రావణ సంహారము..!

రావణ సంహారము..!


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో సారథిగా వచ్చాడు. 

అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. 

రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం యెక్కాడు.

 రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి అతని సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు.


అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.



రావణుని మరణం

రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు. సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి. రాముని బాణాలకు రావణుని పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి.


మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది. కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడువడిన వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!