దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు.

.

దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు.


నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?

కలవిహంగమ పక్షముల దేలియాడి

తారకా మణులలో తారనై మెరసి

మాయ మయ్యెదను నా మధురగానమున!

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


మొయిలు దోనెలలోన పయనంబొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి

పాడుచు చిన్కునై పడిపోదు నిలకు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాలనాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


శీకరంబులతోడ చిరుమీలతోడ

నవమౌక్తికములతో నాట్యమ్ములాడి

జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


పరువెత్తి పరువెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయ రహస్యాలు పల్కుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


అలరుపడంతి జక్కిలిగింత వెట్టి

విరిచేడె పులకింప సరసను బాడి

మరియొక్క ననతోడ మంతనంబాడి

వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు

పూవు పూవునకును పోవుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను

మధుపమయ్యెద చందమామనయ్యెదను

మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను

అలరునయ్యెద చిగురాకునయ్యెదను

పాటనయ్యెద కొండవాగునయ్యెదను

పవనమయ్యెద వార్ధిభంగమయ్యెదను

ఏలకో యెప్పుడో యెటులనో గాని

మాయమయ్యెద నేను మారిపోయెదను.

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!