🚩🌺🌹ద్వారం వెంకట స్వామి నాయుడు.🌹🌺🚩

🚩🌺🌹ద్వారం వెంకట స్వామి నాయుడు.🌹🌺🚩


- రచన : శ్రీ తనికెళ్ళ భరణి గారు.


💦👌🏿అది 1893 వ సంవత్సరం!


అది దీపావళి!!


అది దీపాల వేళ..కర్ణాటక దేశంలో..


ఓ పసిపాప ఏడున్నొక రాగంలో ఏడ్చాడు..ఆ


ఏడుపులో ఓ గమకం ఒలికింది..


కర్ణాటక సంగీత జగత్తులో ఓ కొత్తద్వారం తెరుచుకుంది...


ద్వారం వెంకట స్వామి నాయుడు గారు అలా ఆవిర్భవించారు.


పదేళ్ళొచ్చాయ్!


నాయుడు ఆరో క్లాసు చదువుతున్నాడు.


ఉన్నట్టుండి కళ్ళు మసకేసినట్లయిపోయాయ్!


నల్లబల్లమీద అక్షరాలు అలుక్కు పోయినట్టున్నాయ్!


రేయ్..నాయుడూ.. రాసుకోకుండా దిక్కులు చూస్తున్నావేంట్రా బడుద్ధాయ్.. అన్నాడు మాస్తారు..


నాకేమీ కనబడట్లేదండీ.. వొణుకుతూ లేచి నించున్నాడు నాయుడు.


కనపడట్లేదురా గుడ్డిపీనుగా.. అయితే గుడ్డి వెధవకి చదువెందుకూ..బళ్ళోంచి వెళ్ళిపో..


కసురుకున్నాడు..గుడ్డి మేస్టారు.


కళ్ళలో చూపులేకపోయినా నీళ్ళు నింపుకుని ఇంటికెళ్ళిపోయారు.


ఉత్తరోత్తరా ఈ కుర్రాడే ‘సంగీత కళానిధి’ అవుతాడని ఆ మేష్టారికేం తెలుసు...


పైగా మాస్టారి తిట్లే దీవెనలయ్యాయి. ఆయనే కనుక స్కూల్లోంచి పొమ్మనకపోతే... మన నాయుడు గారు కూడా ఏ సెకండ్ ఫామ్ వరకో చదువుకుని ఎక్కడో గుమాస్త అయ్యేవాడేమో!


ఆంధ్రదేశానికి సంగీతంలో అనర్ఘరత్నాన్ని అందించిన ఆ మేస్టారికి జోహార్లు..


* * *


కళ్ళలో నీళ్ళు కక్కుకుని ఇంటికొచ్చిన నాయుడు కనబడడం మానేశాడు. పిల్లాడేమైపోయాడో అని తల్లీ తండ్రీ అంతా గాభరాపడ్డారు.


అన్న వెంకటకృష్ణయ్య ఊరంతా వెతికి ఉసూరుమని ఇంటికొచ్చాడు.


వెంకటకృష్ణయ్య వాయులీన విద్వాంసుడు..


మనసు బాగోలేక కాస్సేపు వయొలిన్ వాయిద్దామనుకుని పెట్టె తెరిచాడు. వాయులీనం లేదు!!


గుండె గుభేలుమంది.. వాయులీనం తన ప్రాణం..దాన్ని తనకి తెలియకుండా ఎవరూ ముట్టుకోరే..


ఇల్లంతా వెతికితే..ఒక చోట నుంచి నాదం వినిపించింది.


మేడమీద కూర్చుని..తదేక ధ్యానంతో వాయులీనం వాయిస్తున్నాడు తమ్ముడు..


ఆశ్చర్యపోయాడు అన్న.


వీడు వాయులీనమెప్పుడు నేర్చుకున్నాడూ...,.గమకాలంత సొగసుగా ఎలా పలికిస్తున్నాడూ.. అని


కాని అలా వింటూనే ఉండిపోయాడు..


ఆ వాయులీనంలో ఏదో మెత్తదనం..


ఆ వాయులీనం వింటుంటే హృదయం మీటినట్టుంది.


వీడు సామాన్యుడు కాదు కారణజన్ముడు..! సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న నాదయోగి.


అంతే... వెంటనే అన్న గారొక నిర్ణయానికొచ్చి..


తమ్ముణ్ణీ తీసుకుని వీణా విద్వంసులు తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారి శిష్యుడైన సందివనం వెంకన్న గారి దగ్గరికి తీసుకెళ్ళి శిష్యుడిగ చేర్చించాడు..!


