నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం!

నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం!

రచన: భైరవభట్ల కామేశ్వరరావుగారు.

ఉ. 

శ్రీయన గౌరినా బరగు చెల్వకు జిత్తము పల్లవింప భ

ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూ

పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక

ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

.

తిక్కన ‘కొలిచినది’ ఎవరిని? పరతత్త్వాన్నా? హరిహర రూపాన్నా? పరతత్త్వాన్ని ‘కొలవడ’మేమిటి? హరిహర రూపాన్నే అయితే, ‘పరతత్త్వము గొల్చెద’ అని ఎందుకన్నాడు? ‘శ్రీయన గౌరినా బరగు చెల్వ’ – ఇక్కడ, ఒకే మూర్తి శ్రీ గౌరులనే రెండు రూపాలుగా గుర్తింపబడిందా, లేక శ్రీ గౌరులిద్దరు ఒక రూపంగా ఏర్పడ్డారా? ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘హరిహరంబగు రూపము దాల్చి’ – హరిహరంబగు రూపమంటే, హరి, హరుడు అనే రెండు రూపాలా? హరిహరనాథుని ఏక రూపమా? హరి, హరుడు అనే యిద్దరు హరిహరంబగు రూపాన్ని దాల్చారా? లేక ఒకే తత్త్వమైన హరిహరనాథుడు హరి హరులనే రెండు రూపాలను ధరించారా? మళ్ళీ అదే ప్రశ్న. ఒకరు ఇద్దరయ్యారా, ఇద్దరు ఒకరయ్యారా? ‘చెల్వ’ అనే పదాన్నే ఎందుకు ప్రయోగించాడు? ‘భక్త జనాని’కీ, ‘వైదికధ్యాయిత’కూ మధ్య లంకె ఏమిటి?

పద్యాన్ని జాగ్రత్తగా మళ్ళా మళ్ళా చదువుతూ పోతే వీటికి జవాబులు సులువుగానే స్ఫురిస్తాయి. ఆ జవాబుల వెనుక కొత్త అర్థాలు ధ్వనిస్తాయి. చివరగా, తిక్కన గడుసుదనాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేను. శైవవైష్ణవ మతాల మధ్య సమభావం కోసం తిక్కన హరిహరనాథుని ఆరాధన ప్రచారం చేశాడని పండితులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమే కావచ్చు. కాని తిక్కన మత ప్రచారకుడు కాదు, కవి. తిక్కన గడుసుదనమంతా, తాను ప్రచారం చేయాలనుకున్న హరిహరనాథ స్వరూపాన్ని, ఆ హరిహరులే స్వయంగా ధరించారనట్టుగా చెప్పడంలో ఉంది!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!