🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩

🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩


👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💥👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿


తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతా అందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యాసభాగవతంలోని శ్లోకాలను చెప్పుకొని, వాటిని పోతనగారు ఏవిధంగా తెనిగించారు, ఆభావాలను ఏవిధంగా చెప్పారో పోల్చి చూసుకుందాం.


"ఓమ్ నమో భగవతే తస్మై యత ఎతచ్చిదాత్మకం, పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి"


ఎవని ప్రవేశముచే జడములైన శరీరమనంబులు చేతనములౌనో, ఓంకార శబ్డంబునకు లక్ష్యమై శరీరంబున ప్రకృతీ పురుషులు తానైయున్న సర్వసమర్ధుడైన పరమేశ్వరునకు మనంబున నమస్సులు అర్పించుచున్నాను.


ఎందుచేతనో గాని పోతనగారు ఈశ్లోకాన్ని తెనిగించలేదు. ఈశ్లోకంలో వ్యాసులవారు సృష్ట్యాదిలో జరిగిన సంఘటనను తెలియజేసారు. ఈవిషయాన్ని పైంగలోపనిషత్ లో యాజ్నవల్క్యముని పైన్గలునికి ఉపదేశించారు. సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే వున్నాడు. ఆపరమాత్మలోనే సకలము సంకుచిత వస్త్రమువలె దాగివున్నది. ఆపరమాత్మనుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తు ఏర్పడెను. ఆ మహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగా నుండెను. అందుండి తమోగుణాద్రిక్త మగు అహంకారము పుట్టెను. ఆఅహంకారము నందు ప్రతిఫలించిన పరబ్రహ్మము విరాట్ అను చైతన్యమై యుండెను. దానినుండి గర్భోదకశాయి అయిన శ్రీమహావిష్ణువు పుట్టెను. (ఈయన స్థితి కారకుడైన, సత్వగుణప్రధానుడైన, నాలుగు చేతులు గల విష్ణువు కాదు.) ఈయన నుండే సూక్ష్మ పంచ భూతములు పుట్టినవి. ఆ పంచభూతముల వివిధరకములైన కలయకల వలన ప్రాణశక్తి, అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరాలు, మనుషులు, దేవతలు, మన విశ్వంతో పాటు అనేక బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. కాని ఆ దేహేన్ద్రియాలు చైతన్యమూర్తియగు పరబ్రహ్మ లేకుండా స్పందనకలిగి యుండుటకు, పనిచేయుటకు సమర్ధతలేకుండెను. అప్పుడు ఈపరిస్థితిని గమనించిన పరబ్రహ్మ, బ్రహ్మండములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకములను బ్రద్దలుచేసి వాటన్నిటి యందు చైతన్య రూపములో ప్రవేశించెను. ఆ రంధ్రమే మన తలలో నున్న బ్రహ్మరంధ్రము. (సహస్రారచక్రము. పరబ్రహ్మ వచ్చిన ఈరంధ్రము గుండానే మనం బయటకు వెళ్ళితే ఆ పరబ్రహ్మను చేరుకుంటాము. ఈ విషయాన్నీ ఇంకొకసారిముచ్చటించుకుందాము.)అప్పటినుండి ఈ శరీరాలు చైతన్యమయమయ్యాయి. ఆ విషయాన్నే గజేంద్రుడు ద్వారా వ్యాసులవారు మనకు చెప్పారు. తర్వాత ఓంకార శబ్దమునకు లక్ష్యమైనదని చెప్పినారు. పెద్దలు "తస్య వాచకః ప్రణవః, తజ్జపః స్తదర్ధ భావనః" అని తెలియజేసినారు. ఆపరమాత్మ యొక్క సర్వనామము (pronoun) ఓంకారమని, దానిని జపించినచో ఆపరమాత్మ యొక్క అర్ధమూ, భావననూ పొందవచ్చునని చెప్పినారు. అందువల్ల ఓంకారమునకు లక్ష్యము ఆ పరబ్రహ్మేనని, వేరే యితరములు కావని స్పష్టమగుచున్నది. శరీరమున ప్రకృతీపురుషులు తానై యున్నాడని చెప్పినారు.మనశరీరములో ముఖ్యముగా రెండు వున్నవి. ఒకటి పదార్ధము (matter). అదియే ప్రకృతి. రెండవది చైతన్యము. అదే ఆత్మ(energy). ఈ చైతన్యముయొక్క మహాస్వరూపాన్నే ఉపనిషత్తులలోను, పురుషసూక్తములోను పురుషశబ్దంతో తెలియజేశారు. ఈ ప్రకృతిపురుషులకలయిక తోనే జీవరాసులు ఏర్పడినాయి. ఈ ప్రకృతిపురుషులు రెండున్నూ ఆపరబ్రహ్మ తప్ప వేరే ఇంకెవరూ కారు.చూసారా! వ్యాసులవారు ఎన్ని పెద్ద విషయాలని ఒక చిన్న శ్లోకంలో చెప్పారో! ఇలా చిన్న పదాల లోంచి అంతర్గతంగా వున్న మహాజ్ఞానాన్ని వెతుక్కోవటమే తత్వవిచారణ.ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.


"యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదంస్వయం, యో-స్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం"


"ఎవని ఆధారమున విశ్వంబు నిలిచియున్నదో, ఎవ్వనినుంచి ప్రభవించినదో, ఎవరు దానిని సృజించిరో, ఎవరు స్వయముగా తానే విశ్వమై ప్రకటితమయ్యెనో, ఎవరీ దృశ్యప్రపంచముచే, దాని కారణభూత ప్రకృతిచే విలక్షణమై శ్రేష్టమై తనంతతా కారణరహితుడై ప్రభవించునో అట్టి భగవానుని శరణము నొందుచున్నాను."


దీని అర్ధం చాల తేటతెల్లంగా వుంది. వేరే వివరణ అవుసరం అక్కరలేదు. కాని చివర ఒక విషయం చెప్పారు. అన్నీ తానే అవుతూ, మళ్లీ కారణరహితుడై ఉంటాడట. అంటే అన్నీ తానేచేస్తాడు, చేయిస్తాడు. మళ్ళా దేనితోను సంబంధంలేకుండా, దేన్నీఅంటుకోకుండా ఉంటాడు.కాబట్టి మనంకూడా ఈ విషయాన్నే అనుసరించాలి.ఈపదార్ధపూరితమైన ప్రకృతిలో వుంటూ, దీనికి సంబంధించిన పనులు, ఇంకా మిగతావి వాటిని అంటుకోకుండా అంటే నిష్కామంగాచేయాలి. అప్పుడు ఆకర్మలయొక్క ఫలితాలు మనకు అంటుకోవు. పైగా కర్మరాహిత్యం కూడా అవుతుంది. ఈవిషయాన్నే పరమాత్మ భగవద్గీతలో "కర్మణ్యేవాధికారస్తే" అని చెప్పాడు. ఈవిషయాన్నే మనకు వ్యాసులవారు కూడా నర్మగర్భంగా చెప్పారు. ఈశ్లోకాన్ని పోతనగారు తెనిగిస్తూ ఇంకొక విధంగా చెప్పారు.


"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, యెవ్వని యందుడిందు, బరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా, డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్."


తత్వవిచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ, ముఖ్యమైనది. ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్నిఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో యీ పద్యంలో పోతనగారు చెప్పారు. ఆయన స్వయంగా ఒకయోగి. యోగ తత్వరహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలోచొప్పించారు.ప్రస్తుతం యీపద్యాన్ని నాలుగుముక్కలుగా విడదీసుకోవాలి.మొదటిది ప్రశ్నా భాగం. రెండవది ఒక్క "వానిని" అన్న మాట మాత్రమే. మూడవది "ఆత్మభవునీశ్వరు". మిగతాది నాల్గవది.పోతనగారు ఇక్కడ మంచిగమ్మత్తు చేసారు. ముందర మనకి ఎలాప్రశ్నలు వేయాలో నేర్పారు. తర్వాత ఆప్రశ్నలు వేసుకొని, వాటికి సమాధానాలు రాక మనం ఇబ్బందులు పడతామని గ్రహించి, "వానిని" అంటే ఆ ప్రశ్నలకు సమాధానమైన వానిని అని, మళ్లీ వాడెక్కడ ఉన్నాడో తెలియక కలవరపడతామని, "ఆత్మభవుని" అంటే మనఆత్మలోనే, మనకు చాలాదగ్గరలోనే ఉన్నాడని విశదీక రించారు. చూసారా!తత్వవిచారణాపధ్ధతిలో యీపద్యాన్ని అనుసరించినట్లయితే, పరబ్రహ్మస్వరూప జ్ఞానం కోసం ఏవిధమైన పరిశోధన జరపాలి, వాడెక్కడవున్నాడు, వాడిని పట్టుకోవాలంటే ముందర దేన్ని తెలుసుకొని దర్శించాలి, దేన్నిపట్టుకొంటే ఆపరమాత్మ దొరుకుతాడు మొదలైన విషయాలన్నీ చాలా తేలికగా తెలుస్తాయి. ఇదీ పోతనగారి గొప్పతనం.గజేంద్రుడి మిషతో మనకు ఇంతటి గొప్ప విషయ పరిజ్ఞానాన్ని అందించారు. ఇక తర్వాతి శ్లోకానికి వెళదాం.


"యః స్వాత్మనీదమ్ నిజమాయయార్పితం, క్వచిద్విభాతం క్వచతత్తిరోహితం


అవిద్ధదృక్ సాక్ష్యుభయం తదీక్షతే, స ఆత్మ మూలో-వతు మాం పరాత్పరః"


ఏ ప్రభువు తన సంకల్పశక్తిచే తన స్వరూపముగా రచింపబడి సృష్టికాలమందు ప్రకటితమై ప్రళయ కాలమందు అప్రకటితమైయుండునో, ఆ శాస్త్ర ప్రసిద్ధ కార్యకారణరూపజగత్తు అకుంఠిత దృష్టి కల్గియుండు కారణముచే సాక్షీరూపమై చూచుచుండునే గాని దానితో నేకీభావము పొందకయుండునో అట్టి ప్రభువు, చక్ష్యాది ప్రకాశకములకు ప్రకాశమైనవాడు, నన్ను రక్షించుగాక.


