తిరుపతివేంకట కవులు. ....అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు!

తిరుపతివేంకట కవులు. ....

.

అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ

య్యదియే కోట, అదే అగడ్త, అవె రథ్యల్, వారలే యాదవుల్!

యదుసింహుండు వసించు మేడ యదిగో! ఆలాన దంతావళా

భ్యుదయంబై వర మందురాంతర తురంగోచ్చండమై పర్వెడిన్!

.

అసలు పద్య రచనలోనే ఒక విప్లవాన్ని తెచ్చినవారు తిరుపతివేంకట కవులు. అటు అవధానాలతో పండితులనూ, ఇటు భారత నాటకాలతో సామాన్య ప్రజలనూ ఏకకాలంలో తమ పద్యాలతో ఉఱ్ఱూతలూగించిన కవులు వారు. ఆ కాలంలో వారిదొక ప్రభంజనం.

.

శ్రీకృష్ణుడంటే అర్జునుడికున్న స్నేహం, భక్తి, అనురక్తి అనన్యసామాన్యం. అలాంటి ప్రియబాంధవుడైన కృష్ణుని చూడబోతున్నాడంటే అర్జునుడి మనసు ఉత్సాహంతో ఉరకలు వెయ్యదూ! "అదిగో ద్వారక!" అంటూ ఎత్తుగడలోనే ఆ ఉరకలేసే ఉత్సాహాన్ని అలవోకగా ధ్వనింపజేయ్యడం తిరుపతివేంకట కవుల నాటకీయ పద్యనిర్మాణ ప్రతిభ. 

.

తిరుమల కొండ చూసి అన్నమయ్య ఎంతటి ఆనందంతో "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అన్నాడో అదే ఆనందం మనకిక్కడ అర్జునుడిలో ధ్వనిస్తుంది. 

.

అర్జునుడు తన రథమ్మీద ద్వారకకి వస్తూ చెప్పిన పద్యమన్న మాట. ముందు దూరంగా ద్వారకని చూసాడు. కాస్త దగ్గరకి వచ్చాక నగర శివార్లలోని ఆలమందలు కనిపించాయి. మరికొంత దగ్గరకి వచ్చాక కోట, కోట ముందరి అగడ్త కనిపించాయి. కోటలోకి ప్రవేశించాడు. అప్పుడు రాజమార్గాలు (రథాలు వెళ్ళే మార్గాలు కాబట్టి అవి రథ్యలు), వాటిలో తిరుగుతున్న యాదవులు కనిపించారు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుని మేడ, మేడలోని ఏనుగులు, గుఱ్ఱాలు అగుపడ్డాయి. యీ ఒక్క పద్యం చదివేలోపు అంత దూరం ప్రయాణం చేసాడన్న మాట అర్జునుడు! అంటే శ్రీకృష్ణుడి కోసం అతను ఎంత వేగంగా పరుగులు తీసి వచ్చాడో మనం ఊహించవచ్చు. అదీ పద్యనిర్మాణంలో నేర్పు!

.

(మూలం...శ్రీ కామేశ్వర రావు భైరవభట్ల గారి కవిత.)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!