Tuesday, January 23, 2018

శుభరాత్రి - సుభాషితం !

శుభరాత్రి - సుభాషితం !

-

కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి


కృష్ణా....

'' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ''

'' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది.

'' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు.

'' చేయాల్సిందంతా చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ.

'' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు.

'' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి.

'' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు.

'' నేనా? ఎలా? '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం.

'' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు.

వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా?

వాళ్ళు తోటి వారిని ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అని ఒక్కనాడైనా పరీక్షించావా?

నీ పిల్లల ఆలోచనలు, అలవాట్లు మంచివా? చెడ్డవా? అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా? అన్నాడు కృష్ణుడు.

'' లేదు '' అంది గాంధారి.

'' నీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లలను నువ్వు సరిగ్గా పెంచి ఉంటే ఈ నాడు కురుక్షేత్రం జరిగేదీ కాదు,

కౌరవులందరూ పోయేవారూ కాదు.

ఇది నీ స్వయంకృతాపరాధమే '' అన్నాడు కృష్ణుడు.


నేడు చాలామంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా గాంధారి, దృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తూ 

'' చదువులు చంపేస్తుంది '' అంటూ తప్పును చదువుల తల్లిమీద తోసేస్తున్నారు.


'' ప్రైవేటు పాఠశాలలు '' అన్న విత్తనాలను ప్రభుత్వాలు ప్రజల మీద చల్లేస్తే 

వాటికి కావాల్సినంత నీరు (విద్యార్థులను చేర్పింది) పోసింది ఎవరు?? మనం కాదా??

వాటికి కావల్సినంత ఎరువులు (ఫీజులు కట్టింది) చల్లింది ఎవరు?? మనం కాదా??

అవి ఎండిపోకుండా, వాడిపోకుండా పగలనక, రాత్రనకా దాన్ని (ట్యాూషన్లు , స్పెషల్ క్లాసులు అంటూ) రక్షిస్తున్నది ఎవరు?? మనం కాదా??


ఏ ప్రైవేటు పాఠశాలైనా

ఏ ప్రైవేటు కళాశాలైనా

ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మన అనుమతి లేకుండా బలవంతంగా లాకెళ్ళి చదువు చెప్పిస్తున్నారా??

పరిచయమున్న ప్రతి ఒక్కరినీ ఒకటికి పదిసార్లు ఏ స్కూల్ బావుందని అడిగి, లక్షలకు లక్షలు పోసి మరీ మనమేగా మన పిల్లలను చేర్పిస్తున్నది.

ప్రైవేటు పాఠశాలలు పెట్టే ప్రతి అడ్డమైన కండీషన్లకూ గంగిరెద్దుల్లా తలూపుతున్నది మనం కాదా??

కాస్త చదువుకునే పిల్లలైతే

కుదిరితే ఉదయం ఆరుగంటలకంతా ట్యూషన్ కు పంపుతాం

కుదరకుంటే సాయంత్రం ఆరునుండి రాత్రి తొమ్మదిదాకా ట్యూషన్ లో పడేస్తున్నాం

చదువులో కాస్త వెనకబడిన పిల్లలనైతే ఏకంగా హాస్టల్లలో కుక్కేస్తున్నాం.


పిల్లల పరిస్థితి ఎలా తయారయ్యిందీ అంటే.....

స్కూల్లో ఉన్నా చదవాలి

ఇంట్లో ఉన్నా చదవాలి

ట్యూషన్లో ఉన్నా చదవాలి

చివరికి సెలవురోజుల్లోనూ చదవాలి.

పిల్లల్ని చదువుల యంత్రాలుగా తయారుచేస్తున్నది మనం కాదా??


చేయాల్సిన తప్పంతా మనం చేసి 

పెట్టాల్సిన ఒత్తిడంతా పిల్లలపై మనం పెట్టి

ప్రైవేటు పాఠశాలను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.


ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం??

పిల్లల భవిష్యత్తు బావుండాలనే కదా అని మనల్ని మనం సమర్థించుకోవడం అందమైన ఆత్మవంచనే అవుతుంది.

చదువు పేరుతో పిల్లల్ని పిండే కొద్దీ చివరకు మిగిలేది పిప్పే.


చదువుకున్నవాడి అదృష్టం బావుండి ఉద్యోగం వస్తే మనం అనుకున్నట్టు వాళ్ళ భవిష్యత్తుకు ఢోకా లేదు.

పొరపాటున ఏ ఉద్యోగమూ రాకపోతే అడుక్కోవడానికి కూడా పనికిరానివాడిగా తయారు చేసిన వాళ్ళం మనమే అవుతాం..... అవుతున్నాం.....

ఎందుకంటే నేటి విద్యార్థుల్లో నూటికి తొంభైతొమ్మిది మందికి చదువు తప్ప (క్రీడలుగానీ, కళలుగానీ) మరేమీ రాదు.... మనమేమీ నేర్పే ప్రయత్నమూ చెయ్యలేదు..... చెయ్యట్లేదు.


ఒక్కమాటతో ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోవచ్చు.

ఇందులోని నా ఏ ఒక్కమాటైనా

ఏ ఒక్క తల్లి ఆలోచననైనా మార్చగలిగితే

ఏ ఒక్క తండ్రి ప్రవర్తనైనా మార్చగలిగితే

ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నైనా కాపాడగలిగితే

అంతకన్న మహాభాగ్యం మరొకటి లేదు...!

-

No comments:

Post a Comment