🚩ప్రతిభా’ వంతుని వెలుగు రేఖ రేచుక్క💥

🚩ప్రతిభా’ వంతుని వెలుగు రేఖ రేచుక్క💥

VINJAMURI VENKATA APPARAO·TUESDAY, 15 OCTOBER 2019·


ప్రతిభ కలిగిన తెలుగు సినిమా నిర్మాతలు 30వ దశకంలో అతికొద్ది మందే! కారణం ఆ రోజుల్లో సినిమాలు కలకత్తాలోగాని, బొంబాయిలోగాని తయారవుతుండేవి. అందుచేత చిత్ర నిర్మాతలు దాదాపు ఉత్తరాది వారే ఎక్కువగా వుండేవారు. సినిమాలు తీయాలంటే రంగస్థల కళాకారులను కాంట్రాక్టు పద్ధతిలో కలకత్తాకు తీసుకెళ్లి, అక్కడ షూటింగు జరిపి, మద్రాసుకు తీసుకొచ్చి విడుదల కార్యక్రమాలు మొదలుపెట్టేవారు. అలా 1933లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ వారు అఖ్తర్‌ నవాజ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘రామదాసు’ సినిమాలో వేషం కోసం కలకత్తా వెళ్లి, అక్కడ చిత్ర నిర్మాణ ధోరణుల్ని అధ్యయనం చేసి, ఆ అనుభవంతో ‘సతీ తులసి’, ‘మార్కండేయ’, ‘పార్వతీకళ్యాణం’, ‘గరుడ గర్వభంగం’, ‘ శ్రీ సీతారామ జననం’ వంటి పారాణిక సినిమాలు ఎన్నో నిర్మించిన వ్యక్తి ఘంటసాల బలరామయ్య. తర్వాత ఆ తరహా చిత్రాలకు కాలం చెలిందని భావించి జానపద సినిమాలకు శ్రీకారం చుట్టారు. 25 మార్చి 1955న విడుదలైన ‘రేచుక్క’ జానపద చిత్రం ఆ కోవ లోనిదే. ఈ సినిమా ఇప్పుడు అరవై సంవత్సరాలు పూర్తిచేసుకొని వజ్రోత్సవం జరుపుకుంది. మూడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ‘రేచుక్క’ సినిమాకు విశేషాలెన్నో వున్నాయి! ఆ జ్ఞాపకాల్లోకి ఒకసారి తొంగి చూస్తే...




‘ప్రతిభ’లరాముడు

1936లోనే శ్రీరామా ఫిలిమ్స్‌ సంస్థను నెలకొల్పి... వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య, దొమ్మేటి సత్యనారాయణ, శ్రీరంజని వంటి నాటక కళాకారులతో ‘సతీ తులసి’ సినిమా నిర్మించిన ఘనుడు ఘంటసాల బలరామయ్య. తర్వాత కుబేరా ఫిలిమ్స్‌తోబాటు, కుబేరా స్టూడియోను కూడా మద్రాసు నగరంలో స్థాపించి ‘మైరావణ’, ‘మార్కండేయ’ సినిమాలు తీసి విజయం సాధించారు. 1941లో పి. పుల్లయ్యను భాగస్వామిగా చేర్చుకొని ‘ప్రతిభా’ పేరుతో సంస్థను నెలకొల్పి, తొలి ప్రయత్నంగా ‘పార్వతీపరిణయం’ (కల్యాణం) సినిమా నిర్మించారు. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. బాంబుల భయంతో ప్రజలు మద్రాసు విడిచి వెళ్లిపోతుండడంతో సినిమా స్టూడియోలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. పరిస్థితులు సర్దుకున్నాక ఘంటసాల బలరామయ్య వరుసగా సినిమాలు నిర్మించి నిలదొక్కుకున్నారు. ‘శ్రీ సీతారామ జననం’ ద్వారా అక్కినేని నాగేశ్వరరావును, ‘రేచుక్క’ సినిమా ద్వారా దేవికను, అశ్వద్ధామ, మహదేవన్‌ వంటి సంగీత దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనతను బలరామయ్య దక్కించుకున్నారు. 1948లో బలరామయ్య నిర్మించిన ‘బాలరాజు’ సినిమా ఏకంగా 11 కేంద్రాల్లో వంద రోజులకు పైగా ఆడి, రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర పుటలకెక్కింది.




