Monday, March 31, 2014

మతం....... అధికారం.

మతం....... అధికారం..@ Pothu Raju Perikala

మతం అధికారం లో వున్నప్పుడు , అది స్వేచ్చా జీవులను హిమ్చించిన్ది.వారి నోళ్ళు నొక్కింది ,ఏ పిడి వాదము కూడా , ఈ దేశం లో శాఖా భేదాన్ని సైతం సహించిన దాకలాలు లేవు .

అధికారం మతాన్ని ఆశ్రయించిన చారిత్రిక దశలో దౌస్త్యాలు చేయించింది మతం , చేచింది మతం అదుపాజ్ఞలలో వున్న అధికారం .. ఇది వాస్తవం .

అధికారం తనంతట తాను , ఎలాటి శిక్షలను అమలు చేయదు -- దానికి మత ఆమోద ముద్ర కావాలి -- మతం చెప్పిన తీర్పు అధికారానికి శిక్షను వేచే శక్తిని ఇస్తుంది .

సామాన్య జనాల నోళ్ళు దైవ భయం తో కుట్టేస్తుంది ....

గత చరిత్ర , వర్తమానం మనకు కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న సత్యం ఇదే ...

--అందు వల్ల దౌష్ట్యం చేపించే మత తత్త్వం పోవాలి ... మతాన్ని అడ్డు పెట్టుకుని ద్రోహాలు చేచే అధికార తత్వమూ పోవాలి ..

అంటే సిద్ధాంతాలు విసృతం కావాలి ..పాత దురభిప్రాయాలను నిర్ములిన్చుకుంటూ , సంఘ సిద్ధాంతాలతో ముందుకు కదలాలి ,,

Sunday, March 30, 2014

మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు..

వింజమూరి వారి వ్యాఖ్య ....మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు..

Vvs Sarma గారి వ్యాఖ్య ..

ద్రోణుడు ఏకలవ్యుడు - వీరిని గురించి వింజమూరి వారి వ్యాఖ్య 

మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు.. 

లోనే వక్ర భాష్యము ఉన్నది. ద్రోణుడు మంచి గురువా? ఎవరికి? అర్జునునికా? ఏకలవ్యునికా? ద్రోణుడి విలువిద్యా ప్రావీణ్యత గురించి ఎవరికీ అనుమానంలేదు. అర్జునునికి విలువిద్య నేర్పడమే కాక అతనిని మించినవాడు ఉండడని మాట ఇచ్చాడు. ఏకలవ్యుడు ద్రోణునే గురువుగా ఆరాధించి స్వయంకృషితో విలు విద్య నేర్చుకుని, తన విద్యను తాను ఆరాధించిన ద్రోణునికి ప్రదర్శించాడు. అంటే ఏకలవ్యుడు ఉత్తమ శిష్యుడు. ద్రోణుడు అతనికి మంచిగురువు కాలేక పోయాడు. అర్జునుని మించిన విలుకాడు తన యెదుటనే ఉన్నాడు. ఇది సహించలేక ద్రోణుడు నీచమైన అధర్మము చేశాడు. గురుదక్షిణగా అతని విద్యనే పరోక్షంగా కోరాడు. ఇంద్రుడు కర్ణునివద్ద కవచ కుండలములు దానం కోరినట్లే. ఇక్కడ కులాల ప్రసక్తి లేదు. శ్రీకృష్ణుని కథలో ఆయన అనేకులకు అనుగ్రహం చూపాడు. వారిలో బ్రాహ్మణుల సంఖ్య అతి తక్కువ. నాదృష్టిలో ఆకాలపు బ్రాహ్మణులు శ్రీకృష్ణావతారము వలన ప్రయోజనం పొందలేదు.

ఏకలవ్యుడు, శంబూకుడు, బలి చక్రవర్తి మొదలైన కథలను ఆధునికులు చర్చించ వలసినదే. ఏకలవ్యుని వృత్తాంతములో ద్రోణుడు ధర్మాన్ని నిలబెట్టాడడని అనడం సరికాదు. ద్రోణుడు భ్రష్ట బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధర్మాన్ని వదలి క్షాత్రాన్ని స్వీకరించాడు. అధర్మపరుల కొలువులో తనది కాని వృత్తిని స్వీకరించాడు. సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నోరుమెదపలేదు. పైగా అధర్మ పక్షాన సైన్యాధిపతి అయ్యాడు. క్షమాగుణం లేకుండా ద్రుపదుని పై పగ సాధించాడు. ఆయన కుమారుడు అశ్వత్థామ కూడా దుర్యోధనుని సంతోషపెట్టాలని నిద్రపోతున్న వారిని సంహరించాడు. ఇక్కడ కుల ప్రసక్తిలేదు. కేవలము ఇప్పటి వంటి రాజకీయాలే. స్వార్థపరత్వమే.ఆధునిక మానవుని వంటి బలహీనతలే. అవసరమైనప్పుడు బ్రాహ్మణుడు ధర్మ వ్యాధుని వద్ద ధర్మము నేర్చుకొనవలసి వచ్చినది. భీముడు హిడింబను వివాహము చేసుకోవడానికి ఎవరూ అడ్డుచెప్పలేదు. — with Vvs Sarma.


అందరికీ "జయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! జయీభవ!

అందరికీ "జయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! జయీభవ!

క్రొత్తదనాలు పూవులయి గుత్తులుగట్టి యుగాది పందిటన్

మత్తిలి నృత్తమాడినవి, మామిడికొమ్మలు కొత్తగా చివు

ళ్ళెత్తి సుమించి కాచి ఫలియించెను, తీయని క్రొత్త కోరికల్

మెత్తని మన్మనః పథముమీది పదమ్ముల నూని సాగినన్

అని దాశరథివంటి నవకవి పులకించి పాడతాడు. దాశరథికి పూవులన్నిటిలోనూ మోదుగపూలంటే యిష్టం. "పల్లెపడుచు కచమ్ముల నుల్లసిల్లు మోదుగను మించినట్టి పువ్వేది జగతి!" అంటారాయన. అంతే కాదు,

కోట్ల చిలుక ముక్కు లిట్లేకమైనట్లు

కింశుకమ్ము లందగించె నేడు

పేదవాని మదిని పెకలివచ్చిన ఆశ

అరుణతరుణ మగుచు విరిసె ననగ

అని కూడా అంటారు. కోట్ల చిలుకల ముక్కులు ఒక్కదగ్గర చేరినట్లు ఉన్నాయట ఆ కింశుకాలు. అక్కడితో ఆగిపోతే అది దాశరథి కవిత్వం అవ్వదు. విరగపూచిన ఆ మోదుగపూలు, పేదవాని మదిలోని ఆశ పైకి పెకలివచ్చిన తొలిసంధ్య వెలుగులా ఉన్నాయనడం ఆయనకే చెల్లింది! పేదతనమనే చీకటి పూర్తిగా తొలగిపోయే కొత్త ఉషస్సునీ ఉగాదినీ ఆకాంక్షిస్తాడు అభ్యుదయ కవి. అతని దృష్టిలో వసంతవిజయమంటే అదీ.

ఏ పేరుతో వచ్చినా క్రొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించాలని దాశరథి నిష్కర్షగా అంటారు. "విజయ" అనే మంచి పేరుతో వచ్చిన యీ కొత్త సంవత్సరం కొత్త మంచిని తెస్తుందని ఆశిస్తూ దాన్ని స్వాగతిద్దాం. మంచిచెడుల సరిహద్దులు చెరిగిపోయిన యీ కాలంలో ఎవరు ఎవరిని జయించాలని కోరుకుంటాం? ఈ కాలంలో మనకు బాగా తెలిసిన Win-Win situation అనే పదబంధ స్ఫూర్తితో, అందరికీ విజయం చేకూరాలనీ, ఎవరికివారు తమలోని చెడుపైన విజయం సాధించాలనీ కోరుకుందాం, ప్రయత్నిద్దాం.

అందరికీ "జయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! జయీభవ!

" నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు "

" నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు "

.

పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట. 

పోతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - 

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. 

మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో...


ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో...

-

మన పెద్దాలు భార్యాభర్త లా సంసారా భధ్యత లు ను జొడెడ్ల బండి తో పోల్చరూ

.....ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ....ఒకరి కి ఒకరు కట్టి కాలే వరకు ....వెనుక ముందు అంతే ...పాలు నుండీ పెరుగు తరువాత మజ్జిక ,వెన్న నుండి నేయి....మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది నిశితముగా పరిశీలిస్తే .. ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లరి గొరువెచ్చని .... పాలు లాంటి మగని కి తోడు అంటు మజ్జిక మగువ ను చేరిస్తే చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిక ,వెన్న అనబడే చిట్టి పిల్లాలు ,సిరి సంపదలు .ఆ అలు మగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి వారి ఆ నేతి తో పిల్లాలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది .....కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి ఎగసి పోతారూ.....చూసారా...తరిచి..తెరచి చూస్తే ....జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో.....కదా !

Saturday, March 29, 2014

'జనాంతిక..

శ్రీ మునిమాణిక్యం వారితో'జనాంతిక..(@ Sastry Tvs)


అసలు ముందు 'జనాంతికం' అంటే చెప్పాలి కదా! ప్రాచీన నాటకాలకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులూ ఉన్నాయి.అవి,నాందీ ,ప్రస్తావన,జనాంతికం--- ఇలాంటివి కొన్ని ఉన్నాయి.ఆ రోజుల్లో రంగస్థలం మీద కొన్ని దృశ్యాలను ప్రదర్శించేవారు కాదు.ఉదాహరణకు --దహన సంస్కారాలు లాంటివి.మరికొన్నిటిని ప్రదర్శించటం కష్టం.కానీ,వాటి సంగతులు ప్రేక్షకులకు తెలియటం చాలా అవసరం.ఉదాహరణకు,సీతమ్మను రావణుడు ఆకాశ మార్గాన తీసుకొని వెళ్ళుతుంటాడు.జటాయువు అడ్డగించి భీకరపోరు చేస్తాడు.ఆఖరికి ఆ పక్షీంద్రుడు రెక్కలు తెగి భూమిమీద పడతాడు.ఈ దృశ్యం అంతా ప్రేక్షకులకు తెలియచేయవలసినదే! కానీ,రంగస్థలంమీద ఎలా ప్రదర్శించగలరు?అటువంటి సమయంలో,నాటక సూత్రధారులు,ఇద్దరు హాస్య పాత్రధారులను రంగస్థలంపైకి ప్రవేశపెట్టి వారితో గ్రామ్యభాషలో కొద్దిగా హాస్య సంభాషణలతో, ఇలా చెప్పిస్తారు. 

మొదటి పాత్ర-అరే! బావ ఏందిరా అది,ఆకాశంలో పెద్ద శబ్దం వినిపిస్తుంది.

రెండవ పాత్ర--ఏమీ లేదురా,నీకు ఈ మధ్య మీ ఆవిడ దెబ్బలకు ఏది విన్నా పెద్ద శబ్దంలాగే వినిపిస్తుంది.

మొదటి పాత్ర--అక్కడికేదో,నీ భార్య పెద్ద పతివ్రత అయినట్లు.

రెండవ పాత్ర --అది సరేలేరా! నీవన్నట్లు నాకూ భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి.

మొదటి పాత్ర --అదిగోరా! ఆమె ఏడుస్తూ చెబుతుంది,"నేను దశరధ మహారాజు కోడలిని,శ్రీ రామచంద్ర ప్రభువు భార్యను.నా పేరు సీత.భర్త లేని వేళ చూసి ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని వెళ్ళుతున్నాడు.ఎవరైనా కాపాడండి"అని.

రెండవ పాత్ర -అవును నిజమేరా! బామ్మర్ది! నాకూ అవే మాటలు వినపడుతున్నాయి.

మొదటి పాత్ర --భూమిమీద అయితే వాడిని తన్ని సీతమ్మను కాపాడేవాడిని.మరి వాడు ఆకాశంలో వెళ్ళుతున్నాడు.

రెండవ పాత్ర -ఏడిసావులే! మీ ఆవిడ తన్నులకే తట్టుకోలేని వెధవవు,వాడిని నీవేమి చేస్తావు?

మొదటి పాత్ర --ఎవరో వచ్చి పోరాడుతున్నారురా, చూడు!

రెండవ పాత్ర --ఆయన ఒక పక్షి, ఆయన పేరు జటాయువట.ఆయన్ని ఆయనే పరిచయం చేసుకున్నాడు.

మొదటి పాత్ర --ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడురా! మనం ఉన్నాం దేనికి?

రెండవ పాత్ర --అరెరే! ఎంత ఘోరం, పక్షిరాజు నేలకొరిగాడు,సీతమ్మను,రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళాడు.

ఈ విధంగా ఆకాశంలో జరిగిన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వినిపించటం ఒక ప్రక్రియ.అంతటితో ఆ పాత్రలు నిష్క్రమిస్తాయి.నాటకరంగంలో కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఉన్న గొప్ప ప్రయోగం ఇది.దీనిని బట్టి ఊహించుకొండీ, మన నాటకరంగం వెనకపడిందా లేక ముందు కెళ్ళుతుందా, లేక కొన ఊపిరితో ఉందా! అని.ఈ ప్రక్రియకు ఒక ప్రత్యేకమైన పేరు వుంది. అలాగే మరొక ప్రక్రియ ఉంది.దాని పేరు 'జనాంతికం'. ఉదాహరణకు,రంగస్థలం మీద పలుపాత్రలు ఉన్నాయనుకోండీ,ఒక పాత్రధారి మరో పాత్రధారితో రహస్యంగా ఏదో ఒక విషయం చెప్పవలసి వస్తుంది.అటువంటి సందర్భంలో,వారు మాట్లాడుకునే మాటలు వెనకనున్న పాత్రలకు వినపడకూడదు,అవి రహస్యాలు కనుక.మరి ప్రేక్షకులకు తెలియాలి ఆ రహస్యాలు.ఆ సందర్భంలో ఆ పాత్ర ధారులు రంగంస్థలం ముందుకు వచ్చి ఒక పాత్రధారి చెవివద్ద మరో పాత్రధారి చేయిపెట్టి మాట్లాడుతాడు.దానిని ప్రేక్షకులు వింటారు. వెనకునున్న పాత్రలకు వినబడనట్లు సంకేతంగా ముందుకు వచ్చి చెవివద్ద చేయి పెట్టి మాట్లాడటం,మరో గొప్ప ప్రయోగం.దీనినే'జనాంతికం' అని అంటారు.ఒక విధంగా రహస్యంగా మాట్లాడటానికి'జనాంతికం'గా అనటం ఒక జాతీయం కూడా అయింది.నా చిన్నప్పుడు రేడియోలో శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు'జానకితో జనాంతికం'అనే ప్రసంగం చేసారు. ఆకాశవాణి వారు చాలా శ్రీ రామనవముల సందర్భంలో దాన్ని ప్రసారం చేసేవారు.నేటికీ నాకు గుర్తుంది.అది విన్నంత సేపూ నా కళ్ళు నా మాట వినేవికావు.అంత బాగుండేది అది.అన్నిటినీ మించి దువ్వూరి వారి గొంతు కమనీయంగా ఉండేది. వారు చెప్పే విధానం అతి మధురంగా ఉండేది.ఆకాశవాణి వారు ఇటువంటివి వెలికి తీసి సి.డీ లుగా విడుదల చేస్తారేమోనని నా ఆశ! మరి మన ప్రభుత్వం వారు చేసే పనులు ఎలా ఉంటాయంటే, విజయవాడ కేంద్రానికి మళయాళీని డైరెక్టర్ గా, హైదరాబాద్ కేంద్రానికి బెంగాలీ వాడిని డైరెక్టర్ గా నియమిస్తారు. బహుశా:జాతి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని అలా చేస్తారేమో!'

