శకుంతల దుష్యంతునితో చెప్పిన నీతి వ్యాక్యాలు !

సభలో భరతుుడుగా అంగీకరించనని పలికినప్పుడు శకుంతల దుష్యంతునితో చెప్పిన నీతి వ్యాక్యాలు .

శకుంతల దుష్యంతునితో పలికినది: వివేకంతో బాగా ఆలోచిస్తే, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే వాడికి ఇహపరాలు రెండూ ఉండవు. అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు చక్కగా ఆచరించ గలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించ గలుగుతాడు. పుత్ర సంతానాన్ని పొంద గలుగుతాడు. గృహస్థ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగిగే ఫలాన్ని పొందుతాడు. అంతే కాక, భార్య అంటే ఎవరనుకున్నావు?

ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సాధించడానికి అనువైన సాధనం. గృహనీతి అనే విద్యకు నెలవైనది. శీలాన్ని ప్రబోధించే గురువు. వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమ గతులు పొందడానికి ఊత కర్రలా ఉపయోగ పడుతుంది. మన్ననకు ముఖ్య హేతువు. ఆదర్శ ప్రాయాలు, కలకాలం నిలిచేవీ అయని రత్నాల లాంటి గుణాలకు నెలవైనది. హృదయానందాన్ని భర్తకు కలిగించేది భార్యయే సుమా !

మగనికి ఇల్లాలి కంటె ఇంపైనది వేరొకటి లేదు. భార్యా పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడయినా, ఎలాంటి పరిస్థితిలోనయినా, ఎలాంటి ఆపదలోనయినా, ఏ తీరాలలోనయినా చుట్టుముట్టినా ఆపదలన్నీ తొలిగి పోతాయి. అంతే కాక, భార్య భర్తలో సగం. అందు వల్ల భర్త కంటె ముందుగానే మరణించిన భార్య పర లోకంలో అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

భర్త ముందుగానే చనిపోతే అతనిని అనుగమిస్తుంది. అట్టి స్త్రీని అవమానించడం ధర్మవిరుద్ధం.

మరో ముఖ్య విషయం. భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు. కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది.

దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు. గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు. మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు.

‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం.

కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. రాజా ! విరుద్ధాలయిన మాటలు ఎందుకు? ఈ నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ లేవు సుమా ! సత్య వాక్యం గురించి శకుంతల ... 

.

"నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత 

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త 

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.1-4-94

.

ఓ రాజా ! మంచి నీటి ,చేదుడు బావులు నూరిటి కంటె ఒక దిగుడు బావి మేలు. కాగా బావులు నూరిటి కంటె కూడ ఒక మంచి యఙ్ఞం మేలు. అలాంటి యఙ్ఞాలు నూరిటి కంటె కూడ ఒక కుమారుడు మేలు.

అట్టి పుత్రులు నూరుమంది కంటె కూడ ఒక సత్య వాక్యం మంచిది సుమా ! వేయి ఆశ్వ మేథ యాగాలు చేసిన ఫలితం ఒక వైపు, ఒక్క సత్యాన్ని మాత్రమే ఒక వైపు త్రాసులో వేసి ఉంచి తూచి చూస్తే, సత్యం వేపే త్రాసు ముల్లు చూపిస్తుంది. సత్యం అంత గొప్పది. సర్వ తీర్ధాలూ సేవించడం, అన్ని వేదాలనూ అధ్యయనం చేయడం కూడ సత్యంతో సాటి రావు !

ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటె సత్యము గొప్పదని అంటారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!