రాలిన రేచుక్క

మీర్జాపురం రాజు శోభనాచల బ్యానర్‌లో తీసిన ‘లక్ష్మమ్మ’ సినిమాకు పోటీగా అక్కినేని, అంజలీదేవితో ‘శ్రీలక్ష్మమ్మ కథ’ చిత్రాన్ని కేవలం 19 రోజుల్లో తీసి విజయం సాధించాక అదే సంవత్సరం ‘స్వప్న సుందరి’ సినిమాని కూడా విడుదల చేశారు. 1952లో కృష్ణకుమారి, జియన్‌.స్వామి, లింగమూర్తి, నారాయణరావులతో ‘చిన్నకోడలు’ అనే సాంఘిక సినిమాను నిర్మించారు. ఆయన తీసిన ఒకే ఒక సాంఘిక చిత్రం ఈ ‘చిన్నకోడలు’ సినిమా. తర్వాత అక్కినేనితో ఒక జానపద చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో ప్రతిభా సంస్థకు టివియస్‌ శివరామశాస్త్రి జనరల్‌ మేనేజరుగా వుండేవారు. తదనంతర కాలంలో ఆయనే ‘ప్రతిభా’ శాస్త్రిగా ప్రాచుర్యం పొందారు. కథాచర్చల్లో శాస్త్రి సూచనలను తప్పకుండా గౌరవించేవారు. ఓసారి ఆయన బలరామయ్యకు ‘ఎ ప్రిన్స్‌ హూ వాస్‌ ఎ థీఫ్‌’ సినిమా మూలకథను వినిపించారు. యూనివర్సల్‌ స్టూడియో వారు నిర్మించిన ఈ చిత్రానికి అరబిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో థియోడార్‌ డ్రైసర్‌ రాసిన ఒక చిన్న కథ ఆధారం. రుడాల్ఫ్‌ మాటే దర్శకత్వంలో టోనీ కర్టిస్‌, పైపర్‌ లారీ తొలిసారిగా నటించిన ఈ హాలీవుడ్‌ సినిమా శాస్త్రికి విచిత్రంగా తోచింది. ఆ సినిమా మీద ఒక నోట్‌ తయారు చేసి బలరామయ్యకు చూపించారు. దాని ఆధారంగా బలరామయ్య కథను అల్లి, సినీ సాహత్య మణిదీపం మల్లాది రామకృష్ణశాస్త్రి చేత తిరగరాయించి, మాటలు పాటలు రెడీ చేశారు. అశ్వద్ధామ సంగీత దర్శకత్వంలో రెండు పాటలు కూడా రికార్డు చేశారు. అదే ‘రేచుక్క’ సినిమా. బలరామయ్య చేయూతతో తారాపథం చేరుకున్న అక్కినేని ఈ సినిమా తీసే రోజుల్లో మంచి డిమాండులో వున్నారు. ఆయన ఒప్పుకున్న ‘పరివర్తన’, ‘విప్రనారాయణ, ‘మిస్సమ్మ’, ‘అర్ధాంగి’, ‘రోజులుమారాయి’, ‘వదిన’ వంటి సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో వున్నాయి. బలరామయ్య అక్కినేనిని పిలిపించి ‘రేచుక్క’ సినిమా గురించి చెప్పి అందులో నటించమని కోరారు. అక్కినేనికి కాల్షీట్లు సర్దుబాటుచేసే అవకాశం లేక డేట్లలో కొంత సడలింపు కోరారు. బలరామయ్యకు కోపమొచ్చి ఎన్టీఆర్‌ని హీరోగా బుక్‌ చేశారు. అంజలిదేవి, ముక్కామల, సదాశివరావు, పేకేటి, నాగభూషణం ప్రధాన తారాగణంగా సినిమా మొదలుపెట్టి మూడు రీళ్లు తీశారు. జిక్కి ఆలపించిన ‘సంబరమే’...పండుగలే...చినదానా వన్నెదానా’ అనే పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. కానీ 29 అక్టోబరు 1953 అర్ధరాత్రి గుండెపోటుతో బలరామయ్య అర్థాంతరంగా మరణించారు.


