కన్యాశుల్కం

-




🌹🔻


1955 లో 22 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.

అవి మిస్సమ్మ, రేచుక్క, చెరపకురా చెడేవు, కన్యాశుల్కం, జయసింహ, సంతోషం , అర్ధాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగ రాముడు, శ్రీ జగన్నాధ మహాత్మ్యం, బంగారు పాప, బీదల ఆస్థి, ఆడ బిడ్డ, వదినగారి గాజులు, అంతే కావాలి, విజయ గౌరి, కన్యాదానం, శ్రీ కృష్ణ తులాభారం, పసుపు కుంకుమ.


అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది.

ఒక సమకాలీన సాంఘిక సమస్యను తీసుకొని, సభ్యసమాజంలో ఎదురయ్యే సామాన్య జనం నుండి పాత్రలను తీసుకొని రాసిన నాటకమిది. ఇందులో ప్రతి పాత్ర తనదంటూ ఒక మరుపురాని హాస్యభరిత కావ్యాన్ని ఆవిష్కరించింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు, హేయమైన మానవ నైజాల వంటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన నాటకం ‘కన్యాశుల్కము’.

ఇంగ్లిషు, ఫ్రెంచి, రష్యన్‌, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనువాదానికి నోచుకున్న కన్యాశుల్కము, వివిధ నాటక సమాజాల ద్వారా కొన్ని వేల సార్లు ప్రదర్శితమైంది. వినోదా సంస్థ అధినేత డి.యల్‌ నారాయణ ‘కన్యాశుల్కం’ సినిమాను పి.పుల్లయ్య నిర్దేశికత్వంలో సినిమాగా నిర్మించారు.

ఈ సినిమా 64 సంవత్సరాల క్రితం... అంటే 1955, ఆగస్టు 26న విడుదలైంది. తొలివిడత ‘రష్‌’లో ప్రేక్షకాదరణ లభించకపోకపోయినా తరువాతి కాలంలో విడుదలైన ప్రతిసారీ కాసులు రాల్చిన ఈ విలక్షణ చిత్ర విశేషాలు ...


డీ ఎల్‌ అనే ద్రోణావఝుల లక్ష్మీనారాయణ భరణి, రేణుక, తమిళనాడు టాకీస్‌ సంస్థలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేస్తుండేవారు. 1951లో డీఎల్‌తో బాటు దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సుబ్బురామన్‌, రచయిత సముద్రాల భాగస్వాములుగా ‘వినోదా’ బ్యానర్‌ స్థాపించి ‘స్త్రీ సాహనం’, ‘శాంతి’ వంటి సినిమాలు తీశారు. ‘శాంతి’ సినిమా అపజయంపాలైంది. దాంతో భాగస్వాములు ముగ్గురూ తప్పుకున్నారు. 1953లో డీఎల్‌ ఒక్కడే నిర్మాతగా ‘దేవదాసు’ సినిమా తీసి విజయం సాదించారు. విజయానంతరం గురజాడ వారి ‘కన్యాశుల్కము’ నాటకాన్ని సినిమాగా నిర్మించాలనుకొన్నారు. చిన్న చిన్న భేదాబిప్రాయాలు కారణంగా వేదాంతం రాఘవయ్య స్థానంలో పి.పుల్లయ్యను దర్శకునిగా నియమించి, సదాశివ బ్రహ్మం చేత ఆ ఎనిమిది గంటల నాటకానికి సినీ సమీకరణ చేయించారు. అక్కినేని నాగేశ్వరరావును గిరీశం పాత్ర ధరించమని కోరితే, నెగటివ్ రోల్ అని వేయనని, డి ఎల్ ను కూడా సినిమా తీయవద్దని సలహా ఇచ్చారు. డీఎల్‌ది అనుకున్నది సాధించాలనే మనస్తత్వం. అందుకే సినిమా తీసేందుకే మొగ్గుచూపి ఎన్టీఆర్‌ను గిరీశం ప్రాతకు ఒప్పించారు.


ఎన్టీఆర్‌ అప్పటికే సూపర్‌స్టార్‌ స్థాయి చేరుకోవడంతో గిరీశం పాత్రను హీరో పాత్రగా మలిచారు. మధురవాణి లేని కన్యాశుల్కము నాటకాన్ని మనం ఊహించలేం. ఆమెది అందరికాన్నా మహోన్నతమైన పాత్ర. ‘‘మధుర వాణి అనే ఒక వేశ్యశిఖామణి కళింగరాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి లోపం వచ్చివుండేది’’ అని గురజాడవారే ఒకానొకచోట కరకట శాస్త్రి చేత చెప్పిస్తారు. అందుకే ఆ పాత్ర కోసం సావిత్రిని తీసుకున్నారు. లుబ్ధావధానులను పెళ్లి సమయంలో ఏడిపించడం, రామప్పంతుల్ని ఆట పట్టించడంలో సావిత్రి అభినయం అద్భుతం. ఆమె చేత మేజువాణి పెట్టించడం పుల్లయ్య సృష్టి. బుచ్చమ్మ పాత్రకు షావుకారు జానకిని తీసుకోవడానికి ఒక నేపధ్యం వుంది. నిజానికి దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర కోసం తొలుత జానకినే అనుకున్నా కారణాంతరం వలన అది సావిత్రికి దక్కింది. అందుచేత ఈ సినిమాలో ఆమెకు బుచ్చమ్మ పాత్రను ఇచ్చారు.


