Monday, July 31, 2017

ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు !

ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు !


.

రాయలనాట విజయ నగరంలో పెద్దన తరువాత స్థానం తిమ్మనదే! ఆయన అరణపుకవి. చిన్నాదేవివెంట విజయనగరానికి వచ్చాడట. తెనాలి వారు భువన విజయంలో వారిని పరిచయం చేసికొన్న సందర్భంలో చెప్పిన పద్యం తిమ్మన గారి ప్రసిధ్ధికి నిదర్శనం!

.

కం: మాకొలది జానపదులకు 

నీకవితా ఠీవి యబ్బునే? కూపనట ద్భే 

కములకు నాకధునీ 

శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా!

.

తిమ్మనగారి కవిత్వం చల్లని కవిత్వమట!యెంతచల్లనిది? ఆకాశగంగాప్రవాహమందలి నీటితుంపురలను బోలిన చల్లదనమది. సురగంగ చల్లదనం కిందికురికి తిమ్మనగారి కవితలో ప్రవేసించినదట! పొగడ్తకు ఆకాశమే హద్దుగదా!

.

తిమ్మనగారు పారిజాతాపహరెణ మనే ప్రబంధం వ్రాశారు. రాయలవారికి- చిన్నాదేవికి నడుమ నేర్పడిన వియోగమును తప్పించుటకే ఈప్రంధమును తిమ్మన రచించెనని ప్రవాదము. యేదియేమైనను యిది రసవత్తరమైన ప్రబంధమే! 

.

శ్రీకృష్ణుని యంతవాని శిరమును సత్యచే తన్నించి , ప్రణంలో యిది తప్పుకాదు పొమ్మన్నాడు.

పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చినది విని యలిగిన సత్యాదేవి మానసిక, శారీరక ,పరిస్థితులను వర్ణించుచు తిమ్మన గారు ఒకపద్యం చెప్పారు. కవితా కళకు కాణాచియైన ఆపద్యం మన మిప్పుడు తెలిసికొందాం!

.

చ: తుడువదు కన్నులన్వెడలు తోయకణంబులు, కొప్పుఁజక్కగా 

ముడువదు, నెచ్చెలింగదిసి ముచ్చటకుంజన, దన్నమేనియున్ 

గుడువదు ు , నీరముంగొనదు, కూరిమిఁ గీరముఁ జేరి పద్యమున్ 

నుడువదు, వల్లకీగుణవినోదము సేయదు, డాయదన్యులన్;

.

సవతిమీద మత్సరం కోపానికి కారణమైనది. మనస్సు ఉద్వేలమైపోయింది. యేడుపు పొంగిపొరలుతోంది. కన్నులవెంటనీరు కారిపోతోంది. అయినా కన్నీరు తుడవటంలేదట. జుట్టుముడి ఊడింది కేశపాశము విశీర్ణమైనది. దానిని సవరించటం లేదట. ప్రియ సఖులఁజేరి మాటా మంతీ యాడటంలేదట. భోజనంమాటసరేసరి, మెతుకుగూడా ముట్టుటలేదట. చివరకు నీరుగూడా త్రాగటంలేదట. పంజరంలో చిలుకలను గూడా పలకరించటం లేదట. వీణియ తీగెలను మీటుట లేదట. యితరులెవ్వరు వచ్చినా వారిని సమీపించటం లేదట. ఇదీ పాపం సత్య మానసిక స్థితి.

.

మనస్సు బాగోక పోతే రోజూ చేసేపనులుగూడా చెయ్యం నైరాస్యంగా ఉంటాంకదా! అదిగో ఆనైరాస్యం ఆమెచేతలలో కనిపించేలా చేశాడుకవిగారు. నైరాస్యం యెందుకంటారా? కాదామరి. అసలే కృష్ణుని కాపురం "సవతుల కుంపటి" యెప్పుడెవరివల్ల యేబాధకల్గుతుందో చెప్పరానిది. యెవరాతనిని తమ చెంగుకు ముడివేసుకుంటారో యెరుగలేము. అనుకోని యాపద వచ్చిపడింది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం రుక్మిణి తలకెక్కింది. యెంతప్రమాదం! కృష్ణుడింక తన చేజారిపోతాడేమో నని బాధ.అలాగే జరిగితే యిక మిగిలే దేమిటి? నలుగురి నవ్వులు తలవంపులు. అయిపోయింది సత్యావైభవం: అందుకే యీనైరాస్యం. ఆస్థితిని తిమ్మన యీపద్యంలో అద్భుతంగా చిత్రించాడు.

.

తుడువదు, ముడువదు, కుడువదు, నుడువదు, అను నాల్గు క్రియాపదాలను, ఛేకానుప్రాసంగా ప్రయోగించి , తనయసమానమైన పాత్ర చిత్రణా పటిమను వ్యక్త పరచాడు. కావ్యకళాపరిశీలనా దృష్టితో పరిశీలిస్తే యీపద్యం యెంత అద్భుత మైనదో బోధపడుతుంది. ఇది మన పరిశీలనకు పరీెక్ష!

విష్ణువు ఆగమనము! (గజేంద్ర మోక్షం - పోతానా మాత్యుడు)

విష్ణువు ఆగమనము!

(గజేంద్ర మోక్షం - పోతానా మాత్యుడు)

-ఆ.

"విశ్వమయత లేమి వినియు నూరక యుండి

రంబుజాసనాదు లడ్డపడక

విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు

భక్తియుతున కడ్డపడఁ దలంచె!

భావము:

ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.

.

-మ.

"అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై !

భావము:

ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.

.

-మ.

"సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై !

భావము:

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

.

-వచనం 

హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపడుట అనే బరువైన బాధ్యత తీసుకొని అటుపిమ్మట ఆయుధాలను అవధరించి ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో.

-మ.

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె

న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ

క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

భావము:

అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపరంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.

.

-వ.

అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తియ్యటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంది.

.

-మ.

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్

వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్? 

దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం

గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

భావము:

“ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో? దుర్మార్గులు ఐన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలిచారేమో? దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేసారేమో? విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటు దుర్మామార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో?” అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

-వ.

.

అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

-క.

అడిగెద నని కడువడిఁ జను

నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్

వెడవెడ సిడిముడి తడఁబడ

నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్

భావము:

అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. 

అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –

.

ఈ పద్యంచూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్పురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం.

Sunday, July 30, 2017

చదువుల తల్లి సరస్వతీ !

శుభోదయం!

.

పోతన భాగవత ప్రారంభంలో సరస్వతీ మాత దయాబిక్ష కోరుతూ కొన్ని పద్యాలు అమోఘంగా రచించాడు . 

అందులో ” తల్లీ ,నిన్ను దలంచి ” , “క్షోణితలంబునన్ ” , శారద నీరదేందు ” , కాటుక కంటి నీరు ” లాంటి పద్యాలు విద్యార్థులకు ప్రేమతో నేర్పించేవారు గురువులు — మొన్న మొన్నటి వరకూ . 

ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయి . మాతృమూర్తి కరుణించినవారి రచనలు కలకాలం నిలిచాయి . పోతనే అందుకు ఉదాహరణ . చదువులు నిజంగా వంటి కబ్బాలంటే , చదువుల తల్లి కరుణ కావాలి . బిడ్డలందరికీ ఈ పద్యాలు నేర్పించి , వల్లె వేయించి సరస్వతీ మాత దయకు పాత్రులను చేయడం మన ధర్మం.

.

ఈ క్రింది పద్య సరస్వతీ మాత అనుగ్రహం కోరి పోతన రచించిన పద్యం . 

రమ్యం గా ఉంటుంది మరి చదవండి -పిల్లలతో చదివించండి .

పుణ్యమూ , పురుషార్థమూ , చదువుల తల్లి అనుగ్రహమూ లభిస్తాయి .

.

పుట్టం బుట్ట శరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ

దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్

పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ!

.

తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను పుట్టలేదు .

వ్యాస భగవానుని లాగా పడవలో పుట్టలేదు .

కవికులతిలకుడై కాళిని కొల్చిన కాళిదాసునూ కాదు . 

అయినా భాగవతాన్ని తెలుగు భాషలో రచించడానికి పూనుకున్నాను . అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను .

నాకు మార్గాన్ని నిర్దేశించి , చేయూత నిచ్చి నడిపించవమ్మా .

నీవే తప్ప ఇతఃపరంబెరుగను తల్లీ . అనుగ్రహించవమ్మా .

నిన్నే నమ్ముకున్నానమ్మా ! చదువుల తల్లి సరస్వతీ !

నను కరుణించవమ్మా ! బ్రాహ్మీ ! నీవు దయా సముద్రురాలవు కదమ్మా .

Saturday, July 29, 2017

సిట్ ఇంటర్వ్యూ (రవితేజ) :

సిట్ ఇంటర్వ్యూ (రవితేజ) :

(ఒక గెస్ -నెట్ నుండి)

.

డ్రగ్స్ వాడితే ఏమొస్తుంది?

కిక్

-

పదే పదే ఎందుకు వాడతారు?

కిక్ (2)

డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు?

దుబాయి శీను, డాన్ శీను

ఎవరితోకలిసి డ్రగ్స్ తీసుకునేవారు?

వెంకీ,చంటి, భద్ర,

భగీరధ,కృష్ణ,ఆంజనేయులు,వీరా

మీరు డ్రగ్స్ తో పాటు ఏమి తీసుకుంటారు?

మిరపకాయ్

మీకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు?

ఇడియట్

మీరు డ్రగ్స్ తీసుకుంటారని తెల్సి మీ వాళ్లు ఎలా ఫీలయ్యారు?

షాక్

ఈ ఫోటోలో ఉన్నవాడు ఎవడు?

విక్రమార్కుడు

ఇతను ఏం చేస్తుంటాడు?

దొంగోడు

మీ తమ్ముళ్లను చెడగొట్టింది?