Thursday, March 20, 2014

"అమవస నిశి"

(తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం)

కలనాటి ధనము లక్కర

గలనాటికి దాచ కమల గర్భుని వశమా

నెల నడిమి నాటి వెన్నెల

యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

Wednesday, March 19, 2014

ఘటన (భర్తృహరి సుభాషితం)

ఘటన (భర్తృహరి సుభాషితం)

కొందరు ప్రతిభ లేకుండానే రాణిస్తారు. కొందరు ప్రతిభకు మించి ప్రకాశించుతారు. కొందరు అప్రతిహతమైన ప్రతిభ కలిగి కూడా విధి అన్న అగ్నికి ఆహుతియైపోతారు.భర్తృహరి ఈ విషయాన్ని బహు చక్కగా వివరించినాడు. గమనించండి .

సంతప్తాయసి సంస్తితస్య పయసో నామాపి న శ్రూయతే

ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితందృశ్యతే

అంతస్సాగర శుక్తిమధ్య పతితం తన్మౌక్తికం జాయతే

ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషా మేవంవిదా వృత్తయః

దీనికి ఏంగు లక్ష్మణకవి వారి తెలుగు సేత

నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా

నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై దనర్చు నా

నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచితప్రభన్

పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్

Tuesday, March 18, 2014

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలము" నుండి వినాయక ప్రార్థన

జనని స్తన్యముఁ గ్రోలుచుం జరణ కంజాతంబునం గింకిణీ

స్వన మింపారఁగఁ దల్లి మేన మృదుల స్పర్శంబుగాఁ దొండ మ

ల్లన యాడించుచుఁ జొక్కు విఘ్నపతి యుల్లసంబుతో మంత్రి వె

న్ననికిన్ మన్నన సొంపు మీఱ నొసఁగున్ భద్రంబు లెల్లప్పుడున్

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలము" నుండి వినాయక ప్రార్థన

తల్లి పాలు త్రాగుచూ పాదపద్మములకు కట్టిన గజ్జెల మ్రోత ఆహ్లాదాన్ని గొలుపుతుండగా, తనతల్లి శరీరాన్ని మృదువుగా నిమురుతూ ఆనందించు విఘ్నపతి (వినాయకుడు ) మంత్రి వెన్ననికి భద్రము కల్పించుగాక ఈపద్యంలో సాధారణంగా తల్లి పాలుత్రాగే పిల్లలచేష్టలు మనంచూడవచ్చు. పాలుత్రాగుతు కాళ్లు ఆడించటం, చెతులతొ ఒళ్లుతడమటం అనేవి చిన్నపిల్లల చేష్టలు. అవే గణపతికి ఆపాదించి వర్ణించాడు కవి

Monday, March 17, 2014

ఆట గదరా నీకు అమ్మ తోడు

ఆట గదరా నీకు అమ్మ తోడుఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గదరా నీకు అమ్మతోడు

ఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గద జననాలు ఆట గద మరణాలు

మధ్యలో ప్రణయాలు ఆట నీకు

ఆట గద సొంతాలు ఆట గద పంతాలు

ఆట గద సొంతాలు ఆట గద పంతాలు

ఆట గద అంతాలు ఆట నీకు


ఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గదరా నీకు అమ్మతోడు

ఆట గదరా శివా ఆట గద కేశవ


ఆట గదరా నలుపు ఆట గదరా తెలుపు

నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు

ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను

ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను

మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను


ఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గదరా శివా ఆట గద కేశవ

ఆట గదరా నీకు అమ్మతోడు

ఆట గదరా శివా ఆట గద కేశవ

Sunday, March 16, 2014

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు - టీవీయస్.శాస్త్రి

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు - టీవీయస్.శాస్త్రి

amarajeevi shri Potti Sreeramulu

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీ రాములు. అంతకు ముందు శ్రీ స్వామి సీతారం 38 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలోనే విరమించారు. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం చాలా బాధాకరమైనది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు.


శ్రీ పొట్టి శ్రీ రాములు గారు,19 -10 -1952 న,మైలాపూరు,మద్రాసు లోని,స్వాతంత్ర్య సమరుడు శ్రీ బులుసు సాంబ మూర్తి గారి గృహంలో నిరసన వ్రతం ప్రారంభించారు.58 రోజులు తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించి,చివరకు, 16-12-1952 న అమరజీవి అయ్యాడు.ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఉద్యమం 1910 లోనే ప్రారంభం అయింది.1913 లోనే,ప్రధమ ఆంద్ర మహాసభలు బాపట్లలో నిర్వహించారు.ఈ ఉద్యమంలో శ్రీ న్యాపతి సుబ్బారావు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు, కొండా వెంకటప్పయ్య,శ్రీ స్వామీ సీతారాం  మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా మహాత్మాగాంధీని కూడా కలుసుకొని ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను గూర్చి వివరించి నప్పుడు స్వాతంత్ర్య అనంతరం ఈ సమస్యకు పరిష్కారం చూడగలమని హామీ ఇచ్చారు. ఈ ధ్యేయానికి సరైన పరిష్కారం దొరక్క పొట్టి శ్రీ రాములు గారు నిరవధిక నిరాహార దీక్ష గావించి ఈ ఉద్యమానికి ఆయువుపట్టునిచ్చారు.


శ్రీ రాములు గారు ఎవరెన్నిచెప్పినా, పత్రికల ద్వారా సంపాదకీయాలు రాసినా వాటిని పెడచెవిన పెట్టి దీక్షను కొనసాగించి అమరవీరులైనారు. ప్రజలు రెచ్చిపోయి విశృంఖలంగా అనేక దౌర్జన్యాలకు పూనుకున్నారు. యావత్ ప్రపంచం ఈయన త్యాగాన్నికొనియాడింది.. అప్పటి భారత ప్రధాని జవర్‌హాల్‌ నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయుటకు అంగీకరించి ఆంధ్రులకే కాక తమిళ, కేరళ మరాఠీ, గుజరాతీలకు ప్రత్యేక రాష్ట్రాలు ప్రసాదించారు. శ్రీ పొట్టీ శ్రీ రాములుగారు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామంలో 1901 మార్చి 16వ తేదిన జన్మించారు. మద్రాస్‌లో విద్యాభ్యాసం గావించారు. తర్వాత సానిటరీ ఇంజనీరు విద్య కోసం బాంబే వెళ్ళారు. కొంతకాలం రైల్వే శాఖలో పనిచేశారు. చిన్న వయసులోనే భార్యా వియోగం కలిగింది.


1927లో శ్రీ రాములు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజీ పిలుపు మేరకు జాతీయ ఉద్యమంలో సబర్మతి  ఆశ్రమంలో చేరారు. ఆయన నిరాడంబరతను, మానవ సేవను గుర్తించి గాంధీజీ, "శ్రీ రాములు వంటి పది మంది కార్య ధీక్షాపరులు ఉంటే దేశ స్వరాజ్యం ఒక సంవత్సర కాలంలో సాధించవచ్చని" చెప్పారు. కృష్ణాజిల్లాలోని కొమ్మరవోలు గ్రామం, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో గల గాంధీజీ ఆశ్రమాల్లో శ్రీ రాములు గొప్ప సేవలు అందజేశారు. 1938-42 మధ్యలో దేశ స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించారు.


1944లో నెల్లూరు జిల్లాను కేంద్రంగా చేసుకొని ఖద్దర్ వాడకంపై ప్రచారం చేపట్టారు. 1946లో నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో గల వేణుగోపాలస్వామి దేవాలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరసన వ్రతం చేసి వారికి ఆలయ ప్రవేశం కావించుటలో సఫలీకృతులయ్యారు.చివరి రోజుల్లో చాలా కాలం నెల్లూరు జిల్లాలోని పలుప్రాంతాలలో హరిజనోద్దరణ కోసం పాటు పడ్డారు. ఆయన ఙ్ఞాపకార్ధం హైదరాబాద్ నగరంలో తెలుగు విశ్వవిద్యాలయానికి శ్రీ పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాను 'శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా'గా పేరు మార్చారు. తెలుగు వారి అందరికి స్వరాష్ట్రం ఏర్పాటు చేసిన త్యాగపురుషుడు, శ్రీ రాములు గారి ఆశయాలు, నిరాడంబరత పట్టుదల నేటి యువత నేర్చుకొని, ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు ఆంధ్రులు అందించే నిజమైన నివాళి అవుతోంది!


అమరజీవి త్యాగానికి ఘనమైన నివాళి సమర్పించుకుందాం!

Friday, March 14, 2014

ఆంధ్రకవులు, వారిని ఉచితరీతిని సత్కరించిన మహారాజులు

 కీ.శే.గాడేపల్లి కుక్కుటేశ్వరరావుగారు....

విషయము: ఆంధ్రకవులు, వారిని ఉచితరీతిని సత్కరించిన మహారాజులు 


నన్నయభట్టు లేకున్నచో రాజరాజనరేంద్రుకీర్తి కృష్ణార్పణమ్ము, 

తిక్కయజ్వయలేక తెలుగున మనుమసిద్ధినృపాలుపేరు సోదెకునురాదు,

శ్రీనాధకవిరాజులేక వీరారెడ్డి,అవచితిప్పయ్య,విస్సన్న సున్న, 

అలసానివారులేరా,కృష్ణరాయలప్రతిభకు కపిలదస్త్రాలె దిక్కు,


చచ్చి,దుమ్మైననృపతుల చావనీక

దుమ్ముపైనిన్ని యమృతబిందువులు చల్లి 

తిరిగి బ్రదుకిచ్చి జగతి సుస్థిరులజేసె

సుకవియను మేటియైంద్రజాలికుడొకండు

Wednesday, March 12, 2014

దుష్టసంహార ! నరసింహ దురితదూర !

బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ?

య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?

నాటికిపుడే చేసెద నామభజన

దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను !

భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస !

దుష్టసంహార ! నరసింహ దురితదూర !

స్వామీ చివరి రోజులలో నీ నామస్మరణ చేసుకోగలమో లేమో!ఆ రోజున ఎన్ని అడ్డంకులు వస్తాయో! ఆరోగ్యం సహకరించదు అందుకే ఈ రొజే నీ నమస్మరణ చెసుకుంటాము .చెవినొడ్డి వినవయ్యా !

Tuesday, March 11, 2014

ఇంగిలీషు బుడుగు

ఇంగిలీషు బుడుగు 


(ముళ్ళపూడి వారికి క్షమాపణలతో) 

“ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?”

“నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.”

“అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?”

“యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.”

ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి”

బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది.
“ఏమిటిది ? ఇది స్కూలనుకున్నారా!మీ ఇల్లనుకున్నారా! వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు.
బుడుగు లేచి అన్నాడు.

“సరే!ముందు మీరు మొదలు పెట్టండి”

ఇకనుంచి నేను వారినికోరోజు మౌనవ్రతం పాటించాలని నిర్ణయించుకున్నాను వింటున్నారా?" చెప్పింది భార్య. 
"ఎందుకో?" అడిగాడు భర్త. 
"పుణ్యం కోసం బదులిచ్చింది భార్య" 
"పోనీ.. వారంలో ఏడురోజులూ మౌనవ్రతం పాటిస్తే పుణ్యం మరింత వస్తుందేమో?"
అన్నాడు భర్త వెటకారంగా.

మెడిసిన్ చదువుతున్న సీగాన పెసూనాంబ అనే రెండు జెళ్ళ సీతను వాళ్ళింటి కొచ్చిన ప్రొఫెసర్ అడిగాడు.

“ఎటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏమిటి” అని.

పక్కనున్న బుడుగు వెంటనే జవాబు చెప్పాడు.

“జంబలకడి పంబ”

ప్రొఫెసర్ అర్ధం కాలేదన్నాడు.

“మీరడిగింది నాకూ అంతే”-బుడుగు జవాబు.

బుడుగుని తీసుకుని వాళ్ల నాన్న ఆరోజు జూ పార్క్ కు వెళ్లాడు. బోనులో వున్న పులిని చూపించి అది ఎంత భయంకరమయిన జంతువో కొడుక్కుచెప్పసాగాడు.ఓ కంటితో పులిని చూస్తూ ఓ చెవితో తండ్రి చెబుతున్నది వింటున్న బుడుగు వున్నట్టుండి ఇలా అడిగాడు. “పులి అమాంతం బయటకు వచ్చి నిన్ను తినేసింధనుకో. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను యే బస్సు ఎక్కాలి?”

బుడుగుతో టీచరు చెప్పింది.

“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”

బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.

“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.