విజయనగరంలో మధురవాణి (సావిత్రి) అనే వేశ్య బహుజాణ. ఆమెకన్నా జాణతనం కలిగిన గిరీశం (ఎన్టీఆర్‌) అనే ఇంగ్లీషు చదువుకున్న జిత్తులమారి యువకుడు ఒక పూటకూళ్లమ్మ (ఛాయాదేవి) ఇంట్లో వుంటూ మధురవాణితో స్నేహం కలుపుతాడు. రామచంద్రాపురం అగ్రహారంలో పెద్దమనిషిగా చలామణి అయ్యే రామప్పంతులు (సియ్యస్సార్‌ ఆంజనేయులు) బ్రహ్మచారి, వేశ్యాలోలుడు. మధురవాణి దగ్గరకి వస్తుంటాడు. అదే ఊళ్లో లుబ్ధావధానులు (గోవిందరాజులు సుబ్బారావు) అనే అరవయ్యేళ్ల లక్షాధికారి ఉన్నాడు. అతని డబ్బు గుంజే ప్రయత్నంలో రామప్పంతులు అతనిని పునర్వివాహం చేసుకోమని వుసిగొల్పుతాడు. వార్ధక్యంలో పెళ్లెందుకని కూతురు మీనాక్షి (సూర్యాకాంతం) వారించినా లుబ్దావధానులు వినడు. ఆ రోజుల్లో డబ్బులకు ఆశపడి, కన్యాశుల్కము పుచ్చుకొని నోరెరుగని బాలికలను భార్యలేని ముసలివాళ్లకు కట్టబెట్టడం పరపాటి. కృష్ణరాయపుర అగ్రహారంలో వుండే అగ్ని హోత్రావధానులు (విన్నకోట రామన్నపంతులు) అలా పిల్లల్ని అమ్ముకోవడంలో ఘనాపాఠి. అతని పెద్దకూతురు బుచ్చమ్మ (జానకి) చిన్నప్పుడే భర్తను కోల్పోయింది. చిన్నకూతురు సుబ్బమ్మ (బేబీ సుభద్ర)కు తొమ్మిదేళ్లు. ఆ పిల్లను పద్దెనిమిది వందల కన్యాశుల్కానికి రామప్పంతులు ద్వారా లబ్ధావదానుకు అమ్మడానికి అగ్నిహోత్రావధానులు నిశ్చయిస్తాడు. అమాయకురాలైన అతని భార్య వెంకమ్మ (హేమలత) అడ్డుపడి పోట్లాడుతుంది. అయినా ఖాతరు చెయ్యడు.


విజయనగరంలో అప్పులబారి నుండి విముక్తి కాలేక, జిత్తులమారి గిరీశం తన వద్ద ఇంగ్లిష్‌ పాఠాలు నేర్చుకునే అగ్నిహహోత్రవధానులు కొడుకు వెంకటేశం (మాస్టర్‌ కుందు)ను తీసుకొని కృష్ణరాయపుర అగ్రహారం చేరుకుంటాడు. వాళ్ల ఇంట్లో వున్న విధవరాలైన బుచ్చమ్మను చూసి మోహించి ఆమెను లేవదీసుకెళ్లి వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు. ఇంతలో అగ్ని హోత్రావధానులు భార్య ‘‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ అనే వీధి గాయకుల పాటవిని, తన చిన్న కూతురు బ్రతుకు కూడా విధవరికానికే దారితీస్తుందని దుఃఖించి నూతిలో పడుతుంది. అక్కడే వున్న గిరీశం ఆమెను రక్షిస్తాడు. ఈ విషయం అగ్నిహోత్రావధానులు బావమరిది కరటకశాస్త్రి (వంగర వెంకటసుబ్బయ్య)కి తెలిసి ఎలాగైనా బాల్యవివాహాన్ని ఆపి, కన్యాశుల్కము రాబట్టాలనే బావగారి ఆశలకు చరమగీతం పాడాల్సిందేనని నిశ్చయిస్తాడు. స్వయంగా రంగస్థల నటుడు కావడంతో మధురవాణి సహకారంతో తన శిష్యుడు మహేశం (మాస్టర్‌ సుధాకర్‌)కు ఆడపిల్ల వేషం వేసి రామప్పంతులు వద్దకు తీసుకెళ్లి అతనికి లంచమిస్తానని ఆశపెట్టి, అగ్నిహోత్రావధానుల అమ్మాయితో నిశ్చయించిన పెళ్లిని ఆపించమని అందుకు ప్రతిగా ఆడవేషంలో ఉన్న మహేశంతో వివాహం జరిపించమని నాటకమాడుతాడు.


