🚩 కళాపూర్ణోదయం -7: శల్యాసురుడు!🚩

 

                             🚩 కళాపూర్ణోదయం -7: శల్యాసురుడు!🚩

( జరిగిన కథ – రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ ఆశ్చర్యంతో అదెలా జరిగిందో చెప్పమంటారు. ఆమె సుముఖాసత్తి మణిస్తంభులు అతని కన్నవారని, ఆ వృత్తాంతం వివరిస్తోంది. సుముఖాసత్తిని మణిస్తంభుడు కాళికాలయంలో బలి ఇచ్చి నప్పుడు ఆమె “నా మాట నిజమయ్యేట్టు చూడు” అని చివరి మాటగా అని మరణించినందువల్ల అది నిజమై ఆమె మాట వరసకి అన్న మాట “నువ్వు స్త్రీవి ఐతే నేను పురుషుడి నౌతాను” అనేది అక్షరాల జరుగుతుంది. అలా సుముఖాసత్తి మణిస్తంభుడి గాను, మణిస్తంభుడు సుముఖాసత్తి గాను రూపాంతరాలు చెందుతారు. ఇక చదవండి)

🚩

“అలా మారిన సుముఖాసత్తీ మణిస్తంభులు సింహవాహనం మీద ఆకాశంలో తిరుగుతూ ఒక అద్భుతమైన నగరాన్ని చూశారు. అప్పుడు సుముఖాసత్తి (రూపంలో వున్న మణిస్తంభుడు) “ఇది ఎంతో మనోహరమైన పురం, నేనిదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్దామని అనిపిస్తున్నది” అన్నది. అని తన సింహవాహనాన్ని నేలకు దించింది. వాళ్ళిద్దరూ ఊరిబయట నడుస్తున్నారు.

సరిగ్గా అప్పడే ఆ పట్టణానికి రాజైన సత్వదాత్ముడు వాహ్యాళికి వెళ్ళి వస్తూ ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు.

మన్మథుడి ప్రభావంతో రకరకాల వికారచేస్ఠలు చేస్తూ అతను ఆమె వంక చూస్తే,

ఆమె కూడ జారుతున్న పైటను సవరించుకుంటూ తలవాల్చింది.

అప్పుడతను తన గుర్రం దిగి ఆ సిద్ధుడి దగ్గరకు వెళ్ళి “మహాత్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి కెళ్తున్నారు? మీ పేరేమిటి? ఈ సుందరి మీకేమౌతుంది?” అనడిగాడు.

ఆ సిద్ధుడు అవసరం ఐనంతవరకు తన విషయం చెప్పి ఆమె తన భార్య అని వివరించాడతనికి.

“ఎలాగోలా ఈమె నా కళ్ళముందు ఉండేట్టు చూస్తే ఆ తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు” అని దొంగవినయంతో అతను “మిమ్మల్ని కొన్నాళ్ళు నా ఇంట్లో ఉంచుకుని సేవలు చేసే భాగ్యం నాకు కలిగించండ”ని వేడుకున్నాడు. మణిస్తంభుడు సుముఖాసత్తి వంక చూస్తే, ఆమె “అలాగే, ఎక్కడైతే మనకేం?” అంది.

అప్పుడు వాళ్ళని కొత్తపల్లకి మీద ఎక్కించి తన ఇంటికి తీసుకెళ్ళాడు సత్వదాత్ముడు.

అన్ని సౌకర్యాలు సమకూర్చాడు.

స్వయంగా ఎన్నో సార్లు తనే వెళ్ళి వాళ్ళకి పరిచర్యలు చేసాడు.

తగినవాళ్ళ చేత ఆమె తనదగ్గరకు వస్తుందేమో అడిగించాడు.

అందుకామె “ఇప్పుడు నాకు గర్భచిహ్నాలు కనిపిస్తున్నాయి. సిద్ధుడి సంతానాన్ని అతనికి ఇవ్వకుండా ఇంకొకరితో కలవను నేన”ని బదులుచెప్పి పంపింది.