మూతిబిగ ింపులు అలకలు పాతపడిన విదయలని

మూతిబిగ ింపులు అలకలు పాతపడిన విదయలని


మగువలెపుడూ మగవార ని చిరునవుుల గెలావాలని 


తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి 

యువకుల శాస ించుటకే 

యువకుల శాస ించుటకే యువతులవతర ించిరని 

తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి 

Monday, March 10, 2014

భాగవతము - రుక్మిణీ కల్యాణము

భాగవతము - రుక్మిణీ కల్యాణము

క. ఆ వనజగర్భు పంపున

రైవతుఁడను రాజు దెచ్చి రామున కిచ్చెన్‌

రేవతి యనియెడు కన్యను

భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియ\న్‌. 1

వ. తదనంతరంబున. 2

మ. ఖగనాథుం డమరేంద్రుఁ గెల్చి సుధ ము\న్‌ గైకొన్న చందంబున\న్‌

జగతీనాథులఁ జైద్య పక్షచరులన్‌ సాళ్వాదులం గెల్చి భ

ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుత\న్‌ రాజీవగంధి\న్‌ రమా

భగవత్యంశభవ\న్‌ మహాగుణమణి\న్‌ బాలామణి\న్‌ రుక్మిణి\న్‌. 3

వ. అనిన రా జిట్లనియె. మున్ను రాక్షస వివాహంబున స్వయంవరంబునకు వచ్చి,

హరి రుక్మిణిం గొనిపోయె నని పలికితివి. కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున

సాళ్వాదులం జయించి, తన పురంబునకుం జనియె? అదియునుం గాక. 4

శా. కల్యాణాత్మక మైన విష్ణుకథ లాకర్ణింపుచు\న్‌ ముక్త వై

కల్యుం డెవ్వఁడు తృప్తు డౌ, నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా

కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే రుక్మిణీ

కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడి\న్‌. 5

క. భూషణములు సెవులకు బుధ

తోషణము లనేక జన్మ దురితౌఘ విని

శ్శోషణములు మంగళతర

ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్‌. 6

వ. అని, రా జడిగిన శుకుం డిట్లనియె. 7

చ. వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం

డను నొక దొడ్డరాజు గలఁ డాతని కేవురు పుత్రు లగ్రజుం

డనఘుఁడు రుక్మి నాఁ బరఁగు నందఱకుం గడగొట్టు చెల్లెలై

మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణి నాఁ బ్రసిద్ధ యై. 8

క. బాలేందు రేఖ దోఁచిన

లాలితయగు నపరదిక్కు లాగున ధరణీ

పాలుని గేహము మెఱసెను

బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచు\న్‌. 9

వ. మఱియును, దినదిన ప్రవర్ధమాన యై. 10

సీ. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు నబలలతోడ వియ్యంబు లందు

గుజ్జనగూళ్లను గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువుమెఱయ

రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁదీఁగెలకును బ్రోదిసేయు

సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు  

తే. బాలికలతోడఁ జెలరేఁగి బంతులాడు

శారికా కీర పంక్తికిఁ జదువుచెప్పు

బర్హిసంఘములకు మురిపములు గఱపు

మదమరాళంబులకుఁ జూపు మందగతులు. 11

వ. అంత. 12

సీ. దేవకీ సుతుకోర్కె తీఁగెలు వీడంగ వెలఁదికి మైదీఁగె వీడఁ దొడఁగెఁ

గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ గాంతి నింతికి ముఖకమల మొప్పె

మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ బొలఁతికిఁ జనుదోయి పొడవుసూపె

శౌరికి ధైర్యంబు సన్నమై డాయంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె  

ఆ. హరికిఁ బ్రేమబంధ మధికంబు గాఁ గేశ

బంధ మధిక మగుచు బాల కమరెఁ

బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార

నెలఁత యౌవనంబు నిండియుండె. 13

వ. ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి యను నేవురకుం

జెలియ లైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున. 14

క. తన తండ్రి గేహమునకుం

జనుదెంచుచునున్న యతిథిజనులవలనఁ గృ

ష్ణుని రూప బల గుణాదులు

విని కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ డని తలఁచె\న్‌. 15

క. ఆ లలన రూపు బుద్ధియు

శీలము లక్షణము గుణముఁ జింతించి తగన్‌

బాలారత్నముఁ దన కి

ల్లాలుగఁ జేకొందు ననుచు హరియుం దలఁచె\న్‌. 16

వ. అంత. 17

ఉ. బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషీ

సింధువు లై విచారములు సేయఁగ వారల నడ్డపెట్టి దు

స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి మత్త పు

ష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచుఁ దలంచె నంధుఁడై. 18

ఉ. అన్న తలంపుఁ దా నెఱిఁగి య న్నవనీరజగంధి లోన నా

పన్నత నొంది యాప్తుఁ డగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి గర్వసం

ఛన్నుఁడు రుక్మి నేఁడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్న వాఁ

డెన్ని విధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే! 19

క. అయ్యా! కొడుకు విచారము

లయ్యయు వారింపఁ జాలఁ డటు గాకుండ\న్‌

నెయ్య మెఱిఁగించి చీరుము

చయ్యన నిజ సేవకానుసారి\న్‌ శౌరి\న్‌. 20

వ. అని కొన్ని రహస్యవచనంబులు సెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకానగరంబు

నకుం జని, ప్రతీహారులవలనఁ దనరాక నెఱింగించి, య న్నగధరుం డున్న

నగరుఁ బ్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండైయున్న పురుషోత్తముం

గాంచి, పెండ్లికొడుకవు గమ్మని దీవించిన, ముసిముసినగవులు నగుచు,

బ్రహ్మణ్య దేవుండైన హరి, తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ

నియోగించి, తనకు దేవతలు సేయు చందంబునం బూజలు సేసి, సరస పదార్థ

సంపన్నం బైన యన్నంబు పెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున

భాసురుండైన భూసురుం జేరి, లోకరక్షణ ప్రశస్తం బైన హస్తంబున నతని

యడుగులు పుడుకుచు, మెల్లన నతని కి ట్లనియె. 21

సీ. జగతీసురేశ్వర! సంతోషచిత్తుండ వై యున్న నీ ధర్మ మతిసులభము

వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు

తనధర్మమున నుండుఁ దరల డా ధర్మంబు గోరిక లతనికిఁ గురియుచుండు

సంతోషి గాడేఁని శక్రుఁ డైన నశించు నిర్ధనుం డయినను నిద్రఁ బోలు  

ఆ. సంతసించె నేని, సర్వభూత సుహృత్త

ములకుఁ బ్రాప్తలాభ ముదితమాన

సులకు శాంతులకును సుజనులకును గర్వ

హీనులకును వినతు లే నొనర్తు. 22

ఉ. ఎవ్వని దేశమం దునికి యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ

కెవ్వనిరాజ్యమందుఁ బ్రజ లెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం

డి వ్వనరాశిదుర్గమున కె ట్లరుదెంచితి వయ్య! నీవు లే

నవ్వులు గావు నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ! 23

వ. అని యిట్లు లీలా గృహీతశరీరుం డైన య ప్పరమేశ్వరుం డడిగిన, ధరణీసుర

వరుం డతని కిట్లనియె. దేవా! విదర్భదేశాధీశ్వరుం డగు భీష్మకుం డను రాజు

గలండు. ఆ రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి గలదు. అ య్యిందువదన

నీకుం గైంకర్యంబు సేయం గోరి, వివాహమంగళ ప్రశస్తం బైన యొక్క

సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె. అవధరింపుము. 24

సీ. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు

నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు

నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁగలుగు

నే నీ లసన్నామ మేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు  

తే. నట్టి నీయందు నా చిత్త మనవరతము

నచ్చియున్నది నీ యాన నానలేదు

కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!

శ్రీయుతాకార! మానినీచిత్తచోర! 25

శా. ధన్యున్‌ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ

జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితు\న్‌ నిన్ను నే

కన్యల్‌ గోరరు? కోరదే మును రమా కాంతాలలామంబు రా

జన్యానేకప సింహ! నావలననే జన్మించెనే మోహముల్‌. 26

ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో

మాయువు గోరుచందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ

ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ

డా యధమాధముం డెఱుఁగఁ డద్భుత మైన భవత్ప్రతాపముల్‌. 27

మ. వ్రతముల్‌ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్‌ దానధర్మాదులు\న్‌

గతజన్మంబుల నీశ్వరు\న్‌ హరి జగత్కల్యాణుఁ గాంక్షించి చే

సితి నేని\న్‌ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌఁగాక ని

ర్జితు లై పోదురు గాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్‌. 28

ఉ. అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి యో

పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్‌ జయించి నా

వంకకు వచ్చి రాక్షసవివాహమునన్‌ భవదీయ శౌర్య మే

యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెద\న్‌. 29

సీ. లోపలి సౌధంబులోన వర్తింపంగఁ దేవచ్చునే నిన్నుఁ దెత్తునేనిఁ

గావలివారలఁ గల బంధువులఁ జంపి కాని తేరా దని కమలనయన!

భావించితేని నుపాయంబు చెప్పెద నాలింపు కులదేవయాత్రఁజేసి

నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతు  

తే. నెలమి మావారు పంపుదు రేను నట్లు

పురము వెలువడి యేతెంచి భూతనాథు

సతికి మ్రొక్కంగ నీవు నా సమయమునకు

వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత! 30

మ. ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె

వ్వని పాదాంబుజ తోయమందు మునుఁగ\న్‌ వాంఛింతు రే నట్టి నీ

యనుకంపన్‌ విలసింప నేని వ్రతచర్య\న్‌ నూఱు జన్మంబుల\న్‌

నినుఁ జింతించుచుఁ బ్రాణముల్‌ విడిచెదన్‌ నిక్కంబు ప్రాణేశ్వరా! 31

సీ. ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల

పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని తనులతవలని సౌందర్య మేల

భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని చక్షురింద్రియముల సత్త్వ మేల

దయిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల  

ఆ. నీరజాతనయన! నీ వనమాలికా

గంధ మబ్బలేని ఘ్రాణ మేల

ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని

జన్మమేల యెన్ని జన్మములకు. 32

వ. అని యిట్లు రుక్మిణీ దేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాతి విశేషంబు

లును, బ్రాహ్మణుండు హరికి విన్నవించి, కర్తవ్యం బెద్ది సేయ నవధరింపు మని,

సవరణగా ని ట్లనియె. 33

సీ. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారు లూరు

లరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము

మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షు రుత్సవదాయి చన్నుదోయి

పరిహసి తార్ధేందు పటలంబు నిటలంబు జిత మత్తమధుకర శ్రేణి వేణి  

ఆ. భావజాశుగముల ప్రాపులు చూపులు

కుసుమశరుని వింటి కొమలు బొమలు

చిత్తతోషణములు చెలువభాషణములు

జలజనయనముఖము చంద్రసఖము. 34

ఉ. ఆ యెలనాఁగ నీకుఁ దగు నంగనకుం దగు దీవు మా యుపా

ధ్యాయుల యాన పెండ్లి యగుఁ దప్పదు జాడ్యము లేల నీవు నీ

తోయమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి

చ్చేయుము శత్రులన్‌ నుఱుముసేయుము సేయుము శోభనం బిలన్‌. 35

వ. అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశం

బును, రూప సౌందర్యాది విశేషంబులును విని, యవధరించి, నిజకరంబున నతని

కరంబుఁ బట్టి నగుచు, న య్యాదవేంద్రుం డి ట్లనియె. 36

చ. కన్నియమీఁద నా తలఁపు గాఢము కూరుకురాదు రేయి నా

కెన్నఁడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే

మున్నె యెఱుంగుదు\న్‌ బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి

ద్వన్నుత! మాను ద్రచ్చి నవవహ్నిశిఖ\న్‌ వడిఁ దెచ్చుకైవడిన్‌. 37

క. వచ్చెద విదర్భభూమికిఁ

జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీల\న్‌

దెచ్చెద బాల\న్‌ వ్రేల్మిడి

వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చినఁ బోర\న్‌. 38

వ. అని పలికి రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు తెలిసి, తన పంపున రథ సారథి యైన

దారుకుండు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి,

రథ మాయత్తంబు చేసి తెచ్చిన, నమోఘ మనోరథుం డైన హరి తానును,

బ్రాహ్మణుండును, రథారోహణంబు సేసి, యేకరాత్రంబున నానర్తక దేశం

బులు గడచి, విదర్భదేశంబునకుం జనియె. అందుఁ గుండిన పురీశ్వరుం డైన

భీష్మకుండు కొడుకునకు వశుం డై, కూఁతు శిశుపాలున కిత్తు నని తలంచి,

శోభనోద్యోగంబు సేయించె. అప్పుడు. 39

సీ. రచ్చలుఁ గ్రంతలు రాజమార్గంబులు విపణిదేశంబులు విశదములుగఁ

జేసిరి చందనసిక్త తోయంబులు గలయంగఁ జల్లిరి కలువడములు

రమణీయ వివిధతోరణములు గట్టిరి సకలగృహంబులుఁ జక్కఁజేసి

కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి రతివలు పురుషులు నన్నియెడల  

ఆ. వివిధ వస్త్రములను వివిధ మాల్యాభర

ణాను లేపనముల నమరియుండి

రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి

రుత్సవమున నగర మొప్పియుండె. 40

వ. అంత నా భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి, బ్రాహ్మణులకు

భోజనంబులు వెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి

నభిషిక్తం జేసి, వస్త్రయుగళ భూషితం గావించి, రత్నభూషణంబు లిడంజేసె.

ఋ గ్యజు స్సామ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షా

కరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదిత

న్యాయంబున హోమంబుఁ గావించె. మఱియు నా రాజు దంపతుల మేలు

కొఱకు తిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగె.