మధురవాణి రంగంలోకి దూకి మహేశంతో పెళ్లి తంతు జరిపిస్తుంది. లుబ్ధావధానులకు అసలు విషయం తెలిసి పశ్చాత్తాపం చెందుతాడు. ఇదే అదునుగా గిరీశం బుచ్చమ్మను లేవదీసుకొని విశాఖపట్నం చేరుకొని సౌజన్యరావు (గుమ్మడి) అనే సంస్కారవంతుడైన వకీలును కలిసి సాయం కోరతాడు. ఈలోగా వీరిని వెదుక్కుంటూ అందరూ విశాఖపట్నం చేరుకుంటారు. మధురవాణి జరిగిన విషయాన్ని సౌజన్యరావుకు విశదీకరిస్తుంది. సౌజన్యరావు గిరీశాన్ని మందలించి బుచ్చమ్మతో అతనికి వితంతు వివాహం జరిపిస్తాడు. సదాశివబ్రహ్మం, పుల్లయ్యలు ఒరిజినల్‌ ‘కన్యాశుల్కము’ నాటకాన్ని సినిమాకు అనుగుణంగా మార్చిన కథ ఇదే! ఇందులో హెడ్‌ కానిస్టెబుల్‌ పేకేటి శివరావు, పోలిశెట్టిగా చదలవాడ కుటుంబరావు, సిద్ధాంతిగా గౌరీపతిశాస్త్రి, కానిస్టేబుల్‌గా రామకోటి నటించారు.


ఈ సినిమా చిత్రనిర్మాణం మొత్తం రేవతి, నరసూ, వీనస్‌ స్టూడియోల్లో నిర్మించిన సెట్టింగులలోనే జరిగింది. ఎక్కడా అవుట్‌ డోర్‌ సదుపాయాలు వినియోగించలేదు. ఈ సినిమాలో లుబ్ధావధానులుది ప్రధాన పాత్ర. అతడు లేకపోతే సినిమానే లేదు. అందుకే ఆ పాత్రకు గోవిందరాజులు సుబ్బారావు అయితేనే న్యాయం జరుగుతుందని దర్శకుడు పి.పుల్లయ్య భావించారు. నిజానికి ఆ రోజుల్లో వేసే నాటకాల్లో గిరీశం పాత్రను గోవిందరాజులు సుబ్బారావే పోషించేవారు. ఇందులో సౌజన్యరావు పాత్ర సంక్ష్లిష్టమైనది. నాటకంలో సౌజన్యరావు మధురవాణి అందానికి ముగ్ధుడై ఆమెను ముద్దుపెట్టుకోబోతాడు. అపుడు ‘చెడని వారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది. అంచేత ముద్దు పెట్టుకోనివ్వను’’ అని మధురవాణి అతన్ని వారిస్తుంది. అప్పుడు సౌజన్యరావు ఆమెతో ‘కృతజ్ఞుణ్ణి’ అంటాడు. ఇటువంటి పాత్ర కోసం పి.పుల్లయ్య గుమ్మడిని తీసుకురమ్మన్నారు. రామప్పంతులు అల్లరి ఆరంభం చెయ్యగలడుగానీ దాన్ని తప్పుకునే చాకచాక్యంలేదు. అందుకే ఆ పాత్ర సియ్యస్సార్‌ను వరించింది.


విశ్వశాంతి అధిపతి యు.విశ్వేశ్వరరావు ఈ సినిమాకు దయాసాగర్‌తో కలిసి సహాయ దర్శకునిగా పనిచేశారు. అతడు విద్యాధికుడు, మంచి చిత్రకారుడు కూడా. బాపు పద్ధతిలోనే అతడు సన్నివేశాలకు అనుగుణంగా బొమ్మలు గీసుకుని, వాటిని విభజించి చిత్రీకరణ సమయంలో దర్శకునికి గుర్తు చేసేవాడు. ఒకానొక సన్నివేశ చిత్రీకరణలో సావిత్రి మూడు రంగుల గాజులు ధరించింది. ఆ గాజులు రంగులు ఏ వరుసలో ఉండేవో విశ్వేశ్వరరావు నోట్‌ చేసుకున్నాడు. తరవాతి షెడ్యూలులో సావిత్రి ధరించిన గాజుల క్రమం మారిందని గమనించి వెంటనే ఆమె దృష్టికి తీసుకెళ్లి సవరించుకోమన్నారు. సావిత్రికి ఆ సూచన చికాకు తెప్పించింది. ‘‘ఇదేమీ కలర్‌ సినిమా కాదుగదా’’ అంటూ వాదించింది. కంటిన్యూటీ దెబ్బతింటుందని విశ్వేశ్వరరావు చెబితే ‘షాట్‌ తీసే సమయానికి మార్చుకుంటానులే’ అంటూ సావిత్రి దాటవేసింది. రిహార్సల్స్‌ తరవాత షాట్‌ రెడీ అయ్యాక కూడా ఆమె గాజుల క్రమాన్ని మార్చుకోలేదు. విశ్వేశ్వరరావు వెంటనే కట్‌ చెప్పారు. పుల్లయ్యకు అర్ధంకాలేదు. విశ్వేశ్వరరావు పుల్లయ్యకు జరిగిన విషయాన్ని వివరించాడు. సావిత్రి గాజులు మార్చుకోక తప్పలేదు. పి.పుల్లయ్య, విశ్వేశ్వరరావు సూక్ష్మదృష్టిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.