వీడే

మీరు డ్రగ్స్ బదులు ఏమి ఇచ్చేవారు రూపాయలా డాలర్లా?

నా ఆటోగ్రాఫ్

పూరి, చార్మి లకు అలవాటు ఉందా?

అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ?

బలాదూర్ నగర్లో

అక్కడ ఇంకా ఎవరుండేవారు?

అమ్మ.నాన్న ఓ తమిళమ్మాయి.

మరి ఈ సెల్ఫీలో వాళ్లెవరు?

ఒకరాజు ఒకరాణి

మీరు ఇంకేమన్నా చెప్పదలచారా?

నేనింతే

ఇంటికెళ్లాక ఏంచేస్తారు?

శంభో శివశంభో ...

😛😛

Wednesday, July 26, 2017

ఋతుసంహారం -కాళిదాసు!

ఋతుసంహారం -కాళిదాసు!

.

చెట్లు పువ్వుల్తోనూ, సరస్సుల్లో నీళ్ళు తామరపువ్వుల్తోనూ నిండి ఉన్నాయి. స్త్రీలు కోర్కెలతో నిండి ఉన్నారు. గాలిలో సుగంధం నిండి ఉంది. సుఖవంతమైన సాయంత్రాలూ, రమ్యమైన పగళ్ళూ.. ఓ ప్రియా! వసంతం చాలా అందంగా ఉంది.

.

.

మదవతుల కళ్ళల్లో చంచలతగా, బుగ్గల్లో తెల్లదనంగా, పాలిండ్లలో గట్టితనంగా, నడుములో సన్నదనంగా, పిరుదుల్లో పెరుగుదలగా .. ఇలా స్త్రీలలో రకరకాల రూపాల్లో మన్మధుడు వచ్చికూర్చున్నాడు

ఇలాంటి పరిసరాల్లో కాళిదాసు వెన్నెల్లో మేడలు కట్టాడు, మామిడిచెట్లు వేసాడు, దిగుడుబావి తవ్వించాడు, తన పరివారాన్ని తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి అలంకరణలు చేసాడు. పుష్కలంగా మదిర సరఫరా చేసాడు.

.

(ఇంటి సందుల్లో) కొద్దిగా మిగిలిపోయిన మంచువల్ల ఇళ్ళల్లో ఇంకా చలిగా ఉంది. అందుకే బయట దిగుడు బావుల్లోకి దిగారు కొందరు. జలక్రీడలాడుతున్నారు. ఆడవాళ్ళ తలనిండా ఘుమఘుమలాడే సంపెంగపూలూ, స్తనాలమీద మనోహరమైన పూలహారాలు, నడుముకు మణుల్తోచేసిన వడ్డాణాలు ..అందరూ మొలలోతునీళ్ళల్లో ఉన్నారు.. అందువల్ల ఆతర్వాత ఇంకేమీ కనిపించటల్లేదు కాళిదాసుకి. నీళ్ళమీద తేల్తూ మామిడి పువ్వులు, గట్టుమీద విరబూసిన చెట్లు మాత్రమే కనుపిస్తున్నాయి..

.

నిద్రలేకపోవడంవల్ల వాళ్ళ ఒంట్లో అంగాలు స్వాధీనంలో లేవు. పుచ్చుకున్న మదిర వల్ల వాళ్ళ మాటలు నెమ్మదైపోతున్నాయి. కనుబొమలు, చూపులూ వంకరలు పోతున్నాయి. స్త్రీలల్లో కామం పెరుగుతోంది.

వాళ్ళ మాటలు, వడ్డాణాల సవ్వడులూ, నీటి గలగలలూ వాల్మీకి నేపధ్య సంగీతానికి తోడై ఒక గొప్ప వసంతగీతాన్ని సృష్టిస్తున్నాయి.

తమ ప్రియులు రాకపోవడంవల్ల కొందరు బయటే ఉండిపోయారు. వాళ్ళా బావిచుట్టూ ఉన్న వనంలో తిరుగుతున్నారు. ఎర్రనిపూలని చూసినకొద్దీ వాళ్ళలో కోపం పెరిగి దుఃఖంగా మారిపోతోంది.

నిరీక్ష్యమాణా నవయౌవనానాం!

.

ప్రియులకోసం ఎదురుచూస్తున్న ఆ తరుణులకి పైనుంచి క్రిందదాకా పగడాలు కట్టినట్టు (పగడపుటెరుపు రంగులో) పూసిన అశోకచెట్టుని చూడగానే గుండెల్లోంచి శోకం ఉబికివస్తోంది.

అంత చల్లని గాలులు వీస్తున్నా, విరహంతో వాళ్ళకి చెమటలు పడుతున్నాయి.

.

దట్టమైన ఆ చెట్లగుంపుల మధ్యలో, చెమటలు పట్టిన వాళ్ల తామరపువ్వుల్లాంటి ముఖాలు చూస్తూంటే, రత్నాలగుంపులో పరుచుకుని పాకుతున్న ముత్యాల్లా అనిపిస్తున్నాయి.

కొందరు మామిడిచెట్లవంక చూస్తూ పాతజ్‌ నాపకాల్తో బాధ పడుతున్నారు. ఆ చెట్లకొమ్మలు ఊగినప్పుడల్లా వాళ్ళ మనసులుకూడా ఊగిపోతున్నాయి.

బావిలో దిగినవాళ్ళు బయటకి వచ్చారు.

.

ఆడవాళ్ళు ఎర్రపువ్వుల రంగుల్తో ఉన్న పట్టుబట్టల్ని తమ గుండ్రని పిరుదుల చుట్టూ కట్టుకున్నారు. స్తనాలమీద కుంకుమరంగు వస్త్రాల్ని కప్పుకుంటున్నారు.

కొత్త కొండగోగుపూలని చెవులకి ఆభరణాలుగా పెట్టుకున్నారు. ఉంగరాలు తిరిగి ఊగుతున్న నల్లని కురుల్లో ఎర్రని అశోకపువ్వుల కేసరాల్నీ, విచ్చుకున్న మల్లెపూలనీ పెట్టుకుని బయల్దేరారంతా. అంతా బాగా తాగి ఉన్నారు, దానికితోడు గాలిలో కూడా తేనెలవాసనలు గుబాళిస్తున్నాయి.

రంగురంగుల పుప్పొడి గాల్లో ఎగురుతోంది. అది ఒక చెట్టుమీదనుంచి మరొకదానికి ఎగురుతూంటే, ఆ చెట్లు కావాలని ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నట్లుంది. ఆ రంగుల్లో తుమ్మెదల రొద ఆ కార్యక్రమానికి సంగీతంలా అమరింది. పూలగుత్తులు రాళ్లమీద రాలి పడుతున్నాయి. కాముకుల సుఖంకోసం పూలపరుపులు పరుస్తున్నాయి. కొండచరియల్లో, చెట్లకింద.. ఎక్కడ చూసినా రంగురంగుల పరుపులు. చుట్టూ కన్నెలేళ్ళు, చక్రవాకాలు, నీటికోళ్ళు, కొంచపిట్టలు అటూఇటూ తిరుగుతున్నాయి

ఆ పరుపులమీద చెట్లనీడల్లో, మన కాళిదాసు తీసుకొచ్చిన కాముకులు పడుకుని దొర్లుతున్నారు.

వాళ్ళు సురతాల్ని గురించి మాట్లాడుకుంటున్నారు. చెట్లపైనుంచి సూదైన మామిడిపువ్వుల బాణాలు వేస్తూ వసంతుడు వాళ్ళ మనసుల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని వింటితాడు తుమ్మెదల బారుతో చేయబడి ఉంది.

ఇలా ఈ చెట్లకింద పగలు చల్లగా, రాత్రుళ్ళు వెన్నెల్లో.. మరీవేడిగా ఉంటే మేడల్లో .. మేడల్లో మరీ చలివేస్తే ఒకళ్ళ కౌగిళ్ళలో ఒకళ్ళూ….

.

ఇంతకాలం చలిగా ఉందని లావు లావు బట్టలు వేసుకున్నారు. వసంతకాలం రాగానే వాటిని పారేసి, లక్కతో రంగు వేసి అగరు ధూపం వేసిన బట్టల్ని కామంతో అలిసిపోయిన ఒళ్ళకి చుట్టుకుంటున్నారు

కాళిదాసు పరివారం వసంతుడికి స్వాగతమిస్తున్నారు.

మోదుగుచెట్లు విరగబూసి ఊగుతూంటే విరహపుమంటలు రేగుతున్నాయి వాళ్ళలో. ఆ చెట్లగుంపుల్తో చూస్తూంటే ప్రకృతి కాంత ఎర్రచీర కట్టుకున్న క్రొత్తపెళ్ళికూతుర్లా ఉంది. కోకిలలు పాడుతున్నాయి, తుమ్మెదలు మేళాలు కడుతున్నాయి.

Tuesday, July 25, 2017

Rk laxman గారి సామాన్యుడు !

Rk laxman గారి సామాన్యుడు !

.

అనగనగా కధలు ఆ కాశి మజిళీలు,

గజిబిజిగా గదులు ఈ జీవిత మజిళీలు!

నడకే రానివాడు నట్టేట్లో ఈదుతాడు,

ఉట్టే అందనోడు స్వర్గాన్నే కోరతాడు!

.

మబ్బుల్లో నీళ్ళకని ఉన్న ముంతనే ఒంపేస్తాడు!

.

తోక గుప్పెడు గొర్రె గంపెడు,

ఆస్తి మూరెడు ఆశ బారెడు!

Monday, July 24, 2017

కృష్ణుడు (రాధికా గీతము-బసవరాజు అప్పారావు గీతాలు!

బసవరాజు అప్పారావు గీతాలు!

.

కృష్ణుడు (రాధికా గీతము)

నల్లవాడే

గొల్ల

పిల్లవాడే

చెలియ

కల్లగాదే వాని

వల్లో జిక్కితినే! నల్ల...

.

