ఉషా పరిణయం!

ఉషా పరిణయం!

పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. 

బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. . ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. “వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు” అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు “నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను” అన్నాడు. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.

.

ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. ఈవిధంగా శంకరుడు కోటబయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి “శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతొ యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది” అని కోరాడు.

అప్పుడు శంకరుడు “నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు. 

ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఎ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది” అని అడిగింది. అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. 

అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు” అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది.

అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ “ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.” అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. 

బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. 

చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది.

ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. 

ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. 

ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారి నందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. 

ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది” అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది” అని అన్నాడు.

తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. 

శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. 

వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. 

బాణాసురునకు ఉన్న బాహువులలో 996 బాహువులను సుదర్శన చక్రధారల చేత తెంచేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. .

ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యప్పుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. 

బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!