Saturday, August 19, 2017

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.!

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.!


(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి )

.

కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు?

కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు?

కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,

కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.

* * *

లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?

కొడుకులను గంటేను కోటి లాభమ్ము.

గోరంతదీపమ్ము కొండలకు వెలుగు,

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.

మాడంతదీపమ్ము మేడలకు వెలుగు,

మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు.

* * *

Friday, August 18, 2017

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

.

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.

రావు: వచ్చాడా తీసుకొచ్చావా?

సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?

(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)

రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?

సెగట్రీ: యెస్సర్

రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?

సెగట్రీ: అద్భుతం సార్!

రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !

అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.

.

ఈస్ట్ కోస్ట్ మాష్టారు తనకిష్టమైన

అతికష్టమైన బారిష్టర్ టెస్ట్

ఫస్ట్ లో పాస్ అయినందుకు

తన పక్కింటివాడిని ఫీస్ట్ కని

పిలిచి చికెన్ రోస్ట్ టేస్ట్ ను

బెస్ట్ బెస్ట్ అనుకుంటూ

సుస్టుగా లాగించి బ్రేవ మన్నాట్ట" అంటూ

ప్రాసకోసం అతి ప్రయాసపడి రాసేడు

వేటగాడులోని ఈ సంభాషణ మన జంధ్యాల!

సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !

సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !


.

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం .. అనే లోకోక్తి

పై లోకోక్తి ఎలా వచ్చింది?

.

మాచిన్న తనంలో కొందరు బ్రాహ్మణులు నిత్యజీవితానికి ఆరోజుకు అవసరమైన అవసరమైన ఆహారాన్ని ధాన్యం, లేదా బియ్యమును యాచనతో సంపాదించుకునేవారు.

ఇత్తడి చెంబు శుభ్రంగా తోముకొని, సీతారామాభ్యామ్ నమః అని చెప్పుకుంటూ ఆరోజు పంచాంగ శ్రవణం చేస్తూ పిడికెడు బియ్యం తో సంతుష్టిచెంది వెళ్ళేవారు.

బిక్షం వేయగానే ఆశీర్వచన మంత్రం చదివే వారు. దీనిని యాయవార వృత్తి అనేవారు. ఇది సంస్కృత పదం.

సంస్కృత నిఘంటువు - ప్రత్యహం ధాన్య యాచనా - అని అర్థం ఇస్తుంది. 

ముష్టి అంటే పిడికిలి, యాచన కాదు సవ్య ముష్టి ప్రహారంతో లంకాపురిని జయిస్తాడు . 

ఒక విద్యావిహీనుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునికి చిన్నప్పుడు తండ్రి ఉరుములతో కూడీన వర్షం వచ్చినప్పుడు ఇంద్రుని వజ్రం (పిడుగు) పాలి పడకుండా అందరికీ తెలిసిన ఈ శ్లోకం చెప్పాడు

.

“అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః 

భీభత్స విజయోర్జిష్ణుః సవ్యసాచీ ధనంజయః” .||

.

తరువాత కొన్ని దినాలకే తండ్రిపోవడం, దరిద్రస్థితిలో చదువులేక పోవడం జరిగింది. యాయవారంతో పొట్ట పోసుకుంటూ యాచనకు వెళ్ళీ తనకు తెలిసిన పిడుగు మంత్రం చెప్పడం మొదలు పెట్టాడు. పంచాంగం చదవడం, ఆశీర్వచనం చేయడం తెలియదు తెలిసినది ఒకే మంత్రం - పిడుక్కీ బియ్యానికి అదే!

మధ్యాహ్నం మాణిక్యం!

మధ్యాహ్నం మాణిక్యం!

(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ కలబోసి రాసిన కథ )

.

మా తాత గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముళ్ళూ, మేనల్లుళ్ళూ, బావ మరిదీ, మొత్తం పిల్లా పెద్దా కలిసి ఎప్పుడు చూసినా పెళ్ళి ఇల్లులా ఉండేది. ఎప్పుడూ ఏవో నోములూ పేరంటాలూ పురుళ్ళూ తద్దినాలూ సమారాధనలూ చాలా సందడిగా ఉండేది. పక్కన అతిథి కూచుని భోంచేస్తేనే మా తాతగారు తినే వారు. ఆస్థి ఉండి అట్టహాసముండి సరదాలూ సంబరాలూ వేడుకలతో నిండి, బొత్తిగా ముందు చూపూ జాగ్రత్తా లేని ఆ కాలపు పెద్ద కుటుంబం మా తాతగారిది.

