Saturday, January 26, 2019

.పద్మశ్రీ ప్రకాశరావు గారు .🌹

పద్మశ్రీ ప్రకాశరావు గారు .🌹

🌺🌺🌺🌺🌺

లవ్ యూ బాబాయ్..మీలాంటిల వాళ్ళుండబట్టే యగాంతాలు ఆగిపోతున్నాయ్..లేకపోతే ఈ పాడులోకం పాడు జనాల చేసే కుల,వర్ణ,మత,డ బ్బు రాజకీయాలకు భూమి ఎప్పుడో అనంతవాయువుల్లో కలిసిపోయేది

టీ ఆమ్మే తెలుగు వాడికి పద్మశ్రీ గౌరవం… ఎవరాయన, ఏమాకథ

తెలుగు పత్రికల్లో ఒక వార్త ఈ రోజు కనిపించలేదు. తెలుగువాళ్లకు పద్మశ్రీ వచ్చినట్లు పత్రికల్లోవచ్చిన పేర్లలో ఒక పేరు మిస్ అయింది. ఆయన చాలా చిన్నవాడు, జీవితంలో తళుకులు బెళుకులు లేని వాడు. ఎపుడూ సంపాదన మీద దృష్టిపెట్టని వాడు. ఉన్నదాంట్లో సగం, అది ఇల్లూ కావచ్చు, సంపాదన కావచ్చు, ఎపుడూ పేద పిల్లలతో పంచుకునేవాడు. ఆయనే దేవరపల్లి ప్రకాశ్ రావు. ఒరిస్సాలోని కటక్ లో టీ బంకు నడుపుతూ ఉంటాడు. తన టీ స్టాల్ తో ఆయన విప్లవం తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రకాశరావు చాలా కిందట ఒరిస్సా వెళ్లి, అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి చవరకు టీ బంకుతో సెటిల్ అయ్యారు. అయితే, తానుంటున్న బస్తీలో పేద పిల్లలకు స్కూల్ లేకపోవడంతో తన చిన్న ఇంట్లో నే స్కూల్ తెరిచారు. తన సంపాదనలో సగంతో పిల్లల మీద ఖర్చ పెట్టి చాలా పెద్ద వాడయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ దాకా ఆయన కీర్తి రాకపోయినా, ప్రపంచమంతా ఆయన నీరాజనాలు పట్టింది. ఈ రోజు ఆయన పద్మశ్రీ ప్రకటించారు. ఆయన కథ ఇది…

*

ఒదిషా కటక్ లో బక్సిబజార్ అని ఒక బస్తీ ఉంది. అక్కడ ఉండేవాళ్లంతా కూలీనాలి చేసుకునే వాళ్లు, రిక్షా తోలేవాళ్లు, ఇతర కంటికి ఆనని చిన్న చిన్న పనులు చేసి బతు కు వెళ్లదీస్తున్న వాళ్లు. భారత దేశంలోని అన్ని బస్తీల లాగానే ఇది కూడా ఒక మురికి వాడ. ఈ మధ్య హఠాత్తుగా ఈ బస్తీ వార్తలకెక్కింది. జాతీయ, అంతర్జాతీయ విలేకరులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ఎన్జీవోల ప్రతినిధులు బస్తీకొస్తున్నారు. బస్తీ పేరు ఎక్కడ చూసిన మారుమ్రోగుతూ ఉంది. తాజాగా ఈ మధ్య జిల్లాకలెక్టర్ కూడా వచ్చి పోయారు. దీనికంతటికీ కారణం, అక్కడున్న ఒక చిన్న చాయ్ దుకాణం, దాన్నినడిపే తెలుగోడు ఈ ప్రకాశ్ రావు.

ప్రకాశ్ రావుతో ఫోన్లో మాట్లాడండి, తెలుగులో బాగున్నార అనడగండి. అంతే ఆయన అనర్గళంగా తెలుగులో సంభాషణ మొదలుపెట్టి, మధ్య మధ్య ఒడియాలో కి దూకుతూ, ఇంగ్లీష్ లో అలవోకగా మాట్లాడుతూ, అపుడపుడు హిందీ వాడుతూ మిని ఇండియాలా ప్రత్యక్షమవుతాడు. ప్రకాశ్ రావు ఖాయిలాపడి, చచ్చిబతికినవాడు. అపరేషన్ జరుగుతున్నపుడు ఎవరో అనామకుడు చేసిన రక్తదానంతో బతికి బయటపడ్డాడు. ఈ రోజు ‘ఇంత వాడు’ అయ్యాడు. ఇది జరిగి 40 సంవత్సరాలయింది. అప్పటినుంచి చావుబతుకుల్లో ఉన్నవాళ్లకి రక్తదానం చేసితీరాలనుకున్నాడు. రక్తమే కాదు, ఎంత సహాయం చేయాలో అంతచేయాలనుకున్నాడు. చేస్తున్నాడు. ఆయన రక్తదానం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.

అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్ లెట్స్ దానం చేశాడు. ఇపుడు, పేద రోగులకు అసుప్రతిలో వేడి నీళ్లిందిస్తాడు, పాలు, బ్రెడ్ అందిస్తాడు, వీలయితే, పళ్లు కూడా అందిస్తాడు. ఇది రోజూ జరిగే ప్రక్రియ. ప్రకాశ్ రావు సేవ చూసి ఒక పెద్ద మనిషి ఆయన గీజర్ కొనిచ్చాడు, అధికారులు ఆసుప్రతిలో ఒక గది ఇచ్చారు. మరొకరెవర్ అంబులెన్స్ ఇచ్చారు. ఇంతకంటే మరొక ముఖ్యవిషయం ఉంది. బస్తీలో పిల్లలెవరు చదువుకోవడం లేదని, చిల్లరు తిరుగుళ్లో ఉన్నారని కనిపెట్టి, పరిస్థితి మార్చాలనుకున్నాడు.