నింగికెగసిన నక్షత్రం

ఘంటసాల బలరామయ్య మొదలుపెట్టిన రేచుక్క సినిమాని ఎలాగైనా పూర్తిచేసి అతనికి అంకితమివ్వాలని ప్రతిభాశాస్త్రి నడుం బిగించారు. బలరామయ్యకు అత్యంత సన్నిహిత మిత్రుడు పి.పుల్లయ్యను సంప్రదించి దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరించమని కోరారు. చమ్రియా సంస్థ ఈ సినిమాకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. అయితే ఆర్థిక వనరుల లేమిని అర్థం చేసుకున్న ముఖ్య నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా పూర్తయ్యాక పారితోషికాలు తీసుకుంటామని పత్రాలు రాసి పంపిణీదారునికి సమర్పించారు. దాంతో ఇబ్బందులు లేకుండా సినిమా పూర్తయింది. ఉగాది కానుకగా సినిమా విడుదలయింది. సినిమాకు అద్భుతమైన టాక్‌ వచ్చింది. మూడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది కూడా. ఈ వేడుకలను బలరామయ్య పెద్దకుమారుడు కృష్ణమూర్తి చమ్రియా వారి సహకారంతో విజయవాడలో నిర్వహించారు. ఘంటసాల బలరామయ్య మరణానంతరం ‘రేచుక్క’ తోకచుక్కలా రాలిపోతుందేమో అనే సంశయం కొంతమంది ఊహల్లో మెదిలినా, ప్రతిభాశాస్త్రి, పుల్లయ్య సుందర్లాల్‌ నహతా పుణ్యమా అని తారాజువ్వలా నింగికెగసి ధ్రువనక్షతంలా వెలిగి ‘రేచుక్క’గా వెలుగులీనుతూ స్థిరపడిపోయింది.




కథ సంవిధానం

బలరామయ్య తయారుచేసిన మూలకథకు సమగ్ర మార్పులు చేసి మల్లాది రామకృష్ణ శాస్త్రి తెలుగు తనం ఉట్టిపడేలా మాటలు, పాటలు సమకూర్చిన ‘రేచుక్క’ కథ ఉత్సాహభరితంగా వుంటుంది. దేవరాయ మహారాజు (ముక్కుమల) తన ఐదేండ్ల రాకుమారుడు కుమారారాజా (మాస్టర్‌ నాగేశ్వరరావు) జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిస్తాడు. మంత్రి (సదాశివరావు) మహారాజుతో తనకూతురు లలితాదేవి (బేబీఅమ్మలు-పెద్దయ్యాక దేవిక)ని కోడలుగా స్వీకరించమని ప్రతిపాదిస్తాడు. రాజు ఆగ్రహోదగ్రుదౌతాడు. మంత్రి తనకు అనుకూలంగా వ్యవహరించే సేనాపతి నాగులు (వైవిరాజు) సహకారంతో దేవాలయానికి వెళ్తున్న రాజును బందీ చేస్తాడు. రాజు అంతరంగికుడు చిటి వీరయ్య (నాగభూషణం) యువరాజును కాపాడి, ఒక మర్రిచెట్టు వద్ద విడిచి తను వేరే దారి పడతాడు. యువరాజును సర్పం కాటువేయగా జోగులు (గాదేపల్లి), కోనమ్మ (కాకినాడ రాజరత్నం) దంపతులు సంరక్షించి అతనికి కన్నయ్య (ఎన్టీఆర్‌) అనే పేరుపెట్టి మంచి సాహసవంతుడుగా పెంచుతారు. ఆటపాటలతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే నానా (అంజలీదేవి)తో యువరాజు ప్రేమలో పడతాడు. ఈలోగా దేవరాయ మహారాజు చెరనుంచి తప్పించుకొని నానా ఆదరించగా ఆమె ఇంటిలో తలదాచుకుంటాడు. నానా చిటి వీరయ్య కూతురనే విషయం రాజుకు తెలియదు. సినిమా అనేక మలుపులు తిరిగి దేవరాయ మహారాజు కన్నయ్యను యువరాజుగా గుర్తించడం, క్రూరుడైన మంత్రిని యుక్తితో యువరాజు చంపించేయడంతో కథ సుఖాంతమౌతుంది.




