శ్రీ త్యాగరాజస్వామి!!

శ్రీ త్యాగరాజస్వామి!!

.

సంగీతాన్ని ప్రేమించి . సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు నాకు తండ్రి ..ఆయన పాదాలదగ్గర 'బంటురీతి కొలువు' చాలు అంటూ శ్రీ రాముడి కుటుంబం నా కుటుంబం అని చెప్పిన మహా వాగ్గేయకారుడు ..శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు కాకర్ల త్యాగరాజస్వామి..

శ్రీ త్యాగరాజ స్వామి నాదోపాసనలో ముక్తి పొంది భక్తుల కందరికి దారి చూపిన మాహా వాగ్గేయకారుడు. పురందరదాసు, కబీరు తులసీదాసు, రామదాసు వంటి వారు కూడా భక్తిలో నాద యోగస్ధితిని పొంది మోక్షం పొందిన వారే. త్యాగరాజు కారణజన్ముడు.

.

తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో ఉండే కాకర్ల రామబ్రహ్మానికి జన్మించాడు త్యాగరాజు. తల్లి పేరు సీతమ్మ. త్యాగరాజు తాతగారు వీణాకాళహస్తయ్య ఈయన ప్రసిద్ధి కెక్కిన సంగీత విద్వాంసుడు. సంస్కృత, తెలుగు భాషల్లో పాండిత్యం గడించిన త్యాగరాజు శొంఠి వెంకట రమణయ్యగారి వద్ద చేరి సంగీతం అభ్యసించారు. రామకృష్ణానంద స్వామి అనే సన్యాసి ‘నారదోపాస్తి’ మంత్రాన్ని త్యాగరాజుకు ఉపదేశించారు. నారదుడు యతి రూపంలో వచ్చి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంధాన్ని అనుగ్రహించారు. త్యాగరాజు తన కృతులలో అనేక విధాలుగా వారిని స్తుతి చేశారు.

త్యాగయ్యకు పద్దెనిమిదవయేటనే పార్వతమ్మతో వివాహము జరిగింది. తదనంతరం రెండేడ్లకు తండ్రి మరణించాడు. పార్వతమ్మ ఐదు సంవత్సరాల తరువాత మరణించగా, ఆమె చెల్లెలు కమలాంబతో తిరిగి వివాహము జరిగింది. తంజావూరు రాజు శరభోజి ఎన్నో కానుకలను ఇచ్చి వారి సంస్ధానానికి ఆహ్వానించారు. కాని త్యాగయ్య తిరస్కరించారు. అప్పుడు ‘‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా’’ అని కళ్యాణి రాగంలో ఆలాపించారు.

దీంతో విసిగిన అన్నయ్య జపేశం త్యాగయ్య పూజించే రామపంచాయతన విగ్రహాలను కావేరీలో పారవేయగా తెల్లవారుజామున ఆ సంగతి తెలిసి ‘‘ ఎందు దాగినావో ’’ అనే కృతికి ఆకృతి నిచ్చారని ప్రతీతి. దుఃఖంతో భార్య కమాలాంబ మరియు కూతురు సీతాలక్ష్మిని వదిలి అనేక తీర్థయాత్రలు చేసి అనేకానేక ప్రసిద్ధ కీర్తనలు రాసారు.ఆయన పరితాపము చూసి రాముడే కలలో కన్పించి తాను కావేరీలో ఉన్నానని తెలియజేశారట. త్యాగరాజు విగ్రహమూర్తిని తెచ్చుకుంటూ ‘‘రారా మాయింటి దాకా’’ అని అసావేరి రాగంలో పాడారట.

వాల్మీకి లాగానే 2,400 కృతులను ఈయన రచించగా నేడు లభ్యం అవుతున్నవి 600 లకు మించి ఉండవని విజ్ఞుల అభిప్రాయం.ఈయన 72 మేళకర్త రాగాలు మరియు ఎన్నో జన్యరాగాలలో కీర్తనలు రచించారు. అయితే అది కూడా వరుస క్రమంగా సులభ లభ్యం కావడంలేదు. వీరి రచనలలో అత్యున్నతమైన "ఘనరాగ పంచరత్న కృతులు" జగత్‌ ప్రసిద్ది కెక్కాయి. త్యాగయ్య ప్రహ్లాద భక్త విజయము, నౌకా చరిత్ర, సీతారామ విజయం అనే సంగీత నాటికలను కూడా రచించారు.

1767సంవత్సరం మే 4న పుట్టిన త్యాగరాజు దాదాపు 80 సంత్సరాలు జీవించి 1847వ సంవత్సరం జనవరి 6న అంటే పుష్య బహుళ పంచమినాడు ఆ రామునిలో ఐక్యం చెందారు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!