వచ్చినాడే

తోట

జొచ్చినాడే

సకియ

చొచ్చి నాదౌ మనసు

ముచ్చిలించాడే! నల్ల...

.

ఆగినాడే

పొదల

దాగినాడే

మనసు

రాగబంధమువేసి

లాగుకొన్నాడే! నల్ల...

.

చూచినాడే

మోము

దాచినాడే

నాదు

దాచుకొన్నా వలపు

దోచుకున్నాడే! నల్ల...

.

చేరినాడే

చెంత

చీరినాడే

చేర

కోరి చేరా బోవ

పారిపోయాడే! నల్ల...

.

పాడినాడే

చనుచు

ఆడినాడే

మదిని

చేడె! అతనిపాట

వీడకున్నాడే! నల్ల...

.

ఊదినాడే

మురళి

చేదినాడే

వలపు

నాదుమది తనరూపు

పాదుకొలిపాడే! నల్ల...

.

చూడలేనే

మమత

వీడలేనే

వాని

జోడుకూడని ఉసురు

వీడిపోనీవే! నల్ల...

పెండ్యాల నాగేశ్వరరావుగారు !


పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమాసంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూపాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించినకొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పని చేశారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతోసాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడనిపెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు , ముద్దుబిడ్డ , భాగ్యరేఖ , జయభేరి , మహామంత్రి తిమ్మరుసు , శ్రీకృష్ణార్జున యుద్ధం , రాముడు భీముడు , శ్రీ కృష్ణ తులాభారం కొన్ని చాలు – వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి.

అద్భుతమైన పాటలే కాదు, పద్యాలు కూర్చారు. పౌరాణిక చిత్రాలకు సాంఘిక, జానపద చిత్రాలకూ అద్భుతమైన బాణీలు సమకూర్చడానికి తాను ఎంత రిహార్సిల్స్‌ చేసేవారో, గాయనీ గాయకులతో కూడా రిహార్సిల్స్‌ చేయించి మరీ పాడించేవారు. రంగస్థల నటుడు, హార్మోనిస్ట్‌ కూడా కావడంతో పద్యాల మీద రంగస్థలంలో తనకు గల పట్టు, చిత్రాల్లో కూడా పద్యాల మీద చూపి సినిమాల్లో కూడా ఓహో అనేలా పద్యాలు పాడించేవారు. గాయనీ గాయకుల టేలెంట్‌ గుర్తించి, వారి టేలెంట్‌ని సద్వినియోగం అయ్యేలా చేయడానికి మీదు మిక్కిలి శ్రమించేవారు పెండ్యాల.

శాస్త్రీయ సంగీతంలోనూ, హార్మోనియం వాయించడంలోను పేరు ప్రఖ్యాతులు పొందిన తండ్రి సీతారామాయ్య నుంచి గాత్రం, హార్మోనియం రెండూ నేర్చుకున్నారు మిగతా విద్యార్థులతో పాటు. అలాగే తండ్రి రంగస్థల ప్రదర్శనలకు హాజరు అవుతుంటే పెండ్యాల దృష్టి అటువేపు మళ్ళింది. అందుకే స్కూల్లో పాటలు పద్యాలు పాడటమే కాకుండా అప్పుడప్పుడు వేషాలూ వేస్తూ మెల్లిగా రంగస్థలం మీదకు నటుడుగా ప్రవేశించి హార్మోనియం కూడా మీటేవారు.

ఆరుద్ర పెండ్యాల, తిలక్‌ కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లో ఎంత చక్కని పాటలు రూపొందాయో, ఘంటసాల, సుశీల, పెండ్యాల కాంబినేషన్లోనూ అద్భుతమైన పాటలు వెలువడ్డాయి.

దొంగరాముడు, ముద్దుబిడ్డ, ఎమ్‌ఎల్‌ఎ, భాగ్యరేఖ, జయభేరి, భట్టి విక్రమార్క, ఈడూజోడూ, అత్తా ఒకింటి కోడలే, హరిశ్చంద్ర, మహాకవి కాళిదాసు, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కథ, వాగ్దానం, మహామంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, రాముడు భీముడు, వెలుగునీడలు, ఉయ్యాల జంపాల, శ్రీకృష్ణ సత్య, బావామరదళ్లు, అక్కాచెల్లెలు ఇలా అనేక చిత్రాలను అద్భుతమైన సంగీతం సమకూర్చారు పెండ్యాల.

పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆచిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారుగనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికిపూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి(1948)కి పెండ్యాలకు సంగీతదర్శకుడుగా అవకాశం ఇచ్చారుప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైనపాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతగాదర్శకుపెండ్యాల నాగేశ్వరరావుడు స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీగాయకుల చేతపాడించడం – పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగావినియోగించుకునే సంగీతదర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడులేడు!. పెండ్యాల గారి వేలపాటల్లో – అది క్లబ్బుపాటైనాఅందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీపాటని అనుసరించినా, పాశ్చాత్యధోరణిని అనుకరించినా అందులోతెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీగాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.

మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని గుక్క తిప్పుకోవడానికీ, సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనానిలబెట్టడానికీ వీలుకల్పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకొన్నది రాబట్టేవరకూ విడిచి పెట్లేదు.

జగదేకవీరుని కథలోని శివశంకరీ పాట గురించి ఘంటసాల చెప్పేవారు. ‘పాట మొత్తం ఒకే టేక్లో పాడగలిగితేబావుంటుంది – ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని పెండ్యాలగారంటే – ‘ఒకే టేక్లో మొత్తం పాడతానుచూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు. ‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్కి వెళ్లకుండా ఆపాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన’ అని పెండ్యాలగారు, ఘంటసాల మృతిసందర్భంగా చెబుతూ, ఆయన్ని స్తుతించారు.‌ ‌ ‌

Sunday, July 23, 2017

రుక్మిణీదేవిగౌరీపూజ!

రుక్మిణీదేవిగౌరీపూజ!

.

"నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని

న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!"

.

“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు 

.

ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి భక్తిగా

.

పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి

.

ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” 

.

అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది.

Saturday, July 22, 2017

సాంబుడు శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడు.

సాంబుడు !

.

సాంబుడు శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడు.

శ్రీకృషుడు పుత్రులను కోరుకుని మునుల సలహా మీద ఏకాంతజీవనం స్వీకరించి శరీరమంతా భస్మధారణ చేసి చెట్లబెరడును వస్త్రాలుగా చేసుకుని సంవత్సరాల తరబడి పరమశివుని కొరకు తపసుచేసి శివుని మెప్పించి శివపార్వతులను ప్రత్యక్షం చేసుకున్నాడు. తరువాత శ్రీకృష్ణుడు శివపార్వతులను తనకు శివుని వంటి కుమారుడు కావాలని కోరాడు. శివుడు శ్రీకృష్ణుని కోరికను నెరవేర్చి శ్రీకృష్ణ జంబతులకు పుత్రుని ప్రసాదించాడు. వారా పుత్రునికి సాంబుడు అని నామకరణం చేసారు. శివుని వంటి కుమారుని కోరుకున్నాడు కనుక సాంబుడు శివుడు లయకారకుడు కనుక శివునిలా యదువంశం సమూలంగా నాశనం కావడానికి సాంబుడు కారణంఅయ్యాడు.

సాంబుడు అందగాడు అందరికీ అభిమానపాత్రుడు.

సాంబుడు సహించరాని పనులు అనేకం చేసాడు. శ్రీ కృష్ణుని పోలిన సాంబుడు కృషుని వేశంలో తన పిన న తల్లులను మోసం చేసిన కారణం వలన కృష్ణుడు కోపించి కుష్టు రోగమును శాపముగా ఇచ్చడు .

సాంబుడు క్రియల ఫలితంగా యాదవవంశం అంతా నిర్మూలం అయింది. .

శ్రీకృషుడు జన్మించిన యదువంశాన్ని వేరెవరు వధించలేరు కనుక మానవులకు మరణం తథ్యం కనుక యుగానంతంలో ఇలా సంభవించాలని శ్రీకృష్ణుడు సంకల్పించాడు. 

లయకారకుడైన శివునివంటి స్వభావంతో జన్మించాడు కనుక యదువంశం యుగాంతంలో లయం కావడానికి సాంబుడు కారణం అయ్యాడు. యాదవులు వారిలో వారు కలహించుకుని ఒకరిని ఒకరు వధించుకుని దాదాపు అందరూ నాశనం అయ్యారు. ఈ సంఘటనలో సాంబుడు నిమిత్తమాత్రుడు మాత్రం అయ్యాడు. 

దుర్యోదనుని కుమార్తె లక్ష్మణ స్వయంవరం ప్రకటిచిన సమయంలో సాంబుడు ఆమెను వివాహమాడాలని అనుకున్నాడు. కాని ఆమె అందుకు అంగీకరించలేదు. సాంబుడు స్వయంవరానికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఆసమయంలో తనను ఎదిరించిన కురుసైన్యాలను ఓడించినా చివరకు సాంబుడు కౌరవులకు బంధీ అయ్యాడు.

ఈ వార్తవిన్న బలరాముడు కృద్ధుడై హస్థిపురానికి వెళ్ళి సాంబుని విడిపినమని అడిగాడు. అందుకు నిరాకరించిన దుర్యోధనుని మీద కోపించిన బలరాముడు హస్థినాపురాన్ని ధ్వంసం చేయడానికి ఆయత్తమై తన నాగలితో హస్థినను ఒకవైపు పైకి లేపాడు. దుర్యోధనుడు కురుపెద్దల హెచ్చరికకు విని యాదవుల బలపరాక్రాలను గ్రహించి బలరాముని క్షమను వేడుకున్నాడు. బలరాముడు శాంతించాడు. దుర్యోధనుడు తరువాత శాంతించి తనకుమార్తె లక్ష్మణను సాంబుడికి ఇచ్చి వివాహం చేసాడు. సాంబుని వివాహవృత్తాతంతం వ్యాసభారతంలో కనిపించదు. అయినా ఇది ప్రచారంలో ఉంది

Friday, July 21, 2017

శ్రీ త్యాగరాజస్వామి!!

