కాళిదాసు కధ !

శ్రీమతి శారద పోలంరాజు గారు చెప్పిన కాళిదాసు కధ వారికీనా కృతజ్ఞలతో

.

భార్య శాపం ఇచ్చిన తరువాత అక్కడ నుండి బయటకు వెళ్ళిన కాళిదాసు వేశ్యాలోలుడౌతాడు.

అద్భుతమైన రచనలు చేస్తూ భోజుడి సభలో పండితుడిగా పేరు పొంది ఎన్నెన్నో రచనలు చేస్తాడు.

కాని రాజుకు కాళిదాసుకు తరుచుగా వాగ్వివాదాలు జరగటం కాళిదాసు అలిగి రాజ్యం వదిలి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది.

అట్లా ఒకసారి రాజు కోపంలో కాళిదాసుకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. అతను వెళ్ళి ఒక వేశ్య ఇంట తలదాచుకొని అఙ్ఞాతంలో నివసిస్తూ ఉంటాడు.

ఆ సమయంలో భోజుడు రామాయణం చంపూ కావ్యం రచిస్తాడు. ఆ కావ్యం కాళిదాసు చదివి సవరణలు చేయాలని ఆయనకు ఆరాటం. కాని కాళిదాసు ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు.

కాళిదాసు కవితాప్రాభవం తెలిసిన రాజుగారు ఒక సమస్యా పూరణం చేయమని ప్రకటిస్తాడు. పూరించిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని కూడా అంటాడు.

"కుసుమే కుసుమోత్పత్తిః శృయతే న చ దృష్టతే"

అంటే ఒక పుష్పం మీద మరో పుష్పం పూసింది అన్న మాట వినటమే కాని ఎక్కడా చూడలేదు.

ఈ సమస్యకు పూరణ కేవలం కాళిదాసే చేయగలడు అన్న నమ్మకం రాజుకు.

రాజుగారి ప్రకటన చూసిన కాళిదాసుకు ఆశ్రయమిచ్చిన వేశ్యకు దురాశ కలుగుతుంది. ఎట్లాగయినా కాళిదాసు చేత ఆ సమస్య పూరణ చేయించి అర్ధ రాజ్యం తానే పొందాలన్న ఆలోచన వస్తుంది.

తన ఇంటి గోడ మీద కాళిదాసుకు కనబడేలాగా ఆ పాదం రాస్తుంది.

చదివిన కాళిదాసు దాని కింద

"బాలే! తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం" (కొందరు "బాలే! తవ ముఖాంభోజే నయనేందీవర ద్వయం"......మరి కొందరు, "బాలే! తవ ముఖాంభోజే కథం ఇందీవర ద్వయం")

అంటే బాలికా నీ ముఖకమలము మీద పద్మలోచనద్వయం ఉన్నాయి అన్న అర్ధం.

అది చూసిన ఆ దుర్మార్గురాలు రాజ్యం సంపాదించాలన్న కోరికతో, కాళిదాసును తల మీద కొట్టి ఒక గుంటలో పడేసి ఆయన చనిపోయాడనుకొని పైన రాళ్ళు కప్పి ఆ సమస్య పూరణ రాజుగారి వద్దకు తీసుకెళ్తుంది.

ఉన్నదున్నట్టు పూరణం చదివేస్తుంది. కాని ఆమె అక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తుంది.

ఆ పాదం పురుషుడు స్త్రీని సంభోధించిన విషయం రాజు గమనిస్తాడు. వెంటనే ఆమెను నిలదీసి ఈ సమస్యాపూరణం చేసినది ఎవరు అని ప్రశ్నిస్తాడు.

ఇంక చేసేది లేక ఆ వేశ్య తాను చేసిన ఘోర కృత్యం వివరిస్తుంది.

వెంటనే రాజు హుటాహుటిన తన చంపూ కావ్యం తిసుకొని కొనప్రాణంతో కొట్టుకుంటున్న కాళిదాసు వద్దకు చేరుకొని తన కావ్యం వినిపించటం మొదలెడతాడు.

కాళిదాసు ఆ స్థితిలోనే కొన్ని సవరణలు సూచిస్తూ, సుందరకాండ చివరి పద్యం పూర్తవగానే ప్రాణాలు వదులుతాడు.

కాళిదాసుకు వినిపించలేక పోయిన దుఃఖంలో రాజు తాను రాసిన కావ్యంలో మిగిలిన రెండూ అంటే యుద్దకాండ ఉత్తరకాండ చించి పారేస్తాడు.

ప్రపంచానికి భోజుడి రామాయణ చంపూ కావ్యం కేవలం సుందరకాండ వరకే లభ్యం అని ప్రతీతి.

ఒక స్త్రీ (కాళి) వల్ల గొప్ప పండితుడై, మరో స్త్రీ (భార్య) శాపానికి గురై స్త్రీలోలుడై ఒక నీచురాలి వల్ల అంతమౌతాడు ఆ మహా కవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!