ఋతుసంహారం -కాళిదాసు!

ఋతుసంహారం -కాళిదాసు!

.

చెట్లు పువ్వుల్తోనూ, సరస్సుల్లో నీళ్ళు తామరపువ్వుల్తోనూ నిండి ఉన్నాయి. స్త్రీలు కోర్కెలతో నిండి ఉన్నారు. గాలిలో సుగంధం నిండి ఉంది. సుఖవంతమైన సాయంత్రాలూ, రమ్యమైన పగళ్ళూ.. ఓ ప్రియా! వసంతం చాలా అందంగా ఉంది.

.

.

మదవతుల కళ్ళల్లో చంచలతగా, బుగ్గల్లో తెల్లదనంగా, పాలిండ్లలో గట్టితనంగా, నడుములో సన్నదనంగా, పిరుదుల్లో పెరుగుదలగా .. ఇలా స్త్రీలలో రకరకాల రూపాల్లో మన్మధుడు వచ్చికూర్చున్నాడు

ఇలాంటి పరిసరాల్లో కాళిదాసు వెన్నెల్లో మేడలు కట్టాడు, మామిడిచెట్లు వేసాడు, దిగుడుబావి తవ్వించాడు, తన పరివారాన్ని తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి అలంకరణలు చేసాడు. పుష్కలంగా మదిర సరఫరా చేసాడు.

.

(ఇంటి సందుల్లో) కొద్దిగా మిగిలిపోయిన మంచువల్ల ఇళ్ళల్లో ఇంకా చలిగా ఉంది. అందుకే బయట దిగుడు బావుల్లోకి దిగారు కొందరు. జలక్రీడలాడుతున్నారు. ఆడవాళ్ళ తలనిండా ఘుమఘుమలాడే సంపెంగపూలూ, స్తనాలమీద మనోహరమైన పూలహారాలు, నడుముకు మణుల్తోచేసిన వడ్డాణాలు ..అందరూ మొలలోతునీళ్ళల్లో ఉన్నారు.. అందువల్ల ఆతర్వాత ఇంకేమీ కనిపించటల్లేదు కాళిదాసుకి. నీళ్ళమీద తేల్తూ మామిడి పువ్వులు, గట్టుమీద విరబూసిన చెట్లు మాత్రమే కనుపిస్తున్నాయి..

.

నిద్రలేకపోవడంవల్ల వాళ్ళ ఒంట్లో అంగాలు స్వాధీనంలో లేవు. పుచ్చుకున్న మదిర వల్ల వాళ్ళ మాటలు నెమ్మదైపోతున్నాయి. కనుబొమలు, చూపులూ వంకరలు పోతున్నాయి. స్త్రీలల్లో కామం పెరుగుతోంది.

వాళ్ళ మాటలు, వడ్డాణాల సవ్వడులూ, నీటి గలగలలూ వాల్మీకి నేపధ్య సంగీతానికి తోడై ఒక గొప్ప వసంతగీతాన్ని సృష్టిస్తున్నాయి.

తమ ప్రియులు రాకపోవడంవల్ల కొందరు బయటే ఉండిపోయారు. వాళ్ళా బావిచుట్టూ ఉన్న వనంలో తిరుగుతున్నారు. ఎర్రనిపూలని చూసినకొద్దీ వాళ్ళలో కోపం పెరిగి దుఃఖంగా మారిపోతోంది.

నిరీక్ష్యమాణా నవయౌవనానాం!

.

ప్రియులకోసం ఎదురుచూస్తున్న ఆ తరుణులకి పైనుంచి క్రిందదాకా పగడాలు కట్టినట్టు (పగడపుటెరుపు రంగులో) పూసిన అశోకచెట్టుని చూడగానే గుండెల్లోంచి శోకం ఉబికివస్తోంది.

అంత చల్లని గాలులు వీస్తున్నా, విరహంతో వాళ్ళకి చెమటలు పడుతున్నాయి.

.

దట్టమైన ఆ చెట్లగుంపుల మధ్యలో, చెమటలు పట్టిన వాళ్ల తామరపువ్వుల్లాంటి ముఖాలు చూస్తూంటే, రత్నాలగుంపులో పరుచుకుని పాకుతున్న ముత్యాల్లా అనిపిస్తున్నాయి.

