Monday, November 18, 2019

🌺🌹జయదేవ బృందావనం(అష్ట పది )🌺🌹

🌺🌹జయదేవ బృందావనం(అష్ట పది )🌺🌹


🚩మామియం చలితా


రాధా విరహంలో బాధపడుతున్న కృష్ణుని ఈ అష్టపదిలో మనం చూడవచ్చు. ఆ విరహంలో కృష్ణుని వేణుగానం మాటలుగా మారి మనలిని అలరిస్తుంది.


మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన


సాపరాధతయా మయాపి న వారితాతిభయేన


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


నా చుట్టూ స్త్రీల గుంపు ఉన్నారు. రాధాదేవి చూడగూడని స్థితిలో బృందావనంలో నన్ను చూసింది. హృదయం కదిలిపోయి ఉంటుంది. నేరం చేసిన వాడిని కాబట్టి నన్ను చూసి కూడా పలకరించకుండా వెళుతున్న ఆమెను ఆపలేకపోయాను. కటకటా! ఆ రాధ కోపాన్ని పొంది ఆదరణ లేకుండా వెళ్ళిపోయింది.


విశేషం


తప్పు చేసానని ఒక పక్క ఒప్పుకొంటున్నాడు. మరో పక్క రాధ ఆదరణ లేకుండా వెళ్ళిందంటున్నాడు. చాలా తమాషా నేరం ! ఇది భావ చమత్కారం .హరి (కృష్ణుడు) 'హరిహరీ’ అనుకోవటం శబ్ద చమత్కారం🚩కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ


కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


ఆ రాధ చాలాకాలం నా విరహంతో ఉన్నది. నా విరహం పోగొట్టుకోవడానికి ఏమి చేస్తుంది?. ఏమి చెబుతుంది? ఆ రాధ లేకపోతే నాకు ధనంతో ఏమి ఉపయోగం? సేవకులతో ఏమి పని? ఇంటితో ఏమి పని? బతికి ఏమి ప్రయోజనం?


విశేషం


ఎవరివల్ల అయితే తాను బాధ పడుతున్నాడో ఆమె గురించి నాయకుడు బాధపడటం ఇందులో తమాషా .🚩చింతయామి తదాననం కుటిలభ్రు కోపభరేణ


శోణ పద్మమివొపరి భ్రమతాకులం భ్రమరేణ


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


ఎక్కువ కోపంతో కనుబొమలు వంకరయ్యాయి. తుమ్మెదల వలె అవి కదులుతుంటే కదిల్చిన ఎర్రటి పద్మం లాగా ఆమె ముఖం ఉంది.. దాన్ని తలుస్తున్నాను.


విశేషం


కను బొమలను తుమ్మెదతో, ముఖాన్ని ఎర్ర తామరతో పోలుస్తున్నాడు. కోపంతో తిరిగే కనుబొమలు ముఖమనే పద్మం కోసం అటు ఇటు తిరుగుతున్నాయని మధురమైన భావం


🚩తాం అహం హృది సంగతామనిశం భృశం రమయామి


కిం వనే నుసరామి తామిహ కిం వృథా విలపామి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేనతాత్పర్యం


నేను ఆడవిలో ఆ రాధను గూర్చి ఎందుకు వెదుకుతున్నాను? ఇక్కడ ఎందుకు వ్యర్థంగా ఏడుస్తున్నాను!? నా హృదయంలో ఎప్పుడు కలిసి ఉన్న ఆమెను బాగా రమించుచున్నాను (ఇక వేరుగా వెదకటం ఎందుకు?)


విశేషం


ఇక్కడ జీవాత్మ రాధ. పరమాత్మ కృష్ణుడు . నిరంతర స్మరణంతో ముక్తి లభిస్తుంది. జయదేవుని శృంగారం భౌతికాతీతమని ఈ చరణంలో మనకు స్పష్టమవుతుంది .🚩తన్వి!ఖిన్నమసూయయాహృదయం తవాకలయామి


తన్నవేద్మికుతోగతాసినగతాసి నతేన తేనునయామి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యము


ఓ రాధా ! నీ హృదయము అసూయ చేత బాధపడినదని నేను ఊహిస్తున్నాను. ఎందుకు వెళ్ళావో దానిని తెలియకున్నాను. నీకు నమస్కరించటం చేత బతిమాలుకొనుచున్నాను.


విశేషం


రాధా ఎందుకు వెళ్లిందో కృష్ణునికి తెలుసు. అయినా కారణం తెలియనట్లు మాట్లాడటం శృంగారపర్వంలో ఒక సొగసు.🚩దృశ్యసే పురతొ గతాగతమేవ మే విదధాసి


కిం పురేవ స సంభ్రమ పరిరంభణం న దదాసి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


ఓ రాధా! నా ముందు కనబడుచున్నావు. రావటం పోవటం చేస్తున్నావు. ఎందుకు ఇదివరకటిలా ఆశ్చర్యకరంగా నీ కౌగిలి ఇవ్వవు!?


విశేషం


కౌగిళ్ళలో ఆశ్చర్యం కలిగించే కౌగిళ్ళు ఉంటాయి. అవేమిటో రసిక శిఖామణులకు తెలుసు.


🚩క్షమ్యతాం అపరం కదాపి తవేదృశం న కరోమి


దేహి సుందరి దర్శనం మమ మన్మథేన దునోమి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


అందమైన దానా! ఈ దాసుని క్షమించు. ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయను. నాకు నీ దర్శనము ఇమ్ము మన్మథుడు నన్ను కోసి వేస్తున్నాడు


విశేషం


'ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయను.' ఈ వాక్యాన్ని మనమొక సారి పైకి చదువుకొంటే ''ఇంకోరకంగా చేస్తాను" అనే అర్థం వస్తుంది. ఇది ధీర లలిత నాయకుని చమత్కారం.


🚩వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన


బిందుబిల్వ సముద్ర సంభవ రొహిణీరమణేన


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


హరి దాసుడైన బిందుబిల్వ వంశమనే సముద్రంలో పుట్టిన రోహిణికి ఇష్టుడైన


(అనగా బిందుబిల్వ వంశమునకు చంద్రునివంటి) జయదేవ కవి దీనిని చెప్పాడు.


విశేషం


చంద్రుని చల్లదనం అందరికి ఇష్టం.


చంద్రుడిలాంటి జయ దేవుడి కవిత్వమన్నా ఆందరికీ ఇష్టం.


రోహిణీ రమణుడిని అని కవి చెప్పుకోవటంలో విశేషమిది.


- స్వస్తి.


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Tuesday, October 29, 2019

🚩 చనిపోవడమంటే !!!

🚩 చనిపోవడమంటే !!!


👏🏿👏🏿👏🏿👏🏿


చావుగురించి ఆలోచించడం, భయపడడం రెండూ వ్యర్ధమే!


👇💥👇


👉🏿ముందు చనిపోవడమంటే ఏమిటో తెలిస్తే,


ఎక్కడికెడతామనే విషయం ఇట్టే అర్ధమౌతుంది.


సమాజంలో "మరణం" అనే అంశంచుట్టూ రకరకాల


అభూతకల్పనలు ప్రచారంలో వున్నాయి.


స్వర్గం-నరకం, దేవుడు-దయ్యం, పాపం-పుణ్యం,


ఆత్మ-పరమాత్మ ఇలాంటి పదాలన్నీ వొట్టి కల్పన!


ఇదంతా మానవుడి ఊహే తప్ప, ఇలాంటివేవీ లేవు.


ఉండటానికి అవకాశమేలేదు.


మానవదేహం కూడా అచ్చంగా వొక మెషీన్ లాంటిది. లాంటిదేమిటి?


మన దేహం అక్షరాలా వొక బయో మెషీన్. జీవక్రియలు ఆగిపోయినపుడు,


ఇదీ పనిచేయడం మానేస్తుంది. దేహంనుండి బయటికొచ్చే


ఆత్మల్లాంటివేవీ వుండవు. తరువాత మనకు తెలిసేది,


తెలుసుకునేదీ ఏదీ వుండదు.


బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయినపుడు, ఇక మెమరీ కూడా బందే!


ఇక దేహం కూడా మట్టిలో కలిసిపోతుంది. అంతటితొ కథ ముగుస్తుంది!


కానీ, నిజానికి ప్రాణులకు మరణం వుండదు.


ఎందుకంటే, ప్రతీ ప్రాణీ తనలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా తనలాంటి


మరొజీవికి ప్రాణ ప్రతిష్టచేసి, తరువాత, నశించిపోతుంది.


కాబట్టి, తల్లిదండ్రుల సంతానం వారి జీవక్రియకు కొనసాగింపు!


ఇక మరణమెక్కడ? ప్రత్యుత్పత్తియే జీవుల సహజ ధర్మం!


అంతకుమించి యీ దేహానికి వేరే ప్రయోజనం లేదు.


ఇదే సృష్టి (ప్రాకృతిక) రహస్యం! వినడానికి రుచించకపోయినా అదే నిజం.


కాబట్టి, అపురూప జన్మని సార్ధకం చేసుకోవాలి అందరూ!


ఒంటరితనం పెద్ద శత్రువు! అందుకే, క్రొత్త వ్యాపకాలతో మనుషులమధ్య


జీవిస్తూ వుండటమే, డిప్రషన్ కు మందు!


చావుగురించి ఆలోచించడం, భయపడడం రెండూ వ్యర్ధమే!


ప్రయత్నిస్తే, తెలుసుకోదగిన క్రొత్త విషయాలు, నేర్చుకోవడానికి బోలెడు


అవకాశాలూ యీ భూమండలంలో కోకొల్లలు.


ఆసక్తి, సంకల్పబలం మాత్రమే కావలసింది!👏🏿👏🏿👏🏿👏🏿


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿


Sunday, October 27, 2019

🚩తోలుబొమ్మలాట !🌹🌹


🚩తోలుబొమ్మలాట !🌹🌹💥💥💥


తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.


తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు


కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య


విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు.


తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు.


రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు.


తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు.


కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన


ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.


తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు,


రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు


వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది


యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ


మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు


మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును.


ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు.


అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను


నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు .


తోలుబొమ్మలాటలో పాత్రలు


తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు


వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల


మనస్సులపై విశేషాదరణ చూపుతాయి. తోలుబొమ్మలాటలో


ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఈ హస్యపాత్రలకు


అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రలను సామాజిక


స్థితిగతులకు దర్పణంగా నిలిపి, పాత్రల ద్వారా సమాజంలో ఉండే


దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగడతారు.


ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు


మొదలైనవి చోటు చేసుకుంటాయి.


అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి


వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి


సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిళ్ల, మద్దెల, డప్పు,


గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం,


భారతం లకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి.


లంకాదహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం,


మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం


వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు.


సూత్రధారుడు


నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు.


జుట్టుపోలిగాడు, బంగారక్క


ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో


ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి.


మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను


కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా


ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు


సరసమాడుతుంది.


అల్లాటప్పగాడు, కేతిగాడు


పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు


ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునే దానికి (లోబరుచుకునే)


దానికి ప్రయత్నిస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు


హఠాత్తుగా కేతిగాడు ఊడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని


బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై


శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ


కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు.


ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.


వార్తాపత్రికలు, రేడియో వంటి సమాచార వ్యవస్థలేని తొలిరోజుల్లో


తోలుబొమ్మలాట సమాచార మాథ్యమంగా పనిచేసిందని చెప్పవచ్చు


.


తోలుబొమ్మలు - ఆవిర్భావం


తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.


పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష


పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే


సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను


తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం


కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను


ప్రదర్శించేవారు. ఈ విధంగా తోలుబొమ్మలాట పుట్టిందని,


ఈ ఆట పండితుల చేత మెరుగులు దిద్దుకున్నదని, చెప్పడానికి


అమరకోశం లోని శ్లోకాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు.


ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన


కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు,


కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి.


పాశ్చాత్యదేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను


ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ


లభించిందని తెలుస్తున్నది. పర్షియా, టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో


ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని


ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీ కి,


అక్కడినుండి ఫ్రాన్స్ లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు


వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో


భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని


చెప్పవచ్చు.


(సేకరణ..... వింజమూరి .)


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Monday, October 21, 2019

🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹

🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹


(బాలకాండ మందరమకరందం..సర్గ-49


💥💥


రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా,


ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది.


అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో


"ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు


. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు.


"ఓ రామా! ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య అహల్య.


ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని


వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను


అడిగాడు.


తన భర్త వేషంలో వచ్చింది దేవేంద్రుడని అని తెలుసుకున్నది


అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది.


అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను


చూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు.


ఇంతలో గౌతముడు దర్భలను, సమిధలను తీసుకొని ఆశ్రమానికి


వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసాడు. జరిగిన


విషయం గ్రహించాడు.


"ఓ దుర్మతీ! నేను ఆశ్రమంలో లేని సమయంలో నా వేషంలో నా


ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించినందుకు నీకెదే నా


శాపం. నీ వృషణాలు కింద పడిపోవుగాక" అని శపించాడు


గౌతముడు. అతని శాపం ఫలితంగా ఇంద్రుని వృషణాలు నేల మీద


పడిపోయాయి.


తరువాత గౌతముడు తన భార్య అహల్యను చూసాడు.


అహల్య గడగడ వణికిపోయింది. గౌతముడు తన భార్యతో "


అహల్యా! నువ్వు పాపం చేసావు. కాబట్టి నువ్వు అదృశ్యరూపంలో


మట్టిలో దొర్లుతూ, కేవలం గాలినే ఆహారంగా స్వీకరిస్తూ, తపస్సు


చేసుకుంటూ వేల సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే ఉండు.


దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినపుడు


నీకు శాపవిముక్తి కాగలదు. రాముని పూజించిన తర్వాత నీలో


మోహం నశించి పరిశుద్ధురాలై నన్ను చేరగలవు" అని పలికాడు.


వెంటనే గౌతముడు ఆశ్రమం విడిచి హిమత్పర్వతానికి


వెళ్ళిపోయాడు.


గౌతముని శాపంతో వృషణాలు పోయిన ఇంద్రుడు ఎంతో


దు:ఖించాడు. అగ్ని మొదలగు దేవతలతో, ఋషులతో,


"నేను మీకోసమే ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి


అతని తపస్సు వృధా చేసాను. దేవకార్యన్ని సాధించాను.


కానీ నా వృషణాలను పోగొట్టుకున్నాను. కాబట్టి మీరే నా వృషణాలు


మరల వచ్చేటట్టు చేయాలి" అని అడిగాడు.


దేవేంద్రుని మాటలు విన్న దేవతలందరూ పితృదేవతల వద్దకు వెళ్ళి


వారికి యజ్ఞములో అర్పించిన మేషముల వృషణాలు ఇంద్రునికి


ఇవ్వవలసిందిగా అడిగారు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు


యజ్ఞములో అర్పించిన మేషము యొక్క వృషణాలను ఇంద్రునికి


ఇచ్చారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.


రామా! ఇక మనము ఆశ్రమంలోకి వెళ్దాము. అక్కడ అహల్యకు


శాపవిమోచనం కలిగించు." అని చెప్పాడు విశ్వామిత్రుడు.


విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. అప్పటి


దాకా గౌతముని శాపం వల్ల ఎవరికీ కనపడని అహల్య, రామునికి


కనిపించింది. రామ పాద ధూళి సోకిన అహల్యకు శాపవిమోచనం


అయింది. రామలక్ష్మణులు అహల్యకు నమస్కరించారు.


అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి.


రామునికి అతిథి మర్యాదలు చేసి సత్కరించింది.


ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌతముడు రామ దర్శనం చేసుకొని


పునీతయైన భార్యను స్వీకరించాడు. దంపతులిద్దరూ రాముని


పూజించి తపస్సుకు వెళ్ళిపోయారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని


అనుసరించి మిథిలకు చేరుకున్నారు.


🌹🌹🌹🌹🌹💥💥💥💥💥🌹🌹🌹🌹🌹🌹

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!


(టీకా ..భావం )కరిఁ దిగుచు మకరి సరసికిఁ


గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్


గరికి మకరి మకరికిఁ గరి


భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్.