ఇందులో బుచ్చమ్మగా నటించిన షావుకారు జానకి మంచిపేరు తెచ్చుకుంది. ఇందులో వెంకటేశం పాత్రలో నటించిన మాస్టర్‌ కుందు అసలు పేరు గాదె బాలకృష్ణారావు. రేడియో అన్నయ్యగా పిలుచుకొనే న్యాపతి కామేశ్వరరావుకు మేనల్లుడు. ఈ సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించి సినీ నటనకు స్వస్తిచెప్పి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సినిమా చివర్లో గిరీశం బుచ్చమ్మను పెళ్లాడినట్లు చూపడం మాత్రం విమర్శకు దారి తీసింది. ఈ సినిమా టైటిల్‌ కార్డుల్లో విజయనగర రాజప్రసాదం, పురవీధుల ఫోటోలను బ్యాక్‌డ్రాప్‌గా వాడుకుంటూ టైటిల్స్‌ వేయించారు పి.పుల్లయ్య. అంతేకాకుండా సినిమాను గురజాడ వారికి అంకితం చేసి పుల్లయ్య తన సహృదయతను చాటుకున్నారు. సినిమా టైటిల్స్‌కు ముందే ‘‘నాటకమును యధాతథంగా చిత్రించుటకు వీలు పడనందున, కొన్ని సన్నివేశములలోను, సంభాషణలలోనూ యథోచితంగా మార్పులు చేయవలసి వచ్చినది. రసజ్ఞులు సహృదయంతో సహకరించవలెనని ప్రార్ధన’’ అని ప్రేక్షకులకు డి.ఎల్‌. ముందే విన్నపం చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక అనేక విమర్శలు వచ్చాయి. నాటకానికి చేసిన మార్పులను ప్రేక్షకజనం మన్నించలేదు. అందుకు కారణం కన్యాశుల్కము నాటకం అందరికీ కరతలామలకం కావడమే. ముఖ్యంగా దర్శకుని మీద ఎక్కువగా విమర్శలు వచ్చాయి. వేదాంతం రాఘవయ్య దర్శకుడైతే సినిమా మరోవిధంగా వుండేదనేది కొందరి అభిప్రాయం. అందువలన తొలిసారి విడుదలైనప్పుడు సినిమా అంతగా విజయవంతం కాలేదు. డీఎల్‌ నారాయణ మాత్రం నిరాశ పడలేదు. పాతకేళ్ల తర్వాత రిపీట్‌ రన్‌లో కన్యాశుల్కము సినిమా బాగా ఆడి సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. (హైదరాబాద్‌ దీపక్‌లో) గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో శతదినోత్సవం కూడా చేసుకుంది.


మొదటి రిలీజ్లో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయిన సినిమా.. తర్వాత పలుమార్లు విడుదలై, మూడుసార్లు వందరోజులు ప్రదర్శితమైతే అది చరిత్ర కాక ఏమవుతుంది? అలాంటి చరిత్ర గల ఏకైక తెలుగు చిత్రం ‘కన్యాశుల్కం’. ఈ సినిమా విడుదలై 63 ఏళ్లు. ఆ సినిమా విశేషాలు:


మొదటి సారి కన్నా తర్వాతి పర్యాయాలు విడుదలైనప్పుడు ఎక్కువ విజయం సాధించిన కొద్ది చిత్రాల్లో 'కన్యాశుల్కం' ఒకటి. ఇప్పటిలా టీవీలు విడియోలు లేని రోజుల్లో చిత్రాలు మళ్లీ మళ్లీ విడుదల కావడం సర్వసాధారణం. ఆ విధంగా థియేటర్లకు కొన్ని పాత విజయవంతమైన చిత్రాలు ఫలానా థియేటర్లో ఏడాదికో రెండేళ్లకో మళ్లీ వస్తాయని(రిపీట్ రన్) అందరికి తెలిసిపోయేది. అందులోనూ అగ్రహీరోల సంస్థల చిత్రాలకు ఆ విధమైన ఏర్పాటు కూడా వుండేది. పాతాళ భైరవి ఏదో ఒక థియేటర్లో ఎక్కడో ఒక చోట ఆడుతుంటుది గనక ఇప్పటికి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు లెక్క అని ఒకసారి చక్రపాణి చమత్కరించారందుకే. అయితే 'కన్యాశుల్కం' సంగతి వేరు. 1955లో మొదటి సారి విడుదలైనప్పుడు అంతగా ఆదరణ పొందని ఆ సినిమా దశాబ్దాల తర్వాత శతదినోత్సవాలు చేసుకోవడం చాలా అరుదైన ఉదాహరణే. ప్రేక్షకులు ఆచిత్రం స్వారస్యాన్ని, గురజాడ నాటకంగా దాని విశిష్టతను ఆలస్యంగా అర్థం చేసుకోవడం ఇందుకు కారణమై వుండొచ్చు. కన్యాశుల్కం చదవడానికే తప్ప ప్రదర్శనకు అంతగా అనుగుణం కాదనే అపప్రథ చలన చిత్రానికి లేకుండా పోయింది. మూడు గంటల నిడివి కోసం నాటకాన్ని సంక్షిప్తపర్చి కొన్ని మార్పులు చేశారు.