పెద్ద మండువా ఇల్లూ నాలుగు వేపులా పెద్ద పెద్ద వసారాలూ, పెద్ద భోజనాల సావిడీ, నాలుగు పెద్ద పడక గదులూ, కొన్ని చిన్న గదులూ, పాల మజ్జిగలకి ప్రత్యేకం గదీ, వంటకి వేరే, పిండి వంటకి వేరే గదులూ ఉండేవి. మా బామ్మ కూర్చుని పిండి వంటలు చేస్తూ ఉంటే మేవంతా చుట్టూ కూర్చుని ఖాళీ చేసేవాళ్ళం.

“చేసినంతసేపు పట్టదర్రా, ఖాళీ అయిపోవడానికి” అనేదావిడ.

మా నాన్న కన్నతల్లి చంటితనంలోనే పోతే తాతగారి రెండో భార్య దగ్గిరే ఆయన పెరిగారు. “అమ్మా” అనే పిలిచే వారు. చాలా కాలం దాకా ఆవిడే మా అసలు బామ్మని అనుకునే వాళ్ళం.

దేవుడి గుళ్ళో ఏ వేడుక జరిగినా మా ఇంటికే పెద్ద పీటగా ఉండేది. దేవుడి కళ్యాణానికి బామ్మా తాత గారూ, తరవాత కాలంలో అమ్మా నాన్నా, పీటలమీద కూర్చునే వారు. ఆ అయిదు రోజులూ, ఏ రోజుకారోజు కొత్త బట్టలు మడత నలగకుండా కట్టుకునే వారు.

మా అమ్మకి సినీమాలంటే చాలా ఇష్టం. నాన్న మమ్మల్నందరినీ కాకినాడ తీసికెళ్ళి అక్కడ ఉన్న చుట్టాలతో సహా సినీమాకి తీసుకెళ్ళేవారు. అమ్మ స్థిమితంగా సినీమా చూసేందుకు వీలుగా పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళీ ఆడిస్తూ ఏవో కొనిపెడుతూ, కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.

కథలంటే ఆయనకి మహా సరదా. ఆయన చెప్పే కథలు ఇంటిల్లిపాదీ ఆసక్తిగా వినేవారు.

దీపావళొస్తే మా ఇంట్లో సంబరం చూడవలిసిందే. సూరేకారం, పటాసూ పేక ముక్కలూ, పాత పోస్టు కార్డులూ పెట్టి మతాబాలు, చిచ్చుబుడ్లు, టపాకాయలూ చెయ్యడంలో నాన్న నేర్పు గురించి ఊరంతా చెప్పుకునే వారు. గది నిండేలా బాణసంచా పేర్చి, బాగా ఆరనిచ్చి, దీపావళికి ముందూ తరవాతా వారం రోజులు ఊరందరికీ పండగలా నడిపించే వారు. ఊరి పిల్లలందరికీ ఆయన పెద్దన్నయ్య.

అంత మందిలోనూ మాకేలోటూ రాకుండా చూస్తూనే, అందరితో కలిసి మెలిసి ఉండేలా, అందరితో మంచీ చెడ్డా పంచుకునేలా అలవాటు చేశారు.

ఆ రోజుల్లో గ్రామఫోను తప్పనిసరి సౌకర్యంగా ఇంట్లో ఉండేది. ఎవరికి తోచిన రికార్డు వాళ్ళు పెట్టుకుని వినే వాళ్ళు. నాన్న సైగల్‌ పాడిన “దునియా రంగ్‌ రంగేళీ బాబా, దునియా రంగ్‌ రంగేళీ” చాలా మాట్లు వింటూ ఉండేవారు. ఆ మాటలకి పూర్తి అర్థం ఆయనకి తెలుసునోలేదోగానీ, నాకు అర్థం కాకుండానే ఆ పాట వింటూంటే రంగు రంగుల దారాల కలనేత కళ్ళకి కట్టినట్లుండేది. ఎందుకో, నాన్నా ఆ పాటా ఒకటే అనిపించేది.