అ య్యవసరంబున. 41

మ. భటసంఘంబులతో రథావళులతో భద్రేభ యూధంబుతోఁ

బటు వేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియ శ్రేణితోఁ

గటు సంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్‌ విశం

కటవృత్తిన్‌ జనుదెంచెఁ జైద్యుఁడు గడు\న్‌ గర్వించి య వ్వీటికి\న్‌. 42

ఉ. బంధులఁ గూడి గృష్ణ బలభద్రులు వచ్చినఁ బాఱఁదోలి ని

ర్మంధరవృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద మంచు నుల్లసత్‌

సింధుర వీర వాజి రథ సేనలతోఁ జనుదెంచిరా జరా

సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరథ పౌండ్రకాదులు\న్‌. 43

వ. మఱియు, నానాదేశంబుల రాజు లనేకు లేతెంచిరి. అందు శిశుపాలు నెదుర్కొని,

పూజించి, భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె. అంతఁ దద్వృత్తాం

తంబు విని. 44

చ. హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్య హితానుసారు లై

నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం

గర మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి నంచు వేగఁ దా

నరిగె హలాయుధుండు కమలాక్షునిఁ జాడ ననేకసేనతో\న్‌. 45

క. ఆలోపల నేకతమున

నాలోలవిశాలనయన యగు రుక్మిణి త

న్నా లోకలోచనుఁడు హరి

యాలోకము చేసి కదియఁడని శంకిత యై. 46

శా. లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ డు

ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతము\న్‌ బ్రాహ్మణుం

డగ్నిద్యోతనుఁ డేటికిం దడసెనో యత్నంబు సిద్ధించునో

భగ్నం బై చనునో విరించి కృత మె బ్భంగి\న్‌ బ్రవర్తించునో! 47

మ. ఘనుఁడా భూసురుఁ డేఁగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో

విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో విచ్చేయునో యీశ్వరుం

డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యా మహాదేవియు\న్‌

నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో. 48

వ. అని వితర్కింపుచు. 49

ఉ. పోఁడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుఁడు\న్‌

రాఁడను నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుఁడు\న్‌

లేఁ డను రుక్మికిం దగవు లే దిటఁ జైద్యున కిత్తు నంచు ను

న్నాఁ డను గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁడను\న్‌. 50

ఉ. చెప్పదు తల్లికిం దలఁపుఁ జిక్కు దిశల్‌ దరహాస చంద్రిక\న్‌

గప్పదు వక్త్ర తామరస గంధసమాగత భృంగసంఘము\న్‌

రొప్పదు నిద్రఁ గైకొన దురోజ పరస్పరసక్త హారముల్‌

విప్పదు కృష్ణమార్గగత వీక్షణపంక్తులఁ ద్రిప్ప దెప్పుడు\న్‌. 51

చ. తుడువదు కన్నుల\న్‌ వెడలు తోయకణంబులు కొప్పుఁ జక్కఁగా

ముడువదు నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన దన్న మేమియు\న్‌

గుడువదు నీరము\న్‌ గొనదు కూరిమి కీరముఁ జేరి పద్యము\న్‌

నొడువదు వల్లకీగుణ వినోదము సేయదు డాయ దన్యులన్‌. 52

సీ. మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ జలకంబు లాడదు జలజగంధి

ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దుఱుమదు పువ్వుఁబోడి

వనకేళిఁగోరదు వనజాతలోచన హంసంబుఁ బెంపదు హంసగమన

లతలఁ బోషింపదు లతికా లలితదేహ తొడవులు దొడవదు తొడవుతొడవు  

ఆ. తిలక మిడదు నుదుటఁ దిలకినీతిలకంబు

గమల గృహముఁ జొరదు కమలహస్త

గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన

మాలి రాఁడు తగవుమాలి యనుచు. 53

వ. మఱియును. 54

మ. మలఁగు\న్‌ మెల్లనిగాలికిన్‌, బటు నట న్మత్త ద్విరేఫాళికి\న్‌

దలఁగు\న్‌, గోయలమ్రోఁత కై యలఁగు, నుద్యత్కీరసంభాషల\న్‌

గలఁగు\న్‌, వెన్నెలవేఁడికిన్‌ నలఁగు, మాకందాంకుర చ్ఛాయకున్‌

దొలఁగు\న్‌, గొమ్మ మనోభవానల శిఖా దోదూయమానాంగి యై. 55

వ. ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబులయందును విరక్త యై,

మనోజానలంబునం బొగిలెడి మగువకు శుభంబు చెప్పు చందంబున వామోరు

లోచన భుజంబు లదరె. అంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు సను

దెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ

నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురు సని నిలువంబడిన,

బ్రాహ్మణుం డి ట్లనియె. 56

ఉ. మెచ్చె భవద్గుణోన్నతి కమేయ ధనాదుల నిచ్చె నాకుఁ దా

వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె సురాసురు లెల్ల నడ్డ మై

వచ్చిన నైన రాక్షసవివాహమున\న్‌ గొనిపోవు నిన్ను నీ

సచ్చరితంబు భాగ్యమును సర్వము నేఁడు ఫలించెఁ గన్యకా! 57

వ. అనిన వైదర్భి యి ట్లనియె. 58

మ. జలజాతేక్షుణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి నన్‌

నిలువం బెట్టితి నీ కృపం బ్రతికితి\న్‌ నీయట్టి పుణ్యాత్మకుల్‌

గలరే దీనికి నీకుఁ బ్రత్యుపకృతి\న్‌ గావింపఁగానేర నం

జలి గావించెద భూసురాన్వయమణీ! సద్బంధు చింతామణీ! 59

వ. అని నమస్కరించె. అంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట

విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్త ప్రకారంబునఁ బూజించి,

మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి,

భీష్మకుండు బంధుజన సేనాసమేతు లైన వారలకుం దూర్ణంబున సకల సంప

త్పరిపూర్ణంబు లైన నివేశంబులు గల్పించి, విడియించె. ఇట్లు కూడిన రాజుల

కెల్లను వయో వీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి,

పూజించె. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాం

జలులం దదీయ వదనకమల మధుపానంబు సేయుచు. 60

మ. తగు నీ చక్రి విదర్భరాజసుతకు\న్‌ దథ్యంబు వైదర్భియుం

దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దఱిం

దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి యై

మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికి\న్‌ మా పుణ్య మూలంబున\న్‌. 61

వ. అని పలికిరి. ఆ సమయంబున. 62

సీ. సన్నద్ధులై బహు శస్త్ర సమేతులై బలసి చుట్టును వీరభటులు గొలువ

ముందఱ నుపహారములు కానుకలుఁ గొంచు వర్గంబు లై వారవనిత లేఁగఁ

బుష్ప గంధాంబర భూషణ కలిత లై పాడుచు భూసుర భార్య లరుగఁ

బణవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీ ధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ  

ఆ. దగిలి సఖులు గొలువఁ దల్లులు బాంధవ

సతులు దోడ రాఁగ సవినయమున

నగరువెడలి నడచె నగజాతకును మ్రొక్క

బాల చికుర పిహిత ఫాల యగుచు. 63

వ. మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుం

జనుదేర, మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలం

చుచు, నిందుధరసుందరీ మందిరంబు చేరి, సలిల ధారా ధౌత చరణ కరారవింద

యై, వార్చి, శుచియై, గౌరీసమీపంబునకుం జనియె. అంత ముత్తైదువ లగు

భూసురోత్తముల భార్యలు భవసహిత యైన భవానికి మజ్జనంబు గావించి,

గంధాక్షతంబు లిడి, వస్త్ర మాల్యాది భూషణంబుల నలంకరించి, ధూప దీపంబు

లొసంగి, నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీపమాలికల

నివాళించి, రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు. 64

ఉ. నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశుల\న్‌

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! ని\న్‌

నమ్మిన వారి కెన్నఁటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ! 65

వ. అని గౌరీదేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణా

పూపంబులును, దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు

నిచ్చి రుక్మిణీదేవి వారల\న్‌ బూజించిన. 66

ఆ. వార లుత్సహించి వలనొప్ప దీవించి

సేస లిడిరి యువతి శిరము నందు

సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి

మౌననియతి మాని మగువ వెడలె. 67

వ. ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున,

మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవనర్తకుం

డెత్తిన జవనికమఱఁగు దెరలి పొడసూపిన మోహినీదేవత కైవడి, దేవ దానవ

సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత

పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘుమ

ఘుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభ

వంబున, బహువిధ ప్రభాభాసమాన యై, యిందుధరసుందరీ మందిరంబు వెడలి,

మానసకాసార హేమకమల కానన విహారమాణ మత్తమరాళంబు భంగి, మంద

గమనంబునఁ గనకకలశయుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్య

మాన మధ్య యై, రత్నముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు

కైదండ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు

గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త

మధుకరంబుల మాడ్కి నరాళంబు లైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ

గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు

నావహింప, నధరబింబ ఫలారుణమరీచి మాలికలు వదన కుందకుట్మలంబుల కను

రాగంబు సంపాదింప, మనోజాతకేతన సన్నిభం బైన పయ్యెదకొంగు దూఁగ,

సువర్ణ మేఖలాఘటిత మణికిరణపటలంబు లకాల శక్రచాప జనకంబు లై మెఱయ,

జెఱకువిలుతుం డొఱవెఱికి, వాఁడియిడి, ఝళిపించిన ధగద్ధగాయమానంబు లగు

బాణంబులపగిది, సురుచిర విలోకననికరంబులు రాజవీరుల హృదయంబులు

భేదింప, శింజాన మంజు మంజీరనినదంబులు చెవులపండువులు సేయఁ, బాద

సంచారంబున హరి రాక కెదురుసూచుచు, వీర మోహిని

యై చనుదెంచుచున్న సమయంబున. 68

మ. అళినీలాలకఁ బూర్ణచంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధర\న్‌

గలకంఠి\న్‌ నవపల్లవాంఘ్రియుగళన్‌ గంధేభకుంభస్తని\న్‌

బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్త\న్‌ మహో

త్పలగంధి\న్‌ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱు\న్‌. 69

వ. మఱియు, న య్యింతి దరహాస లజ్జావలోకనంబులఁ జిత్తంబు లేమఱి, ధైర్యం

బులు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని,

యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి, గజ తురగ రథారోహణంబులు

సేయనేరక, రాజు లెల్ల నేలకు వ్రాలిరి. ఆ యేణీలోచన తన వామకర

నఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు, నుత్తరీయంబు చక్కనొత్తుచుఁ,

గడకంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకింపుచు. 70

చ. కనియె\న్‌ రుక్మిణి చంద్రమండల ముఖుం గంఠీరవేంద్రావల

గ్ను నవాంభోజదళాక్షుఁ జారుతర వక్షున్‌ మేఘసంకాశ దే

హు నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం జక్రిఁ బీతాంబరు\న్‌

ఘన భూషాన్వితుఁ గంబుకంఠు విజయోత్కంఠు\న్‌ జగన్మోహనున్‌. 71

వ. కని తదీయ రూప వయో లావణ్య వైభవ చాతుర్య తేజోవిశేషంబు

లకు సంతసించి, మనోభవ శరాక్రాంత యై, రథారోహణంబు గోరుచున్న

వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబులు సూచుచుండ, మందగమనంబున

గంధసింధురంబులీలఁ జనుదెంచి, ఫేరవంబుల నడిమిభాగంబు గొని చను

కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక, తృణీకరించి, రాజకన్యకం

దెచ్చి, హరి తన రథంబుమీఁద నిడుకొని, భూ నభోంతరాళంబులు నిండ,

శంఖంబు పూరించుచు, బలభద్రుండు తోడ నడవ, యాదవ వాహినీ పరివృతుం

డై, ద్వారకానగర మార్గంబు వట్టి చనియె. అంత జరాసంధ వశు లైన రాజు

లందఱు హరి పరాక్రమంబు విని సహింపనోపక. 72

మ. ఘన సింహంబుల కీర్తి నీచమృగముల్‌ గైకొన్న చందంబున\న్‌

మన కీర్తుల్‌ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్‌

సనుచున్నా రదె శౌర్య మెన్నఁటికి మీ శస్త్రాస్త్రముల్‌ గాల్పనే

తనుమధ్యన్‌ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్‌ గ్రంతల\న్‌. 73

వ. అని యొండొరులఁ దెల్పుకొని, రోషంబులు హృదయంబుల నిల్పుకొని,

సంరంభించి, తనుత్రాణంబుల వహియించి, ధనురాది సాధనంబులు ధరియించి,

పంతంబు లాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదు

వీరులవెంట నంటందాఁకి, నిలు నిలుండని ధిక్కరించి పలికి యుక్కుమిగిలి,

మహీధరంబులమీఁద సలిలధారలు గురియు ధారాధరంబుల చందంబున, బాణ

వర్షంబులు గురిసిన, యాదవసేనలం గల దండనాధులు కోదండంబు లెక్కిడి,

గుణంబులు మ్రోయించి, నిలువంబడిరి. అప్పుడు. 74

క. అరి బలభట సాయకముల

హరిబలములు గప్పఁబడిన నడరెడి భీతి\న్‌

హరిమధ్య సిగ్గుతోడను

హరివదనముఁ జూచెఁ జకితహరిణేక్షణ యై. 75

వ. ఇట్లుచూచిన. 76

క. వచ్చెద రదె యదువీరులు

వ్రచ్చెద రరిసేన లెల్ల వైరులు పెలుచన్‌

నొచ్చెదరును విచ్చెదరును

జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ! 77

వ. అని రుక్మిణీదేవిని హరి యూఱడించె. అంత బలభద్రప్రముఖు లైన యదు

వీరులు ప్రళయవేళ మిన్నునం బన్నిన బలిపిడుగుల నడరించు పెను మొగుళ్ళ

వడువున, జరాసంధాది పరిపంథి రాజ చక్రంబుమీఁద నవక్ర పరాక్రమంబున

శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ నారాచ భల్ల ప్రముఖంబు లైన బహువిధ

బాణపరంపరలు గురియ, నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న

తురంగంబును, విభిన్న రథవరూథంబును, వినిహిత పదాతియూధంబును,

విఖండిత వాహ వారణ రథారోహ మస్తకంబును, విశకలిత వక్షో మధ్య కర్ణ

కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును,

విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంతసంఘంబును, విఘటిత వీర

మంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపం

బును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల

చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర చ్ఛత్రంబును, విలూన తనుత్రాణం

బును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖా సముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట

రథవేగంబును, వినివారిత సూత మాగధ వంది నాదంబును, వికుంఠిత హయ

హేషా పటహ భాంకార, కరటిఘటా ఘీంకార, రథనేమి ఫటాత్కార, తురగ

నాభిఘంటా ఘణఘణాత్కార, వీర హుంకార, భూషణ ఝణఝణాత్కార,

నిస్సాణ ధణధణాత్కార, మణినూపుర క్రేంకార, కింకిణీ కిణకిణాత్కార,

శింజినీ టంకార, భట పరస్పర ధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజ

సమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూత బేతాళ

కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత

కబంధంబును, బ్రభూర పలలగంధంబును, బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదం

బును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును నై యుండె. అప్పుడు. 78

చ. మగిడి చలించి పాఱుచును మాగధముఖ్యులు గూడి యొక్కచో

వగచుచు నాలిఁ గోల్పడిన వానిక్రియ\న్‌ గడు వెచ్చ నూర్చుచున్‌

మొగమునఁ దప్పి దేఱఁ దమ ముందఱఁ బొక్కుచు నున్న చైద్యుతోఁ

బగతుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే. 79

ఆ. బ్రతుక వచ్చు నొడలఁ బ్రాణంబు లుండిన

బ్రతుకు గలిగెనేని భార్య గలదు

బ్రతికి తీవు భార్యపట్టు దైవ మెఱుంగు

వగవవలదు చైద్య! వలదు వలదు. 80

వ. వినుము. దేహధారి స్వతంత్రుఁడు గాడు. జంత్రగానిచేతి జంత్రపుబొమ్మ కైవడి

నీశ్వరతంత్ర పరాధీనుం డై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపు. తొల్లి

నేను మధురాపురంబుమీఁదఁ బదియేడుమాఱులు పరాక్రమంబున\న్‌ విడిసి, యా

సప్తదశవారంబులును జక్రిచేత నిర్మూలిత బలచక్రుండ నై, కామపాలుచేతం బట్టువడి,

యీ కృష్ణుండు కరుణతో విడిపించి పుచ్చిన వచ్చి, క్రమ్మఱ నిఱువదిమూ డక్షౌహిణులం

గూడుకొని, పదునెనిమిదవమాఱు దాడిచేసి, శత్రువులం దోలి, విజయంబుఁ జేకొంటిని.

