Thursday, June 30, 2016

పరోపకారం... భగవంతుని చేరే మార్గం.!

పరోపకారం... భగవంతుని చేరే మార్గం.!

భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది. ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది.

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్

నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే

తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్

తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే

ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.

నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.

పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుంది, పాప రహితులైన రుషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి. తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.

Tuesday, June 28, 2016

మగవారూ - ఆడవేషాలూ .!

మగవారూ - ఆడవేషాలూ .!

.

ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం' నాటకానికి వెళ్లాను. 

దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం. చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు. ఎంతవరకూ లాగించుకోవాలో ద్రౌపదికీ తెలియదు. 

ఇద్దరూ కూడా చెడ తాగి ఉన్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి వుండేది. కాని వేషం కట్టినది పురుషుడు కదా! 'వద్దు వద్దు' అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు - ద్రౌపది ఆపలేదు.

.

చివరికి ద్రౌపది వేషధారికి పైన 'రైక', క్రింద గావంచా మిగిలింది. నెత్తిపైన బోర్లించిన బుట్టలా సవరం ఒకటి! సృష్టికంతకు ఒక్కటే దిష్టిపిడతలా ద్రౌపది మిగిలింది. 

పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు. తెర దించబోతే పడలేదు.

ద్రౌపదికి నాటకం కాంట్రాక్టరుకి భయం వేసింది కాబోలు కిందకు ఉరికాడు.

ద్రౌపది వేషధారి తను ఆడో, మగో మర్చిపోయి పురుషుల వైపుకు పరిగెట్టాలో, స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూచున్నాడు. ఆడవాళ్లంతా తటాలున లేచిపోయి పాక కాలినంత హడావుడి చేసి కేకలు వేశారు. చివరకు కొందరు మగవాళ్లు వచ్చి ఆ వేషధారిని చావగొట్టారు.

కొంతకాలం పాటు ఆడవేషాలు వేస్తే పాత్రధారి ఇలాగే అవుతాడు. -


మయూరం - నెమలి - మైలతుత్తం !

మయూరం - నెమలి - మైలతుత్తం !

(Vvs Sarma గారికికృతజ్ఞలతో. )

.

చాగంటి కోటేశ్వరరావుగారి ధర్మమా అని ఈరోజు నెమలిని గురించి ఆలోచనలు వచ్చాయి. మయూరం చాలా విచిత్రమైన పక్షి విశేషము. సంస్కృత సాహిత్యంలో అనేక నామాలు. 

.

। बर्हिणः २ बर्ही ३ नीलकण्ठः ४ भुजङ्गभुक् ५ शिखाबलः ६ शिखी ७ केकी ८ मेघनादानुलासी ९ । इत्यमरः प्रचलाकी १० चन्द्रकी ११ सितापाङ्गः १२ । इति शब्दरत्नावली ॥ ध्वजी १३ मेघानन्दी १४ कलापी १५ शिखण्डी १६ चित्पिच्छिकः १७ भुजगभोगी १८ मेघनादानुलासकः १९ 

.

పురాణాలలో కూడా నెమలి ప్రసక్తి వస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈక ధరిస్తాడు. కార్తికేయుని వాహనం నెమలి. భారతంలో భీష్ముడు కృష్ణుని సుబ్రహ్మణ్య అని సంబోధిస్తాడు. ఆయన శిఖలో నెమలిఈక ఆయన కుమార తత్త్వానికి సంకేతం. మయూరః పుంలింగం. మయూరి స్త్రీ. నాట్య మయూరీ అనే వర్ణన సుపరిచితం. ఈ పక్షివైచిత్ర్యానికి కారణం రామాయణంలో ఇలా ఉంది 

.

प्रविष्टायां हुताशन्तु वेदवत्यां स रावणः 

। पुष्पकन्तु समारुह्य परिचक्राम मेदिनीम् ॥

.

వేదవతి అగ్నిప్రవేశం చేశాక రావణుడు పుష్పక విమానంలో భూమిని పరిభ్రమణం చేయడం ప్రారంభించాడు.

ततो मरुत्तं नृपतिं यजन्तं सह दैवतैः । उशीरबीजमासाद्य ददर्श स तु रावणः ॥

.

ఉశీరబీజమనే దేశంలో ప్రవేశించి అక్కడమరుత్తుడనే రాజు దేవతలను ఆవాహనచేసి చేస్తున్న యజ్ఞాన్ని చూఛాడు. 

.

संवर्त्तो नाम ब्रह्मर्षिः साक्षाद्भ्राता बृहस्पतेः । याजयामास धर्म्मज्ञः सर्व्वैर्देवगणैर्वृतः ॥

.

అక్కడ ధర్మజ్ఞుడూ, బృహస్పతి సోదరుడైన సంవర్తుడనే బ్రహ్మర్షి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు.

.

दृष्ट्वा देवास्तु तद्रक्षो वरदानेन दुर्जयम् । तिर्य्यग्योनिं समाविष्टास्तस्य धर्षणभीरवः ॥

.

అక్కడ ఉన్న దేవతలు వరములచేత అజేయుడైయున్న రావణుని చూచి భయముతో పక్షుల రూపములు దాల్చి ఎగిరిపోయారు. 

.

इन्द्रो मयूरः संवृत्तो धर्म्मराजस्तु वायसः । कृकलासो धनाध्यक्षो हंसश्च वरुणोऽभवत् ॥”इत्यादि ॥

.

ఇంద్రుడు నెమలి, యముడు కాకి, కుబేరుడు బల్లి, వరుణుడు హంస అయారు . ఇలాగే అన్యదేవతలుకూడా..... 

.

हर्षात्तदाब्रवीदिन्द्रो मयूरं नीलबर्हिणम् । प्रीतोऽस्मि तव धर्म्मज्ञ ! भुजगाद्धि न ते भयम् ॥

इदं नेत्रसहस्रन्तु यत्त्वद्वर्हे भविष्यति । वर्षमाणे मयि मुदं प्राप्स्यसे प्रीतिलक्षणम् ॥

एवमिन्द्रो वरं प्रादान्मयूरस्य सुरेश्वरः । नीलाः किल पुरा बर्हा मयूराणां नराधिप ! ।

सुराधिपाद्वरं प्राप्य गताः सर्व्वे विचित्रताम् ॥”

.

రావణుడు యజ్ఞశాల వదలి వెళ్ళాక దేవతలు తిరిగివస్తారు. నెమళ్ళ సంఘంలో దాగిన ఇంద్రుడు ఆనందంతో నెమళ్ళపై వరాలు కురిపిస్తాడు. సర్పాల భయంలేకుండా వరం ఇస్తాడు. ఆకర్షణీయమైన నీలి వర్ణం ఇస్తాడు. తన సహస్రాక్షాలకు ప్రతీకగా పింఛంలో నెమలికన్నులు ఇస్తాడు. 

.

इत्यन्तं वाल्मीकीये रामायणे उत्तरकाण्डे १८

.

మైల తుత్తం అనే మాట నాకు చిన్నప్పుడు వింతగా ధ్వనించేది.

దాని అర్థం ఈవాళ తెలిసింది. ఇది మయూర తుత్థం అనే సంస్కృత పదానికి వికృతి. నెమలి కంఠం వర్ణం గల కాపర్ సల్ఫేట్ అనే రసాయనం,

తామ్ర పాత్రలకు ఆమ్లం తగిలినప్పుడు ఏర్పడేది.

నాచిన్నప్పుడు నీలి ఆకుపచ్చ కలనేత రంగు చీరలను నెమలికంఠం 

రంగు అనేవారు . 

మయూర కు తెలుగు తమిళ వికృతి మయిలు. 

మయూరం అనే తమిళనాడు గ్రామానికి ఆపేరు మార్చి మయిలాడుత్తురై 

(నెమలి ఆడే ఊరు) అనిపేరు పెట్టారు. ఇది శివక్షేత్రం. మయూరనాథేశ్వరుని సన్నిధి. తుత్తునాగం అనే జింక్ పేరుకూడా ఈ తుత్థం నుండే వచ్చింది.

మిత్రలాభము ! (నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి )

మిత్రలాభము ! 

(నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి )

.

"ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించు కొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగా వినిపింపుఁ" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగె.

.

గోదావరీతీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి "వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె"నని యత్నము సేయుచుండగా వాఁడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి? మన మీ నూకల కాశ పడరాదు. తొల్లి యొక తెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతి బొందెను. మీకా కథ చెప్పెద వినుండు!

.

పులి-కంకణము-బాటసారి

ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.

కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు." అని చెప్పఁగా విని,

యొక కపోతవృద్ధము నవ్వి యిట్లనియె -

"ఆ! యివి యేటి మాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది, వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర యిట్టి విచారమును పెట్టుకొనరాదు. కొఱమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రతుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుఁడు, నిస్సంతోషి, క్రోధనుఁడు, నిత్యశంకితుఁడు, పర భాగ్యోపజీవియు నను వా రాఱుగురు దుఃఖభాగులని నీతికోవిదులు చెప్పుదురు." అనఁగా విని కపోతములన్నియు నేల వ్రాలెను.

గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికిడి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోగొట్టుకొని క్లేశ పడియెదరు. ఆహా! లోభమెంత చెడుగుణము! అన్ని యిడుములకు లోభము కారణము.

.

(ఇంకావుంది.)


అయ్యలరాజు రామభద్రుడు!

అయ్యలరాజు రామభద్రుడు!

.

అయ్యలరాజు రామభద్రుడు ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజాలలో అయ్యలరాజు రామభద్రుడు కూడా ఒకరని అంటారు. ఈ విషయము పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు. ఈయన ఈనాటి కడప జిల్లాకు చెందినవాడు. సుమారు 1500-1565ల కాలానికి చెందినవాడు.ఈయన అయ్యలరాజు వంశానికి చెందిన అయ్యలరాజు తిప్పయ్య గారి మనుమడు అని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పయ్య గారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన "రామాభ్యుదయాన్ని" శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఈతను ఇంకా "సకలకథాసారానుగ్రహము" అనే సంస్కృత గ్రంధము కూడా వ్రాసాడు. కానీ ఆ గ్రంధము అలభ్యం.

రామాభ్యుదయము

రామాభ్యుదయము ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. దశరథుని పుత్రకామేష్ఠి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్ఫణక ముక్కు, చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఇందులోని ప్రత్యేకతలు. ఈ కావ్యం వ్యాకరణ, అలంకార శాస్త్రానికి, చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధ కావ్యంగా వ్రాయటమనేది గొప్ప ప్రయోగం. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం రామభద్రుడికే చెల్లింది. కాని పాత్ర పోషణ పట్ల కొంత అశ్రద్ధ అనేదీతని బలహీనత. కాని ఇందులో ఆయన రామరాజభూషణుడు అనబడే భట్టుమూర్తి కన్న నయము, అనేది పండితుల అభిప్రాయము. అశోకవనంలో ఆంజనేయస్వామి సీతమ్మ వారికి శ్రీరాముని ముద్రిక ఇచ్చినపుడు సీతమ్మ అన్న మాటలను రామభద్రుడు 14 పద్యాలుగా వ్రాశాడు. ఆ పద్యాలే రామాభ్యుదయానికి సొబగులద్దాయి అని పండితుల అభిప్రాయము.

రామాభ్యుదయము లోని అలంకార ప్రత్యేకతలకు క్రింద ఉదహరించిన పద్యము చక్కని ఉదాహరణ.ఈ పద్యము 7వ ఆశ్వాసము లోని 75 వ కంద పద్యము. ఇందులో విభీషణుడు రావణునికి నీతి చెప్తున్నప్పటిది.

:పరుషోక్తి బాధ చూడకు,

పరిణామ సుఖముచూడు, బ్రతికెద వసురే

శ్వర! మందు చేదుచూడకు, పెరిగిన

తెవులడగ జూడు పెద్దతనానన్!

Monday, June 27, 2016

మళ్ళీ నేర్చుకుందాం 3. జంటపదములు --

మళ్ళీ నేర్చుకుందాం 3.

జంటపదములు -- 

(కృతజ్ఞతలు..శ్రీ Vvs Sarma గారు.)

ఏతావాతా...దానాదీనా..

తాడోపేడో...వాడి..వేడి,రాతకోతలు..

గిల్లికజ్జాలు, గంపగుత్తగా,ఒళ్ళూపై....,తిమ్మిని బమ్మిని.,.

తాడూ బొంగరం, వావివరస, కన్నీరుమున్నీరు, ..

ఆదరాబాదరా, కరాకండీ [కరాఖండీ], కన్నూమిన్నూ, 

ఉబ్బితబ్బిబ్బు, తత్తరబిత్తర, 

యిలాంటి జోడీలు జాడీలకొద్దీ ఉన్నాయి మనకి..

అయితే అవి యిలా ఎందుకు జతలు కట్టాయో చెప్పగలిగితే సంతోషం..కొన్నింటి అర్థాలూ తెలియవుగా మరి!

రెండు అదే పదాలు వస్తే ఆమ్రేడితం అంటారు, 

రెండు సంబంధం ఉన్న లేక లేని పదాలూ జంటగా వాడతారు,

రెండూ అర్థం కలిగినవి వాడతారు, ఒకొక సారి ధ్వనికోసం వాడతారు, 

నొక్కి చెప్పడానికి వాడతారు

.

1. ఏతావాతా = ఏతావత్ అనేది సంస్కృతం శబ్దం = So much, so far ఏతావదుక్త్వా అని రామాయణంలోనూ భారతంలోనూ చాల సార్లు వస్తుంది. = ఇంతవరకు చెప్పి - అని అర్థం ఇది గోదావరిజిల్లా వాడుకలో ఏతావాతా అయింది. ఇంతకూ - అని అర్థం,

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే = ఇంతకూ చెప్పవచ్చేదేమంటే

.

2. దానాదీనా = దాన్నీ దీన్ని = అదీ ఇది = మొత్తము మీఁద = on the whole , దానా దీనా పదిలక్షలు ఖర్చు అయింది.

3. తాడోపేడో తేల్చు = అటో యిటో పరిష్కరించు, either this or that "ఈ వ్యవహారం ఈ రోజు తాడోపేడో తేల్చుకొని కాని ఇక్కడినుండి కదలను

4. రాతకోతలు, వ్రాఁతకోతలు – Writing the sale deed (రాత) after the final hard bargain and the final cut (కోత) in the price.

5. తిమ్మినిబమ్మినిచేయు = క్రిందిది మీదికి- మీదిది క్రిందికి చేయు వ్యవహారములో దక్షత చూపు. ఇక్కడ తిమ్మి అంటే తిమ్మడు (కోతి) బమ్మి అంటే బ్రహ్మ లేదా బమ్మి (బ్రాహ్మడు). మొత్తానికి తిమ్మిని బమ్మిచేసి మా వాడికి ఉద్యోగం ఇప్పించాను.

6. వావీ వరుసా = వావి అంటే బంధుత్వము relation, వరుస అంటే " ఆ అమ్మాయి నాకు వరుసకు మరదలు ఔతుంది" distant but equivalent relationship. సుందరకాండలో మైనాకుడు హనుమను నీకు పినతండ్రిని అంటాడు.అది వరుస కలపడం.

7. అమీతుమీ = నేనా నువ్వా, బెంగాలీ పదాలు, ఈ రోజు అమీతుమీ తేల్చుకుందాం.

8. తత్తర బిత్తర = కంగారు; తత్తర పడడం = అంటే తోట్రు పడడం, కంగారు పడడం, బిత్తర పోవడం = అంటే ఆశ్చర్య పడడం, తెల్లబోవడం, మానసిక స్థితిని వర్ణించడానికి రెండూ కలిపి వాడతాం.

9. కన్నీరు, మున్నీరు = సముద్రం, కన్నీరు మున్నీరుగా విలపించడం అంటే దుఃఖ సముద్రంలో పడుటకు చిహ్నం.

10. ఆదరాబాదరా = తగినంత ఆలోచన, వ్యవధి లేకుండా; హడావుడిగా hurry burry, ఆవార్తవిని ఆదరాబాదరాగా బయలుదేరి వచ్చాము. ఆవార్తవిని ఆదరాబాదరాగా బయలుదేరి వచ్చాము. ఆదరా బాదరాగా = కంగారుగా, ఉన్న పళంగా,అద్ధంతరంగా, బాదర బందీలు ఉండగానే

వానవల్లప్పలు!.

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .!

(వానవల్లప్పలువానవల్లప్పలు.)

.

వానా వానా వల్లప్ప!

వాకిలి తిరుగూ చెల్లప్ప!

కొండమీది గుండురాయి

కొక్కిరాయి కాలువిరిగె

దానికేమి మందు?

వేపాకు పసుపూ,

వెల్లుల్లిపాయ,

నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)

నూటొక్కసారి,

పూయవోయి నూరి,

పూటకొక్కతూరి.

..

వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు.

బయటకుపోక చెల్లెలును

వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప. 

వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి)

గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది - 

కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే, 

కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.

వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి,

నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము)

ఆ తైలమునుపూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే,

కూడు కొంటుందంటాడు వల్లప్ప.

మల్లినేర్చుకుందాం..(2) !. (సుభాషితాల వంటి కొన్ని చాటువులు )

మల్లినేర్చుకుందాం..(2) !.

(సుభాషితాల వంటి కొన్ని చాటువులు )

-

లోక వ్యవహారంలో తరచూ వాడబడుతూ,వినబడుతూ ఉండే ప్రసిద్దిచెందిన కొన్ని

( తెలుగు సామెతల వంటి) ప్రత్యేక సంస్కృత శ్లోక పాదాలని,

వాటికి మూలమైన సంపూర్ణ శ్లోకాలను, చదివి ఆనందించండి. ఇవి అందరు తప్పక తెలుసుకోతగ్గవి.

.

సంస్కృత శ్లోక పాదాలు.-వాటి అర్థాలు.

౧. “ నానృషి: కురుతే కావ్యం” = ఋషి కానివాడు కావ్యం వ్రాయలేడు.

౨. “ ఋణాను బంధ రూపేణ” = ఋణం వల్లే బంధాలు యేర్పడతాయి.

౩. “ ధన మూల మిదం జగత్”= ఈ జగత్తు అంతా ధనంమీదే ఆధారపడి ఉంది.

౪. “ భార్యా రూపవతీ శత్రు:” = అందమైన భార్య శత్రువు ( క్షమించాలి)

౫. “ ఆలస్యాదమృతం విషం”= ఆలస్యం వల్ల అమృతం కూడా విషంఅవుతుంది

౬. “ యధారజా తథాప్రజా” = రాజు ఎలాగో ప్రజలు అలాగే.

౭. “ అతి సర్వత్ర వర్జయేత్” = ఏది అతిగా చేయకూడదు.