ఆసక్తికర అంశాలు

మహారాజు దేవరాయల కొలువులో మహామంత్రి కూతురు లలితాదేవి పాత్రకు బలరామయ్య మరణించే నాటికి ఎవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి ఆ పాత్రను ఎవరైనా కొత్త అమ్మాయి చేత నటింపజేయాలని బలరామయ్య ఆశ. బలరామయ్య అభీష్టానికి అనుగుణంగా ప్రతిభాశాస్త్రి అన్వేషణ జరుపుతున్నప్పుడు నిశ్చల ఛాయాగ్రాహకుడు జైహింద్‌ సత్యం ఒక అమ్మాయి ఫోటో చూపించారు. తమిళ నటుడు యస్వీ సహస్రనామం ప్రదర్శించే నాటకాల్లో ఆ అమ్మాయి వివిధ పాత్రలు పోషిస్తూ వుండేది. వాకబు చేస్తే ఆ అమ్మాయి తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య మనవరాలని తెలిసింది. ఆ అమ్మాయి పేరు ‘ప్రమీల’. మద్రాసు నగర మేయరుగా ఉన్న వాసుదేవనాయుడు దర్శకుడు పుల్లయ్యకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఈ ప్రమీలకు ఆయన బాబాయి. ఆ విధంగా తొలిసారే ఎన్టీఆర్‌ సరసనగా నటించే అవకాశం ప్రమీలకు దక్కింది. ఈ సినిమా ప్రీవ్యూకి ప్రమీల హాజరైంది. ధరించింది ముఖ్యపాత్రే అయినా టైటిల్స్‌లో ఆమె పేరు కనిపించలేదు. పుల్లయ్యకు విషయం అర్థమైంది. ప్రమీలను పిలిచి ‘నీ పేరు దేవికగా మార్చాం. అదే పేరు టైటిల్స్‌లో వేశాం ఇకపై నీ వెండితెర పేరు దేవిక’ అన్నారు. ప్రమీల ఆపై దేవికగానే నటించి మంచి పేరు తెచ్చుకుంది. విశేషమేమిటంటే ఆమె తొలి సినిమా ఎన్టీఆర్‌తో అయితే చివరి చిత్రం ‘శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మంద్ర స్వామి చరిత్ర’ కూడా ఎన్టీఆర్‌ తోనే! అక్కినేనిని హీరోగా తీర్చిదిద్దిన ఘనత బలరామయ్యదే. రేచుక్క సినిమాలో చిన్ననాటి లలితాదేవిగా బలరామయ్య చిన్న కూతురు బేబీ అమ్మలు నటించింది. ఆయన అకాల మరణంతో కలతచెందిన అక్కినేని, బలరామయ్య ఆఖరి సినిమా ‘రేచుక్క’లో చిన్న పాత్రలోనైనా కనిపించి ఆయన ఋణం తీర్చుకోవాలనుకున్నారు. ఇందులో నానా పాత్ర ధరించిన అంజలీదేవికి ‘‘ఎటుచూచిన బూటకాలే...ఎవరాడిన నాటకాలే’’ అనే పాట వుంది. నాట్యం చేస్తూ, ఆ నాట్యం చూడవచ్చిన వారివద్ద వున్న ద్రవ్యాన్ని దొంగలిస్తూ వుంటుంది. అక్కినేని ఆ సీనులో ఒక బాటసారి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు. ఆ పాట ఒకానొక చరణంలో ‘‘పాగా చుట్టావ్‌, పగిడీ పెట్టావ్‌-వేషం కట్టావ్‌, మీసం మెలేశావ్‌... దొరకొడుకా అడవుల్లో పులికి ఆకలేసి నీ మీదికి ఒక దుముకు దుమికితే...నిలబడి కలబడతావా... లాలించి లంచం పెడతావా’ అంటూ అంజలీదేవి అక్కినేనిని ఉద్దేశించి అడుగుతూ, సొమ్మున్న సంచిని తస్కరిస్తుంది. అప్పుడు ఎన్టీఆర్‌ కల్పించుకొని ఆ సొమ్మును అక్కినేనికి తిరిగి ఇప్పిస్తారు. అలా అక్కినేని తన ఆశయాన్ని నేరవేర్చుకున్నారు. అక్కినేని ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 15 సినిమాల్లో ‘రేచుక్క’ మూడవది. ఎన్టీఆర్‌కు ఈ సినిమాలో నటించినందుకు ఇచ్చిన పారితోషికం పదిహేను వేలు. ఈ సినిమా నిర్మాణం నెప్ట్యూన్‌, ప్రకాశ్‌ స్టూడియోల్లో జరిగినా, సింహభాగం చిత్రీకరణ రేవతి స్టూడియోలోనే జరిగింది. అడవి దృశ్యాలను నాటి జమాల్‌ గార్డెన్స్‌ (విజయ గార్డెన్స్‌)లో చిత్రీకరిచారు. కేవలం నలభై రోజుల్లోనే రేచుక్క నిర్మాణం పూర్తి చేసుకోవడం వెనుక ప్రతిభాశాస్త్రి ప్రణాళిక, సుందర్లాల్‌ నహతా వేగం వున్నాయి. ఈ సినిమాను తమిళంలో ‘నాట్టియ తార’ పేరుతో అనువదిస్తే, అక్కడ కూడా విజయవంతంగా ఆడింది. సినిమాలో అద్భుతమైన పాటలకు అంతే అందమైన డ్యాన్సులను పసుమర్తి కృష్ణమూర్తి కంపోజ్‌ చేయగా, స్టంట్‌ సోము కత్తి యుద్ధాలను, ఫైటింగ్‌ సన్నివేశాలను ఆకర్షణీయంగా రక్తికట్టించారు. అంజలీదేవి ‘దేవత’ హిందీ సినిమా షూటింగు కోసం బొంబాయిలో ఉండి పోగా పతాక సన్నివేశంలో డూపును పెట్టి లాంగ్‌ షాట్‌ తీశారు. క్లోజప్‌ షాట్స్‌ను ‘స్వప్నసుందరి’ సినిమా నుంచి తీసుకొని ఈ సన్నివేశానికి జతచేసి అనుకున్న విధంగా ఉగాదికి విడుదల చేసారు. పిఎల్‌ రాయ్‌ ఛాయాగ్రహణం బావుంటుంది. తన జన్మవృత్తాతం తెలుసుకున్న యువరాజు రాజ్యం కోసం కోటలో ప్రవేశించకుండా, హారం నెపంతో కోటలోకి వెళ్లడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకే హారాన్ని రెండు మూడు సార్లు సంగ్రహించే సన్నివేశాలను సినిమాలో జొప్పించినా ఎక్కడా ప్రేక్షకుడు విసుగుచెందకుండా ఉండేలా చిత్రీకరిచండం పుల్లయ్యకే సాధ్యమైంది. ఇప్పుడు తెలుగు చలన చిత్రసీమలో సంగీత యువ సంచలనంగా పేరుతెచ్చుకున్న తమన్‌ స్వయానా ఘంటసాల బలరామయ్య మనవడే!