ఈ రోజున వరకట్న దురాచారంలాగే ఆ రోజుల్లో ‘కన్యాశుల్కం’ సమాజంలో తాండవించేది. డబ్బుకోసం కన్నవారే ముక్కు పచ్చలారని చిన్నారులను ముసలివాళ్లకిచ్చి కట్టబెట్టేవారు. ఇంట్లో అమ్మాయి ఉందంటే ఎంతకు అమ్మవచ్చునని లెక్కలు వేసుకునే దుష్టసంప్రదాయాన్ని కళ్లార చూసిన గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకంలో ఆ దురాచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడుక భాషను సాహిత్యంలో ప్రవేశపెట్టి, తెలుగు భాషను జనానికి మరింత దగ్గర చేసిన ఘనత కూడా ఈ నాటకానికే దక్కుతుంది. ఆ నాటకం తెలుగునేల అంతటా జేజేలు అందుకుంది.


తెలుగునాట సాంఘిక నాటకం అంటే మొదట గుర్తొచ్చేది గురజాడ వారి కన్యాశుల్కం నాటకమే. కన్యాశుల్కం పేరు చెప్పగానే గుర్తొచ్చేది గిరీశం. డామిట్ కధ అడ్డం తిరిగింది (గిరీశం), తాంబూళాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి (అగ్నిహోత్రావధాన్లు), విద్యవంటి వస్తువు లేదు (రామప్పంతులు), బుద్ధికి అసాధ్యం ఉందేమో కాని డబ్బుకు లేదు (మధురవాణి), ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి.


ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు వినోదా సంస్థ అధినేత డి.ఎల్. ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.


‘కన్యాశుల్కం’ నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలి డైలాగ్ ‘సాయంత్రమయింది..’ అన్నది, చివరి డైలాగ్ ‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’ అనేది. ఈ రెండూ గిరీశం నోట వెలవడతాయి. ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి. నాటకంలో ఒక్కో పాత్ర ప్రవేశిస్తుంటే ఆ పాత్ర డైలాగులు జనాలే వల్లించేవారు. అంతలా పేరొందిన ఆ నాటకాన్ని సినిమా కోసం కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఆ విషయాన్ని టైటిల్స్కు ముందే నిర్మాత విన్నవించుకున్నారు. అయినప్పటికీ ‘కన్యాశుల్కాన్ని చెడగొట్టారని, బాల్యవివాహం వల్ల వితంతువులైన వారిని మోసం చేసే గిరీశం పాత్రను ఎన్టీఆర్ కోసం మార్పు చేసి చివర్లో మంచివాడిగా చూపించారని నాటకాభిమానులు కినుక వహించారు. మొదట్లో ఆ సినిమా విడుదలయినప్పుడు ఆ అభిమానులు పెదవి విరిచారు. నాటకమే బాగుందన్నారు. దాంతో డి.ఎల్ ఆశించిన స్థాయిలో ‘కన్యాశుల్కం’ ఆకట్టుకోలేకపోయింది.


అప్పటికే సాంఘిక పౌరాణిక జానపద చారిత్రిక పాత్రలతో అలరించిన ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న గిరీశం పాత్రను ఒప్పుకోవడమే ఒక సాహసం.ఆ పాత్రతో సహా ఏది ఎలా వుండాలో కళా దర్శకుడు వాలి స్కెచ్లుతయారు చేశారు. ఎన్టీఆర్కు గిరీశం పాత్ర బాగా నప్పింది. వంకర చూపుతో వంచనాత్మక మాటలతో అవతలి వారిని బురిడీ కొట్టించే తీరు ఆయన బాగా పండించారు. మధురవాణి దగ్గర తన ఆటలు సాగనప్పుడు, ఆమె దగ్గర వుండగానే పూటకూళ్లమ్మ చీపురు కట్టతో తరుముకొచ్చినప్పుడు అన్నిటినీ మించి బుచ్చమ్మను వలలో వేసుకోవడానికి గాను వదిన గారూ ఎంత మాటన్నారు అంటూ వెంటపడినప్పుడు ఎన్టీఆర్ ఒక పెద్ద హీరోగా గాక టక్కరిగానే కనిపించారు. 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా' అన్న పాట, దానికి అభినయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్ అంటూ శిష్యుడు వెంకటేశంతో ఉత్తుత్తి ఇంగ్లీషు మాట్లాడ్డం, లేనిపోని కోతలు కోయడం, తెలియని శాస్త్రాలు ఉటంకించడం , 'ఏంటోయ్ షేక్స్పియర్ మొహం పెట్టావ్ అంటూ పలకరించడం, 'మై హార్ల్ మెల్ట్స్' అంటూ బుచ్చమ్మ దగ్గర అభినయం అన్నీ నచ్చుతాయి.