ఇట్టి జయాపజయంబులందు హర్షశోకంబుల నెన్నండును జెంద. నేఁటి దినంబున

నీ కృష్ణుని కెదిరిపోర మనరాజలోకంబు లెల్ల నుగ్రాక్షుం గూడుకొని, యెదిరి

పోరిన నోడుదుము. ఇంతియ కాక దైవయుక్తం బైన కాలంబునం జేసి, లోకంబులు

పరిభ్రమించుచునుండు. అదియునుం గాక. 81

మ. తమకుం గాలము మంచి దైన మనలం ద్రైలోక్య విఖ్యాత వి

క్రములం గెల్చిరి యాదవుల్‌ హరి భుజాగర్వంబునన్‌ నేఁడు కా

లము మేలై చనుదెంచె నేని మనము\న్‌ లక్షించి విద్వేషుల\న్‌

సమరక్షోణి జయింత మింత పనికై శంకింప నీ కేటికిన్‌. 82

వ. అని ఇట్లు జరాసంధుండును, అతని యొద్ది రాజులును, శిశుపాలుని పరితాపంబు

నివారించి, తమతమ భూములకుం జనిరి. శిశుపాలుండు ననుచర సేనాసమేతుం

డై, తన నగరంబునకుం జనియె, నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షస

వివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీ

బలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ, దన సారథితో

ని ట్లనియె. 83

ఉ. బల్లిదు నన్ను భీష్మజనపాల కుమారునిఁ జిన్న జేసి నా

చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కక నిక్కపు బంటువోలె నీ

గొల్లఁడు వోయెడి\న్‌ రథము గూడఁగఁదోలుము తేజితోల్లసత్‌

భల్లపరంపరన్‌ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్‌. 84

వ. అని ఇట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి, రథముఁ గూడ

దోలించి, "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు" మని తిరస్క

రించి, బలువింట నారి సైరించి, మూఁడు వాఁడితూపుల హరి నొప్పించి,

యి ట్లనియె. 85

సీ. మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ నేపాటి గలవాఁడ వేది వంశ

మెందు జన్మించితి వెక్కడఁ బెరిఁగితి వెయ్యది నడవడి యెవ్వఁ డెఱుఁగు

మానహీనుఁడ వీవు మర్యాద లెఱుఁగవు మాయఁ గైకొనికాని మలయరావు

నిజరూపమున శత్రునివహంబు పైఁ బోవు వసుధేశుఁడవు గావు వావి లేదు  

ఆ. కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు

విడువు విడువవేని విలయకాల

శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల

గర్వమెల్లఁ గొందుఁ గలహమందు. 86

వ. అని పలికిన, నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి,

యాఱుశరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి,

రెం డమ్ముల సారథిం జంపి, మూఁడు వాఁడితూపులం గేతనంబు ద్రుంచి,

మఱియు నొక్క వి ల్లందినం ద్రుంచి, వెండియు, నొక్కధనువు వట్టిన విదళించి,

క్రమంబున పరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం,

దునుకలు సేసి, క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు

గావించె. అంతటం దనివి సనక వాఁడు రథంబు డిగ్గి, ఖడ్గహస్తుం డై, దవాన

లంబు పైఁ బడు మిడుతచందంబునం గదిసిన, ఖడ్గకవచంబులు చూర్ణంబులు

చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు వెఱికి ఝళిపించి, వాని శిరంబుఁ

దెగవ్రేయుదు నని, గమకించి, నడచుచున్న, నడ్డంబువచ్చి, రుక్మిణీదేవి హరి

చరణారవిందంబులు పట్టుకొని, యి ట్లనియె. 87

మత్తకోకిల. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో

సన్నుతామల కీర్తిశోభిత! సర్వలోక శరణ్య! మా

యన్న యీతఁడు నేఁడు చేసె మహాపరాధము నీయెడ\న్‌

నన్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిధీ! 88

మత్తకోకిల. కల్ల లేదని విన్నవించుటకాదు వల్లభ! యీతని\న్‌

బ్రల్లదుం దెగఁజూచి తేనియు భాగ్యవంతుల మైతి మే

మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా

తల్లిదండ్రులు పుత్రశోకముఁదాల్చి చిక్కుదు రీశ్వరా! 89

మ. అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో

వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచల ద్వేణీ కలాపంబుతోఁ

గనుదోయి\న్‌ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ

క్కిన రుక్మిం దెగవ్రేయఁ బోక మగిడె\న్‌ గృష్ణుండు రోచిష్ణుఁ డై. 90

వ. ఇట్లు చంపక, బావా! రమ్మని చిఱునగవు నగుచు, వానిం బట్టి బంధించి,

గడ్డంబును, మీసంబునుం, దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ

గొఱిగి, విరూపిం జేసె. అంతట యదువీరులు పర సైన్యంబులం బాఱఁదోలి,

తత్సమీపంబునకు వచ్చిరి. అప్పుడు హతప్రాయుం డై, కట్టువడియున్న రుక్మిం

జూచి, కరుణచేసి, బలభద్రుండు వాని బంధంబులు విడిచి, హరిని డగ్గఱి, యి ట్లనియె. 91

క. తల మనక భీష్మనందను

తలయును మూతియును గొఱుగఁ దగవే! బంధుం

దలయును మూతియుఁ గొఱుగుట

తల దఱుగుటకంటెఁ దుచ్ఛతరము మహాత్మా! 92

క. కొందఱు రిపు లని కీడును

గొందఱు హితు లంచు మేలు గూర్పవు నిజ మీ

వందఱియందును సముఁడవు

పొందఁగ నేలయ్య! విషమబుద్ధి ననంతా! 93

వ. అని వితర్కించి పలికి, రుక్మిణీదేవి నుపలక్షించి యి ట్లనియె. 94

శా. తోడంబుట్టినవాని భంగమునకు\న్‌ దుఃఖించి మా కృష్ణు నె

గ్గాడం జూడకుమమ్మ! పూర్వభవ కర్మాధీన మై ప్రాణుల\న్‌

గీడు\న్‌ మేలును జెందు లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ

తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నేఁ డి య్యెడ\న్‌. 95

క. చంపెడిదోషము గలిగినఁ

జంపఁజనదు బంధుజనులఁ జను విడువంగాఁ

జంపిన దోషము సిద్ధము

చంపను మఱి యేల మున్న చచ్చినవాని\న్‌. 96

ఆ. బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు

కల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి

తోడిచూలు నైనఁ దోడబుట్టినవాఁడు

చంపుచుండుఁ గ్రూరచరితుఁ డగుచు. 97

క. భూమికి ధనధాన్యములకు

భామలకును మానములకుఁ భ్రాభవములకుం

గామించి మీఁదు గానక

శ్రీమదమున మానధనులు చెనకుదు రొరుల\న్‌. 98

వ. వినుము. దైవమాయంజేసి, దేహాభిమాను లైన మానవులకు\న్‌ బగవాఁడు, బంధుడు,

నుదాసీనుండు నను భేదంబు మోహంబు సిద్ధం బై యుండు. జలాదులయందుఁ

జంద్రసూర్యాదులును, ఘటాదులయందు గగనంబును, బెక్కులై కానంబడు భంగి,

దేహధారుల కందఱికి నాత్మ యొక్కం డయ్యును, బెక్కం డ్రై తోఁచు.

ఆద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకం బై, యాత్మ

యందు నవిద్యచేతఁ గల్పితం బై, దేహిని సంసారంబునం ద్రిప్పు. సూర్యుండు

తటస్థుం డై యుండ, బ్రకాశమానంబు లైన దృష్టిరూపంబులఁ బోలె నాత్మ

తటస్థుం డై యుండ, దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగును. ఆత్మకు

వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు. వృద్ధిక్షయంబులు చంద్ర

కళలకుం గాని, చంద్రునికి లేనికైవడి, జన్మనాశంబులు దేహంబునకుఁ గాని,

యాత్మకుఁ గలుగనేరవు. నిద్రవోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు

సేవించు తెఱంగున, నెఱుకలేనివాఁడు నిజముగాని యర్థమునందు ననుభవంబు

నొందుచుండుఁ గావున. 99

క. అజ్ఞానజ మగు శోకము

విజ్ఞాన విలోకనమున విడువుము నీకుం

బ్రజ్ఞావతికిం దగునే

యజ్ఞానుల భంగి వగవ నంభోజముఖీ! 100

వ. ఇట్లు బలభద్రునిచేతఁ దెలుపంబడి, రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె. అట

రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుం డై, విడువఁబడి, తన విరూప భావంబునకు

నెరియుచు, హరిం గెల్చి కాని కుండినపురంబుఁ జొర నని ప్రతిజ్ఞ సేసి, తత్సమీ

పంబున నుండె. ఇ వ్విధంబున. 101

క. రాజీవలోచనుఁడు హరి

రాజసమూహములఁ గెల్చి రాజస మొప్ప\న్‌

రాజిత యగు తనపురికిని

రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింప\న్‌. 102

వ. అంత న య్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహకృత్యంబును, బ్రవర్తమాన

గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నర నారీవర్గంబును,

బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల

దానసలిలధారా సిక్త రాజమార్గంబును, బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక

కదళికా కర్పూర కుంకుమాగరు ధూప దీప పరిపూర్ణ కుంభంబును, విభూషిత

సకల గృహవేదికా కవాట దేహళీస్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ

విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె. అ య్యవసరంబున. 103

మ. ధ్రువకీర్తి\న్‌ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణి\న్‌ మాన వై

భవ గాంభీర్య విహారిణి\న్‌ నిఖిల సంపత్కారిణి\న్‌ సాధు బాం

ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి\న్‌

సువిభూషాంబర ధారిణి\న్‌ గుణవతీ చూడామణి\న్‌ రుక్మిణి\న్‌. 104

క. సతులుం దారును బౌరులు

హితమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో

న్నత వర్ధిష్ణులకును మా

నిత రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకు\న్‌. 105

క. హరిపెండ్లికిఁ గైకేయక

కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్‌

పరమానందముఁ బొందిరి

ధరణిలోన గాఢ తాత్పర్యముల\న్‌. 106

క. హరి యీ తెఱఁగున రుక్మిణి

నరుదుగఁ గొనివచ్చి పెండ్లి యాడుట విని దు

ష్కరకృత్య మనుచు వెఱఁ గం

దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్ల\న్‌. 107

ఆ. అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ

గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి

పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి

ప్రీతు లగుచు ముక్త భీతు లగుచు. 108

వ. అని చెప్పి. 109

క. కువలయ రక్షాతత్పర!

కువలయదళ నీలవర్ణ కోమలదేహా!

కువలయనాథ శిరోమణి!

కువలయజన వినుత విమలగుణ సంఘాతా! 110

మాలిని. సరసిజనిభ హస్తా! సర్వలోక ప్రశస్తా!

నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!

పరహృదయ విదారీ! భక్త లోకోపకారీ!

గురు బుధజన తోషీ! ఘోర దైతేయ శోషీ! 111

గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ

పాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహా

పురాణమునంబు రుక్మిణీ జన్మంబును, రుక్మిణీ సందేశంబును, వాసుదేవా

గమనంబును, రుక్మిణీగ్రహణంబును, రాజలోక పలాయనంబును, రుక్మియను

వాని భంగంబును, రుక్మిణీకల్యాణంబును, నను కథలుగల దశమస్కంధంబునందుఁ

బూర్వభాగము సంపూర్ణము.

Saturday, March 8, 2014

ఎవరునేర్పారమ్మ ఈ జాతికి -గౌరవమ్మిమ్మని స్త్రీజాతికి

ఎవరునేర్పారమ్మ ఈ జాతికి -గౌరవమ్మిమ్మని స్త్రీజాతికి


!3-4-2010.నేను హరద్వారలో కుంభమేళాకి వెళ్లేను.ఉదయం 5గంటలకే ఘాట్లన్నీ క్రిక్క్కిరిసి యున్నాయి.నా భార్య, స్నేహితులు గంగలో స్నానానికి సమాయక్తమౌతున్నారు.నాచేతిలో కెమేరాతో చుట్టూ కలయజూస్తున్నాను.ఈ దృశ్యం నాకంటబడింది.తోందరలో నా వేలు కూడా పోటోకి అడ్డుపడింది.


మనుధర్మశాస్త్రము-3వ అధ్యాయం-56వ శ్లోకం


యత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః| 

యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాఫలాః క్రియాః || 


ఎచ్చట స్త్రీలు పూజింపహడతారో అచ్చట దేవతలు ప్రీతి జెందుతారు.ఎచ్చట వారు గౌరవింపబడరో అచ్చటచేసే కార్యాలన్నీకూడా నిష్ఫలములౌతాయి.సనాతన ధ్మర్మంలో మన ఋషులు మన సమాజంలోస్త్రీకి కల్పించిన ఉత్కృష్ట స్థానమది.ఆమె వలనే సంతానోత్పత్తి,ఆమెవలనే కులానికి గారవం.ఆమె వలనే గోత్రాభివృద్ది.మనపురాణాలుకూడా స్త్రీకిగల ప్రముఖ్యాన్ని దేవతల భార్యల ద్వారా తెలియజేసారు.బ్రహ్మ సరస్వతిని ముఖమందు,విష్ణువు వక్షస్థలమందు,భోళాశంకరుడైతే నేనోసగం నువ్వోసగం అని తనలో అర్ధభాగాన్నిచ్చేడు.గంగని కూడా నెత్తిమీద పెట్టుకున్నాడు.భారతనారి పేర్లు స్త్రీదేవతామూర్తుల పేర్లు,పతివ్రతల పేర్లు.ఆధునికులు అర్ధంలేని పేర్లు పెట్టుకొని అదే స్త్రీ స్వాతంత్ర్యం అంటున్నారు -గంటి

Friday, March 7, 2014

గృహ లక్ష్మి.......(ఓల్గా)...

గృహ లక్ష్మి.......(ఓల్గా)...