౮. “ ఉద్యోగం పురుష లక్షణం” ( పూర్వ కాలం)= ఉద్యోగం పురుషులకే

౯. “ కర్మానుగో గచ్చతి జీవ ఏకః” మరణించినపుడు కర్మ ఒక్కటే జీవుని వెంటవస్తుంది.

౧౦. “ న భూతో న భవిష్యతి” = గతంలో, భావికాలం లో కూడా ఉండదు.

పై శ్లోక పాదాలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయో ఆ శ్లోకాలని ఇప్పుడు వరుస క్రమంలో తెలుసు కొందాం.

౧. “ నానృషి: కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్/

నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు: పృథివీ పతి:”//

( వివరణ)

ఋషి కానివాడు కావ్యం వ్రాయలేడు, గంధర్వాంశ లేనివాడు అందంగా ఉండడు, దేవతాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు. పై విశేషాలు తెలిపే సందర్భంలో “నానృషి: కురుతే కావ్యం” అని చెప్పబడింది. కనుకనే వాల్మీకి, వ్యాసాది వంటి ఋషులు వ్రాసిన మహా కావ్యాలు నేటికీ నిలిచి ఉన్నాయి.

౨. “ ఋణాను బంధ రూపేణ పశు పత్ని సుతాలయః/

ఋణ క్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదనా?”//

(భావం)

రుణానుబంధం ఉన్నంత వరకే పశువులు,( పూర్వం అందరి ఇళ్ళలోనూ పశు సంపద తప్పక ఉండేది.) భార్య, పిల్లలు, ఇళ్ళు ఉంటాయి. ఋణం తీరిపోతే ఇవి యేవి ఉండవు. మరి వాటికై బాధ పడటం ఎందుకు? అనే సందర్భంలో పై శ్లోకపాదం వాడబడింది. ఇట్టివే మరికొన్ని చక్కని ఉదాహరణలు చూడండి—

“పండిన ఆకులు చెట్టునుంచి రాలి పడినట్లు ఆయువు తీరిన వారు మరణిస్తారు. వారికై బాధ పడనేల, రాత్రి పూట చెట్టుని ఆశ్రయించుకొని ఉన్న కొన్ని పక్షులు తెల్లవారగానే వాటిదారిన అవి వెళ్ళిపోతాయి,అంతమాత్రాన అవి దు:ఖ పడవుకదా!? అలాగే ఒక నదిలో రెండు కర్ర పుల్లలు కలసి కొంత దూరం పయనించి విడి పోయి, చెరోప్రక్కకి, వెళ్లి పోతాయి అట్లే మనంకూడా కొన్ని రోజులు కలసి ఉండి, విడి పోతాము. దానికి బాధపడుట ఎందులకు?” అనే ఉదాహరణలు గంభీరమైన, వేదాంత పరమైనవి,అందరు తెలుసుకొని, ఆచరించ తగ్గవి.

౩. “ వేదమూల మిదం జ్ఞానం, భార్యామూల మిదం గృహం/

కృషి మూలమిదం ధాన్యం, ‘ధనమూలమిదం జగత్’”//

జ్ఞానానికి మూలం వేదం, ( విద్=జ్ఞానే అని అర్థం.) ఇల్లు బాగుండటానికి మూలం భార్య. అందుకే భార్యని ‘ గృహ లక్ష్మీ’ అన్నారు. ధాన్యం అధికదిగుబడి రావాలంటే వ్యవసాయం బాగా చేయాలి, ( కృషి అంటే వ్యవసాయం)అలాగే ఈ జగత్తులో అన్నింటికి మూలం ‘ధనమే’. కనుక ధనం తప్పక ఉండాలి అని పై శ్లోక పాదం తెలుపు తుంది. ఇట్టివే మరికొన్ని.

రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి కొన్ని రాజ ధర్మాలు చెపుతూ, ఇలా అంటాడు- “ధన మార్జయ కాకుత్స్థ ‘ధనమూలమిదం జగత్’/

అంతరం నాభిజానామి, నిర్ధనస్య మృతస్యచ”//

అనగా---

కకుస్థుడు అనేరాజు పేరుతో రాముని వంశం ప్రసిద్ధిపొందింది. కనుక రాముని ‘కాకుత్స్థ’ అని విశ్వామిత్రుడు సంబోధించేడు. “ఓ రామా! ధనాన్ని బాగా సంపాదించు. ఎందుకనగా ఈ జగత్తు ధనంపై ఆధార పడి ఉంది. ధనం లేని వాడు చనిపోయిన వాడితో సమానం, వారిమధ్య వ్యత్యాసం నాకు ఏమీ కనబడుట లేదు. మరియు కులం, గోత్రం, బలం, అందం ఇవియేవి లేకపోయినా ధనం ఉంటే చాలు అందరూ గౌరవిస్తారు. కష్టాలు, ఆపదలు కూడ ధనం ఉంటే దరిచేరవు, ప్రాణం లేని మద్దెల,లేక మృదంగం కూడా’ధనం,ధనం,ధనం,అని శబ్దం చేస్తుంది.(ధన్ ,ధన్ శబ్దాన్నికవి ఇలా అన్నాడు.) కనుకనే ‘ ధనమూల మిదం జగత్’ అన్నారు. అందుకే ధర్మ మార్గంలో అందరూ ధనాన్ని ఆర్జించాలి” అనే గొప్ప సత్యాన్ని పై శ్లోకం తెలుపుతుంది.

“ భార్యా రూపవతీ శత్రు:” ఈ వాక్యానికి ‘అందమైన భార్య శత్రువు, లేదా ఈపదాన్ని భార్య+ అరూపవతీ’ అని విడదీసి చదివితే ‘అందం లేని భార్య కూడా శత్రువే’ అని అర్థం చెప్పుకోవచ్చు. ( ఆడపడుచులు క్షమించాలి. ఇది పూర్వం చెప్పిన మాట. ఎందుకు అలా అన్నారో వివరణ చదవండి,తెలుస్తుంది.)

౪. “ పితాచ ఋణవాన్ శత్రు:, మాతాచ వ్యభిచారిణీ./

భార్యా రూపవతీ శత్రు: పుత్రః శత్రు: అపండితః”//

వివరణ-----

ఆస్తి లేకుండా అప్పులు మాత్రమే ఉన్న తండ్రి పిల్లలకి శత్రువు, వ్యభిచరించే (చెడ్డగా తిరిగే) తల్లి కూడా పిల్లలకి శత్రువే!, అందమైన (లేక కురూపి ఐన) భార్య భర్తకి శత్రువు, ఎందుకంటే తనకంటే అందమైన భార్య తనప్రక్కన ఉంటే, యితరులు తనభార్యని వ్యోమోహంతో చూసే వారంతా తనకి శత్రువులే కదా? అలాగే భార్య అరూపవతి ( అందం లేనిది) ఐతే, తను అందమైన స్త్రీల వైపు పొరపాటున చూస్తే, తనభార్యే తనని శత్రువుగా చూస్తుంది. అనే అర్థాలలో పై శ్లోక పాదం వాడేరు అనుకోవచ్చు. అట్లే పాండిత్యం (చదువు.) లేని, మూర్ఖుడైన పుత్రుడు తలిదండ్రులకి శత్రువు. అందుకే తెలుగులో ‘ పండిత పుత్రఃపరమ శుంట:’ అన్న నానుడి పుట్టింది.

Sunday, June 26, 2016

నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి!

నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి!

.

గంగాతీరమందు సకలసంపదలు గలిగి పాటలీపుత్రమను పట్టణము గలదు.

ఆ పట్టణమును సుదర్శనుఁడను రాజు పాలించుచుండెను.

అతఁడొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా 

నొక బ్రాహ్మణుఁడు

క. పరువంబు కలిమి దొరతన

మరయమి యనునట్టి వీనియందొకఁడొకఁడే

పొరయించు ననర్థము నాఁ

బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా?

క. పలు సందియములఁ దొలఁచును

వెలయించు నగోచరార్థ విజ్ఞానము లో

కుల కక్షి శాస్త్రమయ్యది

యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతి\న్‌

అని ప్రస్తావవశముగాఁ జదివెను.

ఆ పద్యములు రాజు విని చదువు లేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్న తన కొడుకులఁ దలఁచుకొని యిట్లని చింతించె:

.

"తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకుల చేత మంచివాఁడనిపించుకొన్నవాఁడు బిడ్డఁడు గాని తక్కిన వాఁడు బిడ్డఁడా?

మూర్ఖుఁడు కలకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాఁడు. అట్టివాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడు గాని తల్లికడుపు చెఱుపఁ బుట్టినవాఁడు 

పుత్రుఁడు గాఁడు. గుణవంతులలోఁ బ్రథమగణ్యుఁడుగాని కొడుకును గన్నతల్లికంటె వేఱు గొడ్రాలు గలదా? గుణవంతుఁడయిన పుత్రుఁడొకఁడు చాలును. మూర్ఖులు నూఱుగురవలన ఫలమేమి? ఒక రత్నముతో గులకరాలు గంపెడయినను సరిగావు. విద్యావంతులయి గుణవంతులయిన పుత్రులను జూచి సంతోషించుట యను సంపద మహాపుణ్యులకుఁ గాని యెల్లవారికి లభింప" దని కొంత చింతించి, యుంకించి, తల పంకించి "యూరక యీ చింత యేల? నా పుత్రులు చదువమనిరా? పరామరిక మాలి తగిన విద్యాభ్యాసము చేయింపనయితిని. బిడ్డలకు విద్యాభ్యాసము చేయింపమి తల్లిదండ్రుల దోషము. తల్లిదండ్రులచేత శిక్షితుండయి బాలుఁడు విద్వాంసుఁడగును గాని, పుట్టగానే విద్వాంసుఁడు గాఁడు. పురుషకారముచేతఁ గార్యములు సిద్ధించును. రిత్తకోరికలచేత సిద్ధింపవు. నిద్రించు సింహము నోరమృగములు తమంత వచ్చి చొరవు. కాఁబట్టి యిప్పుడు నాపుత్రులకు విద్యాభ్యాసముకయి వలయు ప్రయత్నము చేసెద" నని చింతించి యచటి విద్వాంసులతో నిట్లనియె:

"నా పుత్రులు విద్యాభ్యాసములేక క్రీడాసక్తులయి తిరుగుచున్నవారు. ఎవ్వరయిన వీరిని నీతిశాస్త్రము చదివించి మంచి మార్గమునకుఁ ద్రిప్పఁజాలినవారు కలరా?" అనిన విష్ణుశర్మయను బ్రాహ్మణుఁడిట్లనియె: 

"రాజోత్తమా! యిది ఎంతపాటి పని? మహావంశజాతులయిన దేవర పుత్రులను నీతి వేదులను జేయుట దుష్కరము గాదు. కొంగను మాటలాడించుట దుష్కరము కాని చిలుకను బలికించుట దుష్కరము గాదు. సద్వంశమందు గుణహీనుండు పుట్టడు. పద్మరాగముల గనిలో గాజు పుట్టునా? ఎట్టి రత్నమయినను సానపెట్టక ప్రకాశింపనట్లు బాలుఁడెట్టి వాఁడయిన గురుజనశిక్ష లేక ప్రకాశింపడు. కాబట్టి నే నాఱు మాసములలో దేవర పుత్రులను నీతికోవిదులను జేసి మీకు సమర్పించెదను" అనిన రాజు సంతోషించి యిట్లనియె. 

"పూవులతో గూడిన నారకు వాసన గలిగినట్లు సజ్జనులతోడ సావాసించు మూర్ఖునకు మంచి గుణము గలుగుట సాజము. అంతేకాదు. సాధుసాంగత్యము సర్వశ్రేయములకు మూలము." అని సాదరముగా వచియించి యాతనికిఁ బసదనమిచ్చి తన కొడుకులను రప్పించి చూపి

"విద్యాగంధములేక జనుషాంధుల వలె నున్నారు. వీరిని గన్ను దెఱపి రక్షించుట మీ భార"మని చెప్పి యొప్పగించెను. అనంతర మా బ్రాహ్మణుండు వారల నొక రమణీయ సౌధమునకుఁ దోడుకొనిపోయి కూర్చుండఁ బెట్టుకొని యిట్లనియె. "మీకు వినోదార్థమొక కథ చెప్పెద. అది మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి నని నాలుగంశములచేత నొప్పుచుండును. వినుండు."

Saturday, June 25, 2016

మళ్లీ నేర్చు కుందాము !...(1)

మళ్లీ నేర్చు కుందాము !...(1)

.

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. 

ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. 

వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. 

ఈ విభక్తులు ఎనిమిది. 

అవి:


ప్రత్యయాలు విభక్తి పేరు


1. డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.


2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.


3. చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.


4. కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.


5.వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.


6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.


7.అందున్, నన్--- సప్తమీ విభక్తి.


8.ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.


ప్రథమా విభక్తి !

డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి.


పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది.

ఉదా: రాముడు, కృష్ణుడు


అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది.

ఉదా: వృక్షము, దైవము


ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది.

ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు


బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది.

ఉదా: రాములు, సీతలు


ద్వితీయా విభక్తి !

నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి


కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'.

ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను. కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును. 'ను' కారము గూర్చి యోచించుట యుక్తము. ఇది ఏకవచనమున జ్యంతమగును.బహువచనమున లాంతమగును.ఇందలి ఇకారమును, అకారమును కేవలము సంబధమును బోధించును.తెలుగు వ్యాకరణములలో జడముల ద్వితీయకు బదులు ప్రధమయును, పంచమికి బదులు నువర్ఞాంత మగు ద్వితీయము వాడుచున్నారు.


పంచమి- రాముడు గృహమును వెడలెను.

తృతీయ- కొలను గూలనేసె.

సప్తమి- లంకను గలకలము.

చతుర్ధి- రామునకు నిచ్చె.

పై నాలుగు విభక్తులును, నుప్రత్యయమునను, కు ప్రత్యయమునను గతార్ధము లగు చున్నవి.కావున ప్రాచీన కాలమున ను, కు వర్ణకములే తెలుగున గలవని తెలియుచున్నవి.


తృతీయ విభక్తి  !

చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.


కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది. క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త.

ఉదా: దేవదత్తుని చేత వంటకము వండబడెను.


తృతీయా విభక్తిలోని నువర్ణాంత లోపంబున జేసి చేత, తోడవర్ణకంబులు నిలుచుచున్నవి.వీనిలో చేత శబ్దము చేయి శబ్దముయొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది.అటులనే తోడ శబ్దము తోడు శ్బ్దాముయొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది


చతుర్ధీ విభక్తి !

కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.


త్యాగోద్దేశ్యము గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం.

ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.


కొఱకు+న్ = కొఱకున్. ద్రుతలోపమున కొఱకు అని నిలిచినది.ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది.అటులనే కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.


పంచమీ విభక్తి !

వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.


అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.

ఉదా: మిత్రుని వలన ధనంబు గొనియె.


అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది. అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది.

ఉదా: రాముని కంటె నన్యుండు దానుష్కుండు లేడు.


నిర్ధారణ పంచమిలో కూడ కంటె ప్రత్యయం వస్తుంది.

ఉదా: మానహాని కంటె మరణము మేలు: ఇక్కడ 'మానహాని' నిర్ధారణము


'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి.

ఉదా: జ్ఞానము బట్టి ముక్తుడగు. ముక్తుడవడానికి కారణము జ్ఞానము


వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటె అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.


షష్ఠీ విభక్తి  !

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.


శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది.

ఉదా: నా యొక్క మిత్రుడు; వాని యొక్క తమ్ముడు.


నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది. జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు.

ఉదా: మనుష్యుల లోపల క్షత్రియుండు శూరుండు.


షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును.ఈ ధాతువునకు అరవమున స్వతంత్ర ప్రయోగము కలదు. అరవమున ఈధాతువనకు 'కూడిన,చేరిన,ఒప్పిన' అని అర్ధము కలదు. లోపల- ఇది ఒక్క శబ్దము.ఇది నిర్ధారణ షస్ఠియందు వచ్చుచున్నది.దీని అర్ధమును బట్టి ఇది సప్తమిరూపమనియే చెప్పుచున్నారు.కాని సంస్కృతమున నిర్ధారణమున షష్ఠి ప్రయోగింపబడును.కావున, సామ్యమున ఇది వైయ్యాకరణలుచే ప్రవేశపెట్టినట్లుగా తోచుచున్నది.


సప్తమీ విభక్తి !

అందున్, నన్--- సప్తమీ విభక్తి.


అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.

ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం.

ఉదా: ఘటమందు జలం ఉంది.


వైషయికం అంటే విషయ సంబంధం.

ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.


అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం.

ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.


ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్ధం.

ఉదా: ఘటంబున జలం ఉంది.


సంబోధనా ప్రథమా విభక్తి !

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.


ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది.

ఉదా: ఓ రాముడ - ఓ రాములార


ఓ శబ్దానికి పురుషుని సంబోధించేటప్పుడు 'యి' అనేది, నీచ పురుషుని సంబోధించినప్పుడు 'రి' అనేది, నీచస్త్రీని సంబోధించినప్పుడు 'సి' అనేది అంతాగమాలుగా విభాషగా వస్తాయి.

ఉదా: ఓయి రాముడా! ఓరి దుష్టుడా! ఓసి దుష్టురాలా!

భోగినీ దండకము బమ్మెర పోతన!

భోగినీ దండకము బమ్మెర పోతన!

