రుక్మిణీ కల్యాణము నుండి కొన్ని పోతన గారి ఆణిముత్యాలు 🌷

రుక్మిణీ కల్యాణము నుండి కొన్ని పోతన గారి ఆణిముత్యాలు 🌷


(పోతనగారి భాగవతం -దశమ స్కంధం .)


🏵️🏵️🏵️🏵️🏵️


మ.


ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్

జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ

ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా

భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.


🏵️


క.


బాలేందురేఖ దోఁచిన

లాలిత యగు నపరదిక్కులాగున ధరణీ

పాలుని గేహము మెఱసెను

బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.


🏵️🏵️


క.


భూషణములు చెవులకు బుధ

తోషణము లనేక జన్మదురితౌఘ విని

శ్శోషణములు మంగళతర

ఘోషణములు గరుడగమను గుణభాషణముల్."


🏵️🏵️🏵️


ఉ.


శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో

మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ

ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ

డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్


🏵️🏵️🏵️🏵️


ఉ.


అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో! 

పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా

వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే

యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్


🏵️


క.


వచ్చెద విదర్భభూమికిఁ; 

జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్

దెచ్చెద బాలన్ వ్రేల్మిడి 

వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్."


🏵️🏵️


శా. 

లగ్నం బెల్లి; వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు

ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం

డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో? 

భగ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?


🏵️🏵️🏵️


మ. 

ఘనుఁడా భూసురుఁ డేఁగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో

విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో విచ్చేయునో యీశ్వరుం

డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యా మహాదేవియు\న్‌

నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో.


🏵️🏵️🏵️🏵️


ఉ.


"నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని

న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!".


🏵️


సీ.


"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ;

నేపాటి గలవాడ? వేది వంశ? 

మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి? ;

వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు? 

మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు; 

మాయఁ గైకొని కాని మలయ రావు; 

నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు; 

వసుధీశుఁడవు గావు వావి లేదు;


🏵️🏵️


-ఆ.


కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు

విడువు; విడువవేని విలయకాల

శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల

గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు."


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!