యీ శ్లోకాన్ని పోతనగారు ఈవిధమగా తెనిగించారు.


"ఒకపరి జగములు వెలినిడి యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై,


సకలార్ధ సాక్షి యగు నయ్యకలంకుని నాత్మమూలు నర్థి దలంతున్"


ఒకసారి లోకాలను సృష్టిచేసి, ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ, ఆలోకాలు రెండూ తానేయై, అన్ని విషయాలనూ ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానం చేస్తాను.


ఆ ఇరువురూ ఇక్కడ పరబ్రహ్మము యొక్క క్రియా, నిష్క్రియాపరత్వాలను, ఆయనయొక్క సాక్షీభూత తత్వాన్ని, తేజః స్వరూప పరాచైతన్యాన్ని తెలియజేసారు. ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.


"కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు


తమసతదా--సీద్ గహనం గభీరమ్ యస్తస్య పారే-భివిరాజతే విభు:"


కాలప్రవాహమునుండి సంపూర్ణలోకములు, మరియు బ్రహ్మాదిలోకపాలకులు పంచభూతముల ప్రవేశించిన తర్వాత, ఆ పంచభూతముల నుండి మహాత్తత్త్వపర్యంతము సంపూర్ణకారణములు వాని పరమకారణరూపప్రకృతిలో లీనమై పోయినప్పుడు దుర్గమమైన అపారఅంధకార ప్రకృతి యుండును. అట్టి అంధకారంబునకావల తనదౌ పరమధామమున ఏసర్వవ్యాపక భగవానుడు అన్నిదిక్కుల ప్రకాశించుచుండునో, ఆప్రభువు నన్ను రక్షించుగాక.


"లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం


జీకటి కవ్వల నేవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్"


లోకాలూ, లోకాలను పాలించేవారూ, లోకాలలో ఉండేవారూ, అందరూ నశించిన అనంతరం, ఆ కారుచీకట్లకు అవతల అఖండమైన రూపముతో ప్రకాశించే వాడిని నేను భావించి సేవిస్తాను.


ఇక్కడ వారిరువురూ ఒకే భావాన్ని చెప్పారు. మహాప్రళయకాలంలో మన భూమి మొదలుకొని సృష్టికారకుడైన చతుర్ముఖబ్రహ్మ వరకూ అంతయూ పంచభూతాలలోను, ఆపంచభూతాలు 'విరాట్' లోను, ఆవిరాట్ 'మహత్తు' లోను ఆమహత్తు 'పరబ్రహ్మ' లోను కలసి పోయినప్పుడు ఇక అంతులేని దుర్గమమైన అంధకారం మాత్రమే వుంటుంది. దానినే పోతనగారు 'పెంజీకటి' అన్నారు. ఆ చీకటికి అవతల ఆసమయములో ఒక్క పరబ్రహ్మ మాత్రమే వుంటాడు. ఆపరబ్రహ్మస్వరూపాన్ని నేను సేవిస్తా నన్నారు ఆ ఇరువురూ. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం చెపుతాను. కళ్ళుగట్టిగా మూసుకోండి. ఏంకనపడుతుంది? అదే పెంజీకటి. దానికవతల చూడగలిగితే, మనకు కనపడేది పరబ్రహ్మ స్వరూపమే! యీ విషయాన్నే వ్యాసులు, పోతన లిరువురూ మనకు తెలియజేసారు. ఇక తర్వాతి శ్లోకానికి వెళదాం.


"న యస్యదేవాఋషయః పదం విదుర్జంతు: పునః కో-ర్హతి గంతుమీరితుమ్


యధా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్య యానుక్రమణః నమావతు"


భిన్నభిన్నరూపంబుల నాట్యంబుచేయు వానియొక్క వాస్తవస్వరూపంబునెట్లు ప్రేక్షకుడు గ్రహించలేడో ఆప్రకారము సత్వప్రధాన దేవఋషులు సైతము నీదైన స్వస్వరూపము దెలియలేరనిన యప్పుడు వేరెవ్వరు సాధారణజీవులు యాస్వరూపజ్ఞానము కల్గియుందురు! అట్టి దుర్గమ విషయంబుల గుర్తించు ప్రభువు నన్ను రక్షించు గాక!


"నర్తకునిభంగి బెక్కగు మూర్తులతో నెవ్వడాడు? మునులు దివిజులుం


గీర్తింప నేరరెవ్వని, వర్తన మొరు లెరుగరట్టివాని నుతింతున్"


నర్తకునిలాగ పెక్కురూపాలతో ఎవడు నాట్యము చేస్తుంటాడో, ఋషులు, దేవతలు ఎవనిని కీర్తింప లేరో, ఎవని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా వుంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను."