కొందరు మామిడిచెట్లవంక చూస్తూ పాతజ్‌ నాపకాల్తో బాధ పడుతున్నారు. ఆ చెట్లకొమ్మలు ఊగినప్పుడల్లా వాళ్ళ మనసులుకూడా ఊగిపోతున్నాయి.

బావిలో దిగినవాళ్ళు బయటకి వచ్చారు.

.

ఆడవాళ్ళు ఎర్రపువ్వుల రంగుల్తో ఉన్న పట్టుబట్టల్ని తమ గుండ్రని పిరుదుల చుట్టూ కట్టుకున్నారు. స్తనాలమీద కుంకుమరంగు వస్త్రాల్ని కప్పుకుంటున్నారు.

కొత్త కొండగోగుపూలని చెవులకి ఆభరణాలుగా పెట్టుకున్నారు. ఉంగరాలు తిరిగి ఊగుతున్న నల్లని కురుల్లో ఎర్రని అశోకపువ్వుల కేసరాల్నీ, విచ్చుకున్న మల్లెపూలనీ పెట్టుకుని బయల్దేరారంతా. అంతా బాగా తాగి ఉన్నారు, దానికితోడు గాలిలో కూడా తేనెలవాసనలు గుబాళిస్తున్నాయి.

రంగురంగుల పుప్పొడి గాల్లో ఎగురుతోంది. అది ఒక చెట్టుమీదనుంచి మరొకదానికి ఎగురుతూంటే, ఆ చెట్లు కావాలని ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నట్లుంది. ఆ రంగుల్లో తుమ్మెదల రొద ఆ కార్యక్రమానికి సంగీతంలా అమరింది. పూలగుత్తులు రాళ్లమీద రాలి పడుతున్నాయి. కాముకుల సుఖంకోసం పూలపరుపులు పరుస్తున్నాయి. కొండచరియల్లో, చెట్లకింద.. ఎక్కడ చూసినా రంగురంగుల పరుపులు. చుట్టూ కన్నెలేళ్ళు, చక్రవాకాలు, నీటికోళ్ళు, కొంచపిట్టలు అటూఇటూ తిరుగుతున్నాయి

ఆ పరుపులమీద చెట్లనీడల్లో, మన కాళిదాసు తీసుకొచ్చిన కాముకులు పడుకుని దొర్లుతున్నారు.

వాళ్ళు సురతాల్ని గురించి మాట్లాడుకుంటున్నారు. చెట్లపైనుంచి సూదైన మామిడిపువ్వుల బాణాలు వేస్తూ వసంతుడు వాళ్ళ మనసుల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని వింటితాడు తుమ్మెదల బారుతో చేయబడి ఉంది.

ఇలా ఈ చెట్లకింద పగలు చల్లగా, రాత్రుళ్ళు వెన్నెల్లో.. మరీవేడిగా ఉంటే మేడల్లో .. మేడల్లో మరీ చలివేస్తే ఒకళ్ళ కౌగిళ్ళలో ఒకళ్ళూ….

.

ఇంతకాలం చలిగా ఉందని లావు లావు బట్టలు వేసుకున్నారు. వసంతకాలం రాగానే వాటిని పారేసి, లక్కతో రంగు వేసి అగరు ధూపం వేసిన బట్టల్ని కామంతో అలిసిపోయిన ఒళ్ళకి చుట్టుకుంటున్నారు

కాళిదాసు పరివారం వసంతుడికి స్వాగతమిస్తున్నారు.

మోదుగుచెట్లు విరగబూసి ఊగుతూంటే విరహపుమంటలు రేగుతున్నాయి వాళ్ళలో. ఆ చెట్లగుంపుల్తో చూస్తూంటే ప్రకృతి కాంత ఎర్రచీర కట్టుకున్న క్రొత్తపెళ్ళికూతుర్లా ఉంది. కోకిలలు పాడుతున్నాయి, తుమ్మెదలు మేళాలు కడుతున్నాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!