దేవీ భాగవతాంతర్గత.మణిద్వీప వర్ణన !

దేవీ భాగవతాంతర్గత.మణిద్వీప వర్ణన !

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

-

-బ్రహ్మలోకానికి పైనసర్వలోకం విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపమంటారు. అక్కడే శ్రీదేవి తేజరిల్లుతూ ఉంటుంది. సమస్తలోకాలకన్న అధికమైనది కావడం వల్లనే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు. పరాంబికాదేవి దానిని తన సంకల్ప మాత్రంచేత సృష్టించింది. ఈ సృష్టికిపూర్వం మూల ప్రకృతీదేవి ఈ మణిద్వీపాన్ని తనకు ఆవాసస్థానంగా ఏర్పరచుకుంది. మణిద్వీపం కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠంకంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్ఠంగా భాసిల్లుతూ ఉంటుంది. అందుకే దానిని సర్వలోకమంటారు.


-

సుదీర్ఘమైన ఆ తీరాలలో నయనానందకరమైన రత్నవృక్ష పంక్తులు రాజిల్లుతూ ఉన్నాయి.

ఆ ప్రదేశానికి ఆవలిభాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణంకల దృఢమైన లోహమయ ప్రాకారం ఉంది. నానాశస్త్రాస్త్రాలను ధరించి పోరడంలో యుద్ధ విశారదులైన రక్షకభటులు నాలుగు ద్వారాలతో ద్వారపాలకులై కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనుఊ వందలాది భటులుంటారు. అక్కడ శ్రీదేవీభక్తులు గణాలుగానివసిస్తారు. వారు సర్వదా జగదీశ్వరి దివ్య సందర్శనార్థం విచ్చేస్తూంటారు. వారు తమ దివ్య వాహనాలపై వస్తూపోతూంటారు. వారి అసంఖ్యాక విమానాదుల గంటల చప్పుళ్ళూ వారి గుర్రాల సకిలింఉలూ, వాటి డెక్కల టక టక ధ్వనులూ దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగుతుంటాయి. అక్కడి దేవీ జనాదులు వేత్ర పాణులై 'గోల చేయకండి' అంటూ దేవ సేవకులను దండిస్తూ ఉంటారు. ఆ మహాకోలాహల మధ్యభాగంలో ఎవరు ఏ చప్పుడు చేసినా తెలియరాదు, ఒకరిమాట వేరొకరికి తెలియరాదు. అక్కడ అడుగడుక్కీ స్వచ్ఛశీతల, మధుర జల సంభరిత సరోవరాలున్నాయి. అచ్చోటనే రత్నమయ వృక్ష సంభరితమైన ఉద్యానవనాలున్నాయి.

=


చిలుకలూ, గోర్వంకలూ, పావురాలూ, రాజహంసలూ ఆదిగాగల పక్షిపక్ష సంజాత వాయువుల వల్ల అక్కడి తరుశాఖలు కంపిస్తూంటాయి. అట్టి తరు సమూహాలు విరజిమ్మే సుగంధ పవనాల వల్ల అక్కడి వనాలలో పరిమళాలు గుబాళిస్తూంటాయి. ఆ వనాలలోని హరిణీ సమూహాలు బిత్తరి గంతులతో ఇటూ అటూ పరిభ్రమిస్తూంటాయి. అచ్చోట నర్తిస్తూ కేకారవాలు చేసే మనోహర మయూరనాదాలు దశదిశలూ వ్యాపిస్తూంటాయి. అట్టి మణిద్వీపంలో మధుర నాదాలు ప్రతిధ్వనించ మధువును స్రవింపజేసే తరుసమూహాలు అలరారుతుంటాయి.

ఆ కాంస్య ప్రాకారం దాటగా లోపలివైపు తామ్రప్రాకారం ఉంది. చతురస్రాకారంగా ఉన్న అది చత్యంఉరస్రాకారంగా సప్తయోజనాల ఔన్నత్యం కలిగి అది భాసిల్లుతూ ఉంటుంది. కాంస్య తామ్ర ప్రాకారాల మధ్యలో కల్ప వనాలున్నాయి. తరు వికసిత పుష్పాలు సువర్ణ పుష్ప సమంగా భాసిల్లుతూ ఉంటాయి. వాటి పత్రాలు సువర్ణ పత్రాలుగా బీజఫలాలు రత్నాలవలె, సొంపుకూరుస్తూ ఉంటాయి. ఆ తరు బహిర్గత సుగంధం దశయోజన పర్యంతం వ్యాపిస్తూ ఉంటుంది. ఆ కల్పవనంలో వసంతేశుడు కొలువై అహోరాత్రులు వసంత శోభలను వ్యాపింప జేస్తూంటాడు. అతడు పుష్పచ్ఛత్ర ఛాయలో పుష్ప సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. పుష్పాభరణాలను దాల్చిన అతడు పుష్ప మధువును పానంచేసి మత్తెక్కి ఉంటాడు. మధుశ్రీ మాధవశ్రీలు ఇర్వురూ అతని భార్యలు. సదా మందస్మిత వదనారవిందాలతో అలరారే భారలతోకూడి వసంతుడు పూల బంతులతో క్రీడిస్తూంటాడు. మధుధారలు ప్రవహించునట్టి ఆ కల్పక వనం అపారానందాన్ని అందజేస్తూ ఉంటుంది. అక్కడి సుగంధాలు దశయోజన పర్యంతం వ్యాపించి ఉంటాయి. సుగంధ సంభరితమైన ఆ వనాలలో గాన లాలసలైన గంధర్వ కామినీజన గాఢాలింగనాలలో గంధర్వ యువకులు సయ్యాటలాడుతూ ఉంటారు. మత్తకోయిలల కలకలరావాలతో వసంత శ్రీ శోభలతో ఆ దివ్యవనం కముకుల కామోద్రేకాన్ని వర్ధిల్లజేస్తూ ఉంటుంది.

.


అందలి ప్రతీశక్తి అగణిత బ్రహ్మాండాలనైనా నాశనం చేయగలదు. అట్టి మహాసైన్యాలను వర్ణించగలమా? అక్కడ ఉన్న రథ వాహినులకు లెక్కయేలేదు. వారందరికందరూ శ్రీదేవికై యుద్ధం చేయ సన్నద్ధులై ఉంటారు. పాపహారకాలైనా వారి నామాలివి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహూ, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, శుంభ, నిశుంభమథిని, మహిషాసురమరద్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థశరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి వీరేక్రుద్ధులయైతే సమస్త బ్రహ్మాండాలనూ నాశనం చేయగలరు. ఎట్టి స్థితిలోనూ వీరు అపజయాన్ని అంగీకరించరు.

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!