శ్రీ త్యాగరాజస్వామి!!

.

సంగీతాన్ని ప్రేమించి . సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు నాకు తండ్రి ..ఆయన పాదాలదగ్గర 'బంటురీతి కొలువు' చాలు అంటూ శ్రీ రాముడి కుటుంబం నా కుటుంబం అని చెప్పిన మహా వాగ్గేయకారుడు ..శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు కాకర్ల త్యాగరాజస్వామి..

శ్రీ త్యాగరాజ స్వామి నాదోపాసనలో ముక్తి పొంది భక్తుల కందరికి దారి చూపిన మాహా వాగ్గేయకారుడు. పురందరదాసు, కబీరు తులసీదాసు, రామదాసు వంటి వారు కూడా భక్తిలో నాద యోగస్ధితిని పొంది మోక్షం పొందిన వారే. త్యాగరాజు కారణజన్ముడు.

.

తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో ఉండే కాకర్ల రామబ్రహ్మానికి జన్మించాడు త్యాగరాజు. తల్లి పేరు సీతమ్మ. త్యాగరాజు తాతగారు వీణాకాళహస్తయ్య ఈయన ప్రసిద్ధి కెక్కిన సంగీత విద్వాంసుడు. సంస్కృత, తెలుగు భాషల్లో పాండిత్యం గడించిన త్యాగరాజు శొంఠి వెంకట రమణయ్యగారి వద్ద చేరి సంగీతం అభ్యసించారు. రామకృష్ణానంద స్వామి అనే సన్యాసి ‘నారదోపాస్తి’ మంత్రాన్ని త్యాగరాజుకు ఉపదేశించారు. నారదుడు యతి రూపంలో వచ్చి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంధాన్ని అనుగ్రహించారు. త్యాగరాజు తన కృతులలో అనేక విధాలుగా వారిని స్తుతి చేశారు.

త్యాగయ్యకు పద్దెనిమిదవయేటనే పార్వతమ్మతో వివాహము జరిగింది. తదనంతరం రెండేడ్లకు తండ్రి మరణించాడు. పార్వతమ్మ ఐదు సంవత్సరాల తరువాత మరణించగా, ఆమె చెల్లెలు కమలాంబతో తిరిగి వివాహము జరిగింది. తంజావూరు రాజు శరభోజి ఎన్నో కానుకలను ఇచ్చి వారి సంస్ధానానికి ఆహ్వానించారు. కాని త్యాగయ్య తిరస్కరించారు. అప్పుడు ‘‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా’’ అని కళ్యాణి రాగంలో ఆలాపించారు.

దీంతో విసిగిన అన్నయ్య జపేశం త్యాగయ్య పూజించే రామపంచాయతన విగ్రహాలను కావేరీలో పారవేయగా తెల్లవారుజామున ఆ సంగతి తెలిసి ‘‘ ఎందు దాగినావో ’’ అనే కృతికి ఆకృతి నిచ్చారని ప్రతీతి. దుఃఖంతో భార్య కమాలాంబ మరియు కూతురు సీతాలక్ష్మిని వదిలి అనేక తీర్థయాత్రలు చేసి అనేకానేక ప్రసిద్ధ కీర్తనలు రాసారు.ఆయన పరితాపము చూసి రాముడే కలలో కన్పించి తాను కావేరీలో ఉన్నానని తెలియజేశారట. త్యాగరాజు విగ్రహమూర్తిని తెచ్చుకుంటూ ‘‘రారా మాయింటి దాకా’’ అని అసావేరి రాగంలో పాడారట.

వాల్మీకి లాగానే 2,400 కృతులను ఈయన రచించగా నేడు లభ్యం అవుతున్నవి 600 లకు మించి ఉండవని విజ్ఞుల అభిప్రాయం.ఈయన 72 మేళకర్త రాగాలు మరియు ఎన్నో జన్యరాగాలలో కీర్తనలు రచించారు. అయితే అది కూడా వరుస క్రమంగా సులభ లభ్యం కావడంలేదు. వీరి రచనలలో అత్యున్నతమైన "ఘనరాగ పంచరత్న కృతులు" జగత్‌ ప్రసిద్ది కెక్కాయి. త్యాగయ్య ప్రహ్లాద భక్త విజయము, నౌకా చరిత్ర, సీతారామ విజయం అనే సంగీత నాటికలను కూడా రచించారు.

1767సంవత్సరం మే 4న పుట్టిన త్యాగరాజు దాదాపు 80 సంత్సరాలు జీవించి 1847వ సంవత్సరం జనవరి 6న అంటే పుష్య బహుళ పంచమినాడు ఆ రామునిలో ఐక్యం చెందారు


భక్తి కవితా చతురానన బమ్మెర పోతన - డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

భక్తి కవితా చతురానన బమ్మెర పోతన

- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

"పలికెడిది భాగవతమఁట

పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ

పలికిన భవహర మగునట;

పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"

నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు

శూలికైనఁ దమ్మి చూలికైన

విబుధజనుల వలన విన్నంత కన్నంత

తెలియ వచ్చినంత తేటపఱుతు."

భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;

గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌

గొందఱికి గుణములగు; నే

నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."

కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయా కవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.

Wednesday, July 19, 2017

మంచి గురువు.... (ఉత్తమ)వెర్రి బాగుల శిష్యుడు!

మంచి గురువు.... (ఉత్తమ)వెర్రి బాగుల శిష్యుడు!


.

మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు.. లోనే వక్ర భాష్యము ఉన్నది.

ద్రోణుడు మంచి గురువా? ఎవరికి? అర్జునునికా? ఏకలవ్యునికా? 

ద్రోణుడి విలువిద్యా ప్రావీణ్యత గురించి ఎవరికీ అనుమానంలేదు. 

అర్జునునికి విలువిద్య నేర్పడమే కాక అతనిని మించినవాడు ఉండడని మాట ఇచ్చాడు. 

ఏకలవ్యుడు ద్రోణునే గురువుగా ఆరాధించి స్వయంకృషితో విలు విద్య నేర్చుకుని, తన విద్యను తాను ఆరాధించిన ద్రోణునికి ప్రదర్శించాడు. 

అంటే ఏకలవ్యుడు ఉత్తమ శిష్యుడు. 

ద్రోణుడు అతనికి మంచిగురువు కాలేక పోయాడు. అర్జునుని మించిన విలుకాడు తన యెదుటనే ఉన్నాడు. ఇది సహించలేక ద్రోణుడు నీచమైన అధర్మము చేశాడు. గురుదక్షిణగా అతని విద్యనే పరోక్షంగా కోరాడు. ఇంద్రుడు కర్ణునివద్ద కవచ కుండలములు దానం కోరినట్లే. 

ఇక్కడ కులాల ప్రసక్తి లేదు. శ్రీకృష్ణుని కథలో ఆయన అనేకులకు అనుగ్రహం చూపాడు. వారిలో బ్రాహ్మణుల సంఖ్య అతి తక్కువ. నాదృష్టిలో ఆకాలపు బ్రాహ్మణులు శ్రీకృష్ణావతారము వలన ప్రయోజనం పొందలేదు.

ఏకలవ్యుడు, శంబూకుడు, బలి చక్రవర్తి మొదలైన కథలను ఆధునికులు చర్చించ వలసినదే. ఏకలవ్యుని వృత్తాంతములో ద్రోణుడు ధర్మాన్ని నిలబెట్టాడడని అనడం సరికాదు. 

ద్రోణుడు భ్రష్ట బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధర్మాన్ని వదలి క్షాత్రాన్ని స్వీకరించాడు. అధర్మపరుల కొలువులో తనది కాని వృత్తిని స్వీకరించాడు. సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నోరుమెదపలేదు. పైగా అధర్మ పక్షాన సైన్యాధిపతి అయ్యాడు. క్షమాగుణం లేకుండా ద్రుపదుని పై పగ సాధించాడు. 

ఆయన కుమారుడు అశ్వత్థామ కూడా దుర్యోధనుని సంతోషపెట్టాలని నిద్రపోతున్న వారిని సంహరించాడు. 

ఇక్కడ కుల ప్రసక్తిలేదు. కేవలము ఇప్పటి వంటి రాజకీయాలే. స్వార్థపరత్వమే.ఆధునిక మానవుని వంటి బలహీనతలే. అవసరమైనప్పుడు బ్రాహ్మణుడు ధర్మ వ్యాధుని వద్ద ధర్మము నేర్చుకొనవలసి వచ్చినది. 

భీముడు హిడింబను వివాహము చేసుకోవడానికి ఎవరూ అడ్డుచెప్పలేదు.

కనిపించే పెద్ద గీత –– సీత -దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ !

కనిపించే పెద్ద గీత –– సీత -దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ !

.

లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది.

తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది.

ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే – 

కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ ! 

తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది. ఊర్మిళే కనక తనని అడవులకు వెళ్ళ వద్దని నిర్బందిస్తే ? 

ఒకరకంగా తనకు పరీక్షే – తను వద్దనగానే మరోమాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది.

.

ఒక్కసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజ పరివారమంతా బయల్దేరివచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు – ఎందుకు రాలేదు ?

భర్తని చూడాలని అనిపించలేదా ? ఏదో కారణం ఉండే ఉంటుంది.

.

తల్లి సుమిత్ర నడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలకి ప్రవేశించగానే చెలికత్తెలు పక్కకు తప్పుకున్నారు. తల్లి సుమిత్రకి, పెదతల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి, ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అన్నగారి ఆజ్ఞని విన్నవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నల అనంతరం సుమిత్రని అడిగాడు లక్ష్మణుడు.

.