**సింగభూపాల వర్ణనము**

శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు

**సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట**

భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్‌ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్‌ బ్రమోషింతు? నేలీల భూపాలకున్‌ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్‌ నివారింతు? నేనాతితోడన్‌ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్‌ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్‌ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్‌ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్‌ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్‌ మనోవీథి నంకించుచున్‌ ఘోషమాణాలికిన్‌ మందవాతూలికిన్‌ జంద్రమః కీలికిన్‌ గోకిలారావ దంభోళికిన్‌ జిత్తభూభల్లికిన్‌ దల్లికిన్‌ లోఁగి సంతాప ఘర్మాంబులన్‌ దోఁగి కామానలజ్వాలలన్‌ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్‌ బరీక్షించి బుద్ధిన్‌ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్‌ బరీక్షించి నీతిన్‌ విచారించి బాలన్‌ గళత్కుంతల వ్రాతఫాలన్‌ గరాంభోజ రాజత్కపోలన్‌ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్‌ విపర్యస్త సన్యస్తచేలన్‌ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్‌ మృగేంద్రావలగ్నన్‌ దయావృష్టిమగ్నన్‌ మనోజాగ్నిభగ్నన్‌ నిరంధన్‌ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్‌ సముద్విగ్న మోహాను బంధన్‌ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్‌ గలద్పాష్పధారన్‌ బరిత్యక్త లాస్యన్‌ బరాభూత లీలావయస్యన్‌ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్‌ బరిక్షీణరాగన్‌ విలోకించి బుద్ధిన్‌ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి

**వేశ్యమాత కూఁతునకు బుద్ధులు చెప్పుట**

బాలా! జడత్వంబు మేలా? విచారింపనేలా? విలోకింపు బేలా! వయోరూపసౌందర్యముల్‌ రిత్తగాఁజేయు నీవృత్తికిన్‌ మెత్తురే? వత్తురే కాముకుల్‌? చొత్తురే డాయఁ? గాయంబు విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్ఛాయ మెన్నే నుపాయంబులన్‌ విత్తమాయత్తముం జేయ కీ రిత్తవాదంబు లాడంగ లాభంబె? లాభానకుం గారణంబైన నా మాట నేరంబె? నేరంబుగా దీ విచారంబు వంశానుచారంబు సంసారసారంబు లాభాధికారంబు చర్చింప నీబోఁటికిన్‌ బిట్టలంకారమే కాని ధిక్కారముం జేయరాదీ విచారంబు లేలే? శుభాకార! యేలే! గుణోదార! యేలే? శుభోదార! యేలే? తటిద్దేహ! యేలే? వరారోహ! యేలే? లలాటాలకవ్యూహ! యేలే? మహోత్సాహ! యేలే? విరాజమ్మ ఖాంభోజ! యేలే? మహోరోజ! యేలే? కలాలాప! యేలే? జగన్మోహన ద్రూప! యేలే? చలచ్చంచలాలోకన వ్రాత! యేలే? నయోపేత! యేలే? మహామర్మ భేదంబులై కౌముదీ మూలకందంబులై చూడనందంబులై సుప్రసాదంబులై మోహనశ్రీవిలాసంబులై యున్న నీ చారు హాసంబులన్‌, సోలి యోలిన్‌ భుజంగాలి జాలిన్‌ బడన్‌ దార్చుటో కాకలోలంబులై మోహ జాలంబులై చంచలాభంబులై మోహితాశేష లోకంబులై యొప్పు లీలావలోకంబులన్‌ బ్రౌఢలోకంబులన్‌ సద్వివేకంబులన్‌ బాపి తాపాతిరేకంబులన్‌ గూర్చుటో కాక తోరంబులై మధ్య భారంబులై నిర్జితానంగ సౌధోపరి స్వర్ణ కుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులన్‌ జూపి పౌరావళిన్‌ నర్మలీలాకురంగావళిం జేసి నిర్జించి వర్జించుటో కాక రాజత్రిలోకీవశీకార మంత్రంబులై యుల్ల సత్కామ తంత్రంబులై దర్పకోద్రేక యంత్రంబులై మోహవారాశి భంగంబులై సూచితానేక నర్మ ప్రసంగంబులై కామకేళీ కలాపంబులై యొప్పు నీ భాసమా నానులాపంబులన్‌ విత్తవల్లోక చిత్తంబులన్‌ రాగమత్తంబులం జేసి తత్తన్నిమిత్తంబులన్‌ నిత్యమున్‌ విత్త మెల్లం బ్రమోషించి దూషించి నిర్జించి తర్జించుటో కాక నీకీ కులాచారముల్‌ మాన నేకీర సల్లాప బోధించెనో? నేఁడు నీతోడు నాతోడు మాటాడుమా చూడుమా! కన్యకాలోకచింతామణీ! బంధుచింతామణీ! గోత్రరక్షామణీ! ధీమణీ! యెవ్వరెవారి భూషించిరే? యేమి భాషించెరే? నేఁడు నీతోడఁ గ్రీడించు ప్రోడల్‌ కుమారీ! కుమారాన్న పోతావనీనాథ సూనున్‌ వధూచిత్తవిత్తాపహారావధానున్‌ సదాదానవిద్యానిరూఢున్‌ మనోజాతహృద్యానవద్యైక విద్యావలీఢున్‌ ప్రభాభానురాగానుసంధాను మాయారమానాథు సర్వజ్ఞసింగక్షమానాథు నే సన్నిధానంబునన్‌ జెప్పిరో? ఏమి వాతప్పిరో? యప్పరో! యప్పయోజాతగంధల్‌ సదాసత్యసంధల్‌ పురిన్‌ నీ వయస్యల్‌ మహాసౌమనస్యల్‌ సువర్ణా! సువర్ణంబు లార్జించుటల్‌ చూడవా? చూడ వాంఛింతురా రాజులన్‌? వారలా రాజులం గానరా? రాజుఁ గామింతురా? రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్‌ రాజులన్‌ మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే చెల్లునే? భూమి నేజాతి యీరీతి నీతిం బ్రకాశింప కీభంగి రాజిల్లునే? చెల్లఁబో! నీ పటుత్వంబు వాచాకటుత్వంబు బాలేందుశోభాలికా! బాలికా! బాలికల్‌ సేయు యత్నంబులే నీ ప్రయత్నంబు? లంభోజనాళాంతరాళ స్ఫురత్తంతుయోగంబునన్‌ జిక్కునే గంధనాగంబు? మిథ్యా మమత్వంబులన్‌ రంజకత్వంబులన్‌ గూఢయంత్రంబులన్‌ మోహమంత్రంబులన్‌ మారుతంత్రంబులం జిక్కఁడే చొక్కఁడే దిక్కులన్‌ జిక్కులం బెట్టు మేధన్‌ మహావేధనైనన్‌ విరోధించి వాకట్టు నీతిన్‌ బలారాతి మంత్రిన్‌ బ్రమోషించు భాషావిశేషంబులన్‌ శేషుతోనైన భాషించు మాయావిధానంబులన్‌ మాధవున్‌ మెచ్చఁడచ్చోట నెచ్చోట మెప్పించెదే! చీటికిన్‌ మాటికిన్‌ బోటి! యామేటి యిచ్చోటికిన్‌ రాఁడు పాటించి నీపాటి పాఠీననేత్రల్‌ ధరిత్రీశు చిత్తంబు మత్తంబుగాఁ జేయఁగాఁ జాలరే యేల రేలుంబగళ్ళున్‌ విచారింపఁ? జాలింపవే! వారవేశ్యాభుజంగుండు గాఁడే మహారాజవేశ్యా భుజంగుండు నిన్నేల యేలున్‌? బరస్త్రీలకున్‌ వేళ యీఁ డెన్నఁడున్‌ దత్తుఁ బాంచాలు భద్రున్‌ మరున్‌ గూచి మారున్‌ వినంగోర కేరీతి నేనాతిచే వింటి వేమంట నీవంటి దీవెంటలన్‌ దంటయై గెంటిపోఁ జూచునే? తమ్మికంటీ! నినుంగంటి నీవెంటకాహా! కనుంగంటి నీగొంటు చైదంబు దైవంబు క్రేఁగంటి కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్‌ వెంటవెంటం బడన్‌ బంటనే? తాళనంటిన్‌ జిరంటీ! చెనంటీ! గుణం బేటికే? మాయలాఁడీ! విభుండైనఁ బోఁడే! నిమగ్నుండు గాఁడే! మముం జేరనీఁడే! నినుంజేరరాఁడే! ప్రవేశింప రాదే! ప్రమోషింప వాదే! ప్రవర్తింపఁ గాదే! ప్రవర్తింతువెచ్చోట నచ్చోటి కేమేఁ బ్రియంబాడ రామే! నినుం బాయలేమే! మహోపాయవై కన్యకా! ధన్యు నన్యున్‌ మదిం గోరుమా! చేరుమా చేరు మా కిష్టముల్‌ వీట లేరే మగల్‌? చేర రారే నినుం గోరి తారే విహారేహులై గేహళీ వాటికిన్‌ మాటికిన్‌? వచ్చు నేవారి నీవారిగాఁ జూడవున్‌ గూడవున్‌ వారిజామోద! యీ వారరామల్‌ మనోరాములన్‌ రిత్తపోరాములన్‌ గాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కిరే? సొక్కిరే? వారు వారాది కృత్యంబులం జేయు వార క్రియల్‌ చెల్లవే తల్లి!

**రాజదూషణము**

రాజుల్‌ బహువ్యాజులే భోజులే? చంచలచ్చిత్తులే! మత్తులే! వ్రేతఁ కాయత్తులే! నూతనాసక్తులే! లోభ సంయుక్తులే! దోషసంసిక్తులే! రంధ్రసంపాదులే! వీత మర్యాదులే! వారి సేవింప భేదింప జీవింపఁ బోరామిఁ గావింపఁగా రాదులే! కాదులే వాదులేలా? నవైలాలతా దేహ! సందేహమే దేహమేలే యలంపన్‌? నిలింపాంగ నాభా! సునాభా! మదిన్‌ మానవే మానవేశాభిలాషంబు లేమా! భరింపంగ లేమా? కరంగింప లే మానరేశున్‌ జితశ్రీసురేశున్‌ గతస్త్రీజితోద్దండ వేదండ చండాహితా ఖర్వగర్వాంధ వేదండ గండస్థలీఖండితారాతిదండంబు గండంబుగా నుండు నమ్మండలేశున్‌ విరాజన్ముఖాంభోజు నాభోగినీ రాజుతో నోజతో నీకుఁ బొత్తుండఁగాఁ బోలునే? నీకు మాదండ నేదండమున్‌ జెందదే చెల్లునే? రాజదండంబు గండంబు గండంపుటండంబుగా నిక్షుకోదండ విభ్రాజిత భ్రూయుగా! భూమిపాలావరోధంబు లేలా? విరోధంబు నీకున్‌ మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ! కన్న వారంబు గామా? హితాదేశముల్‌ సేయఁగా మాకు ధర్మంబు కామాశుగా లోకనా! యేల కామాతురత్వంబునుం జెంద? రామా! త్రిలోకాభిరామా! వరాలేపహేమాదులున్‌ నీకు నీమా? కులోత్తంస! యే మాకులత్వంబునుం బొంద మామాట లేపాటివే? మాటు లాలించు వారిన్‌ నిరీక్షింప కీ మానవాధీశుపై మానసం బేల పట్టించెదే? ముద్దుపట్టీ! భవచ్చాతురిం బట్టి సర్వజ్ఞసింగ క్షమానాథుఁ దప్పించి దర్శించి లోకత్రయిన్‌ నీకు నర్పింతునే మారునిన్‌ జారునిన్‌ జేసి రప్పింతునే బ్రాఁతియే పైఁడి? నా పైఁడి! యే పైఁడి లేదింటిలో? వింటివా? రాచపోరామి యిట్టట్టుఁ బోరామికిన్‌ మూలమే! మేలమే? యింత రవ్వేలనే? యిందు నవ్యార విందాననా! ముందు విందానవే! లాట కర్ణాట పాంచాల నేపాళ బంగాళ చోళాది రాజన్యకన్యల్‌ వయోరూప ధన్యల్‌ సదాసక్తలై డాసి యున్నారఁటే! రారఁటే పాసి తత్పాద రాజీవ సందర్శనారంభ సంరంభులై వీతహృద్దంభులై కుంభినీశుల్‌ బహూపాయన ద్రవ్యహస్తుల్‌ సురూప ప్రశస్తుల్‌ మహాసక్తి నక్తందినంబుల్‌ ప్రవేశించి యున్నారు కన్నారు విన్నారు లోకుల్‌ వరాలోక! నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ బోలదే పోలినన్‌ వాని వాణిన్‌ మహావాణి కాఁపున్నదే! మన్నదే రత్న గర్భంబుతో భూమి తద్భాహుపీఠిన్‌ దిశా కుంభికుంభీనసాగేంద్ర కూర్మాదులన్‌ బాసి కూర్మిన్‌ విలోకంబులన్‌ లచ్చి వర్తించునే దిక్కులందెల్ల కీర్తుల్‌ ప్రవర్తించునే దుర్లభుండే బహుప్రేయసి వల్లభుండే! సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్‌ ఖ్యాతికిన్‌ నీతికిన్‌ దప్పితే? చెప్పితిం గూన! సిద్ధంబు తద్ధాత మున్‌ వారభామా తనూజాతకున్‌ గూఁతుగా మాతనూజాతఁ గావించె నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదినిన్‌ వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై కామశాస్త్రాదివిద్యాసమేత\న్‌ భవన్మాత నుద్దామ మాయా ప్రభూతన్‌ గురంగీవిలోకా! నిరంగీకృతా కారతల్‌ మాని నామాట నీమాటు పాటింపవే నందినీ! నిందనీయంబు గాదే మహానందనీయంబు చిత్తంబుతో నుండు నీవే జనానందనీయా! కఠోరాచలోద్దండకాఠిన్యమున్‌ డింప రత్నాకరశేణి లోఁతున్‌ నివేదింప విత్తేశు గేహంబులున్‌ రిత్తసేయన్‌ జగచ్చక్షువున్‌ గన్ను మూయన్‌ సదాగామి నాఁకట్ట నుద్యద్భుజంగావళిం బట్ట వారాంగనాజాతికిన్‌ న్యాయమే? మామకన్యాయ సంపన్నవై పన్ని యోకన్య నీవన్యులన్‌ బౌరసంపన్నులన్‌ భిన్నులన్‌ ఖిన్నులన్‌ జేసి మన్మందిరాళిందభూమండలాసన్నులం జేయుమీ! రాచబిడ్డేటికే? బిడ్డ! వాచాటతల్‌ సాఁగవే సాఁగినన్‌ నీకు జూదంబులా? కాక వీణావినోదంబులా? గద్యపద్యాదివాదంబులా? మాళవీముఖ్య రాగానుగానంబులా? దండలాస్యాది నృత్యావధానంబులా? యింద్రజాలాది మాయావిధానంబులా? వశ్యమంత్ర ప్రయోగోపసంహారవిద్యావిచార ప్రభావంబులా? రామ! యారామవాటీలతాజాలమూలాభిషేక ప్రచారంబులా? హేమడోలావరోహంబులా? కాక కేళీసరోవ్యూహవీచీ సమూహావగాహంబులా? బంధుగేహ ప్రవేశంబులా? రాజ హంసావళీమందయానోపదేశంబులా? నీలకంఠావళీనృత్య శిక్షావిశేషంబులా? కాముకవ్రాతచిత్త ప్రమోదంబులా? బొమ్మరిండ్లాటలా? యాటలా? పాటలా? పాటలామోద! రాజోపకంఠాటనంబుల్‌ కఠోరాసిధారా వలేహంబులే! సింహ యోగంబులే! సర్పవల్మీకభోగంబులే! శైలశృంగాగ్రవీథీ విహారావధానంబులే! తుంగ తాళాగ్రకోటీ తపస్సంవిధానంబులే! మత్తశార్దూలకుంజప్రవేశంబులే! గంధశుండాలశుండా వినోదంబులే! సప్రమాదంబులే! కొమ్మ! మా కొమ్మ కేరాజు సఖ్యం బసౌఖ్యంబు మేమొల్లమే మొల్లముల్‌ మాకు లాభంబులే? డించ కేవేళ నెమ్మోము సొంపారు? నేవేళఁ బాలిండ్లు పెంపారు? నేవేళ ఫాలంబునన్‌ గుంతలశ్రేణు లల్లాడు? నేవేళ మైదీఁగెయున్‌ వీడు? నేవేళ నాయాసముల్‌ తీఱు? నంచుం బ్రతీక్షింప నీవింతవై వంత లెన్నేనిఁ గల్పించెదే? యింత నీవంతయై నేఁడు నాసింగభూపాలు పాలై ప్రవర్తించుచోఁ గంబుకంఠీ! భవద్దర్శనో త్కంఠతన్‌ రాజ గేహోపకంఠంబులన్‌ వచ్చునీవారి వారింతురే వారిదౌవారికుల్‌ వారధర్మంబువా రంచు దుర్వారులై తన్మహాగేహ నిర్యూహసేవారతాయాత భూపాలక వ్రాతవేదండగండస్థలీ నిస్సరద్దానధారావళీ జాతజంబాలసంఘంబు దుర్లంఘనీయంబు మాకున్‌ మహాదుర్గమంబే చొరన్‌ నిర్గమింపన్‌ మహోత్సాహవై వత్స! మత్సాహచర్యంబుఁ గైకొమ్ము! రమ్మంచు లెమ్మంచు