రుబ్బుడు పొత్రంలా 

తల తిరుగుతూనే వున్నా

ఆలోచనల పప్పు మెదగదు


ఇంగువ వాసనలో మునిగి తేలే ముక్కు

ఊపిరి పీల్చుకోవడం మర్చి పోతుంది


చెతుల చీపురుకట్టలు ఎడతెరిపి లేకండా

సూన్యంలో దేవుతూనే ఉంటాయి


కలల అలల తుంపరలు 

హృదయపు పెనంపై

చుయ్యిమంటూనే ఉంటాయి 


రోకటి బండ కింద

పచ్చడి, పచ్చడవుతూనే ఉంటుంది

నడుం బండకేసి బాదినా

కాటుక కంటినీట జడించినా

మనసుల మురికి వదలనే వదలదు

ఆసులో కండెంలా నిత్యం కదుల్తూనే


చలనం ఎరుగని కాళ్ళు

పిల్లర్స్‌లా ఉన్నచోటనే పాతుకు పోతాయి

అలుగ్గుడ్డల పీతిబట్టల పరిమళంలో

పునీతమవుతున్నా

జీవితం ఎందుకో ఎప్పుడూ 

కాటు వాసనే వేస్తుంటుంది

Thursday, March 6, 2014

ప్రాతః ద్యూత ప్రసంగేన/

పైకి తప్పుగా కనిపించినా లోపల ఎంత గొప్ప అర్థాన్నిదాచుకొని ఉందో  చాటు శ్లోకం. -------

-  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు....


“ ప్రాతః ద్యూత ప్రసంగేన/ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతాం/

నక్తం చొరప్రసంగేన/ కాలో గచ్ఛతి ధీమతః//” 

అర్థం.

ప్రాతః = ఉదయంపూట. ద్యూత ప్రసంగేనా = జ్యూదం గురించి మాటాడుకొంటూ.

మధ్యాహ్నే = మధ్యాహ్నసమయంలో. స్త్రీ ప్రసంగాతాం = స్త్రీ గురించి మాటాడుతూ 

నక్తం =రాత్రుళ్ళు. చోరప్రసంగేన = దొంగల గురించి ప్రసంగిస్తూ.

ధీమతః= బుద్ధిమంతులు (లేక పెద్దలు.) కాలో గచ్ఛతి= కాలాన్ని గడుపుతారు. ఏ మాశ్చర్యం! బుద్ధిమంతులు, ఉదయం జూదం గురించి, మధ్యాహ్నం స్త్రీని గూర్చి, రాత్రి దొంగలను గూర్చి మాటాడుకొంటూ కాలం గడుపుతారట!

 పై వాటిని గూర్చి చర్చించుకొనే వారు బుద్ధిమంతులు ఎలా అవుతారు. చాల విచిత్రంకదా! 

( క్రింది వివరణ చదవకుండా కొంచం ఆలోచించి ఈ చాటువులో విశేషం ఏమిటో తెలుసుకొందుకు ప్రయత్నించండి.తెలియ లేదా అయితే.) 

ఇప్పుడు విశేషార్థం చూడండి.

“ కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముఖ్య కారణం శకుని మాయాజ్యూదమేకదా! ఆకథ మహాభారతం లో ఉంది కనుక ‘ద్యూత ప్రసంగం’ అంటే (ఉదయం) మహాభారతాన్ని చదువుతూ, అట్లే సీతాదేవిని అపహరించటం వలెనే కదా! రామ రావణ యుద్ధంజరిగి లోక కంటకుడైన రావణుడు అంతరించాడు. ఈ చరిత్ర కలిగినది రామాయణం. స్త్రీ ప్రసంగం అంటే (మధ్యాహ్నం పూట) రామాయణాన్ని చదువుతూ, వెన్న దొంగిలించడం,గోపికల (భక్తుల) వస్త్రాల్ని, మనసులని దొంగిలించి, ‘గోపికా మానస చోరుడుగా కీర్తించ బడిన శ్రీకృష్ణ వృత్తాంతం కలిగిన గ్రంథం ‘శ్రీమద్భాగవతం’ నక్తం చోర ప్రసంగం అంటే రాత్రిపూట భాగవతం చదువుతూ” అనగా బుద్ధిమంతులు కాలాన్ని వృధాచేయకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడుకాలాల్లో “మహాభారత, రామాయణ, భాగవతాది” గ్రంధాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకొంటారు, అని పై చాటువుకి విశేషార్థం. చూశారా పై చాటువుల గొప్పతనం.

x

“భ్రాత్రుహంతా పితృహంతా/

పైకి నిందలా కనపడిన లోపల అంటే అంతరార్థం చూస్తే స్తుతి కనపడుతుంది.

 అటువంటి చాటువులని ఇప్పుడు చూద్దాం.

“భ్రాత్రుహంతా పితృహంతా/ మాతృహంతా చ యః పుమాన్/

త్రయేతే చ మహాభక్తాః / ఏతేషాంచ నమామ్యహం//”

భ్రాత్రుహంతా = అన్నని చంపించినవాడు.

పితృ హంతా = తండ్రిని చంపించిన వాడు.

మాతృ హంతాచ = తల్లిని చంపినవాడు.

యః పుమాన్ = ఎవరైతే ఉన్నారో 

త్రయేతేచ = ఆ ముగ్గురు.

మహాభక్తా: = గొప్ప భక్తులు.

ఏతేషాం చ = ఆ ముగ్గురికి.

నమామ్యహం = నమస్కరించుచున్నాను. అని అర్థం.

“అన్నని,తండ్రిని, తల్లిని చంపినవారు మహాభక్తులు ఎలావుతారు? వారుపాపాత్ములు కదా! మరి వారికి నమస్కరించడం ఏమిటి?” ఇది పైకి కనపడేభావం. కాని అంతరార్థం పరిశీలిస్తే “అన్నని చంపిచినవాడు ‘విభీషణుడు’ రామునిచేత పాపాత్ముడైన రావణుని చంపించి లోక కల్యాణానికి

కారణమైన మహాభక్తుడు.”

ఇక తండ్రిని చంపించిన వాడు. ‘ ప్రహ్లాదుడు.’ లోక కంటకుడైన హిరణ్య కశిపుని నరసింహస్వామిచేత సంహరింపజేసిన పరమ భక్తుడు ప్రహ్లాదుడు.

తల్లిని చంపినవాడు ‘పరశురాముడు.’ తండ్రి జమదగ్ని ఆజ్ఞను అనుసరించి తల్లి (రేణుకాదేవి)ని చంపి, తండ్రి వరం కోరుకోమనగా తల్లిని బ్రతికించమని కోరుకొని, మాతా, పితరులను భక్తితో సేవించిన గొప్ప భక్తుడు ‘పరశురాముడు’ ఆయన సాక్షాత్ నారాయణుని అవతారం. 

“ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనకాది” పరమ భక్తుల వరుసలో ప్రహ్లాదుడు, విభీషణుడు కూడా కీర్తించ బడ్డారు. పరశురాముడు సాక్షాత్ భగవంతుడే కనుక వారికి నమస్కరించుట పుణ్య ప్రదమే కదా!” చూశారా! 

-  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు 

విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్

విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్


పల్లెటూరు నుంచి ప్రస్తానం చేసి, రాకెట్లను ప్రయోగించి, వాటి స్థితి గతులను నియంత్రించి, దిశామార్గం చూపి వాటిని భ్రమణ కక్షలో ప్రవేశ పెట్టి ఉపగ్రహ కమ్యునికేషన్స్ కి ఆద్యం పోసి, భారత దేశం ప్రప్రధమ ఎస్ ఎల్ వి - రాకెట్ వెహికిల్ సిస్టం దగ్గర నుండి, నేటి చంద్రయాన్, మంగల్యాన్ వ్యోమ నౌకా - ఉపగ్రహాలని నడిపించిన భారతీయుడు, తెలుగు వాడు, విశిష్ట అంతరిక్ష శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ గారు. శాస్త్రవేత్తగా తన ప్రయాణం మొదలు పెట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు శ్రీహరికోటలోని 'షార్ ' కేంద్రంలో పనిచేసి, సంచాలకుడిగా ఎదిగి భారత దేశ ప్రయోజనాలను, అంతరిక్ష లక్షాలను సాధిస్తున్న సుప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త. రాకెట్ ఉపరితలం ఒదిలి, చంద్ర కక్ష, అంగారక కక్ష ఎలా చేరాలో నిశితంగా రూపకల్పన చేసి దాన్ని అమలులో పెట్టి, నియంత్రిస్తూ, గగనాంతరాళలో విహరింప చేస్తున్నారూ అంటే వారి ప్రజ్ఞా పాటవాలు ఏపాటివో, వారి శాస్త్రీయ నైపుణ్యత ఎంత శ్రేష్టమైనదో వేరే చెప్పనక్కర లేదు. వారు సాధించిన అసామాన్య ఫలితాలు వారి దీక్షా దక్షతలకు ఎంత పరిణితి చెందినవో చెప్పకనే చెప్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే భారత దేశానికున్న అన్ని ఉపగ్రహాలను మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ద్వార పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇంతటి మహత్తర అవకాశం లభించడం చాలా అరుదు. ఈ ఘనత డాక్టర్ ప్రసాద్ గారికే దక్కింది. తొమ్మిది దూరసంచార ఉపగ్రహాలను ఆయన నేతృత్వంలో నింగికి ఎగురవేశారు. 


ప్రస్తుతం భూ కక్షలో ఇరవై మూడు భారతీయ ఉపగ్రహాలను ఆజమాయిషీ చేస్తున్నారు. వీరి పర్యవేక్షణలో ఇరవై జియో సింక్రనస్ ఉపగ్రహాలను ఆజమాయిషీ చేసే మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీని భూపాల్ లో స్థాపించారు. ఇలాటి బృహత్తర కార్యాలన్నిటి వెనుక ఓ తెలుగు వాడి మేదస్సు వుంది అంటే అది మనందరికీ గర్వకారణం. 


మంగల్యాన్ ప్రయోగం - అంతరిక్ష క్షేత్రంలో మైలు రాయి:


నవంబరు 5, 2013, భారతీయ అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మైలు రాయి. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన పి ఎస్ ఎల్ వి - రాకెట్ ద్వారా మంగల్యాన్ వ్యోమ నౌక, ఉపగ్రహాన్ని కక్షలో పెట్టారు. ఎన్నో సవాళ్ళని అధిగమించి అసాధరణ ప్రతిభ కనపరిచారు మన భారతీయ శాస్త్రవేత్తలు. 


మార్స్ ఆర్బిటర్ ను భూ కక్షలో ప్రవెశపెట్టారు. తరువాత దాన్ని ఐదు మార్లు కక్ష, గతులను పెంచి, 9.8 కిలోమీటర్ల నుంచి 10.8 కిలోమీటర్లో వేగాన్ని అందించి, తరువాత 11.4 కిలోమీటర్లకి వేగం పెంచి భూ కక్ష నుంచి "ట్రాన్స్ మార్స్ ట్రాజెక్టరీ" ఆపాదించి అంగారక గ్రహ ప్రయాణ కక్షలోకి పెట్టారు. పది నెలలలో దాదాపు కోటి కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహానికి చేరువై దాని చుట్టూ భ్రమణం చేస్తుంది. ఇంతటి అసాధారణ సాహసం చేసిన ఉదంతాలు భారత దేశ అంతరిక్ష శాస్త్ర రంగంలో ఎక్కడా లేవు. ఇదే ప్రప్రధం. భారత దేశం సత్తాని లోకానికి విదితం చేసారు డాక్టర్ ప్రసాద్ గారు. 


అంగారకుడికి ఉపగ్రహమై ప్రదక్షిణాలు చేస్తుంది. అంగారక గ్రహం ఉపరితలం, వాతావరణం గురించి పరీక్షలు చేస్తుంది, జీవకణాల ఉనికిని కనిపెడుతుంది. మిథేన్, హైడ్రోజన్ ఉన్నాయో లెవో, ఎంత ప్రమాణంలో ఉన్నాయో పరిశోధిస్తుంది. ఘనీభవించిన మంచు గడ్డలు ఉన్నాయో కనిపెడుతుంది. ఇదంతా స్వదేశీ పరిజ్ఞానంతో సాధించినది. ప్రతీ భారతీయుడు గర్వ పడవచ్చు. 


బాల్యం, చదువు, ఉద్యోగం:

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ లో జన్మించారు. వీరిది సామాన్యమైన కుటుంబం. తండ్రి బడి పంతులు. ఇంజినీరింగ్ రెందో సంవత్సరం చదువుకునే దాక ఇంట్లో విద్యుత్ శక్తి కూడా లేదు. అలాటి పరిస్థితుల నుండి పైకి వచ్చారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారికి చదువు మీద చాలా శ్రద్ధ; పని మీద కూడ శ్రద్ధ. కాకినాడ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి బి ఎ లో ఉత్తీర్ణులైయ్యారు. అటు తర్వాత డాక్టరేట్ పట్టా అందుకున్నారు.


"ఎక్కడ చదివేరు అన్నది ముఖ్యం కాదు; మీరు ఏమి చదివేరు, ఎలా చేస్తున్నారు అన్నది ముఖ్యం " అని ముక్తాయించారు డాక్టర్ ప్రసాద్ గారు. శ్రద్ధ పెట్టి పనిచేస్తే పైకి వచ్చేందుకు తగినన్ని అవకాశాలు ఉంటాయి" అని ఉద్ఘాటించారు. డాక్టర్ ప్రసాద్ గారు తాత్విక చింతన కలిగి ఉన్నవారు. మృదు భాషి. 


1975 నుండి 1994 వరకు లాంచ్ వెహికిల్ సిస్టంస్ విభాగాధిపతిగా వ్యవహరించారు. ఈ దరిమిలా ఎన్నో పరిశోధనలు చేసి కొత్త పరికరాలను రూపొందించి రాకెట్లలోకి అనుసంధానం చేశారు. నేడు షార్ - సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర సంచాలకుడిగా ఎదిగారు. ఎన్నో క్లిష్టమైన, విపరీతమైన పరిస్థితులని ఎదుర్కుని, వాటిని వుపాయాలతో అధిగమించి చంద్రయాన్, మంగల్యాన్ వంటి అద్వితీయ అంతరిక్ష వ్యోమ నౌకా ఉపగ్రహాలను కక్షలో పెట్టారు. 


కుజ గ్రహానికి ఉపగ్రహం పంపటం అంత సులువు కాదు. ఎన్నో సంక్లిష్ట పరిస్తుతులను ఎదుర్కుని, ఉపగ్రహాలనే కాదు, భారత దేశ కీర్తి పతాకాలను గగనాంతరాళలోకి తీసుకు వెళ్ళిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ గారు.