” తల్లీ – అయోధ్యలో అందరూ కుశలమేనా ? ఊర్మిళ ఎలా వుంది ? మీరందరూ అడవికి ఆయత్తమవుతుంటే తనూ వస్తానని అనలేదా ? మీతో పాటు ఊర్మిళ ఎందుకు రాలేదు ? ”

” నాయనా లక్ష్మణా – మేమందరమూ భరతునితో బయల్దేరుతున్నామన్న విషయం స్వయంగా నేనే వెళ్ళి చెప్పాను. తనని కూడా రమ్మనమని చెప్పాను…కానీ.. ” మధ్యలో ఆగిపోయింది సుమిత్ర.

” కానీ…”

” తనే రానని నిష్కర్షగా చెప్పింది. ఎంత బ్రతిమాలినా రానంది. ”

” అదేమిటమ్మా – నువ్వు బ్రతిమాలినా రానని అందా ఊర్మిళ – పోనీ ఎందుకు రానందో కారణమైనా విన్నవించిందా నాకు….”

” కారణం…” తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర.

” సందేహం వద్దు – చెప్పమ్మా ! నేనేమూ కోపగించుకోను…”

” నీకు ప్రతిబంధకం కాకూడదని…” సుమిత్ర మధ్యలో ఆగిపోయింది.

ఒక్కసారి లక్ష్మణునకు మనుసుని ఛెళ్ళుమని కొట్టినట్లనిపించింది.

బయల్దేరేముందు తనకి, ఊర్మిళకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఇంకేమీ మారు మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేశాడు. ఊర్మిళ అభిమానవతి. అంతేకాదు భర్త కర్తవ్యపాలనకోసం అంతఃపురానికే అంకితమయ్యిన మహాసాధ్వి. బాధలు, సంతోషాలు పంచుకోవడానికి వదిన గారు సీతకి అన్నగారు రాముడున్నారు. మరి ఊర్మిళకెవరున్నారు ? పక్కన ఉండాల్సిన తను….లక్ష్మణుడు వడి వడిగా అడుగులువేసుకుంటూ తమ కుటీరం వైపు మరలాడు. వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్ప రేకలతో వేసిన ముగ్గు చూసాడు. గబుక్కున త్రొక్కబోయి పక్కకు ఒరిగాడు. పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి.

ఆ పుష్పాల్లో ఊర్మిళే కనిపించింది లక్ష్మణుడికి. కనిపించే పెద్ద గీత – దాని వెనుక మరుగైన చిన్నగీత – సీత – ఊర్మిళ.

Tuesday, July 18, 2017

పోతన పద్య మధురిమలు ముద్దులుగార-కరుణశ్రీ! .

పోతన పద్య మధురిమలు ముద్దులుగార-కరుణశ్రీ!

.

ఉ.

ముద్దులుగార భాగవతమున్రచియించుచు పంచదారలో

అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ

ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీసిన తాటియాకులో

పద్దెములందు ఈ మధురభావములెచ్చటనుండి వచ్చురా!

.

పోతన కవిత్వం పంచదార పాకానికిప్రసిద్ధి. పోతనగారు ముద్దులొలికేలా అంత మథురాతి మధురంగా ఎలా రాయగలిగాడు అనిసందేహం వచ్చిందిట. ఆయనంటే కష్టపడితాటియాకులపై గంటంతో రాసారు. మహాకవి కదా, రవి గాంచని చోటే కాదు కాలం కాంచనిది కూడకనగలడు. తరువాతి తరాలలో సులువుగా కలం సిరాలో ముంచి రాసేవాళ్ళం కదా. పంచదార వాడిమధుర పదార్థాలు చేసేవాళ్ళం కదా. అవన్నీ తెలిసిన వాడు కనుకపంచదారలో గంటం అద్ది తాటాకుల మీదచెమటలు కాదు ముద్దులు కారేలా రాసారు. అలాకాకుండా వట్టి గంటంతో తాటాకులమీద అక్షరాలుగీకేస్తే పద్యాలకి ఇంత మాధుర్యం రాదు కదా.అన్నారు మన కరుణశ్రీ. ఆ రోజుల్లో పంచదార ఎక్కడది అని అడక్కండి.

Monday, July 17, 2017

గోదావరి స్నానాల వింతలు !


గోదావరి స్నానాల వింతలు !
.
కొత్తనీటి కుదుపులకు...
కోడెగాళ్ల అదుపులకు...
కొప్పులోని కొత్తసవరం...
కొట్టుకుపోయే దొడ్డమ్మా..

.

ఉషా పరిణయం!

ఉషా పరిణయం!

పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. 

బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. . ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. “వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు” అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు “నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను” అన్నాడు. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.

.

ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. ఈవిధంగా శంకరుడు కోటబయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి “శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతొ యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది” అని కోరాడు.

అప్పుడు శంకరుడు “నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు. 

ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఎ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది” అని అడిగింది. అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. 

అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు” అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది.

అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ “ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.” అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. 

బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. 

చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది.

ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. 

ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. 

ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారి నందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. 

ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది” అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది” అని అన్నాడు.

తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. 

శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. 

వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. 

బాణాసురునకు ఉన్న బాహువులలో 996 బాహువులను సుదర్శన చక్రధారల చేత తెంచేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. .

ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యప్పుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. 

బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు.

Sunday, July 16, 2017

తండ్రి తానే కుమారుడై పుట్టి తన ప్రకాంశంతో వెలుగొందుతాడు !

తండ్రి తానే కుమారుడై పుట్టి తన ప్రకాంశంతో వెలుగొందుతాడు !

.

భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు. 

కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది.

దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు. 

గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు. మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు.

‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం.

కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. 

నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ లేవు !

జ్వలిత కౌసల్య .కావ్య ఖండిక!

జ్వలిత కౌసల్య .కావ్య ఖండిక!

(రచన -అనుమాండ్ల భామయ్య గారు )

ఈ పద్య కావ్యంలో భర్త నిరాదరణ , బహు భార్యత్వం , సపత్నుల పోరు , అసంతృప్తుల నుంచి సంసార జీవనం , మాతృ వాత్సల్యం , పితృవాక్య పరిపాలన , ఏక పత్నీ వ్రతం వైపు ప్రస్థానం సాగింది.

భర్త నిరాదారణ :

“పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ

మేము కాని , మీ తండ్రి ఇంట నేను

కాలు మోపిన పిదప సుఖము నెరుంగ

నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తుడిచె “(పుట – 1 7 )

మీ తండ్రి ఇంటిలో అడుగు పెట్టిన నుంచి సుఖాల మాట ఎలాగున్నా , కనీసం గౌరవ మర్యాదలన్నా దక్కుతాయనుకుంటే నువ్వు అడవులకు వెళ్ళిపోతున్నావని కౌసల్య విలపించింది .

“నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు

నను గొలువ దాసదాసీ జనమ్ము కలదు

ఎన్ని ఉండి వీని నను భావింపలేని

భాగ్యహీనను పతి ప్రేమ బయడలేక “ (పుట – 22 )

ఏడువారాల నగలున్నాయి . దాసదాసీజనం ఉంది . ఎన్ని ఉండి వీనినను భావింప లేని భాగ్య హీనను , పతి ఆదరణ లేకపోవటం వలెనే కదా ఈ వ్యధ అని ప్రశ్నించింది .

పేరుకి పట్టా మహిషినే గాని మీ నాన్నగారి నిర్వాకంలో నా బతుకు దాసీకన్నా కనా కష్టం అయిపొయింది . నీవు రాజువైతే నన్నా సుఖ పడదామని అనుకున్నాను . అది కూడా అడియాసే అయ్యింది రామా ! అని భోరున కౌసల్య విలపించింది .

ఈ పాట తెలియని వారు లేరు కానీ ఈ మాట చాలామందికి తెలియదు!

ఈ పాట తెలియని వారు లేరు కానీ ఈ మాట చాలామందికి తెలియదు!

.

కవి రాసింది వేరు ..ఘంటసాల గారు పాడింది వేరు.

కూడి (కలసి )ఎడం (విడి పోవడం ..సెపెరేషన్) అని రాసేరు .

సంగీత దర్శకుడు కుడి ఎడమ అని రికార్డు చేసారు.

అలాగా కూడి ఎడము..కుడి ఎడం ఐయింది .

తరువాత కవి సముద్రాల వారు ,త్రాగుబోతుఎలా పాడిన 

పర్వాలేదు అని వదిలేసారు.

Saturday, July 15, 2017

భీష్ముడిని అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు?

భీష్ముడిని  అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? 

.

ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడనుకోండి అపుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు. 


 భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ” అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు. 


అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే! 

భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనిన తరువాత, ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయినా తరువాత శకునికి గుర్తువచ్చింది “నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడని ఒడ్డు” అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు “దౌపదిని ఒడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని. నేను అయన దాసుడిని. దోషం ఆయనకీ వెడుతుంది” అనుకుని ధర్మరాజు ద్రౌపదిని ఒడ్డి ఓడిపోయాడు. 

ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడ్చాడు. ఊడుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది.

 “ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసినది” అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డె అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు.

 “ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ” అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పపోవడం కూడా ధర్మాచరణము నందు వైక్లబ్యమే! ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణములతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి!

.

భారత యుద్ధము ముగిసినది.అంపశయ్యపై భీష్ముడు. శ్రీక్రిష్ణ అదేశనుసారము ధర్మరాజు సతిసొదరసమేతుడై అంపశయ్యపై ఉత్తరాయణపుణ్యకాలనికై నిరీక్షిస్తున్న పితామహుని సన్నిధికి రాగా, భీష్ముడు ధర్మారాజకోరికపై సకలరాజ ధర్మాలు బొధిస్తున్నాడు.