అప్పుడామెకు ఒక శుభముహూర్తంలో ఈ మహారాజు కళాపూర్ణుడు జన్మించాడు.

అలా బ్రహ్మ అమోఘవాక్కు, సరస్వతి వరమూ నిజమయ్యాయి.

ఆ తర్వాత వాళ్ళిద్దరు తమతమ తొలిరూపాల్ని ధరించారు సుముఖాసత్తి రూపంలో వున్న మణిస్తంభుడు అలా మారుదామని చెప్తే మణిస్తంభుడి రూపంలో ఉన్న సుముఖాసత్తి అలాగేనని అలా అనడంతోనే.

ఇప్పుడు యోగాభ్యాసం చేసుకుంటూ వాళ్ళిద్దరూ కాసారపురంలోనే ఉంటున్నారు. వాళ్ళనే అడిగి ఈ విషయం అంతా తెలుకోవచ్చు కావాలంటే!

ఇతను ఎప్పుడు జన్మించాడో అప్పుడే విచిత్రంగా ఇతనికి యౌవనం ప్రాప్తించింది.

యౌవనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే స్వభావుడనే సిద్ధుడు వచ్చి ఇతనికి ఒక మణిని, అమ్ముల్ని, వింటిని ఇచ్చాడు.

ఈ రెంటిలో ఏది ముందో ఏది వెనకో ఎవరికీ తెలీదు.

ఆ సిద్ధుడే ఇతనికి కళాపూర్ణుడనే నామకరణం చేశాడు.

ఇతని సద్యోయవ్వనాన్ని గురించి విన్న సత్వదాత్ముడు “ఇతనెవరో మహాపురుషుడు; ఇతని తల్లిని నేను కామించి పాపం చేశాను; ఏమిచ్చి ఐనా సరే దీన్ని వాళ్ళు మరిచేట్టు చెయ్యాల”నుకుని తన రాజ్యాన్ని ఇతనికి ఇచ్చి తను మంత్రిగా వుండి సేవిస్తున్నాడు.” అని చెప్పిందా బాలిక.

అప్పుడు అలఘువ్రతుడు మళ్ళీ అడిగాడామెని “ఈ స్వభావుడనే సిద్ధుడెవరు? అతను మణిని, శరచాపాల్ని కళాపూర్ణుడికి ఎందుకిచ్చాడు?” అని.

దానికి ఆ బాలిక ఇలా అంది “ఆ స్వభావుడనే సిద్ధుడు సుముఖాసత్తికి తండ్రి. ఆమె పుట్టిన తర్వాత అతను దేశాంతరాలకు పోయి తిరుగుతూ మాహురీపురం చేరాడు. అక్కడ అన్ని యోగరహస్యాలూ తెలిసిన దత్తాత్రేయుడిని తన తపస్సుతో ప్రసన్నుడిని చేసుకున్నాడు. సకల యోగాలు తెలుసుకున్నాడు” అంటూ యోగవిద్య గురించి విస్తరంగా వివరించింది.

“ఆ తరవాత ఆ స్వభావసిద్ధుడు తన యోగసాధనకి అనుకూలమైన స్థలం కోసం చూస్తూ తిరుగుతూ తన ఊరు చేరుకుని అక్కడి శతతాళదఘ్న సరస్సులో నివాసం ఏర్పరుచుకున్నాడు.

అంతలో తన అల్లుడైన శాలీనుడు ఆ మడుగులో దూకినప్పుడు అతన్ని కాపాడి వయస్‌స్తంభన మణి మొదలైన వాటిని అతనికిచ్చి పంపాడు. ఐతే పోయిన బంధాల్ని మళ్ళీ తగిలించుకోవడం ఎందుకని తమ బంధుత్వాన్ని గురించి అతనికి చెప్పలేదు.

తర్వాత కొంతకాలం గడిచాక విధివశాత్తు అతను సరస్సులో నుంచి బయటకు వచ్చి శ్రీశైలానికి వెళ్ళాడు.

