🌹సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి!🌹

🌹సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి!🌹


🚩భారతీయ చలన చిత్ర బహుముఖ ప్రజ్ఞా రాణి ,


స్వర్ణకంకణ దారిణి,బహుకళా భారతి ,ధీరతి ,అష్టావధాని భానుమతి .

-

ఆ మాటలో వెటకారం మనసులో నిర్మలత్వం అభినయం లో శిఖరారోహణ హాస్యం లో అద్వితీయం సంగీతం లో సరస్వతీయం ,హాస్య సాహిత్యం లో సమర్ధత్వం, దర్శకత్వం లో అసామాన్యం ,ఆవకాయ పెట్టినా అత్తగార్ని ఝాడించినా అన్నిటా ఆమెకు ఆమే సాటి .జ్యోతిషం ,వేదాంతాల లోతులు తరచింది .బహుముఖీనప్రజ్నకు ‘’బహు’’ మతి శ్రీమతి పాలువాయి భానుమతి .తెలుగు వారి కి గర్వకారణం .


భానుమతి 1925 సెప్టెంబర్ 7నబొమ్మరాజు వెంకట సుబ్బయ్య సర స్వతమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గర దొడ్డవరం గ్రామంలో మూడవ సంతానం గా జన్మించింది .తండ్రి కి కర్నాటక సంగీతం లో మంచి ప్రావీణ్యం ఉండేది .కూతురు భానుమతిని తనతో బాటు కచేరీలకు తీసుకొని వెళ్లి ఆమెకు సంగీతం లో అభిరుచి కల్గించాడు .క్రమం గా సినిమా పై ద్రుష్టి పడింది .తెలుగు తామిళాలలో రెండు వందల సినిమాలలో నటించి,పాడి రచన సంగీత దర్శకత్వం దర్శకత్వం చేసి ‘’అష్టావధాని ‘’అని పించుకుంది .భరణి స్టూడియో నిర్మించింది .


1939లో వరవిక్రయం సినిమాలో కాళిందిగా నటించి సి.పుల్లయ్య దర్శకత్వం లో తెరంగేట్రం చేసింది భానుమతి మాలతీ మాధవం ,ధర్మ పత్ని,భక్తిమాల చిత్రాలలో నటించింది . కృష్ణ ప్రేమ సినిమాలో నిలదొక్కుకొని అందరి ద్రుష్టి ఆకర్షించింది .స్వర్గ సీమ చిత్రం ఆమె కెరీర్ ను మలుపు తిప్పి అసమాన నటిగా సుప్రతిస్టమైంది .మళ్ళీ మల్లేశ్వరి తో ఆమె నటన పరాకాష్టకు చేరింది .అందులో చిలిపితనం హాస్యం శృంగారం ,విరహం వేదన నాట్యం సెంటి మెంట్ అన్నీ సమర్ధ వంతం గా పోషించి తనకు సాటి లేరని రుజువు చేసింది. అదొక కళా ఖండం గా నిలిచి పోయింది .నాగి రెడ్డి దర్శకత్వ ప్రతిభ దేవుల పల్లి వారి సాహిత్య పరిమళం ,రాజేశ్వర రావు సంగీత దర్శకత్వ ప్రతిభ ,రామారావు నటనా వైదుష్యం ,అన్నీ సమపాళ్ళలో కుదిరి క్లాసిక్ అయింది మల్లీశ్వరి చిత్రం .చక్రపాణి సినిమాలో నవ్వుల పువ్వులే పూయించింది .అదొక ట్రెండ్ సెట్టర్ అయింది .చక్రపాణి కలల సాకారం అది .అంతస్తులు సినిమాలో ‘’ దులపర బుల్లాడా ‘’అంటూ చెడును అవినీతిని దులిపి పారేసింది .