ఈ ధర్మొపదేశాలు జరుగుతుండగా ద్రౌపది నవ్వసాగింది.అది చూసి పితామహుడు "అమ్మాయి!నువ్వు నవ్వటానికి కారణము ఏమిటి? అని ప్రశ్న.    నీ నవ్వు అకారణము కాదు, సంకొచరహితంగా నీ నవ్వుకు కారణం చెప్పు" అని అన్నాడు.      అంత ద్రౌపది ముకుళితహస్తయై  "పితామహ ఈ విషయము  వ్యక్తపరచరానిదీ,అయినా మీరు ఆదేశిస్తున్నారు కనుక చెబుతున్నాను.మీరు నేడు చేస్తూన్న ధర్మోపదేశాలను వింటుంటే నాకు ఆశ్చర్యము భాదకలిగాయి.కారణము నాడు కౌరవ సభలొ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసే సమయములో మీ ధర్మఙ్ఞానము ఏమయిపొయింది? లేక ఇంత ధర్మఙ్ఞానము మీరు ఈ మధ్య నేర్చుకున్నరా అని  నాకు నవ్వు వచ్చినది.నన్ను పెద్దవారు క్షమించేదురు గాక ! 

          అంత భీష్ముడు అమ్మా! నీవు ఈనాడు ఈ ప్రశ్నతో సకలజనులకు ఆనాటి నా మౌనానికి కారణము తెలుస్తుంది అని పలికి.సమాధానముగా ఇలా అన్నాడు "పుత్రీ! నేను నా తండ్రి కొరకు రాజ్యాధికారము వొదలుకొని, నేనుకూడా పాలితుడనయ్యాను.మరియు ఆనాటి నా ప్రతిఙ్ఞప్రకారము  నేను నా ఆజన్మపర్యంతము ఈరాజ్యనికి,రాజుకు బద్దుడనయి వుంటాను. మరి ఆనాటి నారాజు దుర్యొధనుడు. అతను నాకుకావలసిన సర్వసౌకర్యాలు సమకూర్చినాడు.అతని దుష్ట పాలన వల్లలభించిన ఆహారప్రభావము వల్ల నేను మౌనముగా వున్నాను.కాని అర్జునుని శరపరంపరలవలన అనేకగాయలు ఆయినాయి, ఈగాయాల నుంచి ఆ కలుషిత అన్నప్రభావముచే ఉత్పన్నమయిన రక్తము పొయినది.ఈనాటి దేహములొ నామాత్రుగర్భమునుంచి వొచ్చినప్పుడున్న రక్తము వున్నది . అదియును గాక ఈనాడు ఈరాజ్యానికి రాజు ధర్మరాజు అతని ప్రభావము అప్పుడే ప్రారంభించినదని ఇది సూచన.ఆదియునుగాక నేను ఈనాడు స్వేచ్చాజీవిని".           

Friday, July 14, 2017

ఖాండవ దహనం-శ్రీ మహాభారతంలో కథలు!

ఖాండవ దహనం-శ్రీ మహాభారతంలో కథలు!

(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.)

చాలా ఏళ్ళ క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. వందేళ్ళపాటూ సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది. సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. " ఖాండవ వనంలో అనేక దివ్య ఓషధులు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో అ వనాన్ని దహించి ఆ ఓషధుల్ని స్వాహాచేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యమూ కుదుటపడుతుంది. శత్రు సంహారమూ జరుగుతుంది" అని అగ్నికి సలహ ఇచ్చాడు.

సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యాబిడ్డలతో వుంటున్నాడు. ఖాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుడ్ని ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు.

అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కణకణలాడిన అగ్నిదేవుడు ఆ వనన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా ఏడు రోజులూ కాపు కాసాడు. ఏడు రోజులూ ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్లి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు.

"నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు ఖాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది. అప్పటి వరకూ వేచివుండు" అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు.

పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని ఖాండవ వనానికి వెళ్ళాడు.

యమునా తీరాన బావమరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు. వారు సరేనన్నాకా అసలు రూపంలో ప్రత్యక్షమై ఖాండవ వనాన్ని దహించాలనే కోరికను వెళ్ళబుచ్చాడు. కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు. అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్ధన మేరకు అర్జునుడికి 'చంద్రధనస్సు ' (గాండీవం) ఇచ్చాడు. చిత్రమేమిటంటే దానికి అక్షయ తూణీరం ఉన్నది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడు కపిరాజుచిత్తరువుతో వున్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్యరథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన నాలుగు తెల్లగుర్రాలు పూంచి ఉన్నాయి. నాలుగిటికీ కళ్ళేలుగా నాలుగు బంగారపు గొలుసులు ఉన్నాయి. బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు.

కృష్ణార్జునులు ఖాండవ వన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలాకాస్తూ, వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు. అడవిలో జంతువులు అటూ , ఇటూ పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అక్కాడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. ఉరుములూ, మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోకి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేరా ఒక్క వానచినుకు రాలకుండా శరచత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు.

ఆ సమయానికి తక్షకుడు లేడక్కడ. కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతన్ని ఆసాంతం గుటుక్కున మింగి ఖాండవ వనానికి దూరంగా ఉమ్మి వేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టాడు. కోపంతో అశ్వసేనుడి తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి ధుళి పోవడం వల్ల అర్జునుడి గురితప్పింది. అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి.

అది గ్రహించి కృష్ణార్జునులు మండిపడ్డారు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు. పాండవమధ్యముడు ఖాండవ వనంలో కనిపించిన ప్రతీ ప్రాణినీ నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు.

బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు రాగలిగిన పాముల్ని, డేగల్ని అర్జునుడు ముక్కలు చేస్తున్నాడు. మరో పక్క కృష్ణుడు అసురుల్ని మట్టికరిపించాడు. చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు. దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్జ్వలంగా ప్రకాశించాడు.

Thursday, July 13, 2017

శకుంతల దుష్యంతునితో చెప్పిన నీతి వ్యాక్యాలు !

సభలో భరతుుడుగా అంగీకరించనని పలికినప్పుడు శకుంతల దుష్యంతునితో చెప్పిన నీతి వ్యాక్యాలు .

శకుంతల దుష్యంతునితో పలికినది: వివేకంతో బాగా ఆలోచిస్తే, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే వాడికి ఇహపరాలు రెండూ ఉండవు. అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు చక్కగా ఆచరించ గలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించ గలుగుతాడు. పుత్ర సంతానాన్ని పొంద గలుగుతాడు. గృహస్థ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగిగే ఫలాన్ని పొందుతాడు. అంతే కాక, భార్య అంటే ఎవరనుకున్నావు?

ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సాధించడానికి అనువైన సాధనం. గృహనీతి అనే విద్యకు నెలవైనది. శీలాన్ని ప్రబోధించే గురువు. వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమ గతులు పొందడానికి ఊత కర్రలా ఉపయోగ పడుతుంది. మన్ననకు ముఖ్య హేతువు. ఆదర్శ ప్రాయాలు, కలకాలం నిలిచేవీ అయని రత్నాల లాంటి గుణాలకు నెలవైనది. హృదయానందాన్ని భర్తకు కలిగించేది భార్యయే సుమా !

మగనికి ఇల్లాలి కంటె ఇంపైనది వేరొకటి లేదు. భార్యా పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడయినా, ఎలాంటి పరిస్థితిలోనయినా, ఎలాంటి ఆపదలోనయినా, ఏ తీరాలలోనయినా చుట్టుముట్టినా ఆపదలన్నీ తొలిగి పోతాయి. అంతే కాక, భార్య భర్తలో సగం. అందు వల్ల భర్త కంటె ముందుగానే మరణించిన భార్య పర లోకంలో అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

భర్త ముందుగానే చనిపోతే అతనిని అనుగమిస్తుంది. అట్టి స్త్రీని అవమానించడం ధర్మవిరుద్ధం.

మరో ముఖ్య విషయం. భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు. కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది.

దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు. గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు. మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు.

‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం.

కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. రాజా ! విరుద్ధాలయిన మాటలు ఎందుకు? ఈ నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ లేవు సుమా ! సత్య వాక్యం గురించి శకుంతల ... 

.

"నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత 

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త 

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.1-4-94

.

ఓ రాజా ! మంచి నీటి ,చేదుడు బావులు నూరిటి కంటె ఒక దిగుడు బావి మేలు. కాగా బావులు నూరిటి కంటె కూడ ఒక మంచి యఙ్ఞం మేలు. అలాంటి యఙ్ఞాలు నూరిటి కంటె కూడ ఒక కుమారుడు మేలు.

అట్టి పుత్రులు నూరుమంది కంటె కూడ ఒక సత్య వాక్యం మంచిది సుమా ! వేయి ఆశ్వ మేథ యాగాలు చేసిన ఫలితం ఒక వైపు, ఒక్క సత్యాన్ని మాత్రమే ఒక వైపు త్రాసులో వేసి ఉంచి తూచి చూస్తే, సత్యం వేపే త్రాసు ముల్లు చూపిస్తుంది. సత్యం అంత గొప్పది. సర్వ తీర్ధాలూ సేవించడం, అన్ని వేదాలనూ అధ్యయనం చేయడం కూడ సత్యంతో సాటి రావు !

ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటె సత్యము గొప్పదని అంటారు

గజేంద్ర మోక్షం..... (పోతన).

గజేంద్ర మోక్షం..... (పోతన).

.

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. 

“గజ” అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే “జగ” అవుతుంది. “జ” అంటే “జాయతే”. “గ” అంటే “గచ్ఛతే”. “జాయతే” అంటే వెళ్ళిపోవడం. “గచ్ఛతే” అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని “జగము” అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.

గజేంద్రుని ప్రార్ధన !

.

పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది. 

.

"ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!” అని స్తోత్రం చేస్తోంది. 

ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. 

.

"లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం

జీకఁటి కవ్వల నెవ్వఁడు -

నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!

.

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.

ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే వుండి. అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవరూ చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!”

ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది 

.

"కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం

గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!

.

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. 

నిజంగా దీనులయిన వారు పిలుస్తే వస్తాడా? 

అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలడు కలండనెడివాడు కలడో లేడో! అంది. 

ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. 

.

"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!

.