ఇన్నేళ్ళకి మా అబ్బాయి CD player లో ఆ పాట మళ్ళీ విన్నాను. ఎందుకో కలిమిలో నాన్న, కష్టాల్లో నాన్న, కలగలుపుగా ఒకే పిక్చరు మనసులో మెదిలింది.

“పొద్దున్న వేళలా పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ, మధ్యాహ్న వేళల పొడిచేటి భానుడూ మంకెన్న పూఛాయ”.

“ఏవిటీ ఎప్పుడూ లేనిది కూని రాగాలొస్తున్నాయి, పూర్తిగా పాడరాదా” అన్నారు మా వారు.

“ఆ, నా మొహం నాకొకటి ఒస్తే కదా! నా చిన్నప్పుడు మా దొడ్డ పాడే పాటలు గుర్తొచ్చాయి, ఈ ఆకుల వైభవం చూస్తుంటే. మా వూళ్ళో నా వానా కాలం చదువుకి వొంటి పూటి శలవులప్పుడు బడి నించి ఇంటికి వస్తూంటే దారిలో రెండు పక్కలా దుబ్బులమీద తీగలకి పూసిన ఎర్రని మధ్యాహ్నం మాణిక్యాలు, వాటి తొడిమలు తుంపి నోటిలో పెట్టుకుంటే కొద్దిగా మకరందం రుచీ, తీరీ తీరని దాహం, ఏవేవో జ్ఞాపకాలొస్తున్నాయి” అన్నాను.

“మధ్యాహ్నం మాణిక్యాలేమిటీ, నేనెప్పుడూ చూడలేదూ, వినలేదూ?”

“ఏమో, మా దొడ్డా మంకెన్న పువ్వుల్నే మధ్యాహ్నం మాణిక్యాలంటారని చెప్పేది”

ఉపవాసము!

.

ఉపవాసము!

.

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.

భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.

.

హిందూమతంలో ఉపవాసదీక్ష!

శివరాత్రి

నాగులచవితి

తొలి ఏకాదశి

కార్తీక సోమవారం

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!


.శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!

.

అవాకులన్నీ, చవాకులన్నీ

మహారచనలై మహిలో నిండగ,

ఎగబడి చదివే పాఠకులుండగ

విరామ మెరుగక పరిశ్రమిస్తూ,

అహోరాత్రులూ అవే రచిస్తూ

ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు, 

వారికి జరిపే సమ్ మానాలకు

బిరుదల మాలకు, దుశ్శాలువలకు,

కరతాళలకు ఖరీదు లేదేయ్!

.

అలాగే-

.

నేను సైతం తెల్లజుట్టుకు

నల్లరంగును కొనుక్కొచ్చాను

నేను సైతం నల్లరంగును

తెల్లజుట్టుకు రాసిదువ్వాను

యింతచేసి, యింత క్రితమే

తిరుపతయ్యకు జుట్టునిచ్చాను.

.

జొన్నవిత్తుల రాసిన తిట్లదండకం కూడా సినిమాల్లో కొత్త ప్రయోగమే.

ఓరేయ్ త్రాపి, మహాపాపి, కురూపి, 

నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీపీ

ముండమోపి, జిరాఫీ, నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపి

అంకఛండాలుడా, బంకబధిరాంధుడా,

పరమపాపిష్ట, నికృష్ట దుష్టాత్ముడా

నీ నీచ రూపంబు చూడంగ పాపంబు,

నీకంఠనాళంబు కక్కోసు గొట్టంబు 

ఇలా సాగే ఈ పాటలో తెలుగు, సంస్కృత, ఇంగ్లీష్ పదాలు కనిపిస్తాయి.

Thursday, August 17, 2017

నమో‘ ‘చంద్రా‘! -సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా! – ఏలూరిపాటి

నమో‘ ‘చంద్రా‘! 

-సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా!

– ఏలూరిపాటి

విద్యార్థులు లేరని కళాశాల మూసివేయడం, ముసలి తల్లితండ్రులను గోదావరి పుష్కరాలలో వదిలి వేయడం, పాలు లేవని గోవును కబేళాకు పంపడం సమానం కాదా?