నిర్మాత దర్శకుడు అయిన పాలువాయి రామకృష్ణ నుకృష్ణ ప్రేమ సినిమా చిత్రీకరణప్పుడు చూసి వలచి8-8-1943నవివాహం చేసుకొని భరణి కి జన్మ నిచ్చింది .కొడుకు పేరభరణి స్టూడియో నిర్మించి భరణి పిక్చర్స్ బేనర్ తో సినిమాలు నిర్మించింది ఆ జంట .ఆదర్శ దంపతులుగా వారు ఇండస్ట్రీలో వెలిగి పోయారు. రామ కృష్ణ గొప్ప దర్శకుడు .లైలా మజ్ను ,విప్రనారాయణ బాటసారి చిత్రాలు వారి ద్దరి కళా తపనకు నిలువెత్తు అద్దాలు .నాగేశ్వర రావు మజ్నూ గా చిరస్మరణీయ నటన ,లైలా గా భానుమతి ,సముద్రాల సాహిత్యం దాన్ని అమర ప్రేమ కావ్యం గా చేసింది .విప్రనారాయణ లో అక్కినేని ఆ పాత్రనే పోషిస్తే దేవ దేవి గా భాను తన నట ప్రతాపాన్ని చూపించింది .రాజేశ్వర రావు సంగీతం ,ఏ.ఏం.రాజా స్వరం ,భానుమతి మధుర గాత్రం ఆ సినిమాను ఏంతో ఎత్తున నిల బెట్టాయి


నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలనూ చేబట్టి తన సమర్ధత ను నిరూపించుకోవాలనుకొని ‘’చండీ రాణి ‘’సినిమాను 1953లో తెలుగు తమిళ హిందీ భాషల్లో తీసి దర్శకత్వం నిర్వహించి తోలి మహిళా దర్శకురాలని పించుకోంది.మూడు భాషల్లో ఒకే సారి చిత్రాన్ని నిర్మించటమూ అపూర్వవిషయమే .దేనికైనా సమర్ధురాలు భానుమతి ఆమెది కుశాగ్ర బుద్ధి .తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా దొరై భానుమతికి Nadippukku Ilakkanam” ‘’నటనకు వ్యాకరణం ‘’ అనే బిరుదు ప్రదానం చేశాడు .నట శిరోమణి జెమిని గనేషన్ ,తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి ,వందలాది సినిమాల హీరో ఏం జి.రామ చంద్రన్ భానుమతి తో సినిమాలలో నటిస్తూ సెట్ మీద ఆమె లోని అసమాన ప్రతిభకు ,ఆమె సాహసానికి ,ధైర్యానికి పెర్ఫెక్షన్ కు అబ్బురపడటమే కాదు ఆమె అంటే భయ పడేవారు కూడా .తెలుగు అగ్ర శ్రేణి నటులందరూ ఆమె తో నటించారు భానుమతి తమ గురువు అన్నారు అక్కినేనినందమూరి .చాలా రిజర్వేడ్ గా ఉండేది .ఎక్కడా సభ్యతా సంస్కారాలకు తేడా ఒచ్చినా సహించేదికాదు.అదే ఆమె గొప్ప తనం అందుకే అందరికీ అభిమానం .నటనకు చిరునామా గా ,సభ్యతకు పర్యాయ పదం గా ,భక్తికి పరాకాష్టగా ,ఆప్యాయతకు మరో పేరుగా స్నేహానికి ,ఆదరణకు పెట్టింది పేరుగా ఉండేది


ఒక సారి అంతస్తులు సినిమా షూటింగ్ అప్పుడు భానుమతికి హైదరాబాద్ లో రిట్జ్ కార్లతాన్ లో సూట్ బుక్ చేశాడు దర్శకుడు వి.బి.రాజేంద్ర ప్రసాద్ .ఆమె అంతఖర్చు నిర్మాత మీద పెట్టటం భావ్యం కాదని సారధిస్టూడియో లోనే ఉన్నది అక్కడ పాములు తిరిగేవి .రాత్రి పడుకొంటే ఎలుకలు వేలి గోళ్ళు కొరికాయి .ఉదయాన్నే రాజేంద్ర ప్రసాద్ వచ్చి అయోడిన్ రాయించి షూటింగ్ కేన్సిల్ చేద్దామా అని అడిగాడు .’’చిన్న చిన్న విషయాలకే షూటింగ్ కేన్సిల్ చేస్తే నేను భానుమతిని ఎలా అవుతాను “’?అని చెప్పి యదా ప్రకారం చిత్రీకరణలో పాల్గొన్న సాహస చండీ రాణి భాను .1985భర్త రామ కృష్ణ మరణించారు .అయినా మొక్కవోని ధైర్యం తో తన కార్యక్రమాలను యదా ప్రకారం కోన సాగించిన ధీర వనిత .