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. .⁠⁠⁠⁠

Tuesday, July 11, 2017

పోతన వినయం!

పోతన వినయం!

[సౌజన్యం .శ్రీ పైడి నాగ సుబ్బయ్య గారు]

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!

విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేటపరతు!!

.

ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ “మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను” అన్నారు. ఆయన అంటారు – 

.

"అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

.

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కని గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

“అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. “ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.

.

“అమ్మలగన్నయమ్మ” – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం “శ్రీమాతా” అనే నామంతో ప్రారంభమవుతుంది. “శ్రీమాతా” అంటే “శ”కార “ర”కార “ఈ”కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఎన్నదో ఆయమ్మ – అంటే “లలితాపరాభట్టారికా స్వరూపం” – ఆ అమ్మవారికి దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని “అమ్మలగన్నయమ్మ” “ముగ్గురమ్మల మూలపుటమ్మ” 

– ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. 

ఈ ముగురమ్మల మూలపుటమ్మ. “చాల పెద్దమ్మ” – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

“సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ” – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యే అని ఏడిచేటటుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

“తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ” – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

.

మనకి సంప్రదాయంలో “అష్టమాతృకలు” అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని “అష్టమాతృకలు” అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

.

“రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం”

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

“మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్” – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.

.

అమ్మవారికి “శాక్తేయప్రణవములు” అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము “ఓం”, కవిత్వమునకు బీజాక్షరము “ఐం”, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము “హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – “శ్రీం”.

.

ఇపుడు “ఓంఐంహ్రీంశ్రీం” – అమ్మలగన్నయమ్మ “శ్రీమాత్రేనమః”

.

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో “ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః” – “ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః” అనేస్తున్నారు. మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం “శ్రీమాతా” అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు “ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః” అనలేకపోవచ్చు. కానీ “అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ “ అనడానికి కష్టం ఏమిటి? ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును ఇచ్చారు.

బాలల గేయాలు! రైలు -- కాకి బావ!

బాలల గేయాలు!

 రైలు -- కాకి బావ!

.

రైలు స్టేషను చెంత రావి చెట్టుంది

రావి పై నొక కాకి బావ కూర్చుంది

వచ్చి పొయ్యే రైలు వంక చూసింది

గమనించి మురిసి రెక్కలు కొట్టుకొంది

బలగమ్ము నొక నాడు పిలువనంపింది

కొట్ట కొస కొమ్మ పై కొలువు తీర్చింది

రైలు నే రమ్మంటె రావాలనంది

పొమ్మంటె తుర్రున పోవాలనంది

గమ్మత్తు లెమ్మంది కాకి బలగమ్ము

గమ్మత్తు కాదంటు కాకి బావపుదు

రైలు సిగ్నలు చెక్క వంగినది ఎరిగి

రావోయి రావోయి రైలు బావంది

గుప్పు గుప్పున రైలు కూస్తు వచ్చింది

(ఎక్కే వాళ్ళు ఎక్కారు దిగే వాళ్ళు దిగారు)

ఇంతలో గార్డు విజిలేయడమ్మెరిగి

పోవోయి పోవోయి పొగ రాయడాంది

రైలు గుబ గుబ లాడిబైలు దేరింది

కాకి బలగము పొగడ లేక చచ్చింది

విన లేక చచ్చెరా మన కాకి బావ

Saturday, July 8, 2017

తెలుగువారి మనస్సు!

తెలుగువారి మనస్సు!

ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

తేట తేట తెనుగులా....

మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.

పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది

ఏలాఅంటే

=======

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం

చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం

ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం

త థ ద ధ న……నాలుక కొస భాగం

ప ఫ బ భ మ……..పెదవులకు

య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా

ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.

తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.

తెలుగులో మాట్లాడండి. .

తెలుగులో వ్రాయండి. . .

తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..

తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .

_____________________________________

ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు

Friday, July 7, 2017

నా బాలమురళ కృష్ణ గారి జ్ఞాపకాలు !

నా బాలమురళ కృష్ణ గారి జ్ఞాపకాలు !

.

1954 లో వారింటికి ఎదురుగా వుండే వాళ్ళం బెజవాడ సత్యనారాయణ పురం లో 

వారు నన్ను ఏరా "వింజమూరి"అని పిలిచే వాళ్ళు.నాకు అప్పుడు 12ఏళ్ళు.

వారు కొన్ని నచ్చిన సినిమా పాటలు పాడుకునేవారూ ,A .M .రాజా

చూడు మదే చెలియాతరచు పాడే వారు .

వారింట్లో కచేరి కి అల్ ఇండియా రేడియో పున్నమ తోటకి నన్ను పంపే వారు archestraకోసం.

వారు మా బంధువులు .

Thursday, July 6, 2017

చకారకుక్షి!

చకారకుక్షి!

,

కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. దానిపరిణామక్రమం తెలిసికుందాం!

భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట!

అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం.

.

కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు.

అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట.

.

కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది.

కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట.

.

కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి" అనిపలికి -

.

శ్లో: ద్రౌపద్యా ః పాండుతనయాః

పతి ,దేవర, భావుకాః,

నదేవరో ధర్మరాజః

సహ దేవో నభావుకః; -

.

అని వెంటనే ఒకశ్లోకం చెప్పారట. నెచ్చుకుంటున్నానయ్యా!

నీపాండిత్యానికి, చిరాయుష్మాన్భవ! అని ఆశీర్వదించారట.

కాళిదాసు వేలు బయట పడింది.

ఇంతకీ దీనికి అర్ధంయేమిటి అని మీసమదేహంకదూ! 

చెపుతా వినండి.

.

" ద్రౌపదీ దేవికి పాండవులతో భర్త, మరది , బావగారు, అనేమూడురకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరదికాడు , సహదేవుడు బావగాడు" 

అనిదీవియర్ధం! చూశారా కాళిదాసు ప్రతిభ! 

కాళికా వర ప్రసాదిగదా ఆతవికి యిక తిరుగేది?

Wednesday, July 5, 2017

భగవద్గీత !

భగవద్గీత !

.

కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత.

.

బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.

.

ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.

వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు.

.

1.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||

అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి.

2.

వాసంసి జీర్ణాని యథా విహాయ 

నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాని

అన్యాని సంయాతి నవాని దేహీ ||

అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.

3.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి

అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.

ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.

4.

తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |

ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||

కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు

వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.

5.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|

యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||

అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. విచక్షణా జ్ఞాన‌మే వ్యాపారం.

నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం!

నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం!

రచన: భైరవభట్ల కామేశ్వరరావుగారు.

ఉ. 

శ్రీయన గౌరినా బరగు చెల్వకు జిత్తము పల్లవింప భ

ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూ

పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక

ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

.

తిక్కన ‘కొలిచినది’ ఎవరిని? పరతత్త్వాన్నా? హరిహర రూపాన్నా? పరతత్త్వాన్ని ‘కొలవడ’మేమిటి? హరిహర రూపాన్నే అయితే, ‘పరతత్త్వము గొల్చెద’ అని ఎందుకన్నాడు? ‘శ్రీయన గౌరినా బరగు చెల్వ’ – ఇక్కడ, ఒకే మూర్తి శ్రీ గౌరులనే రెండు రూపాలుగా గుర్తింపబడిందా, లేక శ్రీ గౌరులిద్దరు ఒక రూపంగా ఏర్పడ్డారా? ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘హరిహరంబగు రూపము దాల్చి’ – హరిహరంబగు రూపమంటే, హరి, హరుడు అనే రెండు రూపాలా? హరిహరనాథుని ఏక రూపమా? హరి, హరుడు అనే యిద్దరు హరిహరంబగు రూపాన్ని దాల్చారా? లేక ఒకే తత్త్వమైన హరిహరనాథుడు హరి హరులనే రెండు రూపాలను ధరించారా? మళ్ళీ అదే ప్రశ్న. ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘చెల్వ’ అనే పదాన్నే ఎందుకు ప్రయోగించాడు? ‘భక్త జనాని’కీ, ‘వైదికధ్యాయిత’కూ మధ్య లంకె ఏమిటి?

పద్యాన్ని జాగ్రత్తగా మళ్ళా మళ్ళా చదువుతూ పోతే వీటికి జవాబులు సులువుగానే స్ఫురిస్తాయి. ఆ జవాబుల వెనుక కొత్త అర్థాలు ధ్వనిస్తాయి. చివరగా, తిక్కన గడుసుదనాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేను. శైవవైష్ణవ మతాల మధ్య సమభావం కోసం తిక్కన హరిహరనాథుని ఆరాధన ప్రచారం చేశాడని పండితులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమే కావచ్చు. కాని తిక్కన మత ప్రచారకుడు కాదు, కవి. తిక్కన గడుసుదనమంతా, తాను ప్రచారం చేయాలనుకున్న హరిహరనాథ స్వరూపాన్ని, ఆ హరిహరులే స్వయంగా ధరించారనట్టుగా చెప్పడంలో ఉంది!

మహానటి సావిత్రి గురించి,ఆమె తండ్రి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ఆర్టికల్!

నిర్మాతలకు హెచ్చరిక..

(

మహానటి సావిత్రి గురించి,ఆమె తండ్రి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ఆర్టికల్)

నిన్న మొన్నటివరకూ నెలకు మూడు వందలు తీసుకుని నటించే సావిత్రి ఈనాడు చిత్రానికి 20 వేలు డిమాండ్ చేస్తోందిట. ఇరవై వేలు తీసుకునే అర్హత సావిత్రికి ఉందా లేదా అన్న విషయం అప్రస్తుతం. 'కళ' కి విలువలేదుగా.సావిత్రి విలువ అమూల్యం కావచ్చు.అసమాన్యం కావచ్చు.