**భోగిని విరహముచేఁ దల్లిపైఁ గోపించుట**

బోధించు తల్లిన్‌ ధనాదానవిద్యామతల్లిన్‌ విటస్వాంత భల్లిన్‌ నిరూపించి కోపించి బుద్ధిన్‌ బ్రదీపించి యమ్మా! వినంజూడ నేనొల్లఁ బొమ్మా! విచారించుకొమ్మా! భవన్నీతి దుర్నీతి సన్మానుషం బింతయున్‌ లేని దుర్మానవశ్రేణి నీవేల? యీవేళభూషించెదే! యేలభాషించెదే? యేల నన్నుం బ్రమోషించెదే? రాయచౌహత్త మల్లున్‌ వధూటీసరోజాతభల్లున్‌ మహారాజవేశ్యాభుజంగన్‌ హయానేకప గ్రామహేమాది నానామహాదానచంగున్‌ వధూలోకపాంచాలు సర్వజ్ఞసింగభూపాలుఁ గైకొంట తప్పే? కకుప్పాలసంకాశుఁడే! వానియొప్పుల్‌ సతుల్‌ చెప్పరే? యేల నొప్పింప? మాతల్‌ తనూజాతలన్‌ జాతవిత్తాశలన్‌ బేశలత్వంబు లే కర్మిలిం బాసి నారోటు? రారోటు రక్షారతిన్‌? గోర్కు లేరోటు! నీవింత నెగ్గింప నెగ్గేమి గావించితిన్‌? లోకనిర్మాత నిర్మాతగాఁ జేయ కేలా సదుర్మాతఁ గావించె? విజ్ఞాతయోషామనోవృత్తసంఘాతవున్‌ మాతవున్‌ గామసిద్ధాంతవిఖ్యాతవున్‌ జూడ నేతద్దురాలాపముల్‌ చిత్తసంతాపముల్‌గాఁబ్రయోగింతురే? కూఁతుఁ జింతానదిన్‌ ముంతురే? పిన్న నాఁడెల్ల నాఁడెవ్వరింగోరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్‌ సుకందర్ప సిద్ధాంతవేదుల్‌ వశీకార విద్యా ధురీణల్‌ ప్రవీణల్‌ వరశ్రేణి నూహింపరే? చూచి మోహింపరే? వారలూహింపరే నీతులన్‌? నిర్దయా లాపవై పాపవై పాపవేలా మనోజన్యథన్‌? నిన్ను నేమందు నేమందులన్‌ మానదే మానసత్త్వంబు చింతింపు మవ్వా! విభుండేమిదవ్వా? యెఱింగించి రప్పించెదో? కాక కామానలజ్వాలకున్‌ నన్ను నొప్పించెదో? యింతఱంతేల నీకున్‌? గొఱంతేల సద్ద్రవ్యముల్‌ తల్లి! నేనెల్ల వేళన్‌ మనోజాగ్నిఁ గంది లోఁగుందఁగా మ్రంద నీమందటల్‌ చాలు ముందేటికిన్‌ గంటివే? కెంటసం బేల? ఘంటాభవై మ్రోసెదే? యన్యకున్‌ గన్య గానైతి నుద్దామశృంగారుపై దీనమందారుపై భూమిభృద్గాయగోవాళుపై రాయశుండాలహర్యక్షుపై రాయ కందర్పఫాలాక్షుపై రాయగోపాంగనా బృందగోవిందుపై సంతతానందుపైఁ బోచమాంబా లసద్గర్భసంజాతుపై లోకవిఖ్యాతుపైఁ బాదపీఠాంకితారాతి భూపావళీపాలుపై సింగభూపాలుపై వ్రాలి నా చిత్తమున్‌ మత్తమై సోలి కామానలాయత్తమై రాదు తేరాదు నే నా మరుండైన గౌరీవరుండైన వాణీధరుండైన దేవోత్తరుండైన నన్యున్‌ మదిన్‌ గోరఁగా నొల్లనే యుల్లసత్ఫుల్ల మందార రాజన్మరందంబు నందంబునన్‌ గ్రోలు మత్తాళి దుత్తూర మున్‌ గోరునే? హేమరాజీవ రాజీరజోరాజితాకాశగంగానదీ లోలకల్లోలడోలానటద్రాజహంసంబు శైవాలగండూపదీభేక భేకీఢులీసంకులాసారకాసారమున్‌ జేరునే? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయోధారలన్‌ ద్రావు సారంగి కుంభాంతరాంభః ప్రపూరంబులన్‌ ద్రావునే? మాధవోజ్జాతచూతాంకుర స్వాదులీలాలసత్కోకిలేంద్రంబు ఝిల్లీవర క్రూరభల్లాతకీ శాఖకున్‌ బోవునే? సింగభూపాల బాహాపరీరంభసంరంభసంభోగమున్‌ గోరు యోషా శిరోరత్న మాశించునే, నీచసంభోగ మంబా? కుతర్కావలంబా! చలంబా! విలంబానులాపంబులన్‌ బాల సూర్యాభునిన్‌ బాయ నాడన్‌ బురోభాగినీ! భోగినీ రాజు కంటెన్‌ మహాభాగు నాభాగసౌభాగ్యశోభాగరిష్ఠున్‌ బ్రవేశించి నృత్యావధానంబులన్‌ మంజుగానంబులన్‌ జిత్తమార్జింతునే విత్తమున్నే నివర్జింతునే యెట్టిదిన్‌ విత్తమేరిత్తమై యేటికే? నిత్యదంభా! దురాలాపయుక్తిన్‌ బ్రలోభింప విద్వేషినే? యేలనే? గోలనే? బాలనే? నేరనే! మానలేనే వరాధీశచూడామణిన్‌ వారకన్యాజన గ్రామణీ! పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొమ్మంచు లెమ్మంచు నోచెల్ల! రేచెర్లగోత్రోద్భవున్‌ మానలేనంచు మాయోన్నతా! యన్యులన్‌ జేరలేనంచు హృద్భల్లితో వక్రవాగ్భల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబుఁ గీలించి శాతోదరిన్‌ సోదరిన్‌ జూచి యక్కా! ప్రసూనాస్త్రు ధిక్కారమున్‌ జూచితే? నేఁడు రాకేందురాకన్‌ దురాకంపమున్‌ బొందె డెందంబు చైతన్యసంచాలియై కీలియై గాలి యేతెంచెఁ గోదండియై దండియై తూణియై బాణియై కంపిత ప్రాణియై కాముకారాతి యేతెంచె వాసంత వేళారమాకందమాకందశాఖావళిన్‌ గోకిలారావ కోలాహలంబుల్‌ విటస్వాంత హాలాహలంబుల్‌ దిశల్‌ మించి యేతెంచెనే! సింగభూమీశుతో భోగదేవేశుతోడన్‌ నివేదింపవే! కాము సంతాపమున్‌ డింపవే! డింపి పుణ్యంబునం బోఁగదే! రాఁగదే! వేగఁదే! యంచుఁ జింతించు నాత్మానుజాతన్‌ గృశీభూతఁ గన్గొంచు

**వేశ్యమాత భోగినిని భూపాలునితోఁ గలుపుట**

బాలా! లలాటాక్షు దర్శించుమీ! శేషభోగిన్‌ బ్రకర్షింపుమీ! రాహు భావింపుమీ! చంపకశ్రేణి వర్షింపుమీ! యంచు భీతిన్‌ నివారించి నీతిన్‌ విచారించి యారామసౌధాంతరాళస్థలిన్‌ నర్తనాగారవేదిన్‌ మహారాజభోజున్‌ మణిస్వర్ణపర్యంకికా భాసమానున్‌ మనోభూసమానున్‌ ఘనున్‌ రావుసింగక్షమానాథ పౌత్రున్‌ సమీచీన రేచెర్ల గోత్రాంబుజాత్మమిత్రున్‌ మహోదారచారిత్రు సర్వసింగోర్వరాధ్యక్షు నీక్షించి దండ ప్రణామంబు సాపేక్షఁ గావించి హస్తాబ్జముల్‌ మోడ్చి దేవా! భవన్న్యస్త సౌజన్యధన్యన్‌ జగన్మాన్యన్‌ఁ గన్యన్‌ నిరన్యాంక పీఠాధిరోహన్‌ నిరన్యోపగూహన్‌ నిరన్యాభిలాషన్‌ నిరన్యాభిభాషన్‌ నిరన్యావకాశన్‌ నిరన్యప్రకాశం బ్రసూలోచన క్షిప్త బాష్పాంబుపూరన్‌ మనోజాత బాణావళీశంకిత ప్రాణభారన్‌ సఖీమానస న్యస్తచింతాసమూహన్‌ భగిన్యంక సంప్రాపితానేక దేహన్‌ భవద్వైభవాకృష్టచిత్తన్‌ బరాయత్తవృత్తన్‌ గృపం జూడు మంచున్‌ బ్రశంసింప

**సింగభూపాలుఁడు భోగిని నాదరించుట**

నా భోగదేవేంద్రుఁ డా సత్యభాషాహరిశ్చంద్రుఁ డా కామినీలోకపాంచాలుఁ డా సింహభూపాలుఁ డాబాల నా బాలశీతాంశుఫాలన్‌ సరోజాతహస్తన్‌ గుణైకప్రశస్తన్‌ శుకాలాపవాణిన్‌ లసన్నీలవేణిన్‌ మృగేంద్రాపలగ్నన్‌ మనోజాగ్నిమగ్నన్‌ దయాదృష్టి రావించి భావించి నెయ్యంబుఁ గావించి బాహాపరీరంభ సంరంభ నిర్ముక్తసంతాపఁ గావించి కందర్ప కేళిన్‌ వినోదించి సద్భోగినీపట్టమున్‌ దిట్టమౌ నట్టుగా వే ప్రసాదించి తన్మాత రావించి యుద్యద్గజారూఢఁ గావించి విఖ్యాతి మ్రోయించి యిష్టంబు గావించి యొప్పించె నీ భోగినీ దండకం బిద్ధరామండలంబందుఁ జెల్వొంది యాచంద్రతారార్కమై యొప్పుచుండున్‌.

**దండకాంత పద్యము**

ఉ. పండితకీర్తనీయుఁడగు బమ్మెర పోతన యాసుధాంశు మా

ర్తాండ కులాచలాంబునిధి తారకమై విలసిల్ల భోగినీ

దండకమున్‌ రచించె బహుదాన విహర్తకు రావుసింగ భూ

మండల భర్తకున్‌ విమత మానవనాథ మదాపహర్తకున్‌.

Friday, June 24, 2016

పోతన బోగినీ దండకం రాసిన మండపం.!

పోతన బోగినీ దండకం రాసిన మండపం.!


బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న బాగవతంను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు.

.పోతన కొంతకాలం రాచకొండని పాలించిన పద్మనాయక రాజైన సర్వజ్ఙ సింగమ నాయకుడి ఆస్ధానంలో ఉండి “భోగినిదండకం” రాశాడు. 

ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపం పేరు భోగినిమండపం…ఈ మండపంలో ప్రదర్శించబడిన భోగిని నృత్యాన్ని ఆదర్శంగా తీసుకుని సహజకవి అయిన 

పోతన భోగినిదండకం ” కావ్యాన్ని రాసాడని ప్రతీతి. 

నల్గోండ జిల్లాలోని రాచకొండ కోటలో ఉందీ మండపం..

.

బాలరసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్,

కూళల కిచ్చియప్పుడు కూడు భుజించుటకన్న సత్కవుల్ హాలికులైననేమి.

గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజధారసుతొద్దర పోషణార్దమై…..

తమ కావ్యాలను రాజులకు అంకితమిచ్చి వారిచ్చే కానుకలతో నీచపు కూడు తినడం కంటే మంచి కవులు నాగలి చేత పట్టి అడవుల్లో కందమూలాలు తింటూ భార్యా పిల్లలను

పోషించటం నయం అని చెప్పిన పోతన ఒక చేత్తో హలం ,మరొక చేత్తో కలం పట్టి ఒక చేతితో పంటలను, మరొక చేత్తో సాహిత్యాన్ని పండించిన గొప్ప కవి పోతన.

ఆదిత్య గీతాలు..కరుణశ్రీ.!

ఆదిత్య గీతాలు..కరుణశ్రీ.!

శుభోదయం.!

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సూర్యభగవానుణ్ణి ప్రస్తుతిస్తూ ఆదిత్యగీతా లానే అందమైన

పాటలను వ్రాశారు.

ఒకప్పుడు ప్రభాత సమయంలో ఆకాశవాణి ద్వారా భక్తిరంజని లో మధురమైన గాయకుల గళాల్లో

ఈ ఆదిత్య గీతాలు ఇంటింటా మారు మ్రోగుతూ జనాలను ఉత్తేజితులను చేస్తూ ఉండేవి.

అటువంటి ఆదిత్య గీతాల్లో మణిపూస లాంటి ఒక గీతం ఇది.

ఈ గీతం లో కవి చేసిన పద ప్రయోగం, కవిత్వంలోని అలంకార ప్రయోగం అనుపమానం.

పల్లవి :

అడుగడుగో దినరాజు చూడు - పాల కడలి తరగలపైన వెడలి వస్తున్నాడు - అడుగడుగో దినరాజు చూడు

పొడుపు కొండలపైన కొలువు దీరిచినాడు - వెలుగుల యెకిమీడు - వేయి చేతుల రేడు

అడుగడుగో...

చరణం ౧.

అందాల రేవెల్గు జోడు - అరవిందాల సావాసగాడు ... అందాల ..

మందేహులను గెల్చి - సిందూర రుచి దాల్చి ... మందే ..

కన్దోయికిని విందు - గావించు తున్నాడూ ... కందో ..

అడుగడుగో...

చరణం ౨.

బంగారు కిరణాల వేల్పు - చిగురు చెంగావి మువ్వల్వ దాల్పు ... బంగారు ..

రంగారు తొలి ప్రొద్దు - సింగార మది ముద్దు ... రంగారు ..

పొంగారు సుషమా - తరంగాల సరిహద్దు ... పొంగారు ..

అడుగడుగో...

చరణం ౩.

కంటీ కిమ్పగు వెల్గు పంట - కారు కటిక చీకటి గుండె మంట ... కంటీ ..

ఒంటీ చక్రపు రథము - అంటీ అంటని పథము ... అంటీ ..

కుంటీ సారధి తోడ - మింటా పరుగిడు నంట ... కుంటీ ..

అడుగడుగో...

Thursday, June 23, 2016

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది!

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది!

మాటల ఐంద్రజాలికుడు శేషేంద్ర...................- 


.

శేషేంద్ర వచన కవితా కళను గురించి చాల తక్కువే పరిశోధన జరిగిందని చెప్పాలి. శేషేంద్ర పద్యరచనా సామర్థ్యం గురించి నేను కాదు నన్నయకన్నా ప్రాచీనుడైన విశ్వనాథ సత్యనారాయణ అంతటి ప్రాచీన కవే చెప్పాడు. శేషేంద్ర లాగా పద్యం రాయగలిగిన వాడు తెలుగు దేశంలో నలుగురైదుగురు కూడా లేరని అన్నాడు. 

ఆయన ఋతు ఘోష పద్య కావ్యం నాకు చాలా కాలం పారాయణ గ్రంథంలా ఉండేది. అంతటి పద్యరచనా కళను సొంత చేసుకున్న శేషేంద్ర వచన కవితలో కూడా చాలా మంచి ప్రయోగాలు చేశాడు. అంతే కాదు నేను ఎప్పుడూ అంటుంటాను అదేమంటే మామూలు వచనాన్ని అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం అంటే విషయాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చే వచనాన్ని రాస్తూ కూడా అలాంటి వాక్యనిర్మాణాలు చేస్తూ కూడా దాన్ని అద్భుతమైన కవితగా మార్చే శక్తి ఒక రసాయనిక చర్య అని అది ఒక కళ అద్భుత కళ. ఇదే వచన కవితాకళ. అయితే అలాంటి పరిణతి ఈ కాలానికి వచ్చింది. తొలి తరం వచన కవులు చాలా మంది అంతకు ముందు పద్యాలు గేయాలు రాసిన వారే. ఆనాటి వచన కవితల్లో అర్థగేయాల లాగా కనిపించేవి చాలా ఉంటాయి. 

పాదాల విరుపును మార్చినా ఉద్దిష్ట అర్థాలు మారవు. అంటే ఇక్కడ పాదాల దైర్ఘ్యం యాదృచ్చికం అన్నమాట. అలాంటప్పుడు పాదాల విభజన ఎందుకు అని పాదాలు లేకుండా నవలలో లాగా కథలో లాగా బారుగా పంక్తులు పంక్తులుగా వచన కవితను రాస్తే తప్పేంటి అది కవిత ఎందుకు కాదు అనే ఆలోచనతో తొలిసారిగా వచన కవితను అలా ప్రచురించినవాడు (నాకు తెలిసి) శేషేంద్ర. 

నా దేశం నా ప్రజలు కావ్యాన్ని ఇలా ప్రచురించాడు. వచన కవితను కథలాంటి ప్రచురణతో అంటే పాదవిభజన లేకుండా ప్రచురించాడు. కాని ఇది వచనం కాదు అని కవిత అని చెప్పడానికి ప్రతి వాక్యం లేదా వాక్య శకలం అందులో సాక్ష్యంగా నిలుస్తాయి. . శేషేంద్ర వచనకవితా కళను గురించి ప్రత్యేకించి చెప్పవలసే ఉంది.

.

ఆయన రాసిన ఒక కవితను ఇక్కడ వివరంగా విప్పిచెప్పాలనుకుని ఈ పనిచేస్తున్నాను. 

ఆ కవిత “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అనేది. ఇది అందరికీ తెలిసినట్లు గా 1975లో ముత్యాల ముగ్గు సినిమాలో వచ్చింది. ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్ చాలా భాగం జ్ఞాన్ భాగ్ ప్యాలెస్ అది అప్పటి శేషేంద్ర నివాసంలో జరిగింది. ఈ పాటగురించి చాలా సమాచారం ఉంది. ఇది శేషేంద్ర రాసిన ఒకే ఒక సినిమా పాట. కాని దీన్ని గురించి వేరే పెద్దలు చెప్పిందేమంటే ఇది అంతకుముందు రాసిన ఒక కవితకు పరిణామ రూపం అని. కాని శేషేంద్ర కుమారుడు సాత్యకి చెప్పడం మాత్రం వేరు. ఇది కేవలం ఆసినిమా కోసమే ఆయనతో రాయించారు. అని నూటనాలుగు డిగ్రీల జ్వరంలో పాట రాసారని. మద్రాసు సవేరా హోటల్ లో ఉండి రాసారని సాత్యకి స్వయంగా నాతో చెప్పారు.

కాని ఈ పాట, పాట లక్షణాల కన్నా వచనకవితలోని నిర్మాణ లక్షణాలను బాగా పుణికి పుచ్చుకున్నది. శేషేంద్ర వచన కవితను రాసే శైలి ఇందులో బాగా కనిపిస్తుంది.

.

“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది.”

పాటలో నిజానికి సమతూకం ఉన్న పాదాలు అక్షర పునరావృత్తులు ఒక చోట ఎక్కడో యతి సాధారణంగా ఉంటుంటాయి. ఇందులో కొన్ని పాదాలలోనే మైత్రి కనిపిస్తుంది. మిగతా చోట్ల వచన కవిత నిర్మాణపు పోకడలు కనిపిస్తాయి.

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ఈ పాదం నిజానికి ఆరోజుల్లో కాని తర్వాతి రోజుల్లో కాని ఏ సినిమా పాటల్లోను కనిపించని తరహా వాక్యం ఇది అచ్చు వచన కవితలోనే కనిపించే లాంటి వాక్యం. ఇలాంటిది మామూలు వచనం రాస్తే 

1. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి పనిమనిషి వచ్చింది. 

2. ఎవరూ లేని ఇంట్లోకి ఆవు జొరబడింది. 

3. గడ్డి ఏపుగా పెరిగిన తోటలోకి ఎద్దు వచ్చేసింది. 

ఇక్కడ చెప్పిన మూడు వాక్యాలు మామూలు వచనం అంటే వీటిలో వాచ్యార్థం తప్ప మరే అర్ధాలు లేవు. పని మనిషి వచ్చింది. ఆవు జొరబడింది, ఎద్దు వచ్చేసింది అనే క్రియా పదాలు కేవలం అక్కడ యదార్థంగా ఉన్న పనిని తెలిపే క్రియాపదాలు. కర్తలు పనిమనిషి, ఆవు, ఎద్దు ఈ మూడింటిలోను ఉన్న ఇల్లు పాసివ్ గా ఉండిపోయిన అచేతన వస్తువు. ఇది ఒక వాక్య నిర్మాణం, ఇలా మామూలు వాక్య నిర్మాణంతో ఎన్ని వాక్యాలైనా చేయవచ్చు. కాని వీటికి ఉన్నది వాచ్యార్థమే.

సరిగ్గా ఇలాంటి వాక్యాన్నే శేషేంద్ర ఇక్కడ రాసాడు. 