టీకా:


కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగులోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = క్రూరస్వభావము, పట్టుదల; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భారమైనది; అనుచున్ = అంటూ; అతల = పాతాళలోకపు; కుతల = భూలోక; భటుల్ = వీరులు; అరుదు = ఆశ్చర్య; పడన్ = పడగా.


భావము:


మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు” అనుకుంటు పాతాళ, భూ లోకాల శూరులూ ఆశ్చర్య పోయారు.


🚩


శా.


నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స


న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ


ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే


కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!


టీకా:


నానా = అనేకమైన; అనేకప = ఏనుగుల; యూధముల్ = సమూహములు; వనము = అడవి; లోనన్ = అందు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; సన్మానింపన్ = గౌరవించుండగ; దశలక్షకోటి = పదిలక్షలకోట్ల; కరిణీ = ఆడ యేనుగులకు; నాథుండను = పతిని; ఐ = అయ్యి; ఉండి = ఉండి; మత్ = నా యొక్క; దానా = మద; అంభస్ = జలముచే; పరిపుష్ట = చక్కగా పెరిగిన; చందన = గంధపు; లతాంత = తీవ లందలి; ఛాయలన్ = నీడల; అందున్ = లో; ఉండన్ = ఉండ; లేక = లేకపోయి; ఈ = ఈ; నీర = నీటిపైని; ఆశన్ = ఆశతో; ఇటు = ఈవైపునకు; ఏల = ఎందుకు; వచ్చితిన్ = వచ్చితిని; భయంబు = భయమేస్తోంది; ఎట్లో = ఏలాగో; కదే = కదా; ఈశ్వరా = భగవంతుడా.


భావము:


చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.


🚩


కలఁ డందురు దీనుల యెడఁ,


గలఁ డందురు పరమయోగి గణముల పాలం,


గలఁ డందు రన్నిదిశలను,


గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?


టీకా:


కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ = అత్యుత్తమమైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను = దిక్కు లందును; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; అనెడి = అనబడెడి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేడో = లేడో.


భావము:


దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!


🚩


క.


లోకంబులు లోకేశులు


లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం


జీకటి కవ్వల నెవ్వం


డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.


టీకా:


లోకంబులున్ = లోకములు; లోకేశులున్ = లోకాలను పాలించేవారు; లోకస్థులు = లోకములలో నుండువారు; తెగిన = నశించిన తరువాత; తుదిన్ = కడపట; అలోకంబున్ = కనబడనిది, గుడ్డిది; అగు = అయిన; పెంజీకటి = గాఢాంధకారము; కిన్ = నకు; అవ్వలన్ = ఆవతల; ఎవ్వండు = ఎవడు; ఏక = అఖండమైన; ఆకృతిన్ = రూపముతో; వెలుగున్ = ప్రకాశించునో; అతనిన్ = అతనిని; ఏన్ = నేను; సేవింతున్ = కొలచెదను.


భావము:


లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.


🚩


ఉ.


ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;


యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం


బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ


డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


టీకా:


ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = లోపల; ఉండున్ = ఉండునో; లీనము = కలిసిపోయినది; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము పొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైన ప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణభూతుడు; ఎవ్వడు = ఎవడో; అనాదిమధ్యలయుడు = ఆదిమధ్యాంతలలో శాశ్వతముగా నుండువాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నా యొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను.


భావము:


ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.


🚩


శా .


"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్


ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;


నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;


రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!


టీకా:


లావు = శక్తి; ఒక్కింతయున్ = కొంచెము కూడ; లేదు = లేదు; ధైర్యము = ధైర్యము; విలోలంబు = తగ్గి; అయ్యెన్ = పోయింది; ప్రాణంబులున్ = ప్రాణములు; ఠావుల్ = స్థానములనుండి; తప్పెన్ = చలించిపోతున్నాయి; మూర్ఛ = మగత; వచ్ఛెన్ = వస్తున్నది; తనువున్ = శరీరము; డస్సెన్ = అలసిపోయింది; శ్రమంబున్ = కష్టముగా; అయ్యెడిన్ = ఉన్నది; నీవే = నీవు మాత్రము; తప్పన్ = తప్పించి; ఇతఃపరంబు = మరింకొకరుని; ఎఱుంగన్ = తెలియను; మన్నింపన్ = ఆదుకొన; తగున్ = తగినవాడను; దీనునిన్ = దీనావస్థ నున్నవాడను; రావే = రమ్ము; ఈశ్వర = భగవంతుడ; కావవే = కరుణించుము; వరద = వరముల నిచ్చెడివాడ; సంరక్షింపు = కాపాడుము; భద్రాత్మక = శుభమే తానైనవాడ.


భావము:


దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!


🚩


మ .


అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా


పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో


త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.


టీకా:


అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరి = రాజ భవన సముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత; ఉపల = శిల (పైన); ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించు చున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో నున్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అను; కుయ్యాలించి = మొర ఆలించి; సంరంభి = వేగిరపడు తున్న వాడు; ఐ = అయ్యి.


🚩


మ .


సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే


పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం


తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో


పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.


విష్ణుమూర్తి పరికరాదులు


టీకా:


సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుట లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుటలేదు; ఏ = ఏ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవిదుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమ్మిల్లమున్ = జుట్టుముడిని; చక్కనొత్తడు = చక్కదిద్దుకొనుట లేదు; వివాద = ప్రణయకలహము నందు; ప్రోత్థిత = పైకిలేచుచున్న; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీరకొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; అవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి.


భావము:


గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.


🚩


క .


అడిగెద నని కడు వడి జను


అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్


వెడ వెడ జిడి ముడి తడ బడ


నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!


టీకా:


అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగినప్పటికిని; తను = అతను; మగుడ = మారుపలుకులు; నుడుగడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.


భావము:


అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.


కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –


ఈ పద్యం చూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం కాదు అమృత గుళిక.


(వింజమూరి సేకరణ .)

🚩శుభం .-గజేంద్ర మోక్షము.👏🏿👏🏿

🚩శుభం .-గజేంద్ర మోక్షము.👏🏿👏🏿

💥💥💥

🚩త్రికూట పర్వతారణ్యములో ఒక గజరా జుండెను.

అతనికి దశలక్ష భార్యలు గలరు .అతడొకనాడు భార్యలతో

అడవిలో దిరుగుచు దాహమువేసి, ఒక చెరువులో దిగి

నీళ్ళు ద్రావి, కరిణులతో జలక్రీడలకు దిగి, చెరువు నంతయు

కలచివేసెను.

ఆ చెరువులో పెద్దమొసలి యున్నది.

అది వచ్చి గజరాజు కాలుపట్టుకొనేను.

ఏనుగు విదిల్చి కొట్టెను. మొసలి మరల పట్టుకొని విడువలేదు.

లోపలికి లాగుచుండెను. గజము ఒడ్డునకు లాగుచుండెను.

పోరు ఘోరమయ్యెను. వేయి యేండ్లు గడిచేను.

స్థానబలముచేత నీటిలోని మొసలి మరింత విజ్రు౦భి౦చెను.గజరాజునకు బలము సన్నగిల్లెను.

మొసలిని గెలువగలనా లేదా యని సందేహము కలిగెను.

రక్షించువా రెవ్వ రను కొనెను.

పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు

రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను.

అప్పుడు

💥శా|| లా వొక్కింతయు లేదు ధైర్యము విలోల౦బయ్యె ప్రాణ౦బులున్ ఠావుల్ దప్పెను, మూర్చ వచ్చే,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవేతప్ప నిత:పరం బెరుగ, మన్నింప పందగుం దీనునిన్ రావే! యీశ్వర!కావవే వరద!సంరక్షింపు భద్రాత్మకా!

అని మొరపెట్టుకొనెను. 💥💥💥

ఆ మొర విని విష్ణుదేవుడు కరిగిపోయేను.

తాను విశ్వమయుడు గాన, గజేంద్రుని రక్షింపదలచెను.

🚩అహంకారము జీవలక్షణము. అది జీవుని అంత త్వరగా వదలదు.

అది ఉండుట, అవసరమే అయినను మితి మీరకూడదు.

ఆత్మరక్షణకై సకలజీవులు ప్రయత్నించెను. అది తప్పు కాదు.

తానే బలవంతుడ నను అహంకారము అనర్ధము తెచ్చును.

గజేంద్రుడు తన్నుతాను రక్షించుకొనుటకై పోరాడునంత కాలము

శ్రీనాథుడు పట్టించుకోలేదు. మన యవసరము లేదు

లెమ్మని యూరకున్నాడు.

ద్రౌపది విషయంలో గూడా ఇంతేకదా!

దుశ్శాసనుడు చీర లోలుచుచు౦డగా ఆత్మరక్షణకై చాలా

ప్రయత్నించిన దామె. శత్రువుముందు తమ బలము చాలదని

గ్రహించిన తరువాతనే వారు దైవమును శరణు వేడిరి .

అంతవరకును చూచుచు ఊరకుండిన శ్రీహరి

అప్పుడు రంగంలోనికి దిగినాడు. అది అతని శరణాగత రక్షణ

గుణమునకు పరాకాష్ట. సర్వమునకు దైవమే శరణ్య మని నమ్మిన

భక్తులను అయన ఆత్మీయులుగా భావించి రక్షించును.

శ్రీహరి గజరాజు మొర వినగానే ప్రక్కనున్న లక్ష్మితో గూడా చెప్పకుండా

పరుగుల మీద వచ్చి చక్రాయుధముతో మొసలిని జంపి గజరాజును కాపాడినాడు.

🚩అని శుకముని పరీక్షిత్తునకు జెప్పి,

“రాజా! గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడను రాజు .

విష్ణుభక్తుడు. ఒకనాడు అతడు శ్రీహరి ధ్యానములో నుండగా

అగస్త్యుడు అక్కడకు వచ్చెను . రా జతనిని జూడలేదు.

అందుచే ఆ ముని కోపించి “ నీవు మదముతో నాకు మర్యాదలు

చేయవైతివి కావున మదగజమవై పుట్టు “ మని శపించెను.

🚩పుజి౦పదగిన మహాత్ములను

పూజించకుండుటశ్రేయోభంగకరము గదా!

అట్లు ముని శాపమున ఆ రాజు గజరాజై పుట్టెను.

పూర్వజన్మవాసన చేత మనసులో హరిభక్తి అంకురించి విష్ణుదేవుని

యనుగ్రహమునకు పాత్రుడయ్యేను.

మొసలి, హుహు అను గంధర్వుడు . దేవలుని శాపముచే

అట్లాయ్యెను.శ్రీహరి చక్రధారచే చచ్చి పుణ్యగతికి బోయేను.

విషమ పరిస్థితులలో చిక్కుకొన్న వా రేవ్వరైనను

ఈ గజేంద్రమోక్షణ కథను భక్తితో చదివినను,

విన్నను సర్వాపదలు తొలగిపోయి సుఖపడుదురు.

ఉత్తమగతిని గజేంద్రునివలె పొందుదురు.

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩

🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿


భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని


చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం .


“ నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను.


‘నన్ను మఱచిన యెడలన్ మఱతును.’


ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా


నన్నే నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను.


‘యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని ’ వారిని


కాపాడతానంటాడు పరమాత్మ.


తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని,


తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని “ స్పష్టంగా


చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో.


(8-130).


" నీవే తప్పనిత: పరంబెరుగన " నే ఆత్మసమర్పణ భక్తునిలో


కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది.


అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది .


అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి. ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి.


ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు.


” ప్రబలమైన విష్ణుభక్తి సెడదు “(8-126).


అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. దైవబలం లేనందువల్లనే


గుణ రహితులైన దుర్జనులకు ఏనుగులు ,గుఱ్ఱాలు , సంపదలు , ఆలుబిడ్డలు నశించిపోతారు. గుణవంతులైన వారు చెడకుండా జీవిస్తారు. వారిలో విష్ణుభక్తి యందు ఆసక్తి పెరుగుతుంది..


అందుకే ‘ చెడని పదార్ధములు విష్ణుసేవానిరతుల్ ’. అన్నాడు పోతన.


ఆంధ్ర మహాభాగవతం అష్టమస్కంధం లో


మనకు గజేంద్ర మోక్ష ఘట్టం దర్శనమిస్తుంది.


ఈ వృత్తాంతం ఒకనాట తెలుగునాట పరిపాటి గా వినిపించిన ప


రమ భక్తిమయ కావ్యం.


ఐదవ తరగతి తోనే విద్యాభ్యాసం అయిపోయే ఆనాటి రోజుల్లో ఆంధ్రదేశం లో తల్లిదండ్రులు తమ పిల్లలకు తెచ్చి ఇచ్చి చదివించే పుస్తకాల్లో ఒకటి


ఈ గజేంద్ర మోక్షం. డెబై,ఎనభై సంవత్సరాలకు పూర్వమే


పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్ధన చేయించేటప్పుడు “ఎవ్వని చే జనించు జగమెవ్వనిలోపల “ అనే పద్యాన్ని చెప్పించేవాళ్లు.


అది నాటి సమాజం మీద ఆంధ్ర మహాభాగవత ప్రభావానికి నిదర్శనం.


ఏభైయ్యారు సంవత్సరాలక్రితం నాచేత ఆ పద్యాన్ని చదివింపచేసిన


మేష్టారు నాకు ఇప్పటికీ గుర్తున్నారు.


పాలసముద్రం లో త్రికూటమనే ఒక పర్వతం ఉంది. దానికి బంగారం, వెండి, ఇనుము తో నిండిన మూడు శిఖరాలున్నాయి. అది పదివేల ఆమడల పొడవు, అంతే వెడల్పు , ఎత్తు కలిగి ఉంది. ఆ పర్వత సమీపం లోని అడవుల్లో కొన్ని మదపుటేనుగుల సమూహాలున్నాయి. అవి గుంపులు గుంఫులు గా సంచరిస్తూ పచ్చని పచ్చిక బయళ్లను వాసన చూసి,కాళ్లతో మట్టగిస్తూ, పండ్ల చెట్లను రాసుకుంటూ, కొమ్మలను విరుస్తూ, చిన్నచిన్న జంతువులను బెదరిస్తూ విహరించసాగాయి. అలా తిరుగుతున్న ఏనుగుల గుంపులో ఒక గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో చెర్లాడుతూ గుంపు నుండి వెనకపడ్డాడు. దైవవశం చేత తెలివి కోల్పోయి, దారితప్పి, ఆడ ఏనుగులతో కలిసి వేరుమార్గాన ప్రయాణించసాగాడు. దప్పిక తో అలసిపోయిన ఆడ ఏనుగులు వెన్నంటి రాగా, ఆయాసం తో అలసి పోయి, ప్రయాణించి, ప్రయాణించి, ఒక మడుగు చెంతకు చేరుకున్నాడు గజేంద్రుడు.


పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అథినాధుడైన ఆ గజేంద్రుడు ఆ సరస్సులో అత్యంత విలాసం గా, విహరించసాగాడు. అదే సమయం లో ఆ మడుగు లో ఉన్న ఒక మొసలి రాహువు సూర్యుణ్ణి పట్టు కున్నట్టుగా ఆ గజేంద్రుని ముందు రెండు కాళ్లను ఒడిసి పట్టుకొని నీటి లోపలికి లాగసాగింది. కాని ఆ గజేంద్రుడు ఏమాత్రం భయపడలేదు.తన దంతాల మొనలతో బలంగా ఆ మొసలి చిప్పల క్రిందిభాగాలు కదిలిపోయేటట్లుగా పొడిచింది. ఆ మొసలి పట్టు తప్పింది. అది ఏనుగు కాళ్లు వదిలి దానితోకను తన కోరలతో కొరికింది. ఈ విధం గా ఆ కరి, మకరుల పోరాటం వెయ్యేండ్లు భయంకరం గా, అతిభయంకరం గా జరిగింది. అతల కుతల లోకాల్లోని వారంతా ఆ కరి మకరుల పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయారు.


‘ కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్


గరికి మకరి మకరికిఁ కరి భర మనుచును నతల కుతల భటు లరుదుపడన్ ’ ( 8 – 54).