అంతే, తన రెండుగదుల ఇంటిలో ఒక గదిని స్కూలుగా మార్చేశాడు. పిల్లలని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చి, పుస్తకాలు కొనిపించి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ‘ మొదట్లో తల్లిదండ్రులు నన్నుతిట్టారు. మాపిల్లలకు పాచిపనికి వెళ్లి నాలుగు రూకలు తెచ్చే వాళ్లు. నువ్వు బడిపెట్టాక, వీళ్లు పనిమానేస్తున్నారని దబాయించారు. వాళ్లని ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను. చివరకుభోజనం నేనే పెడతాను అనిచెప్పి వాళ్ల అంగీకారం పొందాను. ఇపుడు నా గది స్కూలయింది. 70 మంది విద్యార్థులు, అయిదుగురు టీచర్లున్నారు. టీచర్ కు రు. 1500 ఇస్తాను.అందరికి భోజనం ఉచితం,’ అని ఎషియానెట్ కు ఫోన్లో వివరించాడు.

ఈ ఖర్చెవరిస్తున్నారు?

‘ఇదంతా నా సొంత డబ్బే. టీ స్టాల్ లో బన్ బిస్కట్ లతో పాటు వడలు కూడా ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పోను రు. 600 దాకా మిగులుతుంది. అందులో స్కూల్ కోసం రు. 300 ఇస్తాను. నాకుటుంబానికైనా తగ్గిస్తాను, బడి ఖర్చు తగ్గించను. అది జీవితధ్యేయం. చిన్నపుడు డాక్టర్ కావాలని నాకు కల ఉండేది.పేదరికం, అనారోగ్యం వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల ఈ పిల్లలను చదివిస్తున్నాను. కొంత మంది మెట్రిక్ లేషన్ పాస్ అయ్యారు కూడా,’ అని స్కూల్ ప్రగతి గురించి వివరించాడు.

’మధ్యాహ్నబోజనానినికి రోజూ రు. 8 కావాలి, అయితే, అంత లేదు. అందువల్ల ఉన్నంతలో చేస్తున్నాను. ఈ మధ్య కలెక్టర్ వచ్చి అభినందించారు. మధ్యహ్నం భోజనం పథకాన్ని మాస్కూల్ కు పొడిగించాలని కోరాను. అయితే, రూల్స్ ప్రకారం ప్రయివేటు స్కూళ్లకు పథకం వర్తించదని చెప్పారు,’ అని అంటూ దీనితో తాను నిరుత్సాహ పడటం లేదు అని అన్నాడు.పొద్దున పూటంతా చాయ్ దుకాణం నడిపి, మధ్యాహ్నం టీచర్ అవతారం ఎత్తుతాడు ప్రకాశ రావు. ఈ మద్య లో ఒక రౌండ్ సైకిలేసుకుని ఆసుప్రతికి వెళ్లడం ఆయన రోజు వారి పని.

ఇంతకీ ప్రకాశరావు ఎవరు?

ప్రకాశరావు ముత్తాత దేవర పల్లి అప్పాలస్వామి. 1888 ప్రాంతంలో పిల్లా జెల్లా వేసుకుని నడుచుకుంటూ తూర్పు దేశ యాత్ర ప్రారంభించారు. చివరకు వాళ్ల ఒరిస్సా కటక్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో మకాం వేశారు. అదిపుడు తెలంగపెంటగా మా రింది. తాత మంచి వంటగాడు కావడంతో బ్రిటిష్ వాళ్ల దగ్గిర కొలువు కుదిరాడు. బెంగాల్ అస్సాం తిగిరి చివరకు తెలంగపెంట కే వచ్చాడు. తండ్రి కృష్ణ మూర్తి రెండోప్రపంచయుద్ధకాంలోసైన్యంలో బర్మాలోపనిచేసి తిరిగొచ్చాడు. కొద్ది రోజులు ఒక ప్రయివేటు కంపెనీలో అర్క్ వెల్డర్ గా పనిచేశాడు. 1960లో టీ స్టాల్ తెరిచాడు. అయితే, తండ్రి చనిపోవడం, తర్వాత టిబి వ్యాధి సోకడంతో ప్రకాశ్ రావు చదువు మానేసి టీస్టాల్ బాధ్యత తీసుకున్నాడు.

అంతర్జాతీయ అవార్డు :

ఈ మధ్య బిసెంట్ సెల్స్ లెస్ సర్వీస్ అవార్డు-2016కి ఆయన ఎంపిక అయ్యారు. ఆయనకు గతంలో చాలా అవార్డులొచ్చాయి. ఇపుడాయన కీర్తి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. ఇపుడాయన వయస్సు 59 సంవత్సారాలు.ప అలసటలేదు, విశ్రాంతి లేదు. ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ఉత్సాహంగా చెబుతాడు.

నీకింత ఉత్సాహం ఎలా వచ్చిందంటే… ‘ఇద్దరు కూతుర్లున్నతండ్రికి కొంచెం గర్వం ఉండాలి. నాకు ఇద్దరు కూతుర్లు. బాగా చదువుకున్నారు. స్థిరపడ్డారు. అదే నా ఉత్సా హానికి అసలు కారణం. నాస్కూళ్లో కూడా అడపిల్లలకు ప్రాధాన్యం.’ అని ముగిస్తాడు. కటక్ ఒకసారి రండి, మా స్కూలుపిల్లలను చూడాలి మీరు- అని ఫోన్లో పలకరించిన వారందరిని ఆహ్వానించడం ఆయనకు అలవాటు.

పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయనకు అభినందనలు చెప్పండి. ఫోన్ నెంబర్. 09861235550

🌹🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🌹 .…


Thursday, January 24, 2019

🌹🌺సుభద్రా పరిణయం.🌺🌹

🌹🌺సుభద్రా పరిణయం.🌺🌹


(విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. )


🥀🥀🥀🥀

క్లుప్తంగా కథ:


ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు.


కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో

కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా

కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః

కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్?

.

ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించినా ఒప్పుకోలేదు. ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేపట్టాలని అర్జునుని ఆలోచన. తనవెంట ధౌమ్యుని తమ్ముడి కొడుకు మిత్రుడు ఐన విశారదుడు, మరికొంత పరివారంతో భూప్రదక్షిణకి బయలుదేరాడు.


అలా బయలుదేరిన అర్జునుడు గంగానదీతీరానికి చేరాడు. గంగాతీరం చేరిన అర్జునుడు గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన విశ్రమిస్తాడు. ఆ గంగలో ఉన్న ఉలూచి అనే నాగ కన్య అర్జునిపైన ఎన్నేళ్ళుగానో మరులు కొంది. ఆమె కోరిక తీరే సమయం ఆసన్నమయింది. గంగాతీరాన్న విశ్రమించిన అర్జునుని చూసి"రాజసము తేజరిల్లు నీరాజుఁ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే" అని అనుకొని అతనిని తన నాగలోకానికి తీసుకొని పోయింది. అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఉలూచి అతనికి తన కోరిక వెల్లడించింది. "భూమి ప్రదక్షిణము సేయఁ బోయెడివానిన్ గామించి తోడి తేఁ దగవా? మగువ ! వివేక మించుకైన వలదా ?" అని అడిగాడు. ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు. తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని...

