని ప్రక్కనున్న ఉట్టిని ఎడమ చేత్తో పట్టుకో. ఊయల ఊగుతున్నట్లుగా, కుడివైపుకు ఊపు తెచ్చుకొన్నావంటే అవి గుండ్రముగా ఒకదాని కొకటి చుట్టుకొని పురి ఎక్కుతాయి. అప్పుడు ఏడు ఉట్ల తాళ్ళు పెనవేసుకుపోయి, ఒకటే తాడులా బలంగా, గట్టిగా అయిపోతాయి. అప్పుడు కత్తితో, ఒక్కవేటుతో వాటిని నరికి తెగిన ఉట్లు నీటిని చేరక ముందే, తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకు. ఆపైన ఆ తల్లి దయ" అని సలహా ఇస్తాడు

-

భట్టి. విక్రమాదిత్యుడు మరోమారు ఉట్లను పరిశీలనగా చూసి ఒక ఉట్టి మీద కుడిపాదము పెట్టి దాని ప్రక్కన వున్న మరో ఉట్టిని ఎడమ చేత్తో పట్టుకుని శరీరాన్ని కుడివైపుకు వంచి, ఒక్క ఉదుటున ఊపు తెచ్చుకుంటాడు. రంగుల రాట్నము తిరిగినట్లుగా ఉట్లు తిరిగి, ఏడు తాళ్ళూ పెన వేసుకు పోయి ఒక్క తాడులాగా అయిపోతాయి.

విక్రమాదిత్యుడు ఆ తాడుని కత్తితో ఒక్క వేటుతో నరికేస్తాడు. మరుక్షణమే తాను తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకుతాడు. ఉట్లు నీటిని చేరే లోపుగా అతని తల త్రిశూలాన్ని తాకుతుంది. భట్టి ఇదంతా రెప్పవాల్చకుండా, ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన మరు క్షణాన, భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లవుతుంది. ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకుంటాడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే... అతడి ముందు త్రిశూలమూ లేదు, విక్రమాదిత్యుడి దేహమూ లేదు.

మహంకాళీ మాత విక్రమాదిత్యుడిని కాపాడి ఉంటుందని ఊహించి వెంటనే ఆలయంలోకి పరిగెడ్తాడు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందు, విక్రమాదిత్యుడి శరీరం స్పృహలో లేడు. భట్టి దీనిని ముందే ఊహించాడు.

-

మహంకాళి విగ్రహానికి చేతులు జోడించి నమస్కరిస్తూ.... భట్టి, "మాతా! మమ్ము రక్షించు! విక్రమాదిత్యుని దీవించు" అని ప్రార్దిస్తాడు. మహంకాళీ విక్రమాదిత్యుడి సాహసం భట్టి మృదు మధుర భాషణ పట్లా ఎంతో ప్రీతి కలిగి, ఆ తల్లి కరుణతో, విక్రమాదిత్యుడు స్పృహలోకి వస్తాడు.

దేవి ప్రత్యక్షమౌతుంది. భట్టి విక్రమాదిత్యుల ఆనందానికి భక్తి పారవశ్యంతో, ఆ తల్లికి నమస్కరించి, స్త్రోత్రాలు చేస్తారు. ఆ తల్లి "మీకేమీ వరాలు కావాలో కోరుకోండి," అంటుంది. విక్రమాదిత్యుడు చేతులు జోడించి,

-

"తల్లీ! ఈ ప్రదేశంలో ఒక అందమైన, నగరాన్ని నిర్మించాలని మా కోరిక ఈ ఆలయానికి దగ్గరలో ఎటు చూసినా 10 ఆమడలుండే లాగా చక్కని, భారీ నగరాన్ని నిర్మించేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు! ఆ నగరాన్ని నిర్మించటానికి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించేందుకు, మాకు ఐశ్వర్యం కావాలి. వీటన్నిటినీ సాధించేందుకు నీ కరుణ కావాలి" అంటాడు

-

కాళీ మాత "భక్తులారా! మీరు కోరిన ప్రతీ వరాన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయమునకు ఈశాన్య దిక్కున తవ్వినట్లయితే... నవ రత్నాలూ, బంగారమూ ఉన్న నిధి నిక్షేపాలు కనిపిస్తాయి. ఇక్కడే నగర నిర్మాణము చేసి, సామ్రాజ్య స్థాపన చేయ గలరు. ఉజ్జయిని అను పేరున అది మిక్కిలి ప్రసిద్ది చెందగలదు" అని వరమిచ్చి, వారిరువురినీ దీవించి అంతర్దాన మైపోతుంది.

భట్టి విక్రమాదిత్యులు సైన్యాన్ని, కూలీలని నియోగించి, గుడికి ఈశాన్య దిక్కున తవ్విస్తారు. నవరత్నాలతో నిండిన, బంగారు గని కనుపిస్తాయి. ఆ సంపదని ఉపయోగించి, వాళ్ళు ఉజ్జయినీ నగరాన్నినిర్మిస్తారు.

తమ పూర్వ రాజధాని కన్యాపురానికి, తమ అనుచరుణ్ణి సామంత రాజుగా నియమించి, ఒక శుభముహుర్తాన, ఉజ్జయినీ నగర ప్రవేశం చేస్తారు. 

-

భట్టి విక్రమాదిత్యులు మరోసారి తమ సామ్రాజ్యాన్ని పర్యటించి, పటిష్టపరుచు కుంటారు

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!