🌺🌹జయదేవ బృందావనం(అష్ట పది )🌺🌹

🌺🌹జయదేవ బృందావనం(అష్ట పది )🌺🌹


🚩మామియం చలితా


రాధా విరహంలో బాధపడుతున్న కృష్ణుని ఈ అష్టపదిలో మనం చూడవచ్చు. ఆ విరహంలో కృష్ణుని వేణుగానం మాటలుగా మారి మనలిని అలరిస్తుంది.


మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన


సాపరాధతయా మయాపి న వారితాతిభయేన


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


నా చుట్టూ స్త్రీల గుంపు ఉన్నారు. రాధాదేవి చూడగూడని స్థితిలో బృందావనంలో నన్ను చూసింది. హృదయం కదిలిపోయి ఉంటుంది. నేరం చేసిన వాడిని కాబట్టి నన్ను చూసి కూడా పలకరించకుండా వెళుతున్న ఆమెను ఆపలేకపోయాను. కటకటా! ఆ రాధ కోపాన్ని పొంది ఆదరణ లేకుండా వెళ్ళిపోయింది.


విశేషం


తప్పు చేసానని ఒక పక్క ఒప్పుకొంటున్నాడు. మరో పక్క రాధ ఆదరణ లేకుండా వెళ్ళిందంటున్నాడు. చాలా తమాషా నేరం ! ఇది భావ చమత్కారం .హరి (కృష్ణుడు) 'హరిహరీ’ అనుకోవటం శబ్ద చమత్కారం



🚩కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ


కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


ఆ రాధ చాలాకాలం నా విరహంతో ఉన్నది. నా విరహం పోగొట్టుకోవడానికి ఏమి చేస్తుంది?. ఏమి చెబుతుంది? ఆ రాధ లేకపోతే నాకు ధనంతో ఏమి ఉపయోగం? సేవకులతో ఏమి పని? ఇంటితో ఏమి పని? బతికి ఏమి ప్రయోజనం?


విశేషం


ఎవరివల్ల అయితే తాను బాధ పడుతున్నాడో ఆమె గురించి నాయకుడు బాధపడటం ఇందులో తమాషా .



🚩చింతయామి తదాననం కుటిలభ్రు కోపభరేణ


శోణ పద్మమివొపరి భ్రమతాకులం భ్రమరేణ


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


ఎక్కువ కోపంతో కనుబొమలు వంకరయ్యాయి. తుమ్మెదల వలె అవి కదులుతుంటే కదిల్చిన ఎర్రటి పద్మం లాగా ఆమె ముఖం ఉంది.. దాన్ని తలుస్తున్నాను.


విశేషం


కను బొమలను తుమ్మెదతో, ముఖాన్ని ఎర్ర తామరతో పోలుస్తున్నాడు. కోపంతో తిరిగే కనుబొమలు ముఖమనే పద్మం కోసం అటు ఇటు తిరుగుతున్నాయని మధురమైన భావం


🚩తాం అహం హృది సంగతామనిశం భృశం రమయామి


కిం వనే నుసరామి తామిహ కిం వృథా విలపామి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన



తాత్పర్యం


నేను ఆడవిలో ఆ రాధను గూర్చి ఎందుకు వెదుకుతున్నాను? ఇక్కడ ఎందుకు వ్యర్థంగా ఏడుస్తున్నాను!? నా హృదయంలో ఎప్పుడు కలిసి ఉన్న ఆమెను బాగా రమించుచున్నాను (ఇక వేరుగా వెదకటం ఎందుకు?)


విశేషం


ఇక్కడ జీవాత్మ రాధ. పరమాత్మ కృష్ణుడు . నిరంతర స్మరణంతో ముక్తి లభిస్తుంది. జయదేవుని శృంగారం భౌతికాతీతమని ఈ చరణంలో మనకు స్పష్టమవుతుంది .



🚩తన్వి!ఖిన్నమసూయయాహృదయం తవాకలయామి


తన్నవేద్మికుతోగతాసినగతాసి నతేన తేనునయామి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యము


ఓ రాధా ! నీ హృదయము అసూయ చేత బాధపడినదని నేను ఊహిస్తున్నాను. ఎందుకు వెళ్ళావో దానిని తెలియకున్నాను. నీకు నమస్కరించటం చేత బతిమాలుకొనుచున్నాను.


విశేషం


రాధా ఎందుకు వెళ్లిందో కృష్ణునికి తెలుసు. అయినా కారణం తెలియనట్లు మాట్లాడటం శృంగారపర్వంలో ఒక సొగసు.



🚩దృశ్యసే పురతొ గతాగతమేవ మే విదధాసి


కిం పురేవ స సంభ్రమ పరిరంభణం న దదాసి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


ఓ రాధా! నా ముందు కనబడుచున్నావు. రావటం పోవటం చేస్తున్నావు. ఎందుకు ఇదివరకటిలా ఆశ్చర్యకరంగా నీ కౌగిలి ఇవ్వవు!?


విశేషం


కౌగిళ్ళలో ఆశ్చర్యం కలిగించే కౌగిళ్ళు ఉంటాయి. అవేమిటో రసిక శిఖామణులకు తెలుసు.


🚩క్షమ్యతాం అపరం కదాపి తవేదృశం న కరోమి


దేహి సుందరి దర్శనం మమ మన్మథేన దునోమి


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


అందమైన దానా! ఈ దాసుని క్షమించు. ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయను. నాకు నీ దర్శనము ఇమ్ము మన్మథుడు నన్ను కోసి వేస్తున్నాడు


విశేషం


'ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయను.' ఈ వాక్యాన్ని మనమొక సారి పైకి చదువుకొంటే ''ఇంకోరకంగా చేస్తాను" అనే అర్థం వస్తుంది. ఇది ధీర లలిత నాయకుని చమత్కారం.


🚩వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన


బిందుబిల్వ సముద్ర సంభవ రొహిణీరమణేన


హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన


తాత్పర్యం


హరి దాసుడైన బిందుబిల్వ వంశమనే సముద్రంలో పుట్టిన రోహిణికి ఇష్టుడైన


(అనగా బిందుబిల్వ వంశమునకు చంద్రునివంటి) జయదేవ కవి దీనిని చెప్పాడు.


విశేషం


చంద్రుని చల్లదనం అందరికి ఇష్టం.


చంద్రుడిలాంటి జయ దేవుడి కవిత్వమన్నా ఆందరికీ ఇష్టం.


రోహిణీ రమణుడిని అని కవి చెప్పుకోవటంలో విశేషమిది.


- స్వస్తి.


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!