ఎందరో మహానుభావులు🌷 (చెప్పి గెలిచిన దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు) 🙏🙏🙏🙏- తనికెళ్ళ భరణి🙏🙏🙏

ఎందరో మహానుభావులు🌷


(చెప్పి గెలిచిన దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు)


🙏🙏🙏🙏- తనికెళ్ళ భరణి🙏🙏🙏



విజయనగరం మహారాజు శ్రీ శ్రీ శ్రీ విజయరామ గజపతుల వారికి వీణంటే ప్రాణం.

యువరాజు గారు శ్రీ ఆనంద గజపతుల వారికి సితార్ పై మోజు

చూడ్డానికి ఒకేలా అనిపించినా.. దేనిదారి దానిదే..

వీణ పదహారణాల దక్షిణాది వాయిద్యం

సితార్..ఫక్తు హిందుస్తానీ..

వీణకీ...పక్కన మృదంగ విన్యాసం ఉంటే

సితార్ కి తబలా కావాలి.

అయితే రెండు అప్ప చెల్లెళ్ళు కావు.. తోడికోడళ్ళు.

రాజావారు కొడుక్కి వీణే నేర్పిద్దామనుకున్నాడు.

కొడుకు గారు ససేమిరా వద్దనాడని..

సరే వీణ-సితార్ కంటే గొప్పదీ అని ఋజువైతే..

కొడుకు ఎదురు ప్రశ్న?

ఇంతెందుకూ.. పోటీ పెడదాం

ఎవరక్కడ

చప్పట్లు..

సంగీత దర్బార్ తయారైంది.

రెండు వేడుకలు సిద్ధం.

ఒకటి హిందుస్తానీ

రెండోది ..కర్ణాటకం.

ఓ వైపు అత్తరు పరిమళాలు

మరోవైపు అగరు పొగలు

ఓ వేపు మల్లెల దండలు

మరోవేపు గులాబీల గుత్తులు

ఒక దిక్కు.. మఖ్ మల్ తక్త్ లు

మరో దిక్కు పట్టు బాలీసులు

బనారసీ పాన్ - జర్దా ఘుమాయింపు వొక చోట నుంచి

లేత తమల పాకుల విడియముల పరిమళములొక చోట నుండీ..

హిందుస్తానీ సంగీత విద్వాంసుడు మహబ్బత్ ఖాన్ ఒకవైపు

కర్ణాటక్ సంగీత నిధి దూర్వాసుల సోమయాజులు గారొకవైపు...


సితార్ ఆరంభమైంది.. ఉత్తరాది స్వర గంగ ఉప్పొంగి సుడులు తిరిగి పాయలు పాయలుగా విడిపోయి.. హొయలు పోయీ.. శ్రోతల నరాల మీద నాట్యం చేసి. సలామ్ చేసింది.


శబ్బాష్ లు... వహ్వాలు..

దద్దరిల్లిపోయింది సభ.

ఇక దూర్వాసుల సోమయాజుల వారు..వీణాపాణికి మనసులోనే

దణ్ణమెట్టుకుని మీటాడు వీణ.. 

గోదావరి నది పరవళ్ళు తొక్కడం మొదలెట్టింది.. 

బొట్టి పెట్టినట్టు..బొట్టు బొట్టుగానే మొదలై

చిన్నపిల్ల రెండు జెళ్ళై, కన్నెపిల్ల వాలుజడై

పుష్కరాల్ రేవుల మునకేస్తున్న ఫ్రౌఢ .. విడిపోయిన జడలా..

పాయలు పాయలై, చివరికి ధూర్జటి జటల్లె.. విస్తరించీ.. శ్రోతల్ని ఆనందాంభుధిలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేసింది.

చప్పట్లు లేవు.. నిశ్శబ్దం తప్ప.

అవాక్కయిపోయింది సభ.

ఉఛ్ఛ్వాస నిశ్వాసాలు తప్ప. మరో శబ్దం లేదు..

వీణ మీద పలికించినవి..సితారు మీద పలికించడం 

నావల్ల కాలేదు.. అని ఓటమిని సవినయంగా ఒప్పుకున్నాడు మహబ్బత్ ఖాన్...

అప్పుడు అదిరింది సభ చప్పట్లతో..

ఆనందగజపతి ఆనందంగా వీణ పట్టాడు.

విజయరామ గజపతి పరమానందంగా..

దూర్వాసుల వారి పాదాలు పట్టాడు..

అప్పట్నుంచీ దూర్వాసులవారు గజపతులకు రాజగురువు..

అయితే సోమయాజులవారు కేవలం కర్ణాటక సంగీతానికే పరిమితం కాకుండా..

కాశి..కలకత్తా వంటి ప్రాంతాలకు వెళ్ళి...హిందుస్తానీ సంగీతాన్ని గూడా ఔపోశనపట్టారు.