కాని నిర్మాతలింకా స్టార్ వ్యాల్యూ మోజు మీద సావిత్రం వంటి తారలను ఇరవై లేక నలభై వేలు ఇచ్చి బుక్ చేసుకోవటం ప్రస్తుత ఆర్దిక ప్రతిష్టంభన దృష్టిలో అది పరిశ్రమకు క్షేమం కాదు.

విడుదలైన అనేక చిత్రాలు దెబ్బ తిన్నాయి. అనేకమంది నిర్మాతలు నిలువునా కూలిపోయారు. మార్కెట్ లో ధనం లేకా, ఉన్నది కదలలేకా, నిర్మాణంలో ఉన్న చిత్రాలు మీన మేషాలు లెక్కపెడుతున్నాయి.

ఇటుపైని మొత్తం చిత్రం లక్షా లేదా లక్షన్నర రూపాయల్లో ముగించుకున్నవాడే ధన్యుడు. రంగంలో అనేకమంది మామూలు తారలు అసంఖ్యాకంగా ఉన్నారు. సావిత్రం కూడా నిన్నటి వరకూ మామూలు తారే.

స్టారు వేల్యూ మోజు మీద నిర్మాతలు ఆమె కోరినంత ధనమిచ్చి బుక్ చేసుకునేటంత ఆగత్యమైన పరిస్దితులు ఏమీ కనపడటం లేదు. ఇంతవరకూ ఆమె నటించిన చిత్రాల్లో ఒకటైనా భాక్సాఫీస్ హిట్ అనిపించుకున్నదున్నదా. అలాంటప్పుడు అనవసరంగా ఆమె స్టార్ వ్యాల్యూని మీరే కట్టబెట్టి. వేలం వెర్రిగా అందరూ బుక్ చేసి సమయానికి చిత్రం విడుదల చేయలేక బాధపడటం దేనికి?.

నేటి పరిశ్రమ అనేక విధాలుగా తారుమారైంది. పుష్కరం నుండీ తారాపధంలో వెలుగుతూన్న తారలతో నిర్మించిన చిత్రమైనా విజయవంతం కావటంలేదు. కనీసం పెట్టుబడి ధనమైనా తిరిగి రావటం లేదు. జెమినీ, ఏవియం వంటి ఆర్దిక పుష్టిగల స్టూడియోలే తమ సిబ్బందిని తగ్గించి వేసాయంటే, ఆర్దికంగా పరిశ్రమ ఎంత చితికి పోయిందో ఆలోచించండి.

తారల వల్లే చిత్రాలు విజయవంతమౌతాయనే పాత నమ్మకానికి స్వస్ది పలకాలి. అందుకు నిదర్శనం మీ భాక్సాఫీసులే. లక్షకి లక్షలు తారల కోసం వ్యయపరిచి చిత్ర పరిశ్రమని శాశ్వతంగా గంగలో కలపకండి.

చౌదరిగారూ ఆత్మ పరిశీలన చేసుకోండి

సావిత్రిని సినిమా రంగంలో ప్రవేశపెట్టడానికి వీరు ఎన్ని బాధలు పడ్డారో ఒక్కసారి వెనక్కు తిరిగి చూచుకోవటం చాలా అవసరం. ప్రప్రధమంగా 'మోహిని' లో ఆమె త్రివర్ణ ముఖచిత్రం ప్రచురించిన తరవాతనే సావిత్రికి పిలుపు వచ్చింది...కానీ అనేక అడ్డంకులు రావటంతోనే, పబ్లిసిటి ఆగత్యం అనే నగ్న సత్యాన్ని గ్రహించిన చౌదిరిగారు సావిత్రితో కలిసి రూపవాణి కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చి వెళ్లేరో లెఖ లేదు. ఉగాది సంచికలో సావిత్రి ఇంటర్వూ అచ్చులో ఉండగా బ్రాడ్వేలో మా ప్రెస్ కు ఎన్నిసార్లు విజయం చేసారో జ్ఞాపకం ఉంచుకోవాలి.

ఆవేదన, ఆతృత , ఆ మాదిరిగా ఉండటం సహజం. ఒక తార ముందుకు రావాలంటే ఎంత ప్రయాస ఉందో, ఎంత పలుకుబడి కావాలో చౌదరిగారికి బాగా తెలుసు. కాస్త పైకి రాగానే పాత విషయాలను మరిచిపోవటం సహజమే ఐనా, అవి పరిశ్రమకు కానీ, పత్రికలకు కానీ ఏమీ హానీ చెయ్యవు, తమకే కీడు కలుగుతుంది.

సావిత్రి తార కాక పూర్వం చౌదరి, నిర్మాతలకు చూపించిన అణుకువగా, సృహద్భావం గానీ నేడు లేవు. ఉంటే రేవతి స్టూడియోలో తన మోటారు టైర్లు కోసి వేసే ఆగత్యం ఎందుకతు పట్టింది? జి. వరలక్ష్మి చెయ్యి చేసుకునే అవకాసం ఎందుకు కలిగింది? పైకి రావటంలో ఎంత కష్టం ఉందో, వచ్చిన తర్వాత ఆ స్దానం నిలుపుకోవటంలో కూడా అంత కష్టం ఉంది. అందేవరకూ కాళ్లూ, అందిన తర్వాత జుట్టూ పట్టుకునే స్వభావం మంచిది కాదు.

నేటి సినిమా పరిశ్రమ, వ్యవస్ధలు, పరిస్దిలు ఎలా ఉన్నాయో ఒకసారి సింహావలోకనం చేసుకోవటం చౌదరికి, సావిత్రికి చాలా ముఖ్యం. ఇరవై వేలకి తక్కువ తీసుకుంటే తమ తాహత్తుకు లోటు కావచ్చు. నిర్మాత క్షేమం మీ క్షేమం అనీ, చిత్రం విజయమే మీ విజయమనీ, పరిశ్రమ మనుగడే మీ పురోగమనమనీ గ్రహించాలి.

లక్ష రూపాయలు తీసుకునే బెంగాల్ కోకిల కన్నాల్ బాల కాంట్రాక్టులు లేక గత సంవత్సరంలో ఐదు వేల రూపాయిలిచ్చే నిర్మాత ఉన్నాడా అని అలమటించింది. ఆర్టిస్టుగా సావిత్రికి ఇంకా ఎంతో అనుభవం రావాలి. ఒక్కోసారి రేటు ఇరవై వేలకి పెంచి, నిర్మాతని ఆర్దిక సమస్యల్లో పెట్టి ఉభయులూ దెబ్బ తినటం కన్నా, ఇద్దరికీ కష్టం లేని సామాన్య ప్రతిఫలంతో క్రమంగా ముందుకు రావటం మంచిది కానీ, ఒక్కసారి మీదకు ఎగిరి క్రిదకి పడి పోవటం అటు పరిశ్రమకూ ఇటు ఆర్టిస్ట్ కు క్షేమం కాదు.

నూతనంగా తారాపధానికి వచ్చే తారలంతా పై అంశాలని గమనించాలి. పరిశ్రమలో కాలు పెట్టినప్పుడు పడిన కష్టాలని విస్మరించి, పరిశ్రమకే 'డిక్టేటర్లు' గా మారి కూర్చోకూడదు.

Sunday, July 2, 2017

ఉడుతా భక్తి !

ఉడుతా భక్తి !

.

ఉడుతా భక్తి అంటే తనకు చేతనైన చిన్న సహాయమైనా చేయడం.సేవాభావంతో చేసే చాలా చిన్న సహాయాన్ని ఉడుతాభక్తి అంటారు.ఈ ఉడుతాభక్తిని ఉదాహరణగా ఓ కథ చెబుతుంటారు.

.

నాడు త్రేతాయుగములో సీతామహాలక్ష్మిని రావణుని చెరనుంచి విడిపించడానికై లంకానగరంపై దాడి చేయడానికి పూనుకొని శ్రీరామచంద్రుడు తనూ తన వానర సైన్యం లంకకు

వెళ్ళడానికి వీలుగా సముద్రంలో నీళుని సహాయంతో సేతువును నిర్మించదలచాడు.నీళుని సహాయం ఎందుకు రాముడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే నీళుడు సముద్రంలో

ఏమి వేసినా అది మునిగిపోదు గనుక .

విశ్వకర్మ కొడుకైన నళునికి శిల్పవిద్యలో మేటి అయిన అతని తండ్రి ద్వారా గొప్పవరం పొంది ఉన్నాడు.నళుడు కూడా శిల్ప విద్యలో తండ్రికి సమానుడు.రాముడు సెలవివ్వగా పర్వతాలవంటి వానరవీరులు వేలూ లక్షలూ వెళ్ళి అనేక రకాల చెట్లూ,పర్వతాలూ బద్దలుకొట్టి ఏనుగులంత బండరాళ్ళూ తెచ్చి సముద్రంలో వేస్తున్నారు.

భారీ శరీరాలతో ఉన్న వానరవీరుల మధ్యలో ఓ చిన్న ఉడుతకూడా తనూ సేతువు నిర్మాణంలో భాగస్వామి కాదలచింది.అనుకున్నదే

తడవుగా తను ఇసుకలో పొర్లాడి తన శరీరానికి అంటిన ఇసుకను వానరవీరులేస్తున్న పర్వతాల్లాంటి బండరాళ్ళ మధ్యలో కెళ్ళి అక్కడ విదిలించసాగింది

.శ్రీరాముడిది గమనించి ఉడుతను తన చేతిలోకి తీసుకుని ప్రేమతో దాని వెన్ను నిమిరాడు.అందుకే ఉడుతకు వీపుమీద చారలు అప్పటినుంచి ఏర్పడ్డాయంటారు.

Saturday, July 1, 2017

పోతన గారి నారదుడు !- (తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)

పోతన గారి నారదుడు !-

(తెలుగు భాగవతం -ప్రధమ స్కంధము.)

.

క.

"వాయించు వీణ నెప్పుడు 

మ్రోయించు ముకుందగీతములు జగములకుం

జేయించుఁ జెవుల పండువు 

మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే!

భావము:

“ నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. 

ఆయనకు ఆయనే సాటి.”