“కః పూర్వః” ..మాది నరసరావుపేట” !

“కః పూర్వః”  ..మాది నరసరావుపేట”  !

.

 

పరాభవ నామ సంవత్సరంలో (1966) జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీస్వామివారి శిష్యవర్యులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామివరేణ్యులు చాతుర్మాస్యదీక్షావ్రతులై  ఉజ్జయినిలో ఉన్నప్పుడు ఉత్తరాదిలోని

 పద-వాక్య-ప్రమాణ పారావార పారంగతులందఱూ వారి సన్నిధిసేవకై ఏతెంచిన తరుణం. 


.


ఆ రోజు ఉజ్జయినిలో విద్యార్థుల సంస్కృతభాషా వక్తృత్వప్రదర్శనం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఒక పధ్నాలుగు – పదిహేనేళ్ళ పిల్లవాడు 

తనవంతు రాగానే సంస్కృతంలో నిరర్గళమైన ధారాశుద్ధితో, ఉజ్జ్వలమైన తేజస్సుతో, మేఘగంభీరమైన కంఠస్వరంతో ఉద్దండపాండితీమండితంగా, 

మధ్య మధ్య ఛందోమయవాణీభణితిపూర్వకంగా సర్వజనాహ్లాదకరంగా వక్తవ్యాంశాన్ని పురస్కరించుకొని ప్రసంగించాడు. 

విద్వత్పరిషత్తు విభ్రాంతి చెంది, పెద్దలందఱూ నిండైన మనస్సుతో మెండైన ప్రశంసలుఉట్టిపడేకన్నులకాంతివెల్లువనుఆపిల్లవాడిపై

వెల్లివిరియింపజేస్తున్నారు.రాంకవ పుస్తకాది ప్రోత్సాహక పురస్కారాలు పూర్తయిన తర్వాత,

 శ్రీమదభినవ విద్యాతీర్థస్వాముల వారు ఆ పిల్లవాడికేసి చూస్తూ, “కా పూర్వః?” అని ప్రశ్నించారు.

ఏది పూర్వం? సృష్టికంటె, సృష్ట్యాదికంటె, అన్నింటికంటె మునుపటిది ఏమిటి? అని కాబోలు ఆ ప్రశ్నార్థం. పిల్లవాడిని అడిగే ప్రశ్నేనా అది? అని పెద్దలు, పండితులందఱూ తెల్లపోయారు.

వేదలతాంతాలైన ఉపనిషత్తుల కుదుళ్ళ నుంచి పుట్టిన అపురూపమైన ప్రశ్నమని అందఱూ అనుకొన్నారు.

.


 “అమ్మో, నీ ప్రశ్నకు సమాధానం చెప్పటమే!” అని. ఇదీ అటువంటిదే. అంతేకాదు. పండితపరిషత్తులో పెద్దల ముందు ఎన్ని ఉదాహరణలతో ఏమని చెప్పినా శాస్త్రవాదం “అథాతో బ్రహ్మజిజ్ఞాసా” అంటూ మళ్ళీ మొదటికే వస్తుంది.  ఏమని బదులిచ్చినా అంతకు ముందు మఱేదో ఉండేదని ఏ శాస్త్రమో, పురాణమో చర్చకు రాకుండా ఉంటుందా? ఏదో వక్తృత్వాన్ని ప్రదర్శించినంత మాత్రాన అడిగిన ప్రశ్నకల్లా ఆ చిన్న పిల్లవాడు సమాధానాలు చెప్పాలని లేదు కదా!

,


అదీగాక, జగద్గురువుల వారు “కః పూర్వః” అని అడగకుండా లింగవ్యత్యయం చేసి, పుంలింగమైన పూర్వ శబ్దానికి మునుపు “కా” అని స్త్రీలింగాన్ని ప్రశ్నార్థకంగా జోడించారు.  అన్నింటికంటె పూర్వం ఉండినది పరాశక్తి అన్న స్త్రీత్వభావంతో అడిగితే మాత్రం, ఆ అవతారపురుషుని నోట లింగవ్యత్యయపూర్వకమైన అపశబ్దం దొర్లుతుందా? 

లేక, విద్యార్థి తెలివితేటలను ఆ విధంగా పరీక్షించాలనుకొన్నారా?

.

ముసిముసి నవ్వులతో తండ్రిగారికేసి చూస్తున్న ఆ పిల్లవాడికేసి చూస్తున్నారు అందఱున్నూ. ఏమంటాడోనని ఆసక్తిగానూ, జగద్గురువులవారి దృష్టిని అంతగా ఆకర్షించినందుకు అమితాశ్చర్యంగానూ. అదే ప్రశ్న నన్నడిగితే ఏమి చెప్పాలని కొంద ఱాలోచిస్తున్నారు.

.

ఆ పిల్లవాడి ఆత్మవిశ్వాసం చూడండి: “మాది నరసరావుపేట” అన్నాడు.

సభ సభంతా విస్తుపోయింది. మహాపండితుల కరతాళధ్వనులు మిన్నుముట్టకుండా ఉంటాయా?

.

“పూః పురీ” అని అమరకోశం. జనములచే పూరింపబడేది కాబట్టి పురమునకు “పూః” అని పేరు. “పూః” శబ్దం స్త్రీలింగం. “కా పూః వః” అని ఆ పిల్లవాడి విఱుపు. వః = మీ యొక్క; పూః = పురము; కా = ఏమిటి అని. మీ ఊరేమిటి? అన్నమాట. “నరసరాట్ పూర్ నః” అన్నాడు. మా ఊరు నరసరావుపేట అన్నాడు.

మాతృశ్రీ అనంతలక్ష్మమ్మ గారు, తండ్రి వేంకటేశ్వర అవధాని గారు ఇంటికి వెళ్ళి దిష్టి తీశారో లేదో. ఎన్ని జన్మల పుణ్యఫలం కాకపోతే అటువంటి కొడుకును కనటం సంభవిస్తుంది కనుక!

.

ఆ పిల్లవాడి పేరు తంగిరాల సీతారామాంజనేయులు. పల్నాటి సీమలో అలుగుమల్లెపాడు నుంచి నరసరావుపేటకు వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది. పసిపిల్లవాడుగా ఉండగానే కావ్యశాస్త్రాలలో, వేదవిద్యలలో, సంస్కృతాంధ్రాలలో ఆ బాలసరస్వతి అనుభవాన్ని చూసి బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారంతటివారు ముచ్చటపడి మెచ్చుకొని మరీ దీవెనలు కురిపించారు.

.

ఆ బాలుడే, ఇప్పుడు యుగయుగాంతరానుగత కర్కశ సమస్యల సంక్షోభంలో అల్లకల్లోలమై ఉన్న జగత్తుకు కర్తవ్యాన్ని తెలియజెప్పి సన్మార్గోపదేశం చేస్తూ శ్రీ శృంగేరీ జగద్గురు మహాపీఠాన్ని అధిష్ఠించిన అపర శంకరాచార్యులు, యతిసార్వభౌములు, ధర్మప్రచార దృఢదీక్షావ్రతులు, జగదేకవిద్వాంసులు, శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి కరకమలసంజాతులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివరేణ్యులు. 

Comments

  1. శారదాంబ పుంభావ స్వరూపులగు జగద్గురువుల గురించిన ఒక గొప్ప పూర్వాశ్రమ విశేషం చదవగలగటం జన్మాంతరపుణ్యఫలం. ధన్యోస్మి!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!