పురస్కారాలు:

అనేక పురస్కారాలను అందుకున్నారు డాక్టర్ ప్రసాద్ గారు. వాటిలో:


భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (2014)

కన్నడ రాజ్యోత్సవ అవార్డు

ఇస్రో మెరిట్ అవార్డు

ఇస్రో టీం ఎక్సలెన్స్ అవార్డు (2007, 2009, 2011)

డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం

జీవిత సాఫల్య పురస్కారం - అరునై ఇంజినీరింగ్ కళాశాల

గౌరవ డాక్టరేట్

టీం అవార్డు - చంద్రయాన్ - 1 మిషన్ 2013

సభ్యుడు, ఇంటర్నేష్నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ లా, పారిస్

సభ్యుడు, ఇంటర్నేష్నల్ అకాడమి ఆఫ్ అస్ట్రోనాటిక్స్


కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు, మహాపురుషులౌతారు అన్న నానుడిని యదార్ధం చేశారు డాక్టర్ ప్రసాద్ గారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పల్లెటూరు నుంచి మొదలైన వీరి ప్రస్థానం, డాక్టర్ అబ్దుల్ కలాం శిష్యరికంలో " ఇంతింతై వటుడింతై " అన్నట్టు దిన దిన ప్రవర్ధమానమై భారత అంతరిక్ష క్షేత్రాన్ని గగనాంతరాళలోకి తీసుకు వెళ్ళి తన స్వప్నాన్ని సాకరం చేసిన విశిష్ట శాస్త్రవేత్త - రాకెట్లని, ఉపగ్రహాలని కక్షలో పెట్టి, వాటి స్థితి - గమనాలని అన్ని వేళలా చూస్తూ దేశ ప్రయోజనాలని పెంపొందించిన పరిపూర్ణ అంతరిక్ష శాస్త్రవేత్త. డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ అందరికీ ఆదర్శం. గగనాంతరాళలో ఉపగ్రహాలను పంపి, వాటికి గతులు చూపి కక్షలో ప్రవేశ పెట్టిన ఈ తెలుగు తేజోమూర్తి, భారతీయ ఉపగ్రహాలకు దిశామార్గం చూపించారు. వీరి జీవితమే అందరికీ ఆదర్శం - ప్రసాద్ గారు తెలుగు జాతికి భగవంతుడు ఇచ్చిన వర ప్రసాదమే. మరిన్ని అఖండ విజయాలు భారత దేశానికి చేకూరుస్తారని ఆశిద్దాం.

Wednesday, March 5, 2014

తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు....- రచన : - డా. శిరీష ఈడ్పుగంటి.

తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు....- రచన :  - డా. శిరీష ఈడ్పుగంటి.

తెలుగులో పత్రిక అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియల వలె పాశ్చాత్య ప్రభావంతో వచ్చిన సారస్వత ప్రక్రియ. పత్రిక అనే పేరు పత్రం నుండి వచ్చింది. శబ్దరత్నాకర నిఘంటువులో పత్రికకు అర్థం "వ్యవహారము యొక్క చెల్లుబడికై యొకరొకరు వ్రాసికొనెడి పత్రము” అని ఉంది. పత్రం అనే ఆరోపం దగ్గర "వ్యవహారము యొక్క చెల్లుబడికై యొకరొకరు వ్రాసికొనెడి ఆకు”అని ఇచ్చారు. అదనంగా వార్తాపత్రిక అనే అర్థం కూడా ఇచ్చారు. తరువాత యాభైసంవత్సరాలకు వెలువడ్డ సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా పత్రిక అంటే "వ్రాతకు ఆధారమగు తాటియాకు, కాగితము, వ్యవహారమున పరస్పరము వ్రాసికొనెడి పత్ర,ము అని వివరణ ఉంది. ’లేఖ అనే అర్థంలో పత్రిక అనేపదం మొట్టమొదటసారి ప్రభావతీప్రద్యుమ్నములో కనబడింది. ప్రభావతి పంపిన పత్రిక తీసుకుని శుచిముఖి ప్రద్యుమ్నుడికి చేర్చే సందర్భంలో తెలుస్తుంది’ (రామచంద్ర 1989:1). మద్రాసులో తెలుగు ముద్రాక్షరశాలలు వచ్చిన తర్వాత పత్రికలు రావడం మొదలైంది. ఆ రోజులలో తాళపత్ర గ్రంథాల సేకరణ, ప్రచురణలు ఒక్కసారిగా మొదలైనాయి. ఆనాటి పత్రికలు సహజంగానే భాషా, సాహిత్య, సాంస్కృతిక విషయాలకు పెద్దపీఠ వేశాయి. 


తొలి తెలుగువార్తాపత్రిక

భారతదేశంలో వచ్చిన తొలిపత్రిక ’దిగ్దర్శన్’1818 సంవత్సరంలో వెలువడింది. ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు తెలుగులో తొలిపత్రిక వచ్చింది. తొలిపత్రిక ఏది అనే విషయంలో మాత్రం చాలామంది చాలా అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆరుద్రగారి అభిప్రాయం ప్రకారం’తెలుగు జర్నల్(1831), డా.జి.ఎన్.రెడ్డిగారు ’కర్నాటిక్ క్రానికల్’(1832), డా. వి. సిమ్మన్నగారు ’పోర్టుసెయింట్ జార్జిగెజిట్’(1832), తెలుగుపత్రిక చరిత్రను చెప్పినవారంతా ’సత్యదూత’(1835), ఎక్కువ ఆధారాలతో లభించిన పత్రిక ’వృత్తాంతి’(1838). ఈ వృత్తాంతి పత్రికకు మండిగల వెంకట్రాయశాస్త్రిగారు సంపాదకత్వం వహించారు. దీనిలో ప్రచురించిన జాబులను బ్రౌన్ సేకరించినట్లుగా తెలుస్తుంది. గిడుగు రామమూర్తిపంతులుగారు ఈ పత్రికలోని లేఖను తన గద్యచింతామణిలో ఉదహరించారు. తర్వాత చాలాపత్రికలు వచ్చాయి. భాష, సాహిత్యం, ఇతర విషయాలకు సంబంధించినవన్నీ ఈ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. తొలితరం పత్రికలన్నీ కూడా స్వాతంత్ర్యోద్యమంలో ఉద్యమకారుని పాత్రను పోషించాయి. జాతీయ ప్రయోజనాలకు బాసటగా నిలిచాయి.


స్త్రీలకోసం నడిచిన తొలి తెలుగుపత్రిక 

తెలుగులో స్త్రీల కోసం నడిచిన తొలిపత్రిక ఏది అనే విషయంలో కూడా చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే స్త్రీల కోసం ప్రత్యేకంగా పత్రికలు నడపాల్సిన అవసరముందనే విషయాన్ని గుర్తించింది మాత్రం కందుకూరి వీరేశలింగంపంతులుగారు. ఈయన స్త్రీల కోసం స్థాపించిన సతీహితబోధిని పత్రికే మొదటి పత్రికగా చెప్పవచ్చు. ఇందులో స్త్రీవిద్య, ఆరోగ్యం, నీతిసూత్రాలు, భార్యగా స్త్రీ విద్యుక్తధర్మాలు మొదలైన వాటిపై వ్యాసాలు వచ్చేవి. అయితే కందుకూరివారికి స్త్రీల పట్ల గొప్ప భావాలేమి ఉండేవికావు. కేవలం స్త్రీని ఆదర్శగృహిణిగా నిలపడం గొప్ప సంస్కరణగా భావించారు. వీరి తర్వాత రాయసం వెంకటశివుడుగారి సంపాదకత్వంలో ’తెలుగు జనానా’(1893) పత్రిక వెలువడింది. ఈ పత్రికలో స్త్రీలకోసం పద్యాలు, పాటలు ప్రచురించేవారు. తదనంతరం ఎస్. సీతారామయ్యగారు ’హిందూసుందరి’(1902) పత్రికను కేవలం స్త్రీలకోసం ప్రారంభించారు. ఇందులో స్త్రీవిద్య, బాల్యవివాహాలు, స్త్రీల సంఘాల ఆవశ్యకత మొదలైన భిన్న అంశాల మీద వ్యాసాలు ప్రచురించారు. అంతేగాకుండా స్త్రీల కోసం నడిచే పత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించాలని కోరుకున్నారు. స్త్రీల సంపాదకత్వంలో ఈ పత్రికలు మరింత విజయవంతం కాగలవని ఆశించారు. చివరికి వీరి కోరిక నెరవేరింది. వీరు ప్రారంభించిన ’హిందూసుందరి’(1902) పత్రికకే స్త్రీలు సంపాదకత్వం వహించారు. ఈ పత్రికే స్త్రీల సంపాదకత్వంలో వచ్చిన మొదటి పత్రిక అని చెప్పుకోవచ్చు.


మహిళా సంపాదకులు 

స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడ్డాయి. ఇవన్నీకూడా స్త్రీవిద్య, తద్వారా స్త్రీ చైతన్యానికి తోడ్పడిన పత్రికలే. ఆరోజులలో విద్యావంతులైన కొంతమంది స్త్రీలు సాటి స్త్రీలలో చైతన్యాన్ని కలిగించేందుకు స్వయంగా పత్రికలు స్థాపించి సంపాదకత్వం వహించారు.


హిందూసుందరి (1902)

ఈ పత్రికకు మొసలికంటి రమాబాయమ్మ, వెంపటి శాంతాబాయమ్మగార్లు సంపాదకత్వం వహించారు. తెలుగులో మొట్టమొదటి మహిళాసంపాదకులు వీరే. ఈ పత్రికలో స్త్రీలు రాసిన వ్యాసాలు, కథలు, ఉపన్యాసాలు, ఇతర రచనలు ప్రచురించబడేవి. తెలుగుసాహిత్యంలో తొలికథారచయిత్రి భండారు అచ్చమాంబ రాసిన కథ ’ధనత్రయోదశి’ఈ పత్రికలోనే ప్రచురించబడింది. స్త్రీని చైతన్యవంతురాలిగా, భర్తకి మార్గదర్శకురాలిగా చూపించిన కథ ఇది. అంతేగాకుండా స్త్రీవిద్య, ప్రేమపరీక్ష, ఎరువుసొమ్ము బరువుచేటు, బీదకుటుంబం మొదలైన అచ్చమాంబగారి ఎన్నో రచనలు ఈ పత్రికలో వచ్చాయి. అచ్చమాంబగారు చిన్నప్పుడు సోదరుడు చదువుకుంటుండగా విని వివిధ భాషలు కూడా నేర్చుకున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో ఈ పత్రిక స్త్రీల సంపాదకత్వంలో నడవడటం అనేది పెద్ద సంచలనాన్ని సృష్టించింది.


సావిత్రి (1910)

ఈ పత్రికను పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు కాకినాడ నుండి సంపాదకత్వం వహించారు. ఈమె గొప్పవక్త. హిందీ, బెంగాలీ భాషలలో పాండిత్యం కలదు. స్త్రీలకూ విద్య అవసరం అని తన పత్రిక ద్వారా ప్రచారం చేసేవారు. ఈ పత్రికలో కూడా భండారు అచ్చమాంబ రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాల రచన ప్రచురింపబడేది. ఇది తెలుగులో తొలి స్త్రీల చరిత్ర.


అనసూయ (1914)

కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మగారు అనసూయ పేరుతో పత్రిక నడిపారు. మహిళా ఉద్యమాలకు ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది. స్త్రీలకు, బాలికలకు ఉపయోగపడే రచనలు ప్రచురించేవారు. గృహనిర్వహణ, ప్రకృతిశాస్త్రాలు, పురాణస్త్రీల చరిత్రలు, వివిధ రంగాలలో వన్నెకెక్కిన ప్రపంచ ప్రసిద్ధ మహిళల చరిత్రలు మొదలైన అంశాలకు సంబంధించిన విషయాల గూర్చి ఈ పత్రికలో ప్రచురించేవారు. ఈ పత్రిక తొలిసంచిక అభ్యుదయభావాలకు నాంది అని చెప్పవచ్చు. స్త్రీవిద్య, సమాజంలో ఆనాడు ఉన్న సంఘ దురాచారాల పైన వచ్చిన పత్రిక. అంతేగాకుండా హిందూసుందరి పత్రికకు అనసూయ పత్రికకు మధ్య పత్రికలు సావిత్రి, జననా, గృహలక్ష్మి (పురుష సంపాదకత్వం), ఈ మూడు కొంతకాలం నడిచాయి. ఇవికూడా స్త్రీలకు సంబంధించిన వాటిపై పత్రికలలో ప్రచురించేవి. కాని ఇవి కొంతకాలం మాత్రమే నడిచాయి. అనసూయ పత్రిక వచ్చేనాటికి ఈ పత్రికలు లేవు. కేవలం హిందూసుందరి పత్రిక మాత్రమే ఉంది. అనసూయ సంచికలలో "స్త్రీలు ఎచట ఉంటారో అచట దేవతలుంటారని, స్త్రీలు పురుషులతో అన్నింటా సమానమేననే భావాన్ని వ్యక్తం చేసేవారు. ఆరోజులలో సంపాదకులు ఈ భావాన్ని వ్యక్తం చేయగలగడం సాహసమే. ఒకరకంగా చెప్పాలంటే ఆరోజులలో స్త్రీని మేల్కొలిపిన పత్రిక అని చెప్పవచ్చు. 


సౌందర్యవల్లి (1918)

గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి భార్య రమాబాయిగారు ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు. స్త్రీల సంక్షేమానికి సంబంధించిన రచనలు ఎక్కువగా వచ్చేవి. స్త్రీల కోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ప్రతిపాదించినవారు.


ఆంధ్రలక్ష్మి (1921)

బరంపురం నుండి కళ్ళేపల్లి వెంకటరమణమ్మ గారు ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు. మహిళల సంక్షేమం కోసం, దేశవిదేశాలలోని స్త్రీలకు సంబంధించిన విశేషాలు ప్రచురించేవారు. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారదలేఖలు రచన ఇందులో ప్రచురించబడింది. ఈవిడ స్త్రీలలో విజ్ఞాన వికాసానికి దోహదం చేసినవారు.