అదిగో అన్నయ్య అంటే వాడూ!


ద్వారం వెంకట స్వామి నాయుడు తపస్సు ఆరంభమయ్యింది..


తనకి దృశ్యం కనబడదు...శ్రావ్యం తప్ప.


ఆ చీకటి కాన్వాసు మీద..వాయులీనంతో చిత్రాలు గీయాలి..రంగులు అద్దాలి.. మెరుపులు మెరిపించాలి..పూవులు పూయించాలి.


గగనంలో ఎక్కడో అందకుండ సంచరించే రాగ గంగని..భగీరధుడిలా కిందికి దించాలి.


అనంత సగర గర్భాన...అస్పృశ్యంగా ఉండిపోయిన రాగామృతాన్ని వాయులీనంలో మధించి...మోహినియై శ్రోతలందరికీ అమృతం పంచిపెట్టాలి..!


పొద్దున్న బ్రహ్మీ ముహూర్తంలో వాయులీనం మీద కమాను ఆడటం ప్రారంభిస్తే...మళ్ళీ అపరాహ్ణం వేళ వరకూ అదే ధ్యాస..అదే శ్వాస..


మళ్ళీ సంధ్యవేళ మొదలెడితే ఎన్నోరాగలు మెల్లిమెల్లిగా గగనం వేపుకెళ్ళీ విచ్చుకోడం..వయులీనం తీగలు నరాలు..


వాయులీనం హృదయం...


నాయుడిగారి శరీరంలో వాయులీనం అంతర్భాగం..


కేవలం...సాధన చేయ్యడమే కాక...అన్నగారితో కాకినాడ సరస్వతీ గాన సభకి వెళ్ళి.. అక్కడికొచ్చే మహామహాపాధ్యాయులు...సంగీత సామ్రాట్టులు అయిన..కోనేరాజపురం వైద్యనాధయ్యర్, అరియకుడి రామానుజయ్యంగార్, కాంచీపురం నాయనపిళ్ళై, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, పల్ఘాట్ అనంత రామ భాగవతార్ మొదలైన గాత్ర విద్వాంసులూ, బెంగుళూరు నాగరత్నం, తిరువాలూర్ రాజయ్, వసంత కోకిల, కోయంబత్తూర్ తంబి, ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి మొదలైన గాయనీ మణులు తిరుకొడికావల్ కృష్ణయ్యర్, మలై కోటయ్ గోవిందస్వామి పిళ్ళై వంటి వయొలిన్ విద్వాంసులు, వీణ శేషన్న, సంగమేశ్వర శాస్త్రి వంటి వైణికులు - దక్షిణామూర్తి పిళ్ళై...అళహనంబి మొదలైన మృదంగ విద్వాంసులు - ఇంకా ఎంతో మంది హిందుస్థానీ గాయకులను సునిశితంగా పరిశీలించి... సంగీతంలోని ఎన్నో మెళుకువల్ని వంటబట్టించుకున్నారు ద్వారం.


‘మై ప్రెండ్స్’ అనే సంగీత సభ..


సంగీత విద్వాంసులంతా తమ తమ ప్రతిభా ‘పాట’వాల్ని ప్రదర్శిస్తున్నారు.


చివరిగా నాయుడొచ్చారు..


‘సాదాసీదా మనిషి..నల్ల కళ్ళద్దాలు..బక్కపల్చని శరీరం..వాణికి నమస్కారం చేసి వాయులీనం చేపట్టాడు.


సవ్యసాచైపోయాడు.


ఎడాపెడా వాయించేస్తున్నాడు.


ప్రేక్షకులు తెలీని మత్తులో పడి కొట్టుకుపోతున్నారు. సభ అయిపోయింది.


వెంటనే... సభలో ఉన్న కవి ‘మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు’ గబగబ వేదికనెక్కి...నాయుడిని కౌగిలించేసుకుని తన్ చేతికున్న వజ్రపు టుంగరాన్ని వేలికి తొడిగి.. అదరగొట్టేశావు ఫిడేల్ నాయుడూ.. అని ఆనందబాష్పాలు రాల్చాడు. ఏ సుమూహూర్తాన కవి ఫిడేల్ నాయుడు అన్నాడో గానీ ఆ పేరే స్థిరపడిపోయింది... సార్ధకత చేగూరడం జరిగిపోయాయ్!


* * *


ఎంత నేర్చుకున్నా నాయుడు సంగీత దాహం తీరలేదు!


సరే విజయనగరం సంగీతం కళాశాల్లో చేరి ఇంకా నేర్చుకుందాం అని బయలు దేరాడు.


