🚩అశ్వత్థామకు చిరంజీవిత్వం ఎలా వచ్చింది?

🚩అశ్వత్థామకు చిరంజీవిత్వం ఎలా వచ్చింది?


నిద్రిస్తున్న ఉప పాండవులను చంపినందుకు అతను శిక్ష అనుభవించాలి కదా?


పైగా ఇప్పుడు చాలామంది తమ పిల్లలకు ఆ పేరు పెట్టుకుంటున్నారు. ఇదంతా ఎంతవరకూ సబబు?


🔻


చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు అండి. కానీ ఇంత పెద్ద సమాధానం రాస్తున్నందుకు క్షమించండి. అశ్వత్థామ అంటే అశ్వము(గుఱ్ఱము వంటి) సామర్థ్యం కలవాడు అని అర్థం. అయితే ముందుగా ఒక మాట.


మహాభారతం లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపది సభలోనున్న పెద్దలందరినీ నిలదీస్తుంది అలాగే - భీష్మాచార్యుల వారిని అడుగుతుంది " ధర్మానికి ప్రతి రూపమయిన మీరు కూడా ఈ అధర్మాన్ని ఖండించి ఒక మానవతి శీలం కాపాడలేరా? పట్టమహిషిని బానిసని చేసి వివస్త్ర ని చేయటం ఏ ధర్మ శాస్త్రం సమర్థిస్తుంది?నాకు అన్యాయం జరగవలసిందేనా?" అని పలు రకాల ప్రశ్నలతో నిలదీస్తుంది.


తల్లడిల్లిపోతున్న భీష్ముడు " చూడమ్మా ధర్మం చాలా సూక్ష్మమయినది.. ఒక సందర్భం లో ధర్మం అయినది వేరొక సందర్భం లో అధర్మం అవుతుంది, ఒక సందర్భం లో అధర్మం అయినది వేరొక సందర్భం లో ధర్మం అవుతుంది. ఈ ధర్మ సూక్ష్మములని వివరించటం బ్రహ్మ తరమూ కాదూ, బ్రహ్మ జ్ఞానుల తరమూ కాదూ. కానీ ఎవరూ పాపం చేసినా కాలం వారికి కర్మానుసారం ఫలితం ఇవ్వక తప్పదు" అంటూ కంట తడి పెట్టుకుంటాడు.


ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే అశ్వత్థామ విషయం లో కూడా ధర్మ సూక్ష్మం చెప్పడం చాలా కష్టం.ఇంక వేదాలు మున్నగునవి చదవని నాలాంటి వారికి మరింత కష్టం. ధర్మ సందేహాలు నివృత్తి చేసే అర్హత నాకు లేకపోయినా, నేను చదివిన కవిత్రయ మహాభారతాన్నీ, గురువుల దగ్గర నేర్చుకున్న అంశాలను అనుసంధానం చేసుకుని కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తప్పులుంటే పెద్దలు సరిదిద్దగలరు.


ద్రోణాచార్యులు పుత్రోదయం కోసం ఎన్నో ఏళ్ళు శివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. ప్రసన్నుడయిన శివుడు (తన 11రుద్ర అంశలలో ఒక) రుద్రుడి అంశ తో అశ్వత్థామ జన్మించేలా,వరం ఇస్తాడు. అతడికి నుదుటన ఉన్న మణి వల్ల మానవుడి కంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా, ఆకలి దప్పులు, నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలవాడిగా ఎదుగుతాడని, అంతే కాక కృపాచార్యులు వలెనే అశ్వత్థామ కూడా చిరంజీవి అవుతాడని వరం ప్రసాదిస్తాడు శివుడు. అంతలా ద్రోణుడి కఠోర. తపస్సు శివుడిని మెప్పించింది


1..ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఇవన్నీ అశ్వత్థామ స్వయం కృషి తో సాధించుకోలేదు.. అదంతా తండ్రి తపః ఫలితం.


2.గురుకులం లో పాండవ కౌరవులతో చదువుకునే రోజుల్లో పాండవుల పక్షానే ఉండేవాడు అశ్వత్థామ..ఎందుకంటే తండ్రి శిష్యరికం లో ధర్మాదర్మాల విచక్షణ కలిగి ఎదుగుతున్నాడు కనక.


3.అయితే అశ్వత్థామ రాజగురువు కి కొడుకు అయినందువల్ల తన విధి కాబట్టి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన యుద్ధం చేయవలసి వస్తుంది.మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా తాను ఎవరి తరఫున యుద్ధం చేస్తున్నాడో వాళ్లని గెలిపించడానికి నిజాయితీగా తన శక్తి యుక్తులని వినియోగించాలి. లేకపోతే రాజద్రోహం అవుతుంది.


4.అలా యుద్ధం చేస్తూ అర్జునుడినీ, యుధిష్ఠరుడినీ నిలువరించాల్సి వస్తున్నా నిలువరించలేకపోతుంటాడు.