ఆంధ్రమహిళ (1943)

గుమ్మిడిదల దుర్గాబాయమ్మ ఈ పత్రికను రెండు దశాబ్దాలపాటు నడిపారు. మహిళల ఉన్నతి కోసం జీవితాన్ని అంకితం చేశారు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేసిన పత్రిక. మారుతున్న సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహనతో రచయితలు రాసే రచనలు ఇందులో ప్రచురించబడేవి. కనుపర్తి వరలక్ష్మమ్మ, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, వంటి ఆధునిక రచయిత్రులు రాసే రచనలు ఇందులో వచ్చేవి. మహిళా అభ్యుదయానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించవలసిందిగా సూచిస్తూ 1947 మార్చి సంపాదకీయంలో దుర్గాబాయ్ గారు రాశారు. 


తెలుగుతల్లి (1943)

రాచమళ్ళ సత్యవతీదేవి సంపాదకత్వంలో ఈ పత్రిక నడపబడింది. స్త్రీల కు సంబంధించిన వ్యాసాలు ప్రచురించబడేవి.


తెలుగుదేశం (1950)

సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి సంపాదకత్వంలో నడిచిన పత్రిక. 


బాలలబాట

యస్వీ.వి. రమణమ్మ గారి ఆధ్వర్యంలో బాలలకు సంబంధించిన మాసపత్రిక వచ్చింది. 


వనిత (1956)

అబ్బూరి ఛాయాదేవిగారి సంపాదకత్వంలో తొమ్మిదినెలలు నడిచింది. ఇది తక్కువకాలమే అయినప్పటికి విలువైన సమాచారంతో నడిచింది. హైదరాబాదు నుండి వెలువడిన మొట్టమొదటి పత్రిక. మహిళల సమస్యల పై దృష్టి పెట్టిన పత్రిక. ఎంతోమంది ప్రసిద్ధుల రచనలు ఇందులో ప్రచురించబడేవి. స్త్రీలలో చైతన్యం కలిగించే రచనలు, పిల్లల వికాసం గురించి రచనలు ఇందులో ప్రచురితమయ్యేవి. పాఠకులు చాలారోజుల వరకు ఈ పత్రిక ప్రతులను దాచుకుని మరి చదువుకునేవారు. వీటి తర్వాత వచ్చిన పత్రికలు వనితాజ్యోతి, మహిళ, వనిత వంటివి స్త్రీల పత్రికలే అయినప్పటికీ వీటిని నిర్వహించినవారు పురుషులే. 


నూతన (1978)

ఎం. రత్నమాలగారి సంపాదకత్వంలో వచ్చిన ఈ పత్రిక కొత్త రచయిత్రులను ప్రోత్సహించేది. ఈ పత్రికలో స్త్రీ విముక్తి పేరుతో ప్రత్యేకించి ఒక పేజి ఉండేది.


వసుధ (1970)

ముపాళ్ళ రంగనాయకమ్మగారి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక. మంచి ప్రమాణాలతో కూడిన వ్యాసాలుండేవి. ఇవి పాఠకులకు ఆసక్తిని కలిగించేవిధంగా ఉండేవి. 


స్త్రీస్వేచ్ఛ (1988)

మల్లాది సుబ్బమ్మగారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ పత్రిక చాలా కాలం నడిచింది. స్త్రీల అంశాల మీద కథలు, వ్యాసాలు ఈ పత్రికలో ప్రచురించేవారు. స్త్రీ సంక్షేమం కోసం కృషి చేశారు. ఈమె ఆధ్వర్యంలో స్త్రీలకు సంబంధించిన అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. మహిళాభ్యుదయ సంస్థను స్థాపించి స్త్రీ జనాభివృద్ధి కోసం శ్రమించారు. నిజాన్ని నిర్భయంగా రాయగల్గిన రచయిత్రి. జీవితం మీద విరక్తి కలిగిన ఎందరో అభాగ్యులైన మహిళకు సుబ్బమ్మగారు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నేటి మహిళలు సుబ్బమ్మగారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వాసా ప్రభావతిగారు అన్నారు. మహిళల చైతన్యం కోసం అనేక పుస్తకాలు రాశారు. ఈ పత్రిక కంటే ముందే సుబ్బమ్మగారి ఆధ్వర్యంలో వికాసం అనే పత్రిక పదేళ్ళ పాటు నడిచింది.


లోహిత (1989)

కొండవీటి సత్యవతి, జయప్రభగార్ల సంపాదకత్వంలో హైదరాబాద్ నుండి వచ్చిన పత్రిక. ’శతాబ్దాలుగా అణగారిపోయి ఉన్న ఆడవాళ్ళ విముక్తి కోసం స్త్రీవాద సాహిత్య వేదికగా లోహితను వెలువరించినట్లు’ పేర్కొన్నారు. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రిక.


మాతృక (1992)

విజయవాడ నుండి కె. రమ సంపాదకత్వం వహించారు. సంపాదకవర్గంలో మరికొంతమంది మహిళలు ఉన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడే ఉద్యమాలను ఈ పత్రిక సమర్థించేది. మహిళల పై జరిగే దౌర్జన్యాలను, అత్యాచారాలను గురించి తెలియజేసే త్రైమాసిక పత్రిక. 


ఆహ్వానం (1993) 

సామ్రాజ్యలక్ష్మి గారి సంపాదకత్వంలో వచ్చింది. ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన పత్రిక కాకపోయినప్పటికి స్త్రీల ఆధ్వర్యంలో నడిచిన పత్రిక. ఉన్నత ప్రమాణాలతో కూడిన కథలు, ఆయా రంగాలలో ప్రముఖులతో పరిచయాలు, కవితలు ప్రచురించేవారు. పి. సత్యవతి, ఓల్గా లాంటి స్త్రీవాద రచయిత్రులు, ప్రముఖ కథకుల కథలు ఉండేవి.


చూపు

కాత్యాయనిగారి సంపదకత్వంలో వచ్చింది. స్త్రీ సమస్యల మీద, సామాజికాంశాల మీద పదునైన సంపాదకీయాలతో నడిచిన పత్రిక.


తర్జని

ఎం.ఏ. వనజగారి ఆధ్వర్యంలో వచ్చిన పత్రిక. బాలల, మహిళల, వికలాంగుల, అణగారిన వర్గాలవారి హక్కుల కోసం పోరాడుతూ వారిని చైతన్యపరిచేలా నడిచిన పత్రిక.


మహిళావిజయం

వాసిరెడ్డి కాశీరత్నంగారి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక.


మహిళా స్వయంప్రభ

శివలెంక నాగ ఉదయలక్ష్మిగారి ఆధ్వర్యంలో ఈ పత్రిక నడిచింది.


భూమిక (1993) 

కొండవీటి సత్యవతిగారి సంపాదకత్వంలో ఇరవైసంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న పత్రిక. ఈ పత్రిక కోసం పనిచేయడానికి సత్యవతిగారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఇందులో పనిచేసే వారంతా స్త్రీలే, అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారే. కేవలం స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైన పత్రిక అవసరమనే ఉద్దేశ్యంతో ఎలాంటి జీతభత్యాలు లేకుండానే పనిచేస్తున్నారు. సమాజాన్ని, సాహిత్యాన్ని స్త్రీ దృష్టికోణంతో ఈ పత్రిక విశ్లేషిస్తుంది. స్త్రీవాద దృక్పథం నుండి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తుంది. గుర్తింపు పొందని స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుండి సేకరించి ప్రచురిస్తుంది. స్త్రీవాదపత్రిక అయినప్పటికీ సామాజికాంశాలను కూడా చర్చిస్తుంది. స్త్రీల, బాలికల విషయంలో, లింగవివక్ష విషయాల పట్ల ఎంతో నిష్టగా పనిచేస్తుంది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే ఈవ్ టీజింగ్, ఉద్యోగినుల సమస్యలు, కార్యాలయాలలో లైంగిక వేధింపులు, వరకట్నసమస్య, గృహహింస మొదలైన వాటిని స్త్రీలు మొన్నటివరకు మౌనంగానే భరిస్తూ వచ్చారు. ఇటువంటి వారికోసం సత్యవతిగారి ఆధ్వర్యంలో వచ్చిన "భూమిక సహాయకేంద్రం" ఎంతో ఉపయోగకరంగా ఉంది. వెన్నుతట్టి పీడిత స్త్రీల వెనుక తామున్నామనే భరోసా ఇచ్చింది. తెలుగులో ఇప్పటికీ నిరంతరం కొనసాగుతున్న ఏకైక స్త్రీవాదపత్రిక. ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటుమీడియాలో జాతీయ అవార్డు లభించింది. సత్యవతిగారి సంపాదకీయాలు చైతన్యాన్ని కలగజేసే విధంగా ఉంటాయి. వ్యవసాయ సంక్షోభం, ప్రపంచీకరణ పరిణామాలు, దళిత స్త్రీ సమస్య, చేనేత సంక్షోభం, పిల్లల ప్రత్యేకం, స్త్రీలు- మానసిక ఆరోగ్యం, హెచ్.ఐ.వి./ ఎయిడ్స్, ఇలా ఎన్నో అంశాల మీద ప్రత్యేక సంచికలు వచ్చాయి. కాలానుగుణంగా నడుస్తున్న అన్ని సమస్యల గూర్చి ఈ పత్రికలో సంపాదకీయాలు వస్తుంటాయి. ఇక భూమిక ప్రధాన ఆశయం మహిళాసమస్యలను చర్చించటం, వారిని చైతన్యవంతం చేయడం. వాటిలో భాగంగా స్త్రీలు తమ ప్రతిభా పాటవాలను ఇతరులతో పంచుకునేవిధంగా చేయడం, ప్రపంచసాహిత్యంలో స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయటం, స్త్రీ వాస్తవ జీవితాశలను ప్రతిబింబించే వాటిని సేకరించడం, స్త్రీ విషయాల మీద ప్రభుత్వ ప్రణాళికలు, వాటి పనితీరు, స్త్రీ సంఘ కార్యకర్తల అభిప్రాయాలు మొదలైన వాటిని ప్రచురిస్తుంది. కావున ఈ పత్రిక మరింత ముందుకు సాగుతూ విజయవంతంగా నడవాలని కోరుకుందాం. 


మహిళావర్గం

తిరుపతి నుండి విష్ణుప్రియ సంపాదకత్వం వహించారు. కొంతకాలం తరువాత హైదరాబాద్ నుండి పి. పవన సంపాదకత్వంలో నడిచింది. వీరిద్దరితో పాటు కొంతమంది మహిళాసభ్యులు కూడా ఉన్నారు. స్త్రీని పురుషునికి బానిసగా మార్చే క్రమంలో నిర్వచనాలతో ప్రచురించేవారు. స్త్రీల పట్ల చూపించే వివక్షను గూర్చి రాసిన పత్రిక.


మహిళామార్గ్ & స్త్రీగర్జన

విష్ణుప్రియ గారి సంపాదకత్వంలో ఈ రెండు పత్రికలు వచ్చాయి. సాంఘిక సేవలో మహిళా ఉద్యమాలలో ఎన్నో యేళ్ళుగా పనిచేస్తున్నారు.


చైతన్యమానవి (2002)

స్త్రీల ఆధ్వర్యంలో వచ్చిన మరో పత్రిక. ఐద్వా (ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్) ఈ పత్రికను ప్రచురిస్తుంది. ఎస్. పుణ్యవతి సంపాదకత్వం వహించారు. మరికొంతమంది మహిళలు సంపాదకవర్గంలో ఉన్నారు. కథలు, కవితలు, వ్యాసాలు, ఉద్యమవార్తలు ప్రచురించబడేవి. మహిళల్లో అభ్యున్నతి, చైతన్యం నింపేందుకు దోహదపడుతున్న పత్రిక. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగానూ, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నది. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలు, మహిళల ఆర్ధిక స్థితిగతులు, విద్య, వైద్య, మహిళాచట్టాలు, హింస, మీడియాపాత్ర తదితర అంశాలు పై చర్చించేది. 


నవోదయం

చిత్తూరు జిల్లా నుండి స్వయం సహాయక సంఘాలు తమ స్వశక్తితో నడుపుతున్న స్త్రీల పత్రిక. ఈ పత్రికకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. స్వయం సహాయక సభ్యులైన మహిళలు తమ ప్రతిభతో, స్వశక్తితో మహిళల కష్ట సుఖాలకు సంబంధించిన కథనాలు, డ్వాక్రా మహిళల ఎదుగుదల, వృత్తి నైపుణ్యశిక్షణా కార్యక్రమాలలో మహిళలకు ఈ పత్రిక ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మహిళల ఎదుగుదలకు దోహదం చేస్తున్నారు. ఆరోజులలో మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాలును కూడా మానవీయకోణంలో కథనం రాసి ప్రజల మనస్సులకు దగ్గరయ్యారు. మహిళలుగా వారికి తెలిసిన విషయాల పై వారు ఎదుర్కొంటున్న సమస్యల పై కథలు రాసి ప్రచురించేవారు. గ్రామీణ పేద మహిళలు రాసుకుంటున్నపత్రిక. గ్రామీణ స్త్రీలే ఎడిటర్లు, రిపోర్టర్లుగా ఉన్నారు. వారివారి గ్రామాల్లోని సమస్యలు గూర్చి తాము సాధించిన విజయాల గురించి, సారా సమస్యల గూర్చి రాస్తుంటారు. తమప్రాంతాలలోని ఉద్యోగుల అవినీతి గురించి, గ్రామాల్లోని ఆరోగ్య సమస్యల గురించి వచ్చిన రచనలను ప్రచురిస్తారు. గ్రామీణ స్త్రీల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక. 


ముగింపు

పత్రికా నిర్వాహకులకు ఎంతో చారిత్రక అవగాహన ఉండాలి, మరెంతో దూరదృష్టి ఉండాలి. తెలుగులో పత్రికలకు మహిళలు ఒక శతాబ్ది కాలం (1902-2013 ప్రస్తుతం) కిందటినుంచి సంపాదకత్వం వహిస్తున్నారు. వీటిలో కొంతకాలం పనిచేసి ఆగిపోయిన పత్రికలు ఉన్నాయి, అలాగే నిరంతరం ఇప్పటికీ నడుస్తున్న పత్రికలు ఉన్నాయి. వీటన్నింటి ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ చైతన్యం. ఇవన్నీ కూడా సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఆడవారి అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తున్నాయి. ఒకప్పుడు మహిళా సంపాదకులు ఆరోజుల్లో ప్రధానంగా కనిపించే సమస్యలు బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వేశ్యావృత్తి మొదలైన వాటిపై పత్రికలలో చర్చించేవారు. ఈరోజుల్లో ప్రస్తుతం బాలికలకు చదువుకునే అవకాశం లేకపోవడం, స్త్రీల పై అత్యాచారాలు, వరకట్నసమస్యలు మొదలైన వాటిపై చర్చించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా స్త్రీలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా మనందరం సాహిత్య సృజన చేయాలి.