శ్రీకృష్ణ రాయబారము - _

శ్రీకృష్ణ రాయబారము -

_

"అలుగుటయే యెఱుంగని మహామహితాత్ము డజాతశత్రుడే

యలిగిననాడు సాగరములన్నియు నేకము గాకపోవు, క

ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజరాజ! నా

పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకులఁ గావు మెల్లరన్."!

(పాండవోద్యోగ నాటకము - తిరుపతివేంకటకవులు)

.

అర్థములు:-

అలుగుట = ఆగ్రహించుట;

అజాతశత్రుడు = శత్రువులు లేనివాడు, ధర్మరాజు; 

అని = యుద్ధము; 

విపన్నులు = ఆపన్నులు, ఆపదకు లోనైనవారు;

కావుము = కాపాడుము.

.

భావము: -

కోపమును దరిచేరనీయక, సదా శాంతస్వభావులై సౌమ్యులుగా కనిపించేవారు లోకములో చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారికి ఆగ్రహం కలిగితే, అది ప్రళయభయంకరమే అవుతుంది...... 

మహాభారతములో ధర్మజుని పాత్ర అటువంటిది. ఆయనను వైరివర్గములోనివారు సైతంగౌరవిస్తారు.

అందుకే"అజాతశత్రుడు" అనే పేరు వచ్చినది.

దాయాదులైన తమ వద్దకు సంధిసందేశమును పంపిన ధర్మరాజు శక్తిసామర్థ్యములను శంకించిన దుర్యోధనుడు "పరాక్రమవంతులు పగవారి సముఖానికి రాయబారిని పంపిస్తారా?" అని అధిక్షేపిస్తాడు.

అందుకు జవాబుగా శ్రీకృష్ణుడు పై పద్యములో అజాతశత్రుడు అలిగితే కలిగే అనర్థమును విస్తరించి చెప్పాడు.

-

"సుయోధనా! ఆ ధర్మాత్ముడు కోపిస్తే, సప్తసముద్రములూ 

ఏకమై జలప్రళయం సంబవిస్తుంది సుమా! 

కర్ణుని అండ చూసుకుని నీవు అహంకరిస్తున్నావు

. ఇలాంటి కర్ణులు పదివేవురైనా కదనరంగములో

కన్నుమూయక తప్పదు. జాగ్రత్త!" అని హెచ్చరించాడు. రాధేయుని పరాక్రమమును కించపరచి మాట్లాడడం

మాధవుని భేదోపాయం; దుర్యోధనుని అంతరంగములో బెదురు పుట్టించడం.

లోకులను "విపన్నులు" అనడంలో, రారాజు స్వార్థమునకు ఎంతమంది అమాయకప్రజలు మారణహోమం కాబోతున్నారో ఎత్తిచూపడం... ఇక, "నా పలుకులు విశ్వసింపుము" అని చెప్పుటలో, కురుపాండవపక్షములలో తనకు గల గౌరవమును, తన పరమాత్మతత్త్వమును పరోక్షంగా ప్రస్తావించడం!

-

ధూర్తుడికి భయంచెప్పి, భక్తిని నేర్పే ప్రబోధశిల్పం పై పద్యములో ప్రతిధ్వనిస్తున్నది

. "చెల్లియొ చెల్లకో" అనే మొదటిపద్యం ఎంత మెత్తగా ఉన్నదో, ఈనాటి ఈ రెండవపద్యం అంత గట్టిగా ఉన్నది.

Comments

Post a Comment

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!