సావిత్రి మధురవాణిపాత్రకోసమే పుట్టినంత సహజంగా చేసింది. కుటుంబ కథల గృహిణి పాత్రలు ప్రధానంగా చేసిన సావిత్రి మధురవాణి పాత్రను ఒప్పుకోవడంలో ఆమె అభిరుచి వెల్లడవుతుంది. తర్వాత ఆమె పాత్రను చాలా అధ్యయనం చేసింది. చాలామందితో చర్చించింది. రామప్పంతులు 'లొట్టిపిట్టలు తెప్పిస్తా'నంటే పడీ పడీ నవ్విన సన్నివేశం గాని, లుబ్దావధాన్ల పిలకను తీసి ఆడదిక్కులేక బావగారు ఇలా అయిపోయారని ఏడిపించడం గాని ఎక్కడైనా సరే నటనలో సంభాషణల్లో ఆమెకు ఆమే సాటి అనిపిస్తుంది. అందరినీ తిప్పలు పెట్టే గిరీశం, రామప్పంతులు వంటివారినే మధురవాణి ఒక ఆట ఆడిస్తుంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టేవాళ్లు.


ఇక శకుని వంటి పాత్రలకే ప్రాణం పోసిన సిఎస్ఆర్కు రామప్పంతులు పెద్ద లెక్కలోది కాదు. డాంబికం, దబాయింపు, నక్కజిత్తులు మేళవించి అమోఘంగా పండించారు.


విజయవాడలో న్యాయవాదిగా వున్న విన్నకోట రామన్నపంతులు అగ్నిహౌత్రావధాన్ల పాత్రకు ప్రాణ ప్రతిష్టచేశారు. 'తాంబూలిచ్చాను తన్నుకు చావండి' వంటి ప్రసిద్ధ సంభాషణలు కూడా గొప్పగాపలికించారు.


మహానటుడు గోవిందరాజుల సుబ్బారావుకు అందరికన్నా అధికంగా మార్కులు పడతాయి. కాటికి కాళ్లు చాచుకుని కూడా చిన్నపిల్లను అదికూడా తక్కువ కన్యాశుల్కంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆయన దురాశ దాన్ని ఉపయోగించుకుని ముప్పుతిప్పలు పెట్టే రామప్పంతులు, మధురవాణి సహాయంతో శిష్యుడికి అమ్మాయి వేషం వేసి మోసం చేసే కరకటశాస్త్రి(వంగర) చెప్పాలంటే ప్రతి ఘట్టం వినోదాన్ని సందేశాన్ని ఏకకాలంలో పండిస్తాయి.


బుచ్చమ్మగా జానకి, ఆమె తల్లి వెంకమ్మగా హేమలత, పూటకూళ్లమ్మగా చాయాదేవి, లుబ్దావధాన్లు కూతురు మీనాక్షిగా సూర్యకాంతం, తదితరులు నటించారు. నటీనటులుందరూ హేమాహేమీలైనా పాత్రలే కనిపిస్తాయి. చాందస బ్రాహ్మణ పాత్రలను చూసిన అప్పటి పిల్లలు తమ వీధుల్లో కనిపించే అయ్యవార్లే నటించారనుకున్నారట!


ఈ సినిమాకు సదాశివబ్రహ్మం సంభాషణలు రాశారు.


ఈ సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇందులో గురజాడవారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’, బసవరాజు అప్పారావు, ‘నాగులచవితి’ గీతం, శ్రీశ్రీ రాసిన ‘ఆనందం అర్ణవమైతే’ గీతాలను సందర్భానికి అనుకూలంగా పొందుపరచి గురజాడ నాటకీయతకు న్యాయం చేకూర్చారు.


1) ముందుగా మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన మూడు చరణాల గీతం ‘చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ గురించి చెప్పుకోవాలి. ఇందులో ‘పండంటి పిల్లకు పసుపూ కుంకం నిండుకున్నదేం గురుడా’’ అనే ప్రశ్నకు ‘దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా’’ అంటూ... ‘కొద్దిగ హద్దు మీరరా నరుడా’’ అని గిరీశం ఇచ్చే సలహా సందర్భోచితంగా ఉంటుంది. మరో చరణంలో ‘విధవలందరికి శుభకార్యాలూ విధిగా చెయమంటావా గురుడా’ అనే ప్రశ్నకు ‘అవతారం నీదందుకోసమే ఆరంభించరా నరుడా’ అని ఇచ్చే సమాధానంలో గిరీశం బలహీనతలను వ్యంగ్యం ధోరణిలో, అహంభావంతో వ్యక్తపరిచేలాగా ఘంటసాల దాన్ని తత్వ గీతంలా కాంభోచ్కీజీజి రాగంలో స్వరపరచి ఆలపించారు.


మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన 'చిటారు కొమ్మన' పాట మొత్తం గిరీశం స్వభావానికి తగినట్టు సాగుతుంది.

https://www.youtube.com/watch?v=jOhb-CjF8W8


2) ‘ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే’ అనే శ్రీశ్రీ గీతాన్ని సినిమాలో సావిత్రి కోసం పాడించారు. ఘంటసాల శంకరాభరణ రాగంలో స్వరపరచి ఆ పాటకు వన్నె తెచ్చారు.