అక్కడి వింతలకు ఆశ్చర్యపడుతూ, ఆ శ్రీపర్వతాన్నెక్కి, మల్లికార్జుడికి పూజలు చేసి ఆ ప్రాంతాలలో విహరిస్తుంటే

భృగుపాతానికి సిద్ధమౌతోన్న మణికంధరుడు కనిపించాడతనికి.

“ఎవర్నువ్వు? ఈ సాహసానికి ఏమిటి కారణం?” అని అడిగాడతన్ని.

అప్పటివరకు జరిగిన తన కథంతా అతనికి వినిపించాడు మణికంధరుడు.

అందులో వినపడిన తన అల్లుడూ కూతుళ్ళ విషయాలు విని ఆశ్చర్యపడ్డాడు. తనకు వాళ్ళతో ఉన్న సంబంధం గురించి అతనికి చెప్పాడు.

“నారదశిష్యుడివి, కృష్ణుడి మెప్పు పొందావు, గంధర్వజాతి వాడివి. ఇవి చాలు నీకు మరో గొప్ప జన్మ కలగటానికి. ఇంకా ఏంకావాలని ఈ భృగుపాతానికి సిద్ధమయ్యావు?” అని అడిగాడతన్ని.

“ధనవంతులు, శుచివర్తనులూ ఐన తల్లిదండ్రులకు జన్మించాలని నా కోరిక” అన్నాడు మణికంధరుడు.

“అలా ఐతే, నా కూతురూ అల్లుడు తల్లిదండ్రులు కావాలని కోరుకో. దాని వల్ల నాకు తృప్తిగా వుంటుంది. అప్పుడు నీకు నచ్చే మహోపకారం కూడ చేస్తాను.” అన్నాడా సిద్ధుడు.

“ఇదివరకు ఒకసారి నేను ఆత్మరక్షణ కోసం మా గురువు గారిని ఒక ఖడ్గం కావాలని అడిగితే ఆయన ఒక దివ్యఖడ్గాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇస్తూ, ఇకనుంచి నీ వంశం క్షాత్రవంశం కాబోతోంది అని సెలవిచ్చాడు. దాన్ని బట్టి కూడ నువ్వు నాకు మనవడివై పుట్టటం అనుకూలమౌతుంది. రాజువై ప్రపంచాన్ని పరిపాలిస్తావు. ఇది తథ్యం” అన్నాడు సిద్ధుడు.

“నిజమే. వచ్చే జన్మలో నేను రాజును కావటానికి ఇంకా కారణాలున్నాయి. అంతకన్నా పవిత్రులైన వాళ్ళ ఇంట పుట్టటం కోసమని ఈ భృగుపాతానికి నిశ్చయించుకున్నాను. అయితే, ఇంకా ఒక బాధ నాకు మిగిలి వుంది. అదేమిటంటే, రాజ్యమనే మహాభూతం పట్టినవాళ్ళకు ఎవరికైనా అప్పటివరకూ లేని గుడ్డితనం, మూగతనం, చెవుడూ వస్తాయి. వేదశాస్త్రవిదుల గోష్టుల్తో వాటిని పోగొట్టుకోవచ్చుననుకుంటే భోగాల మీద ఆశ లేనందువల్ల అలాటివారు రాజుల దగ్గర చేరరు. ఈ నా బాధ నివారించటానికి మీరే ఏదైనా మార్గం ఆలోచించండి” అన్నాడు మణికంధరుడు.

“అలా ఐతే, నీకెప్పుడూ విజయాన్ని కొనితెచ్చే విల్లంబుల్ని సృష్టించి ఇస్తాను. అలాగే ఓ అద్భుతమైన మణిని కూడ ఇస్తాను. అది వేదశాస్త్రవిదుల్ని ఆకర్షిస్తుంది” అంటూనే తన ప్రభావంతో వాటినన్నిటినీ సృష్టించాడా సిద్ధుడు. “నువ్వు వచ్చే జన్మలో ఎప్పుడైతే జన్మిస్తావో అప్పుడే ఇవి నీకు అందించే బాధ్యత నాది” అని చెప్పాడతను.

