🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!


(టీకా ..భావం )



కరిఁ దిగుచు మకరి సరసికిఁ


గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్


గరికి మకరి మకరికిఁ గరి


భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్.


టీకా:


కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగులోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = క్రూరస్వభావము, పట్టుదల; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భారమైనది; అనుచున్ = అంటూ; అతల = పాతాళలోకపు; కుతల = భూలోక; భటుల్ = వీరులు; అరుదు = ఆశ్చర్య; పడన్ = పడగా.


భావము:


మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు” అనుకుంటు పాతాళ, భూ లోకాల శూరులూ ఆశ్చర్య పోయారు.


🚩


శా.


నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స


న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ


ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే


కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!


టీకా:


నానా = అనేకమైన; అనేకప = ఏనుగుల; యూధముల్ = సమూహములు; వనము = అడవి; లోనన్ = అందు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; సన్మానింపన్ = గౌరవించుండగ; దశలక్షకోటి = పదిలక్షలకోట్ల; కరిణీ = ఆడ యేనుగులకు; నాథుండను = పతిని; ఐ = అయ్యి; ఉండి = ఉండి; మత్ = నా యొక్క; దానా = మద; అంభస్ = జలముచే; పరిపుష్ట = చక్కగా పెరిగిన; చందన = గంధపు; లతాంత = తీవ లందలి; ఛాయలన్ = నీడల; అందున్ = లో; ఉండన్ = ఉండ; లేక = లేకపోయి; ఈ = ఈ; నీర = నీటిపైని; ఆశన్ = ఆశతో; ఇటు = ఈవైపునకు; ఏల = ఎందుకు; వచ్చితిన్ = వచ్చితిని; భయంబు = భయమేస్తోంది; ఎట్లో = ఏలాగో; కదే = కదా; ఈశ్వరా = భగవంతుడా.


భావము:


చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.


🚩


కలఁ డందురు దీనుల యెడఁ,


గలఁ డందురు పరమయోగి గణముల పాలం,


గలఁ డందు రన్నిదిశలను,


గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?


టీకా:


కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ = అత్యుత్తమమైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను = దిక్కు లందును; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; అనెడి = అనబడెడి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేడో = లేడో.


భావము:


దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!


🚩


క.


లోకంబులు లోకేశులు


లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం


జీకటి కవ్వల నెవ్వం


డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.


టీకా:


లోకంబులున్ = లోకములు; లోకేశులున్ = లోకాలను పాలించేవారు; లోకస్థులు = లోకములలో నుండువారు; తెగిన = నశించిన తరువాత; తుదిన్ = కడపట; అలోకంబున్ = కనబడనిది, గుడ్డిది; అగు = అయిన; పెంజీకటి = గాఢాంధకారము; కిన్ = నకు; అవ్వలన్ = ఆవతల; ఎవ్వండు = ఎవడు; ఏక = అఖండమైన; ఆకృతిన్ = రూపముతో; వెలుగున్ = ప్రకాశించునో; అతనిన్ = అతనిని; ఏన్ = నేను; సేవింతున్ = కొలచెదను.


భావము:


లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.


🚩


ఉ.


ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;


యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం


బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ


డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


టీకా:


ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = లోపల; ఉండున్ = ఉండునో; లీనము = కలిసిపోయినది; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము పొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైన ప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణభూతుడు; ఎవ్వడు = ఎవడో; అనాదిమధ్యలయుడు = ఆదిమధ్యాంతలలో శాశ్వతముగా నుండువాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నా యొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను.


భావము:


ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.


🚩


శా .


"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్


ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;


నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;


రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!


టీకా:


లావు = శక్తి; ఒక్కింతయున్ = కొంచెము కూడ; లేదు = లేదు; ధైర్యము = ధైర్యము; విలోలంబు = తగ్గి; అయ్యెన్ = పోయింది; ప్రాణంబులున్ = ప్రాణములు; ఠావుల్ = స్థానములనుండి; తప్పెన్ = చలించిపోతున్నాయి; మూర్ఛ = మగత; వచ్ఛెన్ = వస్తున్నది; తనువున్ = శరీరము; డస్సెన్ = అలసిపోయింది; శ్రమంబున్ = కష్టముగా; అయ్యెడిన్ = ఉన్నది; నీవే = నీవు మాత్రము; తప్పన్ = తప్పించి; ఇతఃపరంబు = మరింకొకరుని; ఎఱుంగన్ = తెలియను; మన్నింపన్ = ఆదుకొన; తగున్ = తగినవాడను; దీనునిన్ = దీనావస్థ నున్నవాడను; రావే = రమ్ము; ఈశ్వర = భగవంతుడ; కావవే = కరుణించుము; వరద = వరముల నిచ్చెడివాడ; సంరక్షింపు = కాపాడుము; భద్రాత్మక = శుభమే తానైనవాడ.


భావము:


దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!


🚩


మ .


అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా


పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో


త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.


టీకా:


అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరి = రాజ భవన సముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత; ఉపల = శిల (పైన); ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించు చున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో నున్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అను; కుయ్యాలించి = మొర ఆలించి; సంరంభి = వేగిరపడు తున్న వాడు; ఐ = అయ్యి.


🚩


మ .


సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే


పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం


తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో


పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.


విష్ణుమూర్తి పరికరాదులు


టీకా:


సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుట లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుటలేదు; ఏ = ఏ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవిదుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమ్మిల్లమున్ = జుట్టుముడిని; చక్కనొత్తడు = చక్కదిద్దుకొనుట లేదు; వివాద = ప్రణయకలహము నందు; ప్రోత్థిత = పైకిలేచుచున్న; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీరకొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; అవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి.


భావము:


గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.


🚩


క .


అడిగెద నని కడు వడి జను


అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్


వెడ వెడ జిడి ముడి తడ బడ


నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!


టీకా:


అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగినప్పటికిని; తను = అతను; మగుడ = మారుపలుకులు; నుడుగడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.


భావము:


అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.


కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –


ఈ పద్యం చూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం కాదు అమృత గుళిక.


(వింజమూరి సేకరణ .)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!