ఇక్కడ ఇరువురూ కూడా ఆ పరబ్రహ్మము యొక్క చెయిదములను, అసలు స్వరూపాన్ని ఎవరూ కనుగోనలేరని తెలియజేసినారు. ఇక్కడ ఇంకొక రహస్యం వుంది. పాదరసంతో చేసిన లింగమునకు ఇంకాస్త పాదరసంతగిలిస్తే ఆపాదరసం ఆలింగంలో కలిసిపోతుంది. అలాగే పరబ్రహ్మమును తెలుసుకొన్న వారు పరబ్రహ్మమే అవుతారు. శృతి "బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి" అంటోంది. వారికి ఇక అంతకు ముందున్న స్వరూపం వుండదు. ఆ పరబ్రహ్మములో మమైక్యం చెందినవారు ఇక బయటకు రాలేరు, మనకు ఏమీ చెప్పలేరు.కాబట్టి పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొన్నవారు విడిగా ఎవరూ వుండరు. ఈవిషయాన్నే వారిరువురూ మనకు తెలియజేసారు.


"దిదృక్షవో యస్యపదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః


చరన్త్య లోక వ్రతమవ్రణం వనే భూతాత్మ భూతాః సుహృదః స మే గతి:"


అనాసక్తులై సంపూర్ణప్రాణులయందు ఆత్మబుద్ధినుంచి అందరియందు అకారణముగ హితవుంచి అతిశయ సాధుస్వభావము గల్గిన మునిగణములు, ఏ పరమమంగళమయ స్వరూపమును సాక్షాత్కరింప జేసుకొను కోరికచే, వనములందు వసించి అఖండ బ్రహ్మచర్యాది అలౌకిక వ్రతపాలనము జేయుదురో, అట్టి ప్రభువు నాకు గతి యగుగాక.


"ముక్తసంగులైన మునులు దిదృక్షులు, సర్వభూతహితులు సాధుచిత్తు


లసదృశ వ్రతాడ్యులై కొల్తురెవ్వని, దివ్యపదము వాడు దిక్కు నాకు."


ప్రపంచంతో సంబంధాలు వదలివేసిన మునులు, భగవంతుణ్ణి చూడాలనికోరేవారూ, అన్ని ప్రాణులకు మేలు కోరేవారూ, మంచిమనసు కలవారు, సాటిలేని వ్రతాలు ఆచరించుతూ ఎవనిపాదాలను సేవిస్తారో అటువంటి దేవుడు నాకు అధారమగుగాక!


ఇక్కడ వారిరువురూ కూడా పరమహంసస్థాయి గలవారు ఏరీతిగా ఉంటారో, వారెటువంటి గుణ గణాలతో వుంటారో, కేవలము ఆపరబ్రహ్మముతో అనుసంధానింపబడిన ఆత్మతో తప్ప ఇతరముగా ఎలా వుండరో చెప్పారు.


"న విద్యతే యస్య చ జన్మకర్మవా న నామరూపే గుణదోష ఏవ వా


తథాపి లోకావ్యయసంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి


తస్మై నమః పరేశాయ బ్రహ్మణే-ననంతశక్తయే అరూపాయోరురూపాయ నమః ఆశ్చర్య కర్మణే


నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి


సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా నమః కైవల్యనాధాయ నిర్వాణసుఖసంవిదే"


ఎవరి జన్మము మనవలె కర్మబంధముతో జరుగదో, ఎవరిచే నహంకారప్రేరిత కర్మ కావింపబడదో, ఎవరినిర్గుణస్వరూపమునకు నామదేయంబులు లేవో, రూపము లేదో, అయిననూ ఎవ్వరు సమయాను సారంబున జగత్సృష్టిలయంబుల గావించుచూ, స్వేచ్ఛతో జన్మంబు తనకుతా పొందునో, అట్టి అనంతశక్తి సంపన్న పరబ్రహ్మ పరమేశ్వరునకు నమస్కారము చేయుచున్నాను. ఆ ప్రకృతి ఆకారరహితమైయ్యూ అనేకాకారంబులు గల్గియుండు అద్భుతకర్మాచరణుడైన భగవానునకు పలుమార్లు నమస్కరించు చున్నాను. స్వయం ప్రకాశమూర్తి, సాక్షీభూతుడైన పరమాత్మకు నమస్కారములు చేయుచున్నాను. ఏ ప్రభువు మనోవాక్చిత్తవృత్తుల కతీతుడై సర్వత్ర వ్యాపించియుండునో వానికి పలుమార్లు నమస్కరించు చున్నాను. వివేకియైన పురుషునిచే, సత్వగుణ విశిష్టనివృత్తి ధర్మాచరణముచే ప్రాప్తయోగ్యమైన మోక్ష సుఖంబునిచ్చువాడు, మరియు మోక్షసుఖానుభూతి రూపుడైన ప్రభువునకు నమస్కారము చేయు చున్నాను.


"భవము దోషంబు రూపంబు గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక


జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయ నెవ్వడిన్నియును దాల్చు


నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మకిద్ధరూపికి రుపహీనునకును


జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని బరమాత్మునకు బరబ్రహ్మమునకు


మాటలను నెరుకల మనముల జేరంగగాని శుచికి సత్త్వగమ్యు డగుచు


నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు."


భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింప జేయడం కోసం తన మాయాప్రభావంతో యివన్నీ ధరిస్తాడు. రూపం లేని వాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మ కాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకుమూలం. అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ వూహలకూ అందరానివాడు, పరిశుద్ధుడు. సత్వగుణంతో దరిచేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.


ఇక్కడ ఇరువురూ కూడా ఒకే భావాన్ని వేర్వేరు శబ్దాలతో చెప్పారు. ఇక్కడ పోతనగారు వ్యాసులవారి భావాన్ని చక్కగా తెనిగించారు.


"నమో శాంతాయ ఘోరాయ మూడాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ


క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః


సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వ ప్రత్యయహేతవే అసతాచ్ఛాయయోక్తాయ సదా భాసాయ తే నమః


నమో నమస్తే-ఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ


సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమో-పవర్గాయ పరాయణాయ"


సత్వగుణము స్వీకరించియూ, శాంతరజోగుణంబుల స్వీకరించియూ, ఘోరమైన తమోగుణంబును స్వీకరించియుండు మూర్ఖుని మొదలు గుణవంతుడగు వానివరకు భేదరహితుడగుటచే సదా సమ భావముతో స్థితుడైయుండు జ్ఞానఘనుడైన ప్రభునకు నమస్కారము చేయుచున్నాను. సర్వక్షేత్రంబుల నధిష్టించిన క్షేత్రజ్ఞుడా, సర్వసాక్షీ! పరముడవైన మూలపురుషా! ప్రకృతిపురుషుల కాధారభూతా! నీకు నమస్కారము చేయుచున్నాను. ఇంద్రియముల, వాని విషయముల గుర్తించువాడవు నీవే. జ్ఞాన, స్మృతి ప్రదానము జేయువాడవును, సంశయనివృత్తి కారకుడవు నీవే. ఈ సృష్టి అసాంతము నీదు ఛాయయే గదా! ఇందు నీయంశముండుటచే గదా యీసృష్టి సత్యంబని గోచరించుచున్నది. అట్టి సత్య స్వరూపుడవగు నీకు నమస్కారము. నీకై ఏకారణమునూ లేక సర్వకారణంబులకు నీవే కారణున్డవు. అందుచే నీవద్భుతకారణున్డవు. నా నమస్కారములు గైకొమ్ము. సంపూర్ణవేదవిజ్ఞానమున కాశ్రయ భూతుడవు. ముక్తిదాయకుడవు. శ్రేష్టపురుషుల కాధారభూతుడవు. నా హృదయపూర్వక నమస్కారములు గైకొనుము.


"శాంతున కపవర్గసౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషు


నకు, ఘోరునకు గూడునకు గుణధర్మికి సౌమ్యున కధిక విజ్ఞాన మయున


కఖిలేంద్రియ ద్రష్ట కధ్యక్షునకు బహు క్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి


మూల ప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి


నెరి నసత్య మనేది నీడతో వెలుగుచు నుండు నెక్కటికి మహోత్తరునకు


నఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు."


భగవంతుడు శాంతస్వరూపుడు.మోక్షానికి అధిపతి. ఆనందానికి ఆలవాలం. స్వపరభేదం లేనివాడు. దుష్టులకు భయంకరుడు.సంసారబద్ధులకు అందనివాడు.గుణాల ధర్మమూకలవాడు.సరళస్వభావమూ విశేషమైన జ్ఞానము కలిగినవాడు. అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు. అన్నిటికీ ప్రభువు. సర్వజ్ఞుడు.దయారసానికి సముద్రంవంటివాడు. అన్నింటికీ మూలపురుషుడు. ఆత్మకు ఆధారమైన వాడు. ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు. దుఃఖాన్ని తొలగించే వాడు. మాయ అనే నీడతో నిండుగా వెలిగే వాడు, ఒంటరివాడు. మిక్కిలి గొప్పవాడు. అన్నిటికీ బీజమైనవాడు. ఏ కారణము లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడుమంటూ నమస్కరిస్తాను.


ఇక్కడ వారిద్దరూ కూడా ఒకే భావాన్ని వివిధ పదాలతో వ్యక్త పరిచారు. ఇద్దరు ఆ పరబ్రహ్మము యొక్క గుణగణాలను ప్రస్తుతించారు.


"గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూరితమానసాయ


నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయంప్రకాశాయ నమస్కరోమి"


ఏ త్రిగుణమయ కాష్ఠంబుల దాగి జ్ఞానమయాగ్ని యుండునో, అట్టి గుణంబుల కల్లోలమేర్పడ, ఎవని మనమున సృష్టిరచన గావింపగా బ్రహ్మాద్ధ్వంబు దలుచునో అటులనే ఆత్మతత్త్వముయొక్క భావన ద్వారా విధినిషేధ రూప శాస్త్రంబుల కతీతులై బ్రహ్మానందముననుభవించు నిష్కాములైన మహాత్ముల యందు స్వయం ప్రకాశమానుడైనట్టి ఆ ప్రభునికివే నా నమస్కారములు.