వీళ్ళిలా మాట్లాడుకుంటూండగా శివరాత్రి పూజలకు అక్కడికి వచ్చి వున్న మదాశయుడు, అతని భార్య రూపానుభూతి, అతని పురోహితులు ఆ పక్కనే వెళ్తూ అక్కడికి వచ్చారు. ఆ సిద్ధుని పేరడిగి తెలుసుకుని అతనికి సాష్టాంగ ప్రణామాలు చేశారు.

మదాశయుడు వినమ్రుడై, “నేను దత్తాత్రేయుడిని తలచి ఎన్నో ఆరాధనలు చేశాను. ఒకరోజు ఆయన నాకలలో కనిపించి తన భక్తుడు స్వభావసిద్ధుని వల్ల నా కోరిక తీరుతుందని చెపాడు. అప్పటినుంచి నేను మీ గురించి వెతుకుతూ తిరుగుతున్నాను. ఇప్పటికి నా పుణ్యం ఫలించింది” అన్నాడు.

“ఇదంతా ఆ దత్తాత్రేయుడి మహిమ. నీ కోరిక ఏమిటో చెప్పు” అన్నాడా సిద్ధుడు.

“అందర్నీ జయించటం, మంచి సంతానాన్ని పొందటం నా కోరికలు” అన్నాడతను.

“ఓహో, అలానా! ఈ మణికంధరుడికి వచ్చే జన్మలో విజయసిద్ధి కోసం ఈ విల్లుబాణాల్ని సృష్టించాను. అందువల్ల ఇతన్ని తప్ప మిగిలిన రాజులందర్నీ నువ్వు జయిస్తావు”

“అంతే చాలు. అప్పటికి ఈ మణికంధరుడి సంగతి చూడటానికి నేనొక్కణ్ణి చాలులే” అన్నాడతను గర్వంగా.

దాంతో సిద్ధుడికి కోపం వచ్చింది. “ఈ ధనుర్బాణాలతో అతను నిన్ను జయించటం నిశ్చయం. అంతేకాదు, నువ్వూ నీ భార్యా కూడ ఇతనికి బానిసలై సేవలు చేస్తారు” అని శపించాడతన్ని.

మదాశయుడి పురోహితులు సిద్ధుణ్ణి బతిమాలారు. ఐనా అతను “నా మాటకు తిరుగులేదు. ఈ మణికంధరుడు మళ్ళీ పుట్టేవరకు మీ రాజు అందర్నీ జయిస్తాడు. ఆ తర్వాత మాత్రం అతనికి సేవ చెయ్యటం తప్పదు. ఐతే ఆ రాజు దగ్గర వుండే ఒక మణిమహిమ వల్ల ఈ మదాశయుడికి సంతానప్రాప్తి కలుగుతుంది. అంతే కాదు, మీకు కూడ ఆ మణి ఆనందాన్నిస్తుంది” అని ఆ స్వభావసిద్ధుడు తన దారిన వెళ్ళాడు. మదాశయుడు కూడ సకల రాజుల్నీ జయించాడు” అని వివరించింది మధురలాలస.

“మరి సిద్ధుడి నుంచి వరాలు పొంది వెళ్ళిన మణికంధరుడు ఏం చేసాడో కూడా చెప్పు తల్లీ!” అని అడిగాడు అలఘువ్రతుడు మధురలాలసని.

“మణికంధరుడు భృగుపాతానికి అవసరమైన విధులన్నీ నిర్వర్తించాడు. కొండ మీద నుంచి కిందికి దూకటానికి సిద్ధమయ్యాడు.

ఐతే ఇంతలో హఠాత్తుగా అక్కడ ఉత్సవానికి వచ్చిన వాళ్ళంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తలో దిక్కు పరిగెత్తసాగారు.