ఆ పోరాటాన్ని చూసిన వారు ఒకసారి ఏనుగు కంటే మొసలి బలమైనదని , మరోసారి మొసలి కంటే ఏనుగు బలమైందని అనుకోసాగారట. క్రమక్రమంగా గజరాజు బలం క్షీణించసాగింది. స్ధానబలం తో మొసలి విజృభించసాగింది. అంతా బాగున్నప్పుడు తన అంతవాడు లేడని విఱ్ఱవీగే జీవికి కష్టాలు కమ్ముకోగానే దేవుడు గుర్తుకొస్తాడు. "కలడు కలండనెడు వాడు కలడో లేడో "అనే సందేహము వస్తుంది. ఉంటే నన్నేందుకు ఆదుకోవడం లేదనే ఉక్రోషము వస్తుంది.చివరకు "నీవే తప్ప నిత:పరంబెరుగననే "ఆత్మ సమర్పణదశ కు వస్తుంది. ఈ వివిధ దశలన్నీ తను తప్ప వేరేదీ లేదని భావించే ఒక అహంభావి, సర్వాంతర్యామి యైన భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించే దశకు చేరటాన్ని మనకు ఈ వృత్తాతం నిరూపిస్తుంది.


💥


ఎవ్వనిచే జనించు జగ ; మెవ్వని లోపల నుండు లీనమై ;


యెవ్వని యందు డిందు ; పరమేశ్వరు డెవ్వడు ; మూలకారణం


బెవ్వ ; డనాదిమధ్యలయుడెవ్వడు ; సర్వము దానయైన వా


డెవ్వడు ; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


( 8 -73 )


జీవితం లో పోరాడటానికి తన శక్తి చాలనప్పుడు తనకంటే మించిన శక్తి ఒకటి ఉందని, అదే తనను కాపాడగలదనే ఆశ , ఆలోచన జీవిలో కలగడానికి కూడ పూర్వజన్మ వాసనా బలం ఉండాలి . లేకపోతే బాధల్లో నలిగిపోతూ కూడ భగవంతుణ్ణి మరచిపోయి వేడుకోలేని నిర్భాగ్యులు ఈ లోకం లో ఎంతమంది లేరు. అందుకే గజరాజు కు పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి వలన సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేటట్లు భగవత్ప్రేరణ కలిగింది. అందుకే భగవత్ప్రార్ధన కు పూనుకున్నాడని మనం గమనించాలి.


ఈ లోకం ఎవ్వని వలన పుడుతోందో , ఎవ్వని లో ఉంటోందో , ఎవ్వని లో నశిస్తోందో , ఎవడు పరమాత్ముడో , ఎవడు ఈ సమస్త విశ్వానికి మూలకారకుడో , ఎవ్వడు అన్నీ తానై ఉంటాడో అటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను అంటాడు గజేంద్రుడు. అంటే ఆ సర్వాంతర్యామి ఎవరో తెలియని అజ్ఞానం లోనే జీవి కొట్టుమిట్టాడుతున్నాడన్న మాట. ఇది తొలి దశ.


💥


లోకంబులు లోకేశులు , లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం


జీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ .


( 8-75 )


లోకాలు , లోకాలను ఏలే వారు , ఈ లోకాల్లో ఉండే వారు అందరూ నశించిన తరువాత కూడ ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన దివ్యరూపం తో ప్రకాశించే ఆ భగవంతుని నేను భావించి సేవిస్తున్నాను . ముక్తసంగులైన మునులు ,భగవంతుని చూడాలని కోరుకునే వారు, అందరి మేలు ను కోరుకునే వారు , సాధు చిత్తులు , సాటిలేని వ్రతాలు ఆచరించే వారు , ఎవరి పాదాలను సేవించి తరిస్తున్నారో ఆ దేవ దేవుడే నాకు రక్ష యగు గాక .భగవంతునికి పుట్టుక , పాపము , ఆకారము , కర్మ ,పేరు , గుణములు ఉండవు. అతడు ఈ లోకాలను సృష్టించి ,నశింపచేయడం కోసం తన మాయ తో ఇవన్నీధరిస్తాడు . ఆత్మకాంతి లో ప్రకాశించే వాడు. ఆత్మకు మూలమైన వాడు , ఊహలకూ , మాటలకూ అందని వాడు , పరిశుద్ధుడు , శాంతస్వరూపుడు, మోక్షాధిపతి , ఆనందానికి మూలభూతుడు, అయిన ఆ ఈశ్వరుని నేను ప్రార్ధిస్తున్నాను. భగవంతుడు ఒక్కడే . అతడు బహురూపుడు. కాని అన్నీ అతడే. అన్నింటిలోను అతడే కన్పిస్తాడు. ఈ పద్యం లో ఏకేశ్వరోపాసన ప్రతిబింబిస్తోందని విజ్ఞులు భావిస్తున్నారు.


కలడందురు దీనులయెడఁ గలడందురు పరమయోగి గణముల పాలం


గల డందు రన్ని దిశలను , గలడు కలం డనెడు వాడు కలడో లేడో.


(8 – 86 )


దేవుడు ఉన్నాడంటారు. ఆర్తులను ఆదుకుంటాడంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు. అన్నిదిక్కులలోను ఉన్నాడు , ఉన్నాడు , అనే ఆ దేవుడు అసలు ఉన్నాడా ? లేడా ?అనే విచికిత్స కు వచ్చాడు గజేంద్రుడు .ఇది రెండో దశ. అంటే తన లోని అహం కారం పూర్తిగా తొలగలేదు. అందు మూలం గా పెల్లుబికిన అహం భావం లోని తురీయాంశమే ఈ విచికిత్సకు కారణం.భగవంతుడు ఉంటే ఎందుకు రాడు ? అనేది విచికిత్స. అంటే పూర్తిగా భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించలేని మన స్థితి ఇక్కడ మనకు కన్పిస్తుంది. ‘ సంశయాత్మా వినశ్యతి ‘ అంటుంది భగవద్గీత. భక్తుని లో రావలసిన పరివర్తన ఇది కాదు. ‘ అన్యథా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ ‘ అనే దశకు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్న మాట. అందుకే -


💥


కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగు వాడు ,


నాకడ్డ పడరాడె నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడు వాడు ,


.....................................................................................


లీలతో నా మొఱాలింప డే మొఱగుల మొఱలెరుంగుచుఁ దన్ను మొఱగువాడు ( 8 – 87 )


ఆ భగవంతుడు దీనజనుల మొఱలను వింటూ తన్ను తానే మరచిపోయేవాడట. అందుకే ‘ ‘ ‘ ‘ వినడే , చూడడే , తలపడే వేగరాడే ‘ అంటూ మొత్తుకున్నాడు గజేంద్రుడు.


విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్


శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు ,నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్. ( 8- 88 )


ఈ విధం గా పరి పరి విధాల ప్రార్ధించిన గజేంద్రుడు తుదకు మనస్సులో ఈశ్వర సన్నిధానాన్ని కల్పించుకున్న వాడై – ఇలా ప్రార్ధించాడు.


💥


లావొక్కింతయు లేదు ; ధైర్యము విలోలం బయ్యె ; బ్రాణంబులున్


ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్ ; శ్రమం బయ్యెడిన్


నీవే తప్ప నిత: పరం బెరుగ; మన్నింపం దగున్ దీనునిన్


రావే యీశ్వర ! కావే వరద; సంరక్షింపు భద్రాత్మకా ! ( 8- 90 )


ఈ పద్యం లో కన్పించే ‘ లావు ‘ అన్న పదానికి శక్తి, బలము అనే అర్థాలు చెపుతాము. కాని ఇక్కడ ‘లావు ‘ ఒక్కింత కూడ లేదు అనడం లో అంతరార్థం ‘నాలోని అహం కొంచెం కూడ మిగలలేదు . అంతా నశించిపోయింది. ఇక నీవే దిక్కు ‘ అని వేడుకోవడమే. ఎప్పుడైతే అహంకారం నశించిందో శరణాగతత్వబుద్ధి సంప్రాప్తిస్తుంది. అందుకే “ నీవే తప్ప నిత: పరంబెరుగ ..రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ! అన్న ఆర్తి పతాకస్థాయిని చేరుకుంది. జీవుని వేదన రోదన గా రూపు దాల్చింది.


💥


వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల


కోయను దట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యెఁ గరుణావార్థీ ! (8 – 91 )


భగవత్తత్వం బోధ పడింది. ఓ దయా సముద్రుడా ! జీవుల పిలుపులు వింటావట. పోరాని చోట్లకైనా పోతావట. శరణు వేడిన వారు పిలిస్తే వెంటనే ఓ అని పలుకుతావట. సమస్తమూ తెలిసినవాడవట. కాని ఇప్పుడు ఇదంతా సందేహం గా ఉంది అంటాడు గజేంద్రుడు. అవును. ఎంత చెప్పినా తన వరకు వస్తే కాని అసలు వేదన తెలియదని కదా సామెత. అందుకే అట ,అట అంటూనే ’ సందేహమయ్యె ’ అనేశాడు గజరాజు.ఇన్ని గాయాలకు చికిత్స చేశాను గాని నా గాయమంత నొప్పి ఎవరికీ లేదన్నాడట ఒక వైద్యుడు. అందుకే –


ఆలా


పల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోప లో


త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రమ ‘ పాహి పాహి ‘ యన కుయ్యాలించి సంరంభియై ( 8 -95 )


💥 ఓ కమలాప్త ! యో వరద ! యో ప్రతిపక్ష విపక్ష దూర ! కు


య్యో! కవియోగివంద్య సుగుణోత్తమ ! యో శరణాగతామరా


నోకహ ! యోమునీశ్వర మనోహర ! యో విమలప్రభావ ! రా


వే ! కరుణింపవే ! తలపవే ! శరణార్థిని నన్ను గావవే ! ( 8 – 92 )


భగవంతుడు కరుణావార్థి (కరుణా సముద్రుడు ) శరణాగతామరానోకహ ( శరణాగతుల పాలిట కల్పవృక్షం వంటివాడు ) . అటువంటి భగవానుడు ఇంతగా వేడుతున్న భక్తుణ్ణి కాపాడకుండా ఉండగలడా. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఆ గజేంద్రుడు ఆర్తరక్షకుడైన ఆ కమలామనోహరుని ఠావులు తప్పిన ప్రాణాలతో , అలసిన శరీరంతో అర్థిస్తూ ఉండగానే ఆ మకరి కరి ప్రార్థనకు విఘాతం కలిగించాలన్నట్టుగా గజేంద్రుని తీవ్రంగా గాయపరచి , కోపం గా నీటిలోకి లాగింది. అప్పుడు గజరాజు చేసిన ఆర్తనాదమే ‘ కుయ్యో ‘. అది రోదన తో చేసిన ఆక్రందన. ఆదుకునే వాడు వస్తాడనే విశ్వాసం తో ఆయన ఇంకా తొందరగా రావాలనే ఆశతో చేసిన ఆక్రందన అది. అందుకే “ పోరాని చోట్లకైనా పోతావట “ అంటూ దేవదేవుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తుచేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు గజేంద్రుడు.


ఆ లక్ష్మీనాథుడు అరక్షిత రక్షకుడు. అంటే రక్షణ లేని వారిని రక్షించే ప్రభువు ఆయన. అటువంటి ఈశ్వరుడు వచ్చి తనను కాపాడతాడని భారం మొత్తం భగవంతుని పై వేసి ఆకాశం వైపు నిక్కి నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ, ఆకాశానికి చెవులప్పగించి చూస్తోందట ఆశగా గజేంద్రుడు. ఏశబ్దం విన్నా తనను కాపాడ్డానికి భగవంతుడే వచ్చాడనుకునే స్థితికి వెళ్ళిపోయింది గజరాజు. ఇప్పుడు గజేంద్రుడు భక్తియుతుడు. అందుకే భగవంతుడు దిగి వస్తున్నాడు.


బ్రహ్మాది దేవతలందరూ గజేంద్రుని ఆక్రందనలు విని కూడ వారికి విశ్వవ్యాపకత్వం లేకపోవడం మూలంగా గజరాజు కు సాయపడలేక చేతలుడిగి ఉండిపోయారట. విశ్వమయుడు , విభుడు , విజయశీలి అయిన శ్రీమహావిష్ణువు గజేంద్రుని కాపాడటానికి నిశ్చయించుకొని దిగి వస్తున్నాడు.


💥


అల వైకుంఠ పురంబు లో నగరి లో నా మూల సౌధంబు దా


పల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోప లో


త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రమ ‘ పాహి పాహి ‘ యన కుయ్యాలించి సంరంభియై ( 8 -95 )


ఈ పద్యం రాని తెలుగు వాడు ఆనాడు ఉండేవాడు కాదంటే అతిశయోక్తిలేదు. అంత అందమైన , అతిశయమైన పద్యం ఇది. అతిశయమని ఎందుకన్నానంటే భక్తుని కుయ్యాలించి ఆదుకోవడానికి బయలుదేరాడు లక్ష్మీపతి. ఎక్కడనుండి. వైకుంఠంనుండి. వైకుంఠం ఎక్కడుంది. అక్కడెక్కడో ఉంది. అనిచెపుతారు. అందుకే అక్కడెక్కడో ఉన్న వైకుంఠాన్ని మన మనోనేత్రం ముందుకు తీసుకురావడానికి మహాకవి చేసిన ప్రయత్నం పద్యం లోని మొదటి రెండు అక్షరాల్లో గొప్ప గా కుదురుకుంది ‘ అల ‘అని. ‘ అల ‘ అంటే ఎక్కడో ............. . అంటే అన్ని ఊర్థ్వలోకాలకు ఆ పైన ‘ అల ‘... అక్కడెక్కడో అల్లంత దూరం లో జీవుని మాటకు ,చూపు కు , కేక కు, చివరకు ఆక్రందనకు , ఆర్తనాదానికి కూడ అందనంత దూరం లో ఉన్నది ఆ వైకుంఠం. ఆ వైకుంఠ పురం లో శ్రీ లక్ష్మీనారాయణుల అంతపురం. ఆ అంతపురం లో ఆ ..... మూల సౌధానికి సమీపం లో కల్పవృక్షవనం. ఆ వనం లో ఒక అమృతసరస్సు. దాని చెంత చంద్రకాంత శిలానిర్మితమైన ఒక అందమైన తిన్నె . దానిపై కలువపూల పానుపు. ఆ పాన్పు మీద శ్రీమన్నారాయణుడు కలుముల జవరాలు , తన ఇల్లాలు , అయిన శ్రీ లక్ష్మీదేవి తో వినోదిస్తున్నాడు . అంతదూరం లో ఉన్నవైకుంఠం లో , ఇల్లాలి తో వినోదం లో ఉండగా ఆ సమయం లో ఆ ఇందిరారమణునకు గజేంద్రుని ఆర్తనాదం విన్పించింది. కారణం ఆయన ఆపన్నప్రసన్నుడు. అనాథ జన రక్షకుడు. భక్తపాలన కళా సంరంభకుడు కదా. ’ కో ‘అని పిలిస్తే ’ ఓ ‘ అని పలికే దైవం కదా ఆ ఆది నారాయణుడు. . అందుకే వెంటనే బయలుదేరాడు. ఈ విశేష మంతా ‘ అల ’ అనే పదం ద్వారా దర్శింపచేశాడు భక్తకవి పోతన.


ఈ పద్యం లోని అమృతసరస్సు వలన ఈ పద్యానికే అమృతత్వం ప్రాప్తించింది. పోతన భాగవత రచనా సమయం లో ఈ పద్యాన్ని శ్రీ మహావిష్ణువే స్వయం గా వచ్చి పూర్తిచేసి వెళ్లాడని తెలుగునాట కథలు గా చెప్పుకుంటున్నారంటే ఈ పద్యం లోని మాధుర్యం తెలుగు వారి గుండెలను ఎంతగా పులకింపచేసిందో మనం ఊహించవచ్చు. ఈ సందర్భం లో భక్తకవి పోతన ను గూర్చి తెలుగునాట వాడుక లో ఉన్న కొన్ని కథలను ఇదే బ్లాగు లో “ పలికెడిది భాగవతమట.... “ అనే వ్యాసం లో చెప్పుకున్నాము. వీలైతే చూడవచ్చు.


భక్తజనరక్షణార్థం భగవంతుడు ఎంత వేగిర పడతాడో మనకు ఈ ఘట్టం నిరూపిస్తుంది. భక్తపరాధీనుడైన భగవానుని లీలలు కొల్లలు గా మన సాహిత్యం లో మనకు కన్పిస్తాయి. ‘ కుంటెన పంప పోయితివో ’ అంటూ కాళహస్తీశ్వరుని భక్తపరాధీనతను నిలదీసిన మహాకవి ధూర్జటి ని తెలుగు వారు మర్చిపోలేరు కదా.


