పోతన సరస్వతీదేవి !

పోతన సరస్వతీదేవి !

.



పోతన సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణము. . 

అతని యీ రెండు పద్యాలు అతి మధరం.

.

:శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

.

భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి!

ఇక రెండో పద్యం:

"క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్

వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్!

.

ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి...

పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:

.

"హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం

దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్!

.

"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!