శ్రీశ్రీ రాసిన 'ఆనందం ఆర్నవమైతే

https://www.youtube.com/watch?v=YQgCq_SvmOk


3) దేవులపల్లి రాయగా పద్మప్రియ ఆలపించిన బొమ్మలపెళ్లి పాట ‘చేదాము రారే కళ్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము’ను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. బాలానందం సభ్యులచేత నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి చక్కగా డ్యాన్సు చేయించారు. ఈ పాటలో ఊర్వశి శారద బాలనటిగా కనిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=mrG7O2ddfNI


4) గతంలో బసవరాజు అప్పారావు రాసిన ‘నాగుల చవితికి నాగేంద్రా... నీ పొట్టనిండా పాలు పోసేము తండ్రీ’ అనే నాగులచవితి పాటను సందర్భోచితంగా వాడుకున్నారు. సంగీతం ఘంటసాల, తెరపై షావుకారు జానకి , గాన సరస్వతి గానం,

నాగుల చవితికి నాగేంద్ర ! నీకు

పొట్టనిండా పాలు పోసేము తండ్రి !

నీ పుట్ట దరికి నా పాప లొచ్చేరు

పాప పుణ్యమ్ముల వాసనే లేని

బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి !

కోపించి బుస్సలు కొట్ట బోకోయి - నాగుల..

చీకటిలోన నీశిరసు తొక్కేము

కసిదీర మమ్మల్ని కాటేయ బోకు

కోవ పుట్టలోని కోడె నాగన్న

పగలు సాధించి మా ప్రాణాలు దీకు - నాగుల చవితికి

అర్ధ రాత్రీ వేళ అపరాత్రి వేళ

పాపమే యెఱుగని పసులు తిరిగేని

ధరణికి జీవనాధార మైనట్టి

వాటిని రోషాన కాటేయ బోకు - నాగుల చవితికి నాగేంద్ర

అటు కొండ యిటు కొండ ఆరెంటి నడుమ

నాగుల కొండలో నాట్యమాడేటి

దివ్య సుందర నాగ ! దేహి యన్నాము

కనిపెట్టి మమ్మెపుడు కాపాడ వోయి - నాగుల చవితికి నాగేంద్ర

పగలనక రేయనక పని పాటలందు

మునిగి తేలేటి నా మోహాల బరిణె

కంచెలూ కంపలూ గడచేటి వేళ

కంప చాటున వుండి కొంప దీకోయి - నాగుల చవితికి


ఆఖరి చరణం లో మొగుడిని "మోహాల బరిణె" గా వర్ణిచడం బసవరాజు గారి చమత్కారం.


https://www.youtube.com/watch?v=ACVx0HfKv2o


5) గురజాడ రాసిన గేయనాటకం ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ను కూడా సన్నివేశంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మగా కుమారి ప్రమీల రాణి, ముసలి భర్తగా కంచి నరసింహరావు నటించారు. గురజాడ రచన , పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, ఘంటసాల(సంగీతమూ ఆయనదే) అద్బుతంగా గానం చేశారు.


https://www.youtube.com/watch?v=BYAixZI0ykg


6) గురజాడ రాసిన తత్వగీతం ‘ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు.. నీ ఇల్లు ఎక్కడే చిలుకా’ను పద్మప్రియ పాడగా మాస్టర్‌ సుధాకర్‌ మీద చిత్రీకరించారు.

https://www.youtube.com/watch?v=zoNDg8CtyG8


7) గిరీశానికి చుట్ట ముట్టించి సావిత్రి నాట్యం చేసే ‘సరసుడ దరిజేరరా ఔరా సరసుడా’ అనే జావళిని తొలి సన్నివేశంగా చిత్రీకరించారు. ఈ జావళిని సదాశివబ్రహ్మ రాయగా ప్రముఖ కర్నాటక విద్వన్మణి గానసరస్వతి ఆలపించింది. పసుమర్తి నృత్యరచన కూడా ఆ జావళికి అమోఘంగా అమరింది. ‘సరసుడ దరి చేరరా...’ సదాశివబ్రహ్మం

https://www.youtube.com/watch?v=bEQPI9tXLUY


😎 పసుమర్తి కృష్ణమూర్తి గొంతు కలిపి పద్మప్రియ, మాధవపెద్దిలతో కలిసి ఆలపించిన సముద్రాల ‘కీచకవధ’ వీధినాటకం - ‘వెడలె సైరంధ్రి సభకూ మదమరాణిగమన వెడలె’ను అత్యద్భుతంగా చిత్రీకరించారు.

https://www.youtube.com/watch?v=xEmsw5ndeDA


నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తికి ఈ సినిమాలో వంద మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘కన్యాశుల్కము సినిమా నిరాశ పరచినా డీఎల్‌ నారాయణ వెంటనే ‘చిరంజీవులు’ చిత్ర నిర్మాణానికి పూనుకోవడం నిజమైన విశేషం!