💥


సిరికిం చెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింపఁ డే


పరివారంబు ను జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం


తర ధమ్మిల్లముఁ జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో


పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై


( 8 -96 )


గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఆతృతలో ఉన్న శ్రీమహావిష్ణువు ఇల్లాలైన లక్ష్మీదేవికి కూడ చెప్పకుండా బయలుదేరాడు.శంఖ చక్రాది ఆయుధాలను తీసుకోలేదు. సేవకాజనాన్ని ఎవరినీ పులవకుండా , గరుత్మంతుని ప్రయాణానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించకుండా, చెవుల క్రింది వరకు జారిపోయిన సిగముడి ని కూడ సవరించుకోకుండానే బయలుదేరాడు అనాథ జన రక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇవన్నీ మరచిపోయినా ఫర్వాలేదు. ప్రణయ కోపం తో అలిగి వెళ్లిపోతున్న శ్రీ రమారమణి పైటచెంగును పట్టుకున్న వాడై, తొందరలో ఆ లక్ష్మీదేవి పైటను కూడ వదిలి పెట్టకుండా అలాగే ఆతృత గా భక్తజన పాలన కళా సంరంభుడై బయలుదేరాడట నారాయణుడు. కాదు లక్ష్మీనారాయణుడై బయలుదేరాడు సమస్త జంతు హృదయారవింద సదన సంస్థితుడైన ఆ వైకుంఠనాథుడు.


💥


తన వెంటన్ సిరి , లచ్చివెంట నవరోధవ్రాతమున్ , దాని వె


న్కను బక్షీంద్రుడు , వాని పొంతను ధను: కౌమోదకీ శంఖ చ


క్ర నికాయంబును , నారదుండు , ధ్వజనీకాంతుండు రా వచ్చి రొ


య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్ .


(8 -98 )


ఆకాశమార్గం లో శ్రీమహా విష్ణువు , ఆయన చేతి లో పైటచెంగు ఉండిపోవడం తో ఆయనతో సమానం గా నడవలేక నడుస్తూ శ్రీ మహాలక్ష్మి , అయ్యవారు , అమ్మవారు ఎక్కడికో వెళుతున్నారని వారిని అనుసరించిన అంత పుర కాంతలు , వారి వెనుక గరుత్మంతుడు , అతని సరసనే ధనుస్సు ,విల్లు ,శంఖ చక్రాదులు ,వాని వెంట నారదుడు , ఆ తరువాత సర్వసైన్యాధిపతి విష్వక్సేనుడు ఇలా ఒకరి వెంట ఒకరు రాచ నగరు నుండి బయటకు రాగానే చూసిన ఆ వైకుంఠపుర వాసులు ఏదో జరిగిపోతోందని ఒక్కరొక్కరుగా బయలుదేరి చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ శ్రీమహావిష్ణువు వెంట రాసాగారట.


శ్రీ మహావిష్ణువు తో సమానం గా నడవలేక, పైట చెంగు ఆయన చేతిలో ఉండటం తో ఆగలేక తడబడుతూ నడుస్తోంది శ్రీ మహాలక్ష్మీ.


💥


అడిగెద నని కడువడిఁ జను , నడిగినఁ దను మగుడ నుడువఁ డని నడ యుడుగున్


వెడవెడ చిడిచిడి ముడి తడబడ , నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ .(8 -103 )


ప్రభువు ఎక్కడికి వెడుతున్నారో చెప్పడంలేదు. ఎవరైన అనాథ స్త్రీల జనాలాపాలు విన్నాడా ? అమరావతి పై రాక్షసులు ఏమైనా దాడి చేశారా ? వంటి సందేహాలతో మనోనాథుడైన శ్రీ మహావిష్ణువు ను ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో ? అడుగుదామని గబగబ రెండడుగు లు ముందుకు వేసేదట శ్రీ మహాలక్ష్మి. అడిగితే ఆ తొందరలో సమాధానం చెప్పడేమో నని సంశయించి ఆ ప్రయత్నాన్ని మానుకునేది. అడుగులు వేస్తూ, ఆగిపోతూ తడబడుతూ నడుస్తున్న తన ఇల్లాలిని కూడ పట్టించుకోకుండా, నమస్కారాలను సమర్పిస్తూ సేవించుకుంటున్న గగనచరులైన దేవతల మ్రొక్కులను కూడ మన్నించక , మనోవేగం తో కరి మకరులు పోరాడుతున్న సరోవర సమీపానికి చేరుకున్న శ్రీమహావిష్ణువు ఆ మొసలిని చంపడానికి తన చక్రాన్ని ప్రయోగించాడు.


💥


కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగాఁ బంపె స


త్వరితా కంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా


పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండభాండచ్ఛటాం


తరనిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్ .


(8 -109 )


భూమండలాన్ని కంపింపచేసే వేగం తో ,సమస్తలోకాలను కాంతిమయం చేస్తూ, ఆ చక్రం మొసలి శిరస్సును ఖండించింది. గజేంద్రుడు సంసార బంధాలనుండి విడివడిన విరక్తుని వలే , చీకటిని వదిలిన చంద్రుని లాగ మొసలి పట్టు విడిపించుకొని, ఉత్సాహం గా కాళ్లు విదిలించి , భగవంతుని దయవలన బ్రతికి తన ఆడ ఏనుగులను చేరుకున్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. భగవంతుని నమ్మిన భక్తుడు ఆదుకోబడి, చేదుకోబడ్డాడు.


ఇంతకీ అసలు ఈ కరి మకరులు ఎవరు అనేది ప్రశ్న. హూహూ అనే గంధర్వుడు దేవలముని శాపం వలన మొసలి రూపాన్నిపొందాడు. స్వామి అనుగ్రహం తో శాప విముక్తుడై, తిరిగి గంధర్వలోకాన్ని చేరుకున్నాడు.


మొసలి తో పోరాడిన గజరాజు పూర్వజన్మ లో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు. విష్ణుభక్తులలో శ్రేష్ఠుడైన ఈ మహారాజు ద్రవిడదేశాన్ని పాలించేవాడు.ఈ విష్ణుభక్తుడు ఒక పర్వతం మీద మౌనవ్రతం లో ఉంటూ విశేషపూజలతో భగవంతుని సేవించేవాడు. ఒకరోజున ఇంద్రద్యుమ్నుడు ఏకాగ్రచిత్తం తో విష్ణువును ధ్యానిస్తూ ఉండగా , ఆ ప్రాంతానికి అగస్త్యుడు రావడం తటస్థించింది. తనను చూసి కూడ , పల్కరించకుండా , కనీసం కూర్చున్న చోటు నుండి లేవకుండా ఉన్న ఇంద్రద్యుమ్నుని చూసి ఆగ్రహించాడు అగస్త్యుడు. “ అజ్ఞానం తో కూడిన ఏనుగు గా పుట్టమని “ ఇంద్రద్యుమ్నుని శపించాడు. అతడే ఈ గజేంద్రుడు. అతని సేవకులందరు అతని అనుచరులు గా , అనుయాయులు గా జన్మించారు. ఇంద్రద్యుమ్నుడు ఏనుగు గా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వలన మాత్రమే మోక్షాన్ని పొందాడు. “ ప్రబలమైన విష్ణుభక్తి ఎన్నిజన్మలకైన చెడదు “ అన్నది విష్ణుభక్తుల విశ్వాసము.


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩

🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩


👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💥👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿


తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతా అందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యాసభాగవతంలోని శ్లోకాలను చెప్పుకొని, వాటిని పోతనగారు ఏవిధంగా తెనిగించారు, ఆభావాలను ఏవిధంగా చెప్పారో పోల్చి చూసుకుందాం.


"ఓమ్ నమో భగవతే తస్మై యత ఎతచ్చిదాత్మకం, పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి"


ఎవని ప్రవేశముచే జడములైన శరీరమనంబులు చేతనములౌనో, ఓంకార శబ్డంబునకు లక్ష్యమై శరీరంబున ప్రకృతీ పురుషులు తానైయున్న సర్వసమర్ధుడైన పరమేశ్వరునకు మనంబున నమస్సులు అర్పించుచున్నాను.


ఎందుచేతనో గాని పోతనగారు ఈశ్లోకాన్ని తెనిగించలేదు. ఈశ్లోకంలో వ్యాసులవారు సృష్ట్యాదిలో జరిగిన సంఘటనను తెలియజేసారు. ఈవిషయాన్ని పైంగలోపనిషత్ లో యాజ్నవల్క్యముని పైన్గలునికి ఉపదేశించారు. సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే వున్నాడు. ఆపరమాత్మలోనే సకలము సంకుచిత వస్త్రమువలె దాగివున్నది. ఆపరమాత్మనుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తు ఏర్పడెను. ఆ మహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగా నుండెను. అందుండి తమోగుణాద్రిక్త మగు అహంకారము పుట్టెను. ఆఅహంకారము నందు ప్రతిఫలించిన పరబ్రహ్మము విరాట్ అను చైతన్యమై యుండెను. దానినుండి గర్భోదకశాయి అయిన శ్రీమహావిష్ణువు పుట్టెను. (ఈయన స్థితి కారకుడైన, సత్వగుణప్రధానుడైన, నాలుగు చేతులు గల విష్ణువు కాదు.) ఈయన నుండే సూక్ష్మ పంచ భూతములు పుట్టినవి. ఆ పంచభూతముల వివిధరకములైన కలయకల వలన ప్రాణశక్తి, అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరాలు, మనుషులు, దేవతలు, మన విశ్వంతో పాటు అనేక బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. కాని ఆ దేహేన్ద్రియాలు చైతన్యమూర్తియగు పరబ్రహ్మ లేకుండా స్పందనకలిగి యుండుటకు, పనిచేయుటకు సమర్ధతలేకుండెను. అప్పుడు ఈపరిస్థితిని గమనించిన పరబ్రహ్మ, బ్రహ్మండములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకములను బ్రద్దలుచేసి వాటన్నిటి యందు చైతన్య రూపములో ప్రవేశించెను. ఆ రంధ్రమే మన తలలో నున్న బ్రహ్మరంధ్రము. (సహస్రారచక్రము. పరబ్రహ్మ వచ్చిన ఈరంధ్రము గుండానే మనం బయటకు వెళ్ళితే ఆ పరబ్రహ్మను చేరుకుంటాము. ఈ విషయాన్నీ ఇంకొకసారిముచ్చటించుకుందాము.)అప్పటినుండి ఈ శరీరాలు చైతన్యమయమయ్యాయి. ఆ విషయాన్నే గజేంద్రుడు ద్వారా వ్యాసులవారు మనకు చెప్పారు. తర్వాత ఓంకార శబ్దమునకు లక్ష్యమైనదని చెప్పినారు. పెద్దలు "తస్య వాచకః ప్రణవః, తజ్జపః స్తదర్ధ భావనః" అని తెలియజేసినారు. ఆపరమాత్మ యొక్క సర్వనామము (pronoun) ఓంకారమని, దానిని జపించినచో ఆపరమాత్మ యొక్క అర్ధమూ, భావననూ పొందవచ్చునని చెప్పినారు. అందువల్ల ఓంకారమునకు లక్ష్యము ఆ పరబ్రహ్మేనని, వేరే యితరములు కావని స్పష్టమగుచున్నది. శరీరమున ప్రకృతీపురుషులు తానై యున్నాడని చెప్పినారు.మనశరీరములో ముఖ్యముగా రెండు వున్నవి. ఒకటి పదార్ధము (matter). అదియే ప్రకృతి. రెండవది చైతన్యము. అదే ఆత్మ(energy). ఈ చైతన్యముయొక్క మహాస్వరూపాన్నే ఉపనిషత్తులలోను, పురుషసూక్తములోను పురుషశబ్దంతో తెలియజేశారు. ఈ ప్రకృతిపురుషులకలయిక తోనే జీవరాసులు ఏర్పడినాయి. ఈ ప్రకృతిపురుషులు రెండున్నూ ఆపరబ్రహ్మ తప్ప వేరే ఇంకెవరూ కారు.చూసారా! వ్యాసులవారు ఎన్ని పెద్ద విషయాలని ఒక చిన్న శ్లోకంలో చెప్పారో! ఇలా చిన్న పదాల లోంచి అంతర్గతంగా వున్న మహాజ్ఞానాన్ని వెతుక్కోవటమే తత్వవిచారణ.ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.


"యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదంస్వయం, యో-స్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం"


"ఎవని ఆధారమున విశ్వంబు నిలిచియున్నదో, ఎవ్వనినుంచి ప్రభవించినదో, ఎవరు దానిని సృజించిరో, ఎవరు స్వయముగా తానే విశ్వమై ప్రకటితమయ్యెనో, ఎవరీ దృశ్యప్రపంచముచే, దాని కారణభూత ప్రకృతిచే విలక్షణమై శ్రేష్టమై తనంతతా కారణరహితుడై ప్రభవించునో అట్టి భగవానుని శరణము నొందుచున్నాను."


దీని అర్ధం చాల తేటతెల్లంగా వుంది. వేరే వివరణ అవుసరం అక్కరలేదు. కాని చివర ఒక విషయం చెప్పారు. అన్నీ తానే అవుతూ, మళ్లీ కారణరహితుడై ఉంటాడట. అంటే అన్నీ తానేచేస్తాడు, చేయిస్తాడు. మళ్ళా దేనితోను సంబంధంలేకుండా, దేన్నీఅంటుకోకుండా ఉంటాడు.కాబట్టి మనంకూడా ఈ విషయాన్నే అనుసరించాలి.ఈపదార్ధపూరితమైన ప్రకృతిలో వుంటూ, దీనికి సంబంధించిన పనులు, ఇంకా మిగతావి వాటిని అంటుకోకుండా అంటే నిష్కామంగాచేయాలి. అప్పుడు ఆకర్మలయొక్క ఫలితాలు మనకు అంటుకోవు. పైగా కర్మరాహిత్యం కూడా అవుతుంది. ఈవిషయాన్నే పరమాత్మ భగవద్గీతలో "కర్మణ్యేవాధికారస్తే" అని చెప్పాడు. ఈవిషయాన్నే మనకు వ్యాసులవారు కూడా నర్మగర్భంగా చెప్పారు. ఈశ్లోకాన్ని పోతనగారు తెనిగిస్తూ ఇంకొక విధంగా చెప్పారు.


"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, యెవ్వని యందుడిందు, బరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా, డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్."


తత్వవిచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ, ముఖ్యమైనది. ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్నిఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో యీ పద్యంలో పోతనగారు చెప్పారు. ఆయన స్వయంగా ఒకయోగి. యోగ తత్వరహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలోచొప్పించారు.ప్రస్తుతం యీపద్యాన్ని నాలుగుముక్కలుగా విడదీసుకోవాలి.మొదటిది ప్రశ్నా భాగం. రెండవది ఒక్క "వానిని" అన్న మాట మాత్రమే. మూడవది "ఆత్మభవునీశ్వరు". మిగతాది నాల్గవది.పోతనగారు ఇక్కడ మంచిగమ్మత్తు చేసారు. ముందర మనకి ఎలాప్రశ్నలు వేయాలో నేర్పారు. తర్వాత ఆప్రశ్నలు వేసుకొని, వాటికి సమాధానాలు రాక మనం ఇబ్బందులు పడతామని గ్రహించి, "వానిని" అంటే ఆ ప్రశ్నలకు సమాధానమైన వానిని అని, మళ్లీ వాడెక్కడ ఉన్నాడో తెలియక కలవరపడతామని, "ఆత్మభవుని" అంటే మనఆత్మలోనే, మనకు చాలాదగ్గరలోనే ఉన్నాడని విశదీక రించారు. చూసారా!తత్వవిచారణాపధ్ధతిలో యీపద్యాన్ని అనుసరించినట్లయితే, పరబ్రహ్మస్వరూప జ్ఞానం కోసం ఏవిధమైన పరిశోధన జరపాలి, వాడెక్కడవున్నాడు, వాడిని పట్టుకోవాలంటే ముందర దేన్ని తెలుసుకొని దర్శించాలి, దేన్నిపట్టుకొంటే ఆపరమాత్మ దొరుకుతాడు మొదలైన విషయాలన్నీ చాలా తేలికగా తెలుస్తాయి. ఇదీ పోతనగారి గొప్పతనం.గజేంద్రుడి మిషతో మనకు ఇంతటి గొప్ప విషయ పరిజ్ఞానాన్ని అందించారు. ఇక తర్వాతి శ్లోకానికి వెళదాం.