అది – నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది—- తోట నిదురించదు. కారణం నిదురించే లక్షణం ఉన్న సజీవికాదు తోటని నిర్జీవి అని చెప్పలేము కాని మనిషిలాంటి చలనశీలమైన జంతువులాంటి చలనశీలమైన జీవి కాదు. ఇలాంటి అచేతన వస్తువును ఇంగ్లీషులో చెబితే ఇనానిమేట్ ను ఒక సజీవంగా అంటే ఒక మనిషి గుణాన్ని ఆపాదించి అంటే ఏనిమేట్ లక్షణాన్ని ఆపాదించి నిదురించే తోట అని చెప్పాడు. అక్కడితో ఆగలేదు నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. పైన చెప్పిన వాక్యాలలో పనిమనిషి వచ్చింది, ఆవు వచ్చింది ఎద్దు వచ్చింది అనే నిర్మాణం లాంటి వాక్య శకలమే ఇది. కాని ఇక్కడ వచ్చింది అని చెప్పింది పాట. ఇది కూడా నిర్జీవం దీనికి కూడా జీవ లక్షణాన్ని ఆపాదించి వాక్యాన్ని రాశాడు. పూర్తయ్యే సరికే నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే వాక్యం పూర్తిగా వాచ్యార్థం ఏమాత్రం లేకుండా వ్యంగ్యార్థం అంటే అక్కడ లేని భిన్న ఉద్దిష్టార్థాన్ని ఇస్తుంది. ఇక్కడ నిజానికి తోటలేదు పాటా లేదు. ఒక నిర్జీవంగా ఉన్న నిరాశామయంగా ఉన్న నాయిక జీవితంలోనికి ఒక వ్యక్తి జీవితంలోనికి ఒక సంతోషకరమైన అమితానందకరమైన సంఘటన జరిగింది. ఒక అల్పుడైన కవి రచయిత రాస్తే ఇలాంటి శుష్కవచనాన్ని రాస్తాడు. కాని శేషేంద్ర వాక్యం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే వాక్య రచనలోనే మామూలు వచనాన్ని అద్భుతమైన వచన కవితగా మార్చిన ఇంద్రజాలం ఉంది. ఈ ఇంద్ర జాలం మిగతా పాటలోని వాక్యాలన్నింటిలో ఉంది.

దీని తర్వాత రెండు వాక్యాలు చూడండి —- రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ/ దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ —- ఈ రెండు పాదాల్ని మీరు గమనిస్తే ఇందులో పాట లక్షణమైన మైత్రి మీకు కనిపిస్తుంది. కాని వాక్యాలుగా పై వాక్యం వంటి వాక్యాలు కావు. వీటికి వాచ్యార్థాన్ని చెప్పవచ్చు, లక్ష్యార్థాన్ని ధ్వనినీ చెప్పవచ్చు. కాని నిదురించే తోటలోకి అనే వాక్యంలో వాచ్యార్థాన్ని చెప్పడం కుదరదు. తర్వాతి వాక్యం —శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ— ఈ వాక్యానికి వాచ్యార్థం చెప్పడం కుదరదు. నాయిక భావనాస్థితే వర్ణితం ఇక్కడ.

తర్వాతి చరణం మరింత గాఢంగా ఉంటుంది. చూడండి. విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో/ ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి. —విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో— వాక్యాన్ని ఇలా చెప్పడం అద్భుతమైన వచన కవితా ప్రయోగం. కోర్కెలు అనేవి సజీవ ప్రాణులు కాదు అంటే ఇవి మనః స్థితిని చెప్పేవి. గుమ్మంలో కోర్కెలు వేలాడడం అన్నది నిర్జీవ అమూర్త విషయానికి మూర్తమైన ఒక వస్తువు లక్షణాన్ని ఆపాదించడం. మామిడి ఆకులు వేలాడాయి అంటే మాములు వచనం అవుతుంది. ఇక్కడ కోర్కెలు గుమ్మంలో వేలాడాయి అని చెప్పాడు. ఇలా అమూర్త విషయాలకు మూర్త లక్షణాన్ని ఆపాదించి వచన కవితలో వాక్యాన్ని రాయడం అన్నది అద్భుతమైన టెక్నిక్. శేషేంద్ర చేసిన దీన్ని బాగా ప్రతిభావంతంగా పట్టుకున్న తర్వాతి తరపు వచన కవి అఫ్సర్. అఫ్సర్ రాసిన రక్త స్పర్శ కవితల్లో చూస్తే ఇలా అమూర్త విషయాలకు మూర్త లక్షణాన్ని ఆపాదించే టెక్నిక్ కనిపిస్తుంది. సైగల్ పాటమీద రాసిన కవితలో ఈ లక్షణం ఉంది. చాలా చోట్ల ఉంది.

ఈ టెక్నిక్ ని అఫ్సర్ ఇప్పటికి కూడా చాలా విరివిగా వాడుతున్నాడు. యాకూబ్ తన కవితల్లో దీన్ని ఇంకా రిఫైన్ చేయడం కనిపిస్తుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు కవులు ఈ టెక్నిక్ ని చాలా ప్రతిభావంతంగా వాడుకున్నారు. అంటే ఇక్కడి నాఉద్దేశం శేషేంద్రని అనుసరించారని చెప్పడం కాదు. ఒక వచనకవితా కళని వారు పట్టుకున్నారు. దాన్ని మరింత ప్రతిభతో మరింత గట్టిగా పాఠకులకి అందజేశారు.

ఇక పాటలో తర్వాతి వాక్యాలు పూర్తిగా ఇదో ధోరణిలో సాగుతాయి.—–కొమ్మల్లో పక్షుల్లారా!/ గగనంలో మబ్బుల్లారా! / నది దోచుకుపోతున్న నావను ఆపండీ!/ రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ—- పాటలో చివరి వాక్యం రేవు బావురు మంటూందని నావకు చెప్పండి అనేది గుండెను పిండేస్తుంది. రేవు బావురు మనడం కూడాపైన చెప్పిన కళే. నావ నదిని దోచుకు పోతుంది అని చెప్పడం శేషేంద్ర వంటి అత్యంత ప్రతిభాశాలి సృజన శీలి మాత్రమే అనగలిగే మాటఇది. నాయకుని కోల్పోయిన ఒక నాయిక మనఃస్థితిని ఇంత గాఢంగా ఇలా వర్ణించిన కవిత కాని సినిమా పాట కాని మరొకటి కనిపించదు.

నిజానికి ఈ పాట సినిమా పాట లక్షణాలతో రాయలేదు. సినిమా పాటలో లేని సాధారణంగా పనికి రాని వచన కవితా లక్షణాలతో రాసిన పాట ఇది. ఈ పాట క్లాస్ పాఠకులను కవితా ప్రియులను గాఢంగా ఆకట్టుకున్నట్లుగా మామూలు సినీమా ప్రేక్షకులను మాస్ శ్రోతలను ఆకట్టుకోలేదు. ఈ పాట బాగుందని ఏ సినిమా నిర్మాత కాని, సంగీత దర్శకుడు కాని శేషేంద్రని పాటలు రాయమని కోరలేదు. ఆలా ఊహించి కూడా శేషేంద్ర ఈ పాట రాయలేదు. కావాలంటే సినిమా మాస్ పాటని అవలీలగా రాయగలిగిన ప్రతిభావంతుడు శేషేంద్ర కాని తన కవితావ్యక్తిత్వానికి భిన్నంగా రాయలేదు. వచనంలో శేషేంద్ర చేసే ఐంద్రజాలిక చర్యకి మంచి ఉదాహరణ సినిమా పాటల్లో అనర్ఘరత్నం ఈ నిదురించే తోట పాట.

——————————————————-

చిత్రం : Muthyala Muggu(ముత్యాలముగ్గు) (1975)

రచన : గుంటూరు శేషేంద్ర శర్మ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల

Song Lyric : Nidurinche thotaloki paata okati vachindi

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ

ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ

విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

కొమ్మల్లో పక్షుల్లారా!

గగనంలో మబ్బుల్లారా!

నది దోచుకుపోతున్న నావను ఆపండీ!

రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ

ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

పరిచయం రాసిన వారు:--- శ్రీ జంపాల చౌదరి గారు.


( ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి.)


కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది.

యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది.

చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.

.

ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి అన్న అనే విషయం ద్రౌపదిని విస్మయపరిచింది. ఈ విషయం ముందే తెలిసిఉంటే తనకూ కర్ణుడికీ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవన్న సందేహం ఆమెకు కల్గింది. ఆమె అంతకు ముందు కర్ణుని రెండుసార్లే చూసింది. ఆ రెండు సందర్భాలలోనూ ఆమెకు కర్ణుడిపట్లా తిరస్కారభావమో, అసహ్యమో కల్గాయి. తాను కర్ణుని రెండు సార్లే కలసినా తనజీవితమంతా కర్ణుని చుట్టే తిరిగినట్లుందని ఆమెకు తోచింది. ఆమె కర్ణుని మొదటిసారి చూసింది తన స్వయంవర సమయంలో. సూతపుత్రుడన్న కారణంతో కర్ణుని మత్స్యయంత్రం చేదించటానికి ప్రయత్నం చేయకుండా ఆమే ఆపించింది. ఆ తరువాత ఆమె కర్ణుని చూసింది కౌరవసభలో. ఆరోజున తనను అవమానించటంలో కర్ణుడు ప్రముఖ పాత్రే వహించాడు. కర్ణుని హీనునిగా తలపోస్తున్న ద్రౌపదికి, కుంతి, కృష్ణుడు చివరిరోజుల్లో పశ్చాతప్త హృదయుడైన కర్ణుడి ఉదాత్తప్రవర్తన గురించి ఆమెకు తెలిపారు. మరణించిన కర్ణుడు అదృష్టవంతుడు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత, విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకూ, కర్ణుడికీ ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కల్గింది. అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది.

.

పట్టమహిషైన ద్రౌపదికి తన జీవనపథమ్మీద, తన వివాహంపైన ఉన్న ధర్మశంకలను, కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు), కృష్ణుడు తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన మౌద్గల్యుడు ఆమెతో ఏకకాలంలో ఐదురూపాల్లో (త్రిమూర్తులు, ఇంద్రుడు, మన్మథుడు) రమించాడు. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట విని, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.

.

ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి.

ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు.

పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

.

అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.

.

ఈ పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు.

తెలిసిన కథను మనకు మళ్ళీ చెప్పటానికి రచయిత ఎంచుకొన్న క్రమం – మనకు పరిచయమైన క్రమంలో నడవదు ఈ కథ. ఉపపాండవుల మరణశోకంతో ద్రౌపది దుఃఖిస్తుండటంతో ఈ కథను మొదలుబెట్టడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది.

తన ఐదుగురు భర్తల గురించి ద్రౌపది విశ్లేషణ – పాండవు లైదుగురి వ్యక్తిత్వాలను ద్రౌపదితో ప్రథమ సమాగమపు సమయంలో వారి ప్రవర్తనలద్వారా ఆవిష్కరిస్తాడు రచయిత. వారి మనస్తత్వాలను ఆకళింపు చేసుకొని వారి మనోభావాలను దెబ్బ తీయకుండా ద్రౌపది ప్రవర్తించే విధానాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారు.

కుంతికీ ద్రౌపదికీ ఉన్న సాన్నిహిత్యం – ఈ నవలలో ద్రౌపదికి ముఖ్యస్నేహితురాలు ఆమె అత్తగారే. ద్రౌపది వలే కుంతికూడా విలక్షణమైన పురుష సంబంధాలు కల్గినదే. ద్రౌపది మానసిక సంఘర్షణలను, సందిగ్ధాలనూ అర్థం చేసుకొని ద్రౌపదికి మానసిక సాంత్వనను కలిగించటానికి కుంతి ప్రయత్నిస్తుంటుంది.

ఈ నవలలో చాలా విలక్షణమైనది కృష్ణకూ, కృష్ణునికీ ఉన్న సంబంధం. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరిపై విపరీతమైన మమకారం. మానసికంగా వారిద్దరూ అతిసన్నిహితులు.

ఈ కథ చెప్పటంలో లక్ష్మీప్రసాద్‌గారి శైలి ప్రత్యేకించి మెచ్చుకోదగింది. చదువరిలో ఉత్కంఠను రేకెత్తించి పుస్తకాన్ని కడవరకూ చదివింపచేస్తుంది. ఆయన వాక్యాలూ, సన్నివేశాలూ ఉద్విగ్నంగా వడివడిగా పరిగెడతాయి.

లవకుశులు జననవార్త..శ్రీ రాముని అంతరంగం.!

లవకుశులు జననవార్త..శ్రీ రాముని అంతరంగం.!

.

ఒకవైపు మణిదీపాలు, మరోవైపు కానుగ నూనెతో వెలిగించిన గాజు దీపాలు

తోటలో అక్కడక్కడా కాగడాలు-వాటిని మించి గగనంలో కోటి దీపాల కాంతి ప్రసరిస్తున్న కలువలరేడు - ఎటువంటి బాధనైనా మరిపించే అందాలరాత్రిఅది.

.

రాముడొక్కడే అక్కడ కూర్చున్నాడు. అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి.

నిద్రలో ఉలిక్కిపడి లేచిన కోయిల ఒక్కసారి ‘కుహూ’ అని అరచి మళ్లీ కళ్లు మూసుకుంది.

గాలికి తోటలోని పరిమళాలు ముక్కుపుటాలకు చేరుతున్నాయి. హాయిగా ఉన్న వెనె్నల-జాబిల్లి-పూల సుగంధాలు-ఆత్మీయుల అనురాగ భాషణలు ఇవేవీ అతడిని తాకలేకపోతున్నాయి

లోకంలో నూతనంగా పుత్రుడు జన్మించినపుడు ఏ తండ్రి అయినా పొందే అనుభూతిని 

ఇప్పుడు తాను అనుభవిస్తున్నాడు. తనకు కవల పిల్లలా? ఎంత సంతోషం అన్పిస్తున్నది. 

.

వైదేహి గర్భమెంత శుభప్రదమైనది. ఇద్దరు బిడ్డలకు ఒకేసారి జన్మనిచ్చిన

ఆ వుదరాన్ని తాకే అదృష్టం తనకు లేకుండా పోయింది.అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి.

Wednesday, June 22, 2016

ఉత్తర రామాయణంలో సీత.!

ఉత్తర రామాయణంలో సీత.!

తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు

దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు

గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు

బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు.

.

పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది.

.

రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు 

“ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది.

రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే చూస్తున్నది. కేతనమూ కనుమరుగై పోయింది. గుర్రపు గిట్టలవల్లా, రథచక్రాలవల్లా రేగుతున్న దుమ్ము మాత్రమే కనిపిస్తున్నది. ఆమె ఆ రథ పరాగాన్నే చూస్తున్నది. ఆ ధూళి కూడా మాయమైపోయింది. ఇంకేమున్నది, వట్టి బయలు! ఆమె అలానే చూస్తూ వుండిపోయింది. ఎంత చూస్తే మాత్రం ఏమున్నది. అంతా శూన్యం. వట్టి బయలు. బైటా, మనసు లోపలా కూడా.

(చిత్రం ఆచార్యా ..చందమామ.)

మిధునం - తెలుగు సినిమా!

మిధునం - తెలుగు సినిమా!

.

శ్రీరమణ రచించిన “మిధునం” కధ ని సినిమా గా తీసిన తనికెళ్ళ ‘దశ’ భరణి గారి చిత్ర రాజములోని కొన్ని అధ్బుతమైన డైలాగులు, 

.

Ø దాంపత్యమూ - ధప్పళము (గుమ్మడికాయ ముక్కల పులుసు )....మరిగిన కొద్దీ రుచి"

.

Ø దొంగ బెల్లం ...దొంగ ముద్దు, అనుభవిస్తే కాని తెలియదు"

.

Ø అంతే కాని ఇప్పుడు? ప్రతీ వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ....!!!

ఎందుకు రావు?

నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!"

.

Ø మనిషిగా పుట్టడం సులువేనయ్యా...కాని మనిషిలా బ్రతకడమే కష్టం"

.

Ø ఒక్కడ్నో ఇద్దర్నో కంటా వనుకుని పెద్దవాడికి కృష్ణా అని పేరు పెట్టాను...ఏడాది తిరగకుండా పుట్టుకోస్తుంటే.. ప్రతీ సంవత్సరం పేర్ల కోసం ఎక్కడ అఘోరించడం అనీ.............ఇంకా నావల్లకాక...కేశవ నామాలు అందుకున్నా...!!"

.

Ø ఊరగా............ఊరగా....ఊరగాయ.

కోరగా ....కోరగా.........కొబ్బరి"

.

Ø కలలు కన్న దేశానికి వెళ్ళాకా ...కన్న దేశం కలలోకి వస్తుంటుంది"

.

Ø " అదే మనం Air-India flight ఎక్కామనుకోండి? మన air-hostess కాఫీ తెచ్చేలోపు అమెరికా వచ్చేస్తుంది

Tuesday, June 21, 2016

శ్రీ ముని'మాణిక్యం' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.!

శ్రీ ముని'మాణిక్యం' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.!

.

నరసింహారావు గారు బందరులో ఉపాధ్యాయుడిగా వుండేవారు. 

ఆ రోజుల్లో బందరు ఒక సాహితీ కేంద్రం. పూర్వం ఉబ్బసానికి గాడిద పాలు నాటు మందుగా వాడే వారు. నరసింహారావు గారి అబ్బాయికి ఉబ్బస వ్యాధి వుండేది. ఒక రోజు, ఆయన స్కూల్ కి వెళ్ళుతూ, 

భార్యతో 'ఏమోయ్! స్కూల్ నుంచి ప్యూనును పంపుతాను, వాడు గాడిద పాలు తెస్తాడు, ఒక చెంచా పిల్లవాడికి ఇవ్వు' అని అన్నారు.

సాయంత్రము, స్కూల్ నుంచి రాగానే, ఏమోయ్ పిల్లవాడికి గాడిద పాలు ఇచ్చావా? అని అడిగారు.అప్పుడామె,'ఆ సంగతే మరచి పోయానండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గుర్తుకు వచ్చింది' అని వంటింట్లోకి వెళ్లి పోయింది. 

ఇందులో ఇమిడిన హాస్యోక్తికి, భార్య సరస సంభాషణకు ఆయన ఎంతగా మురిసిపోయారో!! ఇది మనసులో వుంచుకొని, నరసింహారావు గారు, భార్యకు మంచి సరసమైన బాణం విసరటం కోసం ఎదురు చూస్తున్నారు.

 ఆయన, కొంతకాలం కర్నూల్ లో కూడా ఉద్యోగము చేశారు. కర్నూల్ వచ్చిన కొత్తలలో, ఒక రోజు భార్యను పిలిచి, 'ఏమోయ్! కర్నూల్ ఎలా వుంది?' అని అడిగారు. అందుకు ఆమె.'ఏమి కర్నూల్ అండి బాబు! ఎక్కడ చూసినా గాడిదలే! హాస్పిటల్ కు వెళ్ళితే అక్కడ గాడిదలు, మార్కెట్ కు వెళ్ళితే అక్కడ గాడిదలు, ఇలా ఎక్కడ బట్టినా గాడిదలే!' అని ఆవిడ సమాధానం చెప్పింది. 

వెంటనే శ్రీ వారు ఏమన్నారంటే'అన్నట్లు! గాడిదలంటే గుర్తుకొచ్చింది! ఈ రోజు మీ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు' అని మంచి బాణం విసిరారు. ఆ సంభాషణకు భార్యాభర్తలిదారు మనసార నవ్వుకున్నారు. 