అశ్వద్ధామ స్వరగుళికలు

రేచుక్క సినిమాకు సంగీత దర్శకుడు అశ్వద్ధామ. సన్నజాజుల సౌకుమార్యం, సంపెంగపూల సౌరభం కలిసిపోయినట్లుడే సంగీతాన్ని ఈ సినిమాకు అశ్వద్ధామ అందించారు. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుండగా ఘంటసాల పాడినవి రెండే రెండు. ‘బలేబలే పావురమా గడుసూ పావురమా- ఎగరాలీ సరదా తీరగా పావురమా’’ పాట బాగా పాపులర్‌ అయింది. ‘‘మబ్బులకు సరాసరి ఎగరాలీ హంసలా- చిక్కాలి నీకూ చక్కని చుక్కలూ’’ అంటూ మల్లాది రేచుక్కల అందాలను ఎగిరే పావురం సాక్షిగా వర్ణిస్తే, అంతే గొప్పగా అశ్వద్ధామ బాణీ సమకూర్చడం విశేషం. మరోపాట ‘‘ఒంటరొంటరిగా పోయేదానా ఒకమాట వినిపో’’ పాటను మధ్యమావతి రాగంతో స్వరపరిస్తే అద్భుతంగా అమరింది. ‘‘ఊసుకోమంటే ఉలిక్కిపడతావ్‌’’ అనే చరణం ఉచ్ఛరించేప్పుడు ఘంటసాల గొంతు జీరబోవడం స్పష్టంగా వినవచ్చు. జిక్కి పాడిన ‘‘సొగసేమో - మనసేమో...గారామో అది మారామో...ఆ తీరే వేరేమో’’ పాటలో ‘ప్రేమలేఖలు’ సినిమాలో జిక్కి ఆలపించిన ‘‘ఏకాంతమూ..సాయంత్రమూ’’ పాట ట్యూను గుర్తుకొస్తుంటుంది. జిక్కి పాడిన ‘‘ఆయ్‌ సంబరమే..పండుగలే’’ పాట బలరామయ్య చనిపోకముందు స్వయంగా చిత్రీకరించారు. ‘‘అయ్యో బంగారు సామీ.. ఓరబ్బీ బంగారు సామీ’’, ‘‘ఎక్కడిది అందం ఎవ్వరిదీ ఆనందం’’, ‘‘ఎటుచూచినా బూటకాలే’’ పాటలు అశ్వద్ధామ మార్కు పాటలని చెప్పవచ్చు. అశ్వద్ధామ కూతురు వీణ గాయత్రి తమిళనాడు సంగీత, లలిత కళల విశ్వవిద్యాలయానికి తొలి వైస్‌ ఛాన్సలర్‌గా వ్యవహరించి గొప్ప వీణ విద్వాంసురాలుగా పేరుతెచ్చుకున్నారు. ఘంటసాల బలరామయ్యకు అంకితమిచ్చిన ‘రేచుక్క’ సినిమా రాత్రే కాదు పగలు కూడా వెలిగే నక్షత్రమే!


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!