"యః స్వాత్మనీదమ్ నిజమాయయార్పితం, క్వచిద్విభాతం క్వచతత్తిరోహితం


అవిద్ధదృక్ సాక్ష్యుభయం తదీక్షతే, స ఆత్మ మూలో-వతు మాం పరాత్పరః"


ఏ ప్రభువు తన సంకల్పశక్తిచే తన స్వరూపముగా రచింపబడి సృష్టికాలమందు ప్రకటితమై ప్రళయ కాలమందు అప్రకటితమైయుండునో, ఆ శాస్త్ర ప్రసిద్ధ కార్యకారణరూపజగత్తు అకుంఠిత దృష్టి కల్గియుండు కారణముచే సాక్షీరూపమై చూచుచుండునే గాని దానితో నేకీభావము పొందకయుండునో అట్టి ప్రభువు, చక్ష్యాది ప్రకాశకములకు ప్రకాశమైనవాడు, నన్ను రక్షించుగాక.


యీ శ్లోకాన్ని పోతనగారు ఈవిధమగా తెనిగించారు.


"ఒకపరి జగములు వెలినిడి యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై,


సకలార్ధ సాక్షి యగు నయ్యకలంకుని నాత్మమూలు నర్థి దలంతున్"


ఒకసారి లోకాలను సృష్టిచేసి, ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ, ఆలోకాలు రెండూ తానేయై, అన్ని విషయాలనూ ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానం చేస్తాను.


ఆ ఇరువురూ ఇక్కడ పరబ్రహ్మము యొక్క క్రియా, నిష్క్రియాపరత్వాలను, ఆయనయొక్క సాక్షీభూత తత్వాన్ని, తేజః స్వరూప పరాచైతన్యాన్ని తెలియజేసారు. ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.


"కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు


తమసతదా--సీద్ గహనం గభీరమ్ యస్తస్య పారే-భివిరాజతే విభు:"


కాలప్రవాహమునుండి సంపూర్ణలోకములు, మరియు బ్రహ్మాదిలోకపాలకులు పంచభూతముల ప్రవేశించిన తర్వాత, ఆ పంచభూతముల నుండి మహాత్తత్త్వపర్యంతము సంపూర్ణకారణములు వాని పరమకారణరూపప్రకృతిలో లీనమై పోయినప్పుడు దుర్గమమైన అపారఅంధకార ప్రకృతి యుండును. అట్టి అంధకారంబునకావల తనదౌ పరమధామమున ఏసర్వవ్యాపక భగవానుడు అన్నిదిక్కుల ప్రకాశించుచుండునో, ఆప్రభువు నన్ను రక్షించుగాక.


"లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం


జీకటి కవ్వల నేవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్"


లోకాలూ, లోకాలను పాలించేవారూ, లోకాలలో ఉండేవారూ, అందరూ నశించిన అనంతరం, ఆ కారుచీకట్లకు అవతల అఖండమైన రూపముతో ప్రకాశించే వాడిని నేను భావించి సేవిస్తాను.


ఇక్కడ వారిరువురూ ఒకే భావాన్ని చెప్పారు. మహాప్రళయకాలంలో మన భూమి మొదలుకొని సృష్టికారకుడైన చతుర్ముఖబ్రహ్మ వరకూ అంతయూ పంచభూతాలలోను, ఆపంచభూతాలు 'విరాట్' లోను, ఆవిరాట్ 'మహత్తు' లోను ఆమహత్తు 'పరబ్రహ్మ' లోను కలసి పోయినప్పుడు ఇక అంతులేని దుర్గమమైన అంధకారం మాత్రమే వుంటుంది. దానినే పోతనగారు 'పెంజీకటి' అన్నారు. ఆ చీకటికి అవతల ఆసమయములో ఒక్క పరబ్రహ్మ మాత్రమే వుంటాడు. ఆపరబ్రహ్మస్వరూపాన్ని నేను సేవిస్తా నన్నారు ఆ ఇరువురూ. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం చెపుతాను. కళ్ళుగట్టిగా మూసుకోండి. ఏంకనపడుతుంది? అదే పెంజీకటి. దానికవతల చూడగలిగితే, మనకు కనపడేది పరబ్రహ్మ స్వరూపమే! యీ విషయాన్నే వ్యాసులు, పోతన లిరువురూ మనకు తెలియజేసారు. ఇక తర్వాతి శ్లోకానికి వెళదాం.


"న యస్యదేవాఋషయః పదం విదుర్జంతు: పునః కో-ర్హతి గంతుమీరితుమ్


యధా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్య యానుక్రమణః నమావతు"


భిన్నభిన్నరూపంబుల నాట్యంబుచేయు వానియొక్క వాస్తవస్వరూపంబునెట్లు ప్రేక్షకుడు గ్రహించలేడో ఆప్రకారము సత్వప్రధాన దేవఋషులు సైతము నీదైన స్వస్వరూపము దెలియలేరనిన యప్పుడు వేరెవ్వరు సాధారణజీవులు యాస్వరూపజ్ఞానము కల్గియుందురు! అట్టి దుర్గమ విషయంబుల గుర్తించు ప్రభువు నన్ను రక్షించు గాక!


"నర్తకునిభంగి బెక్కగు మూర్తులతో నెవ్వడాడు? మునులు దివిజులుం


గీర్తింప నేరరెవ్వని, వర్తన మొరు లెరుగరట్టివాని నుతింతున్"


నర్తకునిలాగ పెక్కురూపాలతో ఎవడు నాట్యము చేస్తుంటాడో, ఋషులు, దేవతలు ఎవనిని కీర్తింప లేరో, ఎవని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా వుంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను."


ఇక్కడ ఇరువురూ కూడా ఆ పరబ్రహ్మము యొక్క చెయిదములను, అసలు స్వరూపాన్ని ఎవరూ కనుగోనలేరని తెలియజేసినారు. ఇక్కడ ఇంకొక రహస్యం వుంది. పాదరసంతో చేసిన లింగమునకు ఇంకాస్త పాదరసంతగిలిస్తే ఆపాదరసం ఆలింగంలో కలిసిపోతుంది. అలాగే పరబ్రహ్మమును తెలుసుకొన్న వారు పరబ్రహ్మమే అవుతారు. శృతి "బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి" అంటోంది. వారికి ఇక అంతకు ముందున్న స్వరూపం వుండదు. ఆ పరబ్రహ్మములో మమైక్యం చెందినవారు ఇక బయటకు రాలేరు, మనకు ఏమీ చెప్పలేరు.కాబట్టి పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొన్నవారు విడిగా ఎవరూ వుండరు. ఈవిషయాన్నే వారిరువురూ మనకు తెలియజేసారు.


"దిదృక్షవో యస్యపదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః


చరన్త్య లోక వ్రతమవ్రణం వనే భూతాత్మ భూతాః సుహృదః స మే గతి:"


అనాసక్తులై సంపూర్ణప్రాణులయందు ఆత్మబుద్ధినుంచి అందరియందు అకారణముగ హితవుంచి అతిశయ సాధుస్వభావము గల్గిన మునిగణములు, ఏ పరమమంగళమయ స్వరూపమును సాక్షాత్కరింప జేసుకొను కోరికచే, వనములందు వసించి అఖండ బ్రహ్మచర్యాది అలౌకిక వ్రతపాలనము జేయుదురో, అట్టి ప్రభువు నాకు గతి యగుగాక.


"ముక్తసంగులైన మునులు దిదృక్షులు, సర్వభూతహితులు సాధుచిత్తు


లసదృశ వ్రతాడ్యులై కొల్తురెవ్వని, దివ్యపదము వాడు దిక్కు నాకు."


ప్రపంచంతో సంబంధాలు వదలివేసిన మునులు, భగవంతుణ్ణి చూడాలనికోరేవారూ, అన్ని ప్రాణులకు మేలు కోరేవారూ, మంచిమనసు కలవారు, సాటిలేని వ్రతాలు ఆచరించుతూ ఎవనిపాదాలను సేవిస్తారో అటువంటి దేవుడు నాకు అధారమగుగాక!


ఇక్కడ వారిరువురూ కూడా పరమహంసస్థాయి గలవారు ఏరీతిగా ఉంటారో, వారెటువంటి గుణ గణాలతో వుంటారో, కేవలము ఆపరబ్రహ్మముతో అనుసంధానింపబడిన ఆత్మతో తప్ప ఇతరముగా ఎలా వుండరో చెప్పారు.


"న విద్యతే యస్య చ జన్మకర్మవా న నామరూపే గుణదోష ఏవ వా


తథాపి లోకావ్యయసంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి


తస్మై నమః పరేశాయ బ్రహ్మణే-ననంతశక్తయే అరూపాయోరురూపాయ నమః ఆశ్చర్య కర్మణే


నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి


సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా నమః కైవల్యనాధాయ నిర్వాణసుఖసంవిదే"


ఎవరి జన్మము మనవలె కర్మబంధముతో జరుగదో, ఎవరిచే నహంకారప్రేరిత కర్మ కావింపబడదో, ఎవరినిర్గుణస్వరూపమునకు నామదేయంబులు లేవో, రూపము లేదో, అయిననూ ఎవ్వరు సమయాను సారంబున జగత్సృష్టిలయంబుల గావించుచూ, స్వేచ్ఛతో జన్మంబు తనకుతా పొందునో, అట్టి అనంతశక్తి సంపన్న పరబ్రహ్మ పరమేశ్వరునకు నమస్కారము చేయుచున్నాను. ఆ ప్రకృతి ఆకారరహితమైయ్యూ అనేకాకారంబులు గల్గియుండు అద్భుతకర్మాచరణుడైన భగవానునకు పలుమార్లు నమస్కరించు చున్నాను. స్వయం ప్రకాశమూర్తి, సాక్షీభూతుడైన పరమాత్మకు నమస్కారములు చేయుచున్నాను. ఏ ప్రభువు మనోవాక్చిత్తవృత్తుల కతీతుడై సర్వత్ర వ్యాపించియుండునో వానికి పలుమార్లు నమస్కరించు చున్నాను. వివేకియైన పురుషునిచే, సత్వగుణ విశిష్టనివృత్తి ధర్మాచరణముచే ప్రాప్తయోగ్యమైన మోక్ష సుఖంబునిచ్చువాడు, మరియు మోక్షసుఖానుభూతి రూపుడైన ప్రభువునకు నమస్కారము చేయు చున్నాను.


"భవము దోషంబు రూపంబు గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక


జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయ నెవ్వడిన్నియును దాల్చు


నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మకిద్ధరూపికి రుపహీనునకును


జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని బరమాత్మునకు బరబ్రహ్మమునకు


మాటలను నెరుకల మనముల జేరంగగాని శుచికి సత్త్వగమ్యు డగుచు


నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు."


భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింప జేయడం కోసం తన మాయాప్రభావంతో యివన్నీ ధరిస్తాడు. రూపం లేని వాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మ కాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకుమూలం. అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ వూహలకూ అందరానివాడు, పరిశుద్ధుడు. సత్వగుణంతో దరిచేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.


ఇక్కడ ఇరువురూ కూడా ఒకే భావాన్ని వేర్వేరు శబ్దాలతో చెప్పారు. ఇక్కడ పోతనగారు వ్యాసులవారి భావాన్ని చక్కగా తెనిగించారు.


"నమో శాంతాయ ఘోరాయ మూడాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ


క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః


సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వ ప్రత్యయహేతవే అసతాచ్ఛాయయోక్తాయ సదా భాసాయ తే నమః


నమో నమస్తే-ఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ


సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమో-పవర్గాయ పరాయణాయ"


సత్వగుణము స్వీకరించియూ, శాంతరజోగుణంబుల స్వీకరించియూ, ఘోరమైన తమోగుణంబును స్వీకరించియుండు మూర్ఖుని మొదలు గుణవంతుడగు వానివరకు భేదరహితుడగుటచే సదా సమ భావముతో స్థితుడైయుండు జ్ఞానఘనుడైన ప్రభునకు నమస్కారము చేయుచున్నాను. సర్వక్షేత్రంబుల నధిష్టించిన క్షేత్రజ్ఞుడా, సర్వసాక్షీ! పరముడవైన మూలపురుషా! ప్రకృతిపురుషుల కాధారభూతా! నీకు నమస్కారము చేయుచున్నాను. ఇంద్రియముల, వాని విషయముల గుర్తించువాడవు నీవే. జ్ఞాన, స్మృతి ప్రదానము జేయువాడవును, సంశయనివృత్తి కారకుడవు నీవే. ఈ సృష్టి అసాంతము నీదు ఛాయయే గదా! ఇందు నీయంశముండుటచే గదా యీసృష్టి సత్యంబని గోచరించుచున్నది. అట్టి సత్య స్వరూపుడవగు నీకు నమస్కారము. నీకై ఏకారణమునూ లేక సర్వకారణంబులకు నీవే కారణున్డవు. అందుచే నీవద్భుతకారణున్డవు. నా నమస్కారములు గైకొమ్ము. సంపూర్ణవేదవిజ్ఞానమున కాశ్రయ భూతుడవు. ముక్తిదాయకుడవు. శ్రేష్టపురుషుల కాధారభూతుడవు. నా హృదయపూర్వక నమస్కారములు గైకొనుము.


"శాంతున కపవర్గసౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషు


నకు, ఘోరునకు గూడునకు గుణధర్మికి సౌమ్యున కధిక విజ్ఞాన మయున


కఖిలేంద్రియ ద్రష్ట కధ్యక్షునకు బహు క్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి


మూల ప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి


నెరి నసత్య మనేది నీడతో వెలుగుచు నుండు నెక్కటికి మహోత్తరునకు


నఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు."


భగవంతుడు శాంతస్వరూపుడు.మోక్షానికి అధిపతి. ఆనందానికి ఆలవాలం. స్వపరభేదం లేనివాడు. దుష్టులకు భయంకరుడు.సంసారబద్ధులకు అందనివాడు.గుణాల ధర్మమూకలవాడు.సరళస్వభావమూ విశేషమైన జ్ఞానము కలిగినవాడు. అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు. అన్నిటికీ ప్రభువు. సర్వజ్ఞుడు.దయారసానికి సముద్రంవంటివాడు. అన్నింటికీ మూలపురుషుడు. ఆత్మకు ఆధారమైన వాడు. ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు. దుఃఖాన్ని తొలగించే వాడు. మాయ అనే నీడతో నిండుగా వెలిగే వాడు, ఒంటరివాడు. మిక్కిలి గొప్పవాడు. అన్నిటికీ బీజమైనవాడు. ఏ కారణము లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడుమంటూ నమస్కరిస్తాను.


ఇక్కడ వారిద్దరూ కూడా ఒకే భావాన్ని వివిధ పదాలతో వ్యక్త పరిచారు. ఇద్దరు ఆ పరబ్రహ్మము యొక్క గుణగణాలను ప్రస్తుతించారు.


"గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూరితమానసాయ


నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయంప్రకాశాయ నమస్కరోమి"


ఏ త్రిగుణమయ కాష్ఠంబుల దాగి జ్ఞానమయాగ్ని యుండునో, అట్టి గుణంబుల కల్లోలమేర్పడ, ఎవని మనమున సృష్టిరచన గావింపగా బ్రహ్మాద్ధ్వంబు దలుచునో అటులనే ఆత్మతత్త్వముయొక్క భావన ద్వారా విధినిషేధ రూప శాస్త్రంబుల కతీతులై బ్రహ్మానందముననుభవించు నిష్కాములైన మహాత్ముల యందు స్వయం ప్రకాశమానుడైనట్టి ఆ ప్రభునికివే నా నమస్కారములు.


"యోగాగ్ని దగ్దకర్ములు యోగిశ్వరు లే మహాత్ము నొండెరుగక స


ద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతు రట్టి పరము భజింతున్."


యోగీన్ద్రులు యోగమనే అగ్నితో తమ పూర్వకర్మలను కాల్చివేసి ఇతరమేమి తలంచకుండా ప్రకాశించే తమ మనసులోని ఏ మహాదేవుని చూస్తుంటారో అటువంటి ప్రభువును నేను సేవిస్తాను.