సంసార జీవితం ఎంత రసమయమో ఆయన రచనల ద్వారా తెలుసుకోవచ్చు. 

వారు చుట్టలు ఎక్కువగా త్రాగే వారు. ఒక సారి విందు భోజనములో, భోజనాలు అయిన తర్వాత విందు ఇచ్చిన వారు ఒక పళ్ళెములో చుట్టలు, సిగరెట్లు తీసుకొని అతిధులందరి వద్దకి వచ్చారు. 

శ్రీ వారు చుట్టలు, సిగరెట్లు రెండూ తీసుకొన్నారు. తెచ్చిన ఆయన విస్తుపోయి,' పంతులు గారు మీరు సిగరెట్లు త్రాగటం ఎప్పడినుంచి మొదలెట్టారు?' అని అడిగారు. అందుకు ఆయన వెంటనే, తడుముకోకుండా 

ఏమన్నారంటే 'నేను ఉభయ భాషా ప్రవీణుడను' అని. చుట్టలు త్రాగటం వదిలి వెయ్యండి, అది మంచి అలవాటు కాదు అని చాలా మంది ఆయనకు చెప్పేవారు. 

అందుకు ఆయన, మా కుల గురువు గురజాడ వారు 'పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్' అని ఎప్పుడో చెప్పారు. నాకు దున్నపోతు కావటము ఇష్టము లేదు, అని చెప్పటమే కాకుండా, మనం పూజించే దేవతలంతా కూడా చుట్టలు త్రాగేవారు. ఇదిగో చూడండి, వచన భాగవతం, అందులో ఏముందో చదివితే మీరే హ ..హ .. హ.. అంటారు. 

అందులో యేముందంటే. 'ఆది శేషుడు చుట్ట చుట్టుకొని పడుకొండెను' అని. అంటే దాని అర్ధం, రేపటి కోసం ఈ రోజే చుట్ట చుట్టుకొని పడుకొనే ఆదిశేషుడు నాకు ఆరాధ్యుడు'. కురుసభలో శ్రీ కృష్ణుడు' నాకు చుట్టలైన, పరులైనా ఒక్కటే' అనటం మనం వినలేదా !! అంటే శ్రీ కృష్ణుల వారికి చుట్టలైన, సిగరెట్లు అయినా ఒకటే అని అర్ధమని, పండితులైన మీకు నేను వేరే మనవి చేయనవసరం లేదనుకొంటాను' అని చమత్కారంగా చెప్పారు. 

ఆయనకు నాటకాలు చూడటమంటే భలే పిచ్చి. 

ఆ రోజుల్లో, బందరులో డి.వి.సుబ్బారావు గారని ప్రఖ్యాత నటులుండేవారు. ఆయన ప్రతాపరుద్రీయం, హరిశ్చంద్ర మున్నగు నాటకాలు ఎక్కువగా ఆడేవారు. పంతులు గారు ఆయన నాటకాలు ఎప్పుడూ మిస్ కాలేదు. నాటకాలు చూసి చూసి, ఆయనకు ఏదో ఒక నాటకంలో ఏదో ఒక పాత్ర వెయ్యాలని కోరిక కలిగింది. జిలపుట్టినప్పుడు గోక్కోవాలి కదా! అదే విషయాన్ని సుబ్బారావు గారికి తెలియ చేశారు. అన్ని వేషాలకు అందరూ బుక్ అయిపోయారు. ఏమి చేద్దామబ్బా! అని ఆలోచిస్తున్నారు. కళా కండూతితో బాధ పడుతున్న పంతులు గారే ఒక సలహా ఇచ్చారు. నాకు రంగస్థలం మీద మొదట కన పడితే చాలు అది ఏ వేషమైనా చాలు అది నౌకరైనా లేక పిచ్చివాడైనా పర్వాలేదు. కథతో సంబంధం లేకపోయినా పర్వాలేదు అని సలహా ఇచ్చారు. 

సుబ్బారావుగారు కాసేపు దీర్ఘంగా ఆలోచించి సరే ఒక పని చేద్దాం, ఒక ఆడ పాత్ర వుంది, కథతో ఏ మాత్రం సంబంధం లేని పాత్ర అది. మీరు మీసాలు తీయించుకొని మంచి పట్టు చీర కట్టుకొని makeup పూర్తి అయిన తర్వాత stage ప్రక్కనే పడ కుర్చీలో పడుకోండి మీ పాత్ర వచ్చే టైంకు మిమ్మల్ని contractor నిద్ర లేపుతాడు అని చెప్పారు. పంతులు గారు తన కళాకండూతి తీరుతున్నందుకు బాగా సంబరపడి పోయారు. నాటకం వేసే రోజు వచ్చింది. శుభ్రంగా మీసాలు తీయుంచుకొని పట్టుచీర కట్టుకొని makeup చేసుకొని ఆప్రక్కనే ఉన్న పడకుర్చీలో నిద్ర పోతున్నారు. కాంట్రాక్టర్ నిద్ర లేపుతాడుగా! సుష్టుగా భోజనం చేశారేమో బాగా నిద్ర పట్టింది. కథతో సంబంధం లేని పాత్ర కదా! కాంట్రాక్టర్ నిద్ర లేపడం మరచిపోయాడు. మధ్యలో లఘుశంకకు పోయే నిమిత్తం వీరికి మెళుకువ వచ్చింది. మంచి నిద్ర పోవటం చేత చీర నలిగి, విగ్ చిందర వందరగా అయి, పిచ్చిదాని లాగా వున్నారు. వళ్ళుమండే అంత కోపం వచ్చింది. కథతో సంబంధం లేదు కదా అని ఒక మంచి రసవత్తర ఘట్టం జరుగుతుండగా శ్రీవారు స్టేజి పైకి వెళ్లి యేవో రెండు dialogues చెప్పారు. శ్రీ సుబ్బారావు గారు వెంటనే ఎవరక్కడ! ఈ పిచ్చిదాన్ని అవతలికి తీసుకొని పోండి అని చెప్పగానే ఇద్దరు భటులు వచ్చి పంతులుగారిని పెడరెక్కలు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు. నాటకం ఏ మాత్రం రసాభాస కాలేదు పంతులుగారి కళాకండూతి కూడా తీరింది! పంతులుగారు తన వేషం కన్నా, శ్రీ సుబ్బారావుగారి సమయస్పూర్తికి యెంతో సంబరపడిపోయారు. ఈ సందర్భంలో మహానటులు సుబ్బారావు గారిని కూడా స్మరించుకోవటం మన అదృష్టం.

ఇలా ఆయనను గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు వినే వాడుంటే!

వారి గ్రంధాలు చదవటం కోసం మీకు ఇది ఒక చిన్న పరిచయం మాత్రమే!!

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఆంధ్ర కవితాకుమారి.!

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఆంధ్ర కవితాకుమారి.!

.

కవితా కుమారి

జడయల్లి జడకుచ్చు లిడ "రాయప్రోలు" "త

ల్లావజ్ఝల" కిరీట లక్ష్మినింప

"పింగళి" "కాటూరి" ముంగురుల్ సవరింప

దేవులపల్లి శ్రీ తిలక ముంప

"విశ్వనాథ" వినూత్న వీథుల కిన్నెర మీట

"తుమ్మల" రాష్ట్రగాన మ్మొనర్ప

"వేదుల" "నాయని" వింజామరలు వేయ

"బసవరాజు" "కొడాలి" పదములొత్త

గీ.

"అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప

"జాషువా" "ఏటుకూరి" హెచ్చరిక లిడగ

నవ్యసాహిత్య సింహాసనమున నీకు

ఆంధ్ర కవితాకుమారి "దీర్ఘాయురస్తు ! "

x

అనుభూతి.!

అనుభూతి.!

శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు ఒక భువనవిజయ సభలో చెప్పిన పద్యమిది. 

ఒక అందమైన అమ్మాయిని చూస్తే, ఒక వేదాంతికి, ఒక నవయువకునికి

, ఒక పిల్లవానికీ, అలాగే ఒక కవికీ, ఎలాంటి అనుభూతులు కలుగుతాయో - 

ఒక పద్యంలో వర్ణించమన్నారతన్ని.

అప్పుడతను ఆశువుగా చెప్పిన పద్యమిది:

.

ఒకనికి మట్టిదిమ్మవు, మరొక్కనికీ వపరంజిబొమ్మ, విం

కొకనికి నమ్మవౌదు, మధురోహల ఊయలలూగునట్టి యీ

సుకవికి యేమియయ్యెదవు సుందరి! యీ కవితాకళామయా

త్మికజగతిన్ రసజ్ఝరుల దేల్చెడి ముద్దులగుమ్మవౌదువా!

.

వేదాంతికి మట్టిదిమ్మ, నవయువకునికి అపరంజిబొమ్మ, 

పిల్లవానికి అమ్మ. ఎవరి మానసిక స్థితికి తగ్గట్టువారు స్పందిస్తారు. 

ఈ పద్యంలో కవి స్పందనకున్న ప్రత్యేకత గమనించారా! 

తక్కిన ముగ్గురికీ ఆమె ఒక వ్యక్తిగా నేరుగా ఒకో రకమైన అనుభూతిని కలిగిస్తోంది. కానీ కవికి ఆమె భౌతిక వ్యక్తిత్వంతో పనిలేదు. 

కవితాలోకంలో రసజ్ఝరుల తేల్చే ఒక ప్రేరణ. అది శృంగార రసమైనా కావొచ్చు, వాత్సల్యమైనా కావచ్చు, మరేదైనా కావచ్చు!

(చిత్రం.. రవివర్మ.. దమయంతి వనవాసం.)

మూడు యేడుపులు ..తెనాలి వారి వ్యాఖ్య !

మూడు యేడుపులు ..తెనాలి వారి వ్యాఖ్య !

అల్లసానిపెద్దన అటు నిటుగా యేడ్చే..

అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్ర ప్రబంధం లోని వరూధిని ఏడుపు వర్ణన.

.

పాటున కింతు లోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ ని 

చ్చోట భవన్నఖాంకురాము సోకే కనుంగొనుమంచు జూపి య 

ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చే కలస్వనంబుతో 

మీటిన గబ్బి గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువందగాన్ 

.

అర్థము:--

తనను ప్రేమించమని వేడుకుంటూ కాదంటే మీద పడి కౌగలించుకున్నవరూధినిని ప్రవరుడు తనచేతులతో త్రోసి వేశాడు.అప్పుడు ఆమె నీవు తోసి వేస్తేఆ దెబ్బకు ఆడవాళ్ళు ఓర్చుకుందురా?దయలేనివాడా నీవు త్రోసినప్పుడు నీ వేలి గోరు నాకు గ్రుచ్చుకొని గాయమయింది చూడు అని తన వక్షస్థలమును చూపి ఆ వరూధిని మధురమైన గొంతుతోవేదన అనే సాకు తో తన గోటి తో చిమ్మినకన్నీరు ఆమె వక్షస్థలము పై చింది పడుచుండగా యేడ్చేను.

.

ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చే...

ముక్కుతిమ్మన వ్రాసిన "పారిజాతాపహరణము"లో సత్యభామ ఏడుపు వర్ణన .

.

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబు చే

గాసిలి యేడ్చే ప్రాణవిభు కట్టె దుటన్ లలితాంగి పంకజ 

శ్రీ సఖ మైన మోము పయి చేల చెరంగిడి బాల పల్లవ 

గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ 

.

అర్థము:--

మనసులో ఈర్ష కోపము ,శోకము కలిసి హెచ్చిన దావానలముతో మండి పోయి వెక్కి వెక్కి తన భర్త యెదుటఆ లలితమైన అంగములు కల సత్యభామ తామర పూవు వంటిఅందమైన తన ముఖముపై పైట చెరగు కప్పుకొని లేత మామిడి చిగుళ్ళు తిని కూసిన కోకిల కూత వలె మధురము గా యేడ్చింది.

.

భట్టుమూర్తి బావురుమని యేడ్చే...

భట్టుమూర్తి వ్రాసిన వసు చరిత్ర లో నాయిక గిరిక ఏడుపు వర్ణన .

.

ఆజాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా

రాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా 

రాజీవానన యేడ్చే కిన్నెర వధూ రాజత్కరాంభోజ కాం 

భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్ 

.

ఆవెన్నెల వెలుగు రేపిన విరహాన్ని భరించలేక చంద్ర బింబము వంటి 

తన ముఖము పై తన పైట చెరగు కప్పుకొని ఆ తామరపూవు వంటి ముఖము గల వనిత కిన్నెర కాంతలు తమ వీణ మీద కాంభోజీ రాగము 

మేళ వించి పాడినట్టుగా అమృత మైన గొంతు తో ఎలుగెత్తి గట్టిగా యేడ్చింది

..

అందుకే ఈ మూడు యేడుపులమీద రామకృష్ణుడి వ్యాఖ్య 

.

అల్లసానిపెద్దన అటు నిటుగా యేడ్చే 

ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చే 

భట్టుమూర్తి బావురుమని యేడ్చే

మృత్యుదేవత

మృత్యుదేవత

శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. సృష్టికార్య నిర్వహణా భారాన్ని స్వీకరించాడు బ్రహ్మ. తొంభై నాలుగు లక్షల జీవరాసులను సృష్టించాడు. ఆ కాలంలో ప్రాణులకు మరణం లేదు. ఎందుకంటే.. సృష్టించడానికైతే బ్రహ్మ జన్మించాడు కానీ.. మరణకార్య భారాన్ని స్వీకరించడానికి ఎవరూ జన్మించలేదు. ఈ కార్యాన్ని స్వీకరించడానికి దేవగణాలలో ఎవరూ సంసిద్ధంగా లేరు. అందుచేత పుట్టకే కానీ.. చావు లేదు. బ్రహ్మ ప్రాణికోటిని సృష్టిస్తూనే ఉన్నాడు. భూదేవి ఎందరినైనా భరిస్తుందేకానీ, ఒక్క పాపిని కూడా భరించలేదు. మరణం లేని కారణంగా అసురుల దురాగతాలకు అంతులేకుండా పోయింది.

ఇక భరించలేని భూదేవి, బ్రహ్మ దగ్గరకు వచ్చి,‘విధాతా..ఈ భూభారాన్ని సహించలేను కొంతకాలం ఈ సృష్టికార్యాన్ని ఆపుచెయ్యి’ అని అర్దించింది. బ్రహ్మదేవునకు భూదేవి కోరిక సమంజసంగానే తోచింది. కానీ తను సృష్టి ఆపడానికి లేదు. భూభారం ఎలా తగ్గించాలో ఆయనకు తోచలేదు. తన అసమర్థతకు తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపానలజ్వాల సర్వ లోకాలనూ చుట్టుముట్టి బాధిస్తూంటే.. పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి శాంతించమని కోరాడు. బ్రహ్మదేవుడు అతి కష్టంమీద తన క్రోధాన్ని ఉపశమించాడు. అప్పుడు ఆ క్రోధానలము నుంచి ఎర్రని శరీరకాంతితో ఒక స్త్రీ జన్మించింది. బ్రహ్మదేవుడు ఆ స్త్రీని చూసి ‘నీ పేరు మృత్యువు..నీవు ప్రాణికోటిని సంహరించే కార్యాన్ని స్వీకరించు’ అని ఆఙ్ఞాపించాడు.

ఆ మాటవిని మృత్యువు ఎంతో విచారించి ‘విథాతా.. ఈ పాప కార్యాన్ని నేను స్వీకరించలేను, నన్ను క్షమించు’ అని తపస్సు చేయడానికి హిమాలయాలకు బయలుదేరింది. బ్రహ్మదేవుడు ఆమె ప్రయత్నాన్ని ఆపి,‘మృత్యుదేవతా... సంహరణకార్యం సృష్టికార్యమంత పవిత్రమైనది. ఈ కార్యమువల్ల నీకు అధర్మము అంటకుండా వరము ఇస్తున్నాను. నీ కన్నీటి బిందువులే రోగాలై జీవులను మరణోన్ముఖులను చేస్తాయి. నీకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను తోడుగా ఇస్తున్నాను. వీటి సాయంతో మృత్యుకార్యాన్ని నిర్వహించు’ అని ఆమెను సమ్మతింప చేసాడు. మృత్యుదేవత అంగీకరరించింది. ఆనాటి నుంచి పరాజయం ఎరుగని ప్రత్యర్థిలా ‘మరణం’ జీవులను నీడలా వెంటాడుతూ సృష్టి సమతుల్యానికి విథాతకు సహకరిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూనే ఉంది.

Monday, June 20, 2016

ఉత్తమా యిల్లాలు ! యెంకి పాటలు నండూరి సుబ్బారావు!

ఉత్తమా యిల్లాలు !

యెంకి పాటలు నండూరి సుబ్బారావు

.

ఉత్తమా యిల్లాలి నోయీ

నన్నుసురుపెడితే దోస మోయీ

నిదరలో నిను సూసి సెదిరెనేమో మనసు

పొరుగు వోరంత నా సరస కురికారంట ఉత్తమా యిల్లాలి నోయీ ...

.

ఏలనే నవ్వంట ఏడుపేలే యంట

పదిమంది ఆయింత పగలబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ...

గాలెంట వోయమ్మ దూళెంట వోయమ్మ

యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ...

.

యీబూది వొకతెట్టె యీపిం కొకతె తట్టె

నీలు సిలికే దొకతె నిలిపి సూసే దొకతె ఉత్తమా యిల్లాలి నోయీ ...

సాటునుండే యెంకి సబకు రాజేశావ

పదిమంది నోళ్ళల్లొ పడమంట రాశావ ఉత్తమా యిల్లాలి నోయీ ..

“కః పూర్వః” ..మాది నరసరావుపేట” !

“కః పూర్వః”  ..మాది నరసరావుపేట”  !

.

 

పరాభవ నామ సంవత్సరంలో (1966) జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీస్వామివారి శిష్యవర్యులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామివరేణ్యులు చాతుర్మాస్యదీక్షావ్రతులై  ఉజ్జయినిలో ఉన్నప్పుడు ఉత్తరాదిలోని

 పద-వాక్య-ప్రమాణ పారావార పారంగతులందఱూ వారి సన్నిధిసేవకై ఏతెంచిన తరుణం. 


.


ఆ రోజు ఉజ్జయినిలో విద్యార్థుల సంస్కృతభాషా వక్తృత్వప్రదర్శనం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఒక పధ్నాలుగు – పదిహేనేళ్ళ పిల్లవాడు 

తనవంతు రాగానే సంస్కృతంలో నిరర్గళమైన ధారాశుద్ధితో, ఉజ్జ్వలమైన తేజస్సుతో, మేఘగంభీరమైన కంఠస్వరంతో ఉద్దండపాండితీమండితంగా, 

మధ్య మధ్య ఛందోమయవాణీభణితిపూర్వకంగా సర్వజనాహ్లాదకరంగా వక్తవ్యాంశాన్ని పురస్కరించుకొని ప్రసంగించాడు. 

