దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం...


దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం

నా కవిత్వం (1941)


నా కవిత్వం, కాదొక తత్వం

మరి కాదు మీరనే మనస్తత్వం

కాదు ధనిక వాదం, సామ్య వాదం

కాదయ్యా అయోమయం, జరామయం


గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ

జాజి పువ్వుల అత్తరు దీపాలూ

మంత్ర లోకపు మణి స్తంభాలూ

నా కవితా చందన శాలా సుందర చిత్ర విచిత్రాలు


అగాధ బాధా పాతః పతంగాలూ

ధర్మ వీరుల కృత రక్త నాళాలూ

త్యాగశక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి

నా కళా కరవాల ధగధ్ధగ రవాలు


నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు

నా అక్షరాలు ప్రజాశక్తు లావహించే ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు.

నా కవిత్వంలొ నేను దొరుకుతాను (ఇది అసంపూర్ణం)


ప్రబంధాలూ తద్గత వర్ణనలూ చదువుకుంటూ

అల్లాంటివే రాస్తూ కూడా యేదో తృప్తి ఆనందమూ

పొందలేక, ఇంకా యేదో నాకు తెలీనిదేదో

వుందనుకునే బాల్యంలో

ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ

వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 

తమ ఊర్వశీ ప్రవాసం లోంచి

వివరాలీ విభావరీ విలాసాల

నీ మసలు చరణ మంజీరము గుసగుసలో

అన్న గేయం విన్నప్పుడు

చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ

బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా వూరి రోడ్ల మీది దుమ్ము

అన్నీ మాయమయి పొయి

నేను నా లోంచి కదలి పోయి జాలి జాలిగా

గాలిలో చిరు చీకటిలో నక్షత్రాల చిరు కాంతిలో

కలసి పోయి యేదో యేదో అయిపోయిన క్రొత్త చైతన్యం లో

ఆ రాత్రంతా నిద్రపోలేదు.

ఆ తర్వాత కొన్ని నాళ్ళకు ఒక పల్లెటూరి పొలిమేరలో

నన్ను నిలబెట్టి ఒక విప్లవ యువకుడు శ్రీశ్రీ "కవితా! ఓ కవితా!"

తన గంభీర కంఠం తో వినిపించినప్పుడు

లక్ష జలపాతాల పాటలూ, కోటి నక్షత్రాల మాటలతో పాటు రాజ్యాలూ

సైన్యాలూ విప్లవాలూ ప్రజలూ శతాబ్దాలూ

నా కళ్ళముందు గిర్రున తిరిగి నేను చైతన్యపు మరో అంచు మీద నిలిచాను

....


ఆర్త గీతం (ఎక్ష్చెర్ప్త్స్)(1956)


నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను

యీ విపంచికకు శ్రుతి కలపలేను

యీ రోజు నాకు విషాద స్మృతి, విధి తమస్సులు మూసిన దివాంధృతి

నా యెడద మ్రోడైన ఒక దుస్థితి.....


నేను నేడు కన్నీరుగా కరిగిన గీతికను, సిగ్గుతో రెండుగా

చీలిన వెదురు బొంగును, మంటలలో అంతరాంతర దగ్ధమైన బూడిదను.....


యీ రోజు నేను చూసినదేమి? విధి ఇన్ని కత్తులను దూసినదేమి?

జాగృతి హేతు వాదరల దుధిరమేమి?


నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు కింద

మరణించిన ముసలి వాణ్ణి;

నేను చూసాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద

నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిల్లిన దృశ్యాన్ని;

నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక, ముంజేతుల

కనులు తుడుచుకుంటూ, మురికి కాల్వ పక్కనే నిద్రించిన

మూడేళ్ళ పసి బాలుణ్ణి;

నేను చూసాను నిజంగా, పిల్లలకు గంజి కాచిపొసి, తాను నిరాహారుడై

రుధ్ధ బాష్పాకులిత నయనుడై, ఆఫీస్ కు వచ్చిన వృధ్ధుని

ప్యూన్ వీరన్న ని;

నేను చూసాను నిజంగా, క్షయగ్రస్త భార్య ఇక బతకదని

డాక్టర్ చెప్పినపుడు, ప్రచండ వాతూల హత నీపశాఖ వలె, గజ గజ

వణికి పోయిన అరక్త అశక్త గుమస్తా ని,

ఐదారుగురు పిల్లలు గలవాణ్ణి;

నేను చూసాను నిజంగా, మూర్తీభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని

క్షుభితాశృ కల్లోల నీరధుల్ని, గచ్ఛత్ శవాకార వికారుల్ని

ఇది యే నాగరికతకు ఫలశృతి? యే విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?