అతను ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక స్త్రీ అతని దగ్గరికి పరుగెత్తుకు వచ్చి ఓ ఖడ్గం అతని చేతిలో పెట్టింది, “నీ భృగుపాతానికి సమానమైన ఫలితం వస్తుంది, ముందు ఈ జనాన్ని రక్షించు” అని అతన్ని తొందర పెడుతూ.

ఇంతలో భీకరంగా ఏదుముళ్ళ వాన కురిసింది! వెండిగునపాలో, వెండి కట్లతో వున్న ఇనప గునపాలో అన్నట్లున్నాయా ముళ్ళు!

మణికంధరుడికి ఏమీ అర్థం కాలేదు. ఆమెనే అడిగాడు “ఏమిటీ ఏదుముళ్ళ వాన? ఏం చెయ్యమని ఈ కత్తిని నాకిచ్చావు? ఇంతకూ నువ్వెవరివి?” అని.

దానికామె “అదుగో వస్తున్నాడు రాక్షసుడు ఏదుపంది రూపంలో! వాడు ఇటురాకముందే చంపెయ్యి” అని చెప్పింది హడావుడిగా.

మణికంధరుడికి మహోత్సాహం కలిగింది. కత్తితో విచిత్రవిన్యాసాలు చేస్తూ ముందుకు కదిలాడు. “ఇదెంత పని? ఇప్పుడే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తా. నువ్వు మిగిలిన వాళ్లకి ధైర్యం చెప్పు” అంటూ తన విన్యాసాల్తో ముళ్ళని ఖండిస్తూ ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. “ఓరి మాయావీ, నిన్నిప్పుడే యముడికి కానుక చేస్తా చూడు” అని అతనంటే, “వీడెవడో వెర్రివాడిలా వున్నాడు, తనెవరో నేనెవరో తెలుసుకోకుండా నా మీదికి వస్తున్నాడు” అని నవ్వుకున్నాడా రాక్షసుడు. ఇద్దరూ భయంకరంగా పోరాడారు. మణికంధరుడు తన కత్తితో అతని తలని ఖండించాడు, అదే సమయంలో ఆ రాక్షసుడి ముళ్ళు రక్షణ లేని అతని శరీరంలోకి దూసుకుపోగా తనూ మరణించాడు”.

అలఘువ్రతుడికి ఇంకా కుతూహలం కలిగింది “ఎవడా రాక్షసుడు? అతన్ని చంపించిన ఆ స్త్రీ ఎవరు?” అని అడిగాడు.

“ఆ రాక్షసుడు మహిషాసురుడి మేనమామ కొడుకు శల్యాసురుడనే వాడు. దుర్గ మహిషాసురుణ్ణి చంపినందువల్ల ఎలాగైనా ఆమెకు కీడు చెయ్యాలని సంకల్పించాడు. ఐతే, అందుకు జాగ్రత్తగా పథకాలు ఆలోచించాడు. సరైన పథకం దొరికేవరకు చాలా సాధువులాగా నటిస్తూ ఒకసారి ఒక వనంలో తిరుగుతుండగా అభినవకౌముది అనే అప్సరస కనిపించిందతనికి. ఆమెను చూసి మోహించాడు. ఆమెకి తన కోరిక తెలిపాడు.

ఐతే అభినవకౌముది అందుకు అంగీకరించలేదు. వాడికి కోపం వచ్చి “నన్ను కాదన్న నిన్ను ఇంకెవడూ చేరకుండా చూస్తాను నేను, నా ప్రియురాలి దగ్గరకు రావటానికి ఎవడికి గుండెలుంటాయి?” అని బెదిరిస్తే, “అలా ఐతే, నిన్ను చంపిన వాడినే నేను వరిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ” అని ఎదురుచెప్పింది అభినవకౌముది.

ఎంతో కోపం వచ్చినా అణుచుకున్నాడు వాడు, “ఎప్పటికైనా మనసు మారకపోతుందా!” అని.