ఇక్కడ వారిరువురూ కూడా, తమ కర్మలను గుణాలను,సంచితములనూ, యోగముతోనూ, నిష్కామకర్మలతోనూ దగ్దం చేసుకొనే యోగుల మనస్సులలో ఆ పరమాత్మ దర్శనమిస్తాడని చెప్పారు.


"మాదృక్ప్రప్రపన్నపశుపాశవిమోక్షణాయ ముక్తాయ భూరికరుణాయ నమో-లయాయ


స్వాంశేనసర్వతనుభ్రున్మనసి ప్రతీత ప్రత్యగ్ద్రుశే భగవతే బృహతే నమస్తే


అత్మాత్మ జాప్త గృహవిత్తజనేషుసక్తై ర్ద్రష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ


ముక్తాత్మభి: స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ"


పశుతుల్యుడను, అవిద్యాగ్రస్తుడనునగు నావంటి శరణాగతుని అవిద్యను తొలగించువాడును,స్వయం నిత్యముక్తుడును, అతిదయాళువును, కోరినదే తడవుగా త్వరితగతి కరుణించువాడునునగు ఆప్రభువు నకు నానమస్కారము. స్వాంశమునే సంపూర్ణ దేహధారుల మనసునందు అంతర్యామియై యుండు వాడు, సర్వనియంత, అనంతపరమాత్మునకు ఇదే నానమస్కారము. శరీర, పుత్ర, మిత్ర, గృహ, సంపత్తుల యందు మరియు బంధుజనుల యందాసక్తులైన వారికి అతి దుర్లభుడును, ముక్తపురుషుల హృదయమందు నిరంతరమూ వసియించు జ్ఞానస్వరూపుడును, సర్వనియామకుడును నగు ఆ భగవంతునకు నానమస్కారములు.


"సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ మయునికి నుత్తమ మందిరునకు


సకలగుణారణిచ్ఛన్న భోదాగ్నికి దనయంత రాజిల్లు ధన్యమతికి


గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తితకర్మనిర్వర్తితునకు


దిశలేని నాబోటి పశువుల పాపంబు లడచువానికి నమస్తాంతరాత్ము


డై వెలుంగువాని కచ్చిన్నునకు, భగవంతునకు దనూజపశునివేశ


దారసక్తులైనవారి కందగరాని, వాని కాచరింతు వందనములు."


పరమాత్ముడు అన్ని ఆగమాలకు, వేదాలకు సముద్రంవంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైనవాడు. రాపిడి కొయ్యలలో అగ్నివలె సుగుణాలలో దాగియుండేవాడు. తనంత తానుగా ప్రకాశించేవాడు. గొప్ప మనసు కలవాడు. ప్రళయమును, సృష్టిని నడిపేవాడు. నావంటి దిక్కు లేని ప్రాణుల పాపాలను శమింపజేసే వాడు. అందరిలోనూ ఆత్మగా వెలిగేవాడు. నాశనం లేనివాడు. పూజింపదగినవాడు. భార్య పుత్రులూ ఇల్లూ పశువులూ అనే వాటిపై ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి దేవాదిదేవునికి నమస్కారాలు చేస్తాను. ఇక్కడ కూడా ఇరువురూ ఒకే భావాన్ని వేర్వేరు శబ్దాలతో చెప్పారు.


"యం ధర్మకామార్ధవిముక్తికామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి


కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మేదభ్రదయో విమోక్షణం


ఏకాన్తినో యస్య న కంచనార్ధం వాన్ఛన్తి యే వై భగవత్ప్రపన్నాః


అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనందసముద్రమగ్నాః


తమక్షరం బ్రహ్మ పరం పరేశ మవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యం


అతీన్ద్రియమ్ సుక్ష్మవివాతిదూర మనంతమాద్యం పరిపూర్ణమీడే"


చతుర్విధ పురుషార్ధంబుల కోరువారు నీచే వారివారి కోర్కెలను పొందుచున్నారు. అట్టియెడ సాధారణమైన వారు వరంబులు కోరి పొందుటయొక లెక్కయా! అనంత కరుణామయుడవు. నీవు అట్టి వారికి సైతము వైదికాచారసంపన్నమైన దేహంబును ప్రసాదించునట్టి ప్రభువు నన్ను భయంకరమై, భాధాయుతమైన ఈప్రమాదమునుంచి రక్షించి ప్రాపంచకవిషయముల నుంచి తప్పించునుగాక. ఏకాంత చిత్తులైన భక్తులు సేవాపరాయణులై అనన్యమనస్కులైన వారు సంపూర్ణశరణాగతిబొంది భజన ధ్యానంబుల నుండువారు ఆధ్యాత్మికంబైన తాదాత్మ్యము నందియుండు వారలెట్టి వరంబులు కోరు కొనరు. సదా ఆనందసంద్రమున మునకలు వేయుచుందురు. నేనా అదృశ్యశక్తిని, నిత్యనివాసిని, పురుషోత్తముని, బ్రహ్మేంద్రాదులకు ప్రభువైనవానిని, భక్తియోగసులభుని, ఇంద్రియాతీతుడైన పరంధాముని, అనంతుని, మూలకారణమైనవాని, సర్వాంతర్యామిని నమస్కరించుచున్నాను.


"వరధర్మకామార్ధ వర్జితకాములై విబుధులెవ్వాని సేవించి యిష్ట


గతి బొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయదేహమిచ్చు నెవ్వాడు కరుణ?


ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు? రానందవార్ధి మగ్నాంతరంగు


లేకాంతు లెవ్వని నేమియు గోరక భద్ర చరిత్రంబు బాడుచుందు?


రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యు బూర్ణు నున్నతాత్ము


బ్రహ్మమైన వాని బరుని నతీన్ద్రియు, నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు."


అంతేకాక, భగవంతుడు ధర్మంపైన, కామంపైన ఆశలు విడిచిన పండితుల పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమవరాలు అనుగ్రహిస్తాడు. దరిజేరి కోరినవారికి దయతో నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనందసముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యమూ ఆరాధిస్తారు. పరమార్ధాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు. అతడు అందరికంటే ఆద్యుడైనవాడు. కంటికి కానరానివాడు. ఆధ్యాత్మయోగంవల్ల మాత్రమే చేరదగిన వాడు. పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్ఠమైనవాడు. ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూలస్వరూపుడు, సూక్ష్మస్వరూపుడు, అటువంటి మహాత్ముణ్ణి నేను సేవిస్తాను.


ఇక్కడ వారిరువురూ కూడా ఒక రహస్యం చెప్పుచున్నారు. భగవంతుడు తనను నిర్మలభక్తితో సేవించేవారి అన్నికొర్కెలూ తీరుస్తాడు. కాని మోక్షగాములైన వారు మాత్రం ఎటువంటి కోర్కెలుకోరరు. వారు ఒకవేళ కర్మలుచేయాల్సి వస్తే, నిష్కామంగా మాత్రమే చేస్తారు. వారి దృష్టి అంతా ఆ పరబ్రహ్మము వైపే వుంటుంది. అందువల్ల మోక్షగాములైన వారు కర్మలు చేయాల్సి వస్తే, నిష్కామంగా గాని, లేక పరమేశ్వర ప్రీత్యర్ధంగా గాని చేయాలి. భౌతికమైన కోర్కెలతో కర్మలు చేస్తే వారు మోక్షగాములు కారు.


"యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాస్చరాచరాః నామరూపవిభేదేన ఫల్ గ్వ్యా చ కలయాకృతాః


యధా ర్చిషో-గ్నే: సవితుర్గభస్తయో నిర్యాంతి సంయాన్త్యసకృత్ స్వరోచిషః


తథా యతో-యం గుణసంప్రవాహో బుద్ధిర్మనః ఖాని శరీర సర్గాః


స వై న దేవాసురమర్త్యతిర్యగ్ నస్త్రీ నషండో నపుమాన్ న జంతు:


నాయం గుణః కర్మ న సన్నచానన్ నిషేధశేషో జయతాద శేషః"


బ్రహ్మాది సమస్త దేవతలు, చతుర్వేదములు నామరూపసంపూర్ణ చరాచరజీవకోటి ఆకృతిభేదముచే సమస్తము ప్రభునిఅత్యల్పమైన అంశమునుంచి రచింపబడినవి. ఏవిధంబుగా జ్వలించునగ్నితో, సూర్యునితో కిరణంబులు పలుమార్లు వెడలుచుండునో, తిరిగి ఆకిరణములు కిరణములలో లీనమై పోవునో, ఆప్రకారంబుగా మనోబుద్ధి యింద్రియంబులు నానాయోనుల నుద్భవించు శరీరమను యీ గుణమయప్రపంచము ఏస్వయంప్రకాశపరమాత్మ నుంచి ప్రకటితమగునో తిరిగి అందే లీనమగుచున్నది. ఓపరమాత్మ! అది వాస్తవమున దెవతలూగారు, దైత్యులూగారు, మానవులూగారు, తిర్యగ్జాలమూలేదు, స్త్రీపురుషనపుంసకుల నెవ్వరూలేరు. ఇట్టి మూడు విభాగంబులలోనికి రాని ప్రాణికోటులు లేరు. అది గుణములు కాదు. కర్మములూ కాదు. కార్యములూ కాదు. కారణములూ కాదు. ఇట్లు కానివన్ని తొలగించిన తర్వాత ఏ విభాగము మిగిలియున్నదో అదియే దాని స్వరూపము. అట్టి పరమాత్మ నన్నుద్ధరించుట కావిర్భావించుగాక.


"పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్భంగి నిగిడింతు రెట్లడంతు


రాక్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వీల్పుల నఖిలజంతు


గణముల జగముల ఘననామరూపభేదములతో మెరయించి తగనడంచు


నెవ్వడు మనము బుద్ధీన్ద్రియమ్ములు దానయై గుణ సంప్రవాహంబు బరపు


స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక తిర్యగమరనరాది మూర్తియును గాక


కర్మగుణభేద సదసతప్రకాశి గాక, వెనుక నన్నియు దానగు విభు దలంతు"


అగ్నిజ్వాలలనూ, సూర్యుడు వెలుగులనూ ప్రసరింపజేసి మళ్లీ శమింపజేసే విధంగా భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మ మొదలైన దెవతలనూ, అన్ని జీవరాసులనూ, సకల లొకాలనూ, నానా విధాలైన నామరూపభేదాలతో పుట్టించి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధీ, ఇన్ద్రియాలూ అన్నీ తానేయై గుణాలతో ప్రవర్తిస్తాడు. ఆయన స్త్రీ , పురుషుడూ, నపుంసకుడు, నరసురజంతుస్వరూపుడూ కాకుండా గుణభేదాలకు కర్మకు అతీతంగా ఉంటాడు.ఉండడమూ లేకపోవడమూ అనే వాటిని బయలుపరచకుండా ఉంటాడు. ఏదీ కాకుండానే అన్నీ తానే అవుతాడు. అటువంటి ప్రభువును నేను ధ్యానం చేస్తాను.


ఇక్కడ వారిరువురూ కూడా ఆ నిరాకారపరబ్రహ్మ యొక్క అవ్యయస్వరూపాన్ని చాలా చక్కగా వివరించారు.ఎవరైతే పరబ్రహ్మస్వరూపాన్ని ఈవిధంగా తెలుసుకొని అర్ధంచేసుకుని ఆచైతన్యాను భవాన్ని సమాధ్యవస్థలో పొందుతారో వారు తప్పక ఆపరబ్రహ్మములో మమైక్యము చెందుతారు.


"జిజీవిషే నాహమిహాముయా కిం అంతర్బహిశ్చావృతయేభయోన్యా


ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవ స్తస్యాత్మలోకావరణస్య మోక్షం"


నేను మొసలిబారినుంచి రక్షింపబడి జీవించుట కోరను. కారణమేమనగా అన్నివైపులనుండి భయపడుచూ యీగజదేహంబుననే నుండనేల? నేనాత్మ ప్రకాశమును కప్పివేయు ఆ అజ్ఞానము నుంచి నివృత్తి పొందగోరుదును. ఆ అజ్ఞానము కాలక్రమమున నశించునదిగాదు. అది భగవంతుని కృపచే, జ్ఞానోదయముచే మాత్రమే నశించును.


ఈ శ్లోకాన్ని పోతనగారు తెనిగించ లేదు. ఇక్కడ వ్యాసులవారు మనస్సు, బుద్ధి అత్యుత్తమ స్థాయికి చేరుకుంటే ఏవిధమైన ఆలోచనవస్తుందో చూపించారు. ఇక్కడ గజేంద్రుడు ఆపదలతో భయపడుతూ జీవించడానికి ఇష్టపడటం లేదు. పైగా ఈఅజ్ఞానంతో ఎలాబ్రతకాలి అంటూ, ఆఅజ్ఞానం జ్ఞానోదయముచే నశించునంటున్నాడు. ఆ జ్ఞానోదయం ఎలా వస్తుంది? పరిపూర్ణజ్ఞానం తత్వవిచారం తోనేవస్తుంది.దాన్నే గజేంద్రుడుచేస్తూ ఈ మాటలంటున్నాడు.అంటే తత్వవిచారం చేస్తూవుంటే మనస్సు, బుద్ధి యొక్క స్థాయి పరిపక్వస్థితికి చేరుకొని జన్మయొక్క సార్ధకత సఫలం చేసుకోని ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి? అనే అత్యున్నతమైన ఆలోచన వస్తుంది. ఈ భావాన్నే సంత్ కబీర్ గారు ఇలా అన్నారు:


"మర్తే మర్తే జగ్ మరా, మర్నా నజానేకొయి, ఐసా మర్నా కొయి నమరా జో ఫిర్ నామర్నా హొయ్"


"ఈలోకంలో ప్రతిరోజూ జనం చస్తూనే ఉన్నారు. కాని దురదృష్టవశాత్తు చావురాకుండా ఉండేలా చని పోయినవాళ్ళు ఎవరూ లేరు." భగవద్గీత ప్రకారం పుట్టినవాళ్ళు చావక, చనిపోయిన వాళ్ళుమళ్లీ పుట్టక తప్పదు. కాని మళ్లీమళ్లీ పుట్టకుండా చనిపోవడం అంటే ఏమిటి? జన్మమృత్యుచక్రం నుండి బయటకు వచ్చి, ఆ పరబ్రహ్మంలో మహానిర్వాణం చెందడం. అదే మళ్లీమళ్లీ చావకుండా చచ్చిపోవడం. ఇదే జన్మ యొక్క సార్ధకత. ఇందుకే మనం జన్మించాము.


🙏🏿🙏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!


🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!👉🏿


కరి దిగుచు మకరి సరసికి


కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్


కరికి మకరి మకరికి కరి


భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !!


👉🏿


నానానేకప యూధముల్ వనము లోనన్ పెద్ద కాలంబు స


న్మానింపన్ దశ లక్ష కోటి కరిణీ నాధుండ నై యుండి మ


ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయ లందుండ లే


కీ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా !!


👉🏿


కలడందురు దీనుల యెడ


కలడందురు భక్త యోగి గణముల పాలం


గలడందురన్ని దిశలను


కలడు కలండనెడు వాడు కలడో లేడో !!


👉🏿


లోకంబులు లోకేశులు


లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం


జీకటి కవ్వల నెవ్వడు


ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!


👉🏿


ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?


ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం


బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా


డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!


👉🏿


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్


ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్


నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్


రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!


👉🏿


అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా


పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో


త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!


👉🏿


సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే


పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం


తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో


పరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహి యై !!


👉🏿


అడిగెద నని కడు వడి జను


అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్


వెడ వెడ జిడి ముడి తడ బడ


నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!


(వింజమూరి సేకరణ .)


👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿

Sunday, October 20, 2019

🚩 తిరు క్షవరం ..😅

🚩 తిరు క్షవరం ..😅


(Courtesy -Sri Satyanand Pydipalli..)

పేస్ బుక్ మా ఫ్రెండ్ గాడి పాలిట ...

డైరీ ,ఫోటో ఆల్బం ,పద్దుల బుక్ ,పోస్ట్ కార్డు , టెలిగ్రాం ,వెస్ట్ బాస్కెట్ , స్టోర్ రూమ్ ....అన్నీను .

ఏ విషయమైనా -అది ఎలాంటిదయినా అర్జెంటు గా పేస్ బుక్ లో గోడ మీద పెట్టకపోతే మనశాంతి ఉండదు వాడికి.