తెలుగు చిత్ర పరిశ్రమ లో అద్వితీయ నటనకు భానుమతి పేరు పొందింది .అందం చందం అభినయం చందమామ లాంటి గుండ్రని ముఖం కాణీ కాసంత కుంకుమ బొట్టు ఒంటి నిండా చీర తో భానుమతి సాక్షాత్తు అపర సరస్వతి గా భాసించేది భాను తేజం ఆమె లో ఉండేది .ఆమెను చూసి తల దిన్చుకొన్న వారే కాని తాల ఎత్తుకొన్న వారుండేవారు కాదు .అగ్ర నటులకూ ఆమె అంటే హడల్ .నటనకు పెద్ద బాల శిక్ష గా ఉండేది .సంగీతానికి సరస్వతి అనిపించేది దర్శకత్వానికి దార్శనికురాలని పించేది .నిర్మాణానికి సమర్దురాలని పించేది .ఇన్ని విషయాలు ఆమెలో దాగి ఉండి అవసరమైనప్పుడు వెలువడి ప్రతిభ ను వ్యక్తం చేసేవి .కర్నాటక ,హిందూ స్తాని సంగీతాలలో ఆమె నిష్ణాతురాలని పించుకోన్నది .నటికి బాల గ్రౌండ్ పాట పాడే వారు వేరుగా ఉండేవారు .కాని భానుమతి నటిస్తుంటే తన పాట తానె పాడుకొనేది .అదీ ఆమె ప్రత్యేకత .అలాకాక పొతే నటించేదే కాదు .హీరోయిన్ గా చేసినా కేరక్టర్ యాక్టర్ గా ఉన్నా చిత్రం లో ఆమెదే సింహ భాగం .భానుమతి పాడిన ‘’పిల చినా బిగువటరా ‘’,కిలకిల నవ్వులు ‘’ప్రేమే నేరమౌనా ,’’ ఎంత హాయి ఈ రేయి నిండెనో “’కోతీ బావాకు పెళ్ళంటా ‘’,జయదేవుని అష్ట పదులు అన్నీ రసగుళికలే .ఆపాత మధురాలే .మళ్ళీ మళ్ళీ వినాలని పించేవే .ఎన్ని సార్లు విన్నా తనివి తీరనివే .’’భక్త మార్కండేయ’’ చిత్రాన్ని అందరూ బాలలతో తీసి సంచలనం సృష్టించింది భానుమతి .పల్నాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు పాత్ర రామా రావు తో నాగమ్మ పాత్ర లో భానుమతి అత్యద్భుతం గా నటించి అవార్డ్ పొందింది .రామినీడు దర్శకత్వ ప్రతిభ కు అది దర్పణంఆమె పాడిన ”ఒహొహొ పావురమా ”ఇంకా చెవుల్లో రింగు మంటూనే ఉంది .ఱజనీ కాంత రావు తో పాడిన పాటలూ మధురాలేభానుమతి చిత్రం తో తపాలా బిళ్ళ ను కేంద్ర ప్రభుత్వం వెలువరించింది అమె తో బాటు అదేసమయం లో రామా రావు ,రంగారావు పేరా విడుదల చేసి ముగ్గురికీ గౌరవం కల్పించారు


భానుమతికి అనేక సంస్థల తో అనుబంధం ఉండేది .రాష్ట్ర ఫిలిం అవార్డ్ కమిటీ సభ్యురాలుగా రెండేళ్ళు ఉంది .ఫిలిం ఇన్స్టిట్యూట్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఒక ఏడాది పని చేసింది .బాలల చలన చిత్రోత్సవ కమిటీ కి అయిదేళ్ళు సభ్యురాలుగా 1965-70లో ఉన్నది .