తీరా అక్కడ ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు..


ఏదీ వాయించు.. అని ఆజ్ఞ జారీ చేసారు దాసుగారు.!


నాయుడు ఫిడేలు అందుకున్నాడు.


సరే రేపు కోరుకొంద ప్యాలెస్ కి రా.. ఆనంద గజపతి రాజా వారు కూడ విన్నాక, నిన్ను చేర్చుకోవాలో వద్దో నిర్ణయిద్దాం... అన్నారు దాసుగారు.


మర్నాడు సంధ్యవేళ..


విజయనగరం కోరుకొండ రాజభవనంలో నాయుడి వయొలిన్ కచేరీ!


సభలో ఆనంద గజపతులతో పాటు ఆయన్ స్నేహితులు బంధువర్గం..కొంతమంది విదేశీయులు వగైరా కూడా ఉన్నారు.


ఫిడేల్ శృతి చేసుకుని మొదలుపెట్టాడు. ఘనరాగ పంచకంలోని నాటరాగంలో...అగరుపొగలై పోయిన రాగలు...అలా అలా గాల్లో తేలుతూ... మఖ్ మల్ తెరల్ని స్పర్శించి..పెద్దపెద్ద్ద ఫాండిదిల్ లోని వెలుగు ముట్టుకునీ.. ప్రాంగణమంతా పాకీ..శ్రీరాగంలా అమృతం కురిపించీ..వినమ్రమై నిలిచింది!


చప్పట్లు మారుమ్రోగాయి!


ఆనందగజపతుల వారు ఆధిభట్ల వారి వైపు విలాసంగా చూసారు!


దాసు గారు.. నాయుడి వైపు పరీక్షగా చూస్తూ...


‘అబ్బాయ్ నువ్వేమీ.. అనుకోకు..నీకు విద్యార్ధిగా సీటు రావడం కష్టం.. అన్నారు..


గుండె ఆగినంత పనైంది.. నాయుడి గార్కి..


మళ్ళీ దాసు గారే అందుకుంటూ లేకపోతే పుంభావ సరస్వతివి నువ్వు విద్యార్ధివేంటిరా చక్కగా ప్రొఫెసరై అందరికీ నేర్పించు.. అని అశీర్వదించారు.


నాయుడిగారి కళ్ళ చీకట్లపైన ఎన్నో మెరుపులు..


విజయనగరం సంగీత కళాశాల వయొలిన్ అధ్యాపకులు శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు..


* * *


నాయుడు గారు దాదాపు భారత దేశంలో ఉన్న అన్ని సంగీత సభల్లోనూ వాయించారు. 1941 లో మద్రాస్ మ్యూజిక అకాడమీకి అధ్యక్షత వహించి ‘సంగీత కళానిధి’ అన్న బిరుదు తీసుకున్నారు.


1940 లో మైసూర్ మహారాజా వారిచే ‘బంగారు రాజముద్రికతో పాటు సంగీత రత్నాకర బిరుదు.


1949 లో విజయవాడ పురపాలక సంఘం అధ్వర్యంలో పౌర సన్మానం..అదే సంవత్సరం ఆంధ్ర విశ్వ విద్యాలయం వారి చేత ‘కళా ప్రపూర్ణ’ ...`953లో ‘రాష్ట్రపతి అవార్డు’..1957 లో ‘పద్మశ్రీ’ అదే సంవత్సరం వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చేత ‘డి.లిట్.


ఇలా ఎన్నో బిరుదులూ, సన్మానాలు అన్నట్తు చెప్పడం మర్చిపోయాను..ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రసిద్ధుడైపోయాక చిన్నప్పుడు గుడ్డిపీనుగా అని తిట్టిన మాస్టారొచ్చి..నన్ను క్షమించు నాయనా నువ్వంతటి వాడవౌతావని ఎరగన్రా అని కంటపడి పెట్టుకుంటే..మీరు ఆ రోజు తిట్టారు గనుకే ఇంతటి వాణ్ణయ్యాను మేస్టారు అన్న సౌమ్యుడు ద్వారం.


* * *


1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయుడి గారిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది...ఆ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చేసిన సన్మానం అందుకున్న రాత్రి...నాయుడి గారికి గుండెపోటు వచ్చింది!


మిత్రుడూ..మృదంగ విద్వాంసుడూ అయిన కోలంక వెంకట్రాజు గారు పక్కన ఉండగా..ద్వారం వారి ప్రాణ వాయులీనం అనంత వయువుల్లో విలీనం అయిపోయింది!!


💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿💦👌🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!