విద్వత్పరిషత్తు విభ్రాంతి చెంది, పెద్దలందఱూ నిండైన మనస్సుతో మెండైన ప్రశంసలుఉట్టిపడేకన్నులకాంతివెల్లువనుఆపిల్లవాడిపై

వెల్లివిరియింపజేస్తున్నారు.రాంకవ పుస్తకాది ప్రోత్సాహక పురస్కారాలు పూర్తయిన తర్వాత,

 శ్రీమదభినవ విద్యాతీర్థస్వాముల వారు ఆ పిల్లవాడికేసి చూస్తూ, “కా పూర్వః?” అని ప్రశ్నించారు.

ఏది పూర్వం? సృష్టికంటె, సృష్ట్యాదికంటె, అన్నింటికంటె మునుపటిది ఏమిటి? అని కాబోలు ఆ ప్రశ్నార్థం. పిల్లవాడిని అడిగే ప్రశ్నేనా అది? అని పెద్దలు, పండితులందఱూ తెల్లపోయారు.

వేదలతాంతాలైన ఉపనిషత్తుల కుదుళ్ళ నుంచి పుట్టిన అపురూపమైన ప్రశ్నమని అందఱూ అనుకొన్నారు.

.


 “అమ్మో, నీ ప్రశ్నకు సమాధానం చెప్పటమే!” అని. ఇదీ అటువంటిదే. అంతేకాదు. పండితపరిషత్తులో పెద్దల ముందు ఎన్ని ఉదాహరణలతో ఏమని చెప్పినా శాస్త్రవాదం “అథాతో బ్రహ్మజిజ్ఞాసా” అంటూ మళ్ళీ మొదటికే వస్తుంది.  ఏమని బదులిచ్చినా అంతకు ముందు మఱేదో ఉండేదని ఏ శాస్త్రమో, పురాణమో చర్చకు రాకుండా ఉంటుందా? ఏదో వక్తృత్వాన్ని ప్రదర్శించినంత మాత్రాన అడిగిన ప్రశ్నకల్లా ఆ చిన్న పిల్లవాడు సమాధానాలు చెప్పాలని లేదు కదా!

,


అదీగాక, జగద్గురువుల వారు “కః పూర్వః” అని అడగకుండా లింగవ్యత్యయం చేసి, పుంలింగమైన పూర్వ శబ్దానికి మునుపు “కా” అని స్త్రీలింగాన్ని ప్రశ్నార్థకంగా జోడించారు.  అన్నింటికంటె పూర్వం ఉండినది పరాశక్తి అన్న స్త్రీత్వభావంతో అడిగితే మాత్రం, ఆ అవతారపురుషుని నోట లింగవ్యత్యయపూర్వకమైన అపశబ్దం దొర్లుతుందా? 

లేక, విద్యార్థి తెలివితేటలను ఆ విధంగా పరీక్షించాలనుకొన్నారా?

.

ముసిముసి నవ్వులతో తండ్రిగారికేసి చూస్తున్న ఆ పిల్లవాడికేసి చూస్తున్నారు అందఱున్నూ. ఏమంటాడోనని ఆసక్తిగానూ, జగద్గురువులవారి దృష్టిని అంతగా ఆకర్షించినందుకు అమితాశ్చర్యంగానూ. అదే ప్రశ్న నన్నడిగితే ఏమి చెప్పాలని కొంద ఱాలోచిస్తున్నారు.

.

ఆ పిల్లవాడి ఆత్మవిశ్వాసం చూడండి: “మాది నరసరావుపేట” అన్నాడు.

సభ సభంతా విస్తుపోయింది. మహాపండితుల కరతాళధ్వనులు మిన్నుముట్టకుండా ఉంటాయా?

.

“పూః పురీ” అని అమరకోశం. జనములచే పూరింపబడేది కాబట్టి పురమునకు “పూః” అని పేరు. “పూః” శబ్దం స్త్రీలింగం. “కా పూః వః” అని ఆ పిల్లవాడి విఱుపు. వః = మీ యొక్క; పూః = పురము; కా = ఏమిటి అని. మీ ఊరేమిటి? అన్నమాట. “నరసరాట్ పూర్ నః” అన్నాడు. మా ఊరు నరసరావుపేట అన్నాడు.

మాతృశ్రీ అనంతలక్ష్మమ్మ గారు, తండ్రి వేంకటేశ్వర అవధాని గారు ఇంటికి వెళ్ళి దిష్టి తీశారో లేదో. ఎన్ని జన్మల పుణ్యఫలం కాకపోతే అటువంటి కొడుకును కనటం సంభవిస్తుంది కనుక!

.

ఆ పిల్లవాడి పేరు తంగిరాల సీతారామాంజనేయులు. పల్నాటి సీమలో అలుగుమల్లెపాడు నుంచి నరసరావుపేటకు వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది. పసిపిల్లవాడుగా ఉండగానే కావ్యశాస్త్రాలలో, వేదవిద్యలలో, సంస్కృతాంధ్రాలలో ఆ బాలసరస్వతి అనుభవాన్ని చూసి బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారంతటివారు ముచ్చటపడి మెచ్చుకొని మరీ దీవెనలు కురిపించారు.

.

ఆ బాలుడే, ఇప్పుడు యుగయుగాంతరానుగత కర్కశ సమస్యల సంక్షోభంలో అల్లకల్లోలమై ఉన్న జగత్తుకు కర్తవ్యాన్ని తెలియజెప్పి సన్మార్గోపదేశం చేస్తూ శ్రీ శృంగేరీ జగద్గురు మహాపీఠాన్ని అధిష్ఠించిన అపర శంకరాచార్యులు, యతిసార్వభౌములు, ధర్మప్రచార దృఢదీక్షావ్రతులు, జగదేకవిద్వాంసులు, శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి కరకమలసంజాతులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివరేణ్యులు. 

విక్రమోర్వశీయము!

విక్రమోర్వశీయము!

.

విక్రమోర్వశీయము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. 

ఇది పురూరవుడు అను రాజు మరియు దేవేంద్రుని ఆస్థాన నర్తకి అయిన ఊర్వశి ల ప్రణయగాథ. 

ఈ నాటకములోని నాయకుడు పురూరవుడు అయినప్పటికీ, 

చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నములలో ఒకడైన కాళిదాసు ఆయనపై గల ప్రేమ మరియు గౌరవ భావముచే 

ఈ కృతికి ఆ పేరు పెట్టెనని కొందరి భావన.

.

ఊర్వశి, పురూరవుడు - రాజా రవివర్మ చిత్రం.

Sunday, June 19, 2016

నమోహిందు మాతా.!

నమోహిందు మాతా.!

నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత

మాతా నమోహిందుమాత సుజాత నమో జగన్మాత!

.

విపుల హిమాదృలే వేణీభరముగ

గంగాయమునలే కంఠ హారముగ

ఘనగోదావరి కఠిసూత్రముగా

కనులకు పండువ ఘటించుమాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!

.

గోలుకొండనీ రత్నకోశమట

కోహినూరు నీజడలో పువ్వట

తాజమహలు నీ దివ్యభవనమట

ఆహాహా నీభాగ్యమే మాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత

.

ఈగేయం మాచిన్నప్పుడు పాడేవాళ్లం. రాసిన మహానుభావుడి పేరు

తెలీదుగానీ పాడేసమయంలో ఆయన భావావేశం మమ్మల్నితాకేది. 

ఇందులో తమాషా ఏమిటంటే గతంలో ప్రార్థనా సమయంలో ఆలపించేవాళ్లు. ఎవరైతే హిందూత్వం అనేది మతంకాదు, దానికి మూలాలులేవు అంటూ వాదించారో వాళ్లే ఇందులోని 'హిందుమాత ' అనేపదం మతతత్వం అంటూ వాదన లేవనెత్తారు. తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి పాడటం ఆపండి అని ఆజ్ఞ. కొంతకాలానికి ఆతమ్ముళ్ల మనోభావాలు వందేమాతరంతో కూడా దెబ్బతిన్నాయి.

ధూర్తాఖ్యానం – ప్రాచీన కథామాలిక. ! .

ధూర్తాఖ్యానం – ప్రాచీన కథామాలిక. !

.


ఓ ఐదుగురు మిత్రులు ఒక చోట చేరి కథలు చెప్పుకున్నారు. ఆ కథల్లో ఎవరి కథ బావుందో చర్చించుకున్నారు. ఇలా ఐదు కథలూ కలిసి మరొక కథగా మారింది. రాం గోపాల్ వర్మ అన్న దర్శకుడు తీసిన హిందీ సినిమా “డర్నా మనా హై” అన్న సినిమా కథకు ఆధారం ఈ ఆలోచన. మణిరత్నం “యువ” సినిమాలో అలాంటి ధోరణి ఛాయామాత్రంగా కనిపిస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన దుప్పట్లో మిన్నాగు అన్న నవల కాన్సెప్ట్ కూడా ఇదే. యండమూరి కథామాలిక (నవల) కు ప్రేరణ – రోవాల్డ్ డాల్ (Roald Dahl) అన్న బ్రిటీష్ రచయిత అని ఆ పుస్తకంలో వ్రాశారు. మరి రోవాల్డ్ డాల్ కు ముందు ఇలా ఎవరూ వ్రాయలేదా? వ్రాశారు. ఆ రచన, దాని కథాంశ వివరణే ఈ వ్యాసం.

విస్తారమైన కథాసాహిత్యం భారతదేశంలో ప్రాచీనకాలం నుండీ ఉంది. భారతదేశ వాఙ్మయ చరిత్రలో తరచి చూస్తే విభిన్నమైన శైలి శిల్పాదులు ఎన్నో కనిపిస్తాయి. కథ, కథలో ఉపకథ, ఉపకథలో మరొక కథా – ఈ ప్రక్రియ భారతీయులకు పంచతంత్రం, బృహత్కథ కాలం నాటికే తెలుసు. పదిమంది రాజకుమారులు కలిసి సాహసయాత్రలు చేసి వారి అనుభవాలు చెప్పుకోవడం దండి దశకుమారచరితమ్ అనే అపూర్వమైన కావ్యంలో మనకు కనిపిస్తుంది. అంతకు ముందే వచ్చిన బాణభట్టుని కాదంబరి ఒక అద్భుతాల కుప్ప. నిజానికి ’గద్యం కవీనాం నికషం వదన్తి’ – వచనమే కవుల సామర్థ్యాన్ని వెల్లడిస్తుందని ఒక మాట. నవ్యరచనాచమత్కృతి లేని కావ్యం ఎలా శోభిస్తుందంటాడు బాణభట్టు.

భారతదేశ కథాసాహిత్యంలో ప్రాకృతభాషల పాత్ర విస్మరించలేనిది. గుణాఢ్యుడు తన బృహత్కథను పైశాచీప్రాకృతంలోనే రచించాడని ఐతిహ్యం. బౌద్ధుల జాతక కథలూ, అట్టకథలూ ప్రాకృతసౌరభశకలాలే. ఈ పరంపరలో ఐదుకథల కథామాలికాప్రయోగం భారతదేశంలో ఏనాడో జరిగింది. ఈ రచనకు కర్త భారతదేశీయుడైన హరిభద్రసూరి.

హరిభద్రసూరి అర్ధమాగధి ప్రాకృతరచయిత. సితంబర జైనమతావలంబి. జన్మస్థానం చిత్రకూటాచలం. (రాజస్థాన్ మేవార్ దగ్గరి చితోర్).ప్రాకృత భాషకు విశిష్టమైన సేవ చేసిన వారిలో జైనులు ముఖ్యులు. హరిభద్రసూరి అనేక ప్రాకృత కావ్యాలు రచించాడు. మొదట హిందూ బ్రాహ్మణుడై, ఆ పిమ్మట జైనమతం స్వీకరించిన ఈతని కాలం జర్మన్ ఇండాలజిస్టు హెర్మన్ జాకోబీ పరిశోధన ప్రకారం – ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల మధ్య. ఈతని రచన ధూర్తాఖ్యానం (ధుత్తక్ఖాణం) బహుశా చరిత్రలో మొట్టమొదటి సారి ఐదు కథలను గుదిగుచ్చిన కథామాలిక అయి ఉండవచ్చు.

ధూర్తాఖ్యానం – ఇది హిందూ పురాణాలలోనూ, రామాయణ మహాభారతాలలో కనబడే కొన్ని అభూతకల్పనల మీద ఒక satire. ఈ satire ను కొన్ని చోట్ల శృతిమించి అసభ్యంగా మార్చటమూ ఈ రచనలో కనిపిస్తుంది. ఆఖ్యానం అంటే Self narration. సాధారణమైన కథలు కాకుండా కల్పితమైన, తెచ్చిపెట్టుకున్న కథలు చెప్పుకోవడం కాబట్టి “ధూర్తాఖ్యానం” అయింది. ఈ కథలను సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈ కథలకు సమాధానాలు వివరణలు పురాణదూష్యాలు, మతప్రసక్తి కలిగినవి కనుకా, వాటిని పూర్తిగా ప్రస్తావిస్తే విస్తారమైన వ్యాసం అవుతుంది కనుక సమాధానాలలో ఏదేని ఒక్క దాన్ని మాత్రం స్పృశించి ముందుకు సాగడం ఈ వ్యాసకర్త అభిమతం.

***********************************************************************************

కథ:

మాళవరాజ్య రాజధాని ఉజ్జయినీనగర సరిహద్దుల్లోని ఒకానొక ఉద్యానవనంలో ఓ మారు రెండువేలా ఐదువందలమంది ధూర్తులు పోగయ్యారు. వాళ్ళందరూ పచ్చిమోసగాళ్ళు. కామరూప, కామగమనాది విద్యలలో ఆరితేరిన వారు. వారిలో ఐదుగురు ప్రముఖులు. ఈ ఐదుగురులో ఒక్కొక్కరికి ఐదువందలమంది చొప్పున శిష్యులు. ఈ ఐదుగురిలో ఒక స్త్రీ కూడా ఉంది. సరిగ్గా వారు కలుసుకున్నప్పుడు బయట తీవ్రమైన వర్షం మొదలై, వచ్చిన పనికి ఆటంకం ఏర్పడింది. నగరంలోనికి వెళ్ళి భోజనం లేదా భోజనానికి వెచ్చాలు సంపాదించుకుని రావాలి. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఐదుగురూ తమ తమ వ్యక్తిగత అనుభవాల రూపంలో కథలను చెప్పుకుంటారు. ఎవరైతే అద్భుతమైన అబద్ధం చెప్పగలుగుతారో వారు ధూర్తులకు నాయకుడవుతారు. అబద్ధానికి నిదర్శనం చూపలేకపోతే వాళ్ళు ధూర్తులందరికీ అన్నపానాదులను సమకూర్చవలసి ఉంటుంది. ఒకవేళ కథ నమ్మశక్యమైనదే అయితే ఎలా నమ్మశక్యమైనదో, ఆ నమ్మటానికి గల కారణాలను పురాణ, రామాయణ, మహాభారత గ్రంథాల నుండీ ఉదహరిస్తూ నిరూపించగలగాలి.

ఇదీ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం మొదట మూలదేవుడు కథ చెప్పాడు. ఈ కథలన్నీ ఉత్తమపురుషలో సాగుతాయి.

మూలదేవుని కథ:

మంచి పరువంలో ఉన్న రోజుల్లో నాకు ఇష్టమైన ప్రతి వస్తువునూ సొంతం చేసుకోవాలనిపించేది. ఈ రోజులాగే వర్షంపడుతున్న ఒకానొక దినం నా గురువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక చేత్తో గొడుగూ, మరో చేత కమండలం మొదలైన అవసర వస్తువులు తీసుకుని నేను బయటకు అడుగుపెట్టాను. కొంతదూరం వెళ్ళగానే కొండలాంటి యేనుగొకటి నా వైపుకు రావడం గమనించాను. నాకు భయంతో కాళ్ళు, చేతులాడలేదు. యేనుగు దగ్గరికి వచ్చేసింది. ఏం చేయాలో తోచక, నేను నా కమండలం క్రింద పెట్టి అందులోనికి దిగిపోయాను. నన్ను వీడకుండా ఆ యేనుగు కూడా కమండలంలోనికి దూకింది. నేనా ఏనుగుకు దొరక్కుండా ఆరునెలలపాటూ అందులోనే తిరిగాను. చివరికొకరోజు కమండలం తాలూకు గొట్టం ద్వారా వెలుపలికి వచ్చేశాను. ఏనుగూ ఆ గొట్టం గుండానే బయటికి రాసాగింది. దాని శరీరం అంతా బయటికి వచ్చిన తర్వాత తోక తాలూకు ఒక్క రోమం మాత్రం గొట్టంలో చిక్కుకుపోయింది. అంతటితో ఏనుగుపీడ నాకు వదిలింది. బయట పడి కాస్త దూరం నడవగానే గంగానది ఉధృతంగా పరుగులు పెడుతూ కనిపించింది. నేను ఆ నదిలో దిగి చేతులతో నీటిని అవతలికి నెడుతూ అవతలి గట్టుకు చేరుకున్నాను. ఆపైన ఆరునెలలు వర్షాన్ని, ఆకలిని దాహాన్నీ సహిస్తూ మా గురువుకు శుశ్రూష చేశాను. ఆపై అట్నుంచి ఇటు వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను.

ఈ నా అనుభవం సత్యమని భావిస్తేఇలాంటి ఘట్టాలు మరెక్కడున్నాయో దృష్టాంతాలు చూపండి. అసత్యమని నిరూపణ అయితే, నన్ను నాయకుడిగా అంగీకరించదమే కాక ధూర్తులకు భోజనం ఏర్పాటు చేయండి.

ఈ కథకు కండరీకుడు సమాధానం చెబుతూ, కథలో సందేహాస్పదమైనదేదీ లేదని పురాణాలలో ఉదాహరణలు చూపెడుతూ సమర్థించాడు.ఆ పైన కండరీకుడు కథ చెప్పాడు.

కండరీకుని కథ:

బాల్యంలో నేను చాలా తుంటరివాణ్ణి. నన్ను భరించలేక మా అమ్మా, నాన్న నన్ను ఇంటినుండీ వెళ్ళగొట్టారు. ఆపై నేను ఎక్కడెక్కడో తిరిగి ఒకానొక ఊరికి చేరుకున్నాను. ఆ ఊళ్ళో ఎన్నో ఆవులూ,గేదెలూ, ఎనుములూ, ఇతర పశువులూ, గుర్రాలూ, ఏనుగులూ, పూలతోటలూ, ధనధాన్యాలూ ఇలా సమృద్ధిగా ఉంది. ఆ ఊరి నడిబొడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుక్రింద కమలదళుడనే ఒక యక్షుడున్నాడు. ఓ మారు నేనతణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాను. గ్రామం అంతా ఆ యక్షుణ్ణి సత్కరించడానికి అక్కడ చేరుకుంది. సరిగ్గా అప్పుడు అక్కడికి అస్త్రశస్త్రధారులైన దొంగల గుంపు వచ్చింది. ప్రజలందరూ కకావికలై పరుగులు పెట్టారు. అప్పుడు నేనక్కుడున్న ఒక దోసకాయ లోకి చొరబడ్డాను. నన్ను చూసి అందరూ నాతో బాటూ ఆ దోసకాయ లోనికి ప్రవేశించారు. ప్రజలెవ్వరూ కనబడక దొంగలగుంపు నిరాశగా వెనుదిరిగింది. ఇంతలో ఒక మేక ఆ దోసకాయ ను మింగివేసింది. ఆ మేకను ఒక పాము మింగివేసింది. ఆ పామును ఒక గద్ద మింగింది.