తినే తిండి , తొడిగే చొక్కా , ,తొక్కిన పేడ ,దూకిన గోడ ,తీసిన పేలు ,గోకిన కాలు ....ఒకటని లేదు ..తను చేసే ప్రతి పనికి రాని పని తెలుసుకోడానికి ప్రపంచం పని గట్టుకుని ఎదురు చూస్తోందని ప్రగాఢ నమ్మకం మా ఫ్రెండ్ గాడికి .

" ఈ రోజు తిరుపతి కి కుటుంబం మొత్తం ఇంటికి తాళం పెట్టి కట్టకట్టుకు పోతున్నాం ..రెండు రోజులు కొండ మీద కొత్త గుండు తో వుంటా ..ఇవిగో టిక్కెట్లు .." అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి (నమ్మమేమో అన్నట్టు ఫ్లైట్ టిక్కెట్లు ,కాటేజ్ -దర్శనాలకి రెకమెండేషన్ లెటర్స్ అన్ని మొహం మీద పెట్టుకుని సెల్ఫీ తీసి కూడా పెట్టి )పోయాడు .

ఇక మొదలైనది -గంటకో పోస్టు ...

.ఎయిర్ పోర్ట్ లో సెండ్ అఫ్ ఫోటో

వీడేదో చంద్రయాన్ లో పైకి పోతోన్నట్టు కాగలించుకు కన్నీళ్లు పెట్టుకు పంపే చుట్టాలు -ఓదార్చే వీడు ....

ఎయిర్ పోర్ట్ లో ఇడ్లి తిని చెట్నీ నాకే వీడి కొడుకు ..

ట్రంప్ లెవెల్లో ఫ్లైట్ లో కి ఎక్కుతూ వెనక్కి తిరిగి చెయ్యి ఊపే వీడు ..

ఇక వరసగా ఫోటోల మేళా -

కొండమీద కోతిని ఎక్కిరిస్తు వీడి ఫోటో (కోతి ఎవరో -వీడు ఎవరో కాసేపు చూస్తే తప్ప తెలీ లేదు )

గుండు చేయించుకుంటూ ఫోటో ,

అంతా గుళ్ళు తో గుళ్ల ముందు ఫోటో ..

ఆబగా ప్రసాదాలు తింటూ ఫోటో ..

వాలీ లోకి దూకుతున్నట్టు కామెడీ ఫోటో ..(దూకినా బావుండును )

కొత్తగా కొన్న టైట్ గా వున్న టోపీ తో చండాలం గా వున్న ఫోటో ,

వాళ్ళ ఆవిడని పట్టుకుని గార్డెన్ లో విజయ్ దేవరకొండ స్టైల్ రొమాంటిక్ ఫోటో (పాపం ఆవిడ తెగ సిగ్గుతో ఇబ్బంది పడుతూ కనిపించింది )

ఎన్నని చెప్పను వాడి వేషాలు ..

చిరాకు తో పేస్ బుక్ చూడటం మానేసాను .

రెండు రోజులు తర్వాత ..నిన్న గుండు తోనూ , ప్రసాదం తోనూ మా ఇంటికి వచ్చాడు .

"అంతా బాగా జరిగిందా .."అడిగాను

"క్షవరం బాగానే జరిగింది .."సీరియస్ గా అన్నాడు .

"అదేంటి అలా వున్నావ్ ..గుండు చేస్తోంటే గాట్లు ఏవైనా పడ్డాయా .."ఓదార్పుగా అడిగాను .

వాడు సైలెంట్ .

"ఎం జరిగింది రా .."అడిగా .

"ఫేస్బుక్ అంత ప్రమాదమైనది దరిద్రమైనది , దారుణమైనది ప్రపంచం లో ఇంకోటి లేదు ..నా ఎకౌంట్ క్లోజ్ చేసేసా .."సీరియస్ గా అనేసి పిలుస్తున్నా, ఆగకుండా పోయాడు .

వాళ్ళబ్బాయికి ఫోన్ చేసి అడిగితె వాడు చెప్పాడు ....

వీడు ఎన్ని రోజులు కొంపలో వుండటంలేదో ఫోటోలు ఫోస్ట్ ల ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ..

ఓ దొంగల గ్రూప్ హ్యాపీ గా , తాపీగా తాళాలు తీసి ఇంట్లో సెటిల్ అయ్యి ..ఫ్రీజ్ లో వన్నీ తినేసి ,పెట్లు అన్నీ సర్దేసి , మూవర్స్ అండ్ పాకేర్స్ టైప్ లో అన్నీ వాన్ లో సర్దుకుని పోయారట .

పైగా వెళుతూ వెళుతూ ..ఇంట్లో వాల్ మీద ..

"పేస్ బుక్ లో మీ వాల్ మీద మీ ఫోటో లు బావున్నాయి ..ఎప్పుడు ఏ వూరు వెళ్లినా ఇలాగె డీటెయిల్స్ పెట్టండి ..మీ ఫాలోవర్స్ .."అని స్మైలీ బొమ్మలు వేసారట .

"ఇప్పుడు నాన్న ఎక్కడ వున్నాడు .."ఫోన్ లో అడిగాను .

"గుండు కి గంధం రాసుకుని , దేవుడి గదిలో వున్నాడు .."అన్నాడు

"ఎం చేస్తున్నాడు "అడిగాను .

"పోయినవన్నీ దొరికితే కొండకి నన్ను తీసుకెళ్లి నాకు ,అమ్మకి గుండు చేయిస్తానని మొక్కుకుంటున్నాడు ..."ఏడుపుగా అని ఫోన్ పెట్టేసాడు .

మళ్ళీ మా ఫ్రెండ్ గాడి కి కి మరో ట్రిప్ ఉండాలని కోరు కుంటూ ఫోన్ ఆఫ్ చేశాను .


హ్యాపీ సన్ డే (వాడికి తప్ప )

😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

Friday, October 18, 2019

🚩 కళాపూర్ణోదయం -8: మణిహారం.!

🚩 కళాపూర్ణోదయం -8: మణిహారం.!


(రచన: శ్రీ కె. వి. ఎస్. రామారావు గారు .. వారికీ కృతజ్ఞతో ..)


👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿.........


( జరిగిన కథ :-రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు అలఘువ్రతుడితో అక్కడ వున్న నలుగురు పురోహితులూ అతని కొడుకులేనని చెప్తుంది. అతను నమ్మలేకపోతాడు. బట్టతలకీ మోకాలికీ ముడిపెట్టగలిగే ఈ కతలతల్లి అదెలా సాధ్యం చేస్తుందోనని ఆశ్చర్యపడతాడు. ఇక చదవండి.)


🚩


అలఘువ్రతుడి మాటలకు నవ్వుతూ, “అలా జరగటం తప్పదు” అన్నాడు కళాపూర్ణుడు. ఆ పాపని చూసి, “ఇతని పుట్టుపూర్వోత్తరాలు, ఇతనికి ప్రథమాగమాదులు ఎలా కొడుకులో మాకందరికీ వివరంగా చెప్పమ”ని అడిగాడు. “అలాగే!” అని ఆ పాప ఇలా చెప్పింది


పాండ్యదేశంలో సోమశర్మ అనే అతను వుండేవాడు. అతని కొడుకు యజ్ఞశర్మ. ఎంత కష్టపడ్డా అతనికి వేదవిద్యలు ఒక్కముక్క ఒంటపట్టలేదని అతను బాధపడుతుంటే, అది మరిపించటానికి అతని తండ్రి నలుగురు గుణవతుల్ని తెచ్చి అతనికి పెళ్ళిచేశాడు. కోడళ్ళందరికీ ఎన్నో ఆభరణాలు, చీరలు, కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చాడు. చివరి దశలో అతను కొడుకుని పిలిచి, కోడళ్ళకు వినపడేట్టు చెప్పాడు “మన వంశాచారం అన్నదానం. ఎలాటి పరిస్థితుల్లోనైనా దాన్ని ఆపకుండా నడుపు. దాని వల్ల నీకు నాలుగు వేదాల వంటి కొడుకులు కలుగుతారు. నా మాట తప్పదు” అని. “అలాగే”నని మాట యిచ్చాడు కొడుకు.


ఆ మాటమీద నిలబడి అతను క్రమం తప్పకుండా తన దగ్గరున్న సొమ్మంతా ఖర్చు పెట్టి అన్నదానాలు చేశాడు. చివరికి తన భార్యల సొమ్ములన్నీ అమ్మాల్సొచ్చింది. ఐతే అందుకు వాళ్ళేమీ బాధపడక పోవటమే కాకుండా “ముందుగా నావి తీసుకోండి, నావి తీసుకోండి” అని అందరూ వాళ్ళ ఆభరణాలన్నీ అతనికిచ్చారు.


ఆ యజ్ఞశర్మే ఈ అలఘువ్రతుడు. ఇతని గొప్ప అన్నదాన వ్రతం మూలాన ఈ పేరు వచ్చింది.


కొంతకాలానికి అతనికి దగ్గర వున్నదంతా ఐపోయింది. ఎలాగైనా తన వ్రతం జరపాలి గనక అందుకు మిగిలిన ఒకటే మార్గం తన భార్యల్ని అమ్మటం అని నిశ్చయించుకున్నాడు. ఐతే ఆ విషయం వాళ్ళకి చెప్పటానికి అతని మనసు రాలేదు. ఒక ఉపాయం ఆలోచించి, “తామ్రపర్ణి రేవులోకి వోడలు వచ్చాయి. నేను ఒకతనితో కలిసి ఓడవ్యాపారం చేసి అన్నదానాలకి డబ్బు సంపాయించుకు వస్తాను” అన్నాడు వాళ్ళతో. వాళ్ళు, “మీరు లేకుండా మేం వుండలేము, మమ్మల్నీ మీతో తీసుకెళ్ళండి” అని ప్రాధేయపడితే కష్టం మీద ఒప్పుకుని (అలా నటించి) వాళ్ళందర్నీ ఒక ఓడ మీద ఎక్కించాడు. తను చివర్లో ఎక్కుతానని చెప్పి కొంచెం దూరంలో దాక్కున్నాడు. ఐతే ఆ ఓడ కదిలి కొంచెం దూరం వెళ్ళేసరికి అతనికి ఎక్కడ లేని దుఃఖం కలిగింది. బోరున ఏడ్చాడు.


అతని భార్యలు చూశారది. ఆ నావికుడెవడో తమ భర్తని మోసం చేశాడనుకుని నలుగురూ ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశారు!


ఎంత వెదికినా వాళ్ళు దొరకలేదు.


“నీ ఏడుపు మూలానే ఇంత జరిగింద”ని అతని కిచ్చిన డబ్బు కూడ లాగేసుకున్నారు నావికులు.


కనుక, తనకు నలుగురు కొడుకులున్నారనే విషయం ఇతను నమ్మలేక పోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఇతనికి తెలియని కథ చాలా వుంది.


ఇతని భార్యలు సముద్రంలోకి దూకిన సమయంలో ఓ పెద్ద చేప నీళ్ళను లోనికి పీలుస్తున్నది. ఆ నీటితో పాటు వాళ్ళూ దాని నోట్లోకి వెళ్ళారు.


ఆ తర్వాత అది కొంతదూరం వెళ్ళి ఆ నీటిని పైకి విసిరింది. దాంతో పాటు వాళ్ళూ పైకి ఎగిరారు.


అలా ఎంతో ఎత్తు ఎగిరి వాళ్ళు అప్పుడు అక్కడ వెళ్తున్న ఓ విమానంలో పడ్డారు.


తెలివొచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక దేవతా దంపతుల్ని చూశారు.


వాళ్ళు ఆ నలుగురినీ ఆదరించారు.


ఐతే వాళ్ళ లావణ్యం చూసిన దేవకాంతకి తన భర్త వాళ్ళ మీద మనసు పడతాడేమో ననే అనుమానం భూతమై పట్టుకుంది.


వాళ్లనెలాగైనా వదిలించుకోవటం మంచిదని ఓ ఉపాయం పన్నింది.


పాచికల ఆటలో తన భర్తని ఓడించి, అందుకు పందెంగా ఇద్దరూ మధురసం తాగి శృంగారక్రీడలు చెయ్యాలని చెప్పి, మధువు తాగేప్పుడు ఆ పాత్రలో తన రూపాన్నే చూసుకుని, “నేను కాక ఇంకెవర్నో తెచ్చిపెట్టుకున్నావా?” అంటూ అతన్తో పోట్లాటకి దిగింది.


అప్పుడు వాళ్ళ విమానం గోదావరీ తీరంలో వెళ్తోంది. అక్కడ ధర్మపురి అనే వూళ్ళో ముఖ్యవారకాంత ఇల్లు ఆకాశాన్ని తాకుతోంటే, ఈ నాటకంతో ఆ నలుగుర్నీ ఆ మేడ పైన దింపించింది. ఐతే వెళ్ళేముందు ఆమె భర్త, “పాపం వాళ్ళు తినటం, ఉండటం ఎలాగా?” అని విచారిస్తోంటే, “ఏం పర్లేదు, ఆ ఇంటి నిండా బోలెడు వస్తువు లున్నాయి. ఇకనుంచి ఆ వస్తువుల్ని వీళ్ళు గాక మరెవరు వాడబోయినా వాళ్ళకి మూడిందే!” అన్నది.


ఆమె తన భర్త మీద అనుమానంతో అన్న ఆ మాట వాళ్ళకి వరంగా పరిణమించింది.


విమానంలో వెళ్ళిపోయారు ఆ దేవతలు.


ఆ యింటి యజమానురాలు ఇదంతా చూసి “వీరెవరో దేవతల్లా వున్నారు, వీళ్ళు ఇక్కడ వుండటమే నా అదృష్టం” అని వాళ్ళకి కనపడకుండా అన్ని సదుపాయాలూ వాళ్ళకి ఏర్పాటుచేసింది.


అప్పుడే వాళ్ళకు గర్భసూచనలు కనిపించాయి. కొన్నాళ్లకి నలుగురికీ నలుగురు కొడుకులు పుట్టారు.


అనుకోకుండా అటు వచ్చిన ఒక యోగి ఆ బిడ్డల జాతకర్మలు నిర్వర్తించాడు. అతనే తన జ్ఞానదృష్టితో వాళ్ళు వేదరూపాలని గుర్తించి అదే విధంగా వాళ్ళకి నామకరణం కూడ చేశాడు.


వాళ్ళు స్వయంగా అన్ని విద్యలూ తెలిసిన వాళ్ళైనా శాస్త్రోక్తంగా ఆ యోగి దగ్గర కూడ కొంత విద్యాభ్యాసం చేశారు.


కొన్నాళ్ళకి వాళ్ళ తల్లులు ఇలా ఊరుకుంటే తమ భర్త విషయం ఎప్పటికీ తెలియదని, వెళ్ళి అతనికోసం వెదకటం మంచిదని, ఆ విషయం కొడుకుల్తో చెప్పారు.


వాళ్ళు “మేము ఓ రాజు దగ్గర ప్రాపకం సంపాయించి వస్తాం. అప్పుడు ఆయన్ను వెదకటం తేలికౌతుంది” అని ఊళ్ళోకి వెళ్ళి విచారిస్తే, అక్కడి రాజు మదాశయుడని, అతను విద్యలు తెలిసినవాడనీ, ఐతే అతని పురోహితుని అనుమతి లేకుండా ఎవరికీ ప్రవేశం దొరకదనీ, ప్రతిభ వున్నవాళ్లు ఎవరికీ పురోహితుడి అనుమతి దొరకదనీ విన్నారు.


రాజుకు మామిడిపండ్ల బుట్టలు మోసుకెళ్ళే వాళ్ళతో కలిసి వాళ్ళ లాటి వేషాల్లో మోసుకెళ్ళి రాజు ముందర పెట్టారు. వాళ్ళ అమాయక చేష్టలు చూసి రాజు నవ్వుతూ, “అంతా బాగే కదా, దాపరికం లేకుండా చెప్పండి” అంటే వాళ్ళు తెలుగులో ఐతే ఒక అర్థమూ, సంస్కృతంలో ఐతే మరో అర్థమూ వచ్చే విధంగా మాట్లాడారు. మదాశయుడు వెంటనే వాళ్ళని నివురుగప్పిన నిప్పుల్లాటి వాళ్ళని గ్రహించి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆదరించాడు. వాళ్ళని తనకు పురోహితులుగా వుండమని ప్రార్థించాడు. అలాగే నని ఒప్పుకుని వాళ్ళు ఆ తరవాత తమ తండ్రిని ఎంతగానో వెదికించారు.