ఆమె “వీడిని చంపే వీరుడు ఎవరా?” అని వెదుకుతుంటే, “నన్ను చంపదలుచుకున్న వాడు చచ్చే మార్గం ఏమిటా?” అని వాడు వెదకసాగాడు.

అలా వాడు ఒకసారి మృగేంద్రవాహన ఆలయానికి వెళ్ళి, అక్కడ రాసి ఉన్న వాటిలో, “ఇక్కడ గండకత్తెర వేసుకునే సాహసికుడు మళ్ళీ బతకటమే కాకుండా తనని చంపబోయే వాడిని చంపుతాడు” అని చదివి అలా చేసి ఇక తనకు ఎదురులేదని గర్వంతో ఆ ఆలయాన్నే నాశనం చేశాడు వాడు.

అభినవకౌముది కూడ ఆ మహాశక్తి మహిమలు విని ఆ గుడి దగ్గరకే వచ్చింది. అప్పుడు అక్కడే వున్నాడు శల్యాసురుడు కూడ.

“ఇంకెక్కడికి వెళ్ళగలవు? ఇక్కడ రాసిన ప్రకారంగా చేసి నన్ను చంపదలుచుకున్న వాడిని చంపే వరం సంపాయించాను. ఇక నీ ప్రతిజ్ఞ నెరవేరటం కల్ల!” అన్నాడు వాడు. ఏం చెయ్యాలో తోచలేదామెకు. ఆ శిధిలాయలంలో వున్న దేవి దగ్గరకు పరుగెత్తింది, తనకో దారి చూపమని ప్రార్థించింది. ఆ దేవి కూడ వాడు తన ఆలయాన్ని పడగొట్టానికి కోపగిస్తూ ఆమెకు వెంటనే ప్రసన్నురాలై, “వీడి వరం జరగక తప్పదు. ఐతే, తనని చంపదలుచుకున్న వాడు చస్తాడని తప్ప తను చావడని కాదు ఆ వరం. మణికంధరుడనే గంధర్వకుమారుడు ఒకడున్నాడు. ఒక కారణం చేత శక్తివంతమైన ఒక కత్తిని ఇక్కడ వదిలి వెళ్ళాడు. దాన్ని నువ్వు తీసుకెళ్ళి అతనికిచ్చి అతని చేత ఈ రాక్షసుణ్ణి చంపించు. అప్పుడు అతను కూడ చావకతప్పదు కాని ఆ తర్వాతి జన్మలో నువ్వు అతన్ని వరించి నీ ప్రతిజ్ఞ చెల్లించుకో. ఇప్పుడతను శ్రీశైలంలో భృగుపాతానికి సిద్ధమౌతున్నాడు. త్వరగా వెళ్ళి ఈ రాక్షసుణ్ణి చంపితే అతనికి భృగుపాతఫలం వస్తుమ్దని చెప్పు” అని ఉపాయం చెప్పింది దేవి.

పైట బిగించి, జుట్టు ముడివేసి, ఖడ్గాన్ని చేత బట్టి బయటకు వస్తున్న అభినవకౌముదిని చూసి శల్యాసురుడు భయపడ్డాడు ఆమె తనని చంపటానికి వస్తుందేమోనని! అలా ఐతే ఆమె మరణించాలి కదా!

“వద్దు, వద్దు. నువ్వు నామీదికి యుద్ధానికి వస్తే నీ ఇష్టదేవతల మీద ఒట్టు! అలాటి తెలివి తక్కువ పని చెయ్యకు” అని కంగారుగా చెప్పాడు.

“ఆపాటి తెలీదా నాకు? అలా చెయ్యనులే” అంటూ మంచి మాటల్తో వాడిని తన వెంట తీసుకుని శ్రీశైలానికి బయల్దేరింది అభినవకౌముది. కామాతురుడై వాడు కూడ వేరే ఆలోచన లేకుండా ఆమె వెంట వెళ్ళాడు.