ఇలా అందరూ లబ్ధప్రతిష్ఠులైన కవులు కలాల నుంచి జాలువారిన గీతాలు ‘కన్యాశుల్కం’ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ‘


సంస్కర్త సౌజన్యారావు (గుమ్మడి) చివరలో బుచ్చమ్మకూ గిరీశానికి పెళ్లి చేసినట్టు చూపించడం కూడా శ్రీశ్రీ కొడవటిగంటి తదితరుల విమర్శకు గురైంది. గిరీశం 'డామిట్ కథ అడ్డం తిరిగింది' అంటూ నిష్క్రమించడం గాక బుచ్చమ్మను పెళ్లి చేసుకున్నట్టు చూపించడంవల్ల గురజాడ ఉద్దేశమే తలకిందులైందని భావించారు. చిత్ర కథ సుఖాంతం చేసినప్పటికీ దానికి ఒక కారణం పెట్టారు. గిరీశం వంటి టక్కరిని దేశం మీద వదలిపెట్టే బదులు బుచ్చమ్మతో పెళ్లిచేస్తే కొంతైనా బాగుపడతాడేమోనని మధురవాణి చెప్పిన సలహా సౌజన్యారావు పాటించినట్టు చూపించారు. వెనక్కు తిరిగి చూసుకుంటే 64 ఏళ్లకిందట తీసి వుండకపోతే తర్వాత మరెవరూ తీసి వుండేవారు కాదేమో. ఎందుకంటే ప్రసిద్ధ తెలుగు సాంఘిక నాటకాలు చిత్రాలుగా వచ్చింది చాలా తక్కువ. ఆ ఘనత కూడా 'కన్యాశుల్కం'కే దక్కింది.


ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు పుల్లయ్య . నలభైలలోనే మంచి పేరు తెచ్చుకున్న పుల్లయ్య ఎన్నో కళాఖండాలను పండించిన వ్యక్తి. తర్వాత తనూ నిర్మాతగా అనేక మంచి చిత్రాలందించారు.


‘కన్యాశుల్కం’ చిత్రంపై ఎన్ని విమర్శలున్నా ఒక్కసారైనా ఈ సినిమాను చూడాలని భావించిన వారు ఈ సినిమా చూశారు. అలా అర్ధశతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం పర్లేదు బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో సరిగ్గా ‘కన్యాశుల్కం’ విడుదలైన 56 రోజులకు ఎన్టీఆర్ నటించిన జానసద చిత్రం ‘జయసింహ’ (21-10-1955) విడుదలై అఖండ విజయం సాధించింది. ఆ చిత్రం ఘనవిజయం మాటున ‘కన్యాశుల్కం’ మరుగున పడిపోయింది. అలా మొదటి రిలీజ్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.


తర్వాత 28 ఏళ్లకు 1983లో ఈ చిత్రం హైదరాబాద్లో విడుదలైంది. సంధ్య 70 ఎమ్ఎమ్ ఉదయం ఆటలతోనూ, వేరే థియేటర్లలో మూడు ఆటలతోనూ ప్రదర్శితమైంది. సంధ్యలో ఏకధాటిగా 130 రోజులకు పైగా ఆడింది. అన్ని రోజులు ఇతర థియేటర్లలో షిప్టుల మీద మూడు ఆటలతో ఆడుతూనే ఉంది. షిప్టుతోనే 175 రోజులు ప్రదర్శితమైంది. అలా 50 సంయుక్తవారాలు జరుపుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ‘కన్యాశుల్కం’.


ఈ చిత్రం 1986లో విడుదలైనప్పుడు విజయవాడ విజయా టాకీస్లోనూ, గుంటూరు రాధాకృష్ణలోనూ నూన్ షో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శితమయింది.


ఆ తర్వాత గురజాడ ‘కన్యాశుల్కం’ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఈ చిత్రం 1993లో మరోమారు విడుదలైంది. అప్పుడు హైదరాబాద్లో ఇంకోసారి ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం.


ఇలా రిపీట్ రన్స్లోనూ మూడుసార్లు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం భారతదేశం చలనచిత్ర చరిత్రలోనే మరొకటి కానరాదు.


మొదటి రిలీజ్లో అంతటి ఆదరణ పొందని ఈ సినిమా రిపీట్ రన్స్తో విశేషాదరణ పొందడానికి ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించడమే కారణమని వేరే చెప్పాలా? స్టార్ హీరోగా ఎంతో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గిరీశం వంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అంగీకరించడం ఎంతో సాహసం. ఆషాడభూతి వంటి ఆ పాత్రను అనితరసాధ్యంగా పోషించి ఆకట్టుకోవడం విశేషమే.


అలా ‘కన్యాశుల్కం’ జనాన్ని రంజింపచేసింది. 64 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులోని కథాంశం ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.


జయాపజయాలు విమర్శలు ఎలా వున్నా ఆ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గురజాడ అడుగుజాడగా మిగిలిపోయింది

Comments

  1. ఈ కన్యాశుల్కం సినిమాను సంధ్యా లోనే నాప్రియమిత్రుడు దివంగత రామలింగేశ్వర శర్మతో కలిసి చూసాను. ఆ మరుచటిరోజే ఆఖరు ప్రదర్శనలు వేసారు. మాశర్మ "రామారావు ఎంతబాగున్నాడూ ఎంతగొప్పగా చేసాడూ. కాని ఇంతబాగా చేసిన సినిమా గురించి చెప్పుకోడేం ఎన్నడూ" అన్నాడు ఆశ్చర్యంగా.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!