యే బుధ్ధ దేవుడి జన్మభూమికి గర్వ స్మృతి?

ఇక నన్ను నిర్బంధించకు నేస్తం, యీ రాత్రి నేను పాడలేను;

యీ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను, మానవత లేని లోకాన్ని స్తుతింపలేను

....

ఒక్క నిరుపేద వున్నంత వరకు, ఒక్క మలినాశృబిందు వొరిగినంత వరకు

ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు

ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పాప ఉన్నంత వరకు

ఒక్క తల్లి వీరవాక్రోశ రవము విన్నంత వరకు

ఒక్క క్షత దుఃఖిత హృదయ మూరడిల్లనంత వరకు

నాకు శాంతి కలుగదింక నేస్తం, నేను నిగర్వి నైనాను...

యీ గుండె గూడుపట్లు ఎక్కడో కదలినవి, యీ కనులు వరదలై పారినవి

యీ కలలు కాగితపు పేలికలై రాలినవి


యీ ఆర్తి యే సౌధాంతరాలకు పయనింపగలదు?

యే రాజకీయవేత్త గుండెలను స్పృశింపగలదు?....

యే భగవంతునికి నివేదించు కొనగలదు....?


అమ్మా, నాన్న ఎక్కడికి....


అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం?

అని అడిగాడు నాలుగేళ్ళ పిల్లవాడు మరోసారి-

అలవోకగా, వాడి తల నిమురుతూ ఆమె అలాగే

ఆశతో వింటోంది రేడియోలో వార్తలు-

ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు

ఆమె గుండెల్లో మర ఫిరంగులు పేలిన జాడలు....

..కాష్మీర్ సరిహద్దుల్లో పొగలమధ్య కాలూని నిల్చున్న సైనికుడు

ఆమె కళ్ళ ముందు నిలిచాడు.


ఆమె కళవళపడింది - నిట్టూర్చింది పైట సరిచేసుకుంది

అంతలో మృదు గర్వ రేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలసి పోయింది...

.. ఆమె రోజూ వస్తుంది పార్కు లోకి వార్తల కోసం

అల్లాగే తెల్లని చీర కట్టుకొని యెర్రని బొట్టు పెట్టుకుని

నల్లని వాల్జెడలో తెల్లని సన్నజాజులు తురుముకొని...

... జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది

పాకిస్తాన్ చైనా ల మధ్య మైత్రి, పామూ తోడేలూ కలసినట్టు

ఇది రెండు దేశాల మధ్య యుధ్ధమే కాదు...

ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది...

....శత్రువుల టాంకులు విమానాలు యెన్నో కూలిపోయాయి

సాహసోపేతమైన భారత సైన్య తరంగం

లాహోర్ సరిహద్దుల మీద విరుచుకు పడింది

నిర్ణిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది

.... లక్షలాది అజ్ఞాత సైనికుల కాబాలగోపాలం కృతజ్ఞతాంజలి

సమర్పించింది.


ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది

అలాగే తెల్లచీర కట్టుకుందిగాని యెర్రని బొట్టులేదు...

..ఆమె సోగ కన్నులలో వాన కురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది

ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంట నొక్కుతోంది

అక్కడ చేరిన గుంపులు "జై హింద్" అన్న నినాదం చేసారు

అమ్మా, నాన్న.... అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని

ఆమె కూడా రుధ్ధ కంఠం తో "జై హింద్" అని మెల్లగా పలికింది

ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా, తీయగా వినపడింది


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!