"యోగాగ్ని దగ్దకర్ములు యోగిశ్వరు లే మహాత్ము నొండెరుగక స


ద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతు రట్టి పరము భజింతున్."


యోగీన్ద్రులు యోగమనే అగ్నితో తమ పూర్వకర్మలను కాల్చివేసి ఇతరమేమి తలంచకుండా ప్రకాశించే తమ మనసులోని ఏ మహాదేవుని చూస్తుంటారో అటువంటి ప్రభువును నేను సేవిస్తాను.


ఇక్కడ వారిరువురూ కూడా, తమ కర్మలను గుణాలను,సంచితములనూ, యోగముతోనూ, నిష్కామకర్మలతోనూ దగ్దం చేసుకొనే యోగుల మనస్సులలో ఆ పరమాత్మ దర్శనమిస్తాడని చెప్పారు.


"మాదృక్ప్రప్రపన్నపశుపాశవిమోక్షణాయ ముక్తాయ భూరికరుణాయ నమో-లయాయ


స్వాంశేనసర్వతనుభ్రున్మనసి ప్రతీత ప్రత్యగ్ద్రుశే భగవతే బృహతే నమస్తే


అత్మాత్మ జాప్త గృహవిత్తజనేషుసక్తై ర్ద్రష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ


ముక్తాత్మభి: స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ"


పశుతుల్యుడను, అవిద్యాగ్రస్తుడనునగు నావంటి శరణాగతుని అవిద్యను తొలగించువాడును,స్వయం నిత్యముక్తుడును, అతిదయాళువును, కోరినదే తడవుగా త్వరితగతి కరుణించువాడునునగు ఆప్రభువు నకు నానమస్కారము. స్వాంశమునే సంపూర్ణ దేహధారుల మనసునందు అంతర్యామియై యుండు వాడు, సర్వనియంత, అనంతపరమాత్మునకు ఇదే నానమస్కారము. శరీర, పుత్ర, మిత్ర, గృహ, సంపత్తుల యందు మరియు బంధుజనుల యందాసక్తులైన వారికి అతి దుర్లభుడును, ముక్తపురుషుల హృదయమందు నిరంతరమూ వసియించు జ్ఞానస్వరూపుడును, సర్వనియామకుడును నగు ఆ భగవంతునకు నానమస్కారములు.


"సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ మయునికి నుత్తమ మందిరునకు


సకలగుణారణిచ్ఛన్న భోదాగ్నికి దనయంత రాజిల్లు ధన్యమతికి


గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తితకర్మనిర్వర్తితునకు


దిశలేని నాబోటి పశువుల పాపంబు లడచువానికి నమస్తాంతరాత్ము


డై వెలుంగువాని కచ్చిన్నునకు, భగవంతునకు దనూజపశునివేశ


దారసక్తులైనవారి కందగరాని, వాని కాచరింతు వందనములు."


పరమాత్ముడు అన్ని ఆగమాలకు, వేదాలకు సముద్రంవంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైనవాడు. రాపిడి కొయ్యలలో అగ్నివలె సుగుణాలలో దాగియుండేవాడు. తనంత తానుగా ప్రకాశించేవాడు. గొప్ప మనసు కలవాడు. ప్రళయమును, సృష్టిని నడిపేవాడు. నావంటి దిక్కు లేని ప్రాణుల పాపాలను శమింపజేసే వాడు. అందరిలోనూ ఆత్మగా వెలిగేవాడు. నాశనం లేనివాడు. పూజింపదగినవాడు. భార్య పుత్రులూ ఇల్లూ పశువులూ అనే వాటిపై ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి దేవాదిదేవునికి నమస్కారాలు చేస్తాను. ఇక్కడ కూడా ఇరువురూ ఒకే భావాన్ని వేర్వేరు శబ్దాలతో చెప్పారు.


"యం ధర్మకామార్ధవిముక్తికామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి


కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మేదభ్రదయో విమోక్షణం


ఏకాన్తినో యస్య న కంచనార్ధం వాన్ఛన్తి యే వై భగవత్ప్రపన్నాః


అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనందసముద్రమగ్నాః


తమక్షరం బ్రహ్మ పరం పరేశ మవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యం


అతీన్ద్రియమ్ సుక్ష్మవివాతిదూర మనంతమాద్యం పరిపూర్ణమీడే"


చతుర్విధ పురుషార్ధంబుల కోరువారు నీచే వారివారి కోర్కెలను పొందుచున్నారు. అట్టియెడ సాధారణమైన వారు వరంబులు కోరి పొందుటయొక లెక్కయా! అనంత కరుణామయుడవు. నీవు అట్టి వారికి సైతము వైదికాచారసంపన్నమైన దేహంబును ప్రసాదించునట్టి ప్రభువు నన్ను భయంకరమై, భాధాయుతమైన ఈప్రమాదమునుంచి రక్షించి ప్రాపంచకవిషయముల నుంచి తప్పించునుగాక. ఏకాంత చిత్తులైన భక్తులు సేవాపరాయణులై అనన్యమనస్కులైన వారు సంపూర్ణశరణాగతిబొంది భజన ధ్యానంబుల నుండువారు ఆధ్యాత్మికంబైన తాదాత్మ్యము నందియుండు వారలెట్టి వరంబులు కోరు కొనరు. సదా ఆనందసంద్రమున మునకలు వేయుచుందురు. నేనా అదృశ్యశక్తిని, నిత్యనివాసిని, పురుషోత్తముని, బ్రహ్మేంద్రాదులకు ప్రభువైనవానిని, భక్తియోగసులభుని, ఇంద్రియాతీతుడైన పరంధాముని, అనంతుని, మూలకారణమైనవాని, సర్వాంతర్యామిని నమస్కరించుచున్నాను.