సంస్కృత కళాశాలలను మూసివేయాలని ముఖ్యమంత్రి అయిన మొదటి సారి

ఎన్ టి రామారావు కు కొందరు నూరిపోశారు. ఆయనకు చెప్పిన కారణాలు ఒకే ఒక్కటి. సంస్కృతం చదవడానికి పిల్లలు ఎవరూ రావడంలేదు. కనుక వీటిని ప్రభుత్వం వదిలించుకోవాలని సిఫార్సు చేశారు.

.అయితే తెలుగు, సంస్కృత భాషలపై మక్కువ ఉన్న రామారావు వీటిని అధ్యయనం చేయమని ఒక అధికారిని నియమించారు. 

అంతేకానీ ఆయన సంస్కృత కళాశాలలను తీసివేయలేదు.

కానీ, ఆయన చేసిన అద్యయనం వల్ల చాలా ఆసక్తికర విషయాలు, ప్రతిపాదనలూ ముందుకు వచ్చాయి. వీటిని అమలు చేయాలని నాటి ముఖ్యమంత్రి ప్రయత్నించినా, రాజకీయ కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. అంతేకాదు నేటికీ అవి అమలు కాలేదు. ఆ వివరాలు ఇవి.

1) చదవడానికి పిల్లలు లేరు అనడానికి కారణం చదివితే ఉద్యోగాలు రాకపోవడమే.

2) విద్యాప్రవీణా, భాషా ప్రవీణా పట్టాలు

3) నిధుల కొరత:

అస్తుబిస్తు మంటూ ఉన్న సంస్కృత కళాశాలలకు నిర్వహణ నిధుల కొరత ఉంది. 

చాలా కళాశాలలకు మౌలికమైన సౌకర్యాలు కూడాలేవు. 

కేవలం కెవికె సంస్కృత కళాశాల వంటి వాటికే మౌలికమైన వసతులు ఉన్నాయి.

.

ప్రభుత్వం మైనార్టీ సంస్థలకు అంగలార్చుకుంటూ వేల కోట్లాది రూపాయలు నిధులూ గ్రాంటులూ రూపంలో, విందు భోజనాలకు కోట్లాది రూపాయలూ వెదచల్లుతోంది కానీ, సంస్కృత పాఠశాలల్లో విద్యార్థులకు పిడికెడు మెతుకులు విదిల్చే కరుణ లేదు.

.

బహుశా సెక్యులరిజం అనే తద్దినం అడ్డం వచ్చి ఉంటుంది.

దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాళ్లే నిధుల కోసం ఊరిలో చందాలకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి కొన్ని యాజమాన్యాలు ఉపాధ్యాయుల గోళ్లూడగొట్టి వారి జీతాల నుంచీ నిర్వహణ నిధులు సేకరించేవారు. కుటుంబాలను రోడ్డు మీద పడేయలేక మౌనంగా ఉపాధ్యాయులు తమ జీతాలు సమర్పించుకుని గంజితాగి బతుకులీడుస్తూ వచ్చారు.

.

ఇప్పటి వరకూ మీకు చెప్పింది అతిముఖ్యమైన సమస్యలు మాత్రమే.

.

కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చినందున ఈ కళాశాలలకు ఒరిగింది ఏమిటి?

.

ఈ సంస్కృత కళాశాలను కబేళాకు పంపుతున్నది ఎవరు?

.

అటు కేంద్రమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా కొడికడుతున్న కళాశాల దీపాన్ని కాపాడతాయా, తల దగ్గర దీపాన్ని వెలిగిస్తాయా?

.

బ్రాహ్మణోత్తములు డాక్టర్ కొలచల వెంకట కృష్ణమూర్తిగారు సంస్కృత భాషాభివృద్ధికి చేసిన దానాలు వృథా కావల్సిందేనా?

.

మరికొద్ది రోజుల్లో భూస్థాపితం కానున్న కళాశాలకు పునరుజ్జీవం కల్పించగలమా?

.

ఏం చేయాలో మీరే తేల్చుకోండి.

.

-ఏలూరిపాటి

/