అయితే సోమయాజులు గారికి సంగీతం నేర్పిన గురువు సాక్షాత్తూ ఆయన తాతగారే.

విజయనగర ప్రభువుల వీర చరిత్రను గేయరూపంలో రచించి 72వ మేళకర్త రాగాలలోనూ స్వరపరచిన ఘనులు సోమయాజులు గారు.


ముఖారి రాగంలో.. ‘ఇటు చూడరా’

కాంభోజి రాగంలో.. ‘ఎందుకే తొందర’

మోహన రాగంలో.. ‘నెరనమ్మినాను’ అనే శృంగార కీర్తనలను

ఆనంద గజపతులవారి మీద రాసి.. అంకితమిచ్చారు.


అన్నట్టు విశేషమైన విషయం ఏమిటంటే మనం సంగీత త్రయంగా పూజించే త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి రచనలని ఆరంభంలో ఆంధ్రదేశం అంతా విస్తృతంగా ప్రచారం చేసిన ఘనత దూర్వాసుల వారిదే..


అలాగే 1831లో మద్రాసులో. మైసూరు.. పుదుక్కోట లాంటి ఏడు సంస్థానాల ... సంగీత విద్వాంసులకి పోటీ జరిగింది. మైసూరులాంటి పెద్ద సంస్థానాలు మొదట్లో పెట్టీ..

విజయనగరం వంటి చిన్న సంస్థానాలకి చివరికి అవకాశం ఉండేలా చేశారు.

ఈ సంగతి తెలిసి ఆనంద గజపతుల వారు చిన్నబుచ్చుకున్నారు.

అప్పుడు సోమయాజులు మందహాసం చేస్తూ 

ఎక్కడుంటే.. ఏవిటండీ.. జరిగేది పోటీ.. గెలవడం లెక్క అంటూ హామీ ఇచ్చాడు.

చివరగా దూర్వాసుల సోమయాజుల వంతొచ్చింది.

కళ్యాణి, వసంత రాగాలతో పాటలు ఇతర సంగీత సాంప్రదాయాలన్నీ మేళవించీ, వీణావాదన మొదలెట్టారు.

అందులో కర్ణాటక మాధుర్యముంది.

హిందుస్తానీ మజా ఉంది.

అంతేకాదు.. పశ్చాత్యుల కిక్కు కూడా ఉంది.

అందువల్లే..

పోటీలో పాల్గొనే సమయం ఇరవై నిముషాలే అయినా,

సుమారు గంటన్నరపైగా వాయించినా ఎవరూ కిక్కురుమనలేదు సరిగదా

పోటీ చూట్టానికొచ్చిన దొరలూ..దొరసానులూ.. సోమయాజులు వాయించిన పాశ్చాత్య సంప్రదాయ రీతికి డాన్స్ చేయడం మొదలెట్టారు.

పోటీ ముగిసింది.

దూర్వాసుల వెంకట సోమయాజులు గారిది ప్రథమ బహుమతి.

ఆనందగజపతి మహారాజుగారు గుండెల్నిండా ఊపిరి పీల్చి సొగసుగా మీసం మెలేసారు.

ఆ సందర్భంలో వైస్రాయ్ ఎల్జిన్ ప్రభువిచ్చిన సర్టిఫికెట్ ఇప్పటికీ సోమయాజుల గారి మనుమరాలి ఇంట్లో భద్రంగా ఉంది.

అలా చాలాకాలం పాటు.. తన సంగీతంతో విజయనగర సంస్థానాన్ని చిరస్మరణీయం చేసిన సంగీత భాస్కరుడు అస్తమించే వేళ ఆసన్నమయింది.

తంత్రులు సడలిన వీణలా ఉన్న ఆయన వొంటి మీద చెయ్యేసి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు ఆనందగజపతి. 

దూర్వాసుల సోమయాజులు మాత్రం..

నిశ్చలంగా, నిర్మలంగా ఉన్నారు. పెదాలమీద చిరునవ్వు ఇంకా చెదరలేదు.

మెల్లి...మెల్లిగా...కళ్ళలోని కాంతి..పైకి ప్రయాణమయ్యింది.

ఆనంద గజపతుల అశ్రుబిందువులు ఆయన పాదాలపై పడ్డాయ్.

ఆయన నిర్యాణం గురించి దూర్వాసుల శ్రీరామ శాస్త్రిగారు ఒక పద్యం రాశారు.

🤲🤲🤲🤲🤲


వీణయు చేతబూని కడు విస్మయ ముప్పతిలంగ భైరవిన్

తానము మేళవించి యమృతంబును జిల్కెడు మిమ్ము జూచుచున్

గాణలు, హుణులొక్క గతిగ నుతి చేసిరి గాని యంతలో

వీనుల పుణ్యమీ కరణి వేడెను గానము విస్తరించగా...

🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!