-

చెఱకువిలుకాని బారికి వెఱచి నీదు

మఱుగుఁ చేరితిఁ; జేపట్టి మనుపు నన్నుఁ;

బ్రాణదానంబు కన్నను వ్రతము గలదే?

యెఱుఁగవే ధర్మపరుఁడవు నృపకుమార !

-

అన్నది.

ఆవిధంగా అతనిని ఒప్పించిన ఉలూచికి ఇలావంతుడనే కుమారుడు పుట్టాడు. (ఇదంతా ఒకే రాత్రిలో జరిగింది). మరునాడు ఉదయం తన మిత్రులంతా ఎదురు చూస్తారని వెళ్ళకపోతే వారు కలత చెందుతారని ఉలూచికి నచ్చచెప్పి అక్కడనుండి బయలుదేరి మిత్రులని కలిసి తన భూప్రదక్షిణ ప్రారంభిస్తాడు. అవిధంగా తిరుగుతూ దక్షిణ భారతంలో పాండ్యదేశరాజధాని ఐన మణిపురానికి చేరుకున్నాడు. ఆ రాజ్యానికి రాజు మలయధ్వజుడు. ఆతనికి ఒక కుమార్తె ఉన్నది పేరు చిత్రాంగద. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన అర్జునుడు విశారదునితో పెండ్లికి రాయబారం పంపుతాడు. అర్జునుడు అల్లుడిగా చేసుకునేందుకు మలయధ్వజుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అలావారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోతుంది. కాలక్రమేణా చిత్రాంగద గర్భందాల్చి బబ్రువాహనుడికి జన్మమిస్తుంది. కుమారుని అచ్చట్లు ముచట్లు తీరాక అర్జునుడు మరల తన భూప్రదక్షిణకు బయలుదేరాడు. అలా తిరుగుతూ సౌభద్ర నదిలో శాపగ్రస్తులైన మొసళ్ళకు శాపవిమోచనం కలిగించి అక్కడనుండి పశ్చిమాన్న ఉన్న ద్వారకా నగరానికి చేరుకున్నాడు.


అక్కడికి చేరుకున్నాక అర్జునుడూ శ్రీకృష్ణుని తలచుకొన్నాడు. శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యక్షమయి అతనికి సాధువేషంలో రైవతక పర్వతం మీద ఉండమని అదేశిస్తాడు. మరునాడు అక్కడ ఒక గొప్ప సన్యాసి వచ్చి ఉన్నాడని ద్వారక ప్రజలంతా వస్తారు. బలరామ శ్రీకృష్ణులు కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. అప్పుడు బలరాముడు అర్జునుని నిజమైన సన్యాసిగా భావించి తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ద్వారకకు చేరుకున్నాడు. బలరాముడు అతని సేవకై సుభద్రని నియమిస్తాడు. సుభద్ర ఆ కపట సన్యాసికి సేవలు చేస్తుండగా ఒకనాడు ఆమెకు శకున శాస్త్రం చెప్తాడు. మాటల్లో ఒకనాడు సుభద్ర...

మీ రింద్రప్రస్థముఁ గని

నారా? పాండవులఁ జూచినారా ? సఖులై

వారందఱు నొకచో ను

న్నారా? వీరాగ్రగణ్యు నరు నెఱుఁగుదురా?

.


ఎగు భుజంబులవాఁడు, మృగరాజ మధ్యంబు

పుడికి పుచ్చుకొను నెన్నడుమువాఁడు

నెఱివెండ్రుకలవాడు, నీలంపు నికరంపు

మెఱుఁగుఁ జామనచాయ మేనివాఁడు

గొప్ప కన్నులవాఁడు, కోదండ గుణ కిణాం

కములైన ముంజేతు లమరువాఁడు

బరివి గడ్డమువాఁడు, పన్నిదం బిడి దాఁగ

వచ్చు నందపు వెను మచ్చవాఁడు

.

గరగరనివాఁడు, నవ్వు మొగంబువాఁడు

చ్గూడఁ గలవాఁడు, మేలైన సొబగువాఁడు,

వావి మేనత్తకొడుకు కావలయు నాకు

నర్జునుండు పరాక్ర మొపార్జునుండు.

.

అని అడిగింది.


ఆమె మనసును గ్రహించిన అర్జునుడు తనే అర్జునుడని అసలు విషయం బయటపెడతాడు.

.

నీకై తపంబు జేసెద

నీ కైవడి; దాఁపనేల? యే నర్జునుఁడన్

లోకోత్తర శుభలగ్నం

బో కోమలి! నేడు కోర్కులొడఁగూర్పఁ గదే !

.

అన్నాడు.


తన నిజరూపం తెలియచేసిన ఆర్జునుడు తనని గాంధర్వ వివాహం చేసుకోమని సుభద్రని అర్ధించాడు. సుభద్ర అందుకు ఒప్పుకోలేదు. పెద్దల సమక్షాన్నే కళ్యాణం అని చెప్పివేసింది. చేసేదిలేక ఆమెను వదిలి వేసాడు. పెళ్ళివరకు ఇద్దరు విరహ తాపాన్ని అనుభవించారు. చంద్రుణ్ణి తిట్టుకున్నారు. మన్మధుడిని తూలనాడారు. బలరామునికి ఈ విషయం ఇంకా తెలియదు. అంతా శ్రీకృష్ణుని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. సరైన సమయం చూసి శ్రీకృష్ణుడు వారికి దొంగపెళ్ళి జరిపించాడు. వారి ఆనందానికి అంతులేదు. అంత సుభద్రని తీసుకొనివెళ్ళే సమయంలో యాదవ వీరులు అతనిని అడ్డగించారు. సుభద్ర సారధ్యం చెయ్యగా అర్జునుడు వారందరిని ఓడించి ఇంద్రప్రస్థం చేరుకున్నారు. సుభద్ర వివాహం సంగతి బలరామునికి తెలిసింది. కోపంతో మండి పడ్డాడు. శ్రీకృష్ణుడు జరిగినది బలరాముని కి చెప్పి వారిని శాంతపరిచాడు. వారందరు కలిసి ఇంద్రప్రస్థం చేరి దంపతులను ఆశీర్వదించారు. మరల వారిద్దరికీ ఐదురోజుల పెండ్లి జరిపించారు. వారి ప్రేమకు అనురాగానికి గుర్తుగా అభిమన్యుడు జన్మించాడు.


ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ముఖ్యంగా విజయ నామధేయుడైన అర్జునుని భూప్రదక్షణ, ఉలూచి, చిత్రంగద, సుభద్రలతో వివాహం వరకు వివరించినా కథ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. చక్కని తేట తెలుగు పద్యాలతో ఉండే ఈ కావ్యం, అందరు తప్పక చదవాల్సిన పుస్తకం.


🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺

యస్యామతం తస్య మతం

శుభోదయం .🌹

🌺🌺

యస్యామతం తస్య మతం 

మతం యస్య న వేద సః 

అవిజ్ఞాతం విజానతాం 

విజ్ఞాతమవిజానతామ్.....


🌺🌺🌹🌹🌹🌺🌺


ఎవరైతే తనకు తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును. కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమె తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక.

ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు. దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక.


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Saturday, January 19, 2019

మేఘ సందేశం !

మేఘ సందేశం !

-

మేఘ సందేశం లేదా మేఘదూతం (Meghasandesam or Meghadiootam) సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు రఘు వంశము, కుమార సంభవము)

కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.

1813లో ఈ కావ్యం 'హోరేస్ హేమాన్ విల్సన్' (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది.

మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉంది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని సుశీలకుమార దేవుడు చెప్పాడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి.

మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది.

పూర్వ మేఘం

ఒక యక్షుడు కర్తవ్యాన్ని విస్మరించడం వలన యజమాని శాపానికి గురియై, మహిమలు పోగొట్టుకుని, కొలువునుండి ఒక సంవత్సరంపాటు బహిష్కరింపబడి, ఒక సంవత్సరం పాటు చిత్రకూటం వద్ద రామగిరి అరణ్యాలలో తిరుగాడుతూ ఉన్నాడు. ప్రియురాలి ఎడబాటుతో విహ్వలుడై ఉన్న అతనికి ఆషాఢం సమీపించినపుడు ఒక మబ్బుతునక అతనికంటబడింది. తన వియోగంతో తన ప్రేయసి కృశించి దుఃఖిస్తూ ఉంటుందని తలచిన ఆ యక్షుడు ఎలాగో ప్రేయసిని ఊరడించడానికి తన సందేశాన్ని ఆమెకు అందించమని కోరుతాడు. పుష్కలావర్త సంభూతుడు అయిన మేఘుడు ఉత్తమ కుల సంజాతుడు గనుక ఒకవేళ తన అభ్యర్ధనను తిరస్కరించినా 'యాచనా లాఘవము' (చిన్నతనము) ఉండదని భావించి అతనిని ప్రార్ధిస్తాడు. మేఘుడు వెళ్ళవలసిన మార్గాన్నీ, మధ్యలో కానవచ్చే దృశ్యాలనూ వర్ణిస్తాడు.

మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు మానస సరోవరం దాకా తోడు వస్తాయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన నదీజలాలను ఆస్వాదించు. మధ్యలో పొటమరించిన కార్చిచ్చును ఆర్చేవాడవు గనుక నిన్ను ఆమ్రకూటం మరువలేదు. మధ్యలో నెమళ్ళు అందంగా నిన్ను స్వాగతిస్తాయి. కాని మైమరచి కార్యాన్ని విస్మరించవద్దు సుమా!.

ఇంకా ముందుకు సాగి విదిశానగరం వద్ద వేదవతీ నదీజలాలను ఆస్వాదించు. ఉజ్జయినీ నగరంలోని ఉత్సవాలను తిలకించు. ఏదైనా మేడపైన విశ్రాంతి తీసుకో. మహాకాళేశ్వరుని పూజా సమయంలో మృదంగ నాదంలాగా ఉరిమి ముందుకు సాగు. తరువాత గంభీరానదికి ఎదురు వెళ్ళు. దేవగిరి వద్ద చల్లనిగాలి నీకు సేద తీరుస్తుంది. అక్కడ నువ్వు ఉరిమితే కార్తికేయునినెమలి ఆనందంగా ఆడుతుంది. తరువాత చర్మణ్వతీ నది, దశపురము, బ్రహ్మావర్తము, కురుక్షేత్రము కనిపిస్తాయి. సరస్వతీ నదీజలాలతో పునీతుడవు కావచ్చును. పాలపొంగులాంటి గంగానది ఫైనుండి పయనించి హిమాలయాలను చేరుకో. ఆదిదంపతుల ఆతిథ్యమారగించు. ఒకవేళ గౌరమ్మ కాలినడకన కైలాసం ఎక్కుతూ ఉంటే నీవు మెట్లుగా మారి ఆమెకు సహకరించు. తరువాత మానస సరోవరం జలాలను గ్రోలి ముందుకు సాగగానే కన్నుల పండువుగా అలకా నగరం కనుపిస్తుంది.

ఉత్తర మేఘం[మార్చు]

అలకానగరం శోభ వర్ణనతో ఉత్తర మేఘం భాగం ఆరంభమౌతుంది. యక్షుడు మేఘునితో తన సంభాషణను ఇలా కొనసాగిస్తాడు -

మిత్రమా! అలకానగరం వర్ణనకు అలవి గానంత అందమైనది. అక్కడి అనేకమైన మేడలు నీతో సమానంగా అంబరాలనంటుతుంటాయి. నీ మెరుపు నెచ్చెలి ఎప్పుడూ నిన్నంటిపెట్టుకొని ఉన్నట్లుగా ఆ భవనాలలో సుందరాంగులు శోభాయమానంగా ఉంటారు. వర్ణ చిత్రాలతో, మధుర సంగీత నాదాలతో, ఇంద్రనీల కాంతులతో ఆ భవనాలు అలరారుతుంటాయి. అక్కడ కుబేరుని ప్రాసాదమునకు ఉత్తరాన ఇంద్రధనుస్సులా ఉండే నా భవనం దూరాన్నుంచే కనిపిస్తుంది.కల్పవృక్షము, నీలమణిఖచితమైన సోపానములు గల బావి, కృతక పర్వతము, కన్నులకింపైన వకుళ, అశోక వృక్షములు, ద్వారమున రమ్యమైన శంఖ పద్మములు - ఇవి నాయింటి గురుతులు.