5.అశ్వత్థామ హతః కుంజర: అంటూ అధర్మం గా తన తండ్రి ద్రోణుడి ని చంపిన ధర్మరాజు మీదకోపంతో నారాయనాస్త్రం ప్రయోగిస్తాడు…పాండవులు వారి సేన ఆయుధాలు వదిలేసి ఆ అస్త్రానికి లొంగిపోగా కృష్ణుడు ఆ అస్త్రాన్ని శాంతింపజేస్తాడు. పాశుపతాస్త్రం తో అన్యాయ మార్గం లో మోసపూరితంగా జయద్రథుడిని(సైన్ధవుడిని)చంపిన అర్జునుడినీ అలాగే పండవులందరినీ చంపుతానని దుర్యోధనుడికి మాటిస్తాడు అశ్వత్థామ (జయద్రథుడిని కాచుకోడానికి అశ్వత్థామ సారథ్యం లో కౌరవ సైన్యం వలయాకార వ్యూహం పన్నాగా అర్జునుడు జయద్రధుడిని సంహరించలేకపోతాడు, అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రం సూర్యుడికి అడ్డు పెట్టి సూర్యాస్తమయం అయినట్టు భ్రమ కలిగిస్తాడు…సూర్యాస్తమాయం అయిందనుకుని కౌరవులూ యుద్ధం ఆపగానే కృష్ణుడు సూర్యుడికి తన చక్రం అడ్డు తీసి అర్జునుడికి సైన్ధవుడి పైకి పంపుతాడు. అర్జునుడు పాశుపతం తో తల ఛిద్రం అయ్యేలా వాడిని హతమారుస్తాడు.)


6.జయద్రథుడిని కాచలేని తన అసమర్థత ని దుర్యోధనుడు ఛీత్కరించగా ఆ రాత్రి శివుడికోసం తపస్సు చేసి మేను అర్పించి శివుడిని మెప్పించి మళ్లీ బ్రతికి ఆ రాత్రి తనని చూసిన వాళ్ళు చచ్చిపోయేలా వరం పొందుతాడు అశ్వత్థామ. అలా ఆ రాత్రి పాండవు సంహరించడానికి వాళ్ళ గుడారాల దగ్గరకెళ్లి దృష్టద్యుమ్నుని కాలితో తన్ని, మర్మస్థానం లో తన్ని కౄరంగా చంపేశాడు. ఉప పాండవుల 5 గురినీ కత్తితో సంహరిస్తాడు. ఉప పాండవుల గుడారాలకు కృతవర్మ నిప్పు పెట్టి అందరినీ బూడిద చేస్తాడు. ఇలా జరుగుతుంది అని ముందే ఎరిగిన కృష్ణుడు, పాండవులని గంగ ఒడ్డుకి చేర్చాడు. అశ్వత్థామ కౄర చర్యలను


తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామ తో తలపడి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు.. అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు.అప్పుడు వ్యాసుల వారొచ్చి…రెండు బ్రహ్మాస్త్రాల వల్ల విశ్వం వినాశనం అయిపోతుంది ఉపసంహరించమని నచ్చజెప్పగా అర్జునుడు విజయ వంతంగా ఉపసంహరిస్తాడు..అశ్వత్థామ వల్ల కాక ఉత్తర గర్భం లో ఉన్న పరీక్షిత్తు మీద ప్రయోగించి గర్భస్రావం చేస్తాడు (తల్లి గర్భం విశ్వం తో సమానం కనకన బ్రహ్మాస్త్రం వల్ల విశ్వం నాశనము అయింది తిరిగి కృష్ణుడి యోగమాయ వల్ల పునర్ఉజ్జీవనం పొందుతాడు పరీక్షిత్తు)


7. ఇలాంటి పాపాలు చేసినందుకు, అశ్వత్థామ యొక్క మణి ని వ్యాసుడు పరిహారంగా ఇచ్చేయమనగా కృష్ణుడు అశ్వత్థామ ని "3000 ఏళ్ళు కుష్ఠు రోగగ్రస్థుడివై అడవులలో తిరగమని శపిస్తాడు. అయితే రుద్రుడి అంశ కనక శివుడి వరప్రసాదం ఉంది కనక అశ్వత్థామ చిరంజీవి అయి ఉన్నాడు.


8. కనక అశ్వత్థామ పేరు పిల్లలకి పెట్టచ్చా లేదా అనేది పెద్దల ఇష్టం ఎందుకంటే అశ్వత్థామ వ్యక్తిత్వం నచ్చకపోయినా అశ్వత్థామ అంటే అశ్వానికున్నంత సామర్థ్యం ఉన్నవాడు అన్న అర్థం ఉంది కనక ఆ ఉద్దేశ్యం తో అయినా పెట్టుకోవచ్చు


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!