సీతాదేవి అరణ్యంలో లక్ష్మణుని నిందించిందా?

సీతాదేవి అరణ్యంలో లక్ష్మణుని నిందించిందా?

.

సీత అపహరణ ఘట్టం శ్రీమద్రామాయణంలో క్రింది విధంగా చెప్పబడింది.

"శ్రీరాముడు సీత కోర్కెపై, మాయ (బంగారు) లేడిని తీసుకుని రావడానికి వెళ్ళిన తరువాత, శ్రీరాముని గొంతుతో, మారీచుడు ఆర్తనాదం చేస్తే, భయపడిన సీత లక్ష్మణుని శ్రీరామునికి తోడుగా వెళ్ళమని చెబుతుంది.

లక్ష్మణుడు సీత రక్షణ గురించి ఆలోచించి, వెళ్ళడానికి నిరాకరించడంతో, సీత లక్ష్మణుని అనుమానించి, అతను అరణ్యానికి వచ్చినదే తనను పొందడానికే అని, అనేక నిందలు మోపుతుంది."

పై విధంగా (సీత లక్ష్మణుని అనుమానించినట్లుగా) శ్రీమద్రామాయణంలో, అరణ్యకాండలో, 45వ సర్గలో ఉంది.

-----------------

సీత నిజంగానే ఆ విధంగా ప్రవర్తించి ఉంటే, సుందరకాండలో దు:ఖించే సమయంలో తను లక్ష్మణుని నిందించినట్లు ఎక్కడా అనదు.

1) రావణుడు సీతను అపహరించుకుని తీసుకుని పోయేటప్పుడు ఈవిధంగా కేకలు పెడుతుంది.

హా లక్ష్మణ మహాబాహో గురు చిత్త ప్రసాదక |

హ్రియమాణాం న జానీషే రక్షసా కామ రూపిణా || (అరణ్యకాండ 49వ సర్గ 24వ శ్లోకం)

"హా లక్ష్మణ! నీ గురువు చిత్తాన్ని ఆనందింపచేయువాడ! ఈ కామరూపియైన రాక్షసుడు నన్ను అపహరించి తీసుకుని వెళుతూంటే నీవు గమనించడంలేదు."

ఇక్కడ సీత లక్ష్మణుని పిలుస్తోందికాని, లక్ష్మణుడు వెళ్ళడానికి తానే కారణమని అనడంలేదు.

2) శ్రీ హనుమంతుడు సీతను వెతుకుతు లంకకు చేరి అశోకవనంలో శింశుప వృక్షంపై దాగి ఉన్నప్పుడు, సీత ఆత్మహత్యకు ప్రయత్నించే సమయంలో ఆమె ఈ విధంగా దు:ఖిస్తుంది.

నూనం స కాలో మృగరూపధారీ |

మామల్పభాగ్యాం లులుభే తదానీం |

యత్రార్యపుత్రం విససర్జ మూఢా |

రామానుజం లక్ష్మణపూర్వజం చ || (సుందరకాండ 28వ సర్గ 10వ శ్లోకం)

"వాస్తవముగా ఆ కాలపురుషుడే మృగరూపమునుదాల్చి అల్పభాగ్యనైన నన్ను అప్పుడు ప్రలోభపెట్టెను. అందువలన మూర్ఖురాలనైన నేను ఆ మృగమును తీసికొనిరమ్మని, ముందుగా పూజ్యుడైన శ్రీరాముని, పిమ్మట లక్ష్మణుని పంపితిని."

ఈ సమయంలో సీతకు తెలిసినవారెవ్వరు అక్కడ లేరు. శ్రీహనుంతుడు అక్కడే ఉన్నట్లు కూడా ఆమెకు తెలియదు. ఆ సమయంలో కూడా తన అపహరణ సమయంలో లక్ష్మణుడు ఆశ్రమంలో లేకపోవడానికి తాను నిందించడమే కారణమని ఆమె రోదించడంలేదు. కాలప్రభావానికిలోనయ్యి, తాను బుద్ధిమాలి, శ్రీరాముని, తరువాత లక్ష్మణుని మాయలేడి కోసం పంపానని మాత్రమే అంటోంది.

3) తరువాత శ్రీహనుమంతునితో సంభాషించే సమయంలో లక్ష్మణుని గురించి ఈ విధంగా అంటుంది.

సింహ స్కంధో మహాబాహు: మనస్వీ ప్రియ దర్శన: |

పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ || (సుందరకాండ 38వ సర్గ 59వ శ్లోకం)

లక్ష్మణుడు సింహమువంటి భుజబలముగలవాడు. దీర్ఘబాహువు. మంచి మనస్సుగలవాడు. చూచువారికి ముచ్చటగొలుపువాడు. శ్రీరాముని తండ్రిగా, నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు.

ఇది సీతకు లక్ష్మణునిపైగల తల్లికి ఉండే వాత్సల్యభావం మాత్రమే!

