దేశభక్తి గీతం.

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!