అమ్మ- నాన్న

అమ్మ- నాన్న

మనం భూమ్మీద పడకముందే భగవంతుడు మనకోసం రెండు అవతారాలు ఎత్తి సిద్ధంగా ఉంటాడుట! ఒక అవతారం అమ్మ అయితే.. రెండో అవతారం నాన్న.

అమ్మ జోలపాట. నాన్న నీతికథ. వెరసి ఇద్దరూ కలసి ఓ పెద్దబాలశిక్ష. కన్నవారి ప్రేమ ఊటబావిలోని నీటిచెలమట. బిడ్డ బతుకును ఎప్పుడూ అది పొడారిపోకుండా కాపాడుతుందని ఒక అరబ్బీ కవి ఎంత ఆర్ద్రంగా చెప్పాడో! తల్లిదండ్రుల ప్రేమలోని మాధుర్యానికి ద్రాక్ష అవమానంతో నలబడిందని, కలకండ అసూయతో గట్టిబడిందని, అమృతం చిన్నబోయి స్వర్గానికి పారిపోయిందని మరో సంస్కృత కవి చమత్కారం.

భూమ్మీద పడ్డ ఓంప్రధంలోనే బిడ్డ కంటబడేది తల్లి రూపం. ఓనామాలకన్నా ముందు పలికేది 'అమ్మ' పదం. ఆ అమ్మ చూపించే నాన్నే బిడ్డకు అన్నీ అవుతాడు. 'నాన్నా' అన్న పిలుపులోనే రెండు 'నా'లు దాగున్నాయి కదా!

అమ్మ ఒడి గుడి అయితే.. నాన్న ఒడి చదువుల బడి. బిడ్డ ఎదగడానికి ముందుగా కొలమానంగా భావించేది కంటిముందున్న అమ్మానాన్నల వ్యక్తిత్వాలనే!

సంతాన సౌభాగ్యంకోసం యవ్వనకాలాన్నంతా సంతోషంగా కారాగారంలో వృథాచేసుకొన్న దేవకీ వసుదేవుల కథ మనకు తెలుసు. కాకిపిల్ల కాకికి ముద్దు. గాంధారీ ధృతరాష్ట్రుల్లా బిడ్డల్ని గుడ్డిగా ప్రేమించడమే కన్నవారికి తెలిసిన వాత్సల్య విద్య. బొజ్జగణపయ్యను చూసి నవ్వాపుకోలేనందుకేగదా చందమామమీద పార్వతమ్మంత లావు చిందులేసింది! పుత్రవియోగం తట్టుకోలేకేగదా దశరథ మహారాజంత దయనీయంగా ప్రాణాలు విడిచింది! బిడ్డకోసం ఆ బిడ్డనే మూపునేసుకొని కదనరంగానికి తరలివెళ్ళింది ఝాన్సీమాత. లోకం, కాలం ఏదైనా సరే తల్లిదండ్రుల లోకంమాత్రం బిడ్డచుట్టూతానే ప్రదక్షిణాలు చేస్తంటుంది. ఈ ప్రేమాకర్షణసూత్రం ఏ విజ్ఞానశాస్త్రానికి అంతుచిక్కని విచిత్రం.

కన్నవారంటే అంతే మరి! తము కన్నవారు తమకన్నా గొప్పవారు కావాలని పగలుకూడా కలలు కనేవారు! స్వీయప్రాణాలను సైతం సొంతబిడ్డలకోసం తృణప్రాయంగా సమర్పించేందుకు సదా సర్వసిద్ధంగా ఉండే పరమత్యాగుల వరసలో ముందుండే వారు. పిల్లకాయలంటే తల్లిదండ్రులకు కంటిముందు తిరిగే గుండెకాయలు కదూ! బిడ్డలకోసం గాలిమేడలు కట్టడమే కాదు! క్రమం తప్పకుండా వాటి దుమ్మూ ధూళీకూడా దులిపే పనిలో ఉంటారు తల్లిదండ్రులు.మనమూ అమ్మానాన్నలమైతేగాని మన అమ్మానాన్నల మనసఏమిటో మనకు అర్థం కాదు.

ఎన్ని తరాలైనా మారనీ.. ఎంత ప్రగతిపథాన అయినా సాగనీ,, 'అ' అంటే 'అమ్మ' అనే అర్థం మారరాదని.. 'నా' కన్నా ముందు 'నాన్నే' గుర్తుకు రావాలని అందుకే పెద్దలు సుద్దులు చెప్పేది.

అమ్మ దీవెన లేనిదే ఏ పని జయప్రదం కానేకాదని, నాన్న చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని నడిచినప్పటి చిన్ని పాదాలే ..ఎదిగిన పిదపా.. నాన్న అడుగుజాడలకు ఎడంగా జరగి పోరాదని తెలుసుకొంటే చాలు బిడ్డ బతుకంతా భద్రం.. బంగారం!

అమ్మ పేగు ఇస్తే నాన్న పేరు ఇస్తాడు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మంచిపేరు తెస్తాడని ఆశించడంలో అత్యాశ ఏముంటుంది?! అడిగినా అన్నీ సమకూరని ఈ వ్యాపారప్రపంచంలో అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మనాన్నలను మించిన పిచ్చివాళ్ళు ఎవరుంటారు! నిజమే! బిడ్డమీది పిచ్చిప్రేమే వాళ్లనలా ప్రేమపిచ్చివాళ్లను చేసిందని తెలుసుకోవడంలోనే ఉంది వాత్సల్య రహస్యం.

మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు, డబ్బులు లేనప్పుడు బంధువులు, శక్తి తగ్గినప్పుడు సంతానం చులకన చేయవచ్చేమోగాని.. ఉన్నప్పుడూ లేనప్పుడూ ఒక్కలాగే ఉండేవాళ్లు మాత్రం జన్మనిచ్చిన తల్లిదండ్రులే! హిమాలయాలు దేశానికి ఉత్తరానే ఉన్నాయి. వాటినిమించిన ఉన్నత ప్రేమాలయాలు ప్రతీ ఇంటా అమ్మానాన్నల రూపంలో ఉంటాయి. అమ్మానాన్నల అనురాగం అరేబియా సముద్రంకన్నా వెడల్పైనది. బంగాళాఖాతంకన్నా లోతైనది. హిందూమహాసముద్రం వారి ప్రేమసింధువుముందు పిల్లకాలువ!

ఈ గజిబిజి జీవితంనుంచి ఎప్పుడైనా విరామం దొరకబుచ్చుకొని జన్మనిచ్చిన ఊరికి వెళ్ళినప్పుడు కోతికొమ్మచ్చులు, దాగుడుమూతలు ఆడుకొన్న ఆ ఇంటిముందు ఆరుబయలు వంటరిగా ఓ మంచంమీద పడుకొని ఆకాశంవంక తేరిపారజూడు! అమ్మ చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తూ నిన్ను మురిపించేందుకు 'రా రమ్మ'ని పిలిచిన చందమామ దోస్తునొకసారి పలకరించు! మీ అమ్మ నీకోసం ఎన్ని కమ్మని కథలు కల్పించి చెబుతుండేదో గుర్తుచేస్తాడు! ఆ వెన్నెల్లో మీ నాన్న నిన్ను తన మోకాలి గుర్రంమీద సవారీ చేయిస్తూ ఎన్నెన్ని సరదా కబుర్లు చెప్పేవాడో నెమరు వేయిస్తాడు. అయినదానికీ కానిదానికీ మీ అమ్మ నీకు తీసే దిష్టి, కానిదానికీ అయినదానికీ మీ నాన్న నీకోసం పడే హడావుడి.. మళ్లా గుర్తుకొస్తే నీ కళ్లు చెమర్చకుండా ఉండవు!

అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు బుడిబుడి అడుగులు వేసే ఓ పాపాయి. ఆ పాపాయి బుడిబుడి నడకలతో బైటికి పోకుండా తన కొంగు చివరకి ముడి వేసుకొని పనిపాటలు చూసుకొనేది అమ్మ.

పాపాయి ఎదుగుతున్నాడు. కిటికీగుండా బైట కనిపించే కొండా కోనా, చెటూ పుట్టా.. పాపాయిని రారమ్మని బులిపిస్తున్నాయి! పాపాయికేమో.. పాపం.. తల్లికొంగు బంధమాయ!

ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది. ఆకాశంలో ఏడురంగుల ఇంద్రధనుసు విరిసింది. పాపాయిని అదే పనిగా అందుకొమ్మని.. ఆడుకొందాం రమ్మని.. ఆగకుండా ఆహ్వానిస్తున్నది. తల్లి గాఢనిద్రలో ఉంది. అదను చూసి చాకుతో చీరకొంగు కోసి.. గడప దాటి.. గబగబా కొండకొమ్ముకేసి ఎగబాకుడు మొదలుపెట్టాడు బుడతడు. ఇంద్రచాపం ఎక్కి జారుడుబండాటాడాలని బుడతడి కంగారు. ఆ తొందరలో పాచిబండమీద కాలు జారాడు. భయంతో 'అమ్మా! అమ్మా!' అని అరుపు. లోయలోకి జారిపడే చివరి క్షణంలో ఠకాలుమని ఆడ్డుపడి ఆపేసింది.. రెండుబండలమధ్య ఇరుక్కున్న అమ్మకట్టిన లావాటి కొంగుముడి! దూరంనుంచి పరుగెత్తుకొస్తున్న అమ్మను చూసి 'హమ్మయ్య' అనుకొన్నాడు బుడతడు!

నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు అదే బుడతడు మరికాస్త ఎదిగిన తరువాత. 'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాదు హఠాత్తుగా!

'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా! నాకు సైకిలు కొనివ్వచ్చుగా! రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న. 'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉంది. ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగుపడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా. 'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.

చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు. ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'

ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా నాన్నలకు నిండుమనసుతో రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు ఆ క్షణంలో. ఒక చేత్తో అమ్మకు.. మరో చేత్తో నాన్నకు!

'పేరెంట్స్ నీడ్ అవర్ ప్రెజన్స్.. నాట్ అవర్ ప్రెజెంట్స్!' అన్నాడు ఆంగ్లంలో ఓ కవి. ప్రపంచంమొత్తం ఏడాదిలో ఓ రోజు( జులై నెల నాలుగో ఆదివారం) తల్లిదండ్రులను తలుచుకొంటుంది. ఏడాదిమొత్తం పన్నెండు నెలలూ రోజూ ఇరవైనాలుగ్గంటలపాటు గడియ గడియకు జన్మదాతలను..

బతికుంటే బాగా చూసుకోవడం.. పైనవుంటే ప్రేమగా స్మరించుకోవడం భారతీయుల కుటుంబ సంస్కృతి. తరాలు మారినా ఆ సంస్కారంలో తరుగుదల రాకుంటేనే ప్రతి చిరంజీవికి శుభం.. లాభం!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!