గజేంద్ర మోక్షం..... (పోతన).

గజేంద్ర మోక్షం..... (పోతన).

.

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. 

“గజ” అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే “జగ” అవుతుంది. “జ” అంటే “జాయతే”. “గ” అంటే “గచ్ఛతే”. “జాయతే” అంటే వెళ్ళిపోవడం. “గచ్ఛతే” అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని “జగము” అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.

గజేంద్రుని ప్రార్ధన !

.

పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది. 

.

"ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!” అని స్తోత్రం చేస్తోంది. 

ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. 

.

"లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం

జీకఁటి కవ్వల నెవ్వఁడు -

నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!

.

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.

ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే వుండి. అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవరూ చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!”

ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది 

.

"కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం

గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!

.

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. 

నిజంగా దీనులయిన వారు పిలుస్తే వస్తాడా? 

అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలడు కలండనెడివాడు కలడో లేడో! అంది. 

ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. 

.

"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!

.

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. .⁠⁠⁠⁠

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!