-----

సీత తను పొరపాటు/తప్పు చేసేననుకుంటే అది ఒప్పుకుంటుందిగానీ, బింకంగా తను చేసిని పనిని సమర్ధించుకునే స్త్రీ కాదు.

ఆమె ఈ స్వభావానిని మరియొక సందర్భంలో గమనిస్తే అర్ధమవుతుంది.

----------

4) సుందరకాండలో, సీత శ్రీరాముని యెడబాటు కారణముగా శోకముతో శ్రీహనుమంతునితో సంభాషించినపుడు, శ్రీహనుమంతుడు ఈ విధంగా అంటాడు.

అథవా మోచయిష్యామి త్వామద్యైవ వరాననే|

అస్మాత్ దు:ఖాదుపారోహ మమ పృష్ఠమనిందితే ||

త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం |

శక్తిరస్తి హి మె వోఢుం లంకామపి సరావణాం || (సుందరకాండ 37వ సర్గ 21,22 శ్లోకములు)

"లేనిచో, అమ్మా! నేడే నిన్ను ఈ దు:ఖములనుండి విముక్తురాలనుగా చేయగలను. ఓ పూజ్యురాలా! నా వీపును అధిరోహింపుము. నిన్ను నావీపుపై చేర్చుకొని, ఈ మహాసముద్రమును దాటగలను. రావణునితోగూడ ఈ లంకను పెకలించి తీసికొనిపోగల శక్తి నాకు గలదు."

అప్పుడు సీత తన పాతివ్రత్య ధర్మముననుసరించి, శ్రీరామునిదప్ప, మఱియొక పురుషుని శరీరమును తన బొందిలో ప్రాణమున్నంతవరకు తాకనని, శ్రీరాముని త్వరితగతిని తీసుకునివచ్చి తనకు చెర విడిపించమని, శ్రీహనుమంతునితో అంటుంది.

5) ఇంద్రజిత్తు మరణవార్త విన్న తరువాత, రావణుడు దు:ఖించి, తన కుమారుడు మాయాసీత తల నఱీకి, శ్రీరాముడిని భ్రమింప చేయడానికి ప్రయత్నించాడని, తను నిజమైన సీతనే చంపివేస్తానని, ఖడ్గం తీసుకుని అశోకవనం బయలుదేరుతాడు. ఆ విషయం తెలిసి, సీత భయపడి ఈ విధంగా ఆలోచిస్తుంది.

హనూమతో2పి యద్వాక్యం న కృతం క్షుద్రయా మయా ||(యుద్ధకాండ 92వ సర్గ-54 శ్లోకం)

యద్యహం తస్య పృష్ఠేన తదా యాయామనిందితా |

నాద్యైవమనుశోచేయం భర్తురంకగతా సతీ || || (యుద్ధకాండ 92వ సర్గ-55 శ్లోకం)

ఈ రాక్షసుడు క్రోధంతో నన్ను వధింపనున్నాడు. దూరదృష్ఠి (బుద్ధిబలం) లేని నేను ఆనాడు హనుమంతుని మాటలను వినకఫోయితిని. నిర్దోషిని (పతివ్రతను) ఐన నేను ఆనాడే హనుమంతుని భుజములపై అధివసించి వెళ్ళియున్నచో, నా భర్తయొడిలో సురక్షితనై యుండెడిదానను. ఇప్పుడు ఈ విధంగా శోకింపవలసిన దు:స్థితి నాకు తప్పి యుండెడిది.

6) చివరిగా శ్రీహనుమంతుడు అరణ్యంలో ఏమి జరిగిందనే విషయం భరతునితో చెప్పుతున్నపుడు, ఈవిధంగా అంటాడు.

తతో రామో ధనుష్పాణిర్ధావంతమనుధావతి |

స తం జఘాన ధావంతం శరేణానతపర్వణా || (యుద్ధకాండ 126వ సర్గ-24 శ్లోకం)

"అప్పుడు శ్రీరాముడు ఆ మాయలేడిని వేటాడి, బాణప్రయోగంతో దానిని సంహరించాడు."

అథ సౌమ్యా దశగ్రీవో మృగం యాతేతు రాఘవే |

లక్ష్మణే చాపి నిష్క్రాంతే ప్రవివేశాశ్రమం తదా || (యుద్ధకాండ 126వ సర్గ-25 శ్లోకం)

"శ్రీరాముడు ఆ మాయలేడిని వేటాడుతూ వెళ్ళినపుడు, లక్ష్మణుడు కూడా లేని సమయంలో రావణుడు ఆశ్రమంలో ప్రవేశించాడు."

ఇక్కడ శ్రీహనుమంతుడు లక్ష్మణుడు కూడా లేని సమయంలో రావణుడు ఆశ్రమంలో ప్రవేశించాడు అని అంటున్నాడుకానీ, లక్ష్మణుడు ఆశ్రమంలో లేకపోవడానికి సీత నిందించడమే కారణమని అనడంలేదు.

కాబట్టి సీత లక్ష్మణుని నిందించిందనే కథ కేవలం ప్రక్షిప్తమే!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!