చిరు జల్లు


.

సూర్యకాంతమ్మ వైద్యం.. చిట్కా !



జలుబు, జ్వరాల కాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా వీటితో బాధపడుతున్నవారే ! ఈ బాధలో ఎవరైనా తమకు తెలిసిన ఏ చిన్న చిట్కా వైద్యం చెప్పినా, కొంచెం సానుభూతి చూపించి పలకరించినా చాలా ఉపశమనంగా వుంటుంది. 


ఇప్పుడంటే పూర్తి వ్యాపారమై పోయి సంబంధాలన్నీ ఆర్థిక పరమై పోయాయి గానీ గతంలో చిత్ర పరిశ్రమలో కూడా కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత దర్శకులు...... ఒకరేమిటి.... అందరి మధ్యా ఆర్థికానుబందాల కంటే ఆత్మీయతానుబంధాలు ఎక్కువగా వెల్లి విరిసేవి. దానికో ఉదాహరణ.



సూర్యకాంతమ్మ అంటే గయ్యాళితనానికి మారు పేరుగా స్థిరపడిపోయింది. కానీ ఆవిడ నిజ జీవితంలో ఎంత సాత్వికురాలో అప్పట్లో పరిశ్రమతో పరిచయం వున్న వారందరికీ తెలుసు. ఆవిడ గళంలో గయ్యాళితనం ఎంత బాగా ప్రతిబింబింబిస్తుందో, అంత బాగా ఆత్మీయత ప్రతిఫలించేది.

ఆవిడ సెట్లో వుంటే ఎవరికి ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ కలిగినా ఆప్యాయంగా పలుకరించేది. అంతే కాదు ఆవిడకు గృహవైద్యంలో ప్రవేశం వుండేదేమో... ఎప్పుడూ కూడా అల్లం, శొంఠి, మిరియాలు, వేపచెక్క లాంటివి కూడా వుంచుకునేవారు. వాటితో చిట్కా వైద్యం చేసి అందరి బాధలను పోగొట్టేవారు. ఆ గృహవైద్యం కంటే ఆవిడ మాటలే వాళ్లకి మంచి ఔషధాలుగా పనిచేసి ఇట్టే ఉపశమనం ఇచ్చేవి. వాళ్ళు మళ్ళీసారి ఆవిణ్ణి కలిసినపుడు వారి బాధలు తగ్గినా వైనాన్ని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తే ఆవిడ పొంగిపోయేదట.

తన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యంతో ఆనందంగా వుండాలని కోరుకోవడం కంటే గొప్పతనం ఉందంటారా ? అదే సూర్యకాంతమ్మ గారిలో విశేషం. అయితే ఇలా అందరికీ చిట్కా వైద్యాలు చెబుతూ పోతుంటే అప్పుడప్పుడు ఎలా ఎదురు తిరుగుతాయో ఆవిడకు సంబంధించినదే....... ఓ సరదా సంఘటన......


సూర్యకాంతం గారు ఒకసారి షూటింగ్ నిమిత్తం మద్రాస్ నుండి హైదరాబాద్ రైలులో బయిలుదేరారు. ఆవిడతో బాటు ఆ కూపేలో మరొక ఆవిడ కూడా ప్రయాణం చేస్తోంది. బాగా జలుబు చేసిందేమో ఆవిడ అదే పనిగా తుమ్ముతోంది. ఆది చూసి సూర్యకాంతమ్మ గారికి ఖంగారు పట్టుకుంది.... ఆ జలుబు తనకేక్కడ పట్టుకుతుందోనని. ఎందుకంటే మర్నాడు షూటింగ్ వుందాయే ! ఎప్పుడూ తనతో కూడా ఉండే చిట్కా మందులు లేవేమో మరి ఆవిడకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకని తన సహజ ధోరణిలో ఆ తుమ్ముతున్నావిడతో.......


" చూడండమ్మా ! జలుబుని అశ్రద్ధ చెయ్యకూడదు. వచ్చే స్టేషన్ లో శారిడాన్ బిళ్ళలేమైనా దొరుకుతాయేమో చూడండి. దొరికితే అవి రెండు వేసుకుని వేడి వేడి కాఫీ తాగండి. చలిగాలి తగలకుండా తలకు మఫ్లర్ కట్టుకోండి. వెచ్చగా శాలువా కప్పుకుని పడుకోండి. తెల్లారి సికింద్రాబాద్ లో దిగేటప్పటికి జలుబు, గిలుబు ఎగిరిపోతుంది " అంటూ ఎడా పెడా సలహాలిచ్చేసారు సూర్యకాంతమ్మ.


జలుబు, తుమ్ములతో బాధపడుతున్న పక్కావిడ ఏమీ మాట్లాకుండా మౌనంగా వింటూంది. సూర్యకాంతం గారికి అనుమానం వచ్చింది.


" ఇంతకీ నేను చెప్పింది వింటున్నారా ? నా సలహాలు మీకు అర్థమయ్యాయా ? పాటిస్తారా ? ఇప్పటిదాకా నేనే వాగుతున్నాను. మీరేం మాట్లాడడం లేదు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా ? " అనడిగారు.


ఆవిడ నిదానంగా " డాక్టర్ కామేశ్వరి " అంది. అంతే సూర్యకాంతం గారికి నోట మాట ఆగిపోయింది.


" ఏమిటో ఈ ముదనష్టపు జలుబు డాక్టర్లను కూడా వదలడం లేదు " అని సణుక్కుంటూ తన బెర్త్ మీదకు వెళ్ళి పడుకున్నారు సూర్యకాంతం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!