ఈలోగా అలఘువ్రతుడు తను చేసిన పనికి విచారిస్తూ దేశాంతరాలు తిరుగుతూ మృగేంద్రవాహన ఆలయం గురించి విని అక్కడికి వెళ్ళి భువనేశ్వరీ మంత్ర జపం రెండేళ్ళ పాటు చేసి ఆ దేవి మహిమ వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాడు” అని ముగించిందా పాప.


ఆశ్చర్యంతో ఈ కథంతా విన్న ఆ పురోహితులు పొంగిపోతూ తమ తండ్రిని కలుసుకుని నమస్కరించారు.


కళాపూర్ణుడు కూడ వాళ్ళని సన్మానించాడు.


అప్పుడు అతని మంత్రుల్లో సత్వదాత్ముడనే వాడు ఆ బాలికతో, “అమ్మా, నేను వెర్రిగా కాసారపురంలో తిరుగుతుంటే జనం నాకు సత్వదాత్ముడని పేరు పెట్టారు. అంతకుముందు నా చరిత్ర ఏమిటో నాకేమీ తెలియదు. ఇన్ని తెలిసిన దానివి నా సంగతి కూడ చెప్పు” అని అడిగాడు. ఐతే ఎందువల్లనో ఆ పాప కేవలం పసిపాప లాగా కళ్ళు నులుముకుని ఏడుపు సాగించిందే తప్ప ఎంత బతిమాలినా ఇంకో ముక్క మాట్లాడలేదు.


కళాపూర్ణుడు మదాశయుణ్ణీ రూపానుభూతినీ చూసి, “విన్నారు కదా, ఇకనుంచి మీరు నాకు అత్తమామలు. మీరు కొలువుకు రానక్కరలేదు. ఇంటికి వెళ్ళి ఈ మధురలాలసని పెంచండి” అని పంపాడు. అలాగే అలఘువ్రతుణ్ణి కూడ అతని భార్యల దగ్గరకు పంపించాడు. అతని అన్నదాన వ్రతం సాగటానికి అనేక గ్రామాలిచ్చాడతనికి.


కాలం గడుస్తోంది.


మధురలాలస పెద్దదయింది.


చెలుల ద్వారా తన చిన్నప్పటి వృత్తాంతం విని కళాపూర్ణుడి మీద మనసు పెంచుకుంది.


ఐతే కళాపూర్ణుడు అభినవకౌముదితో ఆనందంగా వుంటూ, రాజ్యవ్యవహారాల్లో మునిగిపోయి మధురలాలస విషయం పూర్తిగా మరిచిపోయాడు.


వసంతం వచ్చింది. చెలికత్తెల్తో మధురలాలస వనవిహారానికి వెళ్ళింది. డేగవేట మీద కళాపూర్ణుడు కూడ వాళ్ళున్న దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. భారంగా ఒకరికొకరు దూరమయ్యారు.


కళాపూర్ణుడు ఒక వృద్ధవిప్రుణ్ణి పిలిచి తను వనంలో చూసిన సుందరి గురించి చెప్పి ఆమె ఎవరో కనుక్కోమన్నాడు. అతను కొంతసేపు ఆ రాజుతో నర్మగర్భంగా మాట్లాడి చివరికి మెల్లగా బయటపెట్టాడు, ఆమె ఎవరో కాదు మధురలాలసే నని. ఆమె చిన్నప్పుడే కళాపూర్ణుడు ఆమె తల్లిదండ్రుల్ని తనకు అత్తమామలుగా చెప్పుకున్న విషయం గుర్తు చేశాడు.


ఇంకేముంది, ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి వాళ్ళ వివాహానికి!


అభినవకౌముదినీ, మధురలాలసనీ సమానంగా చూసుకుంటూ ఇద్దరితోనూ ఆనందంగా గడుపుతున్నాడు కళాపూర్ణుడు.


ఒక రోజు


అభినవకౌముది వీణ వాయిస్తూ హాయిగా గానం చేస్తోంది. కళాపూర్ణుడు తను కూడ వింటుందని మధురలాలసని అక్కడికి రప్పించి ఆమెను కూడ పాడి వినిపించమన్నాడు. ఆమె “ఈ వీణ ముందు నా స్వరం సరిపోదేమో!” అని అనుమానిస్తే, “నువ్వు మామూలుగా పాడు, ఆ వీణని పట్టించుకోకుండా” అన్నాడతను. అప్పుడామె తన గొంతెత్తి పాడేసరికి ఆ స్వరపటిమకి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆమె గాత్రం ముందు ఆ వీణ చాలదని గ్రహించాడతను. అంతకన్నా మంచి వీణ ఎక్కడన్నా వుందా అని అభినవకౌముదిని అడిగాడు. ఆమె “నేను తనకు ప్రియశిష్యురాలినని తుంబురుడు దీన్ని నాకు ఇచ్చాడు. అప్పుడతను ఇంతకన్నా మంచి వీణ ఇంకెక్కడా లేదని చెప్పాడు” అని కొంచెం ఆలోచించి, “ఐతే, ఈ మధ్య నారదుడు తుంబురుణ్ణి గానంలో ఓడించాడని విన్నాను” అన్నది.


ఆ మాటతో హఠాత్తుగా అతనికి మధురలాలస చిన్నప్పుడు చెప్పిన తన పూర్వజన్మ కథ గుర్తొచ్చింది. దాంతో పాటే స్వయంగా అతనికి కూడా పూర్వజన్మ విషయాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు మణికంధరుడిగా తన వీణను మృగేంద్రవాహనాలయంలో దాచటం గుర్తొచ్చింది. అదే ఆమె కంఠానికి తగిన వీణ అని గ్రహించి, “నీ కంఠానికి సరిపడే వీణ ఒకచోట వుంది. దాన్ని నీకోసం తెప్పిస్తాను” అన్నాడు మధురలాలసతో.


అభినవకౌముది చెలికత్తెలు ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన ఎదుట తన భర్త తన సవతిని అంతగా గౌరవించటం ఆమెకెంత అవమానమో బాగా నూరిపోశారు. దాంతో ఆమె మొహం ముడుచుకుని వుంటే కళాపూర్ణుడు ఆ వీణని తెచ్చి ఆమెకే ఇచ్చి ఆమెని గానంలో అందరి కంటే మిన్నగా చేస్తానని వాగ్దానం చేశాడు.


ఐతే ఈ వార్త వెంటనే మధురలాలసకి చేరింది. తన కోసం తెస్తానన్న వీణని ఇప్పుడు అభినవకౌముదికి ఇవ్వబోతున్నాడని ఆమె కోపగించుకుని అలిగింది. ఆమె అలక తీర్చటానికి అన్ని దిక్కుల రాజుల మహారాణుల మౌళిమణుల్తో ఆమెకు కాలి అందెలు చేయిస్తానని శపథం చేశాడు కళాపూర్ణుడు.


అలా ఆ ఇద్దరికిచ్చిన మాటలు తీర్చుకోవటానికి దిగ్విజయాలు చేసి ఆ వస్తువుల్ని సంపాదించి తెచ్చాడు.


వీణని అభినవకౌముదికిచ్చాడు. మధురలాలసకి పాదమంజీరాలు చేయించమని తన మంత్రిని నియమించాడు.


అతనలా దిగ్విజయం చేసి వచ్చినందుకు ఆనందంగా రకరకాల భూషణాల్ని అలంకరించుకుని ఆ సందర్భంలో తన చిన్నప్పుడు కళాపూర్ణుడు తనకు కానుకగా ఇచ్చిన హారం విషయం చెలికత్తెలు గుర్తు చేస్తే దాన్ని బయటకు తీసి అది మరీ చిన్నదిగా వున్నందువల్ల పొడవు పెంచి వేసుకుంది మధురలాలస.


అప్పుడు సత్వదాత్ముడనే మంత్రి ఆమెకు కొత్తగా చేయించిన అందెలు తీసుకొచ్చి ఆమెకు సాష్టాంగనమస్కారం చెయ్యబోతే ఆమె అతన్ని వారిస్తూ, “వద్దు వద్దు, నువ్వు నాకు మేనమామవు” అంటూ తనే అతనికి నమస్కరించింది.


అందరూ ఆశ్చర్యంగా చూశారామెను.


కళాపూర్ణుడు నవ్వుతూ, “చూస్తే, నీకు చిన్నప్పుడు కలిగిన జననాంతర జ్ఞానం మళ్ళీ కలిగినట్టుంది. అతను అప్పుడు తనెవరో చెప్పమంటే చెప్పలేదు. ఇప్పుడు అడక్కుండానే చెప్తున్నావు. ఐతే అతను నీకు ఎలా మేనమామో కొంచెం వివరంగా చెప్పు. అలాగే, ఇంత గొప్ప జ్ఞానం ఆ వయసులోనే నీకెలా కలిగిందో అప్పుడే ఎందుకు అడగలేదా అని ఎప్పుడూ బాధపడుతుంటాను. ఆ విషయం కూడ చెబుదువు గాని” అన్నాడామెతో.


ఒక విసనకర్రతో అతనికి విసురుతూ ఇలా చెప్పింది మధురలాలస


“ఇతను ఇదివరకు మహారాష్ట్ర దేశం ఏలే సుగ్రహుడనే రాజు. మా తల్లి రూపానుభూతి ఇతనికి అక్క. ఇతనికి పిల్ల నివ్వాలని ఎంతోమంది రాజులు పత్రికలు పంపారు. ఐతే వాళ్ళలో ఎవరితో సంబంధం చేసుకోవాలో తేల్చుకోలేక చాలా కాలం గడిపితే వాళ్ళు కోపగించి తలా ఓ నెపం పెట్టుకుని ఇతని మీదకు దండయాత్రలు చేశారు. రాజ్యం విడిచి వెళ్ళి బయటనుంచి వాళ్ళని జయిద్దామని ఇతను అడవిలోకి పారిపోయాడు. ఆ రాజులు మాత్రం “రాజు లేని రాజ్యాన్ని ఆక్రమించటంలో గొప్ప ఏమిటి?” అనుకుని ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు.


అది ఇతనికి తెలీదు గనక అడవిలోనే వుండి “ఉన్నచోటనే వుండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన వాడు కదా నిజంగా గొప్పవాడు!” అని ఎలాగైనా ఆ శక్తిని సంపాయించాలని బృందావనానికి వెళ్ళి బాలకృష్ణుడి గురించి తపస్సు చేశాడు.


ఇతని తపస్సుకి మెచ్చి విష్ణువు బాలరూపంలో మర్రి ఆకు మీద పడుకుని ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు సర్వజ్ఞత్వం కలగాలని అడిగాడితను.


అప్పుడు విష్ణువు తన మెడలో వున్న ఒక హారాన్ని తీసి ఇతని కిస్తూ, “ఈ హారంలోని నాయకమణి ఎవరి హృదయస్థానానికైనా ఎంతసేపు తాకివుంటుందో అంతసేపు వాళ్ళకు సర్వజ్ఞత్వం వస్తుంది. ఐతే, బ్రాహ్మణులకి మనస్తాపం కలిగించిన వాళ్ల దగ్గర మాత్రం ఇది వుండదు” అని వివరించి మాయమయ్యాడు.


ఇతను ఆ హారాన్ని తీసుకుని వస్తూ దార్లో ఓ దేవాలయం దగ్గరకు వెళ్ళాడు.


అక్కడొక అద్భుత సుందరమైన ప్రతిమ వుంది. దాన్ని చూస్తూ ఇతను కొంచెం దూరంలో కూర్చున్నాడు.


ఇంతలో అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆ ప్రతిమని చూసి అతని మనసు చెదిరింది. ఎవరూ దగ్గర్లో లేరులే అనే ధైర్యంతో దాన్ని బలంగా కౌగిలించుకున్నాడు.


అంతలోనే ఆ దగ్గర్లో వున్న సుగ్రహుణ్ణి గమనించి, ఆ చుట్టుపక్కల వున్న ప్రతిమలన్నిట్నీ కౌగిలించుకోవటం మొదలెట్టాడు.


ఐతే సుగ్రహుడు అది చూసి నవ్వుతూ, “ఎంత నటించినా నువ్వు నన్ను మోసపుచ్చలేవు. నీ ఆంతర్యం నాకు తెలుసులే!” అని గేలిచేశాడు.


ఆ యోగికి కోపం వచ్చింది. “ఇప్పటిదాకా నీకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి పో!” అని శపించాడు. ఇతను భయపడి ప్రాధేయపడితే “నా యీ రహస్యచేష్ట గురించి ఎవరైనా మాట్లాడితే అప్పుడుగాని నీకు నీ పాత జ్ఞాపకాలన్నీ తిరిగిరావు!” అని చెప్పాడు.


అలా కలిగిన మతిమరుపు వల్ల ఒక్క క్షణం కిందటనే ఆ పక్కన తను పెట్టుకున్న హారం సంగతి మరిచిపోయాడితను.


మతిలేని వాడిలా తిరుగుతూ గంగాసరయూ సంగమ స్థలాన్ని చేరాడు.


అప్పుడు కాసారపురానికి రాజు లేకపోతే వాళ్ళు ఒక ఏనుగుకు పూలమాల ఇచ్చి “ఇది ఎవరి మెడలో ఈ మాల వేస్తుందో అతనే ఇకనుంచి రాజు” అని పంపారు. అది ఇతని మెడలో వేసిందా మాలని. అలా కాసారపురానికి రాజై, నీ తల్లిదండ్రుల్తో పరిచయమై ఆ తర్వాత నీకు మంత్రి అయ్యాడు. అది ఇతని కథ!


ఇక నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయనే విషయం గురించి సుగ్రహుడు ఆలయం దగ్గర వదిలేసిన హారాన్ని మధురలో వుండే ఒక బ్రాహ్మణుడు తీసుకెళ్ళి ఎంతో కాలం పూజించి ఆ తర్వాత ద్వారకకు వెళ్ళి దాన్ని కృష్ణుడికి కానుగ్గా ఇచ్చాడు. దాన్ని కృష్ణుడు మణికంధరుడి కవిత్వానికి మెచ్చి అతనికిచ్చాడు. అతను దాన్ని ధరించాడు కాని అతని హృదయభాగం దాకా రాలేదది!


తను శ్రీశైలంలో భృగుపాతానికి వెళ్తూ మణికంధరుడు దాన్ని అలఘువ్రతుడికి ఇచ్చాడు. అతను నీకిస్తే నువ్వు నాకు ఇచ్చావు. అప్పుడు నేను చిన్నదాన్ని గనక దాని నాయకమణి నా హృదయభాగానికి తాగింది. అలా నాకు సర్వజ్ఞత్వం కలిగింది. ఐతే నేను కొంచెం కదిలినప్పుడు ఆ శక్తి పోయింది.


అలా ఇన్నాళ్ళూ మనకెవరికీ ఈ హారం ప్రభావం తెలీలేదు. ఈరోజు నేను అనుకోకుండా దాన్ని పొడవు చేసి వేసుకోవటం వల్ల మళ్ళీ అది నా హృదయస్థానాన్ని తాకి నాకీ జ్ఞానం కలిగింది” అంటూ అన్ని విషయాలు వివరించింది మధురలాలస.


సత్వదాత్ముడికి కూడ తన పూర్వజ్ఞాపకాలన్నీ తిరిగొచ్చాయి. తన మహారాష్ట్ర రాజ్యానికి తిరిగివెళ్ళి దాన్ని మళ్ళీ పాలించాడతను.


మధురలాలస కౌగిలిలో ఆ నాయకమణి తన హృదయాన్ని కూడ తాకేట్టు చేసి కళాపూర్ణుడు కూడ ఆ విడ్డూరాలన్నీ స్వయంగా గ్రహించాడు.


ఆ పూర్వజన్మ జ్ఞానంతో తను మాట ఇచ్చిన ప్రకారం అభినవకౌముదిని గానంలో ఎదురులేకుండా తీర్చిదిద్దాడు.


రాజ్యవ్యవహారాల్లో తనకు కావలసిన విషయాల్ని ఆ హారం ప్రభావంతో కనుక్కుంటూ సుఖంగా రాజ్యపాలన చేసి పుత్రపౌత్రాభివృద్ధి పొందాడు కళాపూర్ణుడు.


..................................సమాప్తం.................................................


👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿...

No photo description available.