"వరధర్మకామార్ధ వర్జితకాములై విబుధులెవ్వాని సేవించి యిష్ట


గతి బొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయదేహమిచ్చు నెవ్వాడు కరుణ?


ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు? రానందవార్ధి మగ్నాంతరంగు


లేకాంతు లెవ్వని నేమియు గోరక భద్ర చరిత్రంబు బాడుచుందు?


రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యు బూర్ణు నున్నతాత్ము


బ్రహ్మమైన వాని బరుని నతీన్ద్రియు, నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు."


అంతేకాక, భగవంతుడు ధర్మంపైన, కామంపైన ఆశలు విడిచిన పండితుల పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమవరాలు అనుగ్రహిస్తాడు. దరిజేరి కోరినవారికి దయతో నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనందసముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యమూ ఆరాధిస్తారు. పరమార్ధాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు. అతడు అందరికంటే ఆద్యుడైనవాడు. కంటికి కానరానివాడు. ఆధ్యాత్మయోగంవల్ల మాత్రమే చేరదగిన వాడు. పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్ఠమైనవాడు. ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూలస్వరూపుడు, సూక్ష్మస్వరూపుడు, అటువంటి మహాత్ముణ్ణి నేను సేవిస్తాను.


ఇక్కడ వారిరువురూ కూడా ఒక రహస్యం చెప్పుచున్నారు. భగవంతుడు తనను నిర్మలభక్తితో సేవించేవారి అన్నికొర్కెలూ తీరుస్తాడు. కాని మోక్షగాములైన వారు మాత్రం ఎటువంటి కోర్కెలుకోరరు. వారు ఒకవేళ కర్మలుచేయాల్సి వస్తే, నిష్కామంగా మాత్రమే చేస్తారు. వారి దృష్టి అంతా ఆ పరబ్రహ్మము వైపే వుంటుంది. అందువల్ల మోక్షగాములైన వారు కర్మలు చేయాల్సి వస్తే, నిష్కామంగా గాని, లేక పరమేశ్వర ప్రీత్యర్ధంగా గాని చేయాలి. భౌతికమైన కోర్కెలతో కర్మలు చేస్తే వారు మోక్షగాములు కారు.


"యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాస్చరాచరాః నామరూపవిభేదేన ఫల్ గ్వ్యా చ కలయాకృతాః


యధా ర్చిషో-గ్నే: సవితుర్గభస్తయో నిర్యాంతి సంయాన్త్యసకృత్ స్వరోచిషః


తథా యతో-యం గుణసంప్రవాహో బుద్ధిర్మనః ఖాని శరీర సర్గాః


స వై న దేవాసురమర్త్యతిర్యగ్ నస్త్రీ నషండో నపుమాన్ న జంతు:


నాయం గుణః కర్మ న సన్నచానన్ నిషేధశేషో జయతాద శేషః"


బ్రహ్మాది సమస్త దేవతలు, చతుర్వేదములు నామరూపసంపూర్ణ చరాచరజీవకోటి ఆకృతిభేదముచే సమస్తము ప్రభునిఅత్యల్పమైన అంశమునుంచి రచింపబడినవి. ఏవిధంబుగా జ్వలించునగ్నితో, సూర్యునితో కిరణంబులు పలుమార్లు వెడలుచుండునో, తిరిగి ఆకిరణములు కిరణములలో లీనమై పోవునో, ఆప్రకారంబుగా మనోబుద్ధి యింద్రియంబులు నానాయోనుల నుద్భవించు శరీరమను యీ గుణమయప్రపంచము ఏస్వయంప్రకాశపరమాత్మ నుంచి ప్రకటితమగునో తిరిగి అందే లీనమగుచున్నది. ఓపరమాత్మ! అది వాస్తవమున దెవతలూగారు, దైత్యులూగారు, మానవులూగారు, తిర్యగ్జాలమూలేదు, స్త్రీపురుషనపుంసకుల నెవ్వరూలేరు. ఇట్టి మూడు విభాగంబులలోనికి రాని ప్రాణికోటులు లేరు. అది గుణములు కాదు. కర్మములూ కాదు. కార్యములూ కాదు. కారణములూ కాదు. ఇట్లు కానివన్ని తొలగించిన తర్వాత ఏ విభాగము మిగిలియున్నదో అదియే దాని స్వరూపము. అట్టి పరమాత్మ నన్నుద్ధరించుట కావిర్భావించుగాక.


"పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్భంగి నిగిడింతు రెట్లడంతు


రాక్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వీల్పుల నఖిలజంతు


గణముల జగముల ఘననామరూపభేదములతో మెరయించి తగనడంచు


నెవ్వడు మనము బుద్ధీన్ద్రియమ్ములు దానయై గుణ సంప్రవాహంబు బరపు


స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక తిర్యగమరనరాది మూర్తియును గాక


కర్మగుణభేద సదసతప్రకాశి గాక, వెనుక నన్నియు దానగు విభు దలంతు"


అగ్నిజ్వాలలనూ, సూర్యుడు వెలుగులనూ ప్రసరింపజేసి మళ్లీ శమింపజేసే విధంగా భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మ మొదలైన దెవతలనూ, అన్ని జీవరాసులనూ, సకల లొకాలనూ, నానా విధాలైన నామరూపభేదాలతో పుట్టించి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధీ, ఇన్ద్రియాలూ అన్నీ తానేయై గుణాలతో ప్రవర్తిస్తాడు. ఆయన స్త్రీ , పురుషుడూ, నపుంసకుడు, నరసురజంతుస్వరూపుడూ కాకుండా గుణభేదాలకు కర్మకు అతీతంగా ఉంటాడు.ఉండడమూ లేకపోవడమూ అనే వాటిని బయలుపరచకుండా ఉంటాడు. ఏదీ కాకుండానే అన్నీ తానే అవుతాడు. అటువంటి ప్రభువును నేను ధ్యానం చేస్తాను.


ఇక్కడ వారిరువురూ కూడా ఆ నిరాకారపరబ్రహ్మ యొక్క అవ్యయస్వరూపాన్ని చాలా చక్కగా వివరించారు.ఎవరైతే పరబ్రహ్మస్వరూపాన్ని ఈవిధంగా తెలుసుకొని అర్ధంచేసుకుని ఆచైతన్యాను భవాన్ని సమాధ్యవస్థలో పొందుతారో వారు తప్పక ఆపరబ్రహ్మములో మమైక్యము చెందుతారు.


"జిజీవిషే నాహమిహాముయా కిం అంతర్బహిశ్చావృతయేభయోన్యా


ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవ స్తస్యాత్మలోకావరణస్య మోక్షం"


నేను మొసలిబారినుంచి రక్షింపబడి జీవించుట కోరను. కారణమేమనగా అన్నివైపులనుండి భయపడుచూ యీగజదేహంబుననే నుండనేల? నేనాత్మ ప్రకాశమును కప్పివేయు ఆ అజ్ఞానము నుంచి నివృత్తి పొందగోరుదును. ఆ అజ్ఞానము కాలక్రమమున నశించునదిగాదు. అది భగవంతుని కృపచే, జ్ఞానోదయముచే మాత్రమే నశించును.


ఈ శ్లోకాన్ని పోతనగారు తెనిగించ లేదు. ఇక్కడ వ్యాసులవారు మనస్సు, బుద్ధి అత్యుత్తమ స్థాయికి చేరుకుంటే ఏవిధమైన ఆలోచనవస్తుందో చూపించారు. ఇక్కడ గజేంద్రుడు ఆపదలతో భయపడుతూ జీవించడానికి ఇష్టపడటం లేదు. పైగా ఈఅజ్ఞానంతో ఎలాబ్రతకాలి అంటూ, ఆఅజ్ఞానం జ్ఞానోదయముచే నశించునంటున్నాడు. ఆ జ్ఞానోదయం ఎలా వస్తుంది? పరిపూర్ణజ్ఞానం తత్వవిచారం తోనేవస్తుంది.దాన్నే గజేంద్రుడుచేస్తూ ఈ మాటలంటున్నాడు.అంటే తత్వవిచారం చేస్తూవుంటే మనస్సు, బుద్ధి యొక్క స్థాయి పరిపక్వస్థితికి చేరుకొని జన్మయొక్క సార్ధకత సఫలం చేసుకోని ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి? అనే అత్యున్నతమైన ఆలోచన వస్తుంది. ఈ భావాన్నే సంత్ కబీర్ గారు ఇలా అన్నారు:


"మర్తే మర్తే జగ్ మరా, మర్నా నజానేకొయి, ఐసా మర్నా కొయి నమరా జో ఫిర్ నామర్నా హొయ్"


"ఈలోకంలో ప్రతిరోజూ జనం చస్తూనే ఉన్నారు. కాని దురదృష్టవశాత్తు చావురాకుండా ఉండేలా చని పోయినవాళ్ళు ఎవరూ లేరు." భగవద్గీత ప్రకారం పుట్టినవాళ్ళు చావక, చనిపోయిన వాళ్ళుమళ్లీ పుట్టక తప్పదు. కాని మళ్లీమళ్లీ పుట్టకుండా చనిపోవడం అంటే ఏమిటి? జన్మమృత్యుచక్రం నుండి బయటకు వచ్చి, ఆ పరబ్రహ్మంలో మహానిర్వాణం చెందడం. అదే మళ్లీమళ్లీ చావకుండా చచ్చిపోవడం. ఇదే జన్మ యొక్క సార్ధకత. ఇందుకే మనం జన్మించాము.


🙏🏿🙏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!