భానుమతి ఎన్నో కధలు రాసింది .అందులో హాస్యం అడుగడుగునా పండించింది .అత్తగారి ని అడ్డం పెట్టుకొని ఎంతో సాహిత్యాన్ని సృష్టించి సృజనాత్మక రచనకు సరిరారు తనకేవ్వరూ అని పించింది .’’నాలో నేను ‘’అనే స్వీయ జీవిత చరిత్రను భానుమతి రాసుకొన్నది .దీనినే ఇంగ్లీష్ లో ‘’మ్యూజింగ్స్ ‘’గా అనువాదం చేసి ప్రచురించారు భానుమతి ‘’అత్త గారి కధలు ‘’కు రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .ఆంద్ర రాష్ట్ర లలిత కళా ఆకడేమికి అయిదేళ్ళు సాహిత్య అకాడేమికి పదేళ్ళు సభ్యురాలుగా సేవలందించింది .తమిళనాడు ప్రభుత్వ సంగీత కళా శాలకు ప్రిన్సిపాల్ గా డైరెక్టర్ గా నియమించి గౌరవించింది .


అనేక సాంఘిక సేవా సంస్థలతో భానుమతికి ప్రత్యెక స్థానం ఉండేది .చికాగో కి చెందినా ‘’ఆల్ ట్రూసా ఇంటర్నేషనల్ సంస్థ’’కు ప్రారంభం నుంచి (1963)జీవితాంతం వరకు సభ్యురాలు . ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ లో జీవిత సభ్యురాలు .చెన్నై లో సాలిగ్రాం లో ‘’డాక్టర్ భానుమతీ రామ కృష్ణ మెట్రిక్ స్కూల్ ‘’ను స్థాపించి పేదలకు ఉచిత విద్యా సౌకర్యం కలిపించింది


భానుమతికి 1966లో పద్మశ్రీ ,2003లో పద్మ భూషణ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసి ఆమె సమర్ధతకు తగిన ట్లు గౌరవించింది .అంతస్తులు ,పల్నాటి యుద్ధం చిత్రాలలో అసమాన నటనకు రాష్ట్రపతి అవార్డ్ లు పొందింది .’’నాలో నేను ‘’అనే స్వీయ చరిత్రకు 1964లో ప్రభుత్వ జాతీయ ఉత్తమ రచనా పురస్కారం అందుకొన్నది .రఘుపతి వెంకయ్య పురస్కారం నందీ పురస్కారం యెన్.టి రామారావు జాతీయ పురస్కారాలను పొందింది .తమిళనాడు ప్రభుత్వం ‘’కలైమణి’’ప్రదానం చేసింది .ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరిస్తే వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది .రాజ లక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం ఆమెను వరించింది .1956లో ఆంద్ర ప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు భానుమతిని ప్రత్యెక ఆహ్వానితురాలిగా ప్రభుత్వం ఆహ్వానించి సత్కరించి గౌరవించింది .ఇలాగౌర్వం పొందిన తోలి నటి ఆమెయే .శృంగేరి శారదా పీఠాదిపతులు జగద్గురువులు శ్రీ అభినవ విద్యా తీర్ధ స్వామి భానుమతికి ‘’శ్రీ విద్యా ఉపాసక ‘’బిరుదును నలభై ఏళ్ళ క్రితమే ప్రదానం చేశారు .అంతటి ఉపాసకురాలు భానుమతి .


తెనాలి రామకృష్ణ ,బొబ్బిలియుద్ధం ,చింతామణి ,అనురాగం ,వివాహ బంధం తోడూ నీడ గృహలక్ష్మి మట్టిలో మాణిక్యం ,విచిత్ర వివాహం అమ్మాయి పెళ్లి ,మంగమ్మ గారి మనవడు ,బామ్మ మాట బంగారు బాట చిత్రాలలో భానుమతి నటనకు సంగీత మాధుర్యానికి ,పరవశించి పోతాం .కారణ జన్మురాలు భానుమతి .భానుమతి నటన అంటే ,గానం అంటే ఉవ్వ్విళ్ళూరి ,ఆరాధించే వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ బేజ వాడ గోపాల రెడ్డి ,రాజమన్నార్,కొడవటి గంటి కుటుంబరావు చక్రపాణి మొదలైన ప్రముఖులెందరో ఉన్నారు


. 2005డిసెంబర్ 24న 80వ ఏట ఆ సంగీత ,సాహిత్య,నట సరస్వతి సత్యలోకం చేరింది( -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-14-ఉయ్యూరు-దీన్ని పంచుకోండి:)


👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!