కొంతదూరం వెళ్ళాక వాడికి అనుమానం వచ్చింది. “ఇలా ఇంక ఎంతదూరం వెళ్ళాలి? నా శక్తి నీకు తెలీదు, చూడు” అంటూ ముళ్ళు కురిపించి ఆ చుట్టుపక్కల వున్న చెట్లనీ, జంతువుల్నీ నాశనం చేశాడు. “నా మాట వినక పోయావంటే ఇలా అందరూ చస్తారు. అప్పుడా పాపం నీదే!” అని బెదిరించాడు. ఇంక ఆలస్యం మంచిది కాదని త్వరత్వరగా శ్రీశైలానికి చేరిందామె. ఆమె వెనకనే తన ముళ్ళని కురిపిస్తూ సాగాడు వాడు.

శ్రీశైలానికి చేరి, అక్కడ శివరాత్రి మహోత్సవానికి వచ్చిన భక్తులకు వాడి గురించి చెప్పి, “ఇక్కడి నుంచి పారిపొండ”ని హెచ్చరించి మణికంధరుడి దగ్గరికి వెళ్ళి అతని చేత వాడిని చంపించి, ఆ మణికంధరుడు మళ్ళీ కళాపూర్ణుడిగా జన్మిస్తే అతన్ని వెదుక్కుని వచ్చి అతన్ని వరించి స్వర్గానికి వెళ్ళకుండా అతనితోనే ఉండేట్టు ఒప్పుకుని అతన్ని గాంధర్వవివాహం చేసుకుంది.

మదాశయుడు కూడ స్వభావసిద్ధుడు చెప్పినట్లుగా రాజులందర్నీ జయించి గర్వంతో కాసారపురం మీదికి దండెత్తి వచ్చి ఈ రాజు చేతిలో ఓడిపోయి అప్పట్నుంచి అతనికి సేవకుడిగా వుంటున్నాడు తన భార్యతో సహా. వాళ్ళకు ఈ మణి దర్శనం వల్ల నేను పుట్టాను. తర్వాత వాళ్ళు సరస్వతీబ్రహ్మల కథలో చెప్పిన విధంగా (ఒక పురోహితుడు మణిని గట్టిగా నొక్కిన కారణాన) ఈ క్రముకకంఠోత్తరపురం నుంచి వెళ్ళి కొంతకాలం అంగదేశంలోనే ఉండి ఆ ప్రయాణం వల్ల నేను చిక్కిపోతే మళ్ళీ తిరిగివచ్చి నన్నిక్కడికి తీసుకువచ్చారు. ఈ మణిదర్శనం వల్ల నేను ఆరోగ్యవంతురాలి నయ్యాను. ఇంతకుముందే నా తల్లిదండ్రులు ఈ విచిత్రం కళాపూర్ణుడికి వివరించారు. పురోహితులు నలుగురూ కూడ ఈ మణి మహిమ వల్ల తిరిగి ఇక్కడికే వచ్చారు, అదిదో వాళ్ళే ఆ నలుగురు!” అని చూపించింది మధురలాలస.

“ఓ వింత బాలికా! మరి ఆ పురోహితులెవరు? వాళ్ళ కథ ఏమిటి?” అని అడిగాడు అలఘువ్రతుడు.

“వాళ్ళ కథ చెప్పేదేముంది? వాళ్ళు నలుగురూ నీ కొడుకులే!” అంది ఆ బాలిక నవ్వుతూ.

దానికి మహాశ్చర్యపోయాడతను. “అదెలా సాధ్యం? నా భార్యల్ని యౌవనంలోనే పొగొట్టుకుని అదీ నా కళ్ళ ముందే సముద్రంలో పడి మునిగిపోతుంటే చూసి అప్పట్నుంచి ఇంకెవరితోనూ సంబంధం పెట్టుకోని నాకు కొడుకులేమిటి? ఈ వింతకథల తల్లి ఏ విధంగా బట్టతలలకి మోకాళ్ళు ముడి పెడుతుందో గాని ఈ మాట మాత్రం నేను నమ్మలేను” అన్నాడతను రాజుతో.

(ఇంకా ఉంది)

👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!