అప్పుడు అక్కడికి ఆ దేశపు రాజు తన సైనికులతోబాటు వచ్చాడు. రాజు తాలూకు భద్రగజం అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వదిలారు. చెట్టుకొమ్మగా భ్రమించి మావటీడు ఏనుగును తాలూకు త్రాడును గద్దకాలుకు కట్టివేశాడు. గద్ద పైకెగరగానే ఏనుగు కూడా దానితోబాటూ ఎగురసాగింది. మావటీడు బెదరి రాజు వద్దకు పరిగెత్తుకు వచ్చి మొరపెట్టుకున్నాడు. రాజు కొందరు యోధులను ఆ గద్దపైకి పంపితే వాళ్ళు వచ్చి బాణాలను ప్రయోగించి ఆ పక్షి రెక్కలను తెగనరికారు. అంతేకాక, దాని కడుపు చీల్చారు. అందులోనుండి పాము,పాముకడుపులోనుండి మేక, మేకకడుపులోనుండి దోసకాయ, అందులోనుంచి గ్రామస్తులు అలా బయటపడ్డారు. వారితో బాటు బయటపడిన నేనూ ఇప్పుడు మిమ్మల్నిలా కలుసుకున్నాను.

ఈ కథంతా ప్రత్యక్షరసత్యమని ఐలాషాఢుడు విష్ణుపురాణం, మహాభారత వనపర్వం, జటాయువృత్తాంతం, ద్రౌపదీస్వయంవరం ఇత్యాది ఘట్టాలను ఉటంకిస్తూ కుండరీకుని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు.

ఐలాషాఢుని కథ:

యవ్వనంలో నాకు డబ్బుపిచ్చి బాగా పట్టుకుంది. పర్వతాలలో, గుహలలో రససిద్ధితో బంగారం సంపాదించవచ్చని తిరుగుతూ ఉండేవాణ్ణి. అనేక మంత్రతంత్రాలను అభ్యసిస్తూ ఉండేవాణ్ణి. నేనున్నచోటికి నూరు యోజనాల దూరంలో ఒక పెద్దపర్వతం, దాని సమీపంలో ఒక యోజనం విస్తీర్ణం ఉన్న సహస్రవేధీ రసకుండమూ ఉన్నాయని ఓ మారు నాకు తెలిసింది. ఇదివినగానే నేను పూర్వదిశగా వెళ్ళడం ఆరంభించాను. ఆ సరస్సును సమీపించి ఆ నీటిని, ఆ కొండపై శిలలను నాకు కావలసింతగా తెచ్చుకుని ఇంటికి వచ్చాను. ఇప్పుడు నాకేం తక్కువ? ఈ రెంటి సంయోగంతో నేను బంగారం చేయడం మొదలెట్టి కొన్ని రోజుల్లో కుబేరసమానుణ్ణి అయిపోయాను.

ఓ మారు ఐదువందలమందితో కూడిన ఓ దొంగలగుంపు మా ఇంటిపైకి వచ్చింది. నేను బ్రతికి ఉండగానే నా డబ్బు దోచుకెళ్ళడం సహించలేని నేను ఒక్కొక్క బాణంతో పదిమంది దొంగలను పడగొడుతూ తలపడ్డాను. ఈ హడావుడి విని మా ఇంటి సభ్యులు, నౌకర్లూ దొంగలపైకి ఎదురుదాడికి దిగారు. ఇంతలో ఒక దొంగ నా తల నరికాడు. ఆ తలను రేగుపళ్ళచెట్టుకు వేలాడగట్టాడు. మిగిలిన వాళ్ళు మొండాన్ని వేరుచేసి దాన్నిఖండఖండాలుగా నరికారు. ఆపై వాళ్ళు ఇంటినంతా దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నా తల పరిస్థితి ఏమని చెప్పను? ఆకలి సహించలేక తలతో నేను పక్కనున్న చెట్టు పళ్ళను తినడం మొదలెట్టాను. ఇంతలో పొద్దు పొడిచింది. లోకులు నా తల పళ్ళను తినడం చూసి నేను బ్రతికే ఉన్నానని కనుక్కుని నా శరీరావయవాలన్నిటినీ ఒకచోటికి చేర్చారు. అంతటితో నా శరీరం నాకు వచ్చేసింది. ఇది నా ప్రత్యక్షానుభవం. ఇందులో మీకు సత్యాలు కనబడితే ప్రమాణం చూపించండి.

శసుడు దేవీభాగవత, మహాభారత, రామాయణాది కథల్లో అనుగుణమైన ప్రమాణాలు చూపాడు.

శసుని నాలుగవ కథ:

అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామానికి వెలుపల పొలాలు, దూరాన కనిపిస్తున్న కొండల వరకూ వ్యాపించి ఉన్నాయి. ఒక శరత్కాలపు పొద్దున నేను సరదాగా మా ఊరి పొలాల వైపుకు వెళ్ళాను. అంతలో దూరంగా ఉన్న కొండపై నుండి దిగి ఒక మదపుటేనుగు నా వైపుకు పరిగెత్తుకు రాసాగింది. నేను ఆ ఏనుగు నుండి ఎలా తప్పించుకోవడమా అని తత్తరపడుతూ దగ్గరగా ఉన్న ఒక నువ్వుచెట్టుపైకెక్కాను. ఆ ఏనుగూ చెట్టుదగ్గరికి వచ్చింది. చెట్టును బలంగా తొండంతో ఊపసాగింది. నేను క్రిందపడలేదు కానీ నువ్వుచెట్టు గింజలు అసంఖ్యాకంగా రాలిపడ్డాయి. ఆ నువ్వులు ఏనుగు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా, దాని పాదాల క్రింద పడి నలిగాయి. వాటినుంచీ నూనె రావడం మొదలయింది.

కాసేపటికి అక్కడ నూనెతో ఒక ఊబి ఏర్పడింది. ఆ ఊబిలోనికి పాపం ఆ యేనుగు కూరుకుపోయి ఆకలి దప్పులకు అలమటిస్తూ చచ్చిపోయింది.

ఆపైన నేను క్రిందికి దిగి ఏనుగు చర్మం ఒలుచుకున్నాను. ఆ చర్మంతో ఒక సంచీ తయారు చేసుకుని, పదిమణుగుల నూనెను త్రాగి, పక్కనున్న రేగుపళ్ళు ఒక్క మణుగు తిని, మిగిలిన నూనెనంతా చర్మపు సంచీలో వేసుకుని ఇంటిదారిపట్టాను. బరువు ఎక్కువవడంతో గ్రామం మొదట్లో మర్రిచెట్టుకు ఆ సంచీ వేలాడగట్టి ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర ఆడుకుంటున్న పిల్లలకు “ఊరి మొదట్లో ఉన్న చెట్టుకు సంచీ ఒకటి వేలాడుతుంది, పట్టుకు రండర్రా” అని చెప్పాను. వాళ్ళక్కడికి వెళితే సంచీ కనిపించలేదు. వాళ్ళు సరేనని ఆ చెట్టును వేర్లతో సహా పీక్కుని ఇంటికి తీసుకు వచ్చారు. ఈ ఘటన జరిగి ఎంతో కాలం కూడా కాలేదు. ఆపైన ఇదుగో మీకోసం ఇక్కడికి వచ్చాను.

చివరి ధూర్తురాలు ఖండపాన ఆ కథను సత్యమేనని, అందులో కల్పనాదూరమైన విషయాలున్నవన్న విషయాన్ని ఖండించింది.

భారతంలో – మత్తగజం తాలూకు మదజలంతో బురద ఏర్పడ్డం అన్న విషయం ఉంది. మదజలంతో బురద ఏర్పడినప్పుడు మదపుటేనుగు తొక్కిడికి నువ్వులనూనె బురద ఏర్పడ్డంలో ఆశ్చర్యం లేదు. భీమునిచేతిలో మరణించిన ఒక రాక్షసుడు ఒక ఎనుము, పదహారు బండ్ల అన్నం, వేయి పీపాల సారాయం త్రాగడం భారతంలో సాధ్యమైనప్పుడు నువ్వు ఒక్క మణుగు రేగుపళ్ళు ఎందుకు తినరాదు? రామాయణంలో కుంభకర్ణుడు తినే తిండి ముందు నీ తిండి యే పాటి? శాస్త్రాలలోనిఒకానొక ఋషి (అగస్త్యుడు) అన్ని సముద్రాలనూ త్రాగాడు. (మహాభారతం అరణ్యపర్వం) మరొక ఋషి (జహ్నుమహర్షి) గంగపై కోపించి దాన్నితాగేశాడు. (రామాయణం బాలకాండ) ఆపై వెయ్యి సంవత్సరాలు దాన్ని అక్కడే బంధించాడు. (ఈ విషయం రామాయణంలో లేదు) ఆ మహర్షి పేరుమీదే గంగ జాహ్నవి అయింది. శాస్త్రాలలోని ఈ విషయాలముందు నీవు త్రాగిన పదిమణుగుల నూనె లెక్కకే రాదు.

శసుడు: మరి అంతపెద్ద నూనెసంచీని నేను గ్రామానికి మోసుకురావడం నీకు ఆశ్చర్యంగా అనిపించలేదా?

ఖండపాన అందుకు గరుడపురాణకథను చెప్పింది. గరుడపురాణంలో గరుడుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి తీసుకువచ్చి మరొకచోట నాటుతాడు. ఆ నాటిన స్థలమే లంక. ఒక పక్షే ఒక చెట్టును మోసుకు వచ్చినప్పుడు నీవు చేసినపని సాధ్యమేనంది. ఇంకా రామాయణ, భాగవతాలలోనూ దృష్టాంతాలు చూపింది.

ఖండపాన చెప్పిన ఆఖరు కథ:

యవ్వనంలో నేనొక అపూర్వలావణ్యవతిని. ఓ మారు నేను చతుర్థస్నానం చేసి శయనాగారంలో నిద్రిస్తూంటే గాలి నాపై మోహంతో నన్ను చేరుకుని రతిక్రీడ సలిపింది. ఫలితంగా నేను గర్భం ధరించాను. నెలలు నిండిన నాకు ఒక పుత్రుడుదయించినాడు. అయితే వాడు పుడుతూనే ఏదో గొణుగుతూ నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఆ స్వానుభవం. నమ్మితీరాలి. నమ్మకపోతే గాలి వలన ఎలా పుత్రుడు జన్మిస్తాడో చెప్పాలి.

మూలదేవుడు భారతం ద్వారా ఖండపాన కథ తాలూకు సంబద్ధాన్ని నిరూపించాడు. అయినప్పటికీ ఆగక ఖండపాన అనుబంధ ప్రశ్నలు వేయడం కొనసాగించింది. ఆయా ప్రశ్నలకు ఐలాషాఢుడు, మూలదేవుడు సమాధానాలు చెప్పారు.

అప్పుడు ఖండపాన కుపితురాలై ప్రశ్నించింది. మీకు నేనెవరో తెలుసా? మూలదేవుడు అన్నాడూ – “నీవు పాటలీపుత్రంలో గౌతమగోత్రజుడైన నాగశర్మ సోమశ్రీ అనే దంపతుల కుమార్తెవి. నీ పేరు జగత్ప్రసిద్ధం”.

అప్పుడామె అంది. – “నా రూపలావణ్యాలు చూసి అలా భ్రమపడుతున్నారు. నేను అక్కడి రాజు తాలూకు చాకలివాళ్ల అమ్మాయిని. నా పేరు దగ్ధికా. నేను వేయిమంది అనుచరులతో కూడి అంతఃపురానికి చెందిన బట్టలు ఉతికేదాన్ని. ఓ మారు బట్టలు ఉతకటానికి గంగానదికి వెళ్ళాను. బట్టలు ఉతికి నా అనుచరులు ఒడ్డున ఎండబెడుతుంటే ఒక పెద్ద సుడిగాలి బయలుదేరి ఆరవేసిన వస్త్రాలు గాలికి కొట్టుకుపోయాయి. ఆ వస్త్రాల వెంత అందరూ పరిగెట్టారు కానీ అవి దొరకలేదు. అందరూ భయపడుతూంటే నేను ధైర్యం చెప్పాను. కానీ రాజు సమక్షానికి వెళ్ళడానికి ధైర్యం చాలక, కాసేపు ఆవుగా, కాసేపు అశోకచెట్టుకు అల్లుకున్న తీవెగా రూపాలు మార్చుకుని కాలక్షేపం చేశాను. రాజుకు బట్టల విషయం తెలియనే తెలిసింది. రజకులకు భయపడిన వస్త్రాలు తిరిగి వస్తే తను ఆ వస్త్రాలను దండించనని రాజు అభయమిచ్చాడు.”

శసుడు కామరూప వృత్తాంతానికి సమాధానం చెప్పాడు. ఖండపాన చివరి అస్త్రం ప్రయోగించింది.

“ఇందాక వస్త్రాలు ఎగిరిపోయాయన్న కథ చెప్పాను కదా, ఆ సమయంలో నా అనుచరుల్లో నలుగురు ఆ బట్టల వెనక పడి పరిగెత్తుతూ ఇంతవరకు రానేలేదు. ఆ నలుగురూ మీరేనని నాకు తెలుసు.ఈ వృత్తాంతం ఒప్పుకుంతే మీరు నాకు దాసులు కండి. ఒప్పుకోకపోతే నా భోజనం సంగతి చూడండి.”

నలుగురు ధూర్తులు సిగ్గు పడ్డారు. వాళ్ళు తమ ఓటమిని ఒప్పుకుని ఆమెను ప్రశంసించారు. బయట జోరుగా వర్షం కురుస్తోంది. భోజనం సంపాదించడానికి ఉపాయం చెప్పమని ఆమెనే అడిగారు.

ఆమె సమీపంలో ఉన్న శ్మశానానికి వెళ్ళింది అక్కడొక బాలుని మృతదేహం ఉంది. దాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి ఒక శ్రేష్టి దగ్గరకు వెళ్ళింది. శ్రేష్టి ఆమెను గెంటివేయమని నౌకర్లకు చెబితే ఆ నౌకర్లను ఆమె మంత్రశక్తితో స్పృహపోగొట్టి శ్రేష్టిని తనే బాలుణ్ణి హత్యచేశాడని రాజుకు చెబుతానని బెదిరించింది. శ్రేష్టి కాళ్లబేరానికి వచ్చి ఒక ముద్రికను ఆమెకు ఇచ్చాడు. ఆ ముద్రికతో ఆమె తన వాసం చేరుకుని, మిగిలిన ధూర్తులకిచ్చి ఆ ముద్రికతో వెచ్చాలు కొని వంట చేయమని ఆజ్ఞాపించింది.

***********************************************************************************

ప్రతి రచనలోనూ స్వీకార్యమైన అంశాలు, స్వీకార్యం కానివి రెండూ ఉంటాయి. రచన తాలూకు సమగ్రమైన సారాంశం ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం అయినప్పుడు ఆ ఆక్షేపణీయమైన అంశాన్ని గుర్తించి వ్యాఖ్యానించటమో, విమర్శించటమో చేయటం ఒక ఉన్నతస్థాయికి సంబంధించిన లక్ష్యం. మతగ్రంథాల విషయంలో ఈ పని మరింత నిశితంగా జరుగవలసి ఉంటుంది. ఎందుకంటే భారతీయ మతసారస్వతానికి మౌఖిక సాహిత్యాం మూలాధారం. తరం నుంచి తరానికి మౌఖికంగా విషయసంగ్రహం జరుగుతున్నప్పుడు అలౌకిక లషణాలు, అభూతకల్పనలు జొరబడడం అనివార్యం. వీటిని మాత్రమే సారాంశంగా గ్రహించి ధూర్తవ్యా(ఆ)ఖ్యానం చేయడం అంత మంచిది కాదని అనిపిస్తుంది. మతప్రచారం తాలూకు మత్తు వీడడం మహాపండితులకూ అసాధ్యమేమో!

ఇదే మాట ధూర్తాఖ్యానికీ వర్తిస్తుంది. ఇందులోని పౌరాణిక అపహాస్యాలను స్వీకరించకపోయినా ఈ విలక్షణ కథాసంవిధానం మాత్రం ఆస్వాదనీయం. satire ను హాస్యంతో మేళవించడం ఈ రచనలోని విశిష్టత. నాట్యశాస్త్రంలో ప్రహసనం అన్న రూపకభేదం హాస్యం కోసమే ప్రత్యేకించినప్పటికీ, ఒక కథగా బహుశా ఈ ప్రక్రియతో ఒక సమగ్రమైన రచన రూపొందడం ధూర్తాఖ్యానంతోనే మొదలై ఉండవచ్చు. ఇలాంటి కథ, వినూత్నమైన ప్రక్రియ ఒకటి ఆ రోజుల్లో సృష్టించాలంటే ఎంతో ధైర్యం కావాలి. మతప్రచారం సాగించటానికి అన్యమతగ్రంథాలపైన ఇటువంటి ప్రయోగాలు చేయటం – సమర్థనీయమా కాదా అన్న సందేహం వచ్చినప్పటికీ, చరిత్ర తిరిగి వ్రాయలేం కనుక ఈ విలక్షణమైన ప్రయోగం ఒకటుందని తెలుసుకోవడం కొన్ని విషయాల అవగాహనకు తోడ్పడుతుంది. ఇలాంటి ఒక పుస్తకం వ్రాయాలంటే అప్పటికాలంలో బహుశా ప్రాకృతంలో మాత్రమే సాధ్యమయ్యే పని యేమో. ఈ అర్ధమాగధి రచనను సంస్కృతం లో సంఘమిత్రుడు అనువదించాడు. గుజరాతీ, హిందీ భాషల్లోనూ ఈ రచనను అనువాదం చేశారు. కథాశిల్పం, అక్కడక్కడా సునిశితమైన హాస్యం చెప్పేవిధానంలో కొత్తదనం, లక్ష్యం ధూర్తమైనా, పరిశీలనలో సూక్ష్మత, ఇటువంటి అంశాలను మెచ్చుకోదగ్గ

ఈ పుస్తకానికి ప్రచారం పెద్దగా లేదు.కారణాలు అనేకం.