ఆ నా భవనమున ఇంపైన పలువరస, సన్ననైన నడుము, చకిత హరిణీ నయనములు గలిగి, యౌవన మధ్యస్థ యైన ముద్దులొలుకు వయ్యారపు బొమ్మ యున్నది. ఆమెయే నా ప్రియతమ, నా బహిఃప్రాణము, మద్వియోగ సంతప్త. ఒకవేళ ఆమె గనుక నిద్రిస్తూ ఉంటే దయతో సద్దుమణగి వేచియుండుము. తరువాత మెల్లగా మేలుకొలిపి మందస్వరముతో నా సందేశాన్ని వినిపించు.

ఆ సందేశము ఏమంటే - "ఓ కళ్యాణీ! విధి చేత శిక్షింపబడిన నీ కాంతుడు రామగిరి ఆశ్రమమున కుశలముగా నున్నాడు. నీకై కుములుచున్నా గాని, శాపాంతమున తిరిగి లభింపగల భోగములను తలచుకొని ఊరట చెందుచున్నాడు. నీవు బేలవు కాక ధైర్యము తెచ్చుకొనుము. కష్టములు కడతేరక మానవు. మిగిలిన నాలుగు నెలల శాపము త్వరలో ముగియనున్నది. ఆపై అంతా ఆనందమే".

ఇంకా యక్షుడు మేఘునితో ఇలా అన్నాడు - "ఓ జలదా! అన్యమార్గము లేక ఈ దూతకార్యము నీకప్పగించుచున్నాను. నా ధూర్తత్వమును మన్నింపుము. నా దయనీయ స్థితిని చూచి నీవీ సందేశమును అందజేతువని ఆశించుచున్నాను. ఆపై నీ ఇచ్చవచ్చిన యెడ నీవు తిరుగవచ్చును. నీకెన్నటికిని ప్రియ వియోగము సంభవించకుండు గాక".

దయనీయమైన ఆ సందేశమును వినిన మేఘుడు యక్షపురికి అరిగి యక్షిణికి ప్రియుని కుశలవార్తను అందజేసెను. ఆ పడతి ఊరటనందెను. కుబేరుడు కూడా ఈ విషయమునెరిగి కరుణతో శాపమును అంతమొందించెను. అప్పుడా యువ దంపతులు సంతోషాంతరంగితులగుచు ఎక్కువైన భోగములనుభవించిరి.

కావ్యంలో అందాలు..

వర్ణనలలోను, అలంకారాలలోను కాళిదాసునకు గల అసమాన ప్రతిభా శైలి ఈ కావ్యంలో వెల్లివిరిసింది. మచ్చుకు కొన్ని వర్ణనలు.

శిప్రా నదీ తరంగములను తాకి వచ్చు చల్లగాలి ఎలా ఉన్నదంటే, నర్మ వచనాలతో ప్రేయసిని అనునయించే ప్రియుని ప్రవర్తనను పోలి ఉంది.

విరహతాపం ఉపశమించడానికి శయ్యపై పవళించిన యక్షపత్ని తూర్పుదిక్కున అంతంతగా కనుపించు ఏకకళామాత్ర శేషయైన చంద్ర రేఖ వలె నున్నది.

జలదా! అలకాపురిలో ఏడంతస్తుల భవనాలున్నాయి. అందు పైభాగముల నీవంటి నీరదములు గాలికి లోపలికేగి, ఆ భవనములలోని చిత్రాలను తమ జల కణములతో తడిచేసి, ఆ అపరాధం వల్ల భయపడి మెల్లగా పొగలాగా కిటికీలలోంచి నిష్క్రమిస్తాయి . ఇదెలా ఉన్నదంటే - దూతీ సహాయమున రహస్యమార్గంలో అంతఃపురంగలోకి చొరబడి అత్యాచారమొనరించిన ధూర్తుడు ఇతరులకు తెలుస్తుందేమో నని శంకతో, అపరాధ భయంతో, దొంగచాటు దారిలో బయటపడుతున్నట్లు.

అసలు మేఘ సందేశమే ఒక కల్పన. ఈ కల్పనకు దారి తీసిన పరిస్థితులు నేపథ్యంగా విశ్వనాథ సత్యనారాయణఒక అందమైన కల్పనతో వ్రాసిన నవల దూతమేఘము. నేపాలరాజవంశాలను పూర్వరంగంగా తీసికొని అతడు వ్రాసిన ఆరు నవల లలో ఇది ఒకటి. కాళిదాసు మందాక్రాంతవృత్తాల లో మేఘ సందేశం వ్రాయడానికి గల కారణానికి అతడు చేసిన కల్పన పరమ రమణీయంగా ఉంటుంది.

ఎడబాటు కలిగిన ప్రేయసీ ప్రియులు దూతల ద్వారా సందేశములు పంపుట ఇతర పురాణాలలో కానవస్తుంది. - నల దమయంతుల హంస రాయబారము, రుక్మిణీ కృష్ణుల బ్రాహ్మణ రాయబారము, రామాయణమున హనుమంతుని దౌత్యము. సుందర కాండములో రామదూతగా హనుమంతుడు శ్రీరాముని అభిజ్ఞానమును సీతమ్మకు అందజేసే వృత్తాంతానికి, మేఘదూతంలోని కథానుగమనానికి పోలికలున్నాయి. కాని ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రథముడు. చైనీయ కవి నూకాంగ్ తన కావ్యములో మేఘమును దూతగా పంపెనని బహుభాషా కోవిదుడు, వంగ దేశీయుడు అగు హరనాథ పండితుడు వ్రాసెను. కాని నూకాంగ్ క్రీ.శ. ద్వితీయ శతాబ్దమువాడు. కాళిదాసు క్రీ.పూ. మొదటి శతాబ్దమువాడు.

మేఘ సందేశం కావ్యాన్ని అనుసరిస్తూ అనేక రచనలు వచ్చాయి. ఈ కావ్యంలోని ఊహాగానానికి ఉన్న అందం అలాంటిది. వాటిలో సాంగణ కుమారుడైన విక్రమ కవి రచించిన 'నేమి సందేశము'ను ప్రత్యేకంగా పేర్కొనాలి. మేఘ సందేశంలోని ప్రతి శ్లోకంలోనూ చివరి పాదాన్ని మాత్రం యధా తధంగా తీసుకొని విక్రమ కవి తన కావ్యాన్ని రచించాడు. అంటే పూర్తి కావ్యం సమస్యా పూరణంలా రచించాడన్నమాట. ఇంకా 100కు పైగా అనుసరణ రచనలు వచ్చాయి. 12వ శతాబ్దికి చెందిన ధోయి కవి 'పవనదూతము', 13వ శతాబ్దికి చెందిన వేదాంత దేశిక కవి 'హంస సందేశము', 15వ శతాబ్దికి చెందిన కృష్ణానంద సార్వభౌముని 'పదాంక దూతము', 14వ శతాబ్దికి చెందిన ఉద్దండుని 'కోకిల సందేశము', జైన పండితుడు మేరుతుంగ కవి 'జైన మేఘ దూతము', 17వ శతాబ్దివాడు దేవీ చంద్రుని 'పవన దూతము', 18వ శతాబ్దినాటి వైద్యనాథ సూరి 'తులసీ దూతము' - వాటిలో కొన్ని. 18వ శతాబ్దమున జర్మను కవి శీలరు మేఘదూత కావ్యము ననుసరించుచు వ్రఅసిన 'మారియా స్టూవర్టు' అనే కావ్యంలో నిర్బంధంలో ఉన్న ఒక రాణి మేఘం ద్వారా ఫ్రాన్సు దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. క్రీ.శ.1083లో నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ద్వీపాంకర అతీశుడు టిబెట్‌కి వెళ్ళి అక్కడ బౌద్ధాన్ని ఉత్తేజపరిచే క్రమంలో భారతీయ సాహిత్యాన్ని అనువర్తింపజేసేందుకు ప్రోత్సహించారు. ఆ క్రమంలోనే మేఘదూతం సహా అనేక సంస్కృత గ్రంథాలను టిబెటిక్ భాషలోకి అనువర్తింపజేశారు.


Friday, January 18, 2019

ఆశ -దోస -అప్పడం.🌹

ఆశ -దోస -అప్పడం.🌹

🙃🙃🙃🙃


సర్కస్ లో రింగ్ మాష్టర్ ఉద్యోగానికని వెళ్ళి మేనేజర్ ని కలిశాడు సుబ్బు.

"పద... ఈవేళ షో చూద్దువుగాని!" అంటూ సర్కస్ జరుగుతున్న గుడారంలోకి సుబ్బూని తీసుకెళ్ళాడు మేనేజర్.

.

అప్పుడు ఒక పాతికేళ్ళు పడుచు, చిన్నచెడ్డీ, బాడీ వేస్కుని చేతిలో కొరడా పట్టుకుని సింహాలనూ, పులులనూ ఆడిస్తూవుంది. కొరడాని అదిలించి సింహాలు, పులులూ చిన్ని చిన్న స్టూల్స్ మీద కూర్చునేలా చేసింది ఆ అమ్మాయి

..

తర్వాత నేలమీద వెల్లకితలా పడుకుంది. అప్పుడు ఆ సింహాలూ, పులులూ స్టూలు మీది నుండి క్రిందికి దూకి ఆ అమ్మాయి చుట్టూ మూగి ఆ అమ్మాయి శరీరాన్ని అప్యాయంగా నాకసాగాయి.

"చూశావా? నువ్వు అలా చెయ్యగలవా?!" అడిగాడు మేనేజర్.

"ఓ... మీరు ఆ పులులనూ బోనుల్లోకి పంపించేస్తే నేను అంతకంటే ఎక్కువే చేస్తా" ఆశగా ఆ అమ్మాయి వంక చూస్తూ అన్నాడు సుబ్బూ.


😉😉😉😉😉😉😉😉😙😙😙😙😉😉😉😉😉😉😉😉

ఏమని పాడెదనో ఈ వేళ...🎼

ఏమని పాడెదనో ఈ వేళ...🎼

-

58 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాల్లో తొలి వీణ పాట పి. సుశీల గాత్రంలో పుట్టింది. అభ్యుదయ గీతాలకు పేరుపొందిన శ్రీశ్రీ ఈ పాటను రాయడం విశేషం.


లలిత సంగీత శాఖకు ఆద్యుడైన సాలూరి రాజేశ్వరరావే స్వరాలు సమకూర్చి వీణ పాటకు నాంది పలికారు.


ఆ సినిమా ‘భార్యాభర్తలు’(1961).


ఇన్నేళ్ళయినా వన్నె తరగని పాట ఇది. చిత్ర కథాపరంగా... విషాద గంభీరంగా సాగుతుందీ పాట.


‘నిదురించిన వే-ళా’ అనే పదాల దగ్గర స్వర విన్యాసం చూడండి.


చరణాల్లో కూడా ఇలాంటి చాతుర్యమే కనపడుతుంది.


మొదటి చరణం వరకూ చూస్తే ..

కలత నిదుర‘లో ’

కాంచిన కల‘లే’

గాలి మేడ‘లై’ ...


ఆ చివరి అక్షరాల విరుపుల మెరుపులు గమనించండి. అది రాజేశ్వరరావు గారి ముద్ర.


1977లో విడుదలైన ‘కురుక్షేత్రము’లోని ‘మ్రోగింది కల్యాణ వీణ’ పాటలోనూ,


1978లో వచ్చిన ‘ప్రేమ-పగ’లోని ‘కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ’ పాటలోనూ...


ఇలాంటి స్వర విన్యాసాన్నే మరింత విస్తారంగా చేశారు ఎస్ రాజేశ్వరరావు.


సెకండ్ వాయిస్ 

ఈ పాటను రికార్డు చేసినపుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల తన అనుభవాన్ని భూమిక పత్రికలో ఏప్రిల్ 23, 2009న ఇలా పంచుకున్నారు.


‘‘1960-61 సంవత్సరాలలో నేను మద్రాసులో వున్న రోజులు. ఆ రోజు భలే ఉషారుగా వుంది. ఎందుకంటే ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ వారి ‘భార్యాభర్తలు’ సినిమా పాట రికార్డింగ్‌. నేను సుశీల గారితో తయారై పోయాను. మొదట ఆమె భర్త ఆమెతో కూడా వెళ్తారనుకున్నారు. కానీ ఆయనకేదో అర్జంట్‌ పనివల్ల నేనే వెళ్ళాలని తెలిసింది.


సాలూరి రాజేశ్వర రావు సంగీతం చేస్తున్న ఆ సినిమాలో ఈ పాట రిహార్సల్స్‌కి నేను వెళ్ళాను. అదీ నా ఆనందం.


ఏ.వి.ఎమ్‌ స్టూడియోలో ఆర్టిస్టు రూ౦ వేరేగా వుంది. అంటే పాడేవాళ్ళ రూ౦ సెపరేట్‌ – హాల్లో మొత్తం ఆర్కెస్ట్రా సెట్‌ చేశారు. ఆమె హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాడతారన్నమాట -


‘ఏమని పాడెదనో ఈ వేళ’ పాటకి వీణ వాయించిన వారు ప్రఖ్యాత వైణికులు చిట్టిబాబు. ఆయన్ని కూడా ఆర్టిస్టు రూ౦లో వుండి వాయించేట్టు ఏర్పాటు చేశారు, ఆ పాటకి మొత్తం పాటంతా చిట్టిబాబు గారు వీణ మీద ఫాలో అవుతారు. అది ఎంత అందంగా, ఎంత సున్నితంగా, ఎంత లలితంగా వుంటుందో ఆస్వాదించి తెలుసుకోవాల్సిందే-


నేను అదే రూ౦లో సోఫాలో కూర్చున్నాను. దూరంగా నాకు ఆర్కెస్ట్రా ధ్వని వినిపిస్తూనే వుంది. ఆమె పాడటం, వీణ ఆమె పాటను అనుసరించటం వింటుంటే నాకెంతో సంతోషం.


రెండు మూడు రిహార్సల్స్‌ అయ్యాయి.


అప్పుడప్పుడు అసిస్టెంట్‌ వచ్చి ఏవో సూచనలిచ్చి, చిన్న చిన్న సర్దుబాట్లు చేసి వెళ్తున్నారు- రెడీ, టేక్‌ అన్నారు.

ఫస్టు టేక్‌ అయ్యింది. బాగుంది బాగుంది అన్నారంతా. కానీ రెండో టేక్‌ కోసం తయరవుతుంటే నేను నాలో నేను అనుకున్నాను ‘చాలా బాగుంది కదా’- అని.


ఇంతలో అసిస్టెంట్‌ గారొచ్చి నెమ్మదిగా సుశీల గారితో ఏదో చెప్పి వెళ్ళారు.


ఆమె నా దగ్గర కొచ్చి నెమ్మదిగా ‘‘నువ్వు పాడుతున్నావా – పాడకూడదు. నిశ్శబ్దంగా వుండు – సెకండ్‌ వాయిస్‌ వినిపిస్తోందన్నారంట’ అంటూ చెప్పారు.


నా గుండెలు జారిపోయాయి.


రికార్డింగ్‌ అంటే పిన్ను పడిన శబ్దమైనా లాగేస్తుందని, నా కప్పుడప్పుడే అర్థమవుతోంది. సినిమా రికార్డింగులు చూస్తున్నప్పుడే నాకు కొన్ని సున్నితమైన విషయాలు తెలియవస్తూ వున్నాయి. నేనెలా పాడాను? నా గొంతులోంచి శబ్దం ఎలా వచ్చింది? నాకు తెలుసుకదా అది రికార్డింగని’ అనుకుంటూ బాధపడిపోయాను.


మొత్తానికి కుదురుగా, నిశ్శబ్దంగా, నోరెత్తకుండా కూర్చున్నాను.


పాట రికార్డింగ్‌ పూర్తయింది. అందరూ ఆనందంగా సుశీల గార్ని అభినందిస్తుంటే అదేదో నన్నేఅన్నంత ఆనందపడి పోయాను.


”హీరోయిన్‌ ఈ పాట వీణ వాయిస్తూ పాడతారు. వీణ మెట్లమీద చక్కగా వేళ్ళు కదలాలి” అన్నారెవరో. ‘‘పోనీ చిట్టిబాబు గారి చేతిని క్లోజప్‌లో పెడితే సరి”.


”అబ్బే అది కుదరదు. ఆయనది అచ్చమైన మగవానిచెయ్యి” అన్నారు మ్యూజిక్‌ డైరక్టర్‌ గారు.


ఈ ‘ఏమని పాడెదనో’ పాట తర్వాత ఎంత పాపులర్‌ అయిందో, అది ఈనాడు ఒక క్లాసిక్‌గా ఏవిధంగా నిలిచిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.


మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఈ పాట సంగీతపరంగా కూడా చాలా గొప్ప పాట. పాడటంలో సుశీల చూపిన ప్రతిభ, వీణలో చిట్టిబాబు పలికించిన లాలిత్యం ఈ పాటను ఉన్నతంగా పెట్టాయి.


రాజేశ్వరరావు గారు కంపోజ్‌ చేసి, సుశీల పాడిన వీణ పాటల్లో ఇదొక గొప్ప పాట.


వీటికి తోడుగా, ఆ పాటను చిత్రీకరించిన సన్నివేశం హీరోయిన్‌ నటన (కృష్ణకుమారి), సినిమా అత్యంత ప్రజాదరణ పొందడం, కళాత్మకంగా వుంటూనే కమర్షియల్‌గా విజయం సాధించటం ఆ పాటని అందరి మనస్సులోన శాశ్వతంగా వుండేట్టు చేశాయి.


సినిమా పాటకి సంగీతం, సాహిత్యం, సన్నివేశం, కుదరటం ఒక ముఖ్యమైన అవసరం. దానికి తోడు సాంకేతికంగా బాగా రికార్డు చేయడం కూడా మరీ అవసరం. అప్పుడే అది కలకాలం నిలబడుతుంది.’’


బాగుంది కదూ జానకీబాల గారి జ్ఞాపకం!


ఇంతకీ ఆ పాటలో చిత్రీకరించిన- వీణ మీటిన వేళ్ళు ఎవరివి?


ఈ సంగతిని ఆ పాటకు అభినయించిన కథానాయిక మాటల్లోనే తెలుసుకుందామా? .


‘‘ ఏమని పాడెదనో... పాటలో వీణ మీద నా చేతి వేళ్ళు కదలాడిన విధానం చాలా బాగుందని ఎంతోమంది మెచ్చుకున్నారు. చిన్నప్పుడు నేను కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను. అది ఆ పాట చిత్రీకరణ సందర్భంగా బాగా ఉపయోగపడింది. ’’ఈ తొలి వీణ పాటను ఇన్ని సంవత్సరాలుగా వేలమంది గాయకులు ఇష్టంగా పాడుతూ... వినేవారిని ఆనందపరుస్తూ వచ్చారు.


***

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Friday, January 4, 2019

ఇటాలియను భాష“తెలుగు ఆఫ్ యూరోపు” 🌹

ఇటాలియను భాష“తెలుగు ఆఫ్ యూరోపు” 🌹🌺

తెలుగు భాషకి గల గొప్పతనమును గురించి చెప్పే ప్రతి సారీ చాలా మంది తెలుగు ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషని ఎక్కడో వాడుకలో ఉన్న ఇటలీ భాషతో పోలుస్తారు.


తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. ఇటాలియన్ భాష కూడా అచ్చుతోనే అంతము అవుతుంది.

హిందీ మొదలయిన చాలా భారతీయ భాషలు హలంత భాషలు అనగా హల్లులతో అంతమయ్యే భాషలు.


దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణించాడు. హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష,తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యాన్ని కనుగొన్నారు.


ఇటాలియన్ భాష లో ప్రతి పదం పలికేటప్పుడు చివర లో ఉచ్చరించేది “ఒక అచ్చు” ను అదే విధానం తెలుగుకూ ఉండటం తో “తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ” అయ్యింది.ఒక ఇటాలియను పదం ఉదాహరణ గా మనకి తెలిసిన “ఫియట్” కారుని విస్తరిస్తే ఫాబ్రికానా ఇటాలియానాఆటోమొబైలో టొరినో గా ప్రతి పదం చివర అచ్చు వచ్చి చేరుతుంది.


అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు.


పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” (Italian of the east) అని పిలుచుకున్నారు.నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది.కనుక్ల మనము ఇటాలియను భాషను “తెలుగు ఆఫ్ యూరోపు” అని పిలుచుకోవచ్చు.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మాతృత్వం’ అనే అందం 🌺🌹

మాతృత్వం’ అనే అందం 🌺🌹


🌺🌺🌺🌺


ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అందం అనేది సహజంగా వచ్చేస్తుంది.... ఈ రంగులను, ఈ రంగు రంగులతో కూడిన అందమైన పూలను, పళ్లను, పక్షులను, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారో తెలీదు..


కొందరు భగవంతుడంతారు.. కొందరు ప్రకృతే సృష్టించింది అంటారు..


కానీ ఈ ప్రకృతిలో జీవ రాసులన్నిటిలోనో ఉన్న ఒకే ఒక్క తేడా ఆడ మగ...


మనము ఎన్ని తేడాలు ఏర్పరుచుకున్నప్పటికీ.. దేవుడు సృష్టించిన తేడా ఇదేనేమో... ( నాకు ఇంతకన్న తేడాలు ఏమున్నాయో తెలీదు మరి)

ఈ అందం అనే ఆలోచన మనిషికి వచ్చిందేనేమో.. లేకపోతే ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.. ఎందరో తాము అందంగా లేమని పక్క వారితో పోల్చుకుని భాదలు పడుతున్నారు.. మరి కొందరు అందాన్ని ఇనుమడించుకోవాలని తాము సంపాదించిన దానిని అంతా బ్యూటీ పార్లర్లకు సమర్పించు కుంటున్నారు....


మగ వారి సంగతి ఏమో గానీ ఆడవాళ్ళు మాత్రం అందం అనే విషయానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు...


అందుకేనేమో ఆడవాళ్ళ మీద వారి అందం మీద, వారు తయారు అవడానికి పట్టే సమయం మీద అనేక రకాల జోకులు పుట్టుకొచ్చాయి.


నిజానికి ఆడవాళ్ళు అందంగా ఉండరని ఎండలో కాసేపు పనిచేస్తే వారి అందం తరిగిపోతుందని అనేక మంది చెబుతుంటారు.


అది నిజమే ననడానికి కొన్ని ఆధారాలు కూడా లేకపోలేదు. సృష్టిలో అందం అని చెప్పుకునే లక్షణాలన్నీ మగజాతికే ఉన్నాయి. ఉదాహరణకి మగ కోయిలే పాడుతుంది, మగ నెమలే పురి విప్పి నాట్యం చేస్తుంది, మగ సింహానికే జూలు ఉంటుంది, ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.


కానీ మగ జాతికి అంత అందం ఎక్కడ నుంచి వచ్చిందంటారా??!!


అవన్నీ ఆడవారి రక్తమాంసాలతో తయారైన దేహాలు కదండీ.. అందుకే అంత అందం..


ఆడవారి అందం అంతా దేవుడు మగవారికి ఇచ్చేసి ఆడవారికి ’ మాతృత్వం’ అనే అందాన్ని ప్రసాదించాడు.

దీనికి సంబంధించి ఒక కధ కూడా ఉందండీ.. ఒక సారి దేవుడు ఆడవాళ్లని అడిగాడట.. మీకు అందం కావాలా మాతృత్వం( తల్లి ప్రేమ ) కావాలా అని?! ఆడవాళ్ళు మాతృత్వం కావాలని కోరుకున్నారట. అంచేత ఆడవాళ్ళు తాము అందంగా లేమని బాధపడనక్కరలేదు, కృత్రిమ అందం కోసం తాపత్రయపడనక్కరలేదు.. 

ఎందుకంటే ఆడవారికి మాతృత్వమే ఎన్నటికీ తరగని అద్భుతమైన అందం.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అసలు శ్రీకృష్ణుడు ఎవరు?

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


అసలు శ్రీకృష్ణుడు ఎవరు?


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿


భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి?


కృష్ణస్తు భగవాన్ స్వయం - అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? 


జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు.

 పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. 


కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. 

ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?

.


కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి.

.

సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి.

 దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు.


క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. 

రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది. 

కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. 

అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది.

కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహారం. 

పైగా అది యుగాంతం. సమాజ ప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. 

రాక్షస సంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతల అంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. 

ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. 

పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల 

సంగమం ఆయన